15, ఫిబ్రవరి 2017, బుధవారం

భగవద్ గీత (7) - సాంఖ్య యోగము - 2.14,15 - సుఖదుఃఖాలు ఎలా వస్తాయి పోతాయి - చావు, పుట్టుకలు లేని అమృత తత్వానికి అర్హత ఎలా వస్తుంది

 



భగవద్ గీత (7)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం

యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొట్టమొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  పోయిన  వారి కోసమైనా, వున్న వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు.  శ్రేయస్ అంటే శాశ్వతమైన సుఖాలు, ప్రేయస్ అంటే అశాశ్వతమైన, భౌతిక సుఖాలు అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం.
తరువాత , ఆరవ వ్యాసంలో -
మనకెవరికీ ఎప్పుడూ మరణం లేదు, మనం లేని సమయమంటూ  ఎప్పుడూ లేదు - అని శ్రీకృష్ణుడు అన్నాడు. మన దేహాలు మాత్రం, సమయానుసారం, మరణించి, పంచ భూతాలలో కలిసిపోతాయి. మనం అప్పుడు మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి శరీరాన్ని  ధరిస్తాము  - అని చెప్పాడు. 
అంటే - నిజమైన నేను  పుట్టడమూ లేదు; మరణించడమూ లేదు. ఏదైనా వొక దేహంలో పుట్టి ప్రపంచాన్ని అనుభవిస్తాను. ఆ దేహం అశాశ్వతం. అది మరణించిన తర్వాత, మరో దేహాన్ని ధరిస్తాను. ఇలా, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం -  జరుగుతూ వుంటుంది అన్నాడు.  

ఇప్పుడు శ్రీకృష్ణుడు యింకా ఏం చెబుతాడో చూద్దాం. 
  
శ్రీకృష్ణుడి మాట :
మాత్రాస్పర్శాహ్ తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ్   |  
ఆగమాపాయినోనిత్యాహ్ తాంస్థితిక్షస్త్వ  భారత           ||  (2.14) 
మాత్రాస్పర్శాహ్ = ఇంద్రియాలు తమ తమ సంబంధిత వస్తువులతో సంపర్కము, లేదా స్పర్శ వలన ; తు = నిజముగా ; కౌంతేయ = ఓ కౌంతేయ (అర్జునా); శీతోష్ణ = చల్లదనము, వేడి అనే  ద్వంద్వాలు; సుఖదుఃఖ =  సుఖము, దుఃఖము అనే ద్వంద్వాలు; దాహ్ = ఇస్తున్నాయి; ఆగమాపాయినః = వచ్చి, పోవునవి లేదా ఆరంభము, ముగింపు రెండూ వున్నవి ; అనిత్యాహ్ = నిత్యమైనవి కావు, ఎల్లప్పుడూ వుండేవి  కావు; తాన్ = అవి, వాటిని; తితిక్షస్వ = (మనం)నువ్వు భరించక తప్పదు ; భారతా = ఓ అర్జునా; 
 
"ఓ అర్జునా! మన యింద్రియాలు తమ తమ సంబంధిత వస్తువుల స్పర్శ వలన, మనకు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి.వన్నీ వస్తూ, పోతూ వుండే, అశాశ్వతమైన విషయాలు. వీటిని నువ్వు భరించక తప్పదు. "


కళ్ళు చూస్తాయి. కొన్ని అందంగా, కొన్ని సామాన్యంగా, మరి కొన్ని వికారంగా కనిపిస్తాయి చూసే కళ్ళకు. అలాగే అనిపిస్తుంది కళ్ళ వెనుక నున్న మనసుకు, బుద్ధికి, వాటి వెనుక నున్న నిజమైన నాకు(మనకు)

చెవులకు వినిపించేది కొన్ని బాగుంటుంది. కొన్ని బాగుండవు.  ముక్కు ద్వారా గ్రహించే వాసనలలో, కొన్ని సువాసనలు, కొన్ని దుర్వాసనలు. 

చేతులతో (లేదా చర్మంలోని భాగం తో నైనా) తాకేవి కొన్ని బాగుంటుంది. కొన్ని బాగుండవు. అలాగే, కొన్ని వస్తువులు చల్లగా, కొన్ని సాధారణంగా, కొన్ని వేడిగా వుంటాయి. 

వేసవి కాలం లో ప్రపంచమంతా వేడిగా వున్నట్టు చర్మానికి, చర్మం ద్వారా మనకు తెలుస్తుంది. చలికాలంలో, ప్రపంచమంతా చల్లగా వున్నట్టు  తెలుస్తుంది. ఇవన్నీ యింద్రియాలు తమతమ సంబంధిత వస్తువులను తాకడం వలన మనకు కలిగే అనుభూతులు. శీతోష్ణాలు మనకు తెలిసేది చర్మము వలనకదా. అలాగే మిగతా నాలుగు ఇంద్రియాల వలన మనకు  వివిధ రకాల సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి.  

ఇంద్రియాలు తాకే వస్తువుల వలన మనకు కలిగే అనుభూతులు సుఖ,దుఃఖాలు.  ఎప్పుడో తాకిన వాటి వలన కూడా సుఖదుఃఖాల అనుభూతులు మనసులో యిప్పుడు కలుగవచ్చు. శీతోష్ణాలు కానీ, సుఖదుఃఖాలు కానీ -  వచ్చి వెళ్ళిపొయ్యేవే కానీ, వుండిపొయ్యేవి మాత్రం కాదు. 

చలికాలము వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తరువాత, వేసవికాలమూ వచ్చి వెళ్ళిపోతుంది.  రెండూ మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో వెళ్లిపోతాయి.  ఏ ఇంద్రియమూ తానూ తాకిన ఏ పదార్థాన్నీ అలాగే పట్టుకుని  వుండలేదు ; విడిచిపెట్టాల్సిందే. 

మధురమైన గానం - వినేటప్పుడు మాత్రమే; ఆ శబ్దాన్ని చెవ్వు గానీ, మనసు గానీ పట్టుకుని వుండలేదు. కళ్ళతో చూసేవీ అంతే. విడిచిపెట్టాల్సిందే. నాలుకతో రుచి చూసేవీ అంతే. ముక్కుతో పీల్చే వాసనలూ అంతే. చర్మంతో తాకే వస్తువులూ అంతే. 

వాలెంటైన్ దినము వస్తుంది. మీరు గాఢంగా ప్రేమించే వ్యక్తి మీ పక్కనే వున్నారు. ఒక గంట సేపు వాళ్ళను కౌగలించుకుని వుండండి చూద్దాం.  మీ వల్ల కాదు.  పట్టుకున్న ప్రతి వ్యక్తినీ, పదార్థాన్నీ  కొన్ని  నిముషాల తర్వాత విడువక తప్పదు. వచ్చేవన్నీ, పొయ్యేవే. ఒక్కో సారి, వచ్చిన వాటిని విడిచి, మీరు వెళ్ళిపోతారు.  అవి మరి కొన్ని నాళ్ళు, పెట్టిన చోటే వుండిపోతాయి. లేదా, ఎవరు ఎత్తుకు పోతే వారి వెంట వెళ్లిపోతాయి.  లక్ష కోట్ల  రూపాయలు సంపాదించిన వాడు కూడా, దాన్ని పూర్తిగా విడిచిపెట్టి, వెళ్లిపోక తప్పదు.

తెలుగులో ఒక పద్యం వుంది :

దానము, భోగము , నాశము, 
పరగంగా మూఢుగతులె  భువి ధనమునకున్ 
దానము, భోగము నెరుగని  దీనుని 
ధనమునకు గతి తృతీయమె  సుమ్మీ . 

ధనాన్ని సంపాదించిన వాడు - (1) దాన్లో కొంత దానము చెయ్యొచ్చు (2) కొంత తానూ, తన వాళ్ళు కలిసి అనుభవించ వచ్చు ; లేదా (3) అది ఏదో రకంగా నాశనం కావచ్చు, దొంగలెత్తుకు పోవచ్చు, మరెవరైనా బలవంతంగా లాక్కోవచ్చు. 

దానము, భోగము చెయ్యని వాని ధనానికి పట్టే గతి నాశనమే కదా ! ది అక్షరాలా నిజం.  లోభి అయిన వాడి సొత్తు, కడపట దొంగ పాలే. ధనమే కాదు. ఏ పద్దార్థమైనా అంతే.  అంగళ్లలో కూరగాయలు అమ్ముతూ వుంటారు. అవి 3-4 రోజులు నిలువ వుంటాయి. అంతే. వాటిని అంతలోపు అమ్మెయ్యాలి. లేదా, చివరి రోజుల్లో, వుదారంగా తక్కువ వెలకు అమ్మెయ్యాలి, లేదా వూరికే  పేదవారికి ఇచ్చేయ్యాలి . లేదా, వ్యర్థంగా, ఎవరికీ ఉపయోగం లేకుండా  నాశనం అయిపోతాయి.  ఇప్పటి రోజుల్లో వాటికి  యేవో విష పదార్థాలు, మైనము, ప్లాస్టిక్ లాంటివి  పూసి, ఎక్కువ రోజులు నిలువబెడుతున్నారు. వైనా నాశనం కావాల్సిందే; లేదా, తినే మనుషులను నాశనం చేసేస్తాయి. ఏదో రకంగా, మనకు ఏది వచ్చినా, వెళ్లిపోవడానికే వస్తుంది. వున్నప్పుడు, మనం అనుభవించ వచ్చు, దానం చెయ్యవచ్చు, లేదా, నాశనము కావడమో, మరో రకంగా వెళ్లిపోవడమో జరుగుతుంది. 

లా వచ్చిన అన్ని పదార్థాలూ వెళ్లిపోతాయి. వచ్చిన సుఖ,దుఃఖాలూ వెళ్లిపోతాయి. వచ్చిన శీతోష్ణాలూ వెళ్లిపోతాయి. వచ్చిన వ్యక్తులూ వెళ్ళిపోతారు. వచ్చిన మనమూ వెళ్ళిపోతాము. దీనికి చింతించడమెందుకు? ఏడవడమెందుకు?   వీటన్నిటినీ భరించాలి, అనుభవించాలి - అంతే. భరించాలి సరే. ఎలా భరించాలి?


" యం  హి  న వ్యథయన్త్యేతే పురుషం ఫురుషర్షభ   | 

సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ  కల్పతే    || (2. 15)

యం = ఎవరినైతే ; హి =నిజముగా; న = లేదు / కాదు; వ్యథయన్త్యేతే  = బాధపెట్టడము;  పురుషం = అటువంటి పురుషుడు;  పురుషర్షభ = గొప్ప మనిషి; సమదుఃఖసుఖం = సుఖదుఃఖాలను సమానంగా చూచు వాడు; ధీరం = ధీరుడు; సః = అతడు ; అమృతత్వాయ = అమృత తత్వానికి (చావు, పుట్టుకలు లేని వాడిగా వుండుటకు); కల్పతే = అర్హుడు. 

"వచ్చే సుఖాన్నీ, దుఃఖాన్నీ, రెండింటినీ  సమానంగా  తీసుకుంటూ వుండే వాడికి, అవి ఎవరినైతే బాధించవో అటువంటి వాడికి - చావు, పుట్టుకలు లేని అమృతత్వానికి  అర్హత వస్తుంది."   

సుఖదుఃఖాలు వస్తాయి, పోతాయి. అవేవీ నిత్యముగా వుండిపోయేవి కావు. ది తెలిసి, వాటిని సమానంగా చూచు వాడిని అవి బాధించ లేవు. అటువంటి ధీరుడు పురుషులలో గొప్ప వాడుగా వెలుగుతాడు. చావు పుట్టుకలు లేని అమృతత్వానికి అర్హుడవుతాడు. 

హిమాలయా పర్వతాలలో, కేవలం గోచీతో తిరిగే వారిని మనం చూడొచ్చు. అలాగే, మల మల మాడ్చే ఎండల్లో, అదే రకం గోచీతో  ఎక్కడంటే అక్కడ పడుకునే వాళ్ళనూ  మనం చూడొచ్చు. ది ఎలా సాధ్యం?  అనారోగ్యాలు వచ్చినా, ఖాతరు చెయ్యకుండా ఆనందంగా వుండే వారినీ మనం చూడొచ్చు. 

లా భారత దేశంలో - మనకు ఆశ్చర్యం కలిగించే, రకరకాల వింత మనుషులను మనం చాలా చోట్ల చూడొచ్చు. కోట్లు సంపాదించిన వాళ్ళే ధీరులు అని మనం చెప్పలేం. దగ్గరికెళ్లి చూస్తే వాళ్లలోని భయాల్ని, అనుమానాల్ని, సంతోష పూరిత మనసులనూ, ఆ మనసుల లోని  ఒత్తిడిని  మనం చూడగలం. 

మానవ సమాజంలో ఎవరు గొప్ప? ఏదీ లేకున్నా, సంతోషంగా ఎల్లప్పుడూ వుండగలిగే వాడా? ఎన్నో వున్నా, మానసిక వొత్తిడితో ఎప్పుడూ  బాధ పడే వాడా?  

ఏదీ సంపాదించ వద్దని చెప్పడం లేదు. ఆరోగ్యంగా వుండవద్దని చెప్పడం లేదు. సుఖాలు వస్తే అనుభవించ వద్దని అనడం లేదు. అవి అశాశ్వతం,  అని గ్రహించు; అవి వెళ్ళేటప్పుడు, దుఃఖాలు వచ్చేటప్పుడు - ఏది వున్నా, ఏది లేకున్నా, అదే సంతోషంతో వుండటానికి  ప్రయత్నించు. అటువంటి వాడే - ధీరుడు ; మానవోత్తముడు;  అటువంటి వాడు అమృతత్వానికి అర్హుడు - అంటున్నాడు శ్రీకృష్ణుడు. 

స్టీవ్ జాబ్స్ - ఆపిల్ కంపెనీ ని స్థాపించిన వాడు. ప్రపంచంలో అతి పెద్ద ధనవంతులలో  ఆయన ఒకడు. ఆయన అంటాడు - నన్ను పూడ్చి పెట్టిన సమాధిలో వున్న నేను, అతి గొప్ప ధనవంతుడని అందరూ అనడం కంటే, ప్రతి రోజూ ఏదో అద్భుతమైన పని చేశానే సంతృప్తితో ఆ రోజు రాత్రి హాయిగా నిద్ర పోవడమే నాకు ఎక్కువ ముఖ్యమని అనిపిస్తుంది. ఆయన సంపాదించిన అంత ధనాన్ని  ఆయన ఒక్క సెంటు కూడా ఎత్తుకుపోలేదు కదా. 

మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ గేట్స్ ప్రపంచంలో మొదటి స్థానంలో వున్న అతి గొప్ప ధనవంతుడు. ప్రతి సంవత్సరము, ఆయన ఎన్నో బిలియన్ల డాలర్లు దాదాపు ప్రతి దేశానికి విరాళంగా ఇచ్చేస్తున్నాడు. నా కొడుకులకు నేను ఏ మాత్రము ఆస్తీ యివ్వను , బాగా చదివిస్తాను అంతే - అంటాడాయన. వారెన్ బఫే అనే ఆయన  కూడా బిల్ గేట్స్  లాగానే, ప్రతి సంవత్సరమూ తన ఆస్తిలో ఎన్నో బిలియన్ల  డాలర్లు విరాళంగా యిచ్చేస్తున్నాడు. 

మనం సంపాదించాలి. కొంత అనుభవించాలి. మిగతాది దానం చెయ్యాలి. లేకుంటే, అది నాశనం అవుతుంది , లేదా పరుల పాలు అవుతుంది. 

మన శరీరమూ అంతే. మనకు ఉపయోగ పడాలి. కొంతైనా పరులకు ఉపయోగ కారి కావాలి.  లేదంటే, వ్యర్థమై పోతుంది. నాశనమై పోతుంది.  ఉపయోగ పడేటప్పుడు సుఖం; వ్యర్థమయ్యేటప్పుడు దుఃఖం. 

ఎన్నో సంవత్సరాలు తనను ప్రేమగా చూసుకున్న భర్త,  ఆయనపై చేయి వేసుకుని పడుకుంటేనే కాని ప్రశాంతంగా నిద్ర పోలేననే భార్య, ఆ భర్త చనిపోతే ఆయన  శరీరాన్ని చూడడానికి, తాకడానికి కూడా   భయపడుతుందంటాడు ఆది శంకరాచార్యుడు. "భార్యా బిభ్రతి తస్మిన్ కాయే" - నీలోని జీవుడు వెళ్ళిపోతే, నువ్వు, నీ భార్య ఇంతగా ప్రేమించే నీ శరీరాన్ని తాకడానికి కూడా నీ భార్యే భయపడుతుంది. నీ శరీరమూ వుండటానికి  రాలేదు. వెళ్ళడానికే వచ్చింది. 

వెళ్ళిపోయే  ఏ వస్తువు పైనా, మనిషి పైనా మోహం వద్దని  అంటాడు, శ్రీకృష్ణుడు. అర్జునుడి ముందున్న  భీష్ముడూ వెళ్లిపోయే వాడే.  ద్రోణుడూ వెళ్లిపోయే వాడే. అసలు వెళ్లిపోకుండా వుండే వాళ్ళు అటువైపు ఎవరు? ఆఖరుకు నువ్వు, నేను  కూడా వెళ్లిపోయే వాళ్ళమే, అర్జునా అని - మర్మంగా హెచ్చరిస్తున్నాడు, శ్రీకృష్ణుడు

ఇక్కడ అమృతత్వము - అంటే  ఏమిటో అర్థం చేసుకోవాలి. శరీరాలు  పడిపోయేవే. నీవు - నీ, మరియు పరుల శరీరాల నిజ రూపం తెలుసుకుంటే, అసలైన  నీతో, నిన్ను నువ్వు ఐక్యం  చేసుకుంటే - ఆ తరువాత, అనిత్యమైన ఈ శరీరాల రాకపోకలు నిన్ను బాధించవు. నీవు నిర్వికల్పుడివి, నిర్వికారుడివి, నిరాకారుడివి,  అమృతత్వానికి అన్ని రకాలా అర్హుడివి - అంటున్నాడు శ్రీకృష్ణుడు.

ఈ భావాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం.
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది
సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    
ఉప్పలధడియం   విజయమోహన్ 

నౌకాసన






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి