భగవద్ గీత (4)
రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన
అర్జున విషాద యోగం మొదటి మూడు వ్యాసాల్లో చూశాం. కానీ, అర్జునుడు ఏం మాట్లాడినా, ఎన్నిరకాల వాదనలు , కారణాలు , సాకులు చెప్పినా, యింత వరకు శ్రీకృష్ణుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. అర్జునుడు యిన్నాళ్ళూ ఎందుకు యుద్ధం కావాలనుకున్నాడో, యిప్పుడు యెందుకు వద్దనుకుంటున్నాడో తనకే అర్థం కాని అయోమయ స్థితి లో వున్నాడు.
కౌరవులను యుద్ధంలో హతమార్చాలి అని - ఎన్నెన్నో దివ్యాస్త్రాలను సమకూర్చుకున్నాడు అర్జునుడు. చివరికి ఈశ్వరుడిని కూడా మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించుకున్నాడు. వరుణుడి ద్వారా బ్రహ్మ చే సృష్టించబడ్డ గాండీవాన్ని, ఎప్పుడూ తరిగిపోని అక్షయ తూణీరాలను (రెండు అమ్ములపొదులను) పొందాడు. అగ్నిదేవుడి ద్వారా ఒక గొప్ప దివ్యరథాన్ని, దివ్యాశ్వాలనూ పొందాడు. సాక్షాత్తూ హనుమంతుడే అర్జునుడి యుద్ధాన్ని చూడాలని, తన జెండాపై కూర్చుని వున్నాడు. యిన్నిటినీ మించి శ్రీకృష్ణ భగవానుడినే తన రథ సారథిగా పొందిన అదృష్టవంతుడు అర్జునుడు. ఇన్ని భాగ్యాలున్న వీరుడు భారత యుద్ధంలో మరొకడు లేడు.
అంతే కాదు. యుద్ధానికి ముందే, "ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధరుడైన అర్జునుడు వుంటారో అక్కడే విజయం వుంటుందని" సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే భగవద్ గీతను ముగిస్తాడు. యిదే భగవద్ గీతకు ఆఖరి శ్లోకము, తల మానికమైన శ్లోకము. ఇక్కడ అర్జునుడే విజయం పొందుతాడని యుద్ధానికి ముందే సంజయుడు చెప్పనే చెప్పాడు.
అటువంటి
మహా వీరుడు, ధీరోదాత్తుడు, అదృష్టశాలి అయిన అర్జునుడు గాండీవాన్ని విడిచిపెట్టి శోక సముద్రంలో మునిగి , నాకీ యుద్ధం వద్దనే వద్దు అంటూ కూలబడి వున్నాడు.
ఇప్పుడు
సాంఖ్య యోగం మొదలవుతుంది. సంజయుడు అంటున్నాడు -
తం తథా కృపయావిష్టం, అశ్రుపూర్ణాకులేక్షణం |
విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః || ( 2. 1)
శ్రీ కృష్ణుడు
- కన్నీళ్లతో ఆర్తితో,దయతో, శోకంతో నిండి వున్న అర్జునుడిని చూసి, యిలా అంటున్నాడు :
శ్రీకృష్ణుడి
మాట:
కుతస్త్వా
కశ్మలమిదం విషమే సముపస్థితం |
అనార్యజుష్టమస్వర్గ్యం
అకీర్తికరమర్జున || (2.2)
"ఓ అర్జునా! ఈ ప్రమాద కరమైన నిరాశ, నిస్పృహ హీనులకు రావలసిందే కానీ నీ వంటి ఆర్యులకు కాదు. యిది నిన్ను స్వర్గానికి అనర్హుడినిగా చెయ్య గలిగినది. నీ కీర్తిని పూర్తిగా నశింప చెయ్య గలిగినది. ఇది నీకెక్కడి నుండి వచ్చింది?"
ఇప్పటి
వరకు అర్జునుడు, ఒక సన్నిహితుడైన స్నేహితుడితో తన గొడవ చెప్పుకున్నట్టే శ్రీకృష్ణుడితో మాట్లాడాడు. తనలోని బాధ, దయ, శోకము వాటికి గల కారణాలు చెప్పుకున్నాడు. చావనైనా చస్తాను కానీ యుద్ధం మాత్రం చెయ్యను. ఎవరినీ చంపను - అన్నాడు. గాండీవం వదిలేసి, తలదించుకుని శోకంతో కూర్చున్నాడు .
శ్రీకృష్ణుడు
కూడా యిప్పుడు స్నేహితుడిలాగే మాట్లాడడం ప్రారంభించాడు. "అర్జునా! నీవు ధర్మాధర్మాలు తెలిసిన ఆర్యుడవు. గొప్ప వీరుడవు. నీలో వుండాల్సింది క్షత్రియ సహజమైన సాహసము, పౌరుషము, ధైర్యమే గానీ యిలాంటి నిరాశ, నిస్పృహ కాదు. ఇదెక్కడినుండి వచ్చిపడింది నీకు? యుద్ధంలో ఇలాంటి భావాలతో, యిలాంటి మాటలు మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతానంటే - నీకు అపకీర్తి రావడమే కాదు, స్వర్గానికి నువ్వు అనర్హుడై పోతావు." ఇలా అర్జునుడిలోని సహజ సిద్ధమైన క్షత్రియ గుణాలను రేకెత్తించ డానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇక్కడ 'ఆర్య' శబ్దం ధర్మాధర్మాలు
తెలిసిన గొప్పవాడు అన్న అర్థం లో వాడబడింది.అదే విధంగా 'అనార్య' శబ్దం ధర్మాధర్మాలు తెలీని వాడు, పాటించని వాడు అన్న అర్థంలోనే వాడబడింది. ప్రస్తుత కాలంలో లాగా, ఆర్యులు,
ద్రావిడులు, మంగోలులు లా - వివిధ శరీర వర్ణాలు కలిగిన మానవ జాతులనే అర్థంలో కాదు. మన సంస్కృతిలో, సాహిత్యంలో ఆర్య అంటే - ధర్మాధర్మాలు తెలిసిన గొప్పవాడు - అని మాత్రమే ఎప్పుడూ వాడబడింది.
సరే. శ్రీకృష్ణుడు అర్జునుడితో యింకా ఏమంటున్నాడో చూద్దాం.
క్లైభ్యం
మా స్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే |
క్షుద్రం
హృదయదౌర్బల్యం త్యక్త్త్వోత్తిష్ట పరంతప || (2.3)
"ఓ పార్థా! యీ దుర్బలత్వం కేవలం నపుంసక లక్షణమే కానీ నీ లాంటి వీరుడికి యెంత మాత్రమూ తగదు. ఈ మానసిక బలహీనత చాలా, చాలా నీచమైనది. నీవు యుద్ధంలో శత్రువులను కాల్చివేసే పరాక్రమ శాలివి. నీ హృదయ దౌర్బల్యాన్ని వెంటనే విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధంగా నిలబడు. "
అర్జునుడు
క్షత్త్రియుడు. మహా వీరుడు. సాక్షాత్తూ పరమేశ్వరుడితో యుద్ధం చేసి మెప్పించిన వాడు. ఉత్తర గోగ్రహణంలో వొంటరిగా కౌరవులనందరినీ ఓడించిన వాడు. ఓటమి అంటే ఎరుగని పరాక్రమశాలి. ఈ యుద్ధం లో విజయం పొందడానికోసం ఎంతో యెక్కువ సన్నాహాలుచేసుకున్నవాడు. అటువంటివాడు యిలా మాట్లాడుతుంటే, శ్రీకృష్ణుడు, అతనిలోని పౌరుషాన్ని మళ్ళీ వెలితీయడానికి అంటున్న మాటలు యివి. నువ్వు సంవత్సరం పాటు బృహన్నలగా, పేడిగా విరాటుని అంతఃపురం లో నాట్యాలాడుతూ, ఉత్తరకు నాట్యం నేర్పిస్తూ వున్నావు - యింకా అదే గుణాలతో మాట్లాడుతున్నావా - అని పరోక్షంగా ఎద్దేవా చేస్తున్నాడు.
ఆ బృహన్నల పాత్ర ముగిసిపోయింది. ఇక మళ్ళీ నపుంసకుడి లాగా మాట్లాడకు. నువ్విప్పుడు ఈ మహా యుద్ధంలో వున్న, మహా వీరుడైన అర్జునుడివి. నీ పరాక్రమంతో, శత్రువుల సైన్యాలను కాల్చివేయగలిగిన వాడివి. ఆ బృహన్నల పాత్ర లోని హృదయ దౌర్బల్యాన్ని మూటగట్టి పారేసి, మళ్ళీ ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన నీ ధైర్యానికి, పరాక్రమానికి ప్రతిరూపమైన నీ స్వభావానికి వచ్చెయ్ - అంటున్నాడు.
పరంతపః - అని సంబోధిస్తున్నాడు. అంటే, శత్రువులను యుద్ధభూమి లో మాడ్చివేసే వాడు అని అర్థం. అటువంటి వాడు, నువ్వు, యిలా పిరికివాడిలా, పేడిలా మాట్లాడుతున్నావేమిటి ? మీరు చేసిన ప్రతిజ్ఞలు, పడిన కష్టాలు, నేను వెళ్లి జరిపిన రాయబారం, తరువాత మనమందరూ కలిసి తీసుకున్న యుద్ధ నిర్ణయం - అన్నీ మర్చిపోయావా? నీ వెనుక ఏడు అక్షౌహిణుల సైన్యం, ఎంతో మంది రాజులు - మీ పాండవుల కోసం యుద్ధానికి వస్తే , నువ్వేమో వున్నట్టుండి యుద్ధాన్ని విడిచి వెళ్లిపోదామంటున్నావు? మరి వాళ్లనెందుకు పిలిచినట్టు? నన్నెందుకు సారథిగా పిలిచినట్టు? జెండాపై కూర్చుని నీ యుద్ధం చూడడానికి ఉవ్విళ్ళూరుతూ వున్న హనుమంతుడు వెర్రి వాడు - అనుకున్నావా ? దేవతలిచ్చిన ఈ రథం, ఈ దివ్యాశ్వాలు, ఈ గాండీవం, ఈ అక్షయ తూణీరాలు, ఈ కిరీటం, ఈ పాశుపతాస్త్రం, ఈ దివ్యాస్త్రాలు నువ్వెందుకు తీసుకున్నట్టు ? పేడిలా ఎవ్వరూ చూడకుండా వెళ్లిపోవడానికా? నీ అసలు సమస్య ఏమిటి ? అసలు, నీ సమస్య ఏమిటి?
ఇదండీ కృష్ణుడు అడిగినదానికి సరైన అర్థం. అన్నీ కలిపి, పేడిలా మాట్లాడుతున్నావేమిటి మళ్ళీ? అని అడిగాడు. యిప్పుడు అర్జునుడి తన అసలు సమస్య చెబుతాడా, అని చూద్దాం.
అర్జునుడి మాట :
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదనా || (2.4)
"ఓ మధుసూదనా ! ఓ శత్రు నాశనా ! భీష్ముడు, ద్రోణుడు నా చేత పూజింప బడవలసిన వాళ్ళు కదా. అటువంటి వాళ్ళతో నేను నా బాణాలతో యుద్ధం చెయ్యడం ఎలా సాధ్యం ?"
యిది కొంత వరకు సమర్థనీయమే అనిపిస్తుంది కదా.
అర్జునుడు అంటున్నాడు - భీష్ముడు నాకు చాలా యిష్టుడైన తాత, గురువు. నాకు ఎన్నో ధర్మాధర్మాలు నేర్పిన వాడు. చాలా ధర్మపరుడు ఆయన. నాకు అన్ని రకాలా పూజనీయుడు. ద్రోణుడు నాకు యుద్ధవిద్యలన్నీ నేర్పిన వాడు. మిగతా శిష్యులందరి కన్నా, కొడుకైన అశ్వథామ కన్నా, నాకే ఎక్కువ విద్యలు, అస్త్ర,శస్త్రాలు నేర్పిన వాడు. ద్రోణుడికి అందరికంటే ప్రియతమమైన శిష్యుడు నేనే. ఈ పూజనీయులైన భీష్మ,ద్రోణులతో యుద్ధం చెయ్యాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎలా అనుకోగలను చెప్పు? వీళ్ళపైన నేను బాణాలు ఎలా సంధించగలను?
నిజమే . అర్జునుడి మనసులో వీళ్ళపైన అమితమైన ప్రేమ వుంది. కౌరవులతో యుద్ధం అనుకున్నాడు కానీ , ఆ యుద్ధంలో వీళ్ళతో కూడా యుద్ధం చెయ్యాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. యింకా ఏమంటున్నాడో చూద్దాం.
అర్జునుడి మాట :
గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుమ్ బైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || (2.5)
"మహానుభావులైన ఈ గురువులను వధించడం కంటే, భిక్షాటన చేసి వచ్చే దాన్ని భుజించడం ఎంతో మేలు కదా! అంతేకాదు. వాళ్ళను వధిస్తే నాకు వచ్చే భోగాలు, సుఖాలు యివన్నీ వాళ్ళ రక్త ప్రవాహాలలో మలినమై వచ్చేవే కదా!"
ఇప్పుడు, 'వీళ్ళను నేను వధించగలను, కానీ గురువులు, పూజనీయులు గనుక వధించలేను' అన్న ధీమా కొద్దిగానైనా కనపడుతోంది కదా. ఇది శ్రీకృష్ణుడి మాటల ప్రభావం. పేడితనం, హృదయ దౌర్బల్యం కొంత పోయినట్టే. భీష్మద్రోణులు తన విరోధులు కానే కారు. పైగా పూజనీయులు, ప్రీతిపాత్రులు. కానీ, కౌరవులవైపు యుద్ధరంగంలో నిలబడి వున్నారు. ఇది అర్జునుడికి పెద్ద సమస్యే. మరి, ఇంతకు ముందు కౌరవులతో కూడా యుద్ధం చెయ్యను - అన్నాడు కదా! దాని మాటేమిటి ? చూద్దాం అర్జునుడు ఏమంటున్నాడో !
అర్జునుడి మాట :
న చేతత్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషయమేస్తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాహ్ || (2.6)
"నాకొక్క విషయం అర్థం కావడం లేదు - మనం వాళ్ళను జయిస్తే మేలా , వాళ్ళే మనలను జయిస్తే మేలా ? ధృతరాష్ట్రుని ఈ కొడుకులు మనముందు నిలబడి వున్నారు. వాళ్ళను వధించిన తర్వాత మనం మాత్రం జీవించి వుండి ఏం లాభం ?"
అర్జునుడి మనస్సులో యిన్ని సందిగ్ధాలున్నాయి. మనం వాళ్ళను జయిస్తే మేలా, వాళ్ళే మనలను జయిస్తే మేలా? మనం వాళ్ళను జయిస్తే - ఆ పూజనీయులను మనం వధిస్తే పాపమే వస్తుంది గాని పుణ్యమెలా వస్తుంది? యిది ముందే చెప్పాను. ఇక ఈ కౌరవులున్నారు, మన ఎదురుగా. భీష్ముడిని రక్షిస్తూ వెనుక నిలబడ్డారు చూడు. నేను కదా భీష్ముడికి తోడుగా నిలబడాలి. వాళ్ళు నిలబడి వున్నారు. అలాంటి వాళ్ళను నేను చంపి, నేను మాత్రం ఎలా జీవించి వుంటాను? నాకేం తోచడం లేదు - అనుకుంటున్నాడు, కొన్ని కృష్ణుడితో అంటున్నాడు. ఇక ప్రయోజనం లేదు. ఈ కృష్ణుడు నాకు వుత్త స్నేహితుడు మాత్రమేనా. నాకు మొట్టమొదటి నుండి శ్రేయోభిలాషి, స్నేహితుడు, ధర్మాధర్మాలన్నీ తెలిసిన వాడు, మార్గదర్శి.
ఆంగ్లంలో ఫ్రెండ్ , ఫిలాసఫర్ అండ్ గైడ్ అని చెప్పవచ్చు.
నాకు సాయుధులైన సేనలు వద్దు, శ్రీకృష్ణుడే కావాలి అని అడిగి మరీ తీసుకొచ్చుకున్నాను కదా. ఇప్పుడీ సమస్యకు నేను పరిష్కారం ఎలాగూ చెప్పలేను గనుక, యీ కృష్ణుడినే అడిగితే పోలా? అడగడం ఎలా ? ఎలా అడిగితే చెబుతాడు? స్నేహితుడుగా అడగడం లాభం లేదు. నీవే నాకు దిక్కు అని సమర్పణ భావంతో అడగడమే మంచిది - అని అనిపించింది అర్జునుడికి. ఇప్పుడేమంటున్నాడో చూద్దాం.
అర్జునుడి మాట :
కార్పణ్యాదోషోపహతస్వభావః పృచ్చామి త్వామ్ ధర్మ సమ్మూఢ చేతాః |
యః శ్రేయహ్ స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మామ్ త్వామ్ ప్రపన్నం || (2. 7)
"ఇప్పుడు నా సహజ స్వభావము కార్పణ్య దోషం వలన దెబ్బ తినింది. నా మనస్సులో ధర్మమేదో తెలియరాని మూఢత్వం అలముకొనివుంది. నేను నీ శిష్యుడిని. నీ శరణు జొచ్చిన వాడను. నాకు నిశ్చయంగా మంచిదేదో నువ్వే చెప్పు అని ప్రార్థిస్తున్నాను."
మొట్ట మొదటి సారి, అర్జునుడు - నేను నీ శిష్యుడను; నిన్నే శరణు జొచ్చిన వాడను; నాకు ఏమీ తెలియడం లేదు. నేనేం చెయ్యాలో నువ్వే నిశ్చయించి నాకు చెప్పు - అంటున్నాడు. కృపణ అంటే చాలా లోభిత్వము , భీరుత్వము లేదా బాధలో వుండే వాడు అని రకరకాలుగా చెప్పొచ్చు.
నేను కర్తవ్య మూఢత్వంలో వున్నాను. నువ్వే చెప్పు - నేనెను ఏమి చేయవలెనో, అని అడుగుతున్నాడు అర్జునుడు. ధర్మ మార్గంలోను, యోగ మార్గంలోను, జ్ఞాన మార్గం లోను ఒక నియమము పాటిస్తారు. అడగని వాడికి సలహా యివ్వరాదు. అడగనివాడికి ఉపదేశం చెయ్యరాదు. అడిగినా, అడిగిన వాడి భక్తిశ్రద్ధలను బాగా పరిశీలించి గాని, ఏ సలహా గానీ, ఉపదేశం గానీ యివ్వరాదు. అనర్హులకు సలహాలు, వుపదేశాలు సరైన రీతిలో అర్థం కావు. వారు దాన్ని వక్రీకరించి ప్రమాదం తెచ్చుకోవడమో, గురువుకే అప్రతిష్ట తేవడమో చేస్తారు.
అర్జున విషాద యోగంలో - అర్జునుడు శ్రీకృష్ణుడిని ఏ సలహా గానీ, ఉపదేశం గానీ అడగ లేదు. తన లోని ఆలోచనలు, నిర్ణయాలుగా చెప్పుకున్నాడు. నేను యుద్ధం చెయ్యను, అన్నాడు. రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో మొదట శ్రీకృష్ణుడు మందలించాడు. కానీ సలహా యివ్వలేదు. ఏమిటి నీ సమస్య - అన్నట్టు అడిగాడు. యింకా పేడిగానే వ్యవహరిస్తున్నావు, నువ్విప్పుడు వీరుడివి - అని హెచ్చరించాడు.
దానికి బదులుగా అర్జునుడు, మెల్లమెల్లగా తన అహంభావాన్ని, మూఢత్వాన్ని వదిలి తన నిజమైన సమస్యను చెప్పి, శరణు జొచ్చి , శిష్యుడనని చెప్పి ప్రార్థించి, నాకు పరిష్కారం నువ్వే చెప్పు - అని అడుగుతున్నాడు. యింకా ఏమి చెబుతున్నాడో విందాం.
అర్జునుడి మాట :
నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణం యింద్రియాణాం |
అవాప్య భూమావాసపట్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం || (2. 8)
"నాకు భూమండలంలో అత్యంత సంపన్నమైన, శత్రువిహీనమైన రాజ్యానికి ఆధిపత్యమే వచ్చినా, సురలోకాధిపత్యమే వచ్చినా, నాలోని యీ శోకం నా యింద్రియాలనన్నింటినీ తడి ఆరిపోయేటట్టు చేస్తూ వుంది. దానికి నాకు పరిష్కారమో, ప్రత్యామ్నాయమో తెలియడం లేదు."
శరణుజొచ్చిన అర్జునుడు మళ్ళీ తనలోని శోకాన్ని, దానికి తనకు పరిష్కారం తెలియదని యిలా చెబుతున్నాడు. నాకు తెలియదు - అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటేనే, మరొకరిని, మనకంటే బాగా తెలిసిన వారిని అడగడానికి మనసు ముందుకు వస్తుంది. నిజంగా సరిగ్గా తెలుసుకోవాలని శ్రద్ధ వస్తుంది. నాకు తెలుసు - అని అనుకుంటే, ఆ తెలిసిన దాన్ని మించి నేర్చుకోవాలనే ప్రయత్నమే చెయ్యము. యిది ప్రతి వొక్కరిలోని మానసిక దుర్బలత్వం.
ఆంగ్లంలో గురించి ఒక గొప్ప నానుడి వుంది .
"ఆయనకు తెలుసు. తనకు తెలుసుననీ బాగా తెలుసు. ఆయన జ్ఞాని. ఆయన వద్ద శిష్యుడిగా వెళ్లి నేర్చుకో .
మరో ఆయనకు తెలుసు.
కానీ, తనకు తెలుసుననే విషయం ఆయనకు తెలీదు. ఆయన సుషుప్తి (నిద్ర) లో వున్నాడు. ఆయనను నిద్ర లేపాలి.
మరో ఆయనకు తెలీదు.
తనకు తెలీదు అన్న విషయం మాత్రం ఆయనకు బాగా తెలుసు. అటువంటాయన అమాయకుడు. అతనికి నేర్పాలి.
మరో ఆయనకు తెలీదు.
తనకు తెలీదు అన్న విషయం కూడా తనకు తెలీదు. (అంటే, తెలుసునని అనుకుంటున్నాడు). అతను ప్రమాదకరమైన మూర్ఖుడు. అతనికి దూరంగా వుండు. "
ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏదైనా తెలుసుకోవాలంటే, మొదట - నాకు యింతే తెలుసు; దానిపైన మరేమీ తెలీదు; అది నేను తెలుసుకోవాలి; అందుకు బాగా తెలిసినటువంటి జ్ఞాని వద్దకు వెళ్ళాలి; నా అహంభావం, గర్వము అన్నీ వదిలి, తెలుసుకోవాలనే తపనతో ఆ జ్ఞానిని గురువుగా అంగీకరించి ఆయనను నాకు యిది తెలియజెప్పండి - అని ప్రార్థించాలి. ఇదీ పద్ధతి.
ఇక్కడ శ్రీకృష్ణుడు మొదటి వర్గానికి చెందిన వాడు. ఆయనకు తెలుసు. తనకు తెలుసుననీ బాగా తెలుసు. ఆయన జ్ఞాని. ఆయన జ్ఞాని అన్న సంగతి అర్జునుడికి కూడా బాగా తెలుసు .
అర్జునుడు మూడో వర్గానికి చెందిన వాడు. నాలుగో వర్గపు వాడిలా మొదట ఏదేదో మాట్లాడాడు గానీ త్వరగా , మూడో వర్గపు వాడిలా మారిపోయాడు. నేను నీ శిష్యుడను. నాకు తెలియడం లేదు. నువ్వే దిక్కు అన్నాడు. ఇప్పుడు అర్జునుడు వుపదేశానికి అర్హుడవుతున్నాడు.
అర్జునుడు అర్హుడయ్యేవరకు శ్రీకృష్ణుడు ఏ ఉపదేశమూ యివ్వలేదు. ఇకముందు ఏమవుతుందో చూద్దాం .
అర్జునుడి యిన్ని మాటల తర్వాత, సంజయుడు ధృతరాష్ట్రునితో యిలా చెబుతున్నాడు :
సంజయుని మాట :
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశహ్ పరన్తపః |
న యోత్స్య యితి గోవిందం వుక్త్వా తూష్ణీం విభూవ హ || (2.9)
శ్రీకృష్ణుడితో యీ మాటలన్నీ చెప్పిన అర్జునుడు తన సమస్యను గోవిందునికి సమర్పించి, శరణుజొచ్చి, నేనిక యుద్ధం చెయ్యను అని మళ్ళీ చెప్పి, నిశ్శబ్దంగా కూర్చుని వుండిపోయాడు.
నిజానికి ఇప్పటి వరకు కూడా విషాదయోగమే అని చెప్పవచ్చు. కానీ సాంఖ్య యోగం లో అర్జునుడు చెప్పిన దానికీ, అర్జున విషాదయోగంలో చెప్పిన దానికీ, చాలా అంతరం వుంది. విషాదయోగంలో, నాకు తెలుసు, నేను ఇలానే చేస్తాను అన్న మూఢత్వం తో చెప్పాడు. ఇప్పుడు నాకు తెలియడం లేదు, తెలీదు, నీకు తెలుసు, నేను నీ శిష్యుడను, ఆర్తిలో వున్న నాకు నువ్వే సరైన మార్గం చెప్పు, అంత వరకు యుద్ధం చెయ్యను - అంటున్నాడు.
శిష్యుడుగా శరణు జొచ్చిన వాడికి, ఇక నుండి ఉపదేశం ప్రారంభం అవుతుంది. నిజమైన సాంఖ్య యోగం యికపైనే ఆరంభం.
ఇక్కడ మరోమాట చెప్పుకోవాలి. మనం ఏ 'పెద్ద పని' చేయాలనుకున్నా - అది మనకు ఒక ధ్యేయం, మన జీవితానికి ఒక లక్ష్యం అని నిర్ణయించు కోవాలి. మళ్ళీ వెనక్కి పోయే ఆలోచన రాకూడదు. లక్ష్యం నిర్ణయించుకోక ముందు, యిదా, అదా, మరొకటా - అని ఎన్నైనా తర్జన భర్జనలు, వాదాలు, తర్కాలు చేసుకోవచ్చు. యివన్నీ చేసుకుని ఆ తరువాతే మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. అందులోని సాధక బాధకాలు, వచ్చే అడ్డంకులు, వాటిని ఎదుర్కొనే మార్గాలు, వుపాయాలు అన్నీ యోచించి, ఆ తరువాత మన లక్ష్యం గురించి ఒక దృఢ నిశ్చయానికి రావాలి. యివన్నీ అయినా తర్వాత వెనక్కి తగ్గే ప్రయత్నమే వుండకూడదు. లక్ష్య సాధన వైపు పరుగెత్తడమే అందమైన, ఆదర్శ వంతమైన జీవితం. ఇలా నిర్ణయించుకున్న లక్ష్యం వదిలి వెనక్కి పోవాలనుకునే వాడు , జీవితంలో ఏదీ సాధించ లేడు
12 ఏళ్ళ అరణ్య వాసము, 1 సంవత్సరం అజ్ఞాత వాసం చేసి - ఆ తరువాత సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ద్వారా రాయబారం కూడా జరిపి, ఆ తరువాత యుద్ధానికి బృహత్ ప్రయత్నం చేసి, 7 అక్షౌహిణుల సైన్యం, ఎంతో మంది రాజుల సహకారం కూడగట్టుకుని , నభూతో నభవిష్యతి అన్నంత పెద్ద యుద్ధంలో నిలబడ్డ అర్జునుడు యిప్పుడు యుద్ధం చెయ్యనంటున్నాడు!
ఒక పెద్ద పని చేసే ముందు SWOT ఎనాలిసిస్ అని ప్రస్తుతం చెప్పుకునే ఒక విమర్శ చేయడం సాధారణంగా జరుగుతుంది . అందులోనూ, యింత పెద్ద యుద్ధం చెయ్యాలంటే, యిది తప్పదు . మన (1) బలాలు (2) బలహీనతలు (3) మనకున్న అవకాశాలు (4) మనకున్న ప్రమాదాలు యివన్నీ నిష్కర్ష విమర్శగా చర్చించుకోవడమే SWOT ఎనాలిసిస్. యిది పాండవులు చేశారు. అర్జునుడూ చేశాడు. అలాగే కౌరవులు కూడా చేసుకున్నారు. మరి సమస్య ఎక్కడొచ్చింది? ఒక్క భీష్ముడు యెంత నాశనం చెయ్యగలడు , ఆయనను ఎలా నిరోధించాలి అన్న విషయం పాండవులలో ఎవరికీ తెలీదు . ద్రోణుడి చేతిలో ఆయుధం వుండగా ఆయనను ఎవరూ జయించలేరు. ఈ విషయం పాండవులకు తట్టనే లేదు. అర్జునుడికి తట్ట లేదు. కానీ ఒక్క విషయం తెలుసు. శ్రీకృష్ణుడు మనవైపు వున్నాడు. ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పటి వరకు కాపాడిన వాడు ఆయనే కదా. ఇప్పుడూ కాపాడుతాడులే - అన్న ధీమా పాండవులకు వుంది. అలాగే జరిగింది యుద్ధంలో.
సరే. అర్జునుడికి ఈ SWOT ఎనాలిసిస్ అర్థమయ్యింది. కానీ, అర్థం కాని పెద్ద సమస్య ఒకటుంది. అర్జునుడి సమస్య బయట లేదు. తనలోనే వుంది. ఆయుధాలు వున్నా, భీష్మ ద్రోణులతో యుద్ధం అని అర్జునుడు ఎప్పుడూ అనుకోలేదు.అదెలా అంటే, అదంతే మరి. కౌరవులతో యుద్ధం అనుకున్నాడు - అది అర్జునుడికి సమస్యే కాదు. వాళ్ళ 11 అక్షౌహిణుల సేన, మిగతా రాజులు - ఎవరూ అస్సలు సమస్యే కాదు.
కానీ ఈ శ్రీకృష్ణుడు సేనల మధ్య రథం నిలపమంటే, సాక్షాత్తూ - భీష్మ ద్రోణుల ముందు - కావాలనే నిలిపాడు. వాళ్ళు నవ్వుతూ , ఎప్పటిలా తన్ను ఆశీర్వాదం చేస్తున్నట్టు వుంది. ప్రియమైన తాతతో, పూజ్యుడైన గురువుతో యుద్ధం ఏమిటి? వాళ్ళ కోసం తన ప్రాణమైనా యోచన చెయ్యకుండా సమర్పించే వాడే అర్జునుడు.
అర్జునుడిలోని అతి పెద్ద బలహీనత యిదే. యిది పోగొడితే కానీ, యుద్ధం జరుగదు. అందుకే జగన్నాటక సూత్రధారి అయినా శ్రీకృష్ణుడు భగవద్ గీతకు అర్జునుడినే యెన్నుకున్నాడు. మన మానసిక బలహీనతల పైన విజయం సాధించాలి. మన మనస్సుపైన విజయం సాధించాలి. యిదే, శ్రీకృష్ణుడి ముఖ్యోద్దేశం. పనిలో పనిగా , మరెన్నో అపూర్వమైన వైజ్ఞానిక విషయాలను కూడా భగవద్ గీతగా మనకు అందించాడు శ్రీకృష్ణుడు. ఇక ముందు శ్రీకృష్ణుడు ఏం చెబుతాడో , అర్జునుడి ఈ మానసిక దౌర్బల్యాన్ని ఎలా తీసేస్తాడో ఇక ముందు చూద్దాం.
ఈ వ్యాసాలపైన
- మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.
సర్వే జనాః సుఖినో
భవంతు
= మీ
ఉప్పలధడియం
విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి