11, ఫిబ్రవరి 2017, శనివారం

భగవద్ గీత (6) - సాంఖ్య యోగము - దేహి ఎవరు ? దేహం ఎవరు? ఏది నిత్యం? యేదనిత్యం ?




భగవద్ గీత (6)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం మొదటి మూడు వ్యాసాల్లో చూశాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా చూశాం. యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొట్టమొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  న్న వారి కోసమైనా , పోయిన  వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకలా  చెప్పాడో కొంత విశ్లేషణ చేసుకున్నాం. శ్రేయస్ అంటే ఏమిటి, ప్రేయస్ అంటే ఏమిటి అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం. 
ప్పుడు జ్ఞాని ఎందుకు దుఃఖించడో - ఆ కారణాలను  శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మనలో మరణించేది  ఏది, మరణించనిది ఏది అన్న విషయం చెప్పబోతున్నాడు. 
శ్రీకృష్ణుడి మాట :
త్యేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాహ్  |  
న చైవ న భవిష్యామః సర్వే వయమతః  పరం           ||  (2.12) 
న = కాదు ; చ = మరియు, నిజముగా; ఏవ = మరియు ; అహం = నేను ; జాతు = ఎప్పుడైనా ; న = కాదు; యిమే = ఈ ; జనాధిపాహ్ = రాజులు ; న = కాదు; చ = మరియు ; నిజముగా; ఏవ = మరియు ; భవిష్యామః = భవిష్యత్తులో ; సర్వే = అందరూ ; వయం = మనము; అతః = ఇప్పటి నుండి; పరం = తరువాత . 
"నేనూ , నువ్వూ , ఈ రాజులందరూ - మనమంతా పూర్వం లో ఎప్పుడూ ఈ ప్రపంచంలో లేని  వాళ్ళం కాము. అలాగే, యిక ముందు, అంటే, భవిష్యత్తు లో కూడా ఎప్పుడూ వుండబోని వాళ్ళమూ  కాము."




ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు - అన్ని దేహాలకూ మరణం తప్పని సరి; కనుక, చనిపోయే ఈ దేహాల్ని గురించి విచారించ కూడదన్నాడు.  

ఇప్పుడు - నువ్వు, చనిపోయే దేహం కాదు, నువ్వు జనన మరణాలు లేని ఆత్మ స్వరూపుడివి - అంటున్నాడు.   

 నువ్వూ, నేనూ , యిక్కడున్న  యీ  రాజులు , సేనలు - అందరూ  భూత, భవిష్యద్, వర్తమానాలలో ఎప్పుడూ  వున్న వాళ్ళమే, మరియు వుండబోయే వాళ్ళమే. మనం నిన్న లేదు, ఈ రోజు వున్నాము, రేపు వుండము - అని అనుకోకు. అందరూ  ఎల్లప్పుడూ వుండే వాళ్ళమే - అంటున్నాడు. 

దేహము పంచభూతాత్మకమైనది. అది ఎల్లప్పుడూ మార్పు చెందుతూనే వుంటుంది. మనం స్థూలంగా జననము,బాల్యము, యవ్వనము, మధ్యవయస్సు, వృద్ధాప్యము, మరణము అని జీవితాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తాము. నిజానికి, శరీరము ప్రతి క్షణమూ మార్పు చెందుతూనే వుంటుంది. అలాగే మనసు కూడా  పంచభూతాత్మకమైనది. అది కూడా, ప్రతి క్షణమూ మార్పు చెందుతూనే వుంటుంది. మరి మనలో, మార్పు చెందనిది ఏది?

శరీరము, మనసు - మనకు పంచ భూతాల నుండీ  వచ్చినవి.  వాటికీ, పంచ భూతాలకు మధ్య నిరంతరమూ యిచ్చి పుచ్చుకోవడాలు జరుగుతూనే  వుంటుంది. శరీరము వంద సంవత్సరాల ఆయుర్దాయం కలది. శరీరంలో వుండే ఒక్కొక్క అంగానికి వేరు వేరు ఆయుర్దాయాలున్నాయి. అందు వలన శరీరం లోని పటుత్వం తగ్గుతూ వస్తుంది. వంద సంవత్సరాలకు అది పూర్తిగా పడిపోతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ శరీరం మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి మరో చోట పుడుతుంది. సూక్ష్మ శరీరం కూడా పాంచ భౌతికమైనదే. కాకపోతే దాని ఆయుర్దాయం చాలా ఎక్కువ. ఒక కల్పం వరకు అది వుంటుంది. అప్పుడు అదీ పడి  పోతుంది. కారణ  శరీరం ఆ తరువాత కూడా వుంటుంది . కానీ అది కూడా ఒకప్పుడు నశించి పోవలసిందే. 

ఈ  స్థూల,సూక్ష్మ, కారణ శరీరాలన్నీ కలిసి, ఒక్క స్థూల శరీరంగానే మనకు కనిపిస్తూ వుంది. వీటికి జనన, మరణాలు తప్పవు. వి పంచ భూతాలనుండి మనకు వచ్చినవి, వాటికే చెందినవి. వాటికే తిరిగి  వెళ్లిపోయేవి. 

ఇవి  మనవీ కావు; మనమూ కాము. కానీ,  ఇవే,మనము అని మనం భ్రమ పడుతూ వుంటాము. లేదా, యివి  మనవి - అని భ్రమ పడుతూ వుంటాము. కొన్ని వెంట్రుకలు పడిపోతే కూడా - అయ్యో, పడిపొయ్యాయే , అని విచారపడే వాళ్ళను కూడా మనం చూడొచ్చు. శరీరం లోని ఏ అంగమూ శాశ్వతంగా వుండదు. అన్నీ పడిపొయ్యేవే. ముసలితనం వస్తే, కళ్ళు కనిపించక పోవచ్చు, చెవులు వినిపించక పోవచ్చు , కాళ్ళు నడవలేక పోవచ్చు, నోరు మాట్లాడలేక పోవచ్చు , మెదడు కూడా సరిగ్గా పని చెయ్యలేక పోవచ్చు. 

అయినా - మనం యివి కాదు; మనం ఎల్లప్పుడూ జీవించే ఉంటాము. మనం కేవలం ఇప్పటి వాళ్ళం కాదు. ద్వాపర యుగంలోనూ మనం వున్నాము ; రామాయణ కాలం, అంటే, త్రేతాయుగంలోనూ మనం వున్నాము. కృతయుగం లోనూ మనం వున్నాము. ముందు రాబోయే యుగాల్లోనూ మనం వుంటాము.  మనకు జనన, మరణాలు లేవు, ముసలితనం లేదు, వ్యాధులు లేవు. ఇలాంటి మనం ఎవరు ? మన పేరేంటి ? మన రూపురేఖలు ఏమిటి? మన స్వభావం ఏమిటి ?  మనకూ, ఈ దేహానికీ సంబంధం ఏమిటి - యివన్నీ చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు, ముందు వచ్చే శ్లోకాలలో. 
 
శ్రీకృష్ణుడి మాట :

దేహినోస్మిన్యథా దేహీ కౌమారం యవ్వనం జరా   |

తథా  దేహాంతరప్రాప్తిర్  ధీరస్తత్ర న ముహ్యతి    ||    (2. 13)

దేహినః = దేహాన్ని ధరించి వున్న వాడు; అస్మిన్ = దీని యందు; యథా = ఏ విధముగానైతే ; దేహీ = దేహము లో నుండి ; కౌమారం = బాల్యము; యవ్వనం = యవ్వనము; జరా = వృద్ధాప్యము; తథా = అదే విధముగా; దేహాంతరప్రాప్తిహ్ = మరో దేహాన్ని పొందడము కూడా ; ధీరః = ధీరుడు; తెలిసిన వాడు; జ్ఞాని; తత్ర= దీనియందు; దీని కోసం; న = కాదు,లేదు; ముహ్యతి = చింతించడు. 

 "దేహి - అంటే, దేహంలో వున్న మనం - దేహం ద్వారా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, అనుభవిస్తున్నాము. అలాగే, ఈ దేహాన్ని వదిలి, మరో దేహానికీ వెళ్ళిపోతున్నాము.  జ్ఞాని అయిన వాడు దీన్ని గురించి ఏ మాత్రం దుఃఖపడడు. "
క్కడ దేహి, అంటే - దేహంలో వున్న వాడు లేదా దేహాన్ని ధరించి వున్న వాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా, తనికి, శ్రీకృష్ణుడు ఏ పేరూ పెట్టలేదు.  దేహి - అన్నాడు, అంతే.  

దేహానికి, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు  పెట్టుకుంటూ వుంటాము. 'దేహి'కి పుట్టుకా  లేదు; మరణమూ  లేదు; మరి దేహానికి పేర్లు మారినట్టు దేహికి పేర్లు మారుతాయా? మనం దేహాన్ని గుర్తించి ఫలానా  వాడు అని పిలుస్తాము. కానీ 'దేహి'ని గుర్తించి పిలువ గలమా? దేహిని చూడలేము. దేహాన్ని మాత్రమే చూడగలం. దేహం పడిపోతోంది. దేహి ఎప్పుడూ వుండే వాడు. పడిపోయే దేహాన్ని గురించి , జ్ఞాని అయిన వాడు  వ్యథ చెందడు.  


ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దేహి దేహంలో వున్నాడు. సరే. దేహం  పట్ల, దేహి కర్తవ్యం  యేమైనా  ఉందా?  యిది  పురాతనమైన మరో శ్లోకంలో చూద్దాం. 

దేహో దేవాలయో ప్రోక్తహ్ ; జీవో దేవః సనాతనః  | 

శ్రీకృష్ణుడు చెప్పిందే, యిక్కడ  మరో రకంగా చెప్పబడింది . దేహి సనాతనుడే. ఎప్పుడూ  వుండేవాడే.  కానీ, యిప్పటి యీ దేహం  అతనికి దేవాలయం లాంటిది. దాన్ని  శుభ్రంగా,ఆరోగ్యంగా పెట్టుకోవాల్సిన బాధ్యత దేహిదే. దేహం ద్వారానే, దేహి ఈ ప్రపంచం అంతటితోనూ సంబంధం పెట్టుకుంటాడు ; దాన్ని గురించి తెలుసుకుంటాడు. 

పతంజలి అంటాడు - దేహం ద్వారా దేహి తెలుసుకునే ప్రపంచమే, అతని మోక్షానికి కారణం కాగలదు, అని. ప్రపంచాన్ని తెలుసుకోవాలి. దాని ద్వారానే మోక్షాన్ని పొందాలి.  

కానీ, నేను దేహాన్ని కాదు, దేహిని అనుకుంటేనే, ప్రపంచాన్ని నిజంగా తెలుసుకోగలం. లేదంటే, పంది, బురదలో జీవిస్తూ, అదే స్వర్గం అనుకున్నట్టు గా ఉంటుంది మన జీవితాలు. శ్రేయస్  ను వదిలి , ప్రేయస్ వెనుక  పరుగులు పెడుతూ, శాశ్వతానందాన్ని మరిచి, క్షణికానందాన్ని వెదుకుతూ వుండి పోతాం. 

ఇక ముందు ముందు , శ్రీకృష్ణుడు  ఏం చెబుతాడో చూద్దాం .  


వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది
సర్వే  జనాః సుఖినో భవంతు 
= మీ 
    
ఉప్పలధడియం   విజయమోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి