3, మార్చి 2012, శనివారం

మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ - కలియుగం కాదిది - రేపుల యుగం - దేవుడు కొత్త రూల్స్ పెడుతున్నాడు. అవి యేవో తెలుసా?


యిప్పుడు - యిండియా లో - రేపుల యుగం నడుస్తూ వుంది. యింతకు ముందు లేదని కాదు.

త్రేతాయుగం లో కూడా - రావణాసురుడు   వున్నాడు.  ఆయనకు రేపులంటే మహా యిష్టం.  అలాంటి వారు అప్పుడూ వున్నారు. యిప్పుడూ వున్నారు.

రావణాసురుడు  వూరికే వుండలేడు కదా. ఎవరి భార్యను ఎత్తుకుపోదామా అని - యోచన చేస్తూనే వుంటాడు.

ఏదో శాపం అడ్డు వలన, రావణుడు సీతను బలాత్కారం చెయ్యలేక పొయ్యాడు. లేదంటే - చేసే వాడే. అన్న కొడుకు (నలకూబరుడు) భార్య అయిన రంభను కూడా రావణుడు వదలలేదు.యిలా ఎంతో మందిని బలాత్కారం చేసిన వాడే. పాపం పూర్తిగా పండిన తరవాతనే పొయ్యాడు. త్రేతాయుగంలో - రేపులకు, వొక్క రావణుడు వుండే వాడు. మిగతా వారి గురించి మనకు తెలీదు.

రామాయణం ప్రప్రథమ కావ్యం. అందులో అతి ముఖ్యంగా చెప్ప బడిన నీతి  - మగవాడికి, అంత స్త్రీ లోలత్వం పనికి రాదని, అది నాశనానికే దారి తెస్తుందని.

యిది చెప్పబడింది - త్రేతా యుగంలో. అప్పటి నుండి, యిప్పటి వరకు, మగవాడి ఈ బలహీనతలో మార్పులేదు.

అందుకే - మగవాడి ఈ బలహీనతను కట్టు చేయడానికి మన సమాజం ఎన్నో సామాజిక నిబంధనలు, ఆంక్షలు పెట్టింది. 

మగవాడు మొట్టమొదట - అంటే, తాను చదువుకునే రోజుల్లో - బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని  పెట్టారు. అది వూరికే కాదు. మగ వాడికి మొదట తనపై తనకు కొంత కంట్రోల్ రావాలి.  తనను గురించి తనకు తెలియాలి. తప్పటడుగులు వేసే ముందు సర్డుకోగలిగే జ్ఞానం రావాలి.

యిది మగవాడికి -చాలా, చాలా, ఉపయోగ పడే ప్రక్రియ, ఉపయోగ పడే విద్య.

ఇప్పుడది వదిలేసి - ఆడా, మగా సెక్సు జ్ఞానం పుట్టగానే నేర్చుకోనీ. అదీ క్లాసులో నేర్పుతామని అంటున్నారు.

మరి తనపై తనకు కంట్రోల్ ఎలా నేర్పుతారు? ఎవరు నేర్పుతారు? ఎప్పుడు నేర్పుతారు?

నేర్పే  వారికి , తమపై తమకే కంట్రోల్ లేదు కాబట్టి - కంట్రోల్ లేకపోవడం ఎలాగో - అది మాత్రమే, నేర్పుతారు. నేర్పగలరు. అదే సెక్సు పరిజ్ఞానం. అది నేర్పుతారు.

నిజానికి - తనను తాను కంట్రోల్ చేసుకోవడం ఎలాగో - ఆ సైన్సు  నేర్పే వాడికీ తెలీదు. నేర్చుకునే వాడికీ తెలీదు, ఈ కాలంలో. యిది, యిప్పటి సామాజిక మూర్ఖత్వానికి, వొక పారాకాష్టగా తయారవుతోంది.

జీవితానికి సెక్సు ముఖ్యం కాదని మన వారు చెప్ప లేదు. దాన్ని వొక గొప్ప సైన్సు గా కూడా తీర్చి దిద్దారు.

కానీ, అది ధర్మ మార్గంలో, చట్ట బద్ధమైన మార్గం లో లభిస్తే - జీవితాంతం వుంటుంది. లేదంటే - మగవాడి కైనా, ఆడదానికైనా - ముప్ఫై ఏళ్ళ లోపే, అందులో ఉత్సుకత ఏ మాత్రమూ మిగలదు; పూర్తిగా యిగిరిపోతుంది.

ఆ తరువాత మిగిలేది, వివాహేతర సంబంధాలూ, ఆ తరువాత, అందులోనూ, ఉత్సుకత లేకపోవడం. యిలా - వివాహ సంబంధాన్ని పూర్తిగా  పాడు చేసుకోవడం. యిదీ జరిగేది.

మగవాడికి నేర్పాల్సింది - మొదట తనపై తనకు కంట్రోల్. యిది నేర్పిన తరువాత- మరేదైనా  నేర్పొచ్చు. సెక్సు పరిజ్ఞానం చాలా సులభంగా వస్తుంది. ప్రకృతిలో దేన్నీ చూసినా తెలిసిపోతుంది.  అదేమీ బ్రహ్మ విద్య కాదు. అయినా - పెళ్ళైన తరువాత భార్యాభర్తలు అందులో తమకు కావాల్సిన విధంగా ఎన్నో రకాల ఎక్స్ పెరిమెంట్లు   చేసుకోవచ్చు. అవన్నీ మన దేశంలో ఎవరూ వద్దన లేదు. 

అసలు నేర్పాల్సింది తనపై తనకు కంట్రోల్. ఈ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? యిది కూడా మన వారు స్పష్టంగా చెప్పనే చెప్పారు. కామ, క్రోధ, లోభ,మోహ, మద, మాత్సర్యాలు మనలోని ముఖ్యమైన బలహీనతలుగా చెప్పారు. అదేదీ - మతపరమైనది కాదు. అంతా సైన్సు.

అందులో మొట్టమొదటిది, మిగతా అన్నిటికీ మూలమైనది - కామము. కామము అంటే కోరిక. ఏ కోరికైనా  , మనసును తొలిచే పురుగు లాంటిది. తీరే వరకు తొలుస్తూ వుంటుంది. ధర్మమూ, అధర్మము చూడ నివ్వదు . చట్ట బద్ధమా, కాదా - అదీ  చూడ  నివ్వదు. సమాజంలోని వారు ఏమనుకుంటారో - అదీ  చూడ  నివ్వదు. స్నేహితులను కూడా విరోధులుగా చూస్తుంది. మేలు కోరే వారిని దూరంగా పెట్ట మంటుంది. తల్లిదండ్రులు మొట్టమొదటి శత్రువులుగా కనిపిస్తారు. గురువులు దుర్మార్గులుగా కనిపిస్తారు. కామము అంత బలవత్తరమైనది.

కోరికలలో కూడా - సెక్సు  వాంఛ  చాలా బలవత్తరమైనది. "కామాతురాణాం న భయం న లజ్జ" - అని చెప్పారు. ఈ సెక్సు వాంఛ మనసులో పడిపోతే - యింతింతై, వటుడింతై -అన్నట్టు, క్షణ క్షణానికీ పెరిగి పోతుంది. మనసులో అదొక్కటే. మరి చదువుకూ తావు లేదు. దేనికీ తావు లేదు. భయం లేదు. సిగ్గు,లజ్జ లేదు.   పగలా, రాత్రా అన్న వ్యవస్థ లేదు. ఇల్లా, దారా, సినిమా హాలా, దేవుడి గుడా - అన్న జ్ఞానం వుండదు.  

"నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు" అన్న చందం అయిపోతుంది. అందులోనూ - మగవాడికి - ఈ బలహీనత ఎక్కువ. అందుకే, మగవాడికి - తనపై తనకు కంట్రోల్ మొదట నేర్పాలి.

ఈ కంట్రోల్ వున్న మగ వాడికి సెక్సు సామర్థ్యం - దాదాపు జీవితాంతం వుంటుంది. కంట్రోల్ లేని వాడికి - చాలా త్వరగా పోతుంది.

యిప్పుడు, ఆర్థికంగా అభివృద్ధి సాధించిన దేశాలలో - ఈ కంట్రోల్ చాల వరకూ పోయింది. సామర్థ్యమూ పోయింది. నా నాలుగో భార్యకు, నేను మూడో మొగుడిని - అన్న  వావి వరుసలు ఎప్పుడో  వచ్చాయి. పిల్లలు పుట్టడం చాలా తగ్గిపోయింది.

యిప్పుడు -ముఖ్యంగా పాశ్చాత్య  దేశాలలో, ఆడదంటే - మగవాడికి, మగ వాడంటే -ఆడదానికి - విముఖత పెరిగిపోతోంది. దీని ఫలితంగా, యిప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏమిటంటే - ఆడదాన్ని, ఆడదే పెళ్లి చేసుకుంటుంది. మగవాడిని, మగవాడే పెళ్లి చేసుకుంటాడు. దీన్ని చట్ట బద్ధం చేసేసారు, చాలా ప్రదేశాలలో.

యిది ఎందుకు జరుగుతోంది - అన్న సందేహం లేక పోలేదు.యిదొక మానసిక జాడ్యమేమో అన్న వివాదం యింకా పూర్తిగా తీర లేదు. దీనిపై పూర్తిగా పరిశోధనలూ  చెయ్య లేదు. అయినా - మేం  పెళ్లి చేసుకుంటాం, మేం చేసుకుంటాం - అనే వారి గోల మరీ ఎక్కువ అవుతుండటంతో - వారి వివాహాన్ని చట్ట బద్ధం చేసేసారు.

దాన్ని వివాహం - అని ఎందుకనాలి? మరేదైనా అనొచ్చుగా.మగ వారు ఆడవారిని చేసుకోవడం పెళ్లి అనబడింది, వేల ఏళ్ళుగా. మరి మగ వారు, మగ వారినే చేసుకొనడం, ఆడవారు ఆడవారినే చేసుకోవడం, దీని పేరు మరేదైనా పెట్టుకోవచ్చుగా. అదీ పెళ్ళంటే - ఎలా? భారత ప్రభుత్వం వారికి ఈ విషయంలో సరైన అవగాహన కుదరడం లేదు. దాదాపు ఈ మాటే - సుప్రీం కోర్ట్ వారే అన్నారు. ప్రభుత్వం వారికి వోటు ముఖ్యం. అందుకని - వారు వస్తే మేము మీ వైపే అనడం. మరొకరు వస్తే - మేము మీ వైపే అనడం - అసలు ఎవరి వైపో తెలియక పోవడం జరుగుతోంది.

యిది వొక ప్రక్క ప్రపంచమంతటా జరుగుతుంటే - మరో ప్రక్క - మగవారిలో నున్న - మగ క్రోమోజోం "వై" చాలా, చాలా  తగ్గిపోతూ వుందని చాలామంది సైంటిస్టులు అంటున్నారు. దానిపై రీసెర్చ్ జరుగుతూ వుంది. దేవుడు మనిషి పోకడలు గమనించి ఏవేవో, క్రొత్త రూల్స్ పెడుతున్నాడు. ముందు, ముందు మరేం జరుగుతుందో తెలియడం లేదు.

యివన్నీ ఎందుకు జరుగుతూ వున్నట్టు?

అనాదిగా వేసిన పునాదులు పీకి, పందిరేస్తే - ఎదురుగాలి ఈదురు గాలిగా మారి ఎత్తుకు పోతూ వుంది. అంతే.

మన మనస్సులో జరిగే ప్రకోపాలు - క్రోమోజోమ్స్ లో కూడా జరుగుతాయి. మన వొక్కొక్క కణం లో కూడా జరుగుతాయి. మన చుట్టూ వున్న పరిసరాల్లో కూడా జరుగుతాయి. యిది యిప్పుడు కాదు. వేల సంవత్సరాల క్రిందటే మన వారికి తెలుసు.

మనసును కంట్రోల్ లో పెట్టుకుంటే - జీవితం సుఖమయంగా, విజ్ఞాన మయంగా, పదిమందికీ   ఉపయోగ కరంగా  జరిగిపోతుందని - అందుకే చెప్పారు. అన్ని చదువులకంటే - అతి ముఖ్యమైన చదువు - మనసును అదుపు చేయడమే నని నొక్కి చెప్పారు.

యోగ శాస్త్రం పైన పతంజలి రాసిన సూత్రాలలో రెండవ సూత్రం అదే. యోగమంటే - మనసును కంట్రోల్ చెయ్యడమే నని.  యోగ శాస్త్రం మొత్తమూ - ఈ వొక్క విజ్ఞానం సాధించడానికే.   

శ్రీ కృష్ణుడు భగవద్గీతను కూడా యోగ  శాస్త్రమనే అన్నాడు. యివేవో మత గ్రంధాలని అనుకుంటే చాలా పొరపాటు పడ్డామన్న మాటే. యివి రెండూ - మన    ఆధునిక విజ్ఞాన శాస్త్రాలకంటే - అతి గొప్ప విజ్ఞాన శాస్త్రాలు.

శ్రీకృష్ణుడంటాడు -

మీ కంట్రోల్ లో వుండే మనసంత గొప్ప మిత్రుడు మీకు మరొకరు లేదు.  మీ కంట్రోల్ లో లేని మనసంత శత్రువు  మరొకరు లేదు.


జీవితానికి మూల సూత్రం యిది. యిది అర్థం కాకుండా - ప్రస్తుత సమాజం ఎక్కడికో వెళ్లి పోతూ వుంది. తన నాశనం వైపు పరుగులు తీస్తూ వుంది.

మీరు యోగ సూత్రాల గురించి - పూర్తిగా తెలుసుకోవాలంటే - నా ఆంగ్ల బ్లాగు -  " వైజ్ స్పిరిచ్యువల్ ఐడియాస్. బ్లాగ్స్పాట్.కాం"  చూడొచ్చు.

సరే. మనసును కంట్రోల్ లో పెట్టుకోక పోవడం వలన - ఏం జరుగుతోంది? వొక చిన్న విషయం చూద్దాం. భారతదేశంలో - ప్రతి రాష్ట్రంలోనూ - యిప్పుడు, రేపు భాగవతం జరుగుతోంది. ప్రతి రోజూ రేపు వార్తలతో నిద్ర లేస్తున్నాం. పడుకుంటున్నాము.

"రేపెన్నిరేపులో" తెలియడం లేదు. ధైర్యం చాలకపోతే - కొంత మందిని పక్కబలంగా పెట్టుకుని మరీ రేపు చేస్తున్నారు మగ వారు. సామూహిక రేపులు, సామాజిక రేపులు, వృద్ధమహిళల రేపులు,   చిన్న పిల్లల రేపులు, -కాదెవరూ, రేపుకనర్హం అన్నట్టుగా జరిగిపోతూ వుంది.

ప్రతి రోజూ సుప్రభాతం లాగా, వార్తలలో - రేపుల పర్వం వుండనే వుంది. బయట రౌడీ రేపు చేసాడని పోలీసుకు చెబితే, ఎలాగో నేనూ చూస్తానని, పోలీసు వాడు రేపు చేసాడట. సరే. యిన్ స్పెక్టరు గారు న్యాయం చేస్తారనుకుంటే   -  ఆయన తన వంతు తాను చేసారు. నా కంట్రోలు లో నేను లేను గానీ - నీవు నా కంట్రోలులో వున్నావని - ఆయన  నిరూపించారు. యిదేదో జోకు కాదని, ఇలాంటివెన్నో - జరిగాయని మనకు తెలుసు. అయినా, మనకు జరగలేదని - అప్పుడు చూసుకుందాం - అని వొక నిబ్బరం. మన అందరికీ.

ఢిల్లీ లోనూ - కలకత్తా లోనూ - మహిళలే ముఖ్యమంత్రులు గా వున్నారు. అక్కడైతే - మరీ ఎక్కువగా రేపులు జరిగిపోతున్నాయి.  చాలా వరకు, సామూహిక రేపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వొకరికొకరుగా  చేయడానికి , మగవారికి - ధైర్యం  చాలడం లేదు. అందులోనూ - ఈ మధ్య ఆడవారు, కరాటే లాంటివి నేర్చుకుని వుంటే? ఇలాంటి భయాల వలన - సింగుల్ రేపు కంటే, సామూహిక రేపు భయం లేని విషయం - అనుకుంటూ వుండొచ్చు.

మిగతా చోట్ల జరగలేదని కాదు. ఆంధ్ర దేశంలో అయితే - నా ప్రేమ వొప్పుకుంటే సరి - లేదంటే - యాసిడ్ పోసేస్తా - అనే పిచ్చి వాళ్ళ సంఖ్య ఎక్కువ. సరే. నలుగురు  ప్రేమించారనుకోండి. అప్పుడు ఎవడో వొకడు , వొకరో, ఇద్దరో, ఆత్మా హత్యో, యాసిడ్ ఆటాకో చేసే చాన్సు ఎక్కువగా వుంది.

భారతదేశంలో - చట్టం ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే - మగవారికి 21, ఆడవారికి 18  సంవత్సరాల వయసు అయివుండాలి.  లేదంటే, పెళ్లి చెల్లదు.

అయితే, ప్రేమించడానికి, అటువంటి చట్ట బద్ధమయిన వయసు నిర్ణయించ లేదు. అందువలన, 14  ఏళ్ళ వయసు నుండీ, ప్రేమలు జరిగిపోతూ వుంది. ఏ స్కూల్ చూసినా, ఏమున్నది వేరే పని - అన్నట్టుగా వుంది. ఆడ,మగా, చెట్టా పట్టాలేసుకుని తిరగడం - అది ప్రేమ అని పేరు పెట్టడం జరుగుతూ వుంది. పెద్ద నగరాల్లో - యిది మరీ విపరీతంగా వుంది. అలాగే, గర్భ ధారణకు కూడా, చట్టం వయసు నిర్ణయించలేదు. అందు వలన, అదీ జరిగిపోతూ వుంది. ఎప్పుడో బాల్య వివాహాలు వుండేవట. యిప్పుడు వారే ఎవరికీ తెలియకుండా చేసేసుకుంటూ  వున్నారు.  పెద్దలు చేస్తే తప్పు. వారే చేసేసుకుంటే?

మేం ప్రేమించు కున్నాం - అని చెప్పుకోవడం స్కూలు విద్యార్థులకు వొక స్టేటస్ సింబల్ లాగా తయారయ్యింది. సరే. ప్రేమించుకుంటే   - తప్పేమిటి? ఏం లేదు. ఆరోజు నుండీ, యింట్లో అన్ని రకాల అబద్ధాలు చెప్పడం ఆరంభం. యింట్లో దొంగతనం చేసి, ప్రియురాలికి సమర్పించడం, స్కూల్లో క్లాసులు కట్టు చేయడం - ఏవేవి చేయకూడదో - అన్నీ ఆరంభవుతాయి.

ఆ వయసులో, ప్రేమ అంటే   - ముఖ్యంగా శారీరక ఆకర్షణే. 14 ఏళ్ళు దాటితే - లోపల కొత్త హార్మోనులు బయలు దేరుతాయి. అంతా వాటి ప్రభావమే. మాదేదో, దైవీక ప్రేమ - అనుకుంటే తప్పు. అదంతా- మనసు చేసే గారడీ. జంతువులకూ, మనకూ, ఆ వయసులో వొకే తేడా. వాటికి ఏదో వొక నియమిత కాలం వుంది. ఆ కాలంలో ఆ ఆకర్షణకు లోనవుతాయి. మనుషులలో - అలా కాదు. కాలం, దేశం, చోటు, యిటువంటి ఏ నియమాలూ లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ - ఈ హార్మోనులు ఎగిసి పడతాయి. మనసా కవ్వించకే నన్నిలా - అని వాపోయినా అవి వొక పట్టాన వదలవు.

ఆడ హార్మోనుల్లో - ఆకర్షించడం వరకు వాటి పని. మగ హార్మోనుల పనే మిగతా అంతా. మగ వాడిని, వాడి మనసును, ఆ ఆకర్షణలో - చిత్ర హింసలు పెడుతుంది.   వాడు ఏదో చెయ్యాలి. ఏది చేస్తే - ఆ హార్మోనులు శాంతిస్తాయో   తెలీదు. అందుకని ఏదేదో చేస్తుంటాడు. దేవదాసు కావొచ్చు. ప్రేమ మందిరం కట్టొచ్చు. వీధిన పడొచ్చు. చదువు మూల పెట్టి తన కలల కన్య వెనుక తిరుగుతూ వుండొచ్చు.  వొక్కొక్కడు, తన ప్రేమ కోసం సర్వం త్యాగం చెయ్యొచ్చు - తల్లిదండ్రులతో సహా.  మంచి మాత్రం ఏమీ చెయ్య లేడు.

వొక ఆడ పిల్ల కోసం, యిద్దరు, ముగ్గురు మగ పిల్లలు కొట్టుకోవడం చాలా సహజమైన విషయంగా మారిపోయింది. కొందరు ఆడ పిల్లల పాకెట్ మనీ కి, సరదాలకు, వొక మగ పిల్ల వాడు చాలడం లేదు. అందుకని, ఇద్దరో, ముగ్గురో వుంటే - మరి కాస్త హాయిగా వుంటుందనుకోవడం   కూడా పరిపాటి అయిపోయింది.

ఆడా,మగా మధ్య దుస్తుల విషయంలో భేదం పూర్తిగా పోతోంది.

వీరెవరూ - మీ మాట వినరు. నా మాట వినరు. వారనుకుంటున్నారు - వారికన్నీ తెలుసునని. వారికి ఏం తెలీదో - అది వారికి తెలీదు.  అది తెలిసే సరికి - పుణ్యకాలం గడిచి పోతుంది.

అమెరికాలో - ప్రేమ వివాహాలు, దాదాపు 53  శాతం  చాలా త్వరగా (18  నెలలలో) విడాకులలో ముగుస్తోందట. యిండియా లో కూడా - అటువంటి పరిస్థితే వస్తూ వుంది. ఈ ప్రేమలన్నీ ఎంత అసహజమైనవో  తెలిసే సరికి - జీవితం లో ని ముఖ్య భాగం గడిచి పోతోంది.

ముందెప్పుడో అనే వారు - "మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని.  యిప్పుడు, దేవుడు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు  - పిల్లల నొసట రాసి మరీ  పంపిస్తున్నాడు. యివన్నీ కూడా- దేవుడు సిద్ధం చేసినవే. అలాగే - విడాకులు కూడా  ఎన్ని ఉండాలో, ఎప్పుడు ఉండాలో కూడా రాసి మరీ పంపించేస్తున్నాడు. అంతేనా, మగవారితో  మగవారికి, ఆడవారితో, ఆడవారికీ పెళ్ళిళ్ళు రాసి పంపిస్తున్నాడు. వై క్రోమోజోములు పెట్టడం మర్చి పోతున్నాడు.

  పెళ్ళిళ్ళతో బాటు, ఎన్ని రేపులు జరగాలో, ఎప్పుడు ఎవరితో జరగాలో రాసి పంపించేస్తున్నాడు.

దేవుడికి ఏదో అయ్యింది. జగన్నాటకం లో పాత్రలు మారి పోతున్నాయి. కృత యుగానికి వొక రావణుడైతే -   కలియుగానికి, వీధికొకడు, వూరికి నలుగురు  పుడుతున్నారు.

అయితే - యిదంతా కేవలం మగ వారి తప్పే అంటే - పూర్తిగా పప్పులో కాలు వేసినట్టే.


బైబిల్ లో ఈవ్ గారు  -  "ఆ...,దేవుడు చెబితే చెప్పాడులే -    ఆ పండు కోసుకు రావోయ్" - అన్నదట. అంతే. ఆడం గారి బుద్ధి పారిపోయింది. ఆయన వెళ్లి కోసాడు. అప్పటి నుండి, యిప్పటి వరకు,  ప్రతి ఈవూ (పోనీ, చాలా మంది) అలా ఏదో చెబుతూనే వుంది. ప్రతి ఆడం, అలా ఏదో చేసేస్తూ వున్నాడు.అది పద్దతిగా మారిపోయింది.

సరే. రామాయణం లో సీతమ్మ వారు ఏం చేసారు. మొదట, బంగారు జింక కావాలని - రాముడిని పంపింది. తరువాత, వొద్దు మొర్రో, నేను పోను, అనే వాడిని, లక్ష్మణునీ, నానా తిట్లు తిట్టి మరీ పంపింది. ఆ పాపానికి , అశోక వనంలో,  శోకిస్తూ, కూర్చోవాల్సి వచ్చింది, చాలా సంవత్సరాలు.

మరి యిప్పుడు ఈ తరంలో, మనం చేస్తున్న తప్పులేమిటి? అర్ధ నగ్న దుస్తులు - మన సినిమాల్లోనూ, టీ.వీ. లలోనూ - సర్వ సాధారణం అయి పోయింది. కొంత మంది ఆడవారు - నా శరీరం - నా యిష్టం - అంటున్నారు.

యిది కాకుండా - వివాహేతర సంబంధాలు ఈ మధ్య ప్రసార మాధ్యమాలలో చాలా ఎక్కువగా చూపుతున్నారు. పెళ్లి కాని ఆడ వారు - పెళ్ళైన మగ వాళ్ళ పైన ఎక్కువగా మోజు పడడం చూపుతున్నారు. సరే. స్కూళ్ళ లోను, కాలేజీల్లోనూ, ప్రతి ఆడ పిల్లకు బాయ్ ఫ్రెండ్సు వుండాల్సిందే  .  వొకరు కాదు. ఇద్దరో, ముగ్గురో.   లేదంటే, సరదాలు తీరవు.

యివన్నీ - పిల్లలే తప్పు చేస్తున్నారంటే - న్యాయం కాదు. సినిమాలు తీస్తున్నదో, సీరియల్సు తీస్తున్నదో - వారు కాదు కదా. యివి తీసే వారు - "ఆ..., నా వొక్క సీరియల్ వలన పిల్లలు, సమాజం చెడిపోయే ప్రమాదం లేదు గాక లేదు" - అని వాదిస్తున్నారు. కానీ- 24  గంటలూ, ప్రతి చానల్ లోనూ, వచ్చే సీరియల్సు అన్నీ - అటువంటివే అయితే - పిల్లల  మనసే కాదు; పెద్దల మనసు కూడా పాడయి పోతుంది. పోతూ వుంది.

యిప్పుడదే జరుగుతోంది. మన యింట్లో, మన టీ.వీ. ముందు కూర్చునే - మనమందరం చెడిపోతున్నాము.పాడయి పోతున్నాము.

యింట్లో నే ఇలాంటి సినిమాలు, సీరియల్సు చూసి చూసి - మనసు పాడుచేసుకునే వారిలో - ఎంతో కొంత శాతం మగ వారిలో; వారు  వీధిలోకి వెళ్ళినా- ఈ సెక్సు హార్మోనులు పని చేస్తూనే వుంటాయి.
అందు వలన, కొంత మంది మగ వారు - యింట్లో రామయ్య, వీధిలో క్రిష్ణయ్య లు గా మారి పోతారు. అది పూర్తిగా వారి తప్పు కాదు. 24  గంటలూ -  సెక్సూ, వయొలెన్సూ -  కామమూ, క్రోధమూ - చేర్చిప్రకోపించేట్టు  చేసే వాటినే - చూస్తూ, వింటూ వుంటే -  అలా జరుగుతుంది.  వారిలో వొక శాతం మందిలో, అది మరీ ఎక్కువగా తయారై - రేపులు చేయాలనిపిస్తుంది.

కొంత మంది, నైట్ క్లబ్బులకు పోవడం, తాగడమూ ఆడ,మగా కలిసి డాన్సులు లాంటివి చేయడమూ జరుగుతుంది. వారి, వారి యిష్టానుసారము, ఏది చేసినా - మిగతా వారికి సమస్య లేదు. ఆ పైన, రేపులు లాంటివీ జరిగిపోతున్నాయి. తరువాత - చట్టమూ, పోలీసులూ, కోర్టులూ -  యివన్నీ.

యివి వొక రకమైతే - యిళ్ళల్లోనో, స్కూళ్ళలోనో, రైళ్ళలోనో  -  కనిపించే లైంగిక   సమస్యలూ వున్నాయి. చిన్న పిల్లపై వేధింపులు, ముసలి వారిపై కూడా వేధింపులు - అన్నీ సామాన్యమై పోతున్నాయి.

మన సామాజిక జీవితంలో - ఎన్నో మార్పులు - అనుకోనివి, అనూహ్యమైనవి కూడా వచ్చేస్తున్నాయి.

యివన్నీ మారాలంటే - మగ - ఆడ మధ్య గౌరవ ప్రదమైన సంబందాలే -  సినిమాల్లోనూ, టీ.వీ. లలోనూ - ఎక్కువగా రావాలి.

చెడు చూపకు, చెడు వినిపించొద్దు. చెడు ప్రచారమూ చెయ్యొద్దు. యిది ప్రసార మాధ్యమాలలో ముఖ్యంగా రావాలి.

జరిగేదే కదా చూపుతున్నాము - అనే చెత్త వాదనలు చెయ్యొద్దు. మీరు చూపే కొద్దీ, ఎక్కువవుతున్నాయి - అవి. వొక తల రావణాసురుడు, పది తలల వాడవుతున్నాడు. వొక్కొక్క తలలోనూ - వొక్క రావణాసురుడు తన పది తలలతోనూ  వచ్చి కూర్చుంటున్నాడు. యిది అన్ని ప్రసార మాధ్యమాలలో పూర్తిగా మారాలి.

విద్యావిధానంలో, తనపై తనకు కంట్రోల్ మొదట నేర్పాలి - ముఖ్యంగా మగ పిల్లలకు. అంటే - మన దేశంలోనే పుట్టిన సైన్సు - యోగ విద్య లాంటివి ముఖ్యంగా నేర్పాలి.

యివి రెండూ చేస్తే చాలు - యిప్పుడు జరుగుతున్న - రేపు యుగం అంతమవుతుంది.

సమాజంలో - గాంధీజీ గారన్నట్టు - ఏ స్త్రీ అయినా, అర్ధ రాత్రయినా, నిర్భయంగా  తిరుగ గలుగుతుంది.

అలా అని, అర్దరాత్రి ఆడది, వీధులలో, తిరుగుతుండాలని కాదు.  వొక్కో సారి, తన కర్తవ్య నిర్వహణలో, అది భాగం కావచ్చు.

అప్పుడు వెళ్ళాల్సిందే. అప్పుడు ఆమెకు - ప్రతి మగ వాడి సహకారం వుండాలి. ఆమెలో, భయము అన్నది వుండ కూడదు. అటువంటి సమాజం రావాలి.

అదండీ కథ.

= మీ

వుప్పలధడియం విజయమోహన్  


1 వ్యాఖ్య:

  1. మీరు చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను. పెద్ద వాళ్ళు పిల్ల్లలకు చెప్పే ముందు వాళ్ళు కూడా కోంత పాటించాలి.. మనకు ఇదివరకు గురు కులాలు ఉండి, అక్కడ చదువుకోనే వాళ్ళందరినీ ఒకలాగే ట్రీట్ చేసి వాళ్ళకు ముందు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం నేర్పే వారు...ఆ నేర్ప్దడంలో భాగమే ఆ కటోర నియమాలన్ని...ఇంద్రియ మనో నిగ్రహాలేర్పడిన తరువాతే వారి వారి అర్హతలని బట్టి గురువుగారు విద్య నేర్పేవారు...
    అలా తనకి సరిపోయే విద్య నేర్చుకున్న వ్యక్తి 16 యేళ్ళోచేసరికి ఒక విలువలు తెలిసిన మనిషిగా పరిణితి చెందే వాడు. అప్పుడు గృహస్తాశ్రమానికి తగినవాడౌతాడు. ఇప్ఫ్దుడు నీతులు చెప్ఫేవారికే నీతిలెదు. అలాటప్పుడు వినేవారేం నేర్చుకుంటారు. ఐనా ఇప్పుడు చదువు అనే దాని అర్థం పూపర్తిగా మార్చేసారు మనవాళ్ళు. ఇదేదో రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదు... మెల్లిగా డి-గ్రేడ్ అవుతూ వచ్చింది. సరి అయిన విద్యా విధానం లేకపోవడం, మానవ సంబంధాలు పక్కదారి పట్టడం వంటివి, కృత్రిమమైన జీవితం ఇంకా చాల కారణాల వలన ఈ స్థితి వచ్చి ఉండావచ్చు. దీని పరిష్కారం కష్టమే గాని అసాధ్యం మాత్రం కాదు.

    ప్రత్యుత్తరంతొలగించు