21, మార్చి 2012, బుధవారం

మీరు దేవుడుగా మారగలరు తెలుసా?= మారండి మరి.


 దైవం మానుష రూపేణ - అంటారు. దేవుడు వస్తే - మనిషి రూపంలోనే వస్తాడు.

నెత్తి మీద కిరీటం, నెమలి పింఛం  పెట్టుకుని రాడు. లేదా అర్ధనారీశ్వర రూపంలో, ఎద్దు వాహనం పైన కూర్చొని రాడు.

వస్తే, మీ లాగే వస్తాడు.

నిజానికి మీరు - దేవుడు కావచ్చు. చాలా సులభంగా. కావాలి - నిజంగా.

దేవుడు ఏం చేస్తాడు -సాధారణంగా?

మీరు విత్తనం నాటితే - దానికి నీళ్ళు  పోస్తే, ఎరువు, మందులు వేస్తే - దేవుడు భూమిలోని ప్రాణశక్తిని, విత్తనంలోని ప్రాణ శక్తిని కలిపి - మొలకెత్తిస్తాడు. ఆ మొలక - నీళ్ళను, భూమి నుండి కావలసిన శక్తిని, సూర్యరశ్మి లోని శక్తిని తీసుకుంటూ పెరుగుతుంది. పెరిగేది మొలకే. ప్రతి విత్తనం లోనూ - సరైన భూమిలో నాటి నీళ్ళు పోస్తే - మొలకెత్తి చెట్టుగా మారగల అన్ని శక్తులూ వున్నాయి.

దానికి కావలసిన ప్రాణ శక్తిని - దేవుడు సూర్య రశ్మిలోను,  భూమి లోనూ పెట్టనే పెట్టాడు. 

మామిడి విత్తనం (మొట్టె ) నాటితే మామిడి మొలక వస్తుంది. పెరిగి, మామిడి చెట్టవుతుంది.  యిందులో -  మీరు చేసే పని వొక్క శాతం మాత్రమే. మిగతా పని 99  శాతం దేవుడు చేస్తున్నాడు. మీరు చెట్టు జీవితంలో - వొక్క శాతం సమయంలోనే - చెట్టుతో వుంటున్నారు. మిగతా 99  శాతం సమయం దేవుడే చెట్టుతో బాటు వుంటున్నాడు. 

మీ చుట్టూ వున్న ప్రపంచంలో అంతర్లీనంగా  - మీరు చేసే ప్రతి పనికీ - తోడు పడ గల  సామర్థ్యం వుంది. మీరు వొక మంచి పని వైపు, వొక సృష్టి కార్యక్రమం వైపు - వొక్క అడుగు వేస్తే - మరో 99 అడుగులు  - మీ చుట్టూ వున్న ప్రపంచంలో గల దైవ శక్తీ మిమ్మల్ని తన వెంట తీసుకు వెడుతుంది. 

దీన్ని - యిప్పుడు - పాశ్చాత్య దేశాలలో - లా ఆఫ్ అట్రాక్షన్ - అని అంటున్నారు. 

మీ నిస్స్వార్థ పనులకు - మీ చుట్టూ వున్న ప్రపంచం తోడుగా నిలుస్తుంది - అన్నదే దీనికి అర్థం.

మీ స్వార్థ పూరిత  పనులకు  అటువంటి తోడు వుండదు. 

కానీ - మీ స్వార్థ పూరిత పనులలో కూడా వొక్కో సారి - ఎంతో పరోపకారం జరుగ గల విషయాలు వుంటాయి . వాటికీ - ప్రకృతి తోడు పడుతుంది - కొంత వరకు. ఉదాహరణకు - మీరు వొక ఫాక్టరీ పెట్టారనుకోండి. మీకు అందులో - కోట్ల లాభం రావచ్చు. కానీ - వెయ్యి మందికి ఉద్యోగాలు కూడా రావచ్చు కదా. యిది పరోపకారమే కదా. యిటువంటి వాటికీ - ప్రకృతి సహాయం వుంటుంది. 

మితి మీరిన స్వార్థానికి, పర-అపకార పనులకు ప్రకృతి తోడు వుండదు.

యిదే లా ఆఫ్ అట్రాక్షన్. ప్రకృతిని - మీరు, మీ నిస్స్వార్థ, ప్రేమైక భావనలతో  ఆకర్షిస్తారు.   అంటే - మీలో వున్న దేవుడు, మీ చుట్టూ (ప్రకృతిలో) వున్న దేవుడితో - ఏకమై - సృష్టి కార్యాన్ని, సాగిస్తారు.

మీ నిజ జీవితంలో మీరూ దేవుడు కావచ్చు. తప్పకుండా కావాలి. 

మనమంతా - వొకరికొకరు దేవుడు కావాలి. యిది శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఈ మధ్య అన్న మాటలు.

అయితే - ఈ సిద్ధాంతాన్ని - 8  ఏళ్ళ క్రితమే -  హైదరాబాదులో - మరెన్నో స్థలాలలో - నేను నా వర్క్ షాపుల్లో - ప్రతి వొక్కరికి చెప్పే వాడిని.   యిది ఎలా చెయ్యొచ్చో - అనేక రకాలుగా చర్చించే వాళ్ళం.

మీ భార్యకు  (లేదా భర్తకు) - మీరు మొట్ట మొదటి దేవుడు కావాలి. యిది పాత సిద్ధాంతమే. యింట గెలిచి, రచ్చ గెలవాలి.

వారి ఆరోగ్యానికి, సంతోషానికి, మీరు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలి.

వారు వొక్క అడుగు వేస్తే చాలు. మిగతా 99  అడుగులు మీరు నడిపించాలి. ప్రతి విషయం లోనూ.

మీ తండ్రికి, తల్లికి కూడా అలాగే - మీరు దేవుడు కావాలి. 

ఆడవారయితే - మీ మెట్టినింట్లో వున్న వారికి మీరు దేవుడు కావాలి.

అలా కాదు. నేను కూడా మా పుట్టినింట్లో   వారికి దేవుడు గా వుంటాను గానీ - మెట్టినింట్లో వారికి వుండను - అన్నారనుకోండి. మీరు అక్కడా వుండ లేరు. ఇక్కడా వుండలేరు. ముఖ్యంగా మీ భర్తకు దేవుడుగా వుండలేరు.

మనం వున్న చోట, వుండాల్సిన చోట - చుట్టూ వున్న వారికి దేవుడుగా వుండాలి.

చుట్టూ వున్న వారి బాధ్యత మీరు తీసుకోవాలి. అంటే - వారు చేయాల్సిన పనులన్నీ మీరు చేయాలని కాదు.

వారి జీవితంలో సంతోషానికి, వారి అభివృద్ధికి - మీరు తెర వెనుక  కారణంగా వుండాలి. 

ఉదాహరణకు - మీ కొడుకు చదువుతున్నాడనుకోండి. మీ పని ఏమి? మీరూ చదవాల్సిన పని లేదు కదా.

కనీసం - మీరు టీ.వీ.  చూడడం ఆపాలి. అది కూడా మీరు ఆపలేక పోతే - మీరు మీ కొడుకు జీవితంలో - దేవుడి పాత్ర ఎలా పోషిస్తారు? తనకు కావాల్సిన లైట్ , ఫ్యాన్, టేబుల్ లాంటి సౌకర్యాలు - ఏం చేయ గలరో అవి చేయాలి.   ప్రోత్సాహ కరమైన మాటలు మాట్లాడాలి.

మనిషికి, మనం మూడు రకాల సహాయం  చెయ్యొచ్చు. మనసా, వాచా, కర్మణా. మొదట - మానసికంగా వారి మేలు కోరాలి. అది మాటలలో కూడా ప్రతిఫలించాలి. ఆ పైన, వారి మేలు కోసం, అభివృద్ధి కోసం - ఏమేం పనులు చేయ గలమో అవి చెయ్యాలి.   

అయితే - వారే చెయ్యాల్సిన పనులు మీరు చెయ్య రాదు. అది దేవుడి పని కాదు. వారు చేసే ప్రతి పనికీ - తెర వెనుక సహాయం అందించాలి. 

కొన్ని పనులు మాత్రం మీరే చెయ్యాలి. ఉదాహరణకు - మీ భార్యకు (లేదా భర్తకు ) - ఈ రోజు ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి. వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళాల్సింది మీరే. అదీ వెంటనే చెయ్యాలి. ఆమె (ఆయన) ఆరోగ్యం కుదుట బడే లాగు చెయ్యాల్సిన బాధ్యత మీదే. 

భార్యకు భర్త, భర్తకు భార్య వొకరికొకరు సంతోష కారణం కావాలి. వొకరికొకరు దేవుడు కావాలి.

వొకరికొకరు దేవుడు కావడం కష్టమేమీ కాదు. మనసులో - "నేను" అనే అహంకారానికి బదులు - ప్రేమ, అభిమానం చోటు చేసుకోవాలి. అంతే.

మాటలతో  - ఎదుటి వారిని సంతోష పరచనూ వచ్చు. బాధ పెట్టనూ వచ్చు.

ఆడవారు, మగవారి కంటే - మూడు రెట్లు ఎక్కువగా మాట్లాడతారట. యిది - అమెరికా వాళ్ళ పరిశోధనల్లో   తేలింది. మూడు రెట్లు హావ, భావ, అంగిక, వాచిక ప్రకటనల ద్వారా - తమ భావ ప్రకటన చేస్తారట.

ఆడవారితో పోలిస్తే - మగ వారు దాదాపు మూగ వారేనట. భారత దేశంలోనూ అంతే. ఎక్కడైనా అంతే.

యిది మంచా, కాదా. మంచి మాటలు మాట్లాడితే  మంచే.  చెడు మాట్లాడితే - చెడే.  

ఆడవారు - ఎక్కువ మాట్లాడి - భర్తను, చుట్టూ వున్న వారిని సంతోష పెట్ట వచ్చు. అది వారికి పుట్టుకతో వచ్చిన విద్య. వొక చిన్న పాప - చాలా వరకి తల్లి మాటలను వినడానికే యిష్ట పడుతుంది. తల్లి - మాటలు తెలీని పాపతో దినమంతా మాట్లాడ గలదు. ఆ పాపకు తల్లి స్వరంలోని మధురిమ, ఆమె ముఖంలోని హావ భావ ప్రకటన ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ పని ఏ మగవాడూ చెయ్యలేడు. అందుకే స్త్రీ స్వరాన్ని - కడవరకు - దేవుడు మధురంగానే వుంచాడు. ఆ స్వరాన్నుమ్ది - ఆమె తియ్యటి మాటలే మాట్లాడాలి.

అదిగాక, స్త్రీ - తన కరుకు మాటలతో, చుట్టూ వున్న వారిని  చంపెయ్యనూ వచ్చు. పిచ్చి పట్టించనూ వచ్చు  . ఆంగ్లంలో - "నాగ్గింగ్ " అనే మాట, దాదాపు, భార్యలు, భర్తలను తమ మాటలతో పెట్టే బాధలను ఉద్దేశించే చెప్పబడింది. స్త్రీల మనసులో - ప్రేమ లేకపోతే - ఈ నాగ్గింగ్ చోటు చేసుకుంటుంది.

అయితే - ఈ నాగ్గింగ్ చేసే భార్యలకు తాము అలా చేస్తున్నామన్న ఎరిక కూడా వుండదు.  భర్తలను మాత్రమే కాదు. ఆడ వారికి - ఆడవారే శత్రువు - అని మొదటి నుండి వున్న మాటే. అత్త గారికి కోడలు, కోడలికి అత్తగారు, వారేగాక, యింటికి వచ్చే ఆడ బిడ్డలు కోడలికి, కోడలు వారికి  శత్రువులు గా వుండటం -  చాలా యిండ్లలో జరిగే విషయం. ఈ విషయాల్లో - ఎక్కడో కొన్ని ఇళ్ళలో తప్ప   - మగవారికి ప్రమేయం వుండదు.

ఎక్కువ మాట్లాడటం వలన వచ్చే అనర్థం యిది  అని దూరంనుండి చూసే వారికి అనిపిస్తుంది. 

అయితే - "ప్రేమ లేని చోట మాట యీటెగా మారుతుంది" - అంటారు. మాట్లాడడం వలన కాదు - మనసులో - ప్రేమ, అభిమానం  లేక పోవడం వలన వచ్చే అనర్థం యిది.

అత్త గారి పై అభిమానం వున్న కోడలు - అత్త గారిని దేవత గా చూసే కోడలు వున్న ఎన్నో యిళ్ళు వున్నాయి. అలాగే - కోడలిని  కూతురి కంటే, కొడుకు కంటే - అభిమానంగా చూసే  అత్త గార్లూ ఎంతో మంది వున్నారు. కాకపోతే వీరెవరూ - దురదృష్ట వశాత్తూ - యిప్పటి టీ.వీ. సీరియళ్ళకు పనికిరారు. చెడు చూడకు - అన్న స్థితి నుండి - చెడు మాత్రమే చూడు - అన్న స్థితికి జారిపోతున్నాము.

జీవితం అర్థమయితే - ప్రతి కోడలూ, ప్రతి అత్తా, వొకరికొకరు - దేవతగా వుంటారు. వుండాలి. ఎదుటి వారున్నారో లేదో ఎదురు చూడక - మీరు దేవుడుగా, దేవతగా  వుండడం  అలవాటు చేసుకోండి.

45  నుండి 90  రోజులలో - ఎదుటి వారూ - మీకు దేవుడుగా, దేవతగా తప్పక మారుతారు. యిది ప్రకృతి నియమం.

అప్పటికీ మారని జన్మాలు మనుషులే కాదు. రాక్షసులు గా వుంటారు.యిది చాలా, చాలా  అరుదు.

మగ వారు తక్కువ మాట్లాడతారని అన్నాం. నిజమే. కాని, వారి వొక్కొక్క మాటా, ఆడవారి పది మాటలకు సమానంగా వుంటుంది. మంచైనా సరే. చెడైనా సరే.

వొక్క మాటతో, భార్యను మెప్పించ గల సమర్థత, పొంగిపోయేటట్లు   చేయ గల శక్తీ -  భర్త మాటలకు వుంది. కానీ - ఆ వొక్క మాట నోరు తెరిచి మాట్లాడాలి కదా. అలాకాక - వొక్క మాటతో - భార్యను నొప్పించడమే  తన పని అనేటట్లు మాట్లాడే భర్తలు ఎందరో వున్నారు.  

భర్తే దైవం - అనే పతివ్రతలు వున్న దేశం ఇది అని చెప్పుకుంటాము. అది సరి కాదు. భర్త, నిజంగా, భార్యకు దైవంగా వున్న దేశం యిది. భార్య మానప్రాణాలకోసం - తన్ను తాను త్యాగం చేసుకునే భర్తలున్న దేశం యిది.   భార్యా పిల్లల సంతోషం కోసమే జీవించే భర్తలున్న దేశం యిది. ఈ రోజుకూ అంతే. తన యిళ్ళు, ప్రావిడెంట్ ఫన్డూ అన్నిటినీ పెట్టి పిల్లలని చదివించే వారు యిప్పుడూ వున్నారు కదా.  

వొకరికొకరు దేవుడుగా మారేదేమీ ఈ దేశంలో క్రొత్త కాదు.

త్యాగం అక్కర లేదు. లోపల ప్రేమ, అభిమానం వుంటే - మీరు ఏమి చెయ్యాలో - ఏమేమి చెయ్య గలరో మీకే తెలుస్తుంది.

లోపలున్న ప్రేమ, అభిమానమే దేవుడు. అది లేక పోతే - లోపల దేవుడు లేదు. అంతే. 

అది వుంటే - మీరూ మీ వారందరికీ దేవుడుగా మారగలరు. మారుతారు.

మారండి మరి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి