శ్రీ శ్రీ రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్
నాకు ఎంతో మంది గురువులంటే - చాలా యిష్టం.
ఇప్పుడున్న వారిలో - శ్రీ శ్రీ రవిశంకర్ ( ఆర్ట్ ఆఫ్ లివింగ్), శ్రీ జగ్గి వాసుదేవ్ (ఈశా ఫౌండేషన్ ), బాబా రాందేవ్, శ్రీ స్వామీ సుఖ బోధానంద , శ్రీ స్వామీ పరమార్థానంద - వీరు నాకు ముఖ్యులు. ఎందుకంటే - వీరి కోర్సులకు నేనూ వెళ్లాను గనుక. అంటే - వీరు నాకు ప్రత్యక్ష గురువులు. సరే. వీరు గాక, యిప్పుడు లేని వారిలో - చాలా మంది నాకు పరోక్ష గురువులుగా చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యులు, స్వామీ వివేకానంద, ఓషో, రమణ మహర్షి, భగవాన్ బుద్ధ లాంటి మహానుభావులు - ఎందరో.
వీరందరూ -మహానుభావులే. వీరి ప్రసంగాలన్నిటినీ - నేను చదువుతూ వుంటాను. లేదా వింటూ వుంటాను. యివి గాక, కృష్ణ భగవానుడి గీత చదవి అర్థం చేసుకోవడం వొక గొప్ప అనుభవం.
యివి విన్న / చదివిన తరువాత - మనలో జరిగే పెద్ద మార్పు వొకటుంది.
జీవితంలో పరుగు కొద్దిగా నిలిపితేనే; దాని వేగం తగ్గిస్తేనే - జీవితానికి అర్థం తెలుస్తుందని - మనకు తెలిసిపోతుంది.
లేదంటే - తుది శ్వాస వరకు - అసలు జీవితమంటే ఏమిటో - అర్థం కాకుండానే గడిచి పోతుంది.
యిదేదో - హిందూ మతానికి సంబంధించింది - మతాలు మనకెందుకులే - అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే.
ఇవేవీ స్వర్గాన్ని గురించి పెద్దగా మాట్లాడవు. దేవుడిని గురించి కూడా మాట్లాడవు. అంతా మనల్ని గురించే; మన సాధారణ జీవితాన్ని గురించే మాట్లాడుతాయి. యిందులో - మనం అనుకునే లాగా - నమ్మకాలు లేవు. లేదా చాలా తక్కువ. అన్నీ - అనుభవైక వేద్యంగా - వొక నిర్దిష్టమైన సైన్సు లాగా మనం తెలుసుకునేవే.
చాలా మందికి - భారతదేశంలో - విగ్రహారాధన ఎక్కువ;మూఢ నమ్మకాలు ఎక్కువ - అనే అభిప్రాయం బలంగా వుంది. విగ్రహారాధన లేదని నేను చెప్పను. కానీ - ఆరాధించేది విగ్రహాన్ని కాదు. విగ్రహ స్వరూపాన్ని కూడా కాదు. అందులో వున్న భగవద్ తత్వాన్ని. మనకు దేవుడు కానిదేమీ లేదు. ప్రహ్లాదుడు చాలా స్పష్టంగా అన్నాడు - యిందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు - అని.
భగవంతుడు, భూమిలో వున్నాడు. ఆకాశంలో వున్నాడు. నీళ్ళలో వున్నాడు. గాలిలో వున్నాడు. అగ్ని, సూర్య, చంద్ర,వరుణ, నక్షత్ర,గ్రహాలన్నిటిలో వున్నాడు. లేని చోటు లేదు.
సింహంలో, పాముల్లో, పందుల్లో, కూర్మంలో, నెమలిలో, పక్షులలో, కోతుల్లో, భల్లూకాలలో, అన్నిటిలో మనం భగవంతుడిని చూడటానికి ప్రయత్నిస్తాము. అణోరణీయాం, మహతో మహీయాం - అన్నట్టు - అణువు నుండి, మహదాకాశం వరకు కనిపించేవన్నీ, వినిపించేవన్నీ, అన్నీ భగవద్ స్వరూపమే. వీటన్నిటినీ మనం పూజిస్తాము. మనం కోతిలో చూసే హనుమంతుడు, పందిలో చూసే వరాహావతార విష్ణుమూర్తి, పాముల్లో చూసే ఆదిశేషుడు - అన్నీ వొకటే. భిన్నత్వంలో - ఏకత్వము - అనే మాట - మన సంస్కృతి నుండి పుట్టింది.
భిన్నంగా కనిపించే ప్రపంచంలో ఏకత్వాన్ని చూడగలగాలి.అదే జ్ఞానోదయం.
అర్జునుడికి, కృష్ణుడు, విశ్వరూప సందర్శనం ప్రసాదించాడని మనం చదువుతాము. అంటే ఏమిటి?
ప్రపంచమంతటా తనే ఉన్నాడని చూడటం, అర్థం చేసుకోవడం. అదేదో కొత్త, పెద్ద రూపాన్ని చూపడం కాదు.
అలాగే - శివ తత్వము, విష్ణుతత్వము, బ్రహ్మ తత్వము వేరు కాదని తెలపడం. శంకరాచార్యులు అననే అన్నారు - శివాయ విష్ణురూపాయ - అని. అప్పటికి అల్లా, యెహోవా లాంటి దేవుళ్ళు భారత దేశానికి యింకా రాలేదు గానీ - వచ్చుంటే - వారి పేర్లూ చేర్చి అందరూ వొకటే - అని శంకరాచార్యుల వారు చెప్పేవారే.
అసలు శంకరాచార్యుల వంటి - అభ్యుదయ వాది - మరొకరు లేదు. వారి నిర్వాణ షట్కం చదివి అర్థం చేసుకున్న వారికి యిది తెలుస్తుంది. వొక సారి శంకరాచార్యుల వారు శిష్యులతో బాటు గంగా నది నుండి శివాలయానికి వెడుతూ వుంటే - వొక అసహ్యకర దుస్తులతో వున్న వాడు ఎదురొస్తాడు. శంకరాచార్యులు కొద్ది చిరాకుతో - దూరంగా పో - అంటాడు. మరి అతనంటాడు - జడమైన ఈ శరీరాన్ని దూరంగా పొమ్మంటున్నావా? ఈ జడం ఎలా వెళ్ళగలదు? అయినా - నీ శరీరమూ జడమే గదా. దానికీ, దీనికీ పెద్ద భేదమేమిటి? అదిగాక, అత్మరూపుడైన నన్ను దూరంగా వెళ్ళమంటున్నావా? ఎక్కడికి వెళ్ళగలను? అత్మస్వరూపుడిగా నేను గాని,నువ్వు గాని లేని చోటు వుందా?వెళ్ళేది ఎక్కడికి మరి? అని అడుగుతాడు.
అంటే. శంకరాచార్యులు వెంటనే తన తప్పు వొప్పుకుని - మీరే నా గురువులు - అంటాడు. అంటరాని తనానికి శంకరాచార్యులు వేసిన పెద్ద వేటు అది. అడిగింది సాక్షాత్ శివుడు. ఆయన అడిగింది సాక్షాత్ ఆది శంకరుల వారిని. అది మనకు చెప్పింది ఆది శంకరులే. దానికి సాక్షులు వారి శిష్యులే. ఆ కాలంలో - శంకరాచార్యుల వారే - మూఢ నమ్మకాలను ఎంతగానో - ఎదిరించి, నచ్చ చెప్పాల్సిన పరిస్ద్తితి. తన తల్లి శరీర దహన కాండలో కూడా ఆయన సమాజాన్ని ఎదిరించ వలసిన పరిస్థితి. శంకరులు చెప్పినా మనం యిప్పటికీ పూర్తిగా మారలేదు. అది వేరే సంగతి. మారాలి అన్నది - వున్న పరిస్థితి.
ఈ కాలంలో కూడా - మన గురువులు చెప్పేది అదే. అయితే - మనం మారడం లేదు.
యిప్పుడు, శ్రీ శ్రీ రవిశంకర్ గారు - పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత దేశానికి, పాకిస్తాన్ కూ మధ్య వున్న అపోహలను కొంతైనా తగ్గించి, సుహృద్ భావాన్ని పెంపొందిం చాలన్నది ఆయన ప్రయత్నం.
యోగా, మెడిటేషన్ ద్వారా - మన మనసుల మధ్య వున్న దూరాన్ని తగ్గించవచ్చన్నది ఆయన దృఢ నమ్మకం. ఎంతో మంది పాకిస్తానీయులు ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు చేసారు. చేస్తున్నారు.
అక్కడ ఆయనను విగ్రహారాధనను గురించి, మీకు ఎంతో మంది దేవుళ్లున్నారు కదా అని వొకరడిగారు. ఆయన - దేవుడు వొక్కడే. మీకు అల్లాః కు వంద పెర్లున్నట్టు గానే - మాకు వందల దేవుళ్ళ రూపాలు, పేర్లు అంతే గాని దేవుడు వొక్కడే అని చెప్పారు.
రవిశంకర్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం - రెండు దేశాల ప్రజల మధ్య ఎంతో కొంత స్నేహ భావం కలిగిస్తుందనడం లో - సందేహం లేదు. సరే. అల్ కైదా లాంటి మతోన్మాదులలో మార్పు రాదు. వారికి కోపం కూడా రావచ్చు. కానీ - సాధారణ ప్రజలంతా - శాంతినే కోరుకుంటారని చెప్ప వచ్చు.
యిక వారి వాక్యాలు చూద్దాం :
1 . ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి? జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడమే. వొక రోజు మనం సంతోషం గా వున్నాం. మరి కొన్ని రోజుల్లో, కష్టాల్లో వున్నాం. అన్ని రోజుల్లోనూ, వొకే లాగా వుండగలగడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. కష్ట సమయాల్లో, సమర్పణ భావం చాలా ముఖ్యం. సంతోష సమయాల్లో సేవా భావం ముఖ్యం. మీ ప్రార్థన ఎలా వుండాలంటే - నా వలన అందరికీ మేలు జరగాలి. నేను సేవ చేయ గలగాలి. సేవ చేసే నా ఈ చేతుల ద్వారా - నాకు జ్ఞానోదయం కలగాలి. నా ఈ చేతుల ద్వారా మేలు జరగాలి. మీరిలా - హృదయపూర్వకం గా ప్రార్థిస్తే - అది తప్పక జరుగుతుంది.
2 . ప్రవాహంతో బాటుగా, తన దిశలో, మనం తేలుతూ వెళ్ల గలగాలి. అలాగే - ప్రవాహాన్ని మనం ఆదుపులోనూ, కట్టుబాటులోనూ వుంచగలగాలి. అదే విజయ సాధనం. ( యిది చెప్పింది ఐ.ఐ.యం, కలకత్తాలో)
3 . మీరు వొకరికొకరు దేవుడిగా మారాలి. ఎక్కడో - ఆకాశంలో, దేవుడి కోసం వెదక్కండి. మీరు చూసే ప్రతి రెండు కళ్ళల్లోనూ దేవుడిని చూడండి. కొండల్లోనూ, నీటిలోనూ, చెట్లలోనూ, జంతువులలోనూ కూడా దేవుడిని చూడాలి. అయితే, మీలో మీరు మొదట దేవుడిని చూడగలగాలి. దేవుళ్ళే, దేవుళ్ళను ఆరాధించగలరు.
4 . మనం (ఇతరులపై) చేసే పితూరీలు మనలో వున్న అందాన్ని పూర్తిగా తీసేస్తాయి. బాహ్య సౌందర్యానికి - మీరు ఎన్నో ధరిస్తారు. కానీ, నిజమైన సౌందర్యానికి - మీరు (ధరించ వలసింది కాదు) తీసేయవలసినవి మాత్రమే వున్నాయి. వాటిలో - మీరు నిత్యం చేసే పితూరీలు కూడా వున్నాయి. బాహ్య సౌందర్యానికి - మీకు "మేకప్" వుంది. కానీ నిజమైన సౌందర్యం - మీలోనే వుంది. దానికి కావలసిన మేకప్ తో బాటే - మీరు ఈ ప్రపంచానికి వచ్చారు.
5 . దొరికే ప్రతి అవకాశాన్ని, ప్రతి క్షణాన్ని - ఆనందంగా, ఉత్సవం లాగా గడపండి. అప్పుడే మీరు, గొప్పగానూ, నిండు గానూ - జీవితాన్ని చూడ గలరు;అనుభవించగలరు.
6 . జీవితం మనం ఆడవలసిన ఆట. అదేదో (కష్టమైన) పోరాటం కాదు.
7 . ఈ ప్రపంచం మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ వుంది. ఈ గాలి మిమ్మల్ని ప్రేమిస్తూ వుంది. ఈ ఆకాశం, ఈ సూర్యుడూ, ఈ చం ద్రుడూ అన్నీ మీపై చాలా అభిమానం వున్నవే. మీ చుట్టూ - ఈ ప్రేమ శక్తి ఎల్లప్పుడూ వుంది. మీరు ధ్యానంలో పూర్తిగా దీనిలో కరిగిపోగలరు. అది మీకు ఎంతో అంతః శక్తిని యిస్తుంది.
8 . మీరున్న నిద్ర నుండి మీరు లేయాలి. లేచి - మీరెంత సౌందర్యంతో వున్నారో చూడండి. మీలోని, ఆ ముగ్ధత, మీలోని ఆ నాట్యం - ఎంత సుందరంగా వుందో చూడండి.
9 . ఈ ప్రపంచమంతా వొకే కుటుంబం.... మీరు మీ చుట్టూ, కట్టుకున్న గోడలను కూలద్రోయాలి..మీ వైపు నుండి మీరు చేయాల్సింది - మీకు, మిగతా వారికి మధ్య నున్న అనుమానాలను, జంకును పూర్తిగా విడిచి పెట్టడమే . అందరితో సఖ్యానికి మీ చేయి అందించండి.
10 . వున్న చట్టాలన్నే మెదడుకే గాని హృదయానికి కాదు.
11 . మీ చుట్టూ వున్న వారిని - మీ వారిగా చేసుకోవడం నేర్చుకోండి. వారు, యిప్పుడు కూడా మీ వారే. వారు వచ్చిందీ యిదే భూమి నుండే. వారు పీల్చేది - మీరు విడుస్తున్న గాలే. మీరు (వారితో) ఎంతో, సంబంధమున్న వారే. ఎంతో!
12 . మీరు నిజంగా కళ్ళు తెరవాలంటే - కొన్ని సార్లు (లేదా కొంత సేపు) మీ కళ్ళు మూసుకోవాలి.
13 . సంతోషం (లేదా ఆనందం) అనేది మీకు తెలియనంత వరకు (మీకు అనుభవం లోకి రానంత వరకు) - వొక వూహ మాత్రమే. తెలిసిన తర్వాత - అదే మీరు (గా మారిపోతారు).
14 . చూడగలిగే కళ్లుంటే - మీరు ప్రపంచమంతటా - ప్రేమను చూడగలరు.
15 . అనూహ్యమైన (చేయలేనటువంటి) విషయాన్ని గురించి - మీరు (మీ ధ్యేయంగా) కల గనాలి. మీరు ఈ ప్రపంచంలో - ఏదో వొక అద్భుత మైన, మీరే చేయ గల కార్యం చేయడం కోసమే - పుట్టారని తెలుసుకోండి. ఈ అవకాశాన్ని విడిచిపెట్ట కండి. అంత గొప్ప ధ్యేయాన్ని గురించి, గొప్పగా కల గనడానికి మీరు, మీకు పూర్తి స్వాతంత్ర్యం యిచ్చుకోవాలి.
16 . పుట్టిన ప్రతి మొగ్గలోనూ, పూవుగా మారగల పూర్తి సామర్థ్యం వుంది.
17 . ప్రత్రి వొక్కరూ (మరొకరికి) యిది చెప్ప గలగాలి - " నీకు అవసరం అయినప్పుడు, నేను నీతోనే వున్నాను / వుంటాను". చాలా మందిలో - ఇప్పుడున్న భయం, తమకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవరూ రారని. ప్రపంచంలో వున్న లంచగొండి తనానికీ, హింసా ప్రవృత్తికీ - యిదే ముఖ్య కారణం.
18 . ప్రేమించడం హృదయం పని. సందేహించడం మెదడు పని. రెండింటి పనీ మీకు అవసరం వుంది.
19 . మీరు గురువు దగ్గరికి వస్తే - ఏదో వొకటి యివ్వాలి. మీరు నాకు, పూలు, మాలలు, షాల్- లు యివ్వాల్సిన పని లేదు. మీ మనసులోని కష్టాలను (వర్రీస్) నాకు యిచ్చేయండి. మీరు సంతోషంగా తిరిగి వెడితే - అదే నాకు గురుదక్షిణ.
20 . మీరు ఎప్పుడైనా శోకంతోనో, కష్టం తోనో వుంటే - వొక్కటి మాత్రం తప్పక తెలుసుకోండి. మీ అంతరాత్మకు యిప్పుడు వెంటనే - మంచి ఆహారం కావాలి. ఆ ఆహారం ధ్యానం మాత్రమే.
= మీ
ఉప్పలదడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి