7, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఎందుకిలా జరుగుతోంది? 24 ఏళ్ళ వయసులో గుండె పోటు ఎందుకు? = నూరేళ్ళ జీవితం, అందంగా, ఆనందంగా గడపాలంటే ఏం చెయ్యాలి?

సమస్య నేనే అనుకుంటే - సమాధానం మనలోనే వెదుకుతాం. సమాధానం మనలోనే వుంటే - అది  తెలుసుకోవడం, దాన్ని అమలు చేయడం చాలా సులభం.

చాలా చాలా సమస్యలకు - నిజానికి సమస్యా మనమే; పరిష్కారమూ మనమే. యిది - క్రిందటి వ్యాసంలో మనం చూసాం.


ఈ ముందు మాట ఎందుకు?

రెండు రోజుల క్రితం - వొక  24  ఏళ్ళ  యువకుడు - ఐ.టీ. రంగంలో వున్న వాడు -  గుండె పోటు(హార్ట్ యటాక్) తో పోయాడు. అతనికి ఏ రకమైన చికిత్సా అందించడానికి మునుపే చని పోయాడు. ఈ మధ్య 24  నుండి 35   లోపుగా వుండే  యువకులిలా  అర్ధాంతరంగా పోవడం - చాలా, చాలా  విన్నాను. 

ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది?

భారత దేశానికి - ఐ.టీ. రంగం రావడం వలన - ఎంతో మేలు జరిగినా - యువకుల్లో -  బీ.పీ, చక్కర వ్యాధి, గుండెపోటు సమస్యలు, మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడం - చూస్తూనే ఉన్నాము.

యివి చాలదన్నట్టు - బెంగుళూరు నగరంలోని - ఐ.టీ. రంగంలోను, బీ.పీ.వో లాంటి మరి కొన్ని రంగాల లోనూ, వివాహ రద్దుల శాతం చాలా ఎక్కువయినట్టు  వార్తలు వస్తున్నాయి.

వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువ అవుతూ వుంది.. అయితే - శరీరంలో క్రొవ్వు శాతం పెరిగి, అతి స్థూల కాయం రావడం వలన సెక్సు సామర్థ్యం తగ్గినట్టు కూడా - తెలుస్తూ వుంది.

ఫాస్ట్ ఫుడ్, పిజ్జా లాంటివే ఎక్కువ తినడం వలన - మరెన్నో వ్యాధులకు గురి కావలసి వస్తున్నారు.
 
నిశితంగా చూసే వారికి - వీరిలో - వోర్పు శాతం తగ్గి, వొత్తిడి (స్ట్రెస్)శాతం ఎక్కువయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎంతో మందిలో - కోపమూ, వేగమూ - పెద్దల పట్ల అసహనమూ పెరుగుతున్నట్టు - అనిపిస్తుంది.

విదేశాల నుండి వచ్చే డబ్బు తో బాటు - వారి సంస్కృతి పట్ల మోజు కూడా చాల ఎక్కువవుతున్నట్టు అనిపిస్తుంది. యిది ఎంత శాతం మందిలో జరుగుతోందో - చెప్పడం కష్టం. కానీ - ఎంతో మందిలో వుంది, ఎక్కువవుతోంది - అని మాత్రం తప్పక అనిపిస్తుంది.

యిదంతా - వారి తప్పే - అని మాత్రం అన లేము. ఎన్నో కంపెనీల్లో,  6  - 8  గంటల పని ఎప్పుడో పోయింది.  12 గంటలు, అంతకు మించి కూడా పని చేసే వారి శాతం చాలా ఎక్కువగా వుంది. వారికి పని భారం వలన - వొత్తిడి, దాని ద్వారా వచ్చే వ్యాధులు వస్తాయి కదా.

యిటువంటి పనీ, పని కాలాలు -ఎక్కువవడమూ, వాటి వల్ల యువతీ,యువకుల మధ్య ఆకర్షణ పెరగడమూ, పెద్దలకు దూరంగా వుండడం వలన, అది సెక్సు రూపం ధరించడం సహజంగా జరిగిపోతూ వుంది. తప్పు వారిది మాత్రం కాదు. వయసుది; పరిస్థితులది - అని తప్పక చెప్పాలి. 

ఈ విషయంలో - కంపెనీలలోనూ, ప్రభుత్వం లోనూ- చైతన్యం రావాల్సిన అవసరం ఎంతయినా వుంది.


ముఖ్యంగా - యువకుల్లో, యువతుల్లో, చైతన్యం రావాలి.

క్షణికాకర్షణలు - సెక్సు గానీ, ఆహారం గానీ, డబ్బు గానీ-  వొక వైపు వున్నా - మరొక వైపు సమాజం ఎలా వుంటే - అందరికీ మేలో - అన్న చైతన్యం పెరగాలి.

ఆహారమూ, శారీరక ఆరోగ్యము పట్ల శ్రద్ధ పెరగాలి.

పని ఎంత వున్నా - మానసిక వొత్తిడి లేకుండా చేయడం నేర్చుకోవాలి.

అలాగే - వివాహేతర సంబంధాలూ, విడాకులపై మోజు - తగ్గాలి. వివాహం పట్ల గౌరవం పెరగాలి.

అమెరికాలో - 53  శాతానికి పైగా  వివాహాలు - అవీ, అన్నీ ప్రేమ వివాహాలే - విడాకులతో, అతి త్వరగా, ముగుస్తున్నట్టు, గణాంకాలు ద్వారా తెలుస్తున్నాయి. 

మరి ఆ ప్రేమలెంత నిజమైనవి? వాటిలో లోపం ఎక్కడుంది? అన్ని ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమౌతున్నాయి? అన్నీ - ఎన్నో నెలల, సంవత్సరాల "డేటింగ్" తరువాత జరిగేవే. అయినా, విఫలమౌతున్నాయి. డేటింగ్ జరిగినంత కాలం కూడా - వివాహం తర్వాత కలిసి వుండలేక పోతున్నారు.

ఎందుకు?

నాకు - ఏదో కావాలి. కానీ ఎం కావాలో, సరిగ్గా తెలీదు. మొదట ఈ బొమ్మ  పైన మనసు పడింది. అది దొరికేంత వరకు అది తప్ప మరోటి వద్దు - అదే కావాలి; అందుకని చిన్న పిల్లలు ఏడుస్తారు. రాద్దాంతం చేస్తారు. సరే. అది తీసిస్తే - వొక్క రోజులో - దాన్ని నాలుగు భాగాలు చేసి పడేస్తారు. మోజు తీరిపోయింది.

మళ్ళీ, మరో బొమ్మ కావాలి. మళ్ళీ అదే తంతు. పెరిగే వరకు అంతే. మనసు ఎదిగే వరకు అంతే. అప్పటికి పుణ్య కాలం గడిచి పోతుంది. వయసు అయిపోతుంది.

జీవితం కూడా బొమ్మలాట లాగ మార్చేస్తున్నారు. మారుస్తూ, జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు.

జీవితం అర్థం కావాలి. మనలో - మిస్టర్ పెర్ఫెక్ట్ కానీ మిస్ పెర్ఫెక్ట్ కానీ - ఎక్కడా లేరు. అందరిలో కొన్ని, కొన్ని లోపాలు వుండనే వుంటాయి. ప్రేమించే సమయంలో లోపాలు తెలియవు. బాధ్యతలు తెలియవు. వివాహం తరువాత - లోపాలు, బాధ్యతలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ప్రేమ మెల్లగా మాయమవుతుంది. 

ప్రేమిస్తే - లోపాలతో బాటు, బాధ్యతలతో బాటు - అన్నిటినీ ప్రేమించాలి. అన్నిటినీ స్వీకరించాలి. అది జరగడం లేదు.

ముందు తరంలో - బాధ్యతలు చాలా స్పష్టంగా - విభజింప బడ్డాయి. యిప్పుడా విభజనను వొప్పుకోక పోవడం వలన, మరో స్పష్టమైన, ప్రత్యామ్నాయం చూసుకోక పోవడం వలన -ప్రేమ వివాహాలు విఫలమౌతున్నాయి.

ప్రేమించే సమయంలో - నా ప్రాణాన్ని కూడా కావాలంటే యిచ్చేస్తా - అన్న వారే - కాఫీ నువ్వే పెట్టాలి, నేను పెట్టను. యిది నువ్వే చెయ్యాలి, నేను కాదు - అని అన్నిటికీ పోటీ పడుతున్నారు. నా జీతం నాదే. అందులో - నేను "మన కోసం" ఖర్చు పెట్టను అనే వారిని చాలామందిని  చూస్తున్నాము.

ఇలాంటి మార్పులు ఎన్నో.

ప్రేమల స్వరూపం మారిపోతూ వుంది. వివాహ జీవితాల స్వరూపం మారిపోతూ వుంది.  పిల్లల పట్ల, పెద్ద వారి పట్ల - అభిప్రాయాలు, ప్రవర్తన మారిపోతూ వుంది.

వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతూ వుంది. 

ఈ సమస్యలకు కూడా - నిజానికి సమస్యా మనమే; పరిష్కారమూ మనమే. అందరూ - పెద్దలూ, యవకులూ, యువతులూ, కంపెనీలు, ప్రభుత్వమూ -అందరూ - భాగ స్వామ్యులమే.

నాలోని కోపాన్ని, అసహనాన్ని, వొత్తిడిని, ఎవరు శీఘ్రంగా తగ్గించ గలరు? నేనే.

నా ఆరోగ్యాన్ని - శీఘ్రంగా ఎవరు బాగు చేయ గలరు? నేనే.

నా వివాహ జీవితాన్ని సరిగ్గా ఎవరు చూసుకో గలరు? నేనే.

సమాజం - కొంత వరకు తోడ్పడుతుంది. నా లో సమాజం పట్ల బాధ్యత వుంటే, గౌరవం వుంటే.

24  ఏళ్ళలో  గుండె పోటుతో పోవలసిన  అవసరం ఎవరికీ రాకూడదు. నూరేళ్ళ జీవితం, అందంగా, ఆనందంగా గడపాలంటే - మరి కాస్త బాధ్యతాయుతంగా, మరి కాస్త సామాజిక స్పృహతో, మరి కాస్త ఆరోగ్య స్పృహతో - జీవితం గడపాల్సిన అవసరం వుంది.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి