18, జూన్ 2011, శనివారం

లక్ష్య సాధన = శరీర శక్తి = ఆలోచనా శక్తి = భావనా శక్తి - ఆధ్యాత్మిక లక్ష్యాలు - సామాజిక లక్ష్యాలు - ఆర్ధిక (యితర) లక్ష్యాలు


క్రిందటి వ్యాసంలో - లక్ష్య సాధనను గురించి, కొంత వరకు తెలుసుకున్నాము.

ఈ వ్యాసంలో - ఈ అతి ముఖ్యమైన అంశాన్ని గురించి మరి కొంత చూద్దాం.

అసలు లక్ష్యమంటే ఏమిటి?

యిది చాలా తేలికైన ప్రశ్నే.కానీ - ముఖ్యమైన ప్రశ్న.

లక్ష్యం అంటే - నిర్ణీత కాలంలో, నిర్ణీత గమ్యాన్ని   చేరాలనుకోవడం. ఇప్పుడున్న  స్థితి నుండి - యింత కంటే - మెరుగైన స్థితిని చేరుకోవడం.
నిర్దిష్టమైన మానవ ప్రయత్నం లేకుండా - అటువంటి మెరుగైన స్థితిని చేరుకోవడం  కష్టం.
అంటే - నిర్ణీత కాలంలో, నిర్ణీత మైన , యిప్పటికంటే  మెరుగైన, ఉన్నతమైన   గమ్యాన్ని , మన ప్రయత్నం తో   చేరాలనుకోవడం - లక్ష్య సాధన  ఉద్దేశ్యము అని  చెప్పొచ్చు.

సరే. అటువంటి లక్ష్యాలు ఎలా వుండొచ్చు  ?ఈ  క్రింది ప్రశ్నలను చూడండి.  

1 . మీరు ఏం కావాలనుకుంటున్నారు? (శారీరకంగా,  మానసికంగా, సంఘికంగా...)
2 . మీరు ఎలా వుండాలనుకుంటున్నారు  ?  
3 . మీరు ఏం చేయాలనుకుంటున్నారు  లేదా సాధించాలనుకుం టున్నారు?
4 . మీకు  ఏమేం కావాలనుకుంటున్నారు  ? ( ఇల్లు, డబ్బు, బిజినెస్సు  ...)
5 .  మీరు ఏమేం నేర్చుకోవాలనుకుంటున్నారు? (సంగీతం, నాట్యం, కరాటే, యోగ...)
6 . మీరు మీ చుట్టూ వున్నా వారిలో ఏమేం మార్పులు తీసుకు రావాలనుకుంటున్నారు? 
7 . మీరు దేని కోసమైనా - పోరాడాలనుకుంటున్నారా?  అందులో - మీరు సాధించ దలుచుకున్న లక్ష్యం / గమ్యం ఏమిటి?

అంటే - మీరు, మీలోను, మీ చుట్టూ వున్న వారిలోనూ - వొక నిర్ణీత కాలంలో - తీసుకురాధలుచుకున్న ఉన్నతమైన మార్పులనే - లక్ష్యాలని చెప్పొచ్చు.యిదే, యింకొక రకంగా చూద్దాం. 

  • మీకొక దేహముంది. అది ఎలా ఉండాలో - మీరే నిర్ణయించుకోవాలి.అది తప్పక వొక లక్ష్యగా వుండాలి. శరీరం ఆరోగ్యంగా వుండాలనేది కనీస లక్ష్యం. మనిషికి మొట్టమొదటిది శరీర శక్తి.   శరీరం ఆరోగ్యంగా లేక పోతే - మరే యితర లక్ష్యాలనూ - మనం చేరుకోవడం, సాధించడం - చాలా కష్టం. అందుకని - దేవుడిచ్చిన శరీరాన్ని - ఆరోగ్యంగా, బలంగా, వీలైనంత అందంగా పెట్టుకోవాలనుకోవడం -అందుకు - ప్రతి దినం ఏం చేయాలో - నిర్ణయించుకోవడం  చాలా ముఖ్యం. అలాగని - అదే - మన జీవితం యొక్క  ముఖ్య లక్ష్యంగా వుండ రాదు.మిగతా గమ్యాలను చేరుకోవడానికి - అది ముఖ్యమైన చేయూత. అంతే. ఆరోగ్యమే మహా భాగ్యమని - తెలుగులో అంటాము. అలాగే - ఆరోగ్యం పోతే - అన్నీ పోయినట్టే నని అంగ్లంలో  వొక సామెత వుంది. అది నిజమే.   
  • ఈ దేహాన్ని ఎలా బాగా పెట్టుకోవడం? చిన్న కొండ గుర్తు చెబుతాను. మీ దేహంలో - ఏ, ఏ భాగమైతే ప్రతి దినమూ - బాగా పని చేస్తుందో - ఆ యా భాగాలు - ఆరోగ్యంగా వుంటాయి. ఏ ఏ భాగాలు ఎక్కువ పని చేయ్యవో - అవి నీరసించి, శక్తి  లేకుండా పోతాయి. 
  • చేత వ్రేళ్ళతో ఎక్కువ పని చేసే వాళ్లకు - వ్రేళ్ళు బలంగా వుంటాయి. వీపుపై బరువులు మోసే వాళ్లకు , వీపులోని కండరాలు, కడుపులోని కండరాలు బలంగా వుంటాయి. బాగా నడిచే  వాళ్లకు, కాళ్ళు,  గుండె, ఊపిరితిత్తులు  ఆరోగ్యంగా వుంటాయి. యోగా ఆసనాలు చేసే వాళ్లకు - శరీరంలోని - అన్ని భాగాలు - సమానంగా - ఆరోగ్యంగా వుంటాయి. ఏదైనా - అతి సర్వత్ర వర్జయేత్ - అన్న సూక్తి జ్ఞాపకం పెట్టుకోవాలి.
  • శ్రీ కృష్ణుడు గీత లోని - ధ్యాన యోగంలో - ప్రతి విషయంలోనూ - మధ్యే మార్గమే వుండాలంటాడు. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర, ఎక్కువ ఆహారము, తక్కువ ఆహారము, ఎక్కువ తిరగడము, తక్కువ తిరగడము -  ఏదీ యోగానికి పనికి రాధంటాడు. యోగమంటేనే -  ఆరోగ్యకరమైన - జీవన విధానమే. 
  • ఆహారం విషయంలో - వీలైనంతగా - సాత్విక ఆహారం తీసుకుంటే - శరీరానికి శక్తీ వస్తుంది. మెదడుకు - ఆలోచనా శక్తీ పెరుగుతుంది. మనలో - ఆహ్లాదకరమైన, ఆనందకరమైన మనస్సూ వుంటుంది. తామసిక ఆహారం తీసుకుంటే - నిద్ర, కోపాలు, అసూయ, అలసట, సోమరితనం పెరుగుతుంది. రాజసిక ఆహారం తీసుకుంటే - ఎప్పుడూ దేని వెంటో - పరుగెడుతూ వుంటాము - కానీ - దేన్లోనూ- ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేము  . 
  • యిక రెండవది   - మీ ఆలోచనాశక్తి. శరీరంలో - ఆలోచనా శక్తి లేక పోతే - శరీరమూ వుండదు. వున్నా ప్రయోజనము లేదు.  మీ ఆలోచనా శక్తి  ఎలా ఉండాలో - అదీ మీరే నిర్ణయించుకోవాలి.అదీ వొక లక్ష్యముగా  వుండాలి.మీ ఆలోచనా శక్తే - మీ శరీర ఆరోగ్యాన్ని , అది చేసే పనులను  నియంత్రిస్తుంది. ఇక్కడా మొదట చెప్పిన సూత్రమే వర్తిస్తుంది. ప్రతి రోజూ - మీ ఆలోచనా శక్తికి పని పెట్టాలి. మీకు తెలుసా- చాలా రకాల  టీ వీ  ప్రోగ్రాములు - మీ ఆలోచనా శక్తిని మొద్దు బరుస్తాయని? 
  • ఆలోచనా శక్తి  రెండు రకాలుగా పని చేస్తుంది.వొకటి - అది మిమ్మల్ని తన అధీనంలో పెట్టుకుని నడిపించ  గలదు. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలన్నిటిలోనూ - వొక ద్వైదీ భావం వుంటుంది. నిశ్చిత భావం వుండదు. యిదా, అదా అన్న సమస్యలో కొట్టు మిట్టాడుతుంటారు. ఏదో వొకటి చేద్దామని, ఏదో వొకటి చేస్తుంటారు. 
  • రెండవది - ఆలోచనా శక్తి - మీ అధీనంలో, మీరు చెప్పినట్టుగా పని చేయడం. యిప్పుడు - మీరు - మీ లక్ష్య సాధన గురించి తెలుసు కుంటున్నారు కదా. మీలో -ఎంత మంది - వెంటనే - తమ తమ లక్ష్యాలను - నిర్ణయించుకుని - వాటి సాధనకు నడుం బిగించుతారో  - వారికి - వారి ఆలోచనా శక్తి , వారి అధీనంలో పని చేస్తుంది. భగవద్ గీతలో - అతి ముఖ్యమైన - అర్జునుడి ప్రశ్న  - యిదే.   శ్రీ కృష్ణుడు  చెప్పేది యిదే. లక్ష్య సాధకుడి అధీనంలో ఆలోచనా శక్తి పని చేస్తుంది. మిగతా వారిని - అది తన అధీనంలో యిష్టం వచ్చినట్టు తిప్పుతుంది. 
  • మూడవది - భావనా శక్తి - మీలో ఎన్నో భావ తరంగాలు వస్తూ వుంటాయి. ప్రేమ, ఆనందం, వాత్సల్యం, స్నేహం, దయ, వీరత్వము, పగ, ద్వేషం, కోపం, అసూయ,  ఈర్ష్య  - ఇలాంటివి  ఎన్నో వున్నాయి. వీటిలో - మీకు  ఏది కావాలి; ఏది వొద్దనేది మీరే నిర్ణయించుకోవాలి.  ఎవరు, ఏది కావాలంటే - వారు అవి ఉంచుకోవచ్చు. 
  • మొదటి అయిదు సాత్విక గుణం. తరువాత రెండూ రాజసం, మిగతావి తామస గుణం. జీవితమంతా - తామసంలో గడిపే వారూ వున్నారు. ఎవరిని చూసినా - వారికి - అసూయ, ఈర్హ్య. ఎప్పుడూ యుద్ధాల్లో, కొట్లాటలలో, లేదో మరేదో ఎడతెరపి లేని పనుల్లో  (రాజస గుణం) గడిపే వారూ వున్నారు. 
  • మీరు సినిమాల్లోనూం, నిత్య జీవితంలోనూ కూడా - చూస్తుంటారు. మా తాతల కాలం నాటి నుండీ, మాకూ, వారికీ, పగ   అంటూ వుంటారు. లేదా మా కష్టాలన్నిటికీ వేరే ఎవరో కారణం అంటూ - ఏ పనీ చేయకుండా గడిపే వారూ వుంటారు. 
  • మన భావనలే, మన ఆలోచనల్ని శాసిస్తాయి. భావనకు తగిన ఆలోచనలు, వాటికి తగిన కారణాలూ వెదుక్కుంటూ వుంటాము.   వొక మంచి లక్ష్యాన్ని  ఎన్నుకున్న వాడికి - పైవన్నీ అడ్డంకులు కావు. వచ్చే అడ్డంకులు, మన పురోగతికి, మెట్లుగా తయారవుతాయి. 
  • లక్ష్యం లేని వాడికి - ప్రతిదీ - అడ్డంకే! ఏ మార్గమూ ఉపయోగం లేదు. 
  • ఆంగ్లంలో - ఆలీస్ యిన్ ది వండర్ ల్యాండ్ - అనే పుస్తకంలో వొక ప్రశ్న-జవాబు వుంది. ప్ర: ఈ దారెక్కడికి వెళ్ళుతుంది?  జ : నువ్వెక్కడికి వెళ్ళాలి? జ : తెలీదు?  జ: అయితే ఈ దారెక్కిడికి  వెళ్ళినా పరవాలేదు. వెళ్ళు!
  • చూసారుగా. లక్ష్యం లేని వాడు - ఎటు వైపు వెళ్ళినా - వొకటే. ఏ ప్రయోజనమూ లేదు. 
  • నాలుగవది - ఆధ్యాత్మిక లక్ష్యాలు. మీరు - మీ శరీరం, ఆలోచనలు, భావనలు మాత్రమేనా? శరీరం పోయాక మీరేమవుతారు? అసలు - మీరెవరు? యిది తెలుసుకోవడం - వొక గొప్ప లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో - అడుగడుగునా - మీకు - ఎన్నో ఆసక్తి కరమైన, ఆనంద కరమైన విషయాలు తెలుస్తాయి.
  • అయిదవది - సామాజిక లక్ష్యాలు. మనం బాగుంటే - చాలదు. మన ప్రక్క వాడూ బాగుండాలి. దేశమంతా  బాగుండాలి. దేశంలోని - ప్రతి వొక్కడూ - బాగుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు. దీనికి - మనం ఏం చేస్తున్నాం. మన దేశం - రక రకాలుగా - కలిసి వున్నా, మానసికంగా విడిపోయి వుంది. ప్రతి వొక్కరినీ -  వొక్క త్రాటిపైకి తీసుకు రావలసిన అవసరం వుంది. ప్రతి వొక్కరినీ - ఆర్థికంగానూ, సామాజికం గానూ మెరుగు పరచ వలసిన అవసరం వుంది. 
  • విడ గొట్టే వాళ్ళ మధ్య - మనం కలిపే వాళ్ళుగా, కలిసే వాళ్ళుగా - వుండాలి. యిది కూడా వొక లక్ష్యమే. 
  • యింతకు మించి - లక్ష్యాలు లేవా? వున్నాయి. కాని  యివి ముఖ్యం. దీనిపై - మీరు ఎన్నో లక్ష్యాలు పెట్టుకోవచ్చు. పర్యావరణ రక్షణ వొక లక్ష్యం కావచ్చు. ప్రపంచానికి సంబందించిన ఏ విషయం పైన అయినా - పరిశోధనలు చెయ్యొచ్చు. ఆర్థికంగా - మీరు చాలా, చాలా డబ్బు సంపాదించొచ్చు. రాజకీయాల్లోనో, కళా రంగాల్లోనో   అశేష కృషి చెయ్యొచ్చు. క్రీడలలో కృషి చెయ్యొచ్చు.  ఉన్నత పదవుల కోసం కృషి చెయ్యొచ్చు.
  • మీరు ఏది చేసినా - ప్రతి రోజూ - నేను సంతోషం గా వున్నానా లేదా - అన్న ప్రశ్న వేసుకోవాలి.శారరకంగా, మానసికంగా, భావనా పరంగా - ముందుకెడుతున్నానా లేదా -  అన్నది చూసుకుంటూ వెళ్ళాలి.
  • అప్పుడే - లక్ష్య సాధన జీవితంలో - ప్రముఖ పాత్ర వహిస్తుంది.
  • దీన్లో , మరి కొన్ని - మెళకువలు  మరో సారి చూద్దాం.

=  మీ

 వుప్పలధడియం విజయమోహన్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి