14, జూన్ 2011, మంగళవారం

మీ లక్ష్యం ఏమిటి? మీరేం సాధించారు? మీరేం సాధించ దలుచుకున్నారు?


జీవితంలో ప్రతి వొక్కరికి ఏదో కావాలి.  ఏదో సాధిస్తే సంతృప్తి. జీవితం ధన్యమవుతుందన్న  వొక భావన.

ఏదైనా వొక గొప్ప (మంచి) లక్ష్యాన్ని సాదించాలన్న తపన అందరిలోనూ వుండాలి. ముఖ్యంగా యువకులలో  ఎక్కువగా వుండాలి.

యువతలో నేర్చుకునే వేగమూ, సాధించ గలిగే వేగమూ రెండూ  ఎక్కువగానే   వుంటుంది.

నేర్చుకున్న దాన్ని ఉపయోగిస్తే - వారి  వయసుకు  - ఫలితమూ ఎక్కువగా వుంటుంది.  

లక్ష్య సాధనకై శ్రమించ గలిగే శక్తీ చిన్న వయసులో ఎక్కువగా వుంటుంది. అందు వలన లక్ష్య సాధనను యువత మనస్సులోను, చిన్న పిల్లల మనస్సు లోను  ముఖ్యంగా, బాగా నాటుకునేటట్టు చేయాల్సి వుంటుంది. 

అయితే - మధ్య వయస్కులకు, వృద్ధులకు - లక్ష్య సాధన అక్కర లేదా? తప్పక  కావాలి.

ప్రతి మనిషిలోనూ, తమ ఆఖరి శ్వాస వరకు - ఏదో వొక లక్ష్య సాధనకు - కృషి జరుగుతూ వుండాలి. లక్ష్యము లేని వారి బ్రతుకు - త్వరగా - నిస్సారమై పోతుంది.

మనం ఎన్నుకొన్న లక్ష్యమూ- మనకు, సమాజానికీ మంచిది చేసేదిగా వుండాలి.సమాజ శ్రేయస్సుకు కీడు కలిగించే లక్ష్యాన్ని - ఎన్నుకోకూడదు. మనకు కీడు కలిగించేది  కూడా - లక్ష్యమనిపించుకోదు . ఉదాహరణకు - పెద్ద దొంగ గానో, దోపిడీ దారుగానో, హంతకుడిగానో పేరు తెచ్చు కోవడం - లక్ష్యమనిపించుకోదు.

లక్ష్యము వున్న వారిలో - శారీరకం గాను, మానసికం గాను  - చురుకుదనం  వుంటుంది.ఆరోగ్యం బాగా వుంటుంది. జీవితం ఆనందం గాను, చలాకీ గానూ గడిచిపోతుంది. 

జీవన లక్ష్యం అంటే - పుట్టినప్పటి నుండి  - చచ్చే వరకు - వొకే లక్ష్యం వుంటుందని కాదు.  లక్ష్యం అప్పుడప్పుడూ మారొచ్చు; మారకనూ పోవచ్చు.  

ఉదాహరణకు - చిత్రకారుల కుటుంబంలో పుట్టి చిత్రాలే లక్ష్యంగా ఎన్నుకున్న వారికి - జీవితమంతా వొకే లక్ష్యంగా వుండొచ్చు. మరొకరు, కలెక్టరు కావాలనుకున్నారనుకోండి . వారు - కలెక్టరు అయిన తరువాత, మరొక లక్ష్యం ఎన్నుకోవచ్చు. కలెక్టరు కాలేధనుకోండి. అప్పుడూ - లక్ష్యం మార్చుకోవచ్చు. ముఖ్యమైనది ఎమిటంటే -     మనకు నిజంగా యిష్టమైనది, సంతృప్తి నిచ్చేది లక్ష్యంగా ఎన్నుకోవాలి.

అయితే - మనం రెండు మూడు రకాల లక్ష్యాలనూ ఎన్నుకోవచ్చు- కాల పరిమితి యొక్క దీర్ఘతను బట్టి. 

ప్రతి మూడు నెలలకు సాధించ దగిన లక్ష్యాలను వొకటో, రెండో, ఎన్నుకోవచ్చు.  

ప్రతి సంవత్సరానికి  సాధించ దగిన లక్ష్యాలను ఎన్నుకోవచ్చు. 

ప్రతి మూడు - అయిదు సంవత్సరాలకు  సాధించ దగిన లక్ష్యాలను వొకటో, రెండో ఎన్నుకోవచ్చు. 

జీవితాంతం సాధించ దగిన లక్ష్యాలను వొకటో, రెండో ఎన్నుకోవచ్చు. 

అయితే - వీటన్నిటినీ - సమన్వయము చేసుకుంటూ - అన్నీ దాదాపు - వొకే మార్గంలో వుండేలా చూసుకుంటూ - కనీసం వొకదానికొకటి విరుద్ధం కాకుండా చూసుకుంటూ వుంటే - మనకున్న అమూల్యమైన కాలం వ్యర్థం కాకుండా వుంటుంది. 

ఉదాహరణకు - డాక్టరు కావాలనుకున్న వారు - మళ్ళీ లాయరు కూడా కావాలనుకోకూడదు. ఇంజనీరు కూడా కావాలని ఆశ పడకూడదు. ఏదైనా వొక మార్గంలో - వొక వృత్తిలో - ప్రావీణ్యత, గుర్తింపు సంపాదిస్తే - చాలు. వొక జీవిత కాలానికి - అంతకు మించి - సమయం లేదు. 

  అలాగే - ఏదైనా వొక కళలో -   కొంత  ప్రావీణ్యం  సంపాదించాలని వొక లక్ష్యం పెట్టుకోవచ్చు. ఈ కళనే వృత్తిగా పెట్టుకోవాలనుకుంటే - దానిలోనే ఎక్కువ కృషి చేయాల్సి వుంటుంది. 

మనకు - ఆర్థికంగా - ఎంతో కొంత అభివృద్ధి చెందాలి -అన్న లక్ష్యం కూడా వుండొచ్చు. అయితే - అది - మీ వృత్తి  , మీకున్న కళలు - వీటినుపయోగించే చేస్తే -   జీవితంలో - ఆనందమూ ఎక్కువగా వుంటుంది. ఆర్థికాభివృద్ధి కూడా వస్తుంది. 

ఆర్థికాభివృద్ధి మాత్రమే - ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న వారూ  - వుంటారు. తప్పు లేదు. అమెరికా లో - ఈ లక్ష్యమే - పెట్టుకున్న వారు ఎక్కువ. యమ్ బీ ఏ  డిగ్రీ  అందుకే  వచ్చింది. యిప్పుడు - డాక్టరు, ఇంజనీరు, లాయరు కంటే - అమెరికా లాంటి దేశాల్లో - యమ్ బీ ఏ  డిగ్రీ కే ప్రాధాన్యత ఎక్కువ. అందుకే - ఆ దేశం - ప్రపంచంలోనే - గొప్ప - సుసంపన్న దేశంగా వెలుగుతోంది.

మన దేశంలో - యిప్పుడు - ఇంజనీరింగు కు అలాంటి ప్రాధాన్యత మనం యిస్తూ ఉన్నాము. కానీ,  అది ఉద్యోగాల  వరకే పరిమితమయి పోతూ వుంది.  దానిలో - ప్రావీణ్యత సంపాదించాలంటే - మళ్ళీ - అమెరికాకే వెళ్ళాల్సి వస్తూ వుంది.  మన దేశంలో - యిప్పుడు - ఏ వృత్తికీ, ఏ కళకూ -  అత్యున్నత ప్రాధాన్యత యివ్వబడ లేదనేది వాస్తవం. యిది దురదృష్టం. మన దేశానికి - వొక ముఖ్యమైన లక్ష్యమంటూ - ఏదీ లేదనడానికి - యిది అద్దం పడుతూ వుంది.

మన దేశీయ ఆటగా హాకీ ని పెట్టుకున్నాము - కానీ- ఈ హాకీ - పంజాబులో కూడా యిప్పుడు కనిపించడం లేదు. అలాగే దేశీయ పక్షి గా పెట్టుకోక మునుపు మన దేశంలో - చాలా నెమళ్ళు వుండేవి. కానీ - యిప్పుడసలు కనిపించడం లేదు.  దేశానికీ - వొక లక్ష్యమంటూ వుండాలి. ఆ మార్గంలో - నడుస్తున్నామని - సర్కారు వారికీ తెలియాలి. మనకూ తెలియాలి. 

సరే. మన వ్యక్తిగత లక్ష్యాలకు వస్తాం.

ఏ లక్ష్యం సాధించాలన్నా - మనిషి వొక నిర్ణీత  పంథాలో  - వివేకంతో, వేగంతో, తన లక్ష్యం (లేదా గమ్యం) వున్న మార్గం లో - వెళ్ళాల్సి వుంటుంది. తనకు వున్న సమయాన్ని - బాగా, ఫలదాయకంగా ఉపయోగించాల్సి వుంటుంది.

దీన్నే ఆంగ్లంలో - టైం మేనేజ్మెంటు - లేదా తెలుగులో, కాల నిర్వహణ (కళ) అనవచ్చు. కాలాన్ని అత్యధిక ప్రయోజన కారిగా ఉపయోగించే  గొప్ప కళగా దీన్ని చెప్పుకోవచ్చు.


మనలో ప్రతి వొక్కరికి - దినానికి 24 గంటలే వున్నా- కొంత మంది ఆ సమయంలోనే - మిగతా వారికంటే - చాలా, చాలా ఎక్కువ ఫలితాన్ని సాధించే విధంగా - పని చేయడము  చూస్తూ వుంటాము.  మరి కొంత మంది - వున్న సమయాన్ని వ్యర్థంగా వెళ్ళ దీయడమూ చూస్తుంటాము. 

చిన్న పిల్లల వయసు నుండి - ఈ కాలాన్ని ఉపయోగించే కళ నేర్పాల్సిన అవసరం మన దేశంలో చాలా వుంది.  

కాలాన్ని దేని కోసం ఉపయోగించాలి ?

మనకని కొన్ని ముఖ్యమైన లక్ష్యాలో, గమ్యాలో వుండాలి.

వొకరు డాక్టరు కావాలనుకోవచ్చు. వొకరు సైంటిస్టు కావాలనుకోవచ్చు. మరొకరు గొప్ప క్రీడాకారుడో  , కళాకారుడో  కావాలనుకోవచ్చు.మరొకరు రచయిత కావాలనుకోవచ్చు. రాజకీయ వేత్త కావాలనుకోవచ్చు. 

ఏదయినా  - వారు,వారు, తాము కావాలనుకున్నది  పొందాలనుకుంటే  - తమకున్న కాలాన్ని, సమర్థ వంతంగా  వుపయోగించుకోవాలి. 

మనం కాలాన్ని సామాన్యంగా - ఎలా వుపయోగించుకుంటూ వుంటాము? 

నిద్ర -                                       7  నుండి   8 గంటల వరకు ;
ఆహారము - మూడు పూటలు -  1    నుండి 2  గంటలు; 
స్నానము, నిత్యకృత్యములు -    2    గంటలు ; 

ఆఫీసు, స్కూలు / కాలేజీ     -    8     గంటలు;
టీ వీ -                                -    2     గంటలు; 

యివి కాక - న్యూసు పేపరు, యింట్లో వాళ్ళతో మాట్లాడడము, స్నేహితులు, బంధువులతో మాట్లాడడము - మున్నగు వాటికి - మిగతా టైం సరిపోతుంది. 

మరి - మనం ఏదో కావాలనుకున్నాం కదా? దాని కెక్కడ టైం?

ఇదండీ సాధారణ మానవుని టైం మేనేజ్మెంటు  సమస్య.

జీవితంలో, ఏదో వొక నిర్ణీత గమ్యాన్ని చేరడంలో, విజయాన్ని సాధించే వారికీ,  మిగతా వారికీ - యిక్కడే తేడా వస్తుంది. 

మిగతా వారికి - ఆశలుంటాయి  . కానీ, దాన్ని సాధించడానికి కావాల్సిన , బలమైన సంకల్పశక్తి  వుండదు. వారు - తమ చిన్న,చిన్న పనులను వేటినీ వదులుకోరు. పెద్ద  గమ్యం సాధించాలంటే -  కొన్ని చిన్న చిన్న పనులను వదు లుకోవాల్సిన  అవసరం ఎంతైనా వుంది. 

విద్యార్థులు  కూడా -  పరీక్షల సమయం లో చదువుపైనే - సమయం వెచ్చిస్తారు  కదా. ఆ సమయంలో - టీ వీ లు,  సినీమాలు వదిలేసి చదివే వారు - చక్కగా పాసవుతారు కదా! 

అదే విధంగా - సంవత్సరంలో - ఎక్కువ కాలం చదువు పైనే - సమయం వెచ్చించే వారు - జిల్లా లోనో, రాష్ట్రం లోనో - మొదటి వారుగా వుత్తీర్ణులవడం చూస్తున్నాం కదా. అలా రావాలనుకునే వారికి - చదువే టీ వీ, చదువే  విశ్రాంతి, చదువే సంతోషాన్నిచ్చే పనిగా వుంటుంది. 

 ఏ యితర గమ్యం సాధించాలన్నా - యిదే మార్గం. బలమైన కోరిక, బలమైన కృషి వుండాలి.

మీరు క్రికెట్ లోనో, సంగీతం లోనో,  వొక సైంటిస్టు లా క్రొత్త వస్తువులు సృష్టించడం లోనో - గొప్ప వారు కావాలనుకుంటే - ఆయా రంగాల్లో, బలమైన కృషి చేయాల్సి వుంటుంది.   

విజేతలయ్యే వారికి -  కోరికతో బాటు, దాన్ని సాధించడానికి కావలసిన సంకల్పశక్తి, మనస్సులో పూర్తిగా వుంటుంది.  వారి మనసు తమ గమ్యం పైనే, లక్ష్యం పైనే  కేంద్రీకృతం అవుతుంది. 

వారికి - లక్ష్యం సాధించిన తరువాతనే - ఆనందం అనుకోకూడదు. లక్ష్య సాధనకు చేసే ప్రతి పనిలోనూ - ఆనందమే. అంటే - జీవితమంతా ఆనందమే.

జీవితంలో - మనం చేసే పనులు నాలుగు రకాలుగా వుంటాయి.

1 . కొన్ని పనులు అవసరమైనవి (అర్జెంటు); అంతే కాదు. ముఖ్యమైనవి (యింపార్టెంటు  ) కూడా. యివి వెంటనే చేసేయాలి. యివి జీవితానికి అతి ముఖ్యమైనవి; ఉదాహరణకు -మీ యింట్లో - ఎవరికో, ఆపరేషను చేయించాలి. యిది - అన్ని లక్ష్యాల కంటే - ముఖ్యమైనది. మనిషి వుంటేనే గదా లక్ష్యం. మన ఆరోగ్యం, మన వారి ఆరోగ్యం - మనకు - ప్రధాన లక్ష్యం. దీని వెనుకే - మిగతా లక్ష్యాలు. 

2 . కొన్ని - అర్జెంటు కావు. కానీ యివి మీ జీవితానికి చాలా, చాలా  ముఖ్యమైనవి. ఇవే - మీ లక్ష్యాలు. వీటికోసం, ప్రతి దినం కనీసం రెండు గంటల కాలం కేటాయించక తప్పదు. కనీసం అన్నాము. మీరు పది గంటలు వెచ్చించినా - మంచిదే. ఇవి ఈ రోజు అర్జెంటు కాదు, కాబట్టి, సాధారణంగా, చాలా మంది వీటిని  రేపటికి చూద్దాం, మాపటికి చూద్దాం - అంటూ వాయిదా వేస్తూ వుంటారు. జీవితంలో - విజేతలయ్యే వారికీ, కాని వారికీ - యిక్కడే తేడా వస్తుంది. మన లక్ష్య సాధన కోసం మనం, ప్రతి దినమూ, ఈ మాత్రమైనా - సమయం కేటాయించక తప్పదు. యిలా కేటాయించే వారు తప్పక విజేతలవుతారు. ఈ రోజు నాకు కావలసిన మనస్స్థితి (మూడ్) లేదు - అందుకని ఈ రోజు చేయను అని ఎప్పుడూ అనుకోరాదు.

3 . కొన్ని అర్జెంటు లాగా కనిపిస్తాయి. కానీ, మన జీవితానికి, లక్ష్య సాధనకు - అవసరం మాత్రం కానే కాదు. ఉదాహరణకు - మీ స్నేహితుడెవరో వున్నారు. ఆయన టెలిఫోను చేస్తున్నాడు. మీ లాగా ఆయనకు లక్ష్యమంటూ  ఏమీ లేదు. టెలిఫోను చేయడమే ఆయన లక్ష్యం. ఆయన టెలిఫోను చేస్తే - అది అర్జెంటు లాగా కనిపించొచ్చు. స్నేహితుడు గదా మరి.  యిటువంటివి - కొంత తగ్గించుకోవాలి. అలాగే - ప్రతి ఫంక్షనుకూ మిమ్మల్ని పిలుస్తూ వుంటారు. వెళ్ళక పోతే ఎలా - అనిపిస్తుంది. వొక సారి మీరూ, వొక సారి, మీ యింట్లో ఎవరో వొకరూ - యిలా వెళ్ళొచ్చు. వొకో సారి, ఏదో బహుమతి  ఎవరి ద్వారానైనా పంపించి   ఊరుకొవచ్చు. ఏది ఏమైనా - రోజు వారీ - లక్ష్య సాధనకు - కాలం కేటాయించి తీరాలి. దాని పై - మిగతా విషయాలు గమనించాలి.

4 .  చాలా విషయాలు - అర్జెంటూ  కావు. అవసరమూ కావు. టీ వీ సీరియల్సు ఈ కోవకే వస్తాయి. నాలుగు ఎపిసోడ్లు చూశారంటే - ప్రతి రోజూ - మీ లక్ష్యం అదే అయిపోతుంది. యిక అది చూసి తీరాల్సిందే అనిపిస్తుంది. మీ నిజమైన జీవన లక్ష్యాలేవీ మరి చేయలేరు. ముఖ్యంగా - పిల్లలకు, యివి అలవాటు చేయకండి. మీరూ చేసుకోకండి. 

చెప్పొచ్చే దేమిటంటే - మనం రెండో కోవ లో చూశాం గదా  - అవి మీ జీవన లక్ష్యాలు. అవి ఈ రోజు అర్జెంటు అని అనిపించకపోవచ్చు.  కాని - లక్ష్య సాధకులకు - అలా అనిపించి తీరాలి. అవి - చేసే కొద్దీ - లక్ష్య సాధనలో ముందుకెళ్ళే కొద్దీ - వాటిలో మీకు రుచీ పెరుగుతుంది. పట్టూ వస్తుంది. మీ నైపుణ్యమూ పెరుగుతుంది.  ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ - మీ జీవితంలో - మీరు పైకి ఎదుగుతారు. 

మన తుది  శ్వాస నిలవక ముందు - " నేననుకొన్నవన్నీ సాధించాను" అన్న తృప్తి -  మనలో రావాలి.  నా జీవితం బాగానే గడిచింది. అన్న సంతృప్తి రావాలి. అప్పుడే - మనం మన జీవితాన్ని బాగా గడిపినట్టు లెక్క. అవునా!!

ఇదండీ - టైం మేనేజ్మెంటు - లేదా తెలుగులో, కాల నిర్వహణ (కళ)!

= మీ
వుప్పలధడియం విజయమోహన్

2 వ్యాఖ్యలు:

  1. యేదో ఒక లక్ష్యం ఉండాలి అనమాకండి. ఒకడు దాదాగిరి చేసి నాయకుడు కావాలి అని కూడా అనుకోవచ్చు. లక్ష్యం లక్ష్యం అని ఊదరగొట్టొద్దు. మంచి లక్ష్యాన్ని మాత్రమే ఎన్నుకొనండి అని చెప్పాలి. ఈ మంచి అనే అనే పదం లేకుంటే ఒకరి లక్ష్యానికి మరొకరి లక్ష్యానికి వైరుధ్యాలు యేర్పడతాయి.

    ఉదాహరణకు ఒకాయన పెట్టుబడి సంపాదించి పారిశ్రామిక వేత్తగా పాలిథీన్ కవర్లు తయారు చేస్తానంటాడు. ఇంకోకాయన పర్యావణ ఉద్యమకారుణ్ణయి కవర్లను నిర్మూలించాలి అంటాడు. ఇదంతా లక్ష్యాల వైరుధ్యమే.

    కాబట్టి మనిషికి మంచి యేదో నేర్పండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే.

    ప్రత్యుత్తరంతొలగించు