సంకల్ప శక్తి
మనిషిలో - అంటే మన అందరిలో - ముఖ్యంగా మూడు రకాల శ క్తులున్నాయి.
సంకల్ప శక్తి (లేదా ఇచ్చా) శక్తి ; జ్ఞాన శక్తి ; క్రియా (ప్రయత్న లేదా కార్య) శక్తి
మొదట సంకల్ప శక్తిని గురించే చెప్పుకోవాలి. మీలో వున్న అతి గొప్ప, దైవీక శక్తి సంకల్ప శక్తి.
మీ సంకల్పం - మీ జ్ఞాన శక్తి నుండే పుట్టొచ్చు. అయినా - లోకంలో మీ ద్వారా జరిగే ప్రతి పనికి - మీ సంకల్పమే మూలకారణం.
అయితే, జ్ఞానం ఎంత వున్నా - వొక మహత్ సంకల్పం మీలో పుట్టాలంటే - జ్ఞానం మాత్రమే చాలదు. మరేదో - దైవీక సహాయమో లేదా ప్రకృతి సంకల్పమో కూడా తోడుండాలి.
అయితే, జ్ఞానం ఎంత వున్నా - వొక మహత్ సంకల్పం మీలో పుట్టాలంటే - జ్ఞానం మాత్రమే చాలదు. మరేదో - దైవీక సహాయమో లేదా ప్రకృతి సంకల్పమో కూడా తోడుండాలి.
సంకల్పానికి, మామూలు ఇచ్చాశక్తికి కాస్త వేర్పాటు వుంది. సంకల్పం అంటే - దృఢ నిశ్చయం.
యిక - అది జరిగి తీరాల్సిందే. సాధారణ మనిషి అనుకుంటే - అది 'ఇచ్ఛ' కావచ్చు. మహానుభావులనుకుంటే - అది సంకల్పం అవుతుంది. మీ ఇచ్ఛ వెనుక దృఢ నిశ్చయం వుంటే - మీ ఇచ్ఛ కూడా సంకల్పం గా మారుతుంది .
మొట్ట మొదట - సృష్టికి మూల కారణము - పరమాత్మ యొక్క సంకల్ప శక్తే నని వేదాలన్నీ చెబుతాయి.
ఏ సృష్టి జరగాలన్నా - రెండు రకాల కారణాలుండాలి. . (1 ) కారణభూతమైన మనిషో / దేవుడో / మరేదో ప్రాణో వుండాలి. (2 ) కారణభూతమైన వస్తువు - దేనినుండి సృష్టి జరిగిందో - అది వుండాలి.
కాని - ప్రథమ సృష్టి కి రెండు రకాల కారణాలూ దేవుడే నని చెబుతారు.
'సృష్టి' చేసిందీ దేవుడే.
తనలోనుండే ప్రతి వస్తువును, ప్రాణులనూ, అన్నిటినీ సృస్టించాడు.అంటే - కారణభూతమైన వస్తువూ తానే. చేసిన సృస్తికర్తా తానే.
కేవలం తన సంకల్ప శక్తి నుపయోగించి, తనలో నుండే ప్రపంచాన్ని సృస్టించ గలవాడు దేవుడు.
దేవుడు మనిషికి కూడా సంకల్ప శక్తి కొద్దిగా ఇచ్చాడు. ఈ సంకల్ప శక్తితో, దేవుడు ముందే సృస్టించిన వస్తువులతో, మనం కూడా, మరేదైనా నూతన వస్తువులను - సృష్టించవచ్చు.
దేవుడు యివ్వని వస్తువులతో సృష్టి చేయగల శక్తీ మనకి లేదు.
దేవుడు యివ్వని వస్తువులతో సృష్టి చేయగల శక్తీ మనకి లేదు.
అంటే - దేవుడు - మనద్వారా, తన వస్తువులతో - తన సృష్టి కార్యాన్ని కొన సాగిస్తాడన్న మాట. మనిషి వొక్కడే - దేవుడిచ్చిన సంకల్ప శక్తి నుపయోగించి, దేవుడి లాగా సృష్టి కార్యాన్ని చేయగలడన్న మాట. మరే ప్రాణికీ దేవుడు ఈ శక్తిని ఇచ్చినట్టు మనకు కనిపించదు.
మనలో - యిది చెయ్యాలి, అది చెయ్యాలి - అని సంకల్పం ఎలా వస్తుంది. వొకడు యింజనీరు కావాలనుకుంటాడు.
వొకడు సైంటిస్టు కావాలనుకుంటాడు . మరొకడు శిల్పి కావాలనుకుంటాడు .ఎవరెవరో ఏదేదో చేస్తూ వున్నారు. అలాగే - సృష్టించే వాడు వొకడైతే - వినాశన కర్త మరొకడు గా తయారౌతున్నాడు. ఈ సంకల్పాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి?
అన్నిటికీ కారణం మనమేనా? లేదా- దేనికీ కారణం మనం కామా?
ఈ రెండు ప్రశ్నలకు సమాధానం - వేరే వుంది.
భగవద్ గీతలో - ఆత్మైవ బంధు ; రిపురాత్మనః ; అంటాడు శ్రీకృష్ణుడు. యిక్కడ ఆత్మ శబ్దాన్ని - మనసు, మనసు తో బాటు వున్న బుద్ధి గురించి వాడారు.
మనసు - బుద్ధి మాట వినకుండా - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య , భయాలకు లోబడి వుంటే - తన మనసే తన శత్రువుగా వుంటుంది. మనసు బుద్ధి మాట వింటే - అదే మనసే - తనకు గొప్ప మిత్రుడుగా మారుతుంది.
గొప్ప మిత్రుడుగా వున్న మనసు, బుద్ధి మాట విని చేసే సంకల్పాలు - దేవుడి ప్రోత్సాహంతో వచ్చేవిగా వుంటాయి. వాటికి దేవుడి ఆశీర్వాదం కూడా వుంటుంది. సంకల్పం మనదే అయినా - అర్జునుడి వెనుక కృష్ణుడు వున్నట్టు - మన సంకల్పం వెనుక దేవుడు కూడా వుంటాడు.
మనసు బుద్ధి మాట విననిదైతే - కామ, క్రోధ, భయాదులకు - లోబడినదైతే - మన సంకల్పం మనదే. దాని ఫలితాలను మనమే అనుభవిస్తాము. దైవ సహాయం వాటికి వుండదు. మన చుట్టూ - కామ, క్రోధాదులకు కావలసిన వస్తువులెన్నో వున్నాయి. వాటికి బానిసైతే - దేవుడికి దూరమౌతాము.
అం టే - అవేవీ మనకు వద్దా? అన్న ప్రశ్న వస్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నీ పురుషార్థాలే.
కామమూ వద్దనాల్సిందేమీ కాదు. అర్థమూ (డబ్బు, నగలు లాంటివి)వద్దనాల్సిందేమీ కాదు.
అవి బుద్ధికి లోబడి - ధర్మానికి లోబడి అనుభవించాల్సినవి. అంతే. అప్పుడు - అవిచ్చే ఆనందం లో మీకు హాని జరిగేదేమీ లేదు.
నిజానికి కామ శాస్త్రమని - వొక గొప్ప సైన్సు రాయబడింది మనదేశంలో మాత్రమే. అలాగే అర్థ శాస్త్రం కూడా.
సరే. సంకల్పానికి వస్తే - మీరు వొక గొప్ప సంకల్పం చేసుకోండి. పైన చెప్పిన - బలహీనతలని ( భయం లాంటివి) విడిచి పెట్టండి.
మీ సంకల్ప శక్తికి - మీ జ్ఞాన శక్తి, మీ క్రియా శక్తి తోడవుతాయి. మీ సంకల్పం స్వార్థ రహితమైనదైతే - మీకు ప్రకృతి శక్తులన్నీ సహకరిస్తాయి. మీరు ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారవుతారు.
మీ మనసులో మీకు స్వార్థమే లేక పోయినా - మీరు ప్రపంచానికి చేసే మేలుకు ప్రతిగా, మీకు -ఎన్నో రెట్లు మేలు జరుగక మానదు. యిది ప్రకృతి నియమం.
మీలో - ఏ గొప్ప పనైనా చేయ గల, అతి గొప్ప సంకల్ప శక్తి దాగి వుంది.
అది వుపయోగించని నాడు - మానవ జన్మ వృథా అయిపోతుంది.
అది - ఉపయోగిస్తే - సార్థకమయిపోతుంది.
యిది - మీ చేతుల్లో వుంది.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
Really great blog and all of u r articles are excellent
రిప్లయితొలగించండి