7, జూన్ 2011, మంగళవారం

మానసిక వొత్తిడి = మీకు వొక బోనసు = ఉచిత గిఫ్టు


మీరు ఎప్పుడో వొకప్పుడు మానసిక వొత్తిడికి గురి అవుతూనే  వున్నారు.

అందులో - ఈ కాలంలో -మానసిక వొత్తిడి మరీ ఎక్కువై పోతూ వుంది. 

కారణాలు ఎన్నో వున్నాయి.

1 . తెల్లవారి లేచి - మీరు వార్తా పత్రిక చదివితే చాలు - మన రాజకీయ నాయకులు కానీయండి, రక్షక దళమని పేరున్న పోలీసులు కానీయండి,  సాధారణ ప్రజానీకంలో కొందరు కానీయండి. వారు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు - చూస్తే - మానసిక వొత్తిడి తప్పక వస్తుంది. అందుకని - ఈ  విషయంలో విశేషంగా అధ్యయనం చేసిన వారు - చెప్పేదేమిటంటే - తెల్లవారి - న్యూస్ పేపరు చదవకండి. టీ వీ న్యూస్ చూడకండి. ఏం కొంప మునిగిపోదు. చదివితే, చూస్తే  - మీకు కొంతైనా    మానసిక వొత్తిడితప్పక వస్తుంది. 

2   తగ్గని రోగాలు వుంటే -   మానసిక వొత్తిడి వస్తుంది. 

౩. ప్రక్క నున్న మనుషులు -సూటి పోటి మాటలు మాట్లాడే వారైతే - మానసిక వొత్తిడి వస్తుంది.  మీరే -అలా మాట్లాడే వారైతే - వినే వారికీ వస్తుంది; మీకూ వస్తుంది.

4  మన దేశం మరీ యింత మోసంగా వుందే - అనుకుంటే -  మానసిక వొత్తిడి వస్తుంది. 

5 . ఆర్ధిక యిబ్బందులు, సాంఘిక యిబ్బందులు, సాంసారిక యిబ్బందులు   - మరీ  ఎక్కువైతే  మానసిక వొత్తిడి వస్తుంది. 

6 . ఆడవాళ్ళలో  - అత్త గయ్యాళి గానో   , కోడలు సోమారిగానో, మెట్టినింటిలో యిమడనిదిగానో, యింటి ఆడబిడ్డలు, మెట్టినిల్లు వదిలి, పుట్టినింటికి వచ్చి అక్కడి కోడళ్ళను గురించి చెడ్డగా మాట్లాడడమో యిలా చాలా కారణాల వలన  మానసిక వొత్తిడి వస్తుంది. యివన్నీ - చాలా యిండ్లలో  జరుగుతున్నా , చాలా మంది మారడం లేదు. 

7     దేశం లో  పెరిగిపోతున్న - సిగ్గు,ఎగ్గు పూర్తిగా వదిలేసిన, పూర్తిగా బరి తెగించిన  -  లంచగొండి తనాన్ని  చూస్తే -  మీకు మానసిక వొత్తిడి వస్తుంది.

యిలా - ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. వీటిలో - వొక ముఖ్య కారణం - చాలా విషయాల్లో, మనం ఎదురు చూసింది ఎదురు చూసినట్టు జరగక పోవడం చాలా ముఖ్య కారణం. 

ఉదాహరణకు -

(1 ) బస్సు సమయానికి రాలేధనుకోండి  . అరగంటో, గంటో లేటయిందనుకోండి. కాచుకునున్న వారిలో -   చాలా మందికి  మానసిక వొత్తిడి వస్తుంది.బీ పీ పెరిగి పొతుంది.  బస్సు రాకపోతే - మీరేమైనా చేయ గలరా. ఏమీ చేయలేరు.  నిజమే - అవతల, ముఖ్యమైన పనులున్నాయి. అయినా- అటువంటి సమయాల్లో - సంయమనం పాటించడం నేర్చుకోండి.  మీకు బీ పీ రానంత మాత్రాన - నష్టమేమైనా వుందా? లేదు కదా. రావలసిన బస్సు రాలేదు. రాకూడని బీ పీ వస్తే -  ఎవరికి నష్టం.  కనీసం ఈ వొక్క నష్టమైనా రాకుండా - మీరు నివారించ గలరు. ప్రతి  సారీ  - బస్సు  వచ్చేంత  వరకు  - నేను  మానసికంగా ఉల్లాసంగా వుంటాను - అని నిశ్చయం చేసుకోండి. 

(2 )  మీరు పోలీసు స్టేషనుకు వెళ్ళారు లేదా మరేదో ఆఫీసుకు వెళ్ళారు  - ఏదో కంప్లైంటు యివ్వడానికి లేదా మరేదో కారణానికి. వారు మీకు పూర్తిగా సహకరిస్తారా? మీరు ఎన్ని సినిమాల్లో, సీరియళ్ళలో  చూసారు కదా. వారి పద్దతులేవీ మార్చుకోరు. మీరూ వోటు వేసేటప్పుడు యివన్నీ పట్టించుకోరు.  దేశం యిలాగే వుంటుంది. దీనికి బీ పీ పెంచుకుంటారు. శివ ఖేరా గారు అంటారు - మీ ప్రక్క వాడికి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు - వాడితో మీరు సహకరించండి. పది మంది చేరండి. మీకు సమస్య వచ్చినప్పుడు - వారూ సహకరిస్తారు. అప్పుడు మన దేశంలో వుందే - లంచగొండి తనం కాస్తైనా తగ్గుతుంది. మీ, మన అందరి మానసిక వొత్తిడీ తగ్గుతుంది. 

(3 ) పరీక్షల్లో మార్కులు రాలేదని  విద్యార్థులు ఆత్మ హత్య వరకు వెళ్ళుతూ వున్నారు. మార్కులు రావాలంటే - ముందుగా బాగా చదవాలి. చదవకుండా తరువాత మార్కులు రాలేదంటే, లాభమేమిటి. పరీక్షాపత్రాలు దిద్దే  వాళ్లకు వొక మనవి.  మీరు మానసిక వొత్తిడిలో వున్నప్పుడు  దిద్దకండి. దిద్దడంలో - అశ్రద్ధగా దిద్దకండి.  యిది విద్యార్థుల జీవన సమస్య. జ్ఞాపకం వుంచుకోండి.

(4 ) అన్నిటికన్నా  ముఖ్యం - జీవితంలో ఏది జరిగినా - నేను కదలను, ఆదరను, వొత్తిడికి లోను కాను. అన్న మనో భావన మన అందరికీ కావాలి.  ఈ భావన వుంటే చాలు - చాలా రోగాలు రావు. వచ్చినవి మందులు లేకుండా  కూడా నయమయి పోతాయి. నేను చేసే ప్రతి పనిలో - నాకు విజయమే రావాలి,  అపజయం నేను తట్టుకోలేను - అన్న భావన మూర్ఖత్వం; పిచ్చితనానికి సమానం. పని చేయడం మాత్రమే మీ చేతుల్లో వుంది. ఫలితం ఎందరి చేతుల్లోనో వుంది. ఉదాహరణకు - మీరు ఆస్పత్రికి పోవచ్చు. ఫలితం డాక్టరు చేతుల్లో వుంది. డాక్టరు మందులీవచ్చు.  ఫలితం మందుల తయారీ వాడి చేతిలో వుంది. వాడి మందులు తనిఖీ చెయ్య వలసిన అధికారుల చేతిలో వుంది.  మందులివ్వవలసిన  నర్సు చేతుల్లో వుంది. రోగాలొస్తే - మన జీవితం యిలా యిందరి చేతుల్లోకి వెళ్లి పోతుంది. 

మీ పిల్లలకు - 90 శాతం రాలేదా. పరవాలేదు. ఏం కొంప మునగదు. మన దేశంలో - 90   శాతం వచ్చిన వారిలో 50   శాతం క్లర్కులు గా స్థిరపడుతున్నారు  . మిగతా వారు (డబ్బున్న వారు) పై చదువులకు వెళ్లి ఆఫీసర్లవుతున్నారు. 60 శాతం  కంటే - తక్కువ వచ్చిన వాళ్ళు బిజినెస్సులలో స్థిరపడుతున్నారు. చదువు రాని వారు -  ఎంతో మంది రాజకీయాలలోకి వెళ్లి - వాళ్ళు  బాగుపడి, దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు చెబుతున్నానంటే - 90 శాతం రాకపోతే -  మునిగిపోయేదేమీ లేదు. మీరూ, మీ పిల్లలూ మానసిక వొత్తిడికి గురి కావలసిన అవసరం లేదు.


ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం మానసిక వొత్తిడి - మీకు మీరుగా, మీరే అనుకుని, బోనసుగా, ఉచితముగా ,  మీరే కొని తెచ్చుకుంటున్న - అతి పెద్ద రోగం; రోగం కాని రోగం; రోగాలన్నిటికీ మూలమయిన రోగం. ఏ మందులకూ తగ్గని రోగం. మీ చేతిలోనే మందు వున్న రోగం.   

వచ్చే ప్రతి రోగం, ప్రతి బాధా, ప్రతి కష్టం - చాలా వరకూ మళ్ళీ వెళ్లి పొయ్యేవే.   పోనివీ కొన్ని వుంటాయి. అవి కూడా - మీరు మానసిక వొత్తిడి  తెచ్చుకోకుంటే, చాలా వరకూ తగ్గుతాయి. లేకున్నా పెద్దగా బాధ పెట్టవు.  మానసిక వొత్తిడి తెచ్చుకోవడమా, మానడమా - అనేది చాలా వరకూ మీ చేతుల్లోనే వుంది. 


మీరే చూడండి. వొకే రకం కష్టానికి - కొందరు - అస్సలేమీ బాధ పడరు. చేయ వలసినదేదో చేసి ఊరుకుంటారు.  కొందరు, చేసి, బాధపడుతూ వుంటారు. కొందరు - చేయకుండా - కూడా బాధ పడరు. కొందరు - చేయకుండా బాధ పడుతూ వుంటారు. అన్ని రకాల మనుషులూ వున్నారు కదా. మరి ఏది మేలంటారు.

చేయ వలసింది చేసి - మానసిక వొత్తిడి తెచ్చుకోకుండా వుండ గలరు. ఎంతో మంది వున్నారు కదా. మీరూ వుండ గలరు. మీరు అనుకుంటే.  

మొదట చిన్న చిన్న విషయాల్లో చేయండి. మీ పెన్ను దొరకలేదనుకోండి. వొత్తిడి లేకుండా ఉల్లాసంగా వెదకండి. దొరికిన పెన్ను రాయలేదనుకోండి. మళ్ళీ అదే లాగా, వేరే పెన్ను కోసం, ఉల్లాసంగా, వెదకడానికి ప్రయత్నం చేయండి. పప్పులో ఉప్పు లేదనుకోండి. ఈజీ గా తీసుకుని - ఉప్పు వేసుకోండి. యిలా చిన్న విషయాల్లో ప్రారంభిస్తే - సులభంగా - వొత్తిడి లేని జీవన శైలిని - మీరు పాటించ గలరు. యిది మీకు అనుభవమైతే - ప్రతి విషయంలోనూ - పెద్ద విషయాల్లో కూడా - అదే మానసిక స్థితిలో - ఉల్లాసంగా - పనులు చేసుకోగలుగుతారు.    చేసుకోలేక పోయినా బాధ పడరు.

1  దారి చివర వున్నా బిచ్చగాడికి లేని వొత్తిడి మీకెందుకు?

2 .జెయిల్ లో వున్న వారికి లేని  వొత్తిడి - మీకు  ఎందుకు?

3  కాళ్ళు, చేతులు, కండ్లు లాంటివి లేని వారికి లేని  వొత్తిడి - మీకు ఎందుకు?

4 . అస్సలు చదువే రాని వారికి లేని - వొత్తిడి మీకు ఎందుకు? 

5 . దేవుడు - మీకేన్నో ఇచ్చాడు. కొన్ని యివ్వలేదు. దేవుడు ఎవరికీ అన్నీ యివ్వ లేదు. యివ్వడు. కొన్ని రోగాలు కూడా యిస్తాడు. కొన్ని కష్టాలు కూడా యిస్తాడు. అది మీరు ఎలా తీసుకుంటారో చూడటానికే. దేవుడా- నేను నిన్ను అన్నీ అడుగుతాను. కానీ, నువ్వు, ఏమిచ్చినా, బాధ పడను - అనండి. ఏమిచ్చినా సంతోషం గానే  వుంటాను అనండి. చూద్దాం.అంటే మానసిక వొత్తిడికి - మందు మీలోనే వుంది. వొత్తిడిని సృష్టించే వారు  మీరే. మందూ మీ మనసులోనే వుంది. 

ప్రయత్నం చేయండి. సఫలీకృతులౌతారు.


= మీ

వుప్పలధడియం విజయమోహన్

1 కామెంట్‌: