3, జూన్ 2011, శుక్రవారం

సంతోషపడటానికి = ఆనందంగా వుండటానికి = ఏం కావాలి మీకు ?


 

మానవ జీవితం చాలా చిత్రమైనది. మన జీవితం ఎందుకిలా పోతోందో మనకు తెలీదు. మరెలా వెళ్ళ  గలదో మనకు తెలీదు. రేపు ఏమవుతుంధో మనకు తెలీదు.

ప్రతి వొక్కరు మన పట్ల స్నేహ భావం కలిగి వుండాలని మన ఆశ. కాని - ప్రతి వొక్కరి పట్ల - మనం అలాగా వుండ గలుగుతున్నామా - లేదు గదా.

మనకు నూటికి నూరు మార్కులు రావాలని - మన ఆశ. కాని - దానికి కనీసం 5 , 6 గంటలు చదవాలంటే - మనకి యిష్టం లేదు. 

మనకు బాగా బలం వుండాలని మన ఆశ.  కాని - దానికోసం - ప్రతిదినం, కనీసం వొక గంట పాటు - దానికి 'కావలసిన' శారీరక పరిశ్రమ చేయడానికి బద్ధకం. 

బ్రూస్ లీ లాగానూ వుండాలి. ఆర్నాల్డ్ లాగానూ వుండాలి. కుదురుతుందా?  

కావలసినంత డబ్బు రావాలి. ఎలా వస్తుందో తెలీదు.
సంతోషంగా వుండాలి. ఎలాగో తెలీదు.

మనకు ఎన్నో కావాలని వుంది. ముఖ్యంగా - మనకు ఏం కావాలో - మనకు తెలీదు.

యిదీ - ప్రపంచంలో - చాలా మంది కున్న సమస్య.

మీ సమస్యలన్నిటినీ వొక ప్రక్కన వుండనీయండి.  

చెట్టుక్రింద గోచి పాత తో ఉన్న బిచ్చ గాణ్ణి కాస్త  గమనించండి. వాడికి - మీకున్నవేమీ లేదు. అయినా, వాడు - మీకంటే  సంతోషంగా వున్నాడు.

బ్రూస్ లీ కంటే సంతోషంగా వున్నాడు. ఆర్నాల్డు కంటే - అంబానీ కంటే - మన్మోహన్ సింగు కంటే - మీ వూరి యమ్ యల్. ఏ. / యమ్.పీ కంటే ,మినిస్టర్ కంటే సంతోషంగా వున్నాడు.  

మీకు - ఏమున్నా, లేక పోయినా - కనీసం ఆ బిచ్చ్చ గాడిలా - సంతోషంగా వుండ గలరు. అవునా, కాదా?

మీరు ఏ ప్రయత్నం చేసినా - దానిలోనూ - సంతోషంగా - వుండొచ్చు. 

మీకు నూటికి నూరు మార్కులు వచ్చినా - సంతోషమే.కాస్త తగ్గినా సంతోషమే. మరీ తగ్గినా దుహ్ఖం లేదు. 

మీ ప్రయత్నం ప్రకారం వచ్చిన మార్కులు ఎన్నైనా - అవి మీవే. అవే మీవి. మరొకరితో పోల్చుకుంటేనే    - సమస్య. అశాంతి. నేనింతే చేసాను. నాకింతే  వచ్చింది. అనుకుంటే - సంతోషమే గదా. 

బిచ్చ గాడు సంతోషంగా  వుండ గలడు. ఎందుకంటే - వాడు - మీతో తనను పోల్చు కోడు. బ్రూస్ లీ తో పోల్చు కోడు. రాష్ట్రంలో మొదటి వాడుగా వచ్చిన వాడితో పోటీ లేదు. ఏ యమ్ యల్; ఏ తో పోటీ లేదు. పోల్చుకుంటే, వాడికీ - సంతోషం కరువై పొతుంది.  ఉన్న ఆ వొక్కటీ పోగొట్టుకుంటాడు.
పోటీ పడని మనస్తత్వం లో  - ఎప్పుడూ సంతోషమే.
అలాగని - మీ పని  మీరు మానుకో నవసరం లేదు. మీకేదో కావాలని మీ యిష్టం. తప్పు లేదు. మీ మార్గంలో మీ పని మీరు చేయండి. మీ పనిలో - మీరు ఆనందాన్ని పొందండి  . ఎంత ఫలితం వచ్చినా సంతోషంగా - ఆనందంగా వుండండి. 

తన పనిలో ఆనందం పొందే వాడికి - ఫలితం ఏమొచ్చినా - ఆనందమే.  

ఈ ఫలితం వస్తేనే ఆనందం అనుకుంటే - పనిలో ఆనందం ఎగిరి పోతుంది.  జీవితమంతా - అశాంతి మయం - అయిపోతుంది.  ఫలితం వచ్చినా - ఆ ఆనందం కూడా - ఆ క్షణానికే పరిమితం అయిపోతుంది.  మళ్ళీ - మరేదో కావాలని , మరేదో చేయాలనే - తపన. 

జీవితంలో - ఎప్పుడూ - రేసు గుర్రంలా  - ప్రతి వొక్కరితో  పోటీగా  పరుగిడుతుంటే మాత్రం - మీ జేవితం ఎల్లప్పుడూ - పరుగే కానీ - ఆనందం వుండదు.

పరుగు  నిలిస్తేనే  ఆనందం. పది నిమిషాలు పరుగెడితే - యిరవై నిమిషాలైనా - నిలవాలి. మంచి గాలి పీల్చుకోవాలి. మన పరుగులోని - అనుభవాలను అనుభవించాలి. ఆనందించాలి.

యిది వస్తేనే ఆనందం; అది అలా అయితేనే ఆనందం - గెలిస్తేనే ఆనందం - అనుకుంటే - మీ జీవితంలో - ఎప్పుడూ ఆనందంగా వుండలేరు. 

వొక్క సారి గమనించండి.
ఈ నిమిషంలో - మీరు ఆనందంగా వుంటే - వద్దనే వాళ్ళెవరు? ఎవరూ లేరు. మీరు తప్ప. 

ఆనందంగా వుండడానికి - కారణమే అక్కర లేదు. 

చిన్న పాపను చూడండి. నిద్రలో కూడా, చాలా అందంగా , ఆనందంగా,  చిరునవ్వు నవ్వుతూ వుంటుంది. 

ఎందుకు ఆ నవ్వు.?  ఎందుకు  ఆ ఆనందం?

ఆ పాపకు నూటికి నూరు మార్కులు వచ్చాయనా? రాష్ట్రంలో మొదటిది గా వచ్చిందనా  ? ఖరీదైన బట్టలు వేసుకుందనా ? చాలా చాలా డబ్బు వుందనా?  అవేమీ కాదు కదా!

మరెందుకు ఆ ఆనందం? 

ఎందుకో తెలుసా? మీ స్వభావమే - ఆనందం. మీ ప్రకృతి ఆనందం. మీలో అంతు లేని ఆనందం వుంది. 

  పాప ఏడిచేది ఎప్పుడో తెలుసా? బయటి వస్తువు కావాలనుకున్నప్పుడు. 

తనలోని, తన ఆనందాన్ని మరిచిపోయినప్పుడు. 

మీరూ అంతే. 

బయటి వస్తువు కావాలనుకున్నప్పుడు;  అది లేక పోతే, ఆనందం లేదనుకున్నప్పుడు;  అప్పుడు మీలో అశాంతి.

అయిదు నిమిషాలు పరుగెత్తి వచ్చి - యింట్లో నేల పై పడుకుంటే -  మహా ఆనందం.

అయిదు నిమిషాలు మీ స్నేహితుడితో  మాట్లాడితే ఆనందం. ఆట్లాడితే   ఆనందం.

మనసులో - అది కావాలి, యిది కావాలి - అన్న అశాంతి లేకుండా -ఏ పని చేసినా ఆనందమే. 

ఆనందం మీలో వుంది. మీరు ఎప్పుడైనా ఆనందం గా వుండచ్చు.

అశాంతి - బయట ఉన్న ప్రతి దాని లోనూ - కాస్తో, కూస్తో  వుండనే వుంది. ఏది కావాలనుకున్నా  - దానితో  బాటు - కాస్త అశాంతి కూడా - మీకు  వచ్చి చేరుతుంది. 

అశాంతి విడిచి పెట్టటం మీ చేతుల్లో వుంది.  ఆనందంగా వుండడం మీ చేతుల్లో వుంది. 

మీరు ఆనందంగా వుండడానికి  - పెద్ద కారణం అక్కర లేదు.
చిన్న చిన్న విషయాలకు - ఎంతో - ఆనందంగా వుండొచ్చు.  అది మీ యిష్టమే.

ఆకాశాన్ని - చూస్తే ఆనందం గా వుండచ్చు. నీళ్ళను చూస్తే ఆనందం గా వుండచ్చు. చెట్లను చూస్తే ఆనందం గా వుండచ్చు. చంద్రుడిని చూస్తే ఆనందం గా వుండచ్చు. నక్షత్రాలని చూస్తే - ఆనందంగా వుండచ్చు . వీటికి డబ్బేం అవసరం లేదు.

ఇక్కడినుండి, వొక్క ప్లేనులో - దుబాయికి వెళ్లి - అక్కడి ఆకాశమూ, నీళ్ళూ చూసి సంతోష పడే ధనవంతుడి కన్నా - మీ యింటి పై మీరు పడుకుని మీ యింటి పై ఉన్న ఆకాశము, మీ యింటిపై ఉన్న చంద్రుడు, నక్షత్రాలూ  చూసి సంతోష పడడం ఎంతో  మెరుగు. మీ సంతోషమే చాలా చాలా గొప్ప. 

సంతోషపడటానికి - మనసులో -  కాస్త చోటుండాలి.   అంటే - సంతోష పడ గలిగే, పడే, అలవాటున్న మనసుండాలి .

మనసు ఖాళీ లేదనుకోండి - సంతోషానికి స్థలం లేదు. అంతే.
 
 మరి - మీ యిష్టం.


= మీ

వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి