4, మార్చి 2017, శనివారం

భగవద్ గీత (12) - సాంఖ్య యోగము - 2.24,25 -పంచ భూతాలకు మన చింతనకు అందనిది ఆత్మ(దేహి) . ఎలా అర్థమవుతుంది అది ?



 

భగవద్ గీత (12)


  

 రెండవ అధ్యాయము  

 సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం.    


అయిదు నుండి పదవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి, దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ) యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. పదకొండవ వ్యాసంలో - 'ఆత్మను ఆయుధాలు, అగ్ని, నీరు, గాలి, లాంటి పంచ భూతాలు ఏమీ చెయ్యలేవు కానీ, శరీరాన్ని ధరించిన ఆత్మ, ఆ శరీరం జీర్ణించి, పనికిరాక పోయినపుడు, చిరిగిపోయిన వస్త్రాలను పారవేసి క్రొత్త వస్త్రాలను మనం ధరించినట్లు, మరో శరీరాన్ని ధరించడానికి వెళ్ళిపోతుంది' అని తెలుసుకున్నాము.  సాంఖ్య యోగపు 24, 25 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"చ్చే ద్యోయమదాహ్యోయం అక్లే ద్యోశోష్య  ఏవ చ
నిత్యహ్ సర్వగతః  స్థాణుహ్ అచలేయం సనాతనః ||  (2. 24)


అచ్చేద్యః  = ఛేదింపలేనిది, వించబడనిది ; అయం = యీ (ఆత్మ); అదాహ్య   = కాల్చలేనిది ; అయం   = యీ (ఆత్మ) ; అక్లేద్యః  = తడుపలేనిది ; అశోష్యహ్    = ఆరబెట్టలేనిది ; ఏవ    = మరియు ; = మరియు నిత్యహ్  = ఎల్లప్పుడూ వుండు ; సర్వగతః   = అన్నిచోట్లా వుండునది ; స్థాణుహ్   = స్థిరమైనది  ; ఆచలః   = చలించనిది, కదలకుండా వుండునది   ; అయం  = ఈ ఆత్మ ; సనాతనః = ఆత్యంత పురాతనమైనది; 'ఆది' అంటూ లేనిది ;

  
"ఈ ఆత్మ ఎవరూ వించలేనిది, గాయపరచలేనిది మాత్రమే కాక, నీటిచే తడుపబడదు, గాలిచే ఆర్పబడదు, అత్యంత పురాతనమైనది, ఆద్యంతాలు లేనిది, ఎల్లెడలా(అన్నిచోట్లా)ఉండునది, కదలిక లేకుండా, స్థిరంగా వుండునది. "


23 వ శ్లోకంలో చెప్పిన విషయాన్నే, యిక్కడ  మరొక మాటు, మరో రకంగా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు? దేహం యొక్క అనిత్యత్వం, దేహి యొక్క నిత్యత్వం అర్జునుడికి, మనకు క్షుణ్ణంగా అర్థం కావాలి.  

దేహం పంచభూతాలనుండి వచ్చినది, వాటికే చెందినది, ప్రతి క్షణమూ, దేహానికి, పంచభూతాలకు మధ్య యిచ్చి, పుచ్చుకోవడం జరుగుతూనే వు న్నది,  దేహం యొక్క పుట్టుక, పెరుగుదల, తరుగుదల, మరణమూ అన్నీ పంచ భూతాల ప్రభావం వలన  జరుగుతున్నవి, ఒక దేహం మరణిస్తే, అది వదిలేసి, దేహి మరో క్రొత్త  శరీరం ధరించడానికి వెళ్లి పోతున్నది - యివన్నీ దేహము యొక్క లక్షణాలు.  

దేహి (ఆత్మ) - దేహం కంటే  ఎంతో విలక్షణమైనది.  అది ఆద్యంతాలు లేనిది, సర్వత్రా వ్యాపించి వున్నది, అచలమైనది, స్థిరమైనది, అత్యంత పురాతనమైనది.    

అయినా - దేహి దేహాన్ని ఆశ్రయించుకుని వుండడంతో పరమార్థం యేమిటి?  దేహి, దేహం ద్వారానే - ప్రపంచాన్ని తెలుసుకోగలడు, అనుభవించగలడు, చివరికి, దేహం ద్వారానే మోక్షాన్ని కూడా పొందగలడు. దేహం అశాశ్వతం అయినా దేహం ద్వారానే, దేహి సకల కార్యాలనూ, లక్ష్యాలనూ సాధించ గలడు.    జ్ఞాన సముపార్జనకు, కర్తవ్య సాధనకు దేహికి దేహం ఒక ఆయుధం, ఒక పనిముట్టు.  యివన్నీ దేహం ద్వారా తానే చేసినా, దేహిలో ఏ మార్పులూ రావు,  తాను  అచంచలంగా, స్థిరంగా వుంటాడు. 

క్కడ మరో సందేహానికి కూడా, శ్రీకృష్ణుడు సమాధానమిస్తున్నాడు. దేహి, యీ ఒక్క దేహంలోనే  వున్నాడా? మరెక్కడైనా కూడా వున్నాడా? దేహి ఆయుర్దాయం ఎంత? మోక్షం అంటున్నాము కదా. ఆ తరువాత దేహి ఏమౌతాడు?

దేహి మార్పులే లేనివాడు. మోక్షం అంటే - దేహాన్ని గురించి, తనను గురించి సరైన అవగాహన తెచ్చుకోవడం, ప్రకృతిని, ప్రపంచాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవడం, ప్రకృతి  ప్రభావం నుండి, దాని మాయ నుండి బయటపడడం - అంతే.    

అజ్ఞానం  అనేది ప్రకృతి ప్రభావానికి లోనవడం జ్ఞానం అనేది ప్రకృతి ప్రభావానికి లోనుండి బయటపడడం - అంతే. జ్ఞానమే మోక్షం. జ్ఞానం తర్వాత మనమెక్కడికీ పోము, యిక్కడే వుంటాము. ఆ తరువాత మనం ప్రకృతి మాయతో ఆడే ఆట మరో రకంగా వుంటుంది. మనకు కావాలంటే -  పెట్టుకోవచ్చు. లేదంటే, విడిచెయ్యవచ్చు.    

దేహి సర్వగతుడన్నాడు శ్రీకృష్ణుడు. అది అన్ని చోట్లా వుంది. విశ్వమంతటా వుంది. అంటే - ప్రపంచమంతటా వుండేది వొకే ఆత్మనా? అనేక ఆత్మలా? కే ఆత్మ అయితే మీరూ, నేనూ ఒకటేనా, వేరు వేరా? అనేక ఆత్మలైతే, అన్నీ ప్రపంచమంతటా ఎలా వుంటాయి? యివన్నీ సందేహాలే కదా. చూద్దాం, శ్రీకృష్ణుడేమంటాడో?  


శ్రీకృష్ణుడు జ్ఞాని. ప్రకృతి మాయనుండి బయట పడిన వాడు. అయినా, ప్రకృతితో ఆడుకుంటున్న వాడు.  ఆయన ఆట వేరు. అర్జునుడు యింకా జ్ఞానం రాని వాడు. ప్రకృతి మాయలో అమితంగా బాధ పడుతూ వున్న వాడు.  రాగ ద్వేషాల మధ్య నలిగి పోతున్న వాడు. అర్జునుడు తన దేహము తో పూర్తిగా తనను సంబంధించుకున్న వాడు,అన్వయించుకున్న వాడు. భీష్మ, ద్రోణుల లాంటివారిని కూడా పూర్తిగా దేహపరంగా చూస్తున్న వాడు. దేహాన్ని గురించి కానీ, దేహిని గురించి కానీ  సరైన జ్ఞానం లేని వాడు. 

శ్రీకృష్ణుడు మహా జ్ఞాని, విశ్వానికంతటికీ, ప్రకృతి కంతటికీ అధిపతి. అటువైపున్న, భీష్ముడు కూడా జ్ఞాని, భక్తుడు. శ్రీ కృష్ణుడు పరమాత్ముడి అవతార మని తెలిసిన వాడు. వీరిరువురికి - ఈ యుద్ధం ఎలా పోతుందో తెలుసు. అర్జునుడు  భక్తుడు, ప్రేమాస్పదుడే కాని  జ్ఞాని కాదు. ఈ జ్ఞానం అతనికీ బోధించాలి. రాబోయే కలియుగంలో, మన లాంటి వారికి సులభంగా అర్థం అయ్యేలాగా కూడా చెప్పాలి.  


ఇంత  చెప్పినా, మనకు పూర్తిగా అర్థం కావడం కష్టం. అందుకనే శ్రీకృష్ణుడు యింకా వివరంగా ఆత్మ స్వరూపాన్ని బోధిస్తున్నాడు 25 వ శ్లోకంలో .



శ్రీకృష్ణుడి మాట : 

 "అవ్యక్తోయమచిన్త్యోయం అవికార్యోయముచ్యతే   | 
తస్మాదేవం విదిత్యైనం నానుశోచితుమర్హసి         || (2. 25) 


అవ్యక్తం = వ్యక్తము కానిది , పంచేద్రియాలకు తెలియనిది ;  అయం = యిది (యీ ఆత్మ) ; అచింత్యం  = చింతనకు, ఆలోచనకు అందనిది ; అయం = యిది (యీ ఆత్మ) ; అవికార్యహ్ = వికారాలు, మార్పులు లేనిది ; అయం = యిది (యీ ఆత్మ) ; ఉచ్యతే = అని చెప్పబడినది ; తస్మాద్ = అందువలన ; ఏవం  = ఈ విధంగా ; విదిత్వా  = తెలుసుకున్న తరువాత ; ఏనం = యిది ; న = కాదు ; అనుశోచితుం = దుఃఖపడడానికి ; అర్హసి =  అర్హత కలిగినది. 


"ఈ ఆత్మ అవ్యక్తమైనది, ప్రకృతి చేత, పంచేంద్రియాల చేత మన అనుభవం లోనికి రానిది, మన చింతన చేత, ఆలోచన చేత మనకు అందనిది - అని మొదటి నుండి  జ్ఞానుల చేత చెప్ప బడినది. ఆత్మను యిలా క్షుణ్ణంగా తెలుసుకున్న వారికి ఈ ఆత్మ ను గురించి దుఃఖ పడడానికి ఏ కారణమూ లేదు. ఆత్మను గురించి దుఃఖపడ్డానికి ఏ అర్హతా ఎవరికీ లేదు "


ఆత్మ నిత్యత్వాన్ని, పంచ భూతాలకు ఆత్మకు వున్న  సంబంధము, భిన్నత్వము రెండింటినీ  మళ్ళీ, మరో రకంగా చెబుతున్నాడు యీ  25 వ శ్లోకంలో. ఆత్మ అవ్యక్తమైనది - అంటే మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తమైనది - అంటే, మన పంచేద్రియాలలో ఏదో ఒకటితో మనం దాని ఉనికిని తెలుసుకోగలం. అది ఎప్పుడో వ్యక్తమైనది, అంటే, ఎప్పుడో పుట్టినది, అని చెప్పుకోవచ్చు. పుట్టేదేదైనా, మన ఇంద్రియాలకు  ఎంతో  కొంత, ఏదో రకంగా తెలుస్తుంది.  కంటికి తెలీని బాక్టీరియా, వైరస్ లు కూడా, దేహంలో  రోగాలు కలిగించేటప్పుడు వాటి ఉనికి మనకు తెలుస్తుంది.   




ఆత్మ పంచ భూతాలకు గానీ, వాటి వలన చేయబడిన పంచేంద్రియాలకు గానీ అందదు. సూక్ష్మ శరీరమైన మనసుకు గానీ, అందులో పుట్టే ఆలోచనలకు గానీ అందదు. ఆత్మలో ఎటువంటి మార్పులూ, ఎప్పుడూ జరగవు.


ఇప్పుడు ప్రశ్న - నేను దేహమా, దేహినా. నన్ను నేను దేహితో అన్వయించుకుంటే - నాకు ఎటువంటి ఆపదా ఎప్పుడూ లేదు.  ఎటువంటి మార్పూ ఎప్పుడూ వుండదు. మరి నేను నన్ను (ఆత్మ స్వరూపుడిని) గురించి చింత పడవలసిన అవసరం ఏముంది ?    

మనం, మనల్ని దేహంతో అన్వయించుకుంటే - అదే సాధారణంగా మనం చేస్తున్న పని. ఈ అన్వయమే అజ్ఞానం వలన  చేసే అన్వయం. అయినా, దేహం తో అన్వయించుకుంటే  కూడా, దుఃఖ పడాల్సిన అవసరం లేదంటున్నాడు శ్రీకృష్ణుడు , ముందు ముందు వచ్చే శ్లోకాలలో. 

యివన్నీ శ్రీకృష్ణుడు, అర్జునుడి దేహానికి, మనస్సుకే గా చెప్పగలుగుతున్నాడు. అర్జునుడి ఆత్మ స్వరూపుడికి కాదు కదా. అర్జునుడి మనస్సుకు యిది అర్థమైతే చాలా? 


జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ  ఎవరికి కావాలి, ఎవరికి వుంది? దేహికా, మనస్సుకా, దేహానికా? దేహానికి, మనస్సుకు జ్ఞానం బోధిస్తే, దేహికి జ్ఞానం ఎలా వస్తుంది? మన ఆలోచనకు, చింతనకు ఆత్మ అందదు అన్నాడు. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? చింతనకు అందదు అన్నదానిపై మనం చింతిస్తున్నాము. ఇన్నీ కూడా, మనకు అర్థం అయ్యేటట్లు, శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. 



మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ  వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత, మరింత  స్పష్టత  కావాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ స్పష్టత మనలో వస్తే, తప్పకుండా, నిస్సందేహంగా మన సంతోషం చాలా, చాలా పెరుగుతుంది. మన భయాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ పోతాయి. 
 

ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి