భగవద్ గీత (13)
రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం.
అయిదు నుండి పండ్రెండవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ) యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. సాంఖ్య యోగపు 26, 27 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం చెప్పబోతున్నాడో చూద్దాం.
అయిదు నుండి పండ్రెండవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ) యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. సాంఖ్య యోగపు 26, 27 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం చెప్పబోతున్నాడో చూద్దాం.
శ్రీకృష్ణుడి మాట :
"అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం |
తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి || (2. 26)
అథ = యిప్పుడు ; చ = మరియు ; ఏనం = యీ (ఆత్మ); నిత్యజాతం = ఎల్లప్పుడూ పుట్టునది ; నిత్యం = ఎల్లప్పుడూ ; వా = అది కాకుంటే ; మన్యసే = ఆలోచించి చూడు ; మృతం = చనిపోయినది ; తథా అపి = అప్పుడు కూడా, అయినా కూడా ; త్వం = నీవు ; మహాబాహో = గొప్ప బాహు బలము కలిగిన ఓ అర్జునా ; న = కాదు ; ఏనం = యీ (ఆత్మ) ; శోచితుమ్ = దుఃఖించుటకు ; అర్హసి = అర్హత లేనిది ;
"గొప్ప బాహుబలము కలిగిన ఓ అర్జునా ! యోచన చేసి చూడు. ఒక వేళ యిది (ఆత్మ ), ఎప్పుడూ పుడుతూ, చస్తూ వుండేదే అని నీకు అనిపిస్తే , అప్పుడు కూడా, దీనిని గురించి నీవు విచారపడడానికి దీనికి అర్హతే లేదు కదా. "
25 వ శ్లోకం వరకు చెప్పినవన్నీ శ్రీకృష్ణుడి స్వంత మాటలు, తనకు బాగా తెలిసిన విషయాలు చెప్పాడు. యిప్పుడేమంటున్నాడు? అర్జునా! నా మాటల పైన నీకు ఇంకా నమ్మకం కుదరలేదు, అనుకుందాం . యిది (అంటే ఆత్మ) ఎల్లప్పుడూ చస్తూ, పుడుతూ వుండేటట్లుగానే, నీ కళ్ళకు, నీ మనస్సుకు అనిపిస్తూ వుందనుకుందాం . అప్పుడు కూడా దీన్ని గురించి నువ్వు దుఃఖించడానికి, అర్హత వుందా? లేదు కదా .
అర్జునుడికి యింకా దేహం, దేహి ల మధ్య గల తారతమ్యం అర్థం అయివుండక పోవచ్చు. దేహం కనిపిస్తున్నది. తన అనుభవం లో వున్నది. ఈ దేహి అనుభవం లో లేనిది. కృష్ణుడు దాన్ని గురించి ఏదేదో చెబుతున్నాడు. దానికి చావు, పుట్టుకలు లేవు - అంటున్నాడు. మార్పే లేదు అంటున్నాడు. దేహం పడిపోతే, అది క్రొత్త దేహం వెదుక్కుంటూ పోతుందట. మరి దానికి ఆకార,వికారాలేవీ లేవట. ఇదెలా సాధ్యం?
మనం చస్తున్నాము, పుడుతున్నాము. అంత మాత్రమే నాకు తెలుసు. అంత మాత్రమే నా అనుభవం లో వుంది - అని అర్జునుడి మనస్సులో అనిపిస్తూ వుండవచ్చు. కృష్ణుడు ఆత్మ గురించి చెప్పిన చాలా విషయాలకు ప్రత్యక్ష ప్రమాణం లేదు. పరోక్ష ప్రమాణమూ కనిపించడం లేదు. ఎలా విశ్వసించడం? ఇటువంటి భావనలు అర్జునుడి మనస్సులో తలెత్తి వుండవచ్చు.
ఈ సందేహాలను సైతం పారద్రోలడానికే కృష్ణుడు, యీ మాటలు చెప్పాడు. ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుతూ, చస్తూ వుండేదని నీవనుకుంటున్నట్లయితే, అప్పుడు కూడా, దానిని గురించి దుఃఖపడనవసరం లేదు కదా - అని అంటున్నాడు .
శ్రీకృష్ణుడికి తెలుసు - ఆత్మజ్ఞానం రావడం ఎవరికైనా అంత సులభం కాదు. పంచేంద్రియాలకు, మనసుకు కూడా అతీతమైంది, అంటే, మానవులకు పూర్తిగా అనుభవాతీతమైనది ఆత్మ. దాన్ని గురించి తెలుసుకోవాలంటే, అది అనుభవం లోకి రావాలంటే, ఎంతో సాధన అవసరం. కొన్ని మాటలతో , అది శ్రీకృష్ణుడే చెప్పినా సరే , అనుభవం లోకి రాదు. అందుకనే , శ్రీకృష్ణుడు అన్ని రకాల తర్కాలతో, అర్జునుడిని మొదట కర్తవ్యోన్ముఖుడుగా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆత్మ శాశ్వతము అనుకుంటే దాన్ని గురించి దుఃఖించనవసరం లేనే లేదు. అది ఎల్లప్పుడూ పుడుతూ, చస్తూ ఉండేది అనుకున్నా దానికోసం దుఃఖించనవసరం లేదు. దేహం సంగతి తెలిసే వుంది. అది చావడం తథ్యం. మరి నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావు అర్జునా - అంటున్నాడు, శ్రీకృష్ణుడు.
దేహాన్ని గురించి యింతకు ముందూ చెప్పాను. మళ్లీ చెబుతాను విను, అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు తరువాతి శ్లోకంలో.
శ్రీకృష్ణుడి మాట :
"జాతస్య హి ధృవో మృత్యుహ్ ధృవం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి || (2. 27)
జాతస్య = పుట్టిన అందరికీ ; హి = నిజముగా ; ధ్రువః = నిశ్చయముగా ; మృత్యుహ్ = మరణము ; ధృవం = నిశ్చయము ; జన్మ = పుట్టుక, జననము ; మృతస్య = మరణించిన ప్రతి ఒక్కరికీ ; చ = మరియు ;తస్మాద్ = అందువలన ; అపరిహార్యే = తప్పకుండా జరుగునది, తప్పించలేనిది ; అర్థే = ఈ విషయంలో ; న = కాదు ; త్వం = నీవు; శోచితుం = దుఃఖపడడానికి ; అర్హసి = అర్హత కలిగిన వాడవు.
"చావు అనునది పుట్టిన ప్రతి ఒక్కరికి నిశ్చయముగా సంభవించునది. అదే విధంగా, పుట్టుక అనునది మరణించిన ప్రతి ప్రాణికి నిశ్చయముగా సంభవించునది. ఈ రెండూ ఎవరూ తప్పించలేనివి. కాబట్టి ఈ రెండింటి విషయంలో దుఃఖపడడానికి నీకు (గానీ , మరెవరికి గానీ) ఏ రకమైన అర్హతా లేదు (కారణమూ లేదు). "
ఈ శ్లోకం కూడా, మన నిత్య పారాయణ గీతలో వుండవలసిన ముఖ్యమైన శ్లోకం. యిది సాక్షాత్తూ, శ్రీకృష్ణుడి నోటి వెంట, సందేహాలకు తావు లేకుండా, నిర్దిష్టంగా మనం వింటున్న ముఖ్యమైన విషయం. మనం పుట్టామా? పుట్టాము కాబట్టి ఎప్పుడో వొకప్పుడు తప్పక మరణిస్తాం. మన మరణాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే, మనం మరణించిన తర్వాత తప్పక పుడతాం . అది కూడా ఎవరూ ఆపలేరు. ఈ జనన, మరణాల గురించి దుఃఖపడడం మూర్ఖత్వమే గాని, సకారణమైనది ఏ మాత్రమూ కాదు - అంటున్నాడు, శ్రీకృష్ణుడు.
పుట్టుక గురించి కాదు మన దుఃఖం, మన భయం. చావును గురించే, అవునా. మనం ఎలాగో పుట్టేశాం. ఇక దాన్ని గురించి దుఃఖము, భయము అవసరం లేదు. కానీ, చావడానికి దుఃఖము, భయము - రెండూ వున్నాయి చాలా మందికి . అవి రెండూ అక్కర్లేదు. అవి రెండూనిరర్థకమైనవి, నిర్హేతుకమైనవి. ఎలాగూ పోనే పోతావు. భయపడితే పోవా? దుఃఖపడితే పోవా ? అంటున్నాడు, శ్రీకృష్ణుడు.
భయపడితే, దుఃఖపడితే, చావు రాకుండా ఆపగలమా? అది ఎలాగూ వస్తుంది ; అది యింకాస్తా ముందుగా, అకాలమృత్యువుగా కూడా రావచ్చు. ఈ క్షణం నుండే, మనం సంతోషంగా వుండడం ఆపేస్తాం. చెయ్యవలసిన ముఖ్యమైన పనులు ఆపేస్తాం. మనకూ, మనవారికీ, లోకమంతటికీ భారంగా మారిపోతాం. అదే విధంగా, మన వాళ్ళు కానీ, మరెవరైనా కానీ, చావకుండా, ఏ వైద్యుడైనా ఆపగలడా ? నిశ్చయంగా ఆపలేడు.
మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మరొకరు మమ్మల్ని కాపాడుతారు - అనే మాటలన్నీ హాస్యాస్పదాలు. చావు నుండీ నేను మిమ్మల్ని కాపాడుతాను - అని ఎవరూ అనలేరు. నేను కాపాడుతాను అని ఎవరైనా అని ఉంటే - వాళ్ళే చనిపోయారు కదా. వారు మరొకరిని ఎలా కాపాడుతారు. శ్రీకృష్ణుడు కూడా చనిపోయాడు కదా.
ఇవన్నీ శ్రీకృష్ణుడు, అర్జునుడి దేహానికి, మనస్సుకే గా చెప్పగలుగుతున్నాడు. అర్జునుడి ఆత్మ స్వరూపుడికి కాదు కదా. అర్జునుడి మనస్సుకు యిది అర్థమైతే చాలా?
జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ ఎవరికి కావాలి, ఎవరికి వుంది? దేహికా, మనస్సుకా, దేహానికా? దేహానికి, మనస్సుకు జ్ఞానం బోధిస్తే, దేహికి జ్ఞానం ఎలా వస్తుంది? మన ఆలోచనకు, చింతనకు ఆత్మ అందదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? చింతనకు అందదు అన్నదానిపై మనం చింతిస్తున్నాము. ఇవన్నీ కూడా, మనకు అర్థం అయ్యేటట్లు, శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు.
మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత, మరింత స్పష్టత కావాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ స్పష్టత మనలో వస్తే, తప్పకుండా, నిస్సందేహంగా మన సంతోషం చాలా, చాలా పెరుగుతుంది. మన భయాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ పోతాయి.
ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం.
ఈ వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్
వజ్రాసనం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి