13, మార్చి 2017, సోమవారం

భగవద్ గీత (15) - సాంఖ్య యోగము - 2.30,2.31 - కిసగౌతమి కథ - మరణం శోక భయ కారణం కాదు - స్వధర్మ పాలన అంటే? 

భగవద్ గీత (15)


  

 రెండవ అధ్యాయము  

 సాంఖ్య యోగము 

 భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం.


అయిదు నుండి పదిమూడవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ), దేహాల యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. మహదాశ్చర్యం గొలిపే దేహి యొక్క స్వరూపం విజ్ఞులకు కూడా పూర్తిగా అర్థం కావడం కష్టం, యిది వ్యక్త రూపంలో దేహాన్ని ధరించి, అవ్యక్త రూపంలో దాన్ని విడిచి పెట్టేస్తుంది, మళ్ళీ వ్యక్త రూపం ధరించి  దేహంలో ప్రవేశిస్తుంది - అన్నాడు 14  వ్యాసంలో, 2.28,29 శ్లోకాలలో  శ్రీకృష్ణుడు.  సాంఖ్య యోగపు 30, 31 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"దేహి  నిత్యమవధ్యేయం దేహే సర్వస్య భారత
 తస్మాత్సర్వాణి  భూతాని న  త్వం శోచితుమర్హసి    ||  (2. 30)


దేహి  = దేహములో నివసించి యుండు (ఆత్మ స్వరూపుడు) ; నిత్యం = ఎల్లప్పుడూ   ; అవధ్యేయం  = వధింప లేనిది; నాశనము లేనిది ; దేహే     = దేహమునందు   సర్వస్య = అందరి యొక్క ; భారత  ఓ అర్జున! ; తస్మాత్  = అందువలన   ; సర్వాణి   = అందరికీ ; భూతాని = ప్రాణులు  ; న =  కాదు/లేదు : త్వం  = నీవు ; శోచితుమ్ = దుఃఖ పడుటకు ; అర్హసి  =  అధికారము లేదు (నీకు ); 

  
"భరత వంశజుడైన ఓ అర్జునా !  ఇది/వీడు (సకల ప్రాణుల దేహములలో నుండు ఆత్మస్వరూపుడు) నాశనము లేని వాడు, అవధ్యుడు. అటువంటి అవధ్యుడైన, నాశనమే లేనటువంటి వాడైన 'దేహి' ని గురించి దుఃఖించుటకు, నీకు ఏ అధికారము, అర్హత లేదు కదా!  "


శ్రీకృష్ణుడు  ఒక సారి దేహాన్ని గురించి, మరొక సారి దేహిని గురించి, యిలా  మార్చి మార్చి విశదంగా, వర్ణిస్తూ చెబుతున్నాడు. ఈ జ్ఞానం అంసులభంగా రాదని, శ్రీకృష్ణుడికి తెలుసు. దేహి సకల ప్రాణుల దేహాలలో నివసిస్తూ వున్నాడు. దేహానికి వున్న సిద్ధాంతం - జాతస్యహి ధృవం మృత్యుహ్, ధృవం జన్మ మృతస్యచ.  పుడితే చావాల్సిందే, ఛస్తే పుట్టాల్సిందే. 


కానీ, దేహికి పుట్టుక, చావు, మార్పు లాంటివేవీ లేదు. దేహినెవరూ చంపలేరు. అలాంటి దేహి కొరకు నీవు దుఃఖించడం ఏ  మాత్రమూ విజ్ఞత లేని పని కదా. ఈ ప్రాణులందరూ దేహాల్ని విడిచి మరో దేహం వెదుక్కుంటూ పొయ్యే వాళ్ళే. ఆ దేహాలకోసమూ దుఃఖించ తగదు. వాటిలోపల వున్న దేహి కోసమూ దుఃఖించ తగదు,  అని తన మాటలకు, రకరకాల కారణాలు తోడు చేశాడు శ్రీకృష్ణుడు.  అసలు, మనమైనా, అర్జునుడైనా ప్రపంచంలో దేని కోసమైనా కానీ దుఃఖించ వచ్చా


దుఃఖము అనేదే, అజ్ఞానానికి సంకేతం అన్నారు విజ్ఞులు. అటువంటి దుఃఖానికి ఎప్పుడూ సరైన కారణం లేదు. అది కేవలం మాయా  జనితం,  మాయా ప్రేరితం, అజ్ఞాన జనితం. మరి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా దుఃఖించారు కదా!, అంటారేమో.  అవును. ఆ సమయంలో వారూ మాయామోహితులైన వారే. అజ్ఞానానికి లోబడిన వారే. 


గౌతమ బుద్ధుడి కాలంలో  కిసగౌతమి అనే స్త్రీ వుండేది. ఆమెకు ఒక కొడుకు. అతడు చాలా పసి ప్రాయంలోనే మరణించడం జరిగింది. ఆమె దుఃఖానికి అంతు లేదు.  ఆమె తన కొడుకును ఎలాగైనా బ్రతికించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆమెకు ఎవరో చెప్పారు, 'గౌతమబుద్ధుడు మహాజ్ఞాని, ఆయన దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తే , ఆయన ఏదైనా అద్భుతమైన మందు యిచ్చి, పిల్లవాడిని బ్రతికించ వచ్చు' అని. 
     
ఆమె అలాగే గౌతమ బుద్ధుడి వద్దకు వెళ్లి ఏడుస్తూ, తన కొడుకును బ్రతికించమని కోరింది. గౌతమబుద్ధుడు చిరునవ్వుతో, 'అదెంత పని, కానీ, దానికోసం నువ్వు , నీ  గ్రామంలోకి వెళ్లి పిడికెడు నువ్వులు  తీసుకురా. ఒక్క ముఖ్య విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో. ఎవరింట్లో అయితే, తల్లిదండ్రులు కానీ, కొడుకులు, కూతుర్లు కానీ మరణించ లేదో అటువంటి యింట్లో నుండి మాత్రమే నువ్వులు తేవాలి. తెచ్చిన వెంటనే, మందు తయారు చేసేస్తాను." అన్నాడు. 


కిసగౌతమి సంతోషంతో బయలు దేరింది. గ్రామంలోని ప్రతి యింట్లోకి వెళ్లి పిడికెడు నువ్వులు అడిగింది. ప్రతి ఒక్కరూ యివ్వడానికి సిద్ధమే . కానీ, ప్రతి ఇంట్లోనూ కిసగౌతమి చెప్పే షరతు మాత్రము కుదరడం లేదు. అందరి నోట్లోనూ వొకే మాట. 


'మా యింట్లో బ్రతికున్న వారి కంటే, చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ. మేము ఏం చేయగలం,' అని అంటున్నారు ప్రతి యింట్లో.  ఏ యింటి కెళ్ళినా యిదే మాట. సాయంకాలం చీకటి పడే దాకా ప్రయత్నం చేసి, అది వ్యర్థప్రయత్నం అని తెలుసుకుంది. ఆ తరువాత, ఆమెలో ఆలోచన మొదలైంది. ప్రతి ఒక్కరి యింట్లో, ప్రతి ఒక్కరూ, కొంచం ముందూ, వెనుకా చనిపోతుంటే, తాను మాత్రం, తన చనిపోయిన బిడ్డ మళ్ళీ బ్రతకాలని కోరుకోవడం ఎంత అర్థ రహితమైనదో మెల్లమెల్లగా ఆమెకు అర్థమై పోయింది. ఆ తరువాత, ఆమె, తన బిడ్డకు అంత్యక్రియలు పూర్తిచేసి గౌతమబుద్ధుడు వద్ద  శరణుజొచ్చింది.  ఆయన శిష్యురాలిగా మారిపోయింది.   జననం, మరణం,  యివి రెండూ, ప్రాణుల జీవితంలో తీసివెయ్యలేని అంగాలు. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు, అని బుద్ధుడు బోధించాడు. కృష్ణుడు అంత మాత్రంతో నిలపలేదు. మరణం చెందిన ప్రతి ఒక్కరూ మళ్ళీ పుడతారు, యిది కూడా తప్పనిసరి, అని బోధించాడు. మనము పుట్టాము, అయితే ఎప్పుడో చనిపోతాము, అని మాత్రం అనుకుంటే శోకము, భయము  రావచ్చు. కానీ, యిప్పుడు  చనిపోతున్నాను; మళ్ళీ ఒక మంచి శరీరంతో, ఒక మంచి తల్లిదండ్రులకు పుడతాను, మళ్ళీ, జీవితంలో అన్నీ అనుభవిస్తాను, అని తెలుసుకుంటే, దుఃఖమెందుకు, శోకమెందుకు?  


మన సంస్కృతిలో, యిది గాఢంగా విశ్వసింప బడుతూ వుంది.  పెళ్లి చేసుకున్నప్పుడు, యీ జీవితం, యీ బంధం, 'యేడేడు జన్మల' అనుబంధం అంటాము మనం. ఒకరు చనిపోతుంటే మరొకరు, నేనూ వచ్చేస్తున్నా, మళ్ళీ మనం వొకటవుదాం. నువ్వెక్కడుంటే, నేనూ అక్కడే, అనే, అనుకునే, విశ్వసించే, గాఢంగా కోరుకునే సంస్కృతి మనది.  మళ్ళీ పుడతాం మనం. మళ్ళీ మనమంతా కలుస్తాం - ఏదో ఒక రకంగా. 


కాకపోతే, పెళ్ళాం మొగుడు కావచ్చు. మొగుడు పెళ్ళాం కావచ్చు. తాత మనమడు కావచ్చు. మనమడు తాత కావచ్చు. కానీ, గాఢంగా ఒకరినొకరు కోరుకునే వారు, కే రకమైన మనసు గలవారు, మళ్ళీ దగ్గర దగ్గర పుట్టడం, వింతేమీ కాదు. వావివరుసలు కొంత మారచ్చు. అనుబంధాలు  ఏదో ఒక రకంగా పెరగవచ్చు .  


ఇక్కడ ముఖ్యమైన అంశం ఒక్కటే, మళ్ళీ మనం పుడతాం. అందువలన  ఏడవకు. భయపడకు. అవి రెండూ అనవసరం. దే కృష్ణుడు  చెప్పడం. అర్జునుడికి భయం లేదు. శోకం వుంది. అది కూడా  అనవసరం. 


క్రిందటి వ్యాసం లో చెప్పినట్టు, పుట్టే ప్రతి వాడూ, దేవుడు క్రొత్తగా తయారు చేస్తున్న వాడు కాదు. దేవుడు  ఆ పని చెయ్యడం లేదు, అవసరం లేదు కూడా. చచ్చిన ప్రతి వాడూ మళ్ళీ పుడుతున్నాడు. అంతే. ఎక్కడ, పుట్టాల్సిన అర్హత ఉందో  అక్కడ పుడుతున్నాడు.  అక్కడ, పుట్టి తీరాలి. తప్పదు.


సరే.  పుట్టిన తరువాత నీ కర్తవ్యాలేమిటి న్నది  చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు తరువాతి శ్లోకంలో.     


శ్రీకృష్ణుడి మాట : 


 "స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి
ధర్మ్యాత్  హి యుద్ధాచ్చ్రేయోన్యత్  క్షత్రియస్య న విద్యతే || (2. 31స్వధర్మమ్ = ఒకరి నిశ్చితమైన కర్తవ్యము అపి   = కూడా   ;   = మరియు   ; అవేక్ష్య = చూడడము ; న = కాదు / లేదు ; వికంపితుమ్ కంపించుట,వూగిపోవుట ; అర్హసి  = అధికారము ; ధర్మ్యాత్ = కర్తవ్యము కంటే ; హి  = నిజముగా ; యుద్ధాత్  = యుద్దముకంటె ;శ్రేయహ్ = గొప్పది ;
అన్యత్  = మరొకటి ; క్షత్రియస్ = క్షత్రియుడికి   ; = లేదు / కాదు ; విద్యతే = వున్నది 


" అంతే కాక, నీవు,  నీకై  నిశ్చితమైన, కర్తవ్యమును, ధర్మమును చూచినా , అదా, యిదా    అన్న సందిగ్ధము లో వుండుట తగదు. ఎందుకంటే, నీ లాంటి  క్షత్రియుడికి  ఈ ధర్మ యుద్ధము కంటే మరొకటి శ్రేయస్కరమైనది లేదు . "  


మానవ సమాజం లో  ఒక్కొక్క జాతికీ ఒక కర్తవ్యము, ఒక స్వధర్మము అంటూ వుంటుంది. వారు స్వధర్మ పాలనలో నిష్ఠతోను, నిష్ణాతులు గానూ వుండాలి. అదే, వారికి అన్ని రకాలా  శ్రేయస్సు ను సమకూరుస్తుంది - అంటున్నాడు శ్రీకృష్ణుడు


క్షత్రియుడుగా అర్జునుడి స్వధర్మము ధర్మాన్ని నిలబెట్టడం. అందుకు గానూ జరుగుతున్న యీ మహా భారత సంగ్రామము, అతనికి, అతని స్వధర్మానికి అన్నిరకాల శ్రేయస్కరము. అది అతనికి లభించిన మహదవకాశము. ఇంతకంటే  గొప్ప కర్తవ్యము  అర్జునుడికి మరొకటి లేదు.  కాబట్టి, స్వధర్మ పాలన కోసం, అత్యంత శ్రేయస్కరమైన యీ యుద్ధం అతడు తప్పక చేసి తీరాలని, శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. 


వ్యక్తి గుణగణాలు, చేసే పనిని బట్టే, తానే జాతులను, ధర్మాలను  నిర్ణయించానని,  మరొకచోట  శ్రీకృష్ణుడు చెబుతాడు.   దీనికి పుట్టుకతో సంబంధము ఉన్నట్టు చెప్పలేదు శ్రీకృష్ణుడు. దీన్ని గురించి మరొక చోట విశ్లేషణ చేసుకుందాం. 


అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియ విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. సమాజంలో ధర్మాన్ని నెలకొల్పడానికి క్షత్రియుడే ముందుకు రావాలి. ఈ మహాభారత సంగ్రామము ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరు.  ది అర్జునుడికి దేవుడే యిచ్చిన మహదావకాశము.  అధర్మ నాశనానికి, ధర్మ రక్షణకు బద్ధుడైన అర్జునుడు ఈ యుద్ధం నుండి వెనుదిరిగి పోవడం తప్పు, మంచిది కాదు, హాస్యాస్పదం, ధర్మ లోపం, అని ఎన్నో రకాలుగా శ్రీకృష్ణుడు చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. మనది లక్షల యేండ్ల పూర్వం నుండి వస్తున్న సంస్కృతి .  ఒక్కొక్క యుగానికి కొన్ని ధర్మాలు ఏర్పడుతున్నాయి. కొన్ని మారిపోతున్నాయి. కొన్ని లేకుండా పోతున్నాయి. కృతయుగపు ధర్మాలెన్నో, త్రేతాయుగంలో లేవు. త్రేతాయుగపు ధర్మాలెన్నో ద్వాపర యుగం లో లేవు. ద్వాపర యుగ ధర్మాలెన్నో కలియుగం లో లేవు. అలాగే, యుగ,యుగానికీ క్రొత్త ధర్మాలూ వస్తున్నాయి. 


శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు. శ్రీకృష్ణుడు ఎంతో  మందిని పెళ్లి చేసుకున్నవాడు.  ద్రౌపది అయిదు మందిని పెళ్లి చేసుకోవడం, అది సమాజంలో పూర్తిగా వొప్పుకోబడడం విశేషం. భారత కాలంలో పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడానికి వాడిన మార్గాలు అనేకం. అవన్నీ అప్పట్లో సమాజంలో  వొప్పుకోబడిన ధర్మ మార్గాలు. 

యోజనగంధి మొదట పరాశర మహర్షిని, తరువాత శంతనుడిని పెళ్లి చేసుకుంది. వ్యాసుడు ఆమె గర్భాన పరాశర మహర్షికి పుట్టిన మహాత్ముడు. ఆమెకు, శంతనుడికి తరువాత  పుట్టిన వాళ్ళు క్షత్రియులయ్యారు. ఇలా జరిగిన వాటిని యథాతథంగా చెప్పిన వాడు  వ్యాస మహర్షి.  ఆనాడు, వాళ్ళు ఒప్పుకున్న పద్ధతులను, ఈ నాడు మనం విశ్లేషణ చెయ్యడం కష్టం. విమర్శించడం అసలు అర్థం లేని పని. తెలుసుకోవడం ఒక్కటే బుద్ధిమంతుల  పని. 


మనకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ  వున్నాయి. ఇప్పుడు దేహి, దేహము అనే వాటిని గురించి విడిచి పెట్టి  స్వధర్మాన్ని గురించి మాట్లాడాడు శ్రీకృష్ణుడు. ఈ అన్ని విషయాల్లో మనకు మరింత, మరింత  స్పష్టత  కావాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ స్పష్టత మనలో వస్తే, తప్పకుండా, నిస్సందేహంగా మన సంతోషం చాలా, చాలా పెరుగుతుంది. మన భయాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ పోతాయి. 
 

ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి