భగవద్ గీత (14)
రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం.
అయిదు నుండి పదిమూడవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ), దేహాల యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. సాంఖ్య యోగపు 28, 29 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం చెప్పబోతున్నాడో చూద్దాం.
అయిదు నుండి పదిమూడవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ), దేహాల యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. సాంఖ్య యోగపు 28, 29 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం చెప్పబోతున్నాడో చూద్దాం.
శ్రీకృష్ణుడి మాట :
"అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదనా || (2. 28)
అవ్యక్తాదీని = మొట్టమొదట గోచరము కాని స్థితిలో నుండునది ; భూతాని = ప్రాణులన్నీ ; వ్యక్తమధ్యాని = మధ్యలో మాత్రం గోచరమగుచున్నవి ; భారత = భరతుడి వంశమందు పుట్టిన ఓ అర్జునా ; అవ్యక్త నిధనాని = చిట్టచివర మళ్ళీ గోచరమగుచున్నది ; ఏవ = మరియు ; తత్ర = అక్కడ(ఇలా వున్నప్పుడు ) ; కా = ఏమిటి ; పరివేదనా = శోకము (నకు కారణము).
"భరత వంశజుడైన ఓ అర్జునా ! ప్రాణులన్నీ మొట్టమొదట అవ్యక్త స్థితిలో నే వున్నాయి. అలాగే, చిట్టచివర కూడా అవ్యక్త స్థితిలోకే వెళ్లిపోతున్నాయి. ఈ రెండు అవ్యక్త స్థితుల మధ్య కొంత కాలం మాత్రమే వ్యక్త స్థితిలో వుంటున్నాయి. ప్రాణులన్నీ యిలా వ్యక్తావ్యక్త స్థితుల మధ్య ప్రయాణం చేసేవే అయినప్పుడు నీ యీ శోకానికి ఏమి కారణం వుండగలదు ? "
మీకు కొడుకు, కూతురు పుట్టారు - అనుకుందాం. ఇప్పుడు మీరు వారిని చూస్తున్నారు. వారి మాటలు వింటున్నారు. వారి ఆటలకు ఆనందిస్తున్నారు. చాలా బాగుంది మీ జీవితం లోకి వారు రావడం. నిజమే. కానీ, వారు పుట్టకముందు ఎక్కడున్నారు? ఏ స్థితిలో వున్నారు? మీకేమైనా తెలుసా? తెలీదు కదా. వారు మీ యింట్లో వ్యక్తమయ్యారు. అంతకు ముందు ఏదో అవ్యక్త స్థితిలో వున్నారు. ఆ స్థితిలో వారు వున్నప్పుడు, వారు మనకెవరికీ తెలీదు.
అలాగే, మీ కళ్ళ ముందే మీ తాతగారు చనిపోయి వుండొచ్చు. ఆ రోజు వరకూ యింటి పెద్ద ఆయనే. మీ ఆస్తిని సంపాదించి పెట్టింది చాలావరకు ఆయనే. ఆయన మీకు ఎంతో నచ్చిన వ్యక్తి. మీకు ఎన్నో నేర్పిన వారు. మీరు ఆయన వొళ్ళో కూర్చుని చాలా విషయాలు నేర్చుకున్నారు. కానీ, ఈ రోజు ఆయన లేరు. ఆయన భౌతిక శరీరం మట్టిలో, గాలిలో కలిసిపోయింది. మరి అంతేనా ఆయన అస్తిత్వం. ఇప్పుడాయన ఏమయ్యాడు? గాలిలో కలిసి పొయ్యాడా? అంతర్హితుడయ్యాడా? అసలేమయ్యాడు?
మీ కొడుకులో మీకు, మీ వాళ్లందరికీ, ఆయన పోలికలు కనిపిస్తున్నాయి. మీకూతురులో మీ అవ్వ గారివో, మరెవరివో పోలికలు కనిపిస్తున్నాయి ? ఈ కాలంలో వీటిని జీన్స్ లేదా జన్యు కణాల ప్రభావం అని మనం చెప్పుకోవచ్చు.
కానీ చనిపోయిన వారు ఏదో ఒక అవ్యక్త స్థితిలోకి వెళ్లిపోయారన్నది మాత్రం మనకు తెలుసు. అక్కడి నుండి, మళ్ళీ వ్యక్త స్థితికి, అంటే పుట్టుకలోకి, రాక తప్పదు అంటున్నాడు శ్రీకృష్ణుడు. అలాగే, వ్యక్త స్థితి అయిన పుట్టుక నుండి, పెరగడము, రకరకాల జీవితం గడపడం, మళ్ళీ మరణం ద్వారా అవ్యక్త స్థితిలోకి వెళ్లిపోవడం, ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. ఇది కాలచక్రంలో జరిగే మన జీవిత చక్రం.
ఇవన్నీ ఒక దాని వెనుక ఒకటి జరిగిపోతూనే వుంటాయి. మనమెవరూ ఆపలేము, ఆపాల్సిన పనీ లేదు. "అలాంటప్పుడు, పుట్టడానికి శోకిస్తున్నావా, బ్రతకడానికి శోకిస్తున్నావా, చావడానికి శోకిస్తున్నావా? మళ్ళీ, మళ్ళీ పుట్టడానికా, మళ్ళీ, మళ్ళీ చావడానికా, మళ్ళీ, మళ్ళీ బ్రతకడానికా? దేనికి నీ శోకం? ఇది ఎంత అర్థ రహితమైనదో చూడు అర్జునా," అంటున్నాడు శ్రీకృష్ణుడు .
పుట్టే పాపకు తల్లి గర్భంలోనే వుండిపోవాలని వుంటుందా? ఏమో. అలా వుండినా, అదే మంచిది, అని మనం ఎవరైనా అంటామా? లేదు కదా? పాప, తల్లి గర్భంలోకి మొదట రావాలి. ఎక్కడి నుండో వస్తుంది. ఏదో ఒక అవ్యక్త స్థితిలో నుండి 'గర్భము' అనే ఒక వ్యక్త స్థితి లోకి రావాలి. మళ్ళీ, తల్లి గర్భంలో నుండి బయటికి రావాలి కదా? ఈ ప్రక్రియ మనం చేస్తున్నామా? ఏదో మనకు తెలీని ఒక అవ్యక్త శక్తి చేస్తున్నది కదా! అలాగే, మనం పెరగడం, యుక్త వయస్కులు కావడం, మధ్య వయస్కులు కావడం, వృద్ధులు కావడం, మనకు పిల్లలు పుట్టడం, వారు పెద్దవారు కావడం, యివన్నీ కూడా మనం చెయ్యడం లేదు కదా .
అలాగే, మనమూ ఒక నాడు ఇప్పుడున్న 'జీవితం' అనే వ్యక్త స్థితి నుండి మళ్ళీ మరణం ద్వారా ఒక అవ్యక్త స్థితి లోకి పోవడం తప్పనిసరి కదా. భీష్ముడు, ద్రోణుడే కాదు, అర్జునుడు కూడా అలా వెళ్లి పోవలసిన వాడే. అర్జునుడి కొడుకూ వెళ్లిపోవాల్సిన వాడే. మనమడూ వెళ్లిపోవలసిన వాడే. ఇదంతా కృష్ణుడికి తెలుసు. అర్జునుడికి అర్థం కావాలి. మనకూ అర్థం కావాలి.
అలాగే, వెళ్లిన వాళ్లంతా, పోలో...మంటూ మళ్ళీ రాక తప్పదు, పుట్టకా తప్పదు, పెరగకా తప్పదు, మళ్ళీ వెళ్ళిపోకా తప్పదు. ఇది కూడా మనకందరికీ అర్థం కావాలి. అవ్యక్త స్థితి మనకు కనిపించదే కానీ, వ్యక్తం అవ్యక్తం నుండే కదా వస్తున్నది. పోయిన వాడే కదా తిరిగి వస్తున్నాడు. అది మనకు అర్థం కావాలి. అలాగే, వచ్చిన ప్రతి వాడూ, మళ్ళీ వ్యక్త స్థితి నుండి, మరణం ద్వారా, అవ్యక్తస్థితి లోకి వెళ్ళిపోతున్నాడు కదా. అదీ మనకు పూర్తిగా అర్థం కావాలి.
పుట్టే ప్రతి వాడూ దేవుడు క్రొత్తగా తయారు చేస్తున్న వాడు కాదు. దేవుడు ఆ పని చెయ్యడం లేదు, అవసరం లేదు కూడా. చచ్చిన ప్రతి వాడూ మళ్ళీ పుడుతున్నాడు. అంతే. ఎక్కడ, పుట్టాల్సిన అర్హత ఉందో అక్కడ పుడుతున్నాడు. అక్కడ, పుట్టి తీరాలి. తప్పదు.
ఈ జీవన-మరణ చక్రం అనే సత్యం తర్కానికీ అందుతుంది. జ్ఞానానికీ అందుతుంది. మనం కళ్ళు తెరిచి, బుద్ధిని లగ్నం చేసి, జరుగుతున్న సంఘటనలన్నీ కాస్త తరచి చూస్తే, యిది పూర్తిగా నిజమని అతి సులభంగా అర్థమయిపోతుంది. మీఇంట్లో పుట్టిన పాప, చనిపోయిన మీ తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, మరెక్కడో, అమెరికాలోనే, ఆఫ్రికా లోనో చనిపోయిన మరెవరో కూడా కావచ్చు. వారి వారి కర్మ ఫలం ననుసరించి మీ యింట్లో పుట్టారు. ఇదేదో దేవుడు మళ్ళీ కూర్చుని కొత్తగా జన్యు కణాలను తయారు చేసి, ఒక చోట చేర్చి కొత్తగా తయారు చేసిన పాప కాదు. దేవుడు ఆ పని చెయ్యడం లేదు.
కొత్త మంది అభిప్రాయాల ప్రకారం, కొన్ని సంస్కృతులలో వున్న నమ్మకాల ప్రకారం, పోయిన వాళ్ళు , తిరిగి రావడం లేదు, అంటే, పుడుతున్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు, మళ్ళీ వీళ్ళు పోతే మళ్ళీ, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు - అని కొన్ని నమ్మకాలు వుంది. మనం కాస్త తార్కికంగా ఆలోచిస్తే కూడా అది తప్పు అని సులభంగా అర్థమయిపోతుంది.
ఇక్కడే , ఈ భూమి పైనే, నీ కర్మ ఫలాన్నంతా, నువ్వు అనుభవించి తీరాలి. స్వర్గమూ, నరకమూ రెండూ, ఈ ప్రస్తుత జీవితంలోనే భాగాలుగా ఉన్నాయా, లేదా? ఆలోచించండి. మీరు సుఖమూ, దుఃఖమూ రెండూ అనుభవిస్తున్నారా, లేదా ? అవే స్వర్గమూ, నరకమూ రెండూ. అవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వున్నాయి.
మీ కళ్ళ యెదుట, యెంత మంది, ఎన్ని రకాల కష్టాలను అనుభవిస్తున్నారు? చూస్తున్నారు కదా! అది నరకం కాదా? అది వారి కర్మ ఫలం కాదా? అలాగే సుఖాలను అనుభవిస్తున్నవారూ వున్నారు కదా! అదే ఈ భూమి మీదే వారికి స్వర్గం లాగా వుంది.
మరి స్వర్గం అన్నది అసలు లేనే లేదా - అన్న విషయం యిప్పటికి ప్రక్కన పెట్టండి. మన ఋషులు ఎవ్వరూ ఎక్కడో వున్న స్వర్గానికి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడికి వెళ్లిన వారందరూ కూడా మళ్ళీ భూమి పైన పుట్టాల్సిందే. వేరే మార్గం లేదు వారికి. పెర్మనెంటుగా అక్కడ వుండి పోయే చాన్సు లేదు గాక లేదు. నిజానికి, 99.9999 శాతం మంది, శ్రీకృష్ణుడు చెప్పిన జనన, మరణాల మధ్య, వ్యక్తావ్యక్తాల మధ్య ప్రయాణాలు చేస్తూ భూమి పైనే వుండాల్సిందే.
"ఫలానా మనిషి స్వర్గస్థులయ్యారు" అని మనం అనుకోవచ్చు. ఫలానా వాడు నరకానికే వెళ్ళుంటాడు - అనీ అనుకోవచ్చు. కానీ, వారందరూ, మళ్ళీ ఈ భూమ్మీదే తమ తమ కర్మఫలానుసారం ఎక్కడో ఒక చోట పుట్టి, యిక్కడే సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తారు , అన్నదే యిక్కడ చెప్పబడింది.
సరే. పుట్టేది దేహం. చచ్చేది దేహం. అవ్యక్తమయ్యేది ఏది? 'దేహి' అని శ్రీకృష్ణుడు చెబుతున్న దాన్ని గురించి విజ్ఞులు ఏం వూహిస్తున్నారు అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు తరువాతి శ్లోకంలో.
శ్రీకృష్ణుడి మాట :
"ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చ అన్యహ్ |
ఆశ్చర్యవత్ చైనమన్యహ్ శృణోతి శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || (2. 29)
ఆశ్చర్యవత్ = ఆశ్చర్యము కలిగించేది, యిది అనే విధంగా ; పశ్యతి = చూస్తారు ; కశ్చిత్ = కొంతమంది ; ఏనం = దీనిని (దేహి, ఆత్మ) ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యము కలిగించేది, యిది అనే విధంగా ; వదతి = చెబుతారు, మాట్లాడుతారు ; తథా = ఆ విధంగా ; ఏవ =కూడా ; చ = మరియు ; అన్యహ్ = మరి (వేరే) కొంత మంది ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యము కలిగించేది, యిది అనే విధంగా ; చ = మరియు ; ఏనం = దీనిని (దేహి, ఆత్మ) ; అన్యహ్ = మరి (వేరే) కొంత మంది ; శృణోతి = (కొంత మంది) వినెదరు; శృత్వా = వినిన తరువాత ; అపి = మరియు ; ఏనం = దీనిని (దేహి, ఆత్మ) ; వేద = తెలుసుకున్న ; న = లేదు / కాదు ; చ = మరియు; ఏవ = కూడా ; కశ్చిత్ = కొంతమంది ;
" కొంత మంది ఈ దేహి చాలా అద్భుతమైనది - అన్నట్టుగా చూస్తున్నారు . మరి కొంత మంది ఈ దేహి చాలా ఆశ్చర్యము కలిగించేది - అన్నట్టుగా చెబుతున్నారు. మరి కొంత మంది ఇదేదో చాలా చిత్రమైంది - అన్నట్టు (మరొకరి నుండి) వింటున్నారు . కానీ యిలా విన్న తరువాత కూడా కొంత మందికి దీన్ని గురించి ఏమీ అర్థం కావడం లేదు . "
"దేహి" యొక్క అద్భుత తత్వాన్ని గురించి, కొంత మంది చూస్తున్నారు, కొంత మంది చెబుతున్నారు, కొంత మంది మరొకరి నుండి వింటున్నారు . యిలా పలు రకాలుగా చూసినా, మాట్లాడినా, విన్నా , చాలా మందికి ఈ దేహి తత్త్వం , పూర్తిగా అర్థం కావడం లేదు - అంటున్నాడు శ్రీకృష్ణుడు.
వ్యక్త స్థితి అయిన పుట్టుక, పెరుగుదల గురించి మనకు కొంత అర్థం అవుతున్నట్టే వుంటుంది. కానీ అవ్యక్త స్థితి అయిన దేహిని గురించి ఊహాగానాలే కానీ నిజమైన అనుభవం రావడం చాలా కష్టం.
కొంత మంది ధ్యానంలోనో, మరో విధంగానో, నేను 'దాన్ని' చూసేశాను - అది చాలా అద్భుతంగా వుంది అని అనుకోవచ్చు. దాన్ని గురించి, మరొకడు, ఎవడో రాస్తే, మనం చదువుతాం. రాసిన వాడికి ప్రత్యక్ష అనుభవం ఉందా అన్నది సందేహాస్పదమే. వాడు రాసింది, మనం చదివి, మనకేదో తెలిసిపోయినట్టు, చుట్టూ వున్న వారికి చెప్పొచ్చు. వారు విని, ఆహా, మాకూ తెలిసిపోయిందని చంకలు కొట్టుకోవచ్చు.
'అది' ఎప్పుడు నిజంగా తెలిసిపోయింది, ఎప్పుడు మన అనుభవం లోకి వచ్చింది, అనుభవం లోకి వచ్చింది అదేనా - అన్నది ఎలా తెలుస్తుంది?
వ్యక్తం లో వున్న దేహమే మనకు సరిగ్గా, పూర్తిగా అర్థం కావడం లేదే. అవ్యక్తంలో మన పంచేంద్రియాలకు అతీతంగా వున్న 'దేహి' మన మనస్సుకో, యింద్రియాలకో , అందే విషయమా ?
అయినా, శ్రీకృష్ణుడు అర్జునుడికి యివన్నీ చెప్పక తప్పదు. అర్జునుడి ద్వారా మనకూ తెలియ జేయక తప్పదు. ఇప్పటికి యిన్ని సమస్యలున్నాయి, దేహిని తెలుసుకోవడంలో - అని మాత్రం చెబుతున్నాడు. కష్టమే. కానీ తెలుసుకోవచ్చు - అని కూడా చెబుతున్నాడు.
మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత, మరింత స్పష్టత కావాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ స్పష్టత మనలో వస్తే, తప్పకుండా, నిస్సందేహంగా మన సంతోషం చాలా, చాలా పెరుగుతుంది. మన భయాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ పోతాయి.
ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం.
ఈ వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్
వజ్రాసనం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి