20, మే 2014, మంగళవారం

చంద్రబాబు నేతృత్వంలో - జరగాల్సిం దేమిటి ? ఏది మొదట? ఏది ముఖ్యం ? ఏది సులభం?


 అభివృద్ధి పథం లో 

మన రాష్ట్రం

ఎన్నికలు ముగిసిపోయాయి . వాటి ఫలితాలూ వచ్చేశాయి .

ఇవి రెండూ, నాకు బాగా నచ్చినట్టే వచ్చాయి . ఆ మాటకొస్తే , మనందరికీ బాగా నచ్చిన వాళ్ళే అధికారం లోకి వచ్చారని చెప్పుకోవచ్చు .

సీమాంధ్ర లో -  చంద్రబాబు నాయుడు గారి తెలుగు దేశం పార్టీ కి 102 సీట్లు , వారి తో బాటు పోటీ చేసిన భా.జ.పా. కు 4 అసెంబ్లీ స్థానాలు రాగా , జగన్ గారి పార్టీ కి 67 సీట్లు వచ్చాయి . కాంగ్రెసుకు ఏమీ రాలేదు . అలాగే - పార్లమెంటు స్థానాలకు, సీమాంధ్ర నుండి TDP + BJP  కూటమికి 17 స్థానాలు రాగా మిగతా 8  YSR కాంగ్రెసుకు వచ్చాయి .ప్రజలు చంద్ర , నరేంద్రులకు  బ్రహ్మ రథం పట్టి గెలిపించేశారు.  

యిక చంద్రబాబు గారు యిక్కడ , నరేంద్రుడు అక్కడ - తమ పరిపాలనా దక్షతను చూపడమే  తరువాయి .

సీమాంధ్ర లోని మొదటి పెద్ద పనులేమి ?

నా ఉద్దేశంలో - కరెంటు కొరత వెంటనే తగ్గించాల్సి వుంది . కరెంటు లేకుండా పరిశ్రమలు కానీ , వ్యవసాయం కానీ ఏదీ అభివృద్ధి చెయ్యలేము . పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యం అన్నీ కుంటు పడతాయి . ఆ విషయంలో చంద్రబాబు గారు మొదట తన దృష్టి సారించాలి .

(1) రాష్ట్రంలో - వున్న విద్యుత్తు కర్మాగారాలన్నీ సరిగా పని చేసే లాగు చూడాలి . నిజానికి దేశం అంతటా , ఎన్నో కర్మాగారాలలో - విద్యుదుత్పాదనకు సంసిద్ధంగా వున్న కర్మాగారాలున్నాయి .  వాటికి బొగ్గు, గ్యాస్ సప్లయ్  లేదు.  కొన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కర్మాగారాలన్నీ పనిచేస్తే - దేశంలో, రాష్ట్రంలో , అతి త్వరగా, విద్యుదుత్పాదన ఘనంగా పెరుగుతుంది . యిది - సులభంగా , అతి త్వరగా చెయ్యగల పని . చాలని విద్యుత్తు నేషనల్ గ్రిడ్ నుండి కొనుగోలు చెయ్యాలి .  కానీ, 2 సంవత్సరాలలోపు, రాష్ట్రాన్ని కొరత రాష్ట్రం నుండి సర్ ప్లస్ రాష్ట్రంగా మార్చ వచ్చు . మార్చాలి . తమిళనాడులో జయలలిత గారు కూడా అదే చేస్తున్నారు .

(2) మన రాష్ట్రంలో నదులున్నాయి . ఈ నదులను కలిపే ప్రణాళిక తయారు చెయ్యాలి . శ్రీకాకుళం నుండి కుప్పం వరకు నదుల నీరు ప్రవహించే ఏర్పాటు మనం చెయ్యాలి. నా చిన్న సలహా - కుప్పం పేరు శ్రీ కుప్పం అని  మారిస్తే బాగుంటుంది . అప్పుడు, మన రాష్ట్రం శ్రీకాకుళం నుండి, శ్రీ కుప్పం వరకు, అని చెప్పుకోవచ్చు . రాష్ట్రం - 'శ్రీ' ,అంటే, సిరి తో నిండి వుంటుంది.  మోడీ గారు, నవీన్ పట్నాయక్ గారు వొప్పుకుంటే - మహానది ని కూడా కలిపి - వొడిశా వొక కొన  నుండి ఆంధ్రప్రదేశ్ మరొక కొన వరకు - అన్ని జిల్లాలలో నదులు ప్రవహించే ఏర్పాటు చెయ్యవచ్చు . యిది అయిదేళ్ళు లేదా పదేళ్ళు పట్టినా ఫరవాలేదు , కానీ ఈ పనికి శ్రీకారం చుట్టాలి . మన రాష్ట్రంలో , చాలా ప్రదేశాలలో ఇప్పటికే మంచినీటి సరఫరా  చాలా తక్కువ . ఈ పరిస్థితి మారాలి. మహానది, గోదావరి , కృష్ణా   నదుల వరద నీరు మాత్రం కాలువల ద్వారా వచ్చినా , చిత్తూరు జిల్లా లాంటి ఎన్నో ప్రాంతాలకు నీటి సదుపాయం కుదురుతుంది

(3) మనకు మంచి రాజధాని కావాలి. హైదరాబాద్ పోగొట్టుకున్నది ఉత్తరోత్తరా మనకు అదృష్టంగా, మహా లాభకరంగా మారేలా చేసుకోవాలి. కొత్త రాజధానిని, రాష్ట్రం మధ్యలో, కనీసం 50 X 50 కి.మీ వైశాల్యం వుండేటట్టు , క్రొత్తగానే నిర్మించాలి . అది, చెన్నై- కోలకాతా జాతీయ రహదారికి వీలైనంత దగ్గర వుంటే మంచిది . అలాగే , కొంత చెన్నైకు సమీపం గా వుంటే చెన్నై లోని విమానాశ్రయము, పోర్ట్ మనం సులభంగా వాడుకునే వీలుంటుంది - అంటే మనం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము, పోర్ట్ నిర్మించే వరకు యివి అవసరం గనుక . యింతకు ముందు వొక సారి అది ఒంగోలు - నెల్లూరు మధ్య ప్రాంతాల్లో అయితే సరిపోతుంది అని రాశాను . అంటే ఒంగోలు ఆని కాదు . దానికి దగ్గర, ఢిల్లీ అంత నగరం నిర్మించ డానికి సరైన ప్రదేశం చూసుకోవాలి .

(4) మన రాష్ట్రంలో - IT  పార్కులు , ఫార్మా  పార్కులు సులభంగా నెలకొల్ప వచ్చు . వాటికి అన్ని రాయితీలు యివ్వాలి . ఈ విషయంలో - చంద్రబాబు గారికి వున్న అనుభవం తో - పారిశ్రామిక వేత్తలను సులభంగా ఆకట్టుకోవచ్చు .

(5) మన రాష్ట్రం పెద్దది. పక్క రాష్ట్రం చిన్నది. మనకు వొక రైల్వే జోన్ కావాలి కదా .  అది మోడీ గారిని అడిగి సాధించాలి .అలాగే - టెలికం సర్కుల్ , లాంటి కేంద్ర కార్యాలయాల విభజన జరగాలి . దీని వలన, ఆంధ్ర ప్రదేశ్ పైన గమనమూ పెరుగుతుంది , అభివృద్ధి     కూడా త్వరగా జరుగుతుంది . టెలికాం లో బ్రాడ్ బాండ్ రావడమూ త్వరగా జరుగుతుంది . రైల్వే లో క్రొత్త లైన్ ల నిర్మాణమూ జరుగుతుంది . వీటితో బాటు - హైదరాబాద్ లోని ఆంధ్రా ఉద్యోగులు కూడా కొంత మంది ఇక్కడికి  రావడానికి వీలుంటుంది . వీటి వలన చంద్ర బాబు గారు అనుకునే అభివృద్ధి తానుగా జరిగే వీలుంది .  అంత పెద్ద రైల్వే జోన్ తెలంగాణా కు అక్కరే లేదు అంత పెద్ద టెలికాం సర్కుల్ అక్కరే లేదు . కాని  మనకు కావాలి . అది మనం అడగాలి . 

(6) నన్నడిగితే,  TDP  పార్టీ నుండి రైల్వే మంత్రి వుంటే మేలు అని నాకు అనిపిస్తుంది . రైల్వే కాకపొతే - IT  మినిస్ట్రీ అయినా బాగుంటుంది , మన రాష్ట్ర అభివృద్ధికి . 

(7) మనకు వొక ఐ.ఐ.టి ., వొక ఐ.ఐ.యం., వొక ఏ.ఐ.ఐ.యమ్.యస్ . - లాంటి ఉత్తమ విద్యల నందించే సంస్థలు రావాలి . యివన్నీ, కేంద్రం నుండి, మనం అడగి తీసుకోవాల్సినవే ; మనం మనముగా చెయ్య వలసినవి కావు. 

(8) చంద్రబాబు గారు ఈ మధ్య పత్రికల వారికి , టీవీ చానెళ్లకు యిచ్చిన ఇంటర్ వ్యూలలో - చాలా సమస్యల గురించి బాగా చెప్పారు . మనకున్న 14 పోర్టుల గురించి , వాటికి చేయవలసిన అభివృద్ధి గురించి , వాటికి , మన వ్యవసాయ,  పారిశ్రామిక రంగాలకు మధ్య వుండవలసిన సహకారాల గురించి చెప్పారు . అలాగే , మనకు రాబోయే రాజధాని ఢిల్లీ కంటే బాగుండాలని చెప్పారు . యివన్నీ బాగుంది . 

చంద్ర బాబు గారు చెయ్యాల్సినవి చాలా వున్నాయి . యిందులో కొన్ని సులభంగా చేసేవి. కొన్ని వెంటనే చెయ్యాల్సినవి . కొన్ని నిదానమైనా, తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు.  మొదట ,సులభంగా చెయ్య వలసినవి చేసేసి, వెంటనే చెయ్యవలసినవి వెంటనే చేసేసి , తరువాత , ముఖ్యమైనవి  చిత్త శుద్ధితో , అందరి సహకారంతో చెయ్యాలి . 

చంద్రబాబు గారు యింకా ఎన్నెన్నో చెయ్యొచ్చు . అసలు ... పదేళ్ళలో , తెలంగాణా వారి కొందరు నాయకుల బూతు మాటలకు, లేని చేతలకు  మొహం మొత్తి , తెలంగాణా ప్రజలు మళ్ళీ, సమైక్యంగా వుందామన్నా - ఆశ్చర్యం లేదు . పక్క పక్క నున్నా , అటువంటి వారు  మధ్య లేకుంటే , కుటుంబ కలహాలు వుండవు . రాష్ట్రాల మధ్యా కలహాలు వుండవు . 

సర్వే జనాః సుఖినో భవంతు

- మీ 

వుప్పలధడియం విజయమోహన్




5 కామెంట్‌లు:

  1. అసలు ... పదేళ్ళలో , తెలంగాణా వారి కొందరు నాయకుల బూతు మాటలకు, లేని చేతలకు మొహం మొత్తి , తెలంగాణా ప్రజలు మళ్ళీ, సమైక్యంగా వుందామన్నా - ఆశ్చర్యం లేదు
    >>
    మీరు రాసిన విషయ మంతా బాగుంది కానీ ఇది మాత్రం గొడవలు తెస్తుంది సుమా!ఒక వేళ వాళ్ళు కలుస్తా మన్నా మనం కల్వగూడదు.విడి పోవటం తేలిక కానీ కల్వదం కష్తం. ఉద్యమ కాలం లో యెంతో మంది చెప్పినా వినకుండా తెగతిట్టి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారా?ఒకవేళ కలిసినా మరో యాభయ్యేళ్ళ తర్వాత మళ్ళీ యెవడో బయల్దేరితే అప్పుడు మన పిల్లల తరం తిట్లు తినాల్సి వస్తుంది. బాబు గారు కూడా మళ్ళీ కలపడం గురించి మాట్లాడుతున్నారు గానీ నాకయితే ఆ ఆలోచన కూడా మనకి అనవసరం అనిపిస్తున్నది, ఆలోచించండి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకనిపిస్తుంది - తెరాస నాయకుల ప్రభావం ఎక్కువ కాలం వుండదని. చంద్రబాబు కున్న చిత్త శుద్ధి వారికి లేదు. విద్వేషాలు రెచ్చ గొట్టడమే కానీ - మరో ఎజెండా లేదు. రెవిన్యూ మన కంటే చాలా ఎక్కువ వున్నా - చంద్రబాబు లాగ అభివృద్ధి చెయ్యగల నాయకుడు లేదు. సరే . మనం , ఎన్నికల ఫలితాలు చూస్తే, యిప్పుడు కూడా, తెలంగాణా లో , TDP కి చాలా మద్దతు వుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లో అయితే వారికే మద్దతు ఎక్కువ. అంటే - ఆ జిల్లాల ప్రజల మనస్సులో ఏముంది? ఎవరైనా అడిగారా అసలు? అందువలన - కొంత కాలంలో , ఈ విద్వేషాలూ పోవచ్చు-అని నా అభిప్రాయం. తె.రా.స. కూడా ఎగిరిపోవచ్చు -కాంగ్రెస్ దేశమంతటా యెగిరి పోయిన మాదిరి. అంటే - రాష్ట్రాలు కలవాలని నేను అనను. పక్క పక్క రాష్ట్రాలలో వున్నా విద్వేషాలు లేకుండా వుండొచ్చు. నాకు తెలిసిన చాలా కుటుంబాలలో పుట్టింది తెలంగాణా , పెరిగింది సీమాంధ్ర . పెళ్లి చేసుకున్నది మరెక్కడో, మళ్ళీ వుద్యోగం హైదరాబాద్. లేదా, రివర్సు. యిలా చాలా మంది వున్నారు. KCR లాంటి వాళ్లకు, ఇవేవీ అర్థం కావు. కానీ యిప్పట్లో రాష్ట్రాలను కలిపే , కలిసే ఆలోచన ఎవరికీ లేదు. అంత వరకు మీరు చెప్పింది కరెక్టే.

      తొలగించండి
  2. హరి బాబు గారూ, బాబు కలుపుతానన్నది ప్రజలనే కానీ ప్రాంతాలని కాదు. దానికి ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు భాష్యాలు చెప్తున్నారు. అదేదో దేశ ద్రోహం అయినట్టు తెలంగాణా న్యాయవాదులు కేసు కూడా పెట్టారు. వీళ్ళకి కచరా లాగ ద్వేషం నూరిపోసే వాళ్ళు అయితేనే ఆనందమేమో. ఇప్పటికే అతి వాద తెలంగాణా వాదుల (AKA తెలబానుల) వల్ల రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు తారా స్థాయికి చేరాయి. అది రెండు ప్రాంతాల మనుగడకు మంచిది కాదు. ముఖ్యంగా భారత దేశానికీ అసలే మంచిది కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మితి మీరిన విద్వేషాలను తె . రా . స. నాయకులు కొందరు సృష్టిస్తున్నారు. అది, మీరు చెప్పినట్టు , రెండు ప్రాంతాల మనుగడకు మంచిది కాదు. ముఖ్యంగా భారత దేశానికీ అసలే మంచిది కాదు.

      తొలగించండి
  3. మీ రన్నది నిజమే కావచ్చు, కానీ సామాన్యుల లోకి కూడా వాళ్ళు విషం యెక్కించేశారు!అది దిగటం కష్టం.వాళ్ళ సంగతి వొదిలెయ్యణ్డి,విడిపోతున్న ఈ రెండు ముక్కల్లో అ భాగాన్ని మిగులు లో ఉంచి ఈ భాగాన్ని తరుగులో ఉంచుకున్న తెల్ల మొహాలమయి కూడా గట్టిగా సమర్ధించలేని నాయకుల వల్ల అన్ని తిట్లు పడ్డాము గదా, తనువున విరిగిన అలుగులు అనే మాట ఇవ్వాళ వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు,పడ్డవాళ్ళకి గుర్తుంటాయి గదా.

    రిప్లయితొలగించండి