సంస్కృతం నుండి
సుభాషితాలు కొన్ని
ఈ మధ్య సంస్కృతం బాగా నేర్చుకోవాలనే తపన ఎక్కువై , సంస్కృత భారతి వారు జరుపుతున్న మూడు పరీక్షలు రాసి బాగా పాసవడం , చివరిదైన కోవిద పరీక్షకు రిజిస్టరు చెయ్యడం జరిగింది . సంస్కృతం భారతీయ / ప్రపంచ భాషలన్నిటిలో, అతి ప్రాచీనమైనది ; అందులోని జ్ఞాన సంపద అత్యున్నతమైనది - అన్న మాట మనలో చాలా మందికి తెలిసినదే .
సంస్కృతం నుండి కొన్ని శ్లోకాలను యిక్కడ ఉదాహరిస్తున్నాను .
ఋగ్వేదం : " ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః "
అంటే , "అన్ని దిక్కుల నుండి మంచి ఆలోచనలే మనకు వచ్చు గాక" అని అర్థం . చూడండి . ఋగ్వేదం ఎప్పుడు మొదట రాయబడిందో , ఎవరికీ తెలీదు . ఎంత ప్రాచీనమైనదో ఎవరికీ తెలీదు . ప్రపంచంలోని అన్ని గ్రంధాలలో - అన్నిటికంటే అతి ప్రాచీనమైనది ఋగ్వేదం . అందులో చెప్పబడిన వాక్యం యిది . యిది ఎప్పటి వాక్యం ? ఎన్నో వేల ఏండ్లది కావచ్చు . ఎన్నో లక్షల ఏండ్లదైనా కావచ్చు . అంత ప్రాచీనమైన మాట యిది .
అన్ని దిక్కుల నుండి మనకు మంచి ఆలోచనలే రావాలి. అప్పుడే కదా , మన మనసు మంచి ఆలోచనలు చేస్తుంది. అప్పుడే కదా, సమాజమంతా - మంచిగా వుంటుంది . దీనికి మరో పిల్ల వాక్యం చెప్పాలంటే , వొక వేళ , వొక వైపు నుండి, చెడు ఆలోచనలు వస్తూ వుంటే , ఏం చెయ్యాలి? మొదట, అవి మీ మనసులో దూరకుండా చూసుకోవాలి . మళ్లీ అవి - ఆ దిక్కున పుట్టకుండా , మన వద్దకు రాకుండా , మరెన్నో చెయ్యాలి . యిలా - ఈ వాక్యార్థం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు . నిజానికి - మన జీవితం బాగుండాలంటే, సుఖ మయం కావాలంటే - ఈ వాక్యం వొక్కటి పాటిస్తే చాలు - ఔనా !
2. "ఆత్మార్థం జీవలోకేస్మిన్ కో న జీవతి మానవః ; పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి" .
ప్రపంచం లో చాలా మంది స్వహితం , స్వసుఖం చూసుకునే వాళ్ళుగానే వున్నారు .
కానీ , పరోపకారార్థం , పర హితార్థం ఎవరు జీవిస్తారో , వారి జీవితమే , నిజమైన , ధన్య జీవితం . అది కాని జీవితము , నిరర్థక జీవితం. యిదీ దీని భావం .
యిది విన్న తరువాత - మనం మన జీవితాన్ని కాస్త నిశితం గా పరిశీలించి - మనలో ఈ పర హితార్థకత వుందా , లేదా; ఎంత వుంది - అని చూసుకోవాలనిపించాలి కదా .
3. "శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధకోటిభిహి ; పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనం . "
కోటి గ్రంధాల లో చెప్ప బడిన దాని (సారాన్ని) అర్ధ (సగం) శ్లోకం లో చెబుతున్నాను . పుణ్యమంటే - పరోపకారమే . పాపమంటే - పరపీడనమే .
మరొకరికి ఉపకారం చెయ్యడమే పుణ్యము .
దేవుడికి మ్రొక్కితే పుణ్యము . పూజ చేస్తే పుణ్యము - అని అనుకుంటాము . నిజానికి , యివన్నీ మన మనసును పరిశుద్ధం చేసేవి . అంతే కాని పుణ్యాలు కావు . పుణ్యమంటే పరోపకారమే - అంతే కానీ , మరేదీ కాదు. దీన్ని మరింతగా మనం విశ్లేషించుకోవచ్చు . రాజు పట్టుకోవాలనుకునే దొంగను దాచి పెట్టడం దొంగకు ఉపకారం లాగా తోచ వచ్చు . కానీ, ప్రజలకు అపకారం కదా . అందువలన , మనం చేసే పరోపకారం - మరొకరికి , ముఖ్యంగా, మంచి వారికి అపకారంగా పరిణమించ కూడదు . లంచగొండి అయిన వాడికి వోటు వేస్తే - వాడికి ఉపకారం ; కానీ, ప్రజలకు అపకారం . అలా వోటు వెయ్యడం కూడా పాపం క్రిందకే వస్తుంది .
పర పీడనమే పాపము , అన్నారు. పరులకు కష్టం కలిగించడం ఖచ్చితంగా పాపమే . యిది మనం సాధారణం గా మాటల ద్వారా ప్రతి దినం , ఎన్నో సార్లు చేస్తూ వుంటాము . "నిజం మాట్లాడడం" పుణ్యం అనుకుంటాం . కాదు . ఆ నిజం వలన పరోపకారం జరగాలి . సజ్జనోపకారం జరగాలి . ఆ నిజం, మృదువుగా, ఆహ్లాదకరంగా , మనసుకు నచ్చేటట్టు చెప్పగలగాలి . అన్ని సమయాల్లోనూ , అలాంటి ప్రయత్నం చెయ్యాలి .
అందుకే "సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ , న బ్రూయాత్, సత్యమప్రియం " అన్నారు. సత్యం చెప్పాలి. ప్రియంగా చెప్పాలి. ఏ సత్యాన్నీ అప్రియంగా చెప్పకండి . -అని భావం .
నువ్వు చూడ్డానికి అందంగా లేవు - అన్నది సత్యమా? ఎదుటి వారిని గురించి - మీ మనసులో అలాంటి భావం వచ్చినా , అది నిజమే అని మీరు అనుకున్నా , అది చెప్పడం సత్యం క్రిందకు రాదు, కానీ పాపం క్రిందకు మాత్రం తప్పకుండా వస్తుంది . పరులకు ఆనందమూ , ఆహ్లాదమూ కలిగించే సత్యాలు ఎన్నో వున్నాయి . అవి చెబితే , పుణ్యం కూడా . కానీ, అవి చెప్పము . చెప్పాలని తోచదు . పరులకు కష్టాన్ని కలిగించే సత్యాలు చెప్పాల్సి వస్తే - అది ఎలా చెప్పాలో, అసలు చెప్పాలా వద్దా అన్నది మనకు తెలియాలి . చెప్పరాని విధంగా చెబితే - అది పాపం . అంటే - మన మాట , మంచి మాటగా , మంచిని పెంచే, పంచే మాటగా వుండాలి .
మరి, దుష్టులకు, వారు చేసే పనులు ఆకృత్యాలని చెప్పాలా , వద్దా ? చెప్పాలి. వీలైనంత వరకు - వారిలో మార్పు వచ్చే రీతిగా చెప్పాలి . అందుకనే - సామ, దాన, భేద , దండోపాయాలను - ఆ వరుస క్రమంలో ప్రయోగించ మన్నారు .
యిది - కేవలం మాటల ద్వారా మనం చెయ్య గలిగే పుణ్యాలు , చేస్తున్న పాపాలు .
ఉత్త మాటల ద్వారా మనం ఎంతో మందిని సంతోష పెట్ట వచ్చు . ఆలోచించండి .
దీని తరువాత - మనం చేసే కార్యాలు - పుణ్యాలా , పాపాలా ? యిది చూసుకోవాలి . దీనికీ పై సూత్రమే వర్తిస్తుంది . ప్రతి రోజూ - మనలో, ప్రతి వొక్కరు , పంచ మహా యజ్ఞాలు - అనేవి చెయ్యాలి, అని పెద్దలు చెప్పారు . దేవతలకు, ఋషులకు, పితరులకు , మానవులకు, సకల భూత కోటికి (జంతువులు, పక్షులు, వృక్షాలు యిత్యాదులు) మన సహాయం అందాలి . యిది మన నిత్య కృత్యం గా మారాలి . ఈ పుణ్యాలు చేసే వాడికి, పాపాలను గురించి యోచన చేసే సమయం కూడా వుండదు . అతని జీవితం కూడా మహదానంద మయం గానే వుంటుంది .
చివర , మహా భారతం లోని వొక చిన్న శ్లోకం :
4. "అలక్ష్మీరావిశత్యేనం శయానమలసం నరం . "
సిరి ఎవరిని వరించదు? దురదృష్టం ఎవరికి వస్తుంది ?
ఎవడైతే నిద్ర మత్తులోనే వుంటాడో , ఎవడైతే సోమరితనంలోనే వుంటాడో - వాడికే దురదృష్టం వస్తుంది; సిరి వాడి వద్దకు రానే రాదు .
- యిలా చురుకుతనాన్ని , పనిలో కుశలతను ఎంతగానో ప్రోత్సహించే తత్త్వం, సంస్కృతి మనది . "కర్మలో కుశలత నే యోగం " అని శ్రీకృష్ణుడు భగవద్ గీతలో కూడా అంటాడు.
సంస్కృతంలో సుభాషితాలు చాలా, చాలా, చాలా ఎక్కువ . అవి చదివితే చాలు ; జీవితాలు మారిపోతాయి . మన పాఠ్య పుస్తకాలలో కూడా , ప్రతి క్లాసులోనూ - ఈ సుభాషితాలను చేరిస్తే చాలు - మన మనసుల్లోను, జీవితాల్లోను ఎంతో ప్రగతి వస్తుంది . అది జరుగుతుందా ? ఎప్పుడు జరుగుతుందో ? శుభస్య శీఘ్రం !
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
వుప్పలధడియం విజయమోహన్
Very useful info on sanksrit..write more on sanskrit scripts.
రిప్లయితొలగించండి