18, మే 2014, ఆదివారం

చేసిన పాపం చెబితే పోతుందా ? మరి చేసిన పుణ్యం? అదీ పోతుందా ? - బిచ్చ గాడు రౌడీ గా మారితే మనకేం?


మనం ధనవంతులా , కాదా ?   మనం ఆరోగ్యవంతులా, కాదా ?    మనం అందంగా వున్నామా, లేదా ?

మనకు అధికారము , పలుకుబడి వుందా , లేదా ? మనల్ని గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు ?
యిలా మనల్ను , ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ వుంటాయి .
కానీ , నేను మంచి వాడినా , కాదా - అన్న ప్రశ్న మనలో వుందా ? అలా వుండాలని మనం అనుకుంటూ వున్నామా ? 

మనమున్న సమాజం లో వొక పెద్ద పోటీ ప్రపంచం వుంది. అందులో వున్న వారు, ఎప్పుడూ, మిగతా వారితో ఏదో వొక విధంగా పోటీ పడుతూ వుంటారు ? కొందరికి ఏ పోటీ అక్కర లేదు . వారు తమ పని తాము చేసుకుని పోతూ వుంటారు ? 

మన రాజకీయ వాదులంతా పోటీ ప్రపంచం లోనే వున్నారు. పారిశ్రామిక వేత్తలలో కొంత మంది పోటీ ప్రపంచం లో, కొంత మంది  దాని బయట వున్నారు .

మనసులో పోటీ అని వుంటే - ఎంతో కొంత ఈర్ష్య వచ్చే ప్రమాదం వుండనే వుంది. ఈర్ష్య రాకుండా - పోటీ పడి, యెదుటి వాడు గెలిస్తే , అప్పుడూ, సంతోషంతో , గెలిచిన వాడిని అభినందించే మనస్తత్వం  మనలో వుందా ?  మనం సాధించిన దానికి, యితరులతో పోల్చుకోకుండా, ఆనందించే గుణం  మనలో వుందా ?

ఈర్ష్య అనేది - మానసిక కాన్సర్ - అని ఫోర్బెస్ అనే ఆయన అంటారు . నిజమే . యిది  మానసికంగా మనలను, ముఖ్యంగా మనలోని మంచిని, తినేస్తుంది . ఈర్ష్య మనసులో వుండే వాడిలో - ప్రేమ, అభిమానము ఉండలేవు - అంటారు, సెంట్ ఆగస్టిన్ . మన ఈర్ష్యకు గొప్ప కారణం వుండాలని ఏమీ లేదు. అది ఏదైనా వొక కారణం వెదుక్కుంటుంది. ఈర్ష్య మనలో వుంటే - అది  వుండడానికి ఏదో కారణాలు వెదకడం ప్రారంభిస్తుంది . తనకు తానుగా పెరగడం ప్రారంభిస్తుంది . అందుకే అది కాన్సర్ లాంటిది.     

కానీ నిజానికి , జీవితమనే నిరంతర ప్రవాహంలో, ఎప్పుడూ , ఎవరో వొకరు మనకు ముందూ వుంటారు ; వెనుకా వుంటారు . ముందు వాళ్ళ పైన ఈర్ష్య అక్కర లేదు . వెనుక వాళ్ళ పైన చిన్న చూపూ అక్కర లేదు . రెండూ మూర్ఖత్వమే . 

సరే . మన వూళ్ళో ధనవంతుడెవడో ,మనలో చాలా మందికి తెలుసు. మన వూరిలో పలుకుబడి, అధికారం,  వున్న వాడెవడో మనకు తెలుసు . అందరికంటే బలమైన వాడు , వెనుక పది మంది రౌడీలు వున్న వాడెవడో తెలుసు .

కానీ మనవూళ్ళో , అందరికంటే మంచి వాడు ఎవడో మనకు తెలుసా ? ఎలా తెలుస్తుంది?

మిగతా అన్ని విషయాల్లోనూ మనకు రక రకాల గణాంకాలు వుంటాయి . చాలామంది ద్వారా లబించే రూమర్లు కూడా వుంటాయి . కానీ - మంచి వాడు ఎవరయ్యా - అంటే , అది చెప్పడం కాస్త కష్టమే. ధనవంతుడో, రాజకీయ నాయకుడో చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్దగా  చూపించే పత్రికలూ, టీవీ లు వుండనే  వున్నాయి .  కానీ ,మీరో, నేనో చేస్తే - చెప్పే వాళ్ళు లేరు . మనమే చెప్పుకోవచ్చా ?  చెప్పుకుంటే వచ్చే పుణ్యం పోతుంది అంటారు . కానీ, సంతోషం వస్తుంది . పది మంది అనుకోవచ్చు - యిదేదో పెద్ద గొప్ప పని అని చెబుతున్నాడు ; అంతా బడాయి - అని . మనకు కాస్త  గాలి  తీసేసినట్టుగా  అవుతుంది . అయినా - చేసిన చెడ్డ పని చెప్పడం కష్టం గానీ , మంచి పని చెప్పడం కష్టం కాదు . అసలు చెప్పకండా వుండడం కష్టం .

నేను చాలా ఏళ్ళ క్రితం వొక మంచి యోగా ప్రోగ్రాం పూర్తి చేశాను . అది చాలా, చాలా బాగుంటుందని  నా లాగా ఆ ప్రోగ్రాం చేసిన వారందరూ వొప్పు కుంటారు.  అందులొ వొక భాగం , మీరు అదే ప్రోగ్రాం చేస్తున్న మరొక అపరిచిత వ్యక్తికి , మీరు మీ జీవితం లో చేసిన వొక పెద్ద తప్పు పని పూర్తిగా చెప్పాలి .ఆ పాపాన్ని అలా చెప్పి కడుక్కోవాలి .   అతడూ అలాగే తను చేసిన పెద్ద తప్పు పని మీకు పూర్తిగా చెప్పాలి. ఆ తరువాత మీరిద్దరూ - మీరు విన్న, చెప్పిన ఆ తప్పు పనులు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు . యిలా కొద్ది నియమాలు వున్నాయి . అతడు నాకేదో చెప్పాడు . నేను అతనికేదో చెప్పాను . యిందులో విశేషమేమిటంటే - యిలా చెప్పేసి ఏడవని వాడంటూ ఆ ప్రోగ్రాం లో లేదనే చెప్పాలి . నేను కూడా ఎన్నో దశాబ్దాల తరువాత , బాగా ఏడిచాను . ఎంత బండ బారిన వారికైనా ఆ ఏడుపు రావాల్సిన సమయం అది .  అది తెచ్చి పెట్టుకునే ఏడుపు కాదు . సహజంగా వచ్చేసే ఏడుపు . అలా, చేసిన ఏదో తప్పు పని , ఎవడికో చెప్పి అందరం ఎడ్చుకున్నాం . ప్రోగాం తరువాత - అందరం సంతోషం తో ఇళ్ళు చేరిన వాళ్ళమే.

మరి చేసే మంచి పనుల మాటేమిటి . అవి రహస్యంగా  వుంచము గా! అది చిన్నదో, పెద్దదో, ఏదైనా గానీ . పది మందికి చెప్పుకుంటే , వాళ్ళు కుళ్ళుకున్నా, అభినందించినా, అంతేనా అని గాలి పీకేసినా   - చెప్పేస్తే అదో సంతృప్తి .
నాకు చాలా సంవత్సరాలు - అసలు జీవితంలో మనం మంచి పనులు ఏమి చేశాము - అని మనసు పీకుతూ వుండేది . మరీ చిన్న పనులు మనకే చెప్పుకోలేము . మరొకరికి ఎలా చెబుతాము . మది కాస్తో, కూస్తో పెద్ద పనులు ఎప్పుడూ చేసినట్టు గుర్తు లేదు . మరేం చెయ్యాలి ?

వొక దశాబ్దం క్రితం అయితే - బిచ్చ గాళ్ళకు కూడా - వొక రూపాయికి మించి బిచ్చం వేసిన వాడిని కాను - అని అనుకుంటా . జేబులో డబ్బులు వున్నా , వొక్కో సారి వేద్దామనిపించినా, బిచ్చగాడిని దాటి వెళ్ళిపోయే వరకు , చెయ్యి జేబులోకి వెళ్ళేది కాదు . ఆ తరువాత, సరే, మరో సారి చూద్దాం అనుకునే వాడిని. వెయ్య కూడదని నియమం లేదు కానీ , వేసే అలవాటైతే లేదు . ఎప్పుడో వొక సారి , ఎలాగో వేసే వాడిని .

ఆ తరువాత, ఈ విషయం - నేను ప్రసంగించే కొన్ని క్లాసులలో చర్చకు వచ్చింది. వెయ్యాలని కొందరు; వెయ్యకూడదని కొందరు ; అసలు, బిచ్చ గాళ్ళలో చాలా మంది ధనవంతులున్నారని కొందరు, అసలు బిచ్చం వేస్తే , సోమరి తనాన్ని ప్రోత్సహించడమే నని కొందరు - యిలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు , వారి వారి కారణాలతో బాటు చెప్పారు.

ఆ తరువాత - బిచ్చ గాళ్ళకు బిచ్చం వేస్తే  ఏమవుతుంది ? వెయ్యకపోతే ఏమవుతుంది ? యిదీ చర్చించాం . ఈ అంశం పైన కాస్త దీర్ఘం గానే , తీవ్రం గానే పరిశోధనే చేసాము.

అప్పుడు నాకు అనిపించింది యిది. బిచ్చ గాడికి బిచ్చం వేస్తే , వాడు ఆ రోజు భోంచేస్తాడు. మరి కొన్ని రోజులు బ్రతుకుతాడు . సరే వాడి వద్ద డబ్బు వుందనుకోండి. మనమిచ్చిందీ అందులో చేరుతుంది . వాడికి అనుభవించే  రాత లేదు . అంతే . కానీ లేని వాడు బ్రతుకుతాడు . బిచ్చగాడి గానే అయినా - కనీసం బ్రతుకుతాడు .

బిచ్చ గాడికి బిచ్చం వెయ్యలేదనుకోండి ? వాడికి ఆకలి పోలేదనుకోండి . అప్పుడేమవుతుంది . వాడికి సమాజం పైన ఈర్ష్య, కసి పుట్టుకు వస్తుంది . ఆకలికి - వాడు చిన్న చిన్న దొంగ  తనాలు   చెయ్యవచ్చు . పట్టుబడితే తన్నులు తింటాడు . జైలుకూ పోవచ్చు . పట్టుబడినా, లేకున్నా , పెరిగే కొద్దీ పెద్ద దొంగ గా , గూండా గా , రౌడీ గా, మారొచ్చు . మన దేశంలో - రౌడీలకు రాజకీయ నాయకుల వద్ద పెద్ద డిమాండు వుంది కదా . కొన్ని పార్టీలలో యిది మరీ ఎక్కువ. భూ కబ్జాలు చెయ్యాలన్నా, ఎదుటి పార్టీ వాళ్ళతో పోరాటాలన్నా, వూరేగింపులన్నా, నినాదాలన్నా - రౌడీలు తప్పకుండా వుండాల్సిందే . ఈ రౌడీలలో చాలా మంది చిన్నప్పుడు వదిలి వేయబడి,  బ్రదుకెలా గడపాలో తెలియని వాళ్ళే . దారిలో అడుక్కున్నప్పుడు , మన లాంటి వాళ్ళ వద్ద , లేదుపో, అనిపిం చుకున్న వాళ్ళే  . కాలే కడుపుకు చట్టాలూ లేవు ; నీతులూ లేవు . అలా రౌడీలుగా మారి, ఆ తరువాత , రాజకీయాలలో చేరి, మంత్రులయిన వారు కూడా ఎందరో . మీరు బిచ్చం వెయ్యక పోతే - వాడు రౌడీ కావచ్చు ; దొంగా కావచ్చు ; మంత్రీ కావచ్చు. వేస్తె - ఆనందంగా , బిచ్చ గాడిగా ఎవరికీ ప్రాబ్లం  కాకుండా వుండి , ఎప్పుడో , ఎక్కడో రాలిపోతాడు .  ఏది బెటర్ ? యిదీ నా ఆలోచన . చాలా యోచన తరువాత , అప్పటినుండి - బిచ్చగాడికి బిచ్చం వెయ్యకుండా పోరాదు - అని నిశ్చయించుకున్నా . కాస్త అది లేటుగా -  నాకు అలవాటుగా మారింది.

కానీ - అదేం పెద్ద గొప్ప పని అన్నట్టు అనిపించ లేదు. నేను యింత కారణాలు వెతికి చేసే పని, చాలా మంది - అసలు ఏ మాత్రం యోచన చెయ్యకుండా , ప్రతి దినం గుళ్ల ముందు చెయ్యడం   చాలా సార్లు చూశాను . అందులో - ఆడవాళ్ళ శాతం యెక్కువ .

మరేం చెయ్యాలి ? 

అప్పుడు నేను రిటైర్ అయిన మొదటి సంవత్సరం.  మా వూళ్ళో "సేవాలయ " అనే అనాథాశ్రమం , వృద్ధాశ్రమం , స్కూలు - కలిపి - బాగా జరుపుతున్న సంస్థ నా దృష్టికి వచ్చింది . అక్కడికెళ్ళి - 5000 రూపాయలు - వారికి వొక రోజు భోజనం కోసమని విరాళం యిచ్చాను . అది నాకు కాస్త బాగా అనిపించింది . మా అన్నదమ్ములందరితో చెప్పాను . వోహో అన్నారు - అంతే .

అలాంటి 5000 రూపాయలు విరాళం , మళ్లీ 4, 5 సార్లు యిచ్చాను . అక్కడికెళ్ళి , ఆ పిల్లలకు వొక స్వీట్ వడ్డించి , వాళ్ళతో బాటు కూర్చుని 2 సార్లు భోజనం చేశాను . యిప్పుడు మరి కాస్త బాగా అనిపించింది . అయినా - పెద్ద గొప్ప పని అని అనిపించ  లేదు.

ఆ తరువాత సంవత్సరంలో - నేను స్టాక్ మార్కెట్ లో - ఎన్నో పరీక్షలలో చాలా బాగా రాసి వుత్తీర్ణుడవడం , అందులో నేను పెట్టుబడి పెట్టిన షేర్లు కాస్త బాగానే  లాభాలివ్వడం జరిగింది .

అప్పుడనుకున్నా - వచ్చే లాభాల్లో - వొక 25 శాతం - ఈ  పిల్లలకు విరాళం గా యిస్తే ఎలా వుంటుంది ? అంతా యోచన చేసి - నా విరాళం 25000 రూపాయలకు పెంచాను. యిలా వొక 5 సార్లు వొక్కొక్క సారి 25,000 రూపాయలుగా యివ్వడం జరిగింది. 

అప్పుడెప్పుడో చదివాను - బిల్ గేట్స్  గారు, వారన్ బఫ్ఫే గారు, మనదేశంలో అజీం ప్రేమ్జీ గారు యిలా ఎంతో మంది - ఎన్నో బిలియన్ల డాలర్లు సంపాదించి అందులో చాలా భాగం ప్రపంచంలోని అన్ని దేశాలలోని బీదలకు ఎన్నో రకాలుగా సహాయం చేసిన వైనం . అందువలన బాగుపడిన కుటుంబాలు, వ్యక్తులు ఎంత మందో చెప్పలేము .

ఇలాంటి ప్రపంచంలోని గొప్ప వాళ్ళ లో, గొప్ప మంచి వాళ్ళతో - ఎవరు పోటీ పడగలరు ? దాతృత్వం అనేది మన దేశం లో వుంది కానీ , అమెరికా లెవెల్ లో లేదనే చెప్పాలి . అందుకే మనదేశంలో యింకా ఆకలి, చదువులేమి , కనీసావసరాల లేమి - అన్నీ వున్నాయి .

యిలా అనుకుంటున్న సమయంలోనే మోడీ ప్రభంజనం  మన దేశం లో వచ్చింది . నాకూ, మోడీ గారు బాగా యిష్టమైన వొక లీడర్ . ఆయన వస్తాడు, వస్తాడు అనగానే - స్టాక్ మార్కెట్ లో వొక ఉప్పెన పుట్టు కొచ్చిం ది ,

నేను పెట్టుబడి పెట్టిన షేర్లు మరి కాస్తా బాగా పైకి పోవడం జరిగింది . అప్పుడనుకున్నా. ముందు అనుకున్న ప్రకారం 25 శాతం యివ్వాలి కదా. వొక వేళ మళ్ళీ షేర్లు పడిపోతే ఎలా?

 కాస్త అనుమానం వచ్చినా, మళ్లీ , చెయ్య గలిగే మంచి పని యిప్పుడే చెయ్యాలి , చేసేద్దాం - అని నేను, నా శ్రీమతి, సేవలయా కు వెళ్లాం . ఈ సారి - ఏదో వొక ఆడ పిల్ల, 5 లేదా 6 వ తరగతి చదువుతున్న పిల్ల , బాగా చదువుతున్న పిల్లను సెలెక్ట్ చెయ్యండి; ఆ పిల్ల చదువులల కయ్యే పూర్తి  ఖర్చు 12 వ తరగతి వరకు ఎంతవుతుందో చెప్పండి . అది వొక విరాళం (ఎండో మెంటు ) గా యిచ్చేస్తానని  చెప్పాను . ఆ ప్రకారమే 80 వేలు విరాళం (ఎండో మెంటు ) గాను మరో 5000 వొక రోజు ఆ ఆశ్రమం భోజన ఖర్చు గానూ  యిచ్చాను . వాళ్ళూ,  బాగా చదివే వొక 5 వ తరగతి పిల్ల పేరులో యిది చేర్చుకున్నారు . ఆ పిల్ల వివరాలు నాకు యిచ్చారు . ఇక పై ఆ పిల్ల ఎలా చదువుతూ వుందో నాకు తెలుపుతాము - అన్నారు .  మేము కూడా అప్పుడప్పుడూ వెళ్లి చూడొచ్చు; మాట్లాడవచ్చు-యిలా ఏదేదో చెప్పారు. ఆ తరువాత - ఏదో మనసులో వున్న మాట వాళ్ళతో చెప్పాను . ఆ పిల్ల 12 వ తరగతి మంచి మార్కులతో పాసైతే , నేను, నా శ్రీమతి అప్పుడూ బాగానే వుంటే - ఆ పిల్ల కాలేజీ ఖర్చులు కూడా యివ్వగాలనో ఏమో చూద్దాం - అని . 

యిలా మోడీ గారు స్టాక్ మార్కెట్ ను మరింత పెంచుతూ వుంటే , నేనూ, మరింత మంది పిల్లల పేరులో , విరాళాలు యిస్తాను కదా అనిపించింది . మరో ఆలోచన కూడా మనసులో మెదిలింది . యిందులో మన నిర్వాకం ఏముంది ? యిలా షేర్ల ధరలు పెరిగేటట్టు మనం చేశామా . అదేదో తానుగా పెరిగింది . మనం అనుకున్న ప్రకారం ఏదో యిచ్చాము .  అంతే  కదా .

యిప్పుడు నాకు 65 సంవత్సరాలు . కనీసం మరో 15 సంవత్సరాలు యిలాగే వుంటే - మరో 20 మంది పిల్లలకైనా - ఎండో మెంటు చెయ్యొచ్చు . యింకా ఎక్కువే చెయ్యొచ్చు కూడా .

ఈ సోదంతా ఎందుకంటే - మన దేశం లో అనాథలు అన్న పదమే వాడకం లో వుండకూడదు . మనమంతా వున్నప్పుడు , మన దేశం లోని ప్రతి బాలుడూ, బాలికా - బాగా చదవాలి . ఆర్ధిక పరిస్థితి కానీ , తల్లిదండ్రులు లేకపోవడం కానీ - పసి పిల్లల భవిష్యత్తుపై  ఎలాంటి చెడు ముద్రా వెయ్యకూడదు . వచ్చే తరాలలో -  రౌడీలుగా , దొంగలుగా, బిచ్చగాళ్ళుగా ఎవరూ వుండకూడదు . యిది మనసులో వుంది . దీనికి - యింకేం చెయ్యాలో చూడాలి.

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్  


1 కామెంట్‌: