28, ఆగస్టు 2014, గురువారం

50 శాతం పౌరులకు రక్షణ లేకుంటే ? మనిషి మృగంగా మారడమంటే ? ఎన్నో శిక్షలు వున్నా ఏ నేరాలు ఆగడం లేదు. ఎందుకు ? "ధనమూలం యిదం జగత్"

50 శాతం పౌరులకు రక్షణ ఎలా ?

కామ , క్రోధ, లోభ ,మోహ, మద, మాత్సర్యాలు - ఈ  ఆరూ  అంతః శత్రువులుగా మన శాస్త్రాలు చెబుతాయి .వీటికి భయం కూడా చేర్చుకోవచ్చు. 

ఇవన్నీ మనలో వుండకూడనివి ; కానీ కొద్దో, గొప్పో వుండేవి. 

ఏ కోరికైనా కామమే. సెక్సు  పరంగా మాత్రమే చెప్పుకో కూడదు . మనలో కోరికలే లేని వాడెవడు ? అందరికీ  వుంటుంది. కానీ, కోరిక ధర్మ బద్ధం గా తీర్చుకుంటే తప్పు లేదు; మంచిదే - అని శాస్త్రాలు చెబుతాయి . 

ధర్మ బద్ధం కాని కోరికే అంతః శత్రువుగా మారి మనల్ని బాధపెడుతుంది. మన ద్వారా, మన చుట్టూ వున్న వారినీ బాధ పెడుతుంది. 

సెక్సు  వాంఛ  శారీరకంగా దేవుడే సృష్టించాడు కదా. అది  తీర్చు కోవడం తప్పెలా అవుతుంది? ధర్మేచ, అర్థేచ, కామేచ   నాతి చరామి - అని ప్రమాణం  చేసి,అది పాటిస్తూ తీర్చుకుంటే - ఆడా , మగా యిద్దరికీ అందులో ఏ ప్రమాదమూ లేదు . యిద్దరికీ సుఖ సంతోషాలు ఆమరణాంతమూ  లభిస్తాయి . 

అలా కాని నాడు , అది దుఃఖ  కారకంగా , సమాజానికి పతన కారకంగా తయారవుతుంది.

అదే జరుగుతూ వుంది  యిప్పుడు. అమాయక అబలలపై బలాత్కారాలు , సామూహిక బలాత్కారాలు , ఆసిడ్ దాడులు , బలాకారాన్ని ప్రతిఘటిస్తే , వారిని క్రూరంగా హింసించి, సెక్సు వాంఛ  తీర్చుకుని, చంపడమో, అంగ వైకల్యం చేయడమో - ఏదేదో చేస్తున్నారు  కొందరు .

మరీ చిన్న చిన్న పసి పాపలపైన కూడా యిది జరగడమూ , అందులోనూ - కుటుంబం లోని వారో , వారికి దగ్గరి వారో యిది చెయ్యడమూ - యివన్నీ ప్రతి రోజూ వార్తా పత్రికల్లో చదువుతూ వుంటే చాలా కష్టంగా వుంది. 

ఈ పరిస్థితి మారాలి . వెంటనే మారాలి . రేపు  కాదు , ఈ రోజు నుండీ, ఈ నిమిషం నుండే మారాలి.  అందుకు ఏం చెయ్యాలి ? పసి పాపల పైన లైంగిక వేధింపు చేసిన వాడికి ఏ శిక్ష వెయ్యాలి ? అసలలా చెయ్యాలనే యోచనే ఎలా మనసులో పుడుతూ వుంది ? ఇది సమాజంలో పెరుగుతూ వున్న  వొక పోకడ . దీన్ని యిప్పుడే యిక్కడే ఆపాలి . మనిషి మృగంగా మారడమంటే యిదే . యిది చేసిన వారికి  కఠినాతి  కఠిన శిక్ష వెయ్యాలి. ఆదైనా, వొక నెల లోపల జరగాలి . అలాగే సామూహిక బలాత్కారం  కూడా, ఏ రకంగానూ క్షమించ రాని నేరం . దానికి వురి తీయడమే - శిక్ష గా వుండాలి. అదీ నెల లోపల జరిగి పోవాలి.

యిది జరుగుతుందా ? జరగాలి. యిది జరగాలంటే - సమాజమంతా మారాలి . అన్ని వ్యవస్థలూ మారాలి . అంటే - మనం వాటిని మార్చాలి .

మొదట పోలీసు వ్యవస్థ దగ్గర ఆరంభం కావాలి. బలాత్కారం జరిగింది - అంటే ఆ ..... అంతే కదా... అన్న మనస్తత్వం పోవాలి . అంతే కాదు . పోలీసు స్టేషన్ కు ఆడ పిల్ల వొంటరిగా రావడానికి భయ పడే - యిప్పుడున్న పరిస్థితి పోవాలి.

యిప్పుడెలా వుందంటే - పోలీసు స్టేషన్ అంటే - న్యాయంగా నడిచే పౌరులు భయపడడము , అన్యాయాలు చేసే వారు భయ పడక పోవడము - యిలా చాలా చోట్ల వుంది . పోలీసు శాఖలో అవినీతి , లంచ గొండి తనం ఎక్కువగా వున్నా పట్టించుకొనే అధికార్లూ తక్కువ. రాజకీయ నాయకులూ తక్కువ . పోలీసు శాఖ లో ఏం జరుగుతోందో - కొంత  వార్తల ద్వారా , మరి కొంత సినిమాల ద్వారా మనకు తెలుస్తూనే వుంది . అయినా , యిది పట్టించు కునే వాడే లేదు.

ప్రతి రోజూ బలాత్కారాలు జరుగుతూనే   వున్నాయి. అందులో కొన్నే పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయి . కానీ - ఆ తరువాత పోలీసు శాఖ ఏం చేసింది , ఘనత వహించిన కోర్టు వారు ఏం చేశారు - యిది చెప్పే వారే లేరు . వొక్కో సారి పోలీసులు అసలైన నేరస్తులను పట్టుకున్నా , రాజకీయ నాయకుల వొత్తిడికి , లేదా, డబ్బు ప్రలోభానికి లొంగి  పోవడం, నేరస్తులు తప్పించుకోవడం జరుగుతూ వుంది .

కామాంధులు బలాత్కారాలు చేస్తే , లోభాంధులు - డబ్బులకో , అధికారానికో లొంగి పోయి - నేరస్తులకు  శిక్ష పడకుండా చూస్తున్నట్టు మనకు అర్థమవుతూ వుంది .

ఇదిలా వుండగా - వొక మహిళా డిస్ట్రిక్ట్ జడ్జీ గారిని , వొక హై కోర్ట్ జడ్జీ గారు  తన ముందు అశ్లీల నృత్యాలు చేయమన్నట్టు - వార్త. అది చేయనందు వలన - ఆమెను మారుమూల ప్రదేశానికి బదిలీ చేసినట్టు వార్త . ఆమె రాసిన లేఖను కంప్లయింట్ గా తీసుకోకుండా , ఆమె చట్ట పరమైన కంప్లయింట్ యివ్వ లేదు కాబట్టి  ఈ విషయం మేం తీసుకోలేం - అని అధికార వర్గాలు చెబుతున్నట్టు  వార్త . హై కోర్ట్ జడ్జీ గారు నేనేమీ చెయ్య లేదని అంటున్నారు . యింత జరిగిన తర్వాత - ఎంతో కొంత విచారణ  జరగాలి కదా ! జరుగుతుందా ? ఏమో ..... కానీ , మహిళా డిస్ట్రిక్ట్ జడ్జీ గారు  మాత్రం రిజైన్  చేసేశారు . యిప్పుడేం జరుగుతుంది ?

బెంగాల్ రాజ్యంలో రామకృష్ణ పరమహంస గారు పుట్టారు . భార్య శారదాదేవిని - దేవత గా  భావించి పూజ చేశారు.  అదే బెంగాల్ లో - వివేకానందుల వారు , ప్రపంచంలో పుట్టిన ప్రతి వారిని సోదర సోదరీమణులారా, లేదా తల్లీ అని పిలిచే సంస్కృతిని సృష్టించారు .   అదే బెంగాల్ లో యిప్పుడేం  జరుగుతూ వుంది? మా ఎదుటి పార్టీ వాళ్ళ యిళ్ళలో  చొరబడి - ఆ యిళ్ళ లోని మహిళలను , మా వాళ్ళ చేత బలాత్కారం  చేయిస్తానని - అక్కడి అధికార పార్టీ MP వొకరు హెచ్చరించారు. వీళ్ళ రాజకీయ కలహాల మధ్య  ఆ మహిళలేం  చేశారు ? అయినా - యిటువంటి దుర్యోధన , రావణుల పరంపరను ఏం చెయ్యాలి?  అక్కడి   ముఖ్య మంత్రి కూడా మహిళే . మహిళా ముఖ్య మంత్రి వుంటే  మహిళలకు  రక్షణ వుంటుందన్న గ్యారంటీ  ఏమైనా వుందా ? ఏమీ లేదు . నేను గొప్ప రౌడీ గర్వం గా చెప్పుకున్న ఆ MP గారు మాత్రం పూర్తి రక్షణ తో వున్నారు. మన పార్లమెంటులో  కూడా - స్పీకర్ గారు మహిళే . మరి యీ  MP  గారిని వారు ఏం  చేసారు; చేయ బోతున్నారు ? ఏమో. వేచి చూడాలి .

ఈ కాలంలో ,  నేను రౌడీని , నేను బలాత్కారాలు చేయిస్తాను అన్న వాడు కూడా MP . ఆ MP గారిని  ఏం చెయ్యాలన్నా - అందరికీ రాజకీయ కారణాలు - అడ్డొస్తాయి . వచ్చే ఎన్నికల్లో  ఆ MP  గెలుస్తాడా . మన లాంటి పరమ మూర్ఖులు  వోటు వేసేంత వరకు  ఆయన గెలుస్తూనే వుంటాడు. 

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి గారు - ఆ... మగ పిల్లలు అలా చేస్తూ వుంటారు .. అని కొట్టి పారేశారు .  యిలా,రాజకీయ నాయకులలో - మహిళల పట్ల నిజంగా వుండవలసిన గౌరవం  అసలు వుండడం లేదు.

బాలాత్కారాలు , సామూహిక బలాత్కారాలు జరిగిన ప్రతి చోటికి మహిళా కమిషన్ వారు వెళ్లాలి. అక్కడి పోలీసు  శాఖను,న్యాయ వ్యవస్థను  కదిలించాలి . సరైన చర్యలు తీసుకునే లాగా చెయ్యాలి . యిలా కాక లేఖలు మాత్రం , అదీ కొన్ని కేసుల్లో మాత్రం , రాస్తూ కూర్చుంటే   - మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది ? నన్నడిగితే - మహిళా కమిషన్ క్రింద వొక పటిష్టమైన సాయుధ, సాధికార రక్షక భట బృందం వుండాలి . కనీసం సామూహిక బలాత్కారాలలో - మామూలు పోలీసు శాఖ కాక , ఈ ప్రత్యేక బృందం రంగం లోకి దిగాలి. వొక వారం లోగా, కేసును పూర్తిగా ఛేదించి, అన్యాయం జరిగిన మహిళకు రక్షణ, వైద్య పరీక్షలు , అనుమానాస్పద వ్యక్తుల విచారణ అన్నిటినీ జరిపించి  మహిళా కోర్టులో ప్రవేశ పెట్టి - నెల తిరిగే లోపు శిక్ష పడే లాగు చెయ్యాలి . యిది ప్రతి  కేసు లోనూ  జరిగిన నాడే మహిళలకు కాస్తైనా ధైర్యం వస్తుంది . రక్షణ లభిస్తుంది. 

చాలా నగరాల్లో - బస్సుల్లోనూ , రైళ్ళ లోనూ , కాలేజీల ముందూ, యిళ్ళ ముందు కూడా - మహిళలను అసభ్యంగా మాట్లాడడము అసభ్యంగా వెకిలిగా ప్రవర్తించడం  జరుగుతూనే వుంది . యిది మనం ఆపలేమా ? ఆప గలం . ఆపాలి. ఎవరు చెయ్యాలి ? ప్రభుత్వం వారే చెయ్యాలి . మహిళలే ప్రభుత్వంలో వున్నత స్థానాలలో వున్న చోట్ల కూడా యిది జరగడం లేదు .

నిజానికి , ఈ విషయంలో - సాంఘిక పరిస్థితులపై చాలా పరిశోధనలు , సర్వేలు జరగాల్సిన అవసరం చాలా వుంది . అసలు ఎందుకు యిలా జరుగుతో వుంది . నేరం  శిక్ష  పడితే చాలా ? నేరం చేసిన వాడికి శిక్ష పడాలని నేనూ వొప్పుకుంటాను. కానీ, భవిష్యత్తు లో నేరం జరగకుండా ఆ శిక్ష ఆపుతుందా ?

యిప్పుడు కూడా హత్యలకు ఉరిశిక్ష వుంది . కానీ హత్యలు ఆగడం లేదు కదా . అలాగే - ఎన్నో నేరాలకు ఎన్నో శిక్షలు వున్నా ఏ నేరాలు ఆగడం లేదు.

ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ?

చట్టం చేసినంత మాత్రాన  నేరాలు ఆగవని  మనం తెలుసుకోవాలి .

ప్రతి నేరానికి , సరైన నేరస్తుడికి , వెనువెంటనే  శిక్ష పడాలి. అప్పుడే - అసలు నేరస్తులకు భయం వుంటుంది . లేదంటే అసలు వుండదు.

ఎన్నో నేరాలలో - అసలు నేరస్తులకు కాక , మరెవరికో శిక్ష పడిన సందర్భాలు ఎన్నో వున్నాయి.    యివి తెలిసినవి ; తెలీనివి మరెన్నో వుంటాయి . పోలీసు శాఖలోను , న్యాయ శాఖలోనూ పూర్తి నిజాయితీ, చిత్త శుద్ధి, న్యాయ నిబద్ధత వుంటే తప్ప - న్యాయం జరుగదు .

డబ్బు కోసం  ఎవరి ప్రక్కనైనా  సరే - వాదించి , గెలిపించాలని కొందరు న్యాయ వాదులు  అనుకోవడం సరైన పద్ధతా ? "ధనమూలం యిదం జగత్" - అని వున్న ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు , న్యాయ వాదులు , పోలీసులు మారితే తప్ప - సాధారణ  పౌరులకు  న్యాయం జరిగే అవకాశం అసలు లేదని నా అభిప్రాయం .

ముఖ్యంగా - యిప్పుడు , 50 శాతం పౌరులైన మహిళలకు రక్షణ రోజు రోజుకూ తగ్గుతూ వుంది .  ఈ పరిస్థితి ని  ఎక్కడి నుండి మార్చాలి మనం ?

నా వుద్దేశంలో  - మన విద్యా వ్యవస్థ సరిపోతే , అందులో , మంచి పౌరులను తయారు చేసే కనీసం వొక దశాబ్దం లో నైనా - మనకు కావలసినంత మంది  మంచి పౌరులు , మంచి పోలీసులు, మంచి న్యాయ వాదులు , మంచి న్యాయ మూర్తులు , మంచి రాజకీయ నాయకులు - వచ్చే అవకాశం  వుంటుంది .

దుర్యోధనుడు  ఎవడో వొకడు ఎప్పుడూ వుంటాడు . రావణుడు ఎవడో వొకడు ఎప్పుడూ వుంటాడు . కాకపోతే , మనకు ధైర్యం, సాహసం, న్యాయ నిబద్ధత  వున్న  రాముడు,కృష్ణుడు , పాండవుల వంటి వారు కూడా కావాలి. అది విద్యా వ్యవస్థ ద్వారానే  జరగాలి . యిప్పుడు మొదట జరగాల్సింది  అదే . చదువు సంస్కారాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, న్యాయాన్ని పిల్లల మనస్సులో, జీవితాల్లో పూర్తిగా నాటే చడువుగా వుండాలి . వూరికే -  సైన్సు , లెక్కలు , జనరల్  నాలెడ్జి  లాంటివి నేర్పేది - చదువే కాదు.

 యివన్నీ నేర్పితే - పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు . మంచి పౌరులుగా మారుతారు . కానీ , యిప్పుడు యివన్నీ మన విద్యా వ్యవస్థలో లేవు గాక లేవు . అందువలననే దేశం దరిద్రంగా , అసహ్యంగా - గంట కో రేపు, రోజుకో సామూహిక బలాత్కారం - చిన్న పిల్లలపై  బలాత్కారాలు  - యిలా తయారయ్యింది .

చట్టాలు రానీ , శిక్షలు పడనీ , కానీ, మన విద్యావ్యవస్థ మారక పొతే - ఏ నేరాలూ తగ్గవు .

ఈ మధ్యలో - పోలీసు వారికి - చాలా, చాలా నేర్పాల్సి వుంది .  పనికి మాలిన రాజకీయ నాయకులను ఎన్నుకునే మన బుద్ధులు కొంత మారాలి. న్యాయ వ్యవష్ట కూడా ఎంతో మారాల్సి వుంది. కొన్ని కేసులు దశాబ్దాల పాటు జరుగుతూ వుంటే , అది న్యాయ వ్యవస్థలో  కూడా వున్న లోపమే కదా . ఆఆ .... మమ్మల్ని మీరేం అనకూడ దంటే ఎలా? మనం అందరం మారాలి ...

= మీ

వుప్పలధడియం  విజయమోహన్


 

1 కామెంట్‌:

  1. అయ్యా

    బృంద/తులసి వృత్తాంతం కొంచెం వివరిస్తారా?

    దేవతలే 'లోక కల్యాల్యాణం' కోసమని తమ వెధవపనులను (క్షమించాలి... 'కానిపనులను')సమర్ధించుకున్నప్పుడు, మనందానిని proper explanationగా భావించి, అంగీకరించినప్పుడు, దేవుళ్ళ అమ్మకి మొగుడైన (దేవుళ్ళని సృష్టించిన) మనిషికి అదేమంత కష్టమా?

    రిప్లయితొలగించండి