4, మార్చి 2014, మంగళవారం

కొత్త రాష్ట్రం ఏది ? తెలంగాణానా -సీమాంధ్రానా ? కె సి ఆర్ ను నమ్మితే...దేన్లో మునిగినట్టు ? కాంగ్రెస్ వారే చెప్పాలి .


కొత్త రాష్ట్రం ఏది ?
తెలంగాణానా -సీమాంధ్రానా 
క్రొత్త రాష్ట్రానికి ఏం కావాలి ?

ఇదీ ప్రశ్న . ఇదివరకెప్పుడూ ఇలాంటి ప్రశ్న , ఏ రాష్ట్ర విభజనలోనూ రాలేదు. వుత్తరాఖాండ్ , ఝార్ఖండ్, ఛత్తీస్ గర్హ్  లాంటి రాష్ట్రాలన్నీ కొత్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన సందర్భంలో - ఈ ప్రశ్నే లేదు. కానీ యిప్పుడొచ్చింది. హైదరాబాద్  కూడా, కర్నూలు, విజయవాడ, విశాఖ  లా వుండి  వుంటే , ఇలాంటి ప్రశ్న వచ్చేది కాదు.  వాళ్ళకూ మనకూ,  ఎందు వల్లనో పొసగ లేదు . పొతే పోనీ . వేరు కుంపటి పెట్టుకుంటే - మనకూ , వారికీ కూడా మేలే - అన్న విధంగా లేదాయె . 

మనం  హైదరాబాదులో రాజధాని పెట్టుకున్నాం. వొక్కటి మాత్రం వొప్పుకుని తీరాల్సిందే . NT రామారావు ముఖ్యమంత్రి  కాకముందు , హైదరాబాదు లో తెలుగు వాతావరణం శూన్యం . ఎక్కడికి వెళ్ళినా , తెలుగు తెలిసిన వారు కూడా - ఉర్దూ లో మాట్లాడే వారు. మరి పట్టణం లో ఏ విధమైన  అభివృద్ధీ  కనిపించేది  కాదు . నిజాముల భవనాలు తప్ప - మిగతా ముస్లిముల యిండ్లు కూడా కూప గృహాలుగా  దర్శనమిచ్చేవి. రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద్ధి ప్రారంభమయ్యింది .  ఆ తరువాతే - అక్కడ కాస్తో కూస్తో తెలుగు మాట్లాడడం కూడా ప్రారంభమయ్యింది . ఆ తరువాత, IT రంగం కానియ్యండి, ఫార్మా రంగం కానియ్యండి - చాలా శీఘ్రంగా అభివృద్ధి  కావడానికి రామారావు గారు , ఆ తరువాత చంద్ర బాబు గారు  కారణం గా నిలిచారు .

ఆ తరువాత మళ్ళీ - కాంగ్రెసు వారి ప్రభుత్వాలు రావడం - క్రమక్రమంగా వున్న విద్యుత్తు  పోయి , కొరతగా మారి  అన్ని రంగాలకు కరెంటు లేదనే స్థితికి వచ్చేసింది . ఆ తరువాత మళ్ళీ - మన రాష్ట్రానికి - హైదరాబాదుకు కూడా -  . క్రొత్త కంపెనీలు రావడం తగ్గి, యిప్పుడు దాదాపు రావడం మానేశాయి . దీనికి కారణం సగం కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత, లంచగొండి తనం కాగా, మిగతా సగం, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి "మధురవాక్కులకు " బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు  కారణం .

అయితే రామారావు గారు, చంద్రబాబు గారు , మిగతా ముఖ్యమంత్రులు కూడా - చేసిన అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి పైగా , హైదరాబాదు లో మాత్రమే  కేంద్రీకరించడం , దాన్ని మాత్రమే అభివృద్ధి చెయ్యడం .  మిగతా నగరాలేవీ కావలసినంతగా అభివృద్ధి చెంద లేదనే చెప్పాలి . అయినా - ఆంధ్రా ప్రజలు తెలంగాణా కు ఏదో అన్యాయం చేసినట్టుగా చిత్రీకరించడం జరిగింది . అందుకు కారణం కే సీ ఆర్ మాత్రమే కాదు . అసమర్థమైన కాంగ్రెస్ నాయకత్వం. వారికి - వారి వారికి కావాల్సిన సొత్తుల సేకరణ తప్ప మరేదీ పెద్దగా పట్ట లేదు. అందుకే వచ్చింది తెలంగాణా వుద్యమం .

తమిళనాడులో చూస్తే - కోయంబత్తూరు లో వున్నన్ని కంపెనీలు - చెన్నై లో కూడా లేవు . ఇప్పుడు  IT  కంపెనీలు కూడా కోయంబత్తూరు లో చాలా వచ్చాయి . వస్తున్నాయి . మనం ఎందుకలా చెయ్యడం లేదు ? - అంటే తమిళనాడు లో ఎలా వుంటే అలా చెయ్యాలని కాదు . రాష్ట్రము లోని ప్రతి ప్రాంతమూ వీలైనంత సమంగా అభివృద్ధి చెందాలి కదా.


ఈ కేంద్రీకరణలో - ఉత్త ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు; ఉత్త కంపెనీలు మాత్రం కాదు - మన ఆర్టిస్టులు, రచయితలు, మేధావులు కూడా హైదరాబాదు కు వెళ్లి - అక్కడే స్థిరపడి పోయారు. యిప్పుడు వారందరూ మా వాళ్ళు కాదు - అనే విధంగా , దేశంలో మరెక్కడా జరగని విధంగా మనకు క్రొత్త రాష్ట్రం ఏర్పడుతూ వుంది. రామారావు గారు , వున్నప్పుడు తెలంగాణా ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత, చంద్రబాబు గారికి కూడా అన్ని ప్రాంతాల ఆదరమూ లభించింది . ఎప్పుడైతే - ఘనతవహించిన  YSR  గారు - అన్ని రకాల భూ ఆక్రమణలను , లంచగొండి తనాన్ని ప్రోత్సహించారో, అన్ని రకాల కుల, మత రాజకీయాలను ప్రోత్సహించారో, - అప్పటి నుండే , KCR గారికి అక్కడి ప్రజలు పట్టం గట్టడం ప్రారంభమయ్యింది .

అది, యిప్పుడు - విభజన కు దోహదం చేసింది . మధ్యలో వచ్చిన సమైక్యాంధ్ర వుద్యమం మంచిదే కానీ - దాని వెనుక నున్న నాయకత్వం సరి లేదు . సమైక్యాంధ్ర అంటే ఏమిటి ? ఏ వొక్కరైనా - తెలంగాణా ప్రాంతంలో కూడా తిరిగి , వారిని నమ్మించే ప్రయత్నం చేశారా ? లేదు కదా . మరి సమైక్యాంధ్ర ఎలా వస్తుంది ? సీమాంధ్ర లో బస్సులు నిలపడం, కార్లు నిలపడం, విద్యుత్తు నిలపడం, హాస్పిటళ్ళతో సహా, అంగళ్ళతో సహా, స్కూళ్ళతో సహా - అన్నింటినీ మూయించడం , పార్లమెంటులో గోల గోల చేసి మన పరువు తీయడం - యిది చేసారే  తప్ప - తెలంగాణా ప్రజలను నమ్మించడం  చెయ్య లేదు ; పార్లమెంటులోని - ఏ ముఖ్య పార్టీనీ నమ్మించ లేదు. కాస్తో కూస్తో ఈ ప్రయత్నం చేసింది వొక్క చంద్ర బాబు మాత్రమే . మిగతా వారిలో - రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రిని నేనే కావాలి - అన్న ఆత్రుత వొక్కటే నాకు కనిపించింది. యిప్పుడు తెలంగాణా వచ్చేసినట్టే . అది  పోనీయండి . జరిగే ప్రతి కార్యం, జరిగే ప్రతి విపత్తు కూడా - మనకొక క్రొత్త అవకాశాన్నిస్తుంది.  అదే ప్రకృతి నియమం . దాన్ని మనం వుపయోగించుకుంటామా - అన్నదే యిప్పుడు ముఖ్యం .  


యిప్పుడు సీమాంధ్ర ప్రజలు కొత్త రాజధాని నిర్మించుకోవాలి . కొత్తగా పరిశ్రమలను ఆకర్షించాలి . కొత్త, అత్యున్నత విద్యాలయాలను ఆకర్షించాలి. నదులలోని నీరు శ్రీకాకుళం నుండి చిత్తూర్ జిల్లా వరకు అన్ని ప్రాంతాలకూ తీసుకు రావాలి. సినిమా , ఫార్మా, ఐ టీ రంగాలకు కావలసిన ప్రోత్సాహాన్ని, సదుపాయాలను కలుగజెయ్యాలి . యివన్నీ చెయ్యాలంటే - స్వార్థ రహిత నాయకులకే పట్టం కట్టాలి . లంచగొండి తనం తో , కుల మత రాజకీయాలతో, ఫాక్షన్ రాజకీయాలతో పైకొచ్చిన వారిని ప్రక్కన బెట్టాలి . మంచి నాయకులైన జే పీ లాంటి వారిని - యిటు వైపుకు ఆకర్షించాలి .

కానీ, యిప్పుడు జరుగుతున్నదేమిటి ? ఎవరు అవినీతికి పేరు మోశారో , వారికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్ట బెడతారేమో అన్న అనుమానం వస్తూ వుంది .

అది వొక  ప్రక్క వుండనిస్తే , మన క్రొత్త రాజధాని ఎక్కడ వుండాలన్నది - పనికి మాలిన స్వార్థాలలో, రాజకీయాలలో చిక్కుకుంటూ   వుంది . మా గ్రామంలో  పెడితే బాగుండు - మా గ్రామంలోనే పెట్టాలి - అనే విధంగా మన (వి)నాయకులు ఘోషిస్తూ వున్నారు .

రాజధాని కనీసం 50 చ కి మీ  విస్తీర్ణం అయినా వుండాలి . వీలైనంతగా రాష్ట్రానికి మధ్యలో వుండాలి . కనీసం వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కు వీలైనంత దగ్గరగా వుండాలి . మనకు వున్న పెద్ద నేషనల్ రహదారికి వీలైనంత సమీపంగా వుండాలి . మంచినీటి వసతి వుండాలి; లేదా, కృష్ణ, గోదావరులనుండి నీరు తీసుకురావడానికి అనుకూలంగా వుండాలి.  IT పరిశ్రమకు అనుకూలంగా వుండాలి . ఫార్మా పరిశ్రమకు అనుకూలంగా వుండాలి .

మనమే వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కట్టుకునే వరకు - చెన్నై ఎయిర్పోర్ట్ ను వాడుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ, మళ్ళీ హైదరాబాదు ను, అక్కడి ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చెయ్యడం మన మూర్ఖత్వమే అవుతుంది . కానీ వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ మనం కట్టుకునే లాగా సరిపడేటంత  స్థలం యిప్పుడే వుంచుకోవాలి. వొక చిన్న ఎయిర్పోర్ట్ వెంటనే కట్టుకోవాలి కూడా.  చెన్నై - కలకత్తా నేషనల్ రహదారికి వీలైనంత సమీపంలో వుండాలి . చిత్తూరుకు, శ్రీకాకుళానికి రెంటికీ అందుబాటులో వుండాలి - అవే రాష్ట్రానికి ఎల్లలు గనుక. 

గుజరాత్ కూడా అహమదాబాద్ నే పెట్టుకోలేదు . గాంధీనగర్ ను కట్టుకున్నారు. సీమాంధ్ర  కూడా అలాంటి క్రొత్త నగరాన్నే నిర్మించుకోవాలి. అక్కడ స్థలాలను ఆక్రమణ దారుల స్వంతం చెయ్యకూడదు . వొక్కొక్క స్థలాన్నీ - వొక్కొక్క నిర్ణీత పథకానికి కేటాయించాలి . యిళ్ళ  స్థలాలను , సరైన ధరకు సరైన వాళ్లకు అమ్మాలి . అక్కడ వుండాల్సిన ప్రభుత్వోద్యోగులకు - యిళ్ళ స్థలాలను కేటాయించాలి . ఎన్ని క్వార్టర్స్  కావాలో - అన్ని కట్టడానికి స్థలం పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో - యివన్నీ నెల్లూరుకు దగ్గరగా , నేషనల్ రహదారికి సమీపంగా, కనీసం 50 చ కి మీ ఖాళీ స్థలం నిర్దేశించి, ఏదైనా ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ సంస్థకు - ఆ పని వొప్పగిస్తే , బాగుంటుంది - అనిపిస్తుంది .

యిది ఎవరు చెయ్యగలరు ? నా ఉద్దేశంలో - చంద్రబాబు గారు , జే పీ  గారు - మోడీ గారితో కలిస్తే - కలిసి ప్రభుత్వం నెలకొల్పితే - చాలా సులభంగా సాధ్యమవుతుంది . చాలా బాగా సాధ్యమవుతుంది . నాకు మిగతా వారిపై నమ్మకం లేదు . లంచగొండి తనానికి పేరు మోసిన కాంగ్రెస్ వారిపై అసలు నమ్మకం లేదు . అది ఏ కాంగ్రెసైనా  సరే .

ఆలోచించండి మరి . యిందులో మళ్ళీ, కొట్లాటలకు , ఉద్యమాలకు తావు లేదు . వుండకూడదు .

సరే . కెసిఆర్ గారితో కలిస్తే  ఏమవుతుందో కాంగ్రెస్ వారికి ఈ రోజు తెలిసొచ్చింది. తెలంగాణా యివ్వండి - మా పార్టీని మీ పార్టీ లో విలీనం చేసేస్తానన్న పెద్ద మనిషి - తెలంగాణాను కాంగ్రెసు వారు చాలా కష్ట పడి యిచ్చేశాక - యిప్పుడిక విలీనం ప్రసక్తే లేదంటున్నారు .

కాంగ్రెసుకు యిది కావాల్సిందే . కె సి ఆర్ గారిని నమ్మకండి - అని ఎందరో రాసారు; ఎన్నో రకాలుగా చెప్పారు. ఆయన నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు తప్ప  వేరే రావాయె .   దేశాన్ని నట్టేట్లో దింపిన కాంగ్రెసును,  కె సి ఆర్ గారు ఈ రోజు నట్టేట్లో దింపారు. అయినా పిచ్చి గాకపోతే - కె సి ఆర్ ను నమ్మితే , కాంగ్రెసుకే కాదు, తెలంగాణా ప్రజలకూ చివరికి అదే అవుతుంది కదా. కానీ వారు బాగుండాలి; వారు మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిద్దాం. అలాగే - దేశమంతటా , నమ్మకం కోల్పోయిన కాంగ్రెసుకు , అది పాత కాంగ్రెసైనా, క్రొత్త కాంగ్రెసైనా, ఏదైనా  సరే - దాన్నే మళ్ళీ నమ్మితే - దానికే మళ్ళీ వోటేస్తే  - కే సి ఆర్ ను నమ్మినట్టే వుంటుంది  మన గతీ . 

అయితే - కొంత మంది మారొచ్చు . మారిన నాయకులు మంచి దార్లో నడుస్తారా అన్నది  చూడాలి. వారి పాత చరిత్ర చూడాలి . స్వార్థ రాజకీయాలు, కుల మత  రాజకీయాలు, నేర చరిత్ర, లంచగొండి తనం ,గూండా చరిత్ర లాంటివి లేని వారిని ఎవరినైనా ఆహ్వానించ వచ్చు . నిజానికి - అందరూ అలా మారాలి . అప్పుడే రాష్ట్రం బాగుంటుంది .

సర్వే  జనాః  సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్




5 కామెంట్‌లు:

  1. అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి పైగా , హైదరాబాదు లో మాత్రమే కేంద్రీకరించడం
    తప్పు తప్పు. సగానికి పైగా అంటారేం. మూదొంతులకు పైగా అనవలసి ఉండగా!
    ఇంతచేసినా శ్రీమాని మధురవాక్యధురీణ కంచంరావుగారు అభివృధ్ధి అంతా నిజాములు చేస్తే దాన్ని సీమాంధ్రులు చెడగొట్టారని సిధ్ధాంతం చేసారు. అయోమయం ఏమీలేదు. తెలుగును హైదరాబాదులో ప్రవేశపెట్టటమే తిరోగమన చర్య అని వారి అభిప్రాయం. తెలుగుముద్రవేసి హైదరాబాదు సంస్కృతిని దెబ్బగొట్తటం తప్పు కదా? ఇప్పుడు తెలంగాణాగాంధీ బిరుదుకోసం ప్రయత్నిస్తున్న ఆయన అహింసాయుతంగా ఇక్కడి అభివృధ్ధికి సంకేతంగా సీమాంధ్రులు అనుకుంటున్న ఐటీ ఫార్మారంగాలను బయటకు నెట్టి మళ్ళీ నిజాం దొరల రాజ్యాన్ని పునర్వికాసానికి తెస్తారన్నమాట అందరూ గ్రహించటం మంచిది.

    రిప్లయితొలగించండి
  2. "రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద్ధి ప్రారంభమయ్యింది"

    This is just propaganda without any factual basis.

    రిప్లయితొలగించండి
  3. కాంగ్రెసు కేసీఆర్ని నిజంగానే నమ్మిందా? కేసీఆర్ కాంగ్రెసుని నిజంగానే నమ్మాడా?ధర్మరాజుని అడిగితే యేం చెబుతాడు?విక్రమార్కుణ్ణి అడిగితే యేం చెబుతాడు?

    రిప్లయితొలగించండి