22, ఫిబ్రవరి 2014, శనివారం

నా సలహా ఏమిటంటే ... సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో? చెప్పకూడదో ? తెలుసుకోండి . యిది సలహాల సైన్స్ - శ్రీకృష్ణుడి సలహా భగవద్ గీత


నా సలహా ఏమిటంటే ...


మనకు సలహా లివ్వడం పరిపాటి . అడిగిన వాడికీ , అడగని వాడికీ , దావన పోయ్యే  ప్రతి దానయ్యకూ, బస్సులోనో , ట్రైన్ లోనో ప్రక్కన కూర్చున్న వాడికీ,  వినే వాడికీ, వినని వాడికీ, ప్రొద్దు పోకుండా కూర్చున్న సోమరి వాడికీ - అందరికీ సలహాలిస్తాం . మరొకరు మనకిస్తే - వొక్కో సారి వింటాం . వొక్కో సారి వినం .  వాళ్ళూ అంతే .

సాధారణంగా సలహాలన్నీ ఉచిత సలహాలే . కానీ డాక్టర్ సలహా కావాలంటే , ఫీజు యిచ్చుకోవాలి . అలాగే , వొక మంచి లాయరు , చార్టర్డ్  అకౌంటెంట్ , స్టాక్ బ్రోకర్ లాంటి వాళ్ళ సలహాలకు కూడా ఫీజు యిచ్చుకోవాలి .

ప్రపంచంలో  బాగా పేరు మోసిన పాత సలహాదారు  శ్రీకృష్ణుడు .

ఆయన ఎప్పుడు సలహా యిచ్చాడు ? అర్జునుడు  తన గాండీవము , శస్త్రాస్త్రాలు - అన్నీ తీసుకుని దేవతలిచ్చిన దివ్య రథాన్నెక్కి , కౌరవులను అందరినీ చంపేస్తాను - అని బయల్దేరాడు . అతని సారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు . తీరా యుద్ధ భూమికి వచ్చి  - భీష్ముల వారిని , ద్రోణుల వారిని, కౌరవులను చూసే సరికి , అర్జునుడిలో  విషాదం పుట్టుకు వచ్చింది . నాకు ఎంతో యిష్టమైన తాత గారిని, గురువును, ఇతరులను చంపి వచ్చే  రాజ్యమూ , ఆ నెత్తుటి కూడు నాకక్కర లేదు - అని,  శస్త్రాస్త్రాలు అన్నీపారేసి, ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు . అప్పటికీ శ్రీ కృష్ణుడు  ఏమీ మాట్లాడ లేదు . దాదాపు వొకటిన్నర ఛాప్టరు " నేను యుద్ధం చెయ్యను . ఎందుకంటే ..."  అని ఎన్నో , ఎన్నెన్నో కారణాలు అర్జునుడు చెబుతూ వచ్చాడు . అన్నీ విన్న శ్రీకృష్ణుడు అప్పుడు కూడా ఏ గొప్ప సలహానూ యివ్వ లేదు. మొదట కాస్త మందలించాడు . నీకసలు బుద్ధుందా ? యుద్దానికొచ్చేసి ,  యిక్కడ శస్రాస్త్రాలు పారేసి,  పేడి లాగా  మాట్లాడుతున్నావా ?  నలుగురూ నవ్వి పోతారు  - అన్నాడే కానీ అప్పుడూ సలహా యివ్వ లేదు .

ఈ తిట్లు అర్జునుడిలో - ఎక్కడో - తను ఏదో తప్పు చేస్తున్నట్టే  వుంది - అన్న భావన కలిగించింది .

అప్పుడు అన్నాడు - కృష్ణా ! నేను నీ శిష్యుడిని . నీ దాసుడిని . నాకు నీవు తప్ప మరొకరు మంచి చెప్పే వారు , సక్రమ మార్గంలో పెట్టె వారు ఎవరూ లేరు. దయ చేసి - నాకు సరైన మార్గం చూపించు . నువ్వు చూపించే  మార్గం లోనే నేను నీ వెనుకే వస్తాను. మామేకం శరణం మమ అని పూర్తిగా కృష్ణుడి ముందు దాసోహం  అనేశాడు .

అప్పుడు మొదలైంది శ్రీకృష్ణుడి సలహా . అదే భగవద్ గీత . దాసోహం అనే వారికి ఉపయోగ పడే భగవంతుడి  సలహాల సంపుటి . నాకు తెలిసి అంత కంటే  గొప్ప విజ్ఞాన సంచిక మరొకటి లేదు. రాదు.

అందులో - ఎన్ని రకాల విజ్ఞానం పొందుపరచ బడిందో చూస్తే - చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని గురించిన వివరణ తో కూడిన వ్యాఖ్యానం నా ఆంగ్ల బ్లాగ్ 'wisespiritualideas.blogspot.com ' లో రాస్తూ వున్నాను . సమయం వచ్చినప్పుడు క్లుప్తంగా ఈ తెలుగు బ్లాగ్ లో కూడా రాస్తాను.

యిక్కడ శ్రీకృష్ణుడి పాలసీ మనం గమనించాలి .
 • మొదటిది - అడగనిదే సలహా యివ్వ కూడదు .
 • అడిగినా - ఆ అడిగిన వాడు మనం యిచ్చే సలహా తీసుకుంటాడా, లేదా చూసి,   తీసుకునే  వాడికే సలహా యివ్వాలి . అలా లేని వాడికి సలహా యివ్వ కూడదు .
 • దాసోహం - అన్న వాడికి తప్పకుండా యివ్వాలి .
 • వాడు - చెయ్య గలిగేదే చెప్పాలి కానీ చెయ్య లేనిది చెప్ప కూడదు.
 • సలహా అడిగాడు కదా అని - అడిగిన వాడిని చిన్న చూపు చూడ కూడదు
 •  అడిగిన వాడికి - 4,5 మార్గాలుంటే అన్నీ చెప్పాలి.  ఆ మార్గాలన్నిటిలో  వుండే సాధక బాధకాలన్నిటినీ చెప్పి - అందులో ఏది , ఎందుకు మేలో చెప్పాలి .
 • అడిగిన వాడిని ఉత్సాహ పరచాలే తప్ప , నిరుత్సాహ పరచ కూడదు .
 • ధర్మ మార్గంలో వుండే మార్గాలు చెప్పాలే తప్ప - అధర్మ మార్గాలు కాదు .

- యిలా , సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో  చేసి చూపిన వాడు  శ్రీ కృష్ణుడు . ఆధునిక కాలంలో మనం కమ్మ్యూనికేషన్ స్కిల్స్ అని అంటాము కదా . అందులో ఆయన్ను మించిన నిష్ణాతుడు మరొకరు లేడు . భగవద్ గీత అంతా ఈ స్కిల్ల్స్ కు వొక శాస్త్రీయ గ్రంధం లాంటిది .

సరే . ఈ సలహాలను గురించి - ప్రపంచం లో నలు మూలలా ఏమనుకుంటున్నారు - అన్నది చూద్దాం .

 • మన సుమతి శతక  కారుడంటాడు - వినదగునెవ్వరు చెప్పిన , వినినంతనే వేగపడక వివరింప  దగున్ - అని. అది 'సలహా' కూ వర్తిస్తుంది .
 • సత్యం బ్రూయాత్ ; ప్రియం బ్రూయాత్ ; న బ్రూయాత్ సత్యమప్రియం :- అంటే సత్యమే చెప్పాలి . కానీ వినేవారికి  ప్రీతికరం గా వుండేటట్లు   చెప్పాలి.  అప్రీతికరం గా సత్యాన్ని చెప్ప వద్దు . యిది చాలా పురాతనమైన సూక్తి . యిది సలహాలు చెప్పే వారికి పూర్తిగా వర్తిస్తుంది. కఠినంగా మాట్లాడే వాళ్ళు సలహా యివ్వకుండా వుండడమే , వుభయులకూ మంచిది .  నేను కట్టె  విరిచినట్టు మాట్లాడే వాడిని - అనే వాళ్ళలో సత్యాని కంటే , నిర్దయ, అమానుషత్వం ఎక్కువగా వుంటాయి . వారు సలహాలు యివ్వడానికి అనర్హులు
 • సలహా యిచ్చే వారికి తీసుకునే వారి పట్ల అభిమానం , అక్కర వుండక పొతే - వారి సలహా సరైన సలహా కానే కాదు.  అలాగే, తీసుకునే వారికి, ఇచ్చే వారి పట్ల గౌరవము ,  అభిమానము లేకపోతే - వారికి సలహా ఇవ్వనే రాదు .
 • సలహా పాటిస్తే వచ్చే పరిణామాలు ఎలా వుంటాయో పూర్తిగా అర్థం చేసుకుని కానీ - సలహా యివ్వ కూడదు; పాటించ కూడదు . 
 • సలహాలు - తీసుకునే వారి మనస్స్థితి , ధైర్య సాహసాలు , వివేకము, విజ్ఞానము , వయస్సు - వీటిని బట్టి మారిపోతూ వుంటాయి . క్రూర మృగం కనిపిస్తే - పోరాడి వధించమని సుక్షత్రియునికి చెప్పాలి . చెట్టెక్కి తప్పించుకోమని   మిగతా వారికి చెప్పాలి .
 • మూర్ఖుడు ఎవరి సలహా తనకు అక్ఖర్లేదు - అని అనుకుంటాడు . కానీ వివేక వంతుడు  యితర్ల ఆలోచనలు వింటాడు - అంటుంది బైబిల్ .
 • మంచి సలహాలు అడగని, తీసుకోని వాడికి - జీవితంలో పడే దెబ్బలే - సరైన సలహాలనివ్వ గలదు   - అంటాడు హొరేజ్ .
 • నా జీవితమే - నేనివ్వగలిగే సలహా - అన్నది మహాత్మా గాంధీ అభిప్రాయం .
 • సహాయం చెయ్యడం - సలహా యివ్వడం కంటే మంచిది - అని మార్క్విస్  అనే ఆయన అంటాడు
 • నువ్వు నీలాగే వుండు - అన్నది కొంత మందికి మనం యిచ్చే మహా మూర్ఖమైన సలహా - అంటాడు థామస్ యల్ మేసన్. బాగు లేని వాడే సలహా అడిగే వాడు - నీవు అలాగే వుండు అనడం సలహా కానే కాదు . 
 •  పోగాలం దాపురించిన వారు - ఆప్త వాక్యమును వినరు - అని ఏకాలం నాటిదో వొక అభిప్రాయం . మరో రకంగా చూస్తే - ఆప్త వాక్యము (శ్రేయోభిలాషులు , వివేకులు అయిన వారు ఆప్తులు ) వినక పొతే - పోగాలము దాపురిస్తుందని అర్థం. 
 • కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా శయనేషు రంభా - అని భార్యను గురించి వొక "గొప్ప మాట" - భార్య యిలా వుంటే బాగుండునని అన్నారు . అటువంటి  భార్యను మించిన  సలహాదారు మరొకరు వుండరు - అని అర్థం .
 • అలాంటి (భర్త పైన అమితమైన ప్రేమ వున్న) భార్యల మాటలు విని బాగు పడిన భర్తలు, కుటుంబాలు ఎంతో మంది వున్నారు. అటువంటి భార్య దొరకడం దేవుడిచ్చిన వరం - అని తమిళ సామెత . కొంత మంది  (భర్త తప్ప మిగతా విషయాలపై ప్రేమ వున్న) భార్యల మాటలు విని - నాశనమయిన కుటుంబాలూ వున్నాయి . . 
 • సలహాల వరకు - ప్రపంచం లో అడిగే వారి కంటే - యిచ్చే వాళ్ళు చాలా, చాలా  ఎక్కువ అని వొకాయన అభిప్రాయం .
 • అయాచిత సలహాలు యిచ్చే వారికి - వాటిని ఆచరించడం లో వున్న సాధక బాధకాలు అర్థం కావు - అన్నది వొక పూర్వోక్తి .
 • యెవడైనా వొక్కడు నిన్ను  గాడిదా అంటే దాన్ని అసలు పట్టించుకోకు . కానీ మరో యిద్దరు అన్నారంటే - వెంటనే వొక కళ్ళెం కొనుక్కొని తగిలించుకో - అంటాడు తాల్ముడ్ . 
 • పడవలో నుండి - క్రింద నీళ్ళలో మునుగుతున్న వాడికి సలహా యివ్వడం తేలిక . పాటించడం కష్టం .
 • అన్నీ నువ్వనుకున్నట్టు జరిగితే - మరి నేనెందుకు ? దేవుడెందుకు ? నువ్వనుకున్నట్టు జరిగేవి కొన్ని . నేననుకున్నట్టు జరిగేవి కొన్ని . 99 శాతం దేవుడనుకున్నట్టు , నువ్వూ , నేనూ  అనుకోని విధంగా జరుగుతాయి . అందుకే వివేక వంతుల సలహాలు అడగాలి . పాటించాలి . 
 •  నీకే తెలీని విషయాలలో అస్సలు సలహా యివ్వకు 
 •  ప్రేమ లాంటి కొన్ని విషయాలలో - వద్దు, కాదు లాంటి సలహాలను  ఎవరూ వినరు గాక వినరు. 
 • కొంత మందికి సలహా చాలదు . థెరపీ కావాలి. 
 • ధనవంతుడు బీద వాడికి సలహా యివ్వడం మనం చూడొచ్చు . బీద వాడు ధనవంతుడికి సలహా యివ్వడమో , అది యితడు పాటించడమో చూడడం చాలా అరుదు .
 •  ధనవంతుడు - బీదవాడికి యిచ్చే సలహా - సాధారణంగా పాటించ లేనిది గానే వుంటుంది . 
 • నిన్ను వూరికే పొగిడే వాడి సలహాలో నిజం సాధారణంగా వుండక పోవచ్చు . 
 •  నీ సలహా ఎప్పుడూ కాస్త క్లుప్తంగానే వుండనీ - అంటాడు హోరాజ్ 
 • కొంత మంది సలహా అడుగుతున్నారో , తమ కష్టాల్లో భాగస్వామ్యం తీసుకో మంటున్నారో - బాగా జాగ్రత్త గా గమనించి మరీ సలహా యివ్వండి . 
 • వొకరికొకరు సలహా యిచ్చుకో వడం లోనే -అందరి రక్షణా వుంది (బైబిల్  వాక్యం )
 • రాజులకు మంత్రులూ వుంటారు . భట్రాజులూ వుంటారు . మంత్రుల వద్ద పొగడ్త ఎదురు చూడకూడదు . భట్రాజుల వద్ద సలహా అడగ కూడదు .
 • మంచి సలహా దొరికితే - పది మందికి చెప్పండి .
 • తండ్రిని మించిన శ్రేయోభిలాషి అరుదు . ఆయన యిచ్చే సలహా తీసుకోండి . తరువాత మంచి వివేక వంతులనూ  అడగండి . వొక్కో సారి తండ్రి సలహా మిన్న గా వుండొచ్చు -అది మెదడు నుండి మాత్రం కాక , హృదయం నుండి కూడా వస్తుంది గనుక . 
 •  స్టాక్ మార్కెట్ కు చాలా మంది రోల్స్ రాయిస్ కార్లో వస్తారు. సబ్ వే లో నడిచి వెళ్ళే వారి వద్ద సలహా తీసుకుంటూ వుంటారు.    ( వారన్ బఫ్ఫే)
 • పోప్  వద్ద సెక్స్ ను గురించి సలహా అడగొద్దు . అవి ఆయనకు తెలిసి వుండ కూడని విషయాలు  - GB  షా 
 •  సలహా యిస్తే యివ్వు కానీ - ఆ తరువాత ఎదుటి వారు అది పాటించే తీరాలని అనుకోకు . వారిని నీవే సరి చేయాలని అనుకోకు . 
 •  హృదయ కవాటం తెరిచి లేక పొతే - అందులోకి ఏ సలహా ఎక్కదు . అది వృథా శ్రమ . 
 •  నువ్వు  చెయ్యలేనిది ఎదుటి వాడు చెయ్యాలని సలహా యివ్వకు .  అలాగే ఎదుటి వాడు చెయ్య లేనిది - చెయ్యమని సలహా గా యివ్వకు 
 •  నువ్వు మొయ్య లేనిది , ఎదుటి వాడు ఎలా మోయ్యాలో చెప్పకు . అది నువ్వు మోసినప్పుడే తెలుస్తుంది  - అది ఎలా మొయ్యాలో  
 • మన దేశాన్ని ఎంత బాగా ఎలా నడపాలో చెప్ప గలిగే వాళ్ళంతా ఆటో డ్రైవర్ లు గానో , అదీ కాకుండానో  వున్నారు . ఎంత దురదృష్టం!
 • గొప్ప గురువు చెప్పేదంతా గొప్ప సలహా నే -  వొక మంచి గురువు ఎల్లప్పుడూ కావాలి . 
 • ప్రతి రోజూ - లోకాః సమస్తాః సుఖినో భవంతు ; సర్వే జనాః సుఖినో భవంతు; అని మొదట అనుకోండి . ఆ భావం వుంటేనే - సలహాలు యివ్వండి . లేకపోతే  వద్దు .
 • చిట్ట చివర - నా సలహా ఏమిటంటే - ప్రతి రోజూ , మొట్ట మొదట, మీరు, మీకే వొక మంచి సలహా యిచ్చుకోండి .  వీలైనంత పాటించండి . అప్పుడే - అది మంచి సలహానా , కాదా అని మీకు తెలుస్తుంది . 
సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్   

2 వ్యాఖ్యలు:

 1. ప్రపంచంలో బాగా పేరు మోసిన పాత సలహాదారు శ్రీకృష్ణుడు .

  కాదండీ విదురుడు. ఆయన నిత్యం చెవిలో సలహాలమీదసలహాలతో పోరు పెట్టినా గుడ్డిరాజు పుత్రమోహంతో వినలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. విదురుడు ధృతరాష్ట్రుడికి సలహాదారే . నిజమే. విదురనీతి చాలా ప్రసిద్ధమైనది కూడా . ధృతరాష్ట్రుడి వద్ద అది పని చెయ్య లేదన్నది కూడా నిజమే . కానీ , శ్రీకృష్ణుడు మాత్రమే సలహాను వొక సైన్స్ లాగా వాడాడు. అర్జునుడికి మాత్రమే కాదు . భగవద్ గీత మనకందరికీ కూడా చాలా గొప్ప సలహాల నివ్వ గల విజ్ఞాన సర్వస్వం. నిజానికి పాండవ విజయానికి కారణం శ్రీకృష్ణుడి సలహాలే . నేను యుద్ధం చెయ్యను . ఆయుధం కూడా ముట్టను - అన్న వాడు కౌరవుల ప్రతి సేనాపతి మరణానికీ కారకుడయ్యాడు , కేవలం తన సలహాలతో .

  ప్రత్యుత్తరంతొలగించు