14, మార్చి 2014, శుక్రవారం

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే - ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే 
ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?


జీవితంలో  ఎన్నో మలుపులుంటాయి . జీవితంలో సంతోషం తెచ్చే మలుపులు కొన్ని అయితే , భయానకం చేసేవి కొన్ని ; దుఃఖకరమైనవి మరి కొన్ని ; అనూహ్యమైన మలుపులు కూడా ఎన్నో, ఎన్నెన్నో . 

మన  కళ్ళ ఎదురుగా, ఎంతో  మంది జీవితాలలో ఇలాంటివి జరగడం - మనం అయ్యో; అయ్యో పాపం - యిలా అనుకోవడం  జరుగుతూనే వుంటుంది . కానీ - మన జీవితాలలోనే జరిగితే - మనం ఏం అనుకుంటాం ? ఎలా ప్రతిస్పందిస్తాం ?

రక రకాలుగా స్పందిస్తాం . కొన్ని  ఏళ్ల  క్రితం, మాకు తెలిసిన వొకమ్మాయి కి పెళ్లై అత్తగారింటికి వెళ్ళింది. మొదటి రోజే ఆమె భర్త పిచ్చికుక్క కాటు వల్ల "హైడ్రోఫోబియా " వచ్చి చనిపోయాడు.  పెళ్లి కి కొద్ది రోజుల ముందే పిచ్చి కుక్క కరిచిందట . కానీ, దాన్ని  వారు పట్టించుకోలేదు . ఏదో, ఆంటీ బయోటిక్స్ వేసుకున్నాడు. తరువాత మరిచిపోయారు . ఆ తరువాత పెళ్ళయ్యింది. పెళ్లి కూతురుతో సహా వారి ఊరుకు వెళ్ళారు . వెళ్ళిన కొన్ని ఘంటల  లోనే - కుక్క కాటు ప్రభావం పని చేసి - చనిపొయ్యాడు. అతడు చనిపోయిన విధానాన్ని గురించి చిలవలు పలవలుగా అప్పట్లో వర్ణించే వారు .

కొద్ది రోజుల క్రితం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ లో - యిద్దరు విద్యార్థులు , కాలేజీ ఆవరణ లోని చిన్న కుక్క పిల్లలతో ఆడుకుంటూ  వుండగా, అవి వారిని కరిచింది; వో రెండు రోజుల్లో ఆ విద్యార్థులకు హైడ్రోఫోబియా వచ్చి చని పోయారు . కరిచిన వెంటనే , సరైన వాక్సీను వేసుకుని వుంటే , వారి బ్రతికే వారే . అంతే కాదు; ఆ కాలేజీ ఆవరణ లో ఈ మధ్య కుక్కల సమూహం చాలా ఎక్కువగా పెరిగిందట.  అది చూసి సరైన చర్యలు తీసుకున్న వారు లేరు . యిటువంటి అసమర్థత , మూర్ఖత్వం మన దేశం లో చాలా ఎక్కువ .

పిచ్చి కుక్క కరిస్తే - యింత భయంకరంగా పని చేస్తుందా - మనుషులు యిలా చనిపోతారా - అని నాకూ చాలా ఆశ్చర్యంగా వుండేది. అయితే - దానికి ఏం చెయ్యాలో, నాకూ వొకప్పుడు తెలీదు . చాలా మందికి యిప్పటికీ తెలీదు. మన సమాజంలో , మన విద్యా విధానంలో , యిదొక పెద్ద లోపం . అతి పెద్ద దురదృష్టం . 

ఎప్పుడో చనిపోయిన మొగలాయీ వంశం, ఆంగ్ల వైస్ రాయ్ లు - లాంటి వారిని గురించి అంతా చదువుతాం . కాని మన వూర్లో , మన వీధిలో పోతున్న కుక్క మనల్ని కరిస్తే - ఏం చెయ్యాలో - వూర్లో 90 శాతం మందికి తెలీదు.   చాలా ఊళ్లలో పిచ్చి కుక్క కాటుకు వెయ్య వలసిన మందులూ లేవు .

చాలా మందికి కుక్కలంటే అమితమైన ప్రేమ. కుక్కలకు కూడా తమ యజమానులైన మనుషులపై అమితమైన విశ్వాసము. నిజానికి కుక్కలకున్నంత విశ్వాసము, ప్రేమ మరే జంతువుకూ వుండడం మనం చూడలేము . అది మంచిదే. కానీ, యింట్లో పెంచే కుక్కలకు కూడా, అప్పుడప్పుడూ ఆంటీ రాబీస్ వాక్సిన్ వేస్తూ వుండాలి. అలా చేస్తే వాటి వల్ల, మనకు ప్రమాదం లేదు. అలా వాక్సిన్ వేయించకుంటే వాటికీ ప్రమాదమే. వాటి వల్ల మనకూ ప్రమాదమే.  వాటికి రాబీస్ రోగం వచ్చిందంటే, అవీ చావడం ఖాయం; వాటివలన మనయిళ్ళలో , వొకరో, ఇద్దరో చావడం కూడా అంతే ఖాయం .

యిక వూరికుక్కలైతే , వాటికి ఎప్పుడు రాబీస్ వస్తుందో చెప్పలేము . ఎప్పుడైనా రావచ్చు ; ఎన్నో కారణాల వల్ల  రావచ్చు . రాబీస్ వస్తే , ఆ కుక్క కనిపించిన  మనిషినల్లా కొరకడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు . యిది ఎన్నో వూళ్ళలో జరిగింది . యికముందూ జరుగుతుంది . నిజానికి ప్రపంచ దేశాలన్నింటిలో ఈ రాబీస్ మరణాలు మన దేశం లోనే చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. వూరకుక్కల్ని చంపరాదని మనం చట్టం కూడా చేసుకున్నామని వికీ పేడియా వెబ్ సైట్ చెబుతో వుంది . వూరకుక్కల్ని చంపరాదు సరే ;వాటికి రాబీస్ రాకుండా చేసే చట్టాలేవీ మనం చేసుకోలేదు . అసలు అటువంటి ప్రయత్నాలే మన దేశంలో లేవు . యిదొక పెద్ద మూర్ఖత్వం .

చాలా దేశాలలో అసలు రాబీస్ అనే రోగమే లేదు, రాదు . మరి మన దేశంలో యింత ఎక్కువగా ఎందుకు వుంది? కొన్ని కొన్ని ఊర్లలో, వూరకుక్కలు మనుషుల కంటే  ఎక్కువ సంఖ్యలో వున్నాయి . రాత్రి పూట ఎవరూ మరో  వీధికి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ఊళ్లలో వుంది .  అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఇవేవీ పట్టించుకునే  పరిస్థితి లేదు . పంచాయితీ పాలన అంటామే కానీ - అది చాలా దరిద్రం గానూ, అసమర్థంగానూ వుంది.  పూర్తి  లంచ గొండి తనం తో నిండి వుంది.  మన ప్రభుత్వ విధానాలు కూడా చాలా అసమర్థంగా వున్నాయి .

అమెరికా , చైనా లాంటి దేశాలలో - యిప్పుడు రాబీస్ ప్రమాదం చాలా తక్కువ . ముందు చెప్పినట్టు - కొన్ని దేశాలలో అసలు లేనే లేదు . మన దేశంలోనే చాలా ఎక్కువ గా వుంది . భూత దయఅంటే యిటువంటి మూర్ఖత్వం అని కాదు అర్థం . చైనా లోని బీజింగ్ లో యింటికి  వొక   కుక్కకు  పైగా పెంచ రాదని; అది కూడా, 14 ఇంచీలు (35. 5సెం. మీ) కంటే పెద్దవిగానూ వుండకూడదు ;భయం కొలిపేది గానూ వుండకూడదు -అని చట్టం కూడా చేశారట. యిది కూడా రాబీస్ రోగం రాకుండా నివారించడం కోసమే .

రాబీస్ రోగం రాకుండా, ముందే వేసుకునే వాక్సీన్ వుంది కాని, వచ్చింతరువాత దాన్ని పోగొట్టే మందే  లేదు ; మరణం ఖాయం . రాబీస్ వచ్చిన కుక్క ఎంత మంది మనుషుల్ని కరుస్తుందో చెప్ప లేము . ఎంత మంది నైనా కరవ వచ్చు . దానికి చూసిన వారినందిరినీ కరవాలని అనిపిస్తుంది. కరుస్తూ పొతుంది. కరచిన వారందిరికీ రాబీస్ వచ్చే ప్రమాదం వుంది - వారు వెనువెంటనే  వాక్సీన్ వేసుకోక పొతే. 

మన రాష్ట్రం గురించి , ఎన్నో ఊర్లలో ఈ పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి, రాబీస్ వచ్చిన వారి గురించి వార్తలు - అప్పుడప్పుడూ వస్తూనే వున్నాయి.  అయినా - రాష్ట్ర ప్రభుత్వం గానీ, పంచాయితీలు గానీ ఈ కుక్కలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నమే చెయ్యడం లేదు . దీనికి తోడు , బ్లూ క్రాస్  వారి గొడవ పెద్దది . చస్తున్న మనుషుల గురించి వారికి అస్సలు పట్టదు. కుక్కలకు పిచ్చి పట్టడం గురించి కూడా వారికి బాధ లేదు . కానీ కుక్కలను యెవరు ఏం చేసేస్తారో - అన్నది మాత్రమే బాధ.

మనుషుల క్షేమం మొదట - కుక్కల క్షేమం తరువాత గా వుంటే తప్ప దేశం  బాగుపడదు . మన ప్రభుత్వాలు చేసిన పనికి మాలిన చట్టాలు చాలావి యిలాగే వున్నాయి .

కుక్కల సంఖ్య , ముఖ్యంగా  ఊరకుక్కల సంఖ్య గణనీయంగా తగ్గాలి . వాటికి కుటుంబ నియంత్రణ పథకాలు వున్నాయి  కాని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా లేదు . ప్రతి జిల్లా కలెక్టరూ వొక్క వారం రోజులు , పోలీసు, పంచాయితీ, బ్లూ క్రాస్ - యిలా అన్ని విభాగాలనూ కూడదీసి , కుక్కల కుటుంబ నియంత్రణ 100 శాతం చేయిస్తే తప్ప , ఊరకుక్కల బెడద తగ్గదు . రాబీస్ ప్రమాదం వుండనే వుంటుంది .

అలాగే , మన స్కూళ్ళలో , కుక్కలు కరిస్తే - వెంటనే ఏం చెయ్యాలో చెప్పే వొక పాఠం తప్పకుండా  వుండి తీరాలి . కుక్కలను పెంచాలంటే , ఎలాంటి నియమాలు పాటించాలో తెలియాలి .

 నన్ను కూడా ఆరేళ్ళ క్రితం వొక పిచ్చి కుక్క , వెనుక నుండి వచ్చి,  కరిచింది . నన్ను కరిచిన కుక్క మళ్ళీ యింకెంతో మందిని కూడా కరిచిందట.  ఆ తరువాత , దాన్ని ఎవరో చంపేశారట.   నేను మాత్రం - వెంటనే , 5 నిమిషాల లోపే , నాకు తెలిసిన వొక డాక్టరుకు ఫోను చేశాను . ఆమె సలహా ప్రకారం , వెంటనే, కుక్క కరిచిన శరీర భాగాన్ని సోపు తో కడిగి, వేగంగా వెళ్ళే నీళ్ళలో మరింత బాగా కడిగాను. అక్కడున్న కుక్క నోటి లోని సలైవా వీలైనంత పూర్తిగా పోవాలి. అది మొదట చెయ్య వలసిన పని . వెనువెంటనే, దగ్గరున్న డాక్టరు దగ్గరికి వెళ్లి ఆంటీ రాబీస్ వాక్సీన్ ఇంజెక్షన్ చేయించుకున్నాను . ఆ తరువాత , మరో నాలుగు ఇంజెక్షన్లు డాక్టర్ చెప్పిన రోజులలో - వేయించుకున్నాను. మనం చెయ్యాల్సింది యింతే . యిది చేస్తే, మరిక భయం లేదు .

కానీ, యిది చెయ్యకపోతే - కొన్ని రోజులలోగానే రాబీస్ రావచ్చు . లేదా, కొన్ని మాసాలలో రావచ్చు . వొక్క సారి  రాబీస్ లక్షణాలు వస్తే, మళ్ళీ మందే లేదు.  వొక్కో సారి మనం మంచ్జ్హి కుక్క అనుకునేది , రాబీస్ కుక్కగా వుండవచ్చు . కాబట్టి, కుక్క కాటు ఏ  మాత్రమూ అశ్రద్ధ చెయ్య తగనిది .  పైన చెప్పిన వైద్యం వెనువెంటనే  చెయ్యాలి . నాకు ఆయుర్వేదమంటే , చాలా యిష్టం . చాలా విషయాలకు ఆయుర్వేద మందులే వాడతాను . అయినా కుక్క కాటుకు మాత్రం - ఆంటీ రాబీస్ వాక్సీన్  తప్పని సరి . 

మీ వూళ్ళో ఊరకుక్కలు ఎక్కువగావుంటే - వెంటనే పంచాయితీ వారికో , కలెక్టరు గారికో రిపోర్ట్ చెయ్యండి.  వారిద్వారా , వాటి పెరుగుదలనూ అరికట్టాలి ;  వీలైతే , వాటిని, వూరికి దూరంగా వదిలి వేసే  ఏర్పాటూ చెయ్యాలి . ఏదైనా కుక్క అందరినీ కరవాలని  చూస్తుంటే - దానికి పిచ్చెక్కిందనే అనుకోవాలి . అది ఎవరినీ కరవనీకుండా జాగ్రత్త పడాలి.  అది కరిచిన వారూ, బరికిన వారూ - అందరూ ఇంజెక్షన్లు వేసుకుని తీరాలి .  ప్రతి వూర్లోనూ , గ్రామంలోనూ , ఈ వాక్సీన్ వుండి తీరాలి. యిది కరిచిన వెంటనే , వేసుకుంటే  చాలా మంచిది . ఎంత త్వర పడితే - అంత మేలు . అందుకని, మీరున్న ఊళ్లోనే వాక్సీను వుండి తీరాలి - మీకు అందుబాటులో వున్న డాక్టరు గారి దగ్గర వుండాలి . ముఖ్యమైంది - యిది అందరికీ తెలిసుండాలి .

ఇదండీ సంగతి . ప్రతి వారం చదువుతున్న రాబీస్ చావులను చూస్తూ వుంటే; చదువుకున్న వారు కూడా చేస్తున్న నిర్లక్ష్యం , దాని ఫలితాలు  చూస్తూ వుంటే - యిది తప్పక రాయాలనిపించింది .   మీకు తెలిసిన వారికి తప్పక చెప్పండి .

సర్వే  జనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి