19, మార్చి 2014, బుధవారం

శ్రీకృష్ణుడా?యదువీరులా ? శల్య సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ? మీ నిజ జీవితంలో ఏది కావాలి మీకు ?


శ్రీకృష్ణుడా - యదువీరులా ?  
ఎవరు కావాలి మీకు ? 
శల్య  సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ?
ఏది కావాలి మీకు ? 
 

ఈ మహా భారత కథ మీకు తెలిసే వుంటుంది. కానీ ఈ కథ వెనుక దాగివున్న జీవిత సత్యం మీకు తెలుసా ?  

నిజానికి , మహా భారతంలో వుండే అనేక పిట్ట కథలలో , అలాగే , అందులోని అనేక ముఖ్య సంఘటనలలో - ఈ రోజుకూ మనకు కావలసిన జీవిత సత్యాలు, జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించ గల జీవిత సూత్రాలు  - ఎన్నెన్నో నిక్షిప్తమై వున్నాయి . 

యిటువంటి, యింత గొప్ప ఇతిహాసం - ప్రపంచం లో మహా భారతం వొక్కటే . దీన్ని మించిన పుస్తకం, కావ్యం , యితిహాసం మరెక్కడా మరొక్కటి లేదు. కాకపొతే , దీన్ని సరైన రూపంలో - ప్రపంచానికి, మనం అందించలేక పోతున్నాము.  అందువలన మహాభారతం లాంటి మహత్తర గ్రంథం కూడా మరుగున పడిపోతున్నది.  మన భారత ప్రభుత్వం వారి వైఫల్యాల్లో యిది కూడా ప్రముఖమైనదిగా చెప్పుకోవాలి. 

సరే . యిప్పుడు అసలు కథకు వద్దాం . 

మహాభారత యుద్ధం ఆరంభం చెయ్యడానికి - ఇరువైపులా సన్నాహాలు జరుగుతున్న సమయం అది . పాండవులూ, కౌరవులూ భారత దేశం లోని అందరు రాజుల సహాయమూ అర్థిస్తున్న సమయం  అది.  ఆ కాలంలో, చాలా మంది రాజులకు వొక నియమం వుండేటట్టు కనిపిస్తుంది. ఎవరు తమను ముందుగా సహాయం అడుగుతారో , వారి ప్రక్కన యుద్ధం చెయ్యడమే కానీ , వారి వైపు ధర్మం వుందా , లేదా - అన్నది పెద్దగా చూడ లేదు వారిలో చాలా మంది . 

ఉదాహరణకు శల్యుడు. శల్యుడు మద్ర దేశపు రాజు . చాలా కాలానికి  ముందు, వొక సారి శల్యుడి సేన, పాండురాజు సేన వొక చోట ఎదురు పడతాయి. అప్పుడు శల్యుడు , శల్యుడి సేనాపతి పాండురాజుతో మాట్లాడే సందర్భం వస్తుంది. శల్యుడి ప్రక్కన సన్నగా ముచ్చటగా వున్న అతడి సేనాపతి పాండురాజు దృష్టిని ఆకర్షిస్తాడు. అది చూసి శల్యుడు , మనలో ఎవరు విజయం చేపట్టుతారో - అది యుద్ధం చేసైనా సరే , లేదా వివాహ బంధం తో నైనా సరే - తేల్చుకుందాం, అంటాడు. నిజానికి అతడి సేనాపతి అతడి చెల్లెలైన మాద్రి .  పాండురాజు సంతోషంతో మాద్రిని వివాహం చేసుకుంటాడు. దీన్ని బట్టి మనకు ,  ఆ కాలంలో మహిళలు కూడా - అందరు కాక పోయినా , కొందరైనా - యుద్ధ విద్యలను అభ్యసించే వారని తెలుస్తుంది . యిలా శల్యుడు పాండవులకు మేనమామ  అయిన వాడు ;

భారత యుద్ధానికి ముందు శల్యుడు , పాండవుల వైపు యుద్ధం చెయ్యాలని , సైన్యం తో సహా బయలుదేరుతాడు. కానీ, మార్గ మధ్యం లో దుర్యోధనుడు శల్యుడికి విందు భోజనం పెట్టి, పెట్టినది పాండవులే అని శల్యుడు అనుకుని , ఆ విందు పెట్టిన వారికి ఏ సహాయమైనా చేస్తానని శల్యుడు నుండి దుర్యోధనుడు కుయుక్తితో మాట తీసుకుని - ఆ తరువాత చెబుతాడు , ఆతిథ్యం యిచ్చింది , కౌరవులని , శల్యుడు వారివైపే వుండాలని . 

యిలా ఏదో చిన్న కారణానికి , శల్యుడు కౌరవుల వైపు యుద్ధం లో చేరిపోతాడు . ఇది దుర్యోధనుడి కుయుక్తి . అయితే , ఈ కుయుక్తిని కాస్త ఆలస్యంగా, కౌరవులకు మాట యిచ్చిన తరువాత,  తెలుసుకున్న శల్యుడు - మళ్ళీ ధర్మరాజు వద్దకు వెళ్లి తన విచారం వెలి బుచ్చుతాడు.  అప్పుడు ధర్మ రాజు, శ్రీకృష్ణుడు, కాస్త ఆలోచించి -  శల్యుడికి వొక సలహా యిస్తారు.  యుద్ధంలో, ఏదో వొక సమయంలో కర్ణుడు సేనాధిపతి అయిన తరుణంలో, శల్యుడు అతనికి సారథ్యం వహించ వలసిన పరిస్థితి వస్తుంది ; ఆ సమయంలో  శల్యుడు , తన మాటలతో కర్ణుడిని నిర్వీర్య పరచవలసినదిగా చెబుతారు. ఈ విధంగా , కర్ణుడికి శల్య సారథ్యం , దాని ఫలితంగా కర్ణుడి మరణానికి శ్రీకృష్ణుడి  సలహాతో యుద్ధానికి ఎంతో ముందే పునాది వెయ్యడం జరుగుతుంది. దుర్యోధనుడి కుయుక్తి అతనికే ఆపద తెచ్చిపెడుతుంది. 

మరి కృష్ణ సారథ్యం గురించి తెలుసుకోవాలిగా . యుద్ధానికి శ్రీకృష్ణుడి సహాయం అర్థించడానికి, అర్జునుడూ దుర్యోధనుడూ , యిద్దరూ దాదాపు ఏక కాలంలో వస్తారు.  వారు వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ వున్నట్టు నటిస్తూ వుంటాడు . వచ్చిన దుర్యోధనుడు , కృష్ణుడి తలవైపున్న ఆసనం లో కూర్చుంటాడు . అదో అహంకారం - నేను మహారాజాధిరాజును, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర కూర్చోవడమేమిటని.  అర్జునుడు కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు.  దుర్యోధనుడి మనసులో అహంకారం . అయినా అతడికి కృష్ణుడి సహాయం కావాలి, యుద్ధం లో. అర్జునుడి మనసులో కృష్ణుడి పట్ల స్నేహానుబంధం;మమతానుబంధం; భక్తిభావం; అన్నీ వున్నాయి.  అర్జునుడికి యెలాగైనా సరే, కృష్ణుడు కావాలి ; కేవలం యుద్దానికని కాదు . అది అతనికి కృష్ణుడితో వున్న జన్మ జన్మల అనుబంధం. అందుకని అతడికి కృష్ణుడే కావాలి.

కృష్ణుడు లేస్తాడు. లేచినట్టు నటిస్తాడు. జగన్నాటక కర్త గదా . లేచిన వెంటనే కాళ్ళ వద్ద నున్న ఆర్జునుడిని చూస్తాడు. కుశల ప్రశ్నలు వేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడినీ చూస్తాడు . అతనితోనూ మాట్లాడుతాడు. ఆ తరువాత అడుగుతాడు విషయం ఏమిటని. యిద్దరూ విషయం చెబుతారు. దుర్యోధనుడు చెబుతాడు - నేనే మొదట వచ్చాను, కాబట్టి , నువ్వు నాకే సహాయం చెయ్యాలని . కానీ, కృష్ణుడు అంటాడు - కానీ, నేను మొదట అర్జునుడి నే చూశాను; అతడినే అడిగాను విషయమేమిటని . అయినా, మీరిద్దరూ , నాకు కావాల్సిన వారే కదా . యిద్దరికీ సహాయం చెయ్యడం నా ధర్మం కదా . కాబట్టి, మీకు వొక నిర్ణయాధికారం యిస్తాను. నేను నిరాయుధుడిగా, అస్త్రం పట్టకుండా, వొకరి వైపు వుంటాను ; మరొకరి వైపు నాతో సమానమైన 10 వేల మంది యదు వీరులు, శస్త్రాస్త్రాలలో ప్రవీణులు , వారు యుద్ధం కూడా చేస్తారు. వారు మరొక వైపు వుంటారు . 

అయితే , మీయిద్దరిలో  చిన్న వాడు  అర్జునుడు గనుక - మొదట కోరుకునే అవకాశం అతడికే యిస్తున్నాను - అంటాడు .    

దుర్యోధనుడికి కోపం . శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి గనుక ఎలాగో యదు వీరులను వారికి యిచ్చి తాను  యుద్ధం చెయ్యకుండా తమ ప్రక్క కూర్చుంటాడేమో నన్న అనుమానం . 

కానీ , అర్జునుడి మనసులో శ్రీకృష్ణుడు తప్ప మరేమీ లేదు. ముల్లోకాలను యిచ్చినా అవేవీ వద్దు గాక వద్దు , కృష్ణుడే కావాలి అన్న మనో భావం వున్న వాడు . మరో అనుమానం , ఆలోచన ఏవీ లేకుండా, తాను కృష్ణుడినే  కోరుకుంటాడు .
కృష్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తాడు . దుర్యోధనుడి మనసులో - ఈ అర్జునుడెంత మూర్ఖుడు , యుద్ధం చేసే పది వేల మంది వీరులను వదిలి పెట్టి, యుద్ధం చెయ్యని ఈ శ్రీకృష్ణుడిని ఎన్నుకున్న పరమ బుద్దిహీనుడు - అనుకుంటాడు . సంతోషంతో, పదివేల మంది యదు వీరులను వెంట బెట్టుకుని హస్తినాపురానికి వెళ్లి పోతాడు . 

యుద్ధం చెయ్యని ఆ శ్రీకృష్ణుడే - కౌరవుల అందరు సేనాపతుల మరణానికి ఏదో విధంగా కారణమవుతాడు . అనేక ఆపదల నుండి, పాండవులలో ప్రతి  వొక్కరినీ  రక్షించిన వాడూ అవుతాడు. అంతే కాదు. దుర్యోధనుడిపై  ఎంత ప్రీతిభావం వున్నా, కృష్ణుడి కి ఎదురు పక్షంలో యుద్ధం చెయ్యలేనని చెప్పి , తీర్థ యాత్రలకు బలరాముడు వెళ్లి పోవడానికి కారణం అవుతాడు.

భీష్మ,ద్రోణ, కర్ణుల శస్త్రాస్త్రాల నుండి, అన్ని రకాలుగా అర్జునుడి రక్షణకు చివరి వరకు తానే కారణం గా - శ్రీకృష్ణుడు  నిలుస్తాడు.

అన్నిటినీ మించి , అర్జునుడి మనసులో విషాద భావం బలంగా నాటుకుని వున్న సమయంలో - అర్జునుడికీ , అర్జునుడి పతాకం లో వున్న తన మరో భక్తుడు హనుమంతుడికీ - సంజయుడి ద్వారా, వ్యాసుడి ద్వారా మనకూ-  భగవద్ గీత లాంటి అత్యున్నతమైన వొక సైన్స్ ను బోధిస్తాడు శ్రీకృష్ణుడు . అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగే ప్రశ్నలే - మన జీవితాలలో , మనం ఎదుర్కొనే ప్రశ్నలు . అన్నిటికీ , శ్రీకృష్ణుడు  సశాస్త్రీయమైన సమాధానాలు యిస్తాడు . 

గీత అనే ఆ సైన్స్ ను అర్థం చేసుకున్న వారి జీవితాలలో - విషాదానికి చోటు లేదు . ఆనందానికి అలవి లేదు . జ్ఞానానికి అంతు లేదు . సంపూర్ణ ఆరోగ్యానికి మూల సూత్రాలు అన్నీ గీతలో వున్నాయి.  ఆనంద మయ జీవితానికి మూల సూత్రాలు యిందులో వున్నాయి. విజయానికి కావలసిన  అన్ని మెట్లూ యిందులో వున్నాయి. గీతను A  to Z  ఆఫ్ లైఫ్  అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణుడు  అర్జునుడికి ఏదో మతం గురించి బోధించనే లేదు. విజ్ఞానము, జ్ఞానము - అదీ జీవితానికి వొక్కొక్క నిముషమూ వుపయోగపడేవి చెప్పాడు . ఎన్నో రకాల కిటుకులూ , టెక్నిక్స్  చెప్పి - యిందులో నీకేది కావాలో అది నిర్ణయించుకో అన్నాడు. శ్రీకృష్ణుడు అహింస బోధించ లేదు. యుద్ధం ఎందుకు, ఎవరితో, ఎప్పుడు , ఎలా చెయ్యాలో చెప్పాడు .  ఏది ఎలా ధర్మం అవుతుందో చెప్పాడు . మనిషి గుణాలు ఏవి , అవి ఎలా వస్తాయి, ఏది ఎప్పుడు వుంటే మేలు - శ్రేష్టమైనది ఏది - అది ఎలా అలవరచుకోవడం - యివన్నీ గీతలో వున్నాయి . ఈనాటి మనస్తత్వ శాస్త్రానికి ఏమీ తెలీని , గొప్ప మనస్తత్వ శాస్త్రం గీతలో వుంది . ఈ నాటి ఆరోగ్య శాస్త్రానికి తెలీని ఎన్నో ఆరోగ్య సూత్రాలు గీతలో వున్నాయి . కాకపొతే , గీతను బట్టీ పెట్టడం ముఖ్యం కాదు. అది తప్పని కాదు. అది మంచిదే . కానీ అంత కంటే ముఖ్యం - అందులోని అంతరార్థం బాగా ఆకళించుకోవడం , పాటించడం .

వొక అర్జునుడు తనకు పది వేల మంది యదు వీరులు వద్దు - శ్రీకృష్ణుడే కావాలి - అని కోరుకుంటే ,   ఎంత మేలు జరిగింది - అర్జునుడికీ , పాండవులకూ , మనకూ .

మరి మీరేం కోరుకుంటూ వున్నారు ? మీకేం కావాలి ?

యదు వీరులు అంటే -  మనం మరొకరితో  శత్రుత్వం పెంచుకుని ,కొట్లాడి , యుద్ధం చేసి,  సంపాదించాలనుకునే    విజయం . అక్కడ విజయం రావచ్చు; రాక పోవచ్చు . విజయం వచ్చినా , అందులో వచ్చే సంతోషం చాలా తక్కువ ; అది ఎక్కువ కాలం నిలువదు కూడా .

శ్రీకృష్ణుడు అంటే - మనం మొదట - మన బలహీనతల పైన యుద్ధం చేసి విజయం సంపాదించడం . ఇది సాధిస్తే  - మిగత ప్రపంచం పై విజయం సంపాదించడం ఎంత సులభమో గ్రహించడం.  ఈ విజయం, దీని ద్వారా వచ్చే ఆనందం నిరంతరం , మహోన్నతం అని గ్రహించడం , దీన్ని అనుభవించడం. దీన్లో ప్రాపంచిక విజయమూ వుంది; పారమార్థిక విజయమూ  వుంది .

యడువీరులు అంటే - పరిమాణం ; సంఖ్య ; ఆంగ్లం లో క్వాంటిటీ  అనవచ్చు . శ్రీకృష్ణుడు అంటే - ఉత్తమత్వం ; వుపయోగత్వం ; ఆంగ్లం లో క్వాలిటీ - అనవచ్చు . మరి , మీకేది కావాలి?

సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్

( ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ - బ్రాండ్ ఈక్విటీ  సెక్షన్ లో " సేనను కాదు ; కృష్ణుడిని ఎన్నుకోండి ; క్వాంటిటీ  కాదు; క్వాలిటీ ఎన్నుకోండి " అన్న వొక  హెడింగ్ చూసిన సందర్భంగా రాయడం జరిగింది. కానీ ఆ  వ్యాసానికీ, ఈ వ్యాసానికీ మరే సంబంధం లేదు . )

3 వ్యాఖ్యలు:

 1. ఇక్కడే మన పిల్లల్ని కంఫ్యుజ్ చెస్తున్నాం. ధుర్యోధనుడు చెస్తే అది మోసం అన్నం.. అదే క్రిష్ణుడు చెస్తే వొప్పు అంటున్నాం..

  http://madebymaster.com/

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లాక్షాగృహం నుంచీ మొదలు పెట్టి మాయా ద్యూతంతో రాజ్యాన్ని హరించటంతో ఆగకుండా ద్రౌపదీ వస్త్రాపహరణం వరకూ యెన్ని ఘోరాలు చెశాడో మీకు తెలుసు కదా?

   వనవాసంలో కూడా వాళ్ళ పాటికి ఉందనివ్వకుండా తన గొప్ప చూపించుకోవటానికి ఘోషయాత్ర పేరుతో వెక్కిరించాలని చూశాడనేదీ మీకు తెలుసు.

   ఆఖరికి రాయబారంలో మర్యాదగా అడిగిన అయిదూళ్ళు కూడా ఇవ్వకుండా తనే యుధ్ధానికి కారణ మయ్యాడనేది మీకు తెలుసు.పోనీ యుధ్ధమయినా న్యాయంగా చేశాడా?అభిమన్యుడనే ఒక కుర్రాడు మహావీరు లందరికీ ముచ్చెమటలుపట్టిస్తుంటే దానకర్ణుడుకూడా సత్రువుకి ఆయుధమివ్వనే క్రూరత్వంతో నిరాయుఢుడ్ని చేసి చంపడమూ తెలుసు.

   అయినా మీకు కంఫ్యుజన్ గానే ఉందా?

   తొలగించు
  2. చిరంజీవి గారూ , మనకు ఇలాంటి అనుమానం రావడం కొంత సహజమే . నేను కాదనను . యిక్కడ ప్రశ్న వొక్కటే వస్తుంది . ఏ అధర్మాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ? వొక్కొక్క సారి అధర్మాన్ని మనం ఎదుర్కోలేక పోతాం. అప్పుడేం చెయ్యాలి అని ? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ద్రౌపదిని నిండు సభలో మానభంగం చెయ్యడానికి ప్రయత్నించినపుడు భీష్మ ద్రోణులు కూడా మౌనం వహించారు . అది వారు చేసిన చేసిన పాపమే అని చెప్పక తప్పదు . అది వారికీ తెలుసు . అందుకనే - తమ చావుకు వారు తామే సిద్ధ పడ్డారు . కానీ దుర్యోధన, దుశ్శాసన కర్ణులు - దాదాపు నేటి కాలపు సామూహిక బలాత్కారం లాంటిది - నిండు సభలో, అందరి ఎదుట చేసిన వారు . మనం NTR గారి 'కర్ణ' సినిమా చూసి కర్ణుడు అందరి కంటే మంచివాడు అని ముద్ర వెయ్య కూడదు. ద్రౌపదికి, కర్ణుడితో సహా వారు, చేసిన సామూహిక బలాత్కారానికి , వారికి మరణ శిక్ష తప్ప మరో శిక్ష లేదు . కానీ అది, ఎలా ఎప్పుడు అమలు చెయ్యాలి -అన్నదే ప్రశ్న అవుతుంది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు , వీరికి అండగా వుంటే , వారినీ తొలగించక తప్పదు. అధర్మానికి అండగా నిలుస్తాననే వారు కూడా శిక్షార్హులే. భీష్ముడు, ద్రోణుడు తమ చావు ఎలా రావాలో దాదాపు తామే ఎన్నుకున్నారు . కర్ణుడికి వున్న దివ్యాస్త్రాలు యివన్నీ కూడా తొలగించక తప్పదు . కర్ణుడి చావు - అతడు ద్రౌపదీ మానభంగంలో వ్యవహరించిన తీరుకు , అభిమన్యుడిని కూటనీతితో సంహరించిన తీరుకు లభించిన శాపం మాత్రమే . శ్రీకృష్ణుడు ఎవరికి ఏది ఎలా యివ్వాలో - వారికది అలా యిచ్చాడు . కర్ణుడికి కడపట చెప్పనూ చెప్పాడు - అతడికెందుకు వీర మరణం లభించ లేదో. నన్నడిగితే - ఈ రోజుకూ - సామూహిక బలాత్కారం చేసిన వారికి సరైన శిక్ష - మరణ శిక్షే -అని చెబుతాను. మళ్ళీ, దానిలో ప్రెసిడెంట్ గారి క్షమ , యివన్నీ దండగ . వొక సుప్రీమ్ కోర్ట్ చెప్పిన తర్వాత, సామూహిక బలాత్కారం చేసింది వీరే - అని నిర్ద్వంద్వం గా తెలిసిన తరువాత - వెను వెంటనే మరణ శిక్ష అమలు చెయ్యాలి . వారు ఎంత పెద్ద వారైనా సరే . దుర్యోధనుడి లాంటి మహారాజైనా సరే . అదే ధర్మం . అయినా వొక్కో సారి సందేహం వస్తుంది . శ్రీకృష్ణుడిని , ధర్మాన్ని - అర్థం చేసుకోవడం సులభం కాదు కదా . భారతం లోనూ , గీత లోనూ - మన ప్రశ్న లన్నింటికి సమాధానాలు వుండనే వున్నాయి . చాలా ప్రశ్నలు అర్జునుడే అడిగాడు కూడా .

   తొలగించు