1, ఏప్రిల్ 2014, మంగళవారం

మూర్ఖుడితో సర్దుకుంటారా ? మూర్ఖత్వాన్ని ఎదిరిస్తారా ? - 5 బుద్ధిహీనత సిద్ధాంతాలు - మీరు బుద్ధిమంతులా ?

బుద్ధిహీనత (మూర్ఖత్వం)

ఎలా వస్తుంది ? ఎలా పోతుంది ?




ఆంగ్లంలో 'స్టుపిడిటీ' అంటే - తెలుగులో 'బుద్ధిహీనత' లేదా , 'మూర్ఖత్వం' అని తర్జుమా చేసుకోవచ్చు. 

వున్న విషయాలు తెలియక పోవడం వేరు. తెలిసి,  లేదా, నేను తెలుసుకొను - అని మంకు పట్టు పట్టి , ఆలోచన లేకుండా, తెలిసిన వాళ్ళను అడగకుండా - ఏదేదో చేసెయ్యడం , తద్వారా, తనకూ, తన చుట్టూ వున్న వారికి కష్టాలు ,  నష్టాలు కలుగ జెయ్యడం - యిది బుద్ధి హీనత సాధారణ లక్షణాలు - అంటారు కార్లో  నారియా కిపోలా. 

ఎప్పుడైనా సరే - ఎవరో చెప్పితే  విని , మనలో ఎవరూ బుద్ధి హీనులు కాము . మనకు మనమే బుద్ధిహీనతను కొని తెచ్చుకుంటాము ; లేదా, ఆపాదించుకుంటాము. అంటే - మన బుద్ధిహీనత కు మరొకరు కారణం కాజాలరు . దానికి కారణం మనమే . మన ఆలోచనా విధానమే .

సరే . మనలో ఎవరైనా , ఎల్లప్పుడూ  బుద్ధి హీనులుగానూ,. మూర్ఖులుగానూ  వుంటామా ; వుండగలమా ?  వుండ లేము . వొకప్పుడు  బుద్ధిని బాగానే ఉపయోగిస్తూ , మరొకప్పుడు బుద్ధిని సరిగ్గా ఉపయోగించకుండా మన మూర్ఖత్వాన్ని ప్రదర్శించు కుంటాము .

ఎందుకిలా ? భగవద్ గీతలో శ్రీకృష్ణుడు అంటాడు - మన మనస్సే మన శత్రువు - మనం బుద్ధి మాట విననంత కాలం . కానీ , అదే మనసు , బుద్ధి మాట -వింటే  మన మిత్రుడు గా మారి పోతుంది - అని .

అంటే బుద్ధి మాట వినే మనసు   సరైన నిర్ణయాలు తీసుకోనిస్తుంది . బుద్ధి మాట వినని మనసు, మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది . 

నా ఉద్దేశం లో - "బుద్ధిలేని తనం" -అంటే - బుద్ధిమాట ను మరీ ఎక్కువగా చంపేసి , బుద్ధి లేని మార్గంలో మనసు వెళ్లి పోతుంటే - మనిషి అందరి అభిప్రాయంలో మూర్ఖుడు గా, బుద్దిహీనుడు గా ముద్ర వెయ్య బడతాడు . అప్పుడు - మనకు ఆ పోకడే అలవాటై పోతుంది .

ఉదాహరణకు - పొగ త్రాగడం హానికరం . అందరికీ తెలుసు . కానీ చాలా మంది పొగ త్రాగే వారున్నారు . అది యిలాగే ప్రారంభమవుతుంది. మొదటి సారి బుద్ధి - మనకు బుద్ధి చెబుతుంది .  వద్దు - అంటుంది. కానీ ఏదో ప్రోద్బలం , ఎవరో మూర్ఖుల స్నేహం - మన మనసు, మన బుద్ధిని చంపేసేటట్లు చేస్తుంది. ఆ తరువాత - మన మనసు మరి బుద్ధి మాట పట్టించుకోదు. అలాగే - మిగతా మూర్ఖపు పనులు కూడా. మాదక పదార్థాలు సేవించడం , విడవలేక  వాటికి బానిసవడం , మన జీవితాన్ని మాత్రమే కాక, చుట్టూ వున్న వారి జీవితాల్ని కూడా నరక ప్రాయం చెయ్యడం - యివన్నీ మన దేశంలో - 50 శాతం పైగా మగ వాళ్ళు ముఖ్యంగా చేస్తున్న బుద్ధి లేని పనులు .

దొంగ తనాలు, బలాత్కారాలు, సామూహిక బలాత్కారాలు, చంపడం , అబద్ధాలు చెప్పడం, లంచగొండి తనం  - అన్నీ మూర్ఖపు పనులే .

మూర్ఖపు పనులు మొదట మనసులోనే మొదలవుతాయి . ఆ తరువాత , మాటల ద్వారా , కొద్దో గొప్పో బయటపడుతాయి . మాటల్లో కాఠిన్యం మొదటి మూర్ఖత్వం . యిది కొంత మందికి మరీ ఎక్కువ . కొంత మందికి ఎప్పుడో కొద్ది సమయాల్లో మాత్రమే  వుంటుంది. 

కొంత మంది మాటల్లో బాగా సంయమనం పాటిస్తారు . ఇది అభ్యాసం చెయ్యాలి - అంతే. రోజుకు యిద్దరిని పొగడాలి అని నియమం పెట్టుకుంటే - అది వొక 48 రోజులు పాటిస్తే - మంచి మాటలు మాట్లాడడం మీకు అలవాటై పోతుంది . ఆ తరువాత - మీరు చెడ్డ మాటలు, అబద్ధాలు, పరుషం గా మాట్లాడడం - అన్నీ బాగా తగ్గి పోతాయి. అంటే -బుద్ధిలేనితనం లోని వొక అంశం మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లి పోతుంది . అంటే - బుద్ధిహీనత నిరంతరంగా మన ముద్రగా వుండాల్సిన పని లేదు . 

కానీ - కొందరు తాము పరుషంగా మాట్లాడడము, అందువలన యితరులు బాధ పడడం , ఏదో తమ గొప్పగా భావిస్తూ వుంటారు . ఇతరులు  సహించినంతకాలం - యిది యిలాగే జరుగుతూ వుంటుంది . చుట్టూ వున్న వారు తిరగబడాలి.  అంతకంటే పరుషంగా మాట్లాడినా సరే - సమాజంలో పది మంది ముందు వీరిని బాగా దులిపైనా సరే - పది మంది వారిని పరుషంగా మాట్లాడైనా సరే - పరుష భాషణం మూర్ఖత్వం అనేది - బాగా తెలియజెప్పాలి . ఇలాగే మిగతా  మూర్ఖత్వపు లక్షణాల  విషయం కూడా. వొకరి మూర్ఖత్వం ఎటువంటిదైనా - మరికరిని బాధిస్తూ వుంటే - అది సహించి వూరుకోవడం ,మరొకరి  మూర్ఖత్వమే అవుతుంది .


కార్లో  నారియా కిపోలా  అనే ఆర్ధిక శాస్త్ర - చరిత్రకారుడు , 5 బుద్ధిహీనత సిద్ధాంతాలను  ప్రతిపాదించాడు.  వాటిని కాస్త పరిశీలిద్దాం .

  • ఎల్లప్పుడూ, నిస్సందేహంగా  - మనం , మన చుట్టూ వున్న బుద్ధిహీనుల సంఖ్యను, చాలా తక్కువగానే  అంచనా వేస్తాము. 
  •  వొక మనిషి బుద్ధిహీనుడా, కాదా అన్న విషయం - అతని మరే గుణగణాల పై కానీ, చదువు పై గానీ ఆధార పడి వుండదు . అంటే - బుద్ధి హీనుడి బుద్ధి హీనత స్వతహాగా బ్రతుకుతుంది . మరే గుణగణాల పైన ఆధార పడదు 
  • వొక మనిషి బుద్ధిహీనుడా, కాదా అన్నది ఎలా చెప్పొచ్చు ? వాడు, స్వలాభం ఏ మాత్రం పొందకుండా , యితరులకు నష్టం కలిగిస్తే అతడు బుద్ధిహీనుడే; అంతకంటే ఘోరం - తాను కూడా నష్టపోతూ , యితరులకు నష్టం కలిగిస్తే , వాడు ఖచ్చితంగా మరింత బుద్ధిహీనుడే . 
  • బుద్ధిహీనులు కాని వారు కూడా - బుద్ధిహీనులతో జత చేరితే జరిగే ప్రమాదాన్ని, నష్టాన్ని ఎప్పుడూ , తక్కువ గానే అంచనా వేస్తారు . వారితో చేరడం ఎంత గొప్ప తప్పో ఎల్లప్పుడూ మర్చి పోతూ వుంటారు . 
  • ప్రపంచంలో - బుద్ధిహీనుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మరొకరు లేరు . 

యివండీ ఆ 5 సూత్రాలు . మనం - మరెన్నైనా సూత్రాలను , మనకు తోచిన వాటిని చేర్చుకోవచ్చు . బుద్ధి హీన ప్రపంచంలో సర్వం సాధ్యమే .

మొదటి సూత్రం ప్రకారం - మన చుట్టూ వున్న బుద్ధిహీనుల సంఖ్య లేదా వారి శాతం , మనం అనుకోగలిగిన దాని కంటే   ఎప్పుడూ కాస్త ఎక్కువ గానే వుంటుందంటారు కార్లో. అది నిజమే -అంటాను నేను. కనీసం వొక్కరిని ఆ లిస్టు లో చేర్చడానికి   మనం మర్చిపోతూనే  వుంటాం . నిజానికి చాలా మందిని ఆ లిస్టు లో చేర్చం .  అదంతే .  అది - మన బుద్ధిహీనత .

ఇప్పుడు  మీలో ప్రతి వొక్కరూ - మీ చుట్టూ వున్నఅందరి లిస్టు  వెయ్యండి చూద్దాం . ఆ తరువాత , అందులో బుద్ధిహీనులెవరో టిక్కు కొట్టండి. బుద్ధిమంతులెవరో వారి పేర్లను మరో రంగుతో టిక్కు కొట్టండి .

అయిపోయిందా . యిప్పుడు, ఆ బుద్ధిమంతుల గురించి బాగా ఆలోచన చెయ్యండి . వాళ్ళు ఎందుకు అలాగే వున్నారో , ఎందుకు అభివృద్ధి చెందలేదో , ఎందుకు యింకా సంతోషంగా లేదో , ఎందుకు , వారికి రోగాలొచ్చాయో , ఎందుకు వాళ్ళింట్లో , అప్పుడప్పుడూ కొట్లాటలు , వాగ్వాదాలు వస్తుంటాయో - యిలా - వారిని గురించిన నకారాత్మక విషయాల గురించి బాగా యోచన చెయ్యండి . యిప్పుడు, వారు బుద్ధిమంతులు కాదు అనిపిస్తే వారిని బుద్ధిహీనుల లిస్టు లో చేర్చెయ్యండి .

యిప్పుడు చాలా మంది ఈ బుద్ధిహీనుల లిస్టులోకి వచ్చేసారు కదా. అయినా యింకా కొద్ది మంది ఈ లిస్టు లోకి రాలేదు . వారిని ఈ లిస్టు లోకి చేర్చడానికి మీ బుద్ధి కాదు - మనసు యిష్ట పడడం  లేదు . కారణం ఏదైనా కానియ్యండి . మీ దగ్గరి వారిలో కొందరైనా బుద్ధి మంతులు అన్నది మీ భావన; నమ్మకం . అదీ కథ . యిందులో - వొకరిని గురించైతే , మీరు అనుకోవడమే లేదు ! ఎవరు వారు ?

యిప్పుడు మళ్ళీ మీరు మీ లిస్టు చూడండి . అందులో - ఆడవాళ్ళు, మగ వాళ్ళు , పిల్లలు , పెద్దలు , ముసలి వాళ్ళు , చదువు కున్న వాళ్ళు , చదువులేని వాళ్ళు , డబ్బున్న వాళ్ళు , డబ్బు లేని వాళ్ళు ,  అందంగా వున్న వాళ్ళు , అందంగా లేని వాళ్ళు - అందరూ వున్నారు . అంటే ఏమిటి - బుద్ధి హీనత కూ , మిగతా విషయాలకూ సంబంధం లేదు . యిది నిజం . ఎందుకిలా ? ప్రకృతిలో బుద్ధిహీనత  అనే లక్షణం  ఎందుకిలా , యింత విస్తారంగా , ధారాళంగా వుంది ? ఎవరికి తెలుసు ?

సరే . ప్రస్తుతానికి , నేను , మీరు  కాస్త బుద్ధిమంతులం అనుకుందాం . మనసులో అది వొక వూరట . ఏదో కాస్త సందేహం పీకుతోనే వుంటుంది - అయినా యిలా అనుకుందాం . సందేహం ఎందుకు వస్తుందంటే - యింత మంది బుద్ధి హీనులని మనకు తెలిసిన తర్వాత - మనం మాత్రం బుద్ధిహీనులు కాదు - అని అనుకోవచ్చా ? అదెలా కుదురుతుంది ? నలుగురితో బాటు నారాయణా అనుకోవడమే కదా - మనం చేస్తున్నది ! చెయ్యాల్సింది. 

బుద్ధిహీనులకు పుట్టాం . బుద్ధిహీనులతో కాపురం చేస్తున్నాం . బుద్ధిహీనులకు జన్మ నిచ్చాం . బుద్ధి హీనుల పక్కింట్లో , ఎదురింట్లో , ముందింట్లో వుంటున్నాము . మరి మనం మాత్రం వేరేగా ఎలా వుంటాం ? ఈ సందేహం వచ్చే వుంటుంది . అయినా , మనం కాదు అనుకోవడంలో - ఏదో సంతృప్తి వుంది కదా .  అనుకుందాం . పొయ్యేదేముంది ?

రెండో సూత్రం కూడా కొంత వరకు పైన చెప్పిన దాన్లోనే మనకు తెలిసిపోయింది . 15 ఏళ్ళ క్రితం ముకేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఆస్తులు దాదాపు సమానంగా పంచుకున్నారు . కానీ ఈ రోజు , ముకేష్ తో పోలిస్తే, అనిల్ ఆస్తి 1 / 5 వంతు కంటే తక్కువగా పడి పోయింది . అంటే ఏమిటి అర్థం? ఈయనకు అదృష్టం తక్కువనా ? అదేం లేదు. అప్పుడప్పుడూ , చుట్టూ వున్న వాళ్ళతో  సర్దుకు పోవడంలో ,ముకేష్ గొప్ప అని తెలుస్తూనే వుంది . ఆపైన కాస్త అదృష్టం. 

బుద్ధి వుండడం, లేకపోవడం అనేది ముఖ్యం కాదు ; వున్న బుద్ధి స్వలాభం కోసం , చుట్టూ వున్న వారి లాభం కోసం ఉపయోగించక పోవడం -  తమ అర్థ రహితమైన అహంకారాన్ని సంతోష పరచడానికి ఉపయోగించడం - అదే  బుద్ధి హీనత అని - మనకు తెలుస్తుంది.

ఎంతో మంది - తమకు వొక కన్ను పోయినా ఫరవా లేదు - ఎదుటి వాడికి రెండు కండ్లు పోవాలి అనుకునే  వారున్నారు ; అలా కావాలని ఎంతో ప్రయత్నాలూ చేస్తారు . మరికొందరు మహా మూర్ఖులు  తమకు రెండు కండ్లూ పోయినా ఫరవాలేదు - ఎదుటి వాడికి కనీసం  వొక కన్నైనా పోవాలి అనుకునే వారున్నారు .

ఎన్నో యిళ్ళలో - వారానికి కనీసం రెండు రోజులు భార్యాభర్తలు పోట్లాడుకుంటారు . పెద్ద కారణమేమీ వుండదు . కాస్సేపు కొట్లాడి, వొక రోజు మూతి ముడుచుకుని కూర్చుంటే - తాము బుద్ధిహీనులు అన్నది అందరికీ అర్థమయ్యేటట్టు చేసి , తమ పిల్లల ముందు కూడా తాము బుద్ధిహీనులు అన్నది తెలియ జేసి - ఆ తరువాత మెల్లగా సర్దుకుంటారు . పిల్లలకు అర్థం కాదు - వీళ్ళు యింత చిన్న విషయాలకు ఎందుకింత పోట్లాడుకుంటారో అని . అన్నం తినకండా పస్తులుండడం, చిర్రుబుర్రులాడుతూ వుండడం , కొన్ని కుటుంబాలలో సర్వ సాధారణం . యింకా కొన్ని కుటుంబాలలో అసహ్యంగా తిట్టు కోవడం , కొట్టుకోవడం కూడా జరుగుతూ వుంటాయి .  

కొన్ని కుటుంబాలలో అయితే - మేం ఈ కులం లో పుట్టాం గనుక , కొట్లు, తిట్లు, దొమ్మీలు, ఆగడాలు చెయ్యకపోతే అసలు మాకు మర్యాదే లేదు -  అనే వొక మూర్ఖపు   భావన చాలా ఎక్కువ గా కనిపిస్తుంది . అది మిగతా వాళ్ళు సహించడం - అంత కంటే మూర్ఖత్వం .

పిల్లలు కొట్లాడితే - అర గంట; భార్యాభార్తలు కొట్లాడితే కొన్ని రోజులు; కొంత మంది వుత్తి పుణ్యానికి డైవర్స్ వరకు వెళ్లి పోతుంటారు . కొన్ని మంచి స్నేహాలు - అసలు కారణమే లేకుండా - తెగి పోతూ వుంటాయి . యివన్నీ మూర్ఖత్వపు లక్షణాలే . 

ఆల్బర్ట్ ఆయిన్ స్టీన్  అంటారు - "ప్రపంచం , మనిషిలోని మూర్ఖత్వం యివి రెండూ ఎల్లలే లేనంత విస్తారమైనవి . కానీ, వొక వేళ ప్రపంచానికి ఎల్ల వుంటే వుండొచ్చు; కానీ మనిషి మూర్ఖత్వానికి మాత్రం ఎల్లేలే లేవు ." 

యిది నిజమే . తెల్లారి లేచి వార్తా పత్రిక చదివితే - అందులో - మన నాయకులెంత బుద్ధిహీనులో, ప్రజలెంత  బుద్ధిహీనులో తెలుస్తుంది . మనం ఎంత బుద్ధిహీనులో - కాస్త యోచన చేస్తే  తెలుస్తుంది .వొక నాయకుడికి ఏదో కుంభకోణం లో శిక్ష పడింది . మనం, మరో యోచన లేకుండా , ఆయన సతీమణికి , లేదా కుమారుడికి వోటు వేసేస్తాం . యింత బుద్ధిహీనత మనలో వుంటే , అంత బుద్ధి హీనులు నాయకులవడంలో , ఆశ్చర్యం ఏముంది ? మరొకడికి ఎన్నో వేల కోట్లు మరొకరి పదవి వలన , తన నిర్వాకం  ఏమీ లేకుండానే వచ్చి పడిందని  తెలుస్తుంది . అతడినీ గొప్ప నాయకుడిగా పూజిస్తాం .

మనిషి బుద్ధిహీనత  ఎల్లలే లేనంత ఎక్కువ అన్న దాన్లో నాకు సందేహం లేదు. 

మరొకాయన అంటారు - బుద్ధి హీనులు ఎంతో మంది గుంపులు గుంపులు గా వుంటారు అని . అదీ నిజమే .పాకిస్తానుకు , మనకు యుద్ధాలు జరిగాయి . ముందు,  ముందు కూడా జరగ వచ్చు. - అలాగే మనకు, చైనా కు మధ్య వైరం వుంది . ఈ భాగం మాది ; ఆ భాగం మాది - అని చైనా  వారు ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు . అయినా మనం మాత్రం చైనా లో చేసిన వస్తువులే కావాలని కొనుక్కుంటాం. మన దేశాన్ని కబళించాలని వున్న దేశపు వస్తువుల పట్ల , అది వూరికే యిచ్చినా సరే - మనం ఆశ పడరాదు. ఈ మాత్రం బుద్ధి మనకూ లేదు ; మన ప్రభుత్వానికీ లేదు . మన దేశం లో చిన్న, పెద్ద  పరిశ్రమలన్నీ  చైనా వస్తువుల వల్ల మూత బడుతున్నాయి . BHEL  లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థ కూడా -  ఆర్డర్లు తగ్గి వెల వెలా పోతోంది . నష్టాల్లోకి వెళ్ళినా వెళ్ళవచ్చు.  L &T లాంటి మరొక భారీ సంస్థ యజమాని  నాయక్  గారు వొక సారి అన్నారు కూడా - చైనా వస్తువుల కొనుగోలు వల్ల మన దేశంలో - నాణ్యతా పోతూ వుంది ; దేశంలో వుత్పత్తీ పోతూ వుంది అని . అయినా - ప్రభుత్వ ధోరణీ మారలేదు; మన ధోరణీ మారలేదు. జపాన్లో అయితే - మొట్ట మొదట జపాన్ వస్తువులకే , ప్రతి వొక్కరూ ప్రాధాన్యత యిస్తారు. మన దేశంలో అయితే - భారత వస్తువులు తప్ప , మరే వస్తువైనా కొనేస్తాము - విదేశీ ముద్ర వుంటే చాలు . అదో మోహం . అదో మూర్ఖత్వం . 

ఇలా - మన మూర్ఖత్వాన్ని గురించి గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు . మనం బుద్ధి మాట ఎప్పుడు వింటాం ? ఎప్పుడు మారతాం ? 

మనకూ, మన ప్రక్కనున్న భారతీయులకూ, మన దేశానికి , మొట్ట మొదట - మన ద్వారా మేలు జరిగే కార్యక్రమాలకు ఎప్పుడు శుభారంభం పలుకుతాం ?

జయ నామ  సంవత్సరం వచ్చేసింది . అది  వెళ్ళే లోపల - మనకూ , మన దేశానికీ - జయ జయ ధ్వానాలు మనం పలుక గలమా ? మంచి మాట , మంచి ఆలోచన , మంచి పని ద్వారా - మనం ప్రతి వొక్కరూ - మన దేశంలోని కొందరిని అయినా జయ నామ సంవత్సరం లో ఆదుకుంటామా ? 

మంచి పనులు చేసే వారిలో - మూర్ఖత్వం వుండదు . పారిపోతుంది . 



సర్వే  జనాః సుఖినో భవంతు . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్









                                               
  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి