6, డిసెంబర్ 2013, శుక్రవారం

స్వగతం (4) - టర్నింగ్ పాయింట్స్ - కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు నా ప్రయాణం

స్వగతం (4) - టర్నింగ్ పాయింట్స్

కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు నా ప్రయాణం

 

నేను  చెన్నై టెలిఫోన్స్ లో - మొదట చీఫ్ అకౌంట్స్  ఆఫీసర్ గా అయిదేళ్ళు పని చేసిన తర్వాత, వొక సంవత్సరం పైగా  అక్కడే  డిప్యూటీ  జనరల్ మేనేజర్ గా పని చేశాను. ఆ తరువాత నన్ను, హైదరాబాద్ లోని, నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్సు అండ్ మేనేజ్ మెంట్ కు బదిలీ చేశారు. అప్పటి వరకు నేను ఏదో చిన్న చిన్న క్లాసులు అక్కడక్కడా తీసుకునే వాడినే కాని ఇలాంటి  నూటికి నూరు శాతం ఫైనాన్సు , మేనేజ్ మెంట్ లాంటి  విషయాలపై - అందునా సీనియర్  ఆఫీసర్లు కు కూడా పాఠాలు చెప్పడం లాంటి పనులు చెయ్య లేదు. నిజానికి ఈ సబ్జెక్ట్స్ ఏవీ నాకు తెలీదు. కాకపొతే, ఆ అకాడెమీ చీఫ్  జనరల్  మేనేజర్ గారు నాకు వొకప్పుడు చెన్నై టెలిఫోన్స్ లో బాస్ గా వున్న వారే. అందుకని, మరో మాట చెప్పకుండా వెళ్లి 2003 డిసెంబర్ లో జాయిన్  అయిపోయాను. 

ఇప్పుడు నా డ్యూటీ ఏమిటంటే -  టెలికాం ఫైనాన్సు, మేనేజ్ మెంట్, హ్యూమన్  రిలేషన్స్  స్కిల్స్ - ఇలాంటి విషయాలపై - చాలా లోతుగా అన్ని విషయాలనూ చదివి, పరిశీలించి, అన్ని రాష్ట్రాల నుండీ ట్రైనింగ్ కు వచ్చే సీనియర్ ఆఫీసర్లకు లెక్చర్  యివ్వాలి.  యిక్కడ, లెక్చర్ యిచ్చే వాడు వచ్చిన వారిని అంచనా  వెయ్యడం కాదు; అందుకు రివర్సు. ట్రైనింగ్ కు వచ్చిన వారు,  లెక్చర్లను యిచ్చే మమ్మల్ని అంచనా వేసి, మార్కులు వెయ్యాలి. వారి అంచనాలను, క్రోడీకరించి వొక్కొక్క లెక్చరర్ కు ఎన్ని మార్కులు వచ్చాయో - అది మా బాస్ గారికి పంపించాలి.  వారు అది చూసి, తరువాత యివ్వాల్సిన  లెక్చర్లకు - ఏం చెయ్యాలో చెబుతారు. అంటే - ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్కులు వెయ్యడం కాదు. విద్యార్థులు ఉపాధ్యాయుడికి మార్కులు వెయ్యాలి. అది హెడ్ మాస్టర్ గారు చూసి, ఉపాధ్యాయులు పాసో, ఫెయిలో నిర్ణయించాలి.   యిది చాలా ట్రైనింగ్ అకాడెమీ లలో వున్నదే. 

ఈ అకాడెమీ లో ట్రైనింగ్ వింగ్  వొకటి, అడ్మినిస్ట్రేషన్  వింగ్ వొకటి - ట్రైనింగ్ కు నేను హెడ్, అడ్మినిస్ట్రేషన్ కు మరొకరు, మాకిద్దరికీ పైన CGM  గారు. మాక్రింద , కొంత మంది చీఫ్  అకౌంట్స్ ఆఫీసర్  లు, వారి క్రింద అకౌంట్స్ ఆఫీసర్ లు, యిలా ఎంతో మంది వుండే వారు. మేము అందరమూ లెక్చర్లు  యివ్వాల్సిన వారమే.

వచ్చిన గొప్ప చిక్కు ఎక్కడంటే, ట్రైనింగ్ కు వచ్చిన వారు,  మాకందరిలో వొక జూనియర్ మోస్ట్, అంటే, వొక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గారి లెక్చర్ చాలా బాగుందని, మా, అంటే, DGM గారి లెక్చర్ బాగు లేదని రాసేయచ్చు. అంతెందుకు. చీఫ్ జనరల్ మేనేజర్ గారి లెక్చర్ కూడా బాగు లేదని రాసేయచ్చు. అంటే, యిది ఏదో, ఆఫీసుల్లో,  పైళ్ళలో, మనం ఏదో రాసెయ్యడం, మన అభిప్రాయాలు, మన నిర్ణయాలు చెప్పడం లాంటి పని కానే కాదు. మేము చెప్పే విషయాలు - వినే వారికి నచ్చిందా లేదా అన్నది - వినే వారు మాకు చెప్పాలి. అందు లోనూ, లిఖిత పూర్వకంగా. మాకు మార్కులు కూడా వెయ్యాలి .  మార్కులంటే మజాకా! ప్రతి వొక్కరికీ ఎక్కువ మార్కులు తీసుకోవాలని తాపత్రయం వుంటుంది కదా ! కనీసం క్రింద వారికంటే - మనకు ఎక్కువ రావాలని వుంటుంది కదా . మార్కులు వేసే వాడు , ఎందుకు, ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తాడో - చెప్పడం చాలా కష్టం .

డ్రెస్, మాట్లాడే తీరూ, జోకులు వెయ గలిగే నేర్పూ , ఎదుటి వారిని సంభాషణలో పెట్టడం,  వారిలో ఇంటరెస్ట్ , ఉత్సాహం రేకెత్తించడం, మాట్లాడాల్సిన సబ్జెక్టు లో పూర్తి అవగాహన, మనకు యివ్వ బడిన సమయం లో ఏది చెప్పాలో, ఏది విడిచి పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో, ఎలా ముగించాలో - యిలా ఎన్నో విషయాలు మనకు తెలియాలి . అంటే - వొక లీడర్ కు వుండ వలసిన సర్వ లక్షణాలు, వొక లెక్చరర్ కు కూడా వుండాలి.

ఇంతే కాదు. ఏది మాట్లాడ కూడదో - అదీ బాగా తెలిసుండాలి . మీరు ఎంత బాగా మాట్లాడినా, మాట్లాడకూడని మాట వొకటి మాట్లాడితే చాలు - మిమ్మల్ని అంచనా వేసే వాళ్ళు , ఆ వొక్క మాటపై మాత్రమే మిమ్మల్ని అంచనా వేస్తారు. గిన్నెడు పాలలో వొక్క చుక్క విషం కలిస్తే , పాలంతా విషమైన మాదిరి. ఇవన్నీ నాకు పూర్తిగా అర్థం కావడానికి - దాదాపు వొక సంవత్సరం పట్టింది . ఇవేవీ అర్థం చేసుకోకుండా, ఎన్నో సంవత్సరాలు లెక్చర్లు యిచ్చే వాళ్ళు కూడా ఎంతో మంది వున్నారు. నిజానికి - యివన్నీ ప్రతి మనిషికీ తెలియాల్సిన విషయాలు . వీటిని గురించి ముందు ముందు  ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన  అవసరం వుంది. 

కానీ, నా సర్వీసులో యిన్నాళ్ళూ, మూడు దశాబ్దాలకు పైగా, నేను చేసిన పని పైళ్ళలో రాయడమే. మరి, యిప్పుడు మాట్లాడాలి . అందునా వొక ముప్ఫై మందైనా ఆఫీసర్లు ట్రైనీలు గా వున్న, వొక అధునాతన క్లాస్ రూము లో, పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ల తో బాటు,  ప్రపంచం లో వున్న సరి క్రొత్త విషయాలు, వాటిలో యిప్పుడు వస్తున్న మార్పులు  - సభికులకు నచ్చే విధంగా, వారిని మెప్పించే విధంగా మాట్లాడాలి.

మా బాసు ఎలాంటి వారంటే - యిప్పుడు హార్వర్డ్ , ఆక్స్ ఫర్డ్  లో చెబుతున్న విషయాలు కూడా తెలుసుకుని  చెప్పాలంటారు . అదీ, వారికిష్టం. వారి పేరు చివర, పెద్ద డిగ్రీల తోక వుంది.  మా మరో DGM  గారు కూడా యింజనీరు, MBA. నేనొక్కడే ఉత్త MA  ఎకనామిక్స్. మరెలా? ఎలా ఏమిటి ? చెయ్యాలి. వారి కంటే బాగా చెయ్యాలి . కనీసం వారితో సమానం గా చెయ్యాలి. ఎలా? 

యిదీ నాకు వచ్చిన ఛాలెంజ్ . నేను MBA  చెయ్య లేదు కానీ వారికంటే బాగా, MBA  లో రాని పాఠాలు కూడా,  చెప్పి, వచ్చే వారిని మెప్పించాలి.  నిజానికి , యిప్పుడు ట్రైనింగ్ వింగ్ కు నేను బాసు. ట్రైనింగ్ ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవ్వరు, ఏ పాఠాలు చెప్పాలో, ఏ ట్రైనింగ్ లో వచ్చే వారిని ఎలా ఆకర్షించాలో, ఎలా ఎక్కువ మంది వచ్చే లాగా చెయ్యాలో -అన్నీ నేనే ప్లాన్ చెయ్యాలి . వాటిని జరిపించాలి.  మరో DGM గారు, CGM  గారు, నా ప్లాన్ ను చూసి , సూచనలిచ్చి , ఆమోదం తెలిపే వారు  మాత్రమే.

యింతే కాదు . మిగతా అందరి కంటే, నేను బాగా చెప్పాలి. మిగతా అందరూ కూడా బాగా చెప్పేటట్టు, వారికీ సూచనలివ్వాలి . అంటే - వారి సబ్జెక్టు కూడా నాకు బాగా తెలిసుండాలి. 

 అప్పటికి మా కుటుంబ సభ్యులు యింకా హైదరాబాద్ రాలేదు. నేనూ, మా అకాడెమీ లోనే, వొక రూములో వున్నాను, యింకా క్వార్టర్స్  దొరక లేదని. అందుకని, వీలయినంత సమయం, మా లైబ్రరీ లో, పుస్తకాల వేట - చదువులతో గడప సాగాను . ఆఫీసు సమయంలో - కంప్యూటర్ లో పవర్  పాయింట్  ప్రెజెంటేషన్ లు ఎలా సిద్ధం చెయ్యాలో,  వెయ్యాలో - బాగా నేర్చుకున్నా. PA  పైన ఆధార పడకుండా చెయ్య గలిగితే , మన మనో భావాలకు  అనుగుణంగా  తయారు చెయ్య వచ్చు గదా; అందుకని. నా మొట్ట మొదటి లెక్చర్, "కమ్యూనికేషన్ స్కిల్స్" - గా నేనే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే - నాకు లేని స్కిల్ ముఖ్యంగా అదే కదా, అని.  అందుకని, దాదాపు 40-50 గొప్ప పుస్తకాలు చదివాను. చదవగా, చదవగా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత కష్టమైనదో; కానీ, మన జీవితం లోని ప్రతి రంగంలోనూ, ఎంత ముఖ్యమైనదో  తెలిసి వచ్చింది . పుస్తకాలు చదివి, చదివి, నాకు నచ్చిన అన్ని విషయాలు రాసుకున్నాను . అది హనుమంతుడి  తోక లాగా పోతోంది .

వొక ప్రెజెంటేషన్ 250 స్లైడ్స్ తో తయారు చేశాను. అంటే, గోడ మీద వున్న స్క్రీన్ లో పడేది వొక్క  స్లయిడ్  అన్న మాట - అలా 250 స్క్రీన్లు తయారు చేశాను. పుస్తకాల్లో వున్నవి, నేను చదివినవి అన్నీ చెప్పేయాలన్నది - నా తాపత్రయం .  అప్పుడు - ఈ క్లాసుకు వున్న సమయం, వొకటిన్నర ఘంటలు.

నేను చెప్పాల్సిన రోజు రానే వచ్చింది. కానీ నేను యింకా సంసిద్ధుడు కాలేదు. కాకపోతే - తరువాత ఎప్పుడో తెలిసి వచ్చింది - మనం ఎప్పుడూ, ఏ గొప్ప విషయం లోనూ, పూర్తిగా సంసిద్ధులు కాలేమని . దూకితే కాని యీత రాదు - ఎన్ని పుస్తకాలు చదివినా. దూకాలి. దూకాను.

ఆ రోజు గోడ మీది స్క్రీన్ పై స్లయిడ్  ఫోకస్ చేసి చెప్పడం ఆరంభం చేసాను. ఎప్పుడు, గోడ  చూస్తున్నానో , ఎప్పుడు సభికులను చూస్తున్నానో, నాకు తెలీదు . వొక్కొక్క స్లయిడ్ కు ఎంత టైం తీసుకున్నానో కూడా తెలియడం లేదు. వొకటిన్నర ఘంట అయ్యే లోపు, 20 స్లయిడ్ లు కూడా పూర్తి కాలేదు. నేను ప్రిపేర్  చేసింది  250 స్లయిడ్లు. చిట్ట చివర - వొక 5 నిముషాలు, చెప్పినవి టూకీగా మరో సారి చెప్పి నా మనసులోని విషయాలు మరో రెండు చెప్పి  ముగించాను. నాకు ఏ మాత్రము  సంతృప్తి గా లేదు . మనసులో, అయ్యో, ఏమీ చెప్ప లేదే - అన్న గుబులు. వచ్చిన వారిని అడిగాను. మీకెలా వుందని. వారు చాలా బాగుందన్నారు . యిది వరకు ఇలాంటి లెక్చర్ వినలేదన్నారు . వారిచ్చే మార్కులు కూడా బాగానే యిచ్చారు . కానీ, నాకు ఏ మాత్రమూ సంతృప్తి గా లేదు. 250 స్లయిడ్ లలో, 20 చెప్పి ముగిస్తే , సంతృప్తి ఎలా వస్తుంది?

అప్పుడు - వొక్క విషయం అర్థమయ్యింది . వచ్చిన వారికి నేను చెప్పిన విషయాలే తెలుసు కానీ, నేను చెప్పని విషయాలు ఏవి అన్నది తెలియదు - అని.  నా నెక్స్ట్  లెక్చర్ కు 3 గంటలు  టైం  తీసుకుంటే బాగుంటుందేమో - అనుకున్నా. అది మరో నెల తర్వాత వస్తుంది . మా మరో DGM  గారిని సలహా అడిగాను . యిద్దరం వెళ్లి CGM  గారినీ అడిగాము, ఆయన 3 ఘంటలు తీసుకోమన్నారు. కానీ కొన్ని సూచనలిచ్చారు. సభికులను, అప్పుడప్పుడూ, ఏదైనా ప్రశ్నలు అడగమన్నారు . ఇంటరాక్టివ్ గా - అంటే, మీరూ వాళ్ళతో మాట్లాడాలి; వారూ మీతో మాట్లాడుతూ వుండాలి - అని . యిలా కొన్ని సూచనలు . సరే . అన్నాను. మా మరో DGM  గారు అన్నారు - నేను, ఇక్కడికి వచ్చిన ఆరు నెలల తర్వాతనే, నా మొదటి క్లాస్స్ తీసుకున్నా. మీరు, ఎందుకు తొందర పడుతున్నారు - అని. కానీ , నాకు మాత్రం - ఆలస్యం చెయ్యడం లో ఏ ప్రయోజనం కనిపించ లేదు. 

మా అకాడమీ కు, మా BSNL  కంపెనీ  లోని - అంటే దేశం మొత్తం లోని,  అన్ని ప్రాంతాల నుండీ , చిన్న అఫీసర్ల నుండి, చాలా పెద్ద, చాలా సీనియర్ ఆఫీసర్లు వరకు,అందరూ వస్తారు. చాలా సీనియర్ ఆఫీసర్లు  వచ్చినప్పుడు,వారికి, DGM  లు, CGM గారు ఎక్కువగా క్లాసులు  తీసుకోవాలి. మిగతా వారు తక్కువ క్లాసులు, అవీ, అంత ముఖ్యం కానివి తీసుకోవాలి - యిలా వొక ఆనవాయితీ  వుంది .  నా కమ్యూనికేషన్  స్కిల్స్ - చాలా ముఖ్యమైన  క్లాసు - అని నాకు తెలిసింది . అంతే . ఈ పెద్ద, పెద్ద  ఆఫీసర్లు వచ్చే సమయంలో  నేను ఎలా చెప్పాలి - అన్నది, నా మనసులో ప్రశ్న . 

అప్పుడు అనుకున్నా - ఈ విషయంలో ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్  చెయ్యాల్సిందే - అని. వొక రోజు వార్తా పత్రికలు  చదువుతూ వుంటే -అందులో - కొంత మంది రాజకీయ నాయకులు, మినిస్టర్లు తప్పులు తడకలు గా చెప్పిన కొన్ని విషయాలు కనిపించాయి. అలా వెదుకుతూ వెడితే , ప్రపంచ చరిత్రలో - ఈ కమ్యూనికేషన్  స్కిల్స్ లేనందు వల్ల - అంటే, మాట్లాడ కూడనివి మాట్లాడడం వల్ల  వచ్చిన  ఉపద్రవాలు, మాట్లాడ వలసినవి మాట్లాడక పోవడం వల్ల  వచ్చిన పరిణామాలు ఎన్నో, ఎన్నో తెలిసాయి .  అవి నాకు చాలా బాగా అనిపించాయి. 

ఆ తరువాత, ప్రపంచ చరిత్రలో అతి గొప్ప భాషణలు (స్పీచ్ లు) - ఎందుకు గొప్పవయ్యాయో - బాగా పరీక్ష చేసి - అందులోని, కొన్ని  ముఖ్యమైన వాక్యాలను ఎంచుకున్నాను .అందులో అమెరికా ప్రెసిడెంట్లు  మాట్లాడినవే ఎక్కువ వున్నాయి.  వారు చాలా గొప్ప వక్తలు, చాలా గొప్ప మేధావులు, చాలా గొప్ప లీడర్లు అని తెలుస్తుంది. మన దేశంలో, గాంధీ గారి మాటలే - చాలా బాగున్నాయి . గాంధీ గారి తరువాత , మనుషులను, మనసులను , హృదయాలను అలా కదల్చ గల నాయకులు రాలేదనే చెప్పవచ్చు . యిప్పుడిప్పుడు - నరేంద్ర మోడీ గారు మెల్ల మెల్లగా అలా తయారవుతున్నారని చెప్పవచ్చు . అమెరికా లో అలా కాదు . అక్కడ ఎంతో మంది వున్నారు, దేశానికి ప్రెసిడెంట్ కాగల పూర్తి అర్హత వున్న వారు. దేశాన్ని, అభ్యుదయ పథంలో, తీసుకెళ్ల గలిగిన వారు ; ప్రజలను , తమ మాటలతో , చేతలతో, వొక్క ఊపు వూపగలిగిన వారు; తమ వెనుక తీసుకెళ్ల గలిగిన వారు - ఎంతో మంది వున్నారు .

ఎవరో వొక శత్రువును చూపి, అదుగో, అతడే మన పతనానికి, దుస్థితికి కారణం , పదండి, అతన్ని ఎదుర్కొందాం   - అని చెప్పి,  వేల మందిని కదనానికి తయారు చెయ్య వచ్చు. కానీ - ఎవరినీ ద్వేషించ వద్దు, యిదీ, మనకు  కావలసినది,యిలా సాధిద్దాం, రండి - అని పిలిస్తే, సాధారణంగా ఎవరూ రారు. పగ, ద్వేషంతో, కొట్టుకోవడానికి వొకటైనట్టు , మనుషులు మంచి పనులకు వొకటి కావడం చాలా కష్టం. ద్వాపర యుగం లో కూడా చూడండి. కోట్ల మంది వొక్క చోట కూడడం ఎలా సంభవించింది ? యుద్ధం చేద్దాం, అంటే - వచ్చారు, కానీ, దేశాన్ని బాగు చేద్దాం - అంటే వచ్చారా? రారు గాక రారు. రామాయణం  లోనూ అంతే. ప్రపంచ యుద్ధాల్లోనూ అంతే. వొక మంచి పని కోసం, ప్రజలను వూప గలిగిన శక్తి, గాంధీ గారి లాంటి బహు కొద్ది మందికే వుంది. పని చెయ్యొద్దు - స్ట్రైక్ చెయ్యండి అని చెప్ప గలిగే కార్మిక నాయకులు , చేయించ గలిగే కార్మిక నాయకులు, మీరు బాగా పని చెయ్యండి - అని చెప్ప గలరా? చాలా కష్టం . నాకు తెలిసి, స్ట్రైక్ చెయ్యించ గలిగే వారే కానీ పని బాగా చెయ్యండి అని చెప్పే కార్మిక నాయకులు చాలా, చాలా తక్కువ మన దేశంలో. నేను, యిది చాలా మంది కార్మిక నాయకులను అడిగాను కూడా. వారి జవాబు, స్ట్రైక్ చేయించడం మా పని; హక్కుల కోసం పోరాడడం మా పని. పని చేయించడం యాజమాన్యం పని, అని . కొంత మంది కార్మిక నాయకులు తమ పనిని మాత్రం బాగా చేసేస్తారు. కొంత మంది అదీ లేదు.  యిదంతా ఎందుకు చెబుతున్నానంటే - ఏదైనా వొక BSNL లాంటి సంస్థను, లేదా, వొక రాష్ట్రాన్ని , లేదా వొక దేశాన్ని బాగు చెయ్యాలంటే - నాయకుడికి , ఆ సంస్థ యొక్క బలమూ , బలహీనతా రెండూ తెలిసుండాలి. బలాన్ని పెంచడం ఎలాగో, బలహీనత తొలగించడం ఎలాగో తెలిసుండాలి. దీనికి, SWOT అనాలిసిస్ - అని వొక పధ్ధతి వుంది. నేను  వొక సంవత్సరం తరువాత ఎప్పుడో యిదీ చేశాను. BSNL కు, నాకు, మా అకాడెమీ కి, మన దేశానికి - అన్నిటికీ చేశాను .  ఆ పధ్ధతి నాకు చాలా బాగా నచ్చిన పధ్ధతి.  

సరే . నా మొదటి లెక్చర్ నాకు ఏ మాత్రమూ సంతృప్తి యివ్వ లేదు. అసంతృప్తినే మిగిల్చింది. అయితే - అసంతృప్తి వున్న చోటే - అవకాశం వుంటుంది. ప్రయత్నం వుంటుంది. ఫలితమూ వుంటుంది. కొందరికి మాత్రం యివి లేకనూ పోవచ్చు . నరేంద్రుడికి వున్న అసంతృప్తి కారణంగానే ,  తరువాత కాలం లో వివేకానందుడయ్యాడు. గాంధీ గారి అసంతృప్తి కారణం గానే స్వరాజ్యం వచ్చింది . అయితే - అసంతృప్తి ప్రగతి పథం లో వుండాలి. నా పరిస్థితి కి మరెవ్వరో కారణం అనుకునే వారి అసంతృప్తి  ప్రమాద కరమైనది.

యిప్పుడు - నా అసంతృప్తికి, కారణం నేనే, నా అసమర్థతే అని తెలుస్తూనే వుంది . యిప్పుడు నేనేం చెయ్యాలి ? అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ - అంటే ఏమిటి ? అసలా ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? నాకు లేని స్కిల్స్ నేను మరొకరికి యివ్వగలనా? వారికి 3 గంటల లెక్చర్ యిస్తే - స్కిల్ వచ్చేస్తుందా ? మరి నేను చెయ్య వలసింది  ఏమిటి ?

 మా మరో DGM  గారు ఏం చేస్తున్నారో , చూశాను . ఏదో పుస్తకాల్లో,  ట్రైనీ ల కోసం యివ్వ బడిన - వొక 20 ప్రశ్నలు వుంటాయి; వాటికి ప్రతి దానికీ ఏదో నాలుగు సమాధానాలు వుంటాయి. వాటిలో - వారు తమకు సంబంధించినవి అనిపించేవి , టిక్  చెయ్యాలి . ఉదాహరణకు , క్రొత్త వారితో మాట్లాడాలంటే , మీరేం చేస్తారు ? భయ పడి పారిపోతారా; సిగ్గుతో తల వంచుకుని  కూర్చుంటారా, మెల్ల మెల్లగా, భయం భయంగా మాట్లాడుతారా , హాయిగా, ఉత్సాహంగా మాట్లాడుతారా ? యిన్ని జవాబులు వున్నాయి .  మీరు అందులో, ఏదో వొకటి , మీ స్వభావానికి అనుగుణంగా వున్నది టిక్ చెయ్యాలి.

20 ప్రశ్నలకు ట్రైనీలు  రాసిన తరువాత లెక్చరరు గారు సరైన జవాబు చెబుతారు. మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో చెబుతారు. ఇది వారికి MBA లో, వారి లెక్చరర్లు  చెప్పిన పధ్ధతి . పుస్తకాల్లో రెడీ మేడ్  గా వున్న పధ్ధతి. అది చెయ్యొచ్చు. బాగానే వుందనిపించింది.  యిందులో లెక్చరర్ గారు కూడా హాయిగా అర గంట పైగా వూరికే కూర్చో వచ్చు. ట్రైనీ లు - ఆ అరగంటా ఏదో వొకటి యోచన చెయ్యాలి . ఏదో వొకటి టిక్ చెయ్యాలి. మళ్ళీ దాన్ని గురించి లెక్చరర్ గారు చెప్పేటప్పుడు సరి చూసుకోవాలి. వొకటిన్నర ఘంట లెక్చర్ సులభంగా గడిచి పోతుంది. అంతే కాక - యిందులో , లెక్చరర్ గారు, ట్రైనీ లను పరీక్ష చేసి, మీరు యింతే , అంతే , యిలా మారండి , అలా మారండి - అని ప్లేటు  ఫిరాయించే  వీలు కూడా వుంది. 

అంతా మంచిదే, కానీ, నాకిది చాలదనిపించింది. దీన్లో, మరీ అంత పెద్ద ఉపయోగం కనిపించ లేదు. ట్రైనింగ్  వరకు బాగానే వుంటుంది . కానీ, నిజంగా వాళ్ల  జీవితంలో ఏదైనా మార్పు తేవాలి. నా మూడు ఘంటల ట్రైనింగ్ ద్వారా , వారిలో ఏదో వొక ముఖ్యమైన మార్పు రావాలి. యిదీ నా ఆలోచన.

అప్పుడొక ముఖ్యమైన ఆలోచన తట్టింది. మొదటే వొకటిన్నర ఘంటలు , వారి నిజ జీవితం లో, వారి యింటిలో జరుగుతున్న, జరగవలసిన  కమ్యూనికేషన్. రెండవ   వొకటిన్నర ఘంటలు, వారి ఆఫీసుల్లో జరుగుతున్న , జరగవలసిన  కమ్యూనికేషన్.  ఇక, ఉత్త, పుస్తకాల్లో వున్న కమ్యూనికేషన్ స్కిల్స్  ను పక్కన పెట్టి - మనకు, అంటే - ప్రతి మనిషికి , ముఖ్యంగా - మా ట్రైనింగ్ కు వచ్చే ట్రైనీ లకు , ఏది ముఖ్యంగా కావాలో - అది ఏమిటి?  అన్న ఆలోచన ఆరంభం అయ్యింది.

యింట్లో - భార్యాభర్తల మధ్య, పిల్లలతో, తల్లిదండ్రులతో, యిరుగు పొరుగుతో - వచ్చే సమస్యలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఎలా తీర్చుకోవచ్చు?  అలాగే - ఆఫీసుల్లో, క్రింది వారితో, పై వారితో సంబంధాలు , అంతకు మించి, వచ్చే కస్టమర్లతో, ఎలా మాట్లాడాలి?  యిళ్లల్లో, ప్రతి వొక్కరికీ వున్న వొక సమస్య , ఆఫీసుల్లోని వొక సమస్య - కనీసం యివి  ప్రతి వొక్కరికీ తీరితే - నా ట్రైనింగ్ సఫలమైనట్టే . యిప్పుడు - యిదీ నా ఆలోచన .

దీనిపై - నా బ్రహ్మాండమైన పరిశోధన ఆరంభమైంది. అయితే, దీనిపై యిప్పటి వరకు పుస్తకాలలో  చదివిన  కమ్యూనికేషన్ స్కిల్స్ లో - నాకు దొరికిన బలమైన అంశాలు తక్కువే.  చాలా వరకు, ఆఫీసులకు, కస్టమర్లకు సంబంధించిన విషయాలే. అందునా, భారత దేశ పరిస్థితులకు, మన భాషలకు, మన వారి మనస్తత్వాలకు పూర్తిగా అనుగుణంగా లేవు . కాని, వాటిని పునాదిగా, నా లెక్చర్ మలుచుకోవాలి.

అప్పుడు మొదలైంది - నా ప్రయాణం - కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు .

 అది చాలా, చాలా ఎక్కువగా, నాకు నచ్చిన టర్నింగ్  పాయింట్ . నా నిజ జీవితంలో కూడా వొక పెద్ద మలుపు . మరో సారి , విశదంగా చూద్దాం . 

యిప్పుడు సంస్కృతం  లోని  వొక శ్లోకం   : 
సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్;;  న బ్రూయాత్ సత్యమప్రియం. 
అర్థం : సత్యం చెప్పాలి ;  మనసుకు నచ్చే విధంగా చెప్పాలి ; మనసుకు నచ్చనిది సత్యమైనా చెప్పవద్దు .... యిది మాత్రం చదివితే - మనం నిజంగా, చెప్ప వలసినవి కొన్ని చెప్పక - తప్పు చేస్తాం . అప్రియమైన సత్యాలను, మీరే చెప్పాల్సిన సత్యాలను, మీరు మార్చాల్సిన మనుషుల దగ్గర, చెప్పి తీరాలి . మిగతా వారి వద్ద వద్దు . 

తమిళం లో విన్న వొక చాటువు ;
వున్మై ఏ పేసుగ  (నిజమే చెప్పండి); నన్మై ఏ  పేసుగ (మంచిదే చెప్పండి); అషగాగ పేసుగ (అందంగాచెప్పండి ); మనమరిందు  పేసుగ (ఎదుటి వాడి మనస్స్థితి తెలుసుకుని  దానికి అనుగుణంగా మాట్లాడండి ); అర్థం అరిందు పేసుగ ( మీరు మాట్లాడే మాటల అర్థం తెలుసుకుని మాట్లాడండి ); పలన్ అరిందు పేసుగ (చేస్తే తరువాత ఏమవుతుందో యోచించి మాట్లాడండి); సమయమరిందు పేసుగ (సరైన సమయం చూసి చెప్పండి); సబై అరిందు పేసుగ (చుట్టూ వున్న వారెవరో అర్థం చేసుకుని మాట్లాడండి); పేసాదిరుందుం పషగుగ (మాట్లాడకుండా వుండడం కూడా అలవాటు చేసుకోండి); 

తెలుగులో : 
ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి అన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక ; తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ ;

యింతకు మించి కమ్యూనికేషన్ స్కిల్స్ వుందంటారా ?

= మీ

వుప్పలధడియం విజయమోహన్



28, నవంబర్ 2013, గురువారం

గోధుమ పైరు రసం - ఎన్ని రోగాలకు మందు? - కాన్సర్ ను అది తగ్గిస్తుందా ?

గోధుమ పైరు రసం

ఎన్ని రోగాలకు మందు?

కాన్సర్ ను అది తగ్గిస్తుందా ?


ఈ  మధ్య  గోధుమ పైరు రసం(వీట్  గ్రాస్ జూస్ ) గురించి చాలా వార్తలు వచ్చాయి; వస్తున్నాయి . దాదాపు 15 ఏళ్ళుగా దీన్ని ఎన్నో దేశాలలో, ఎన్నో రోగాలకు ఔషధం గా ప్రయోగించడం జరిగింది . దీనిపై కొంత మంది డాక్టర్లు , తాము చేసిన పరిశోధనలను గురించి వివరం గా పుస్తకాలు రాశారు. అందులో, ఎంతో మంది రోగుల అనుభవాలు , డాక్టర్ల  అనుభవాలు పొందు పరిచారు . చాలా ఆసక్తి కరమైన అంశాలు అందులో వున్నాయి. అదే కాక, యింటర్ నెట్ లో దీన్ని గురించి చాలా , చాలా సమాచారం వుంది , ఎంతో మంది డాక్టర్లు , రోగులు - తమ అనుభవాలను చెబుతున్నారు. దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా వొక్క విషయం మాత్రం తెలుస్తూ వుంది . ఈ గోధుమ పైరు రసం - ఎన్నో రోగాలకు, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది - అని .

ఒక 20 రోజులకు ముందు, మా బంధువర్గంలో వొకతను , 40 ఏళ్ళ వయస్సు వాడు , అతనికి  కడుపునొప్పి రావడం, డాక్టర్లు ఆపరేషన్ చేసి, కడుపులోని పెద్ద గడ్డను తీసి వెయ్యడం జరిగింది . ఆ తరువాత జరిగిన వైద్య పరిశోధనలలో, అతనికి లివర్ దగ్గర అనుకుంటా - కాన్సర్ కూడా వున్నట్టు నిర్దారించడం జరిగింది. అది నా దృష్టికి రావడం, ఆయన నన్ను కూడా సలహా అడగడం జరిగింది.

అల్లోపతి వైద్యం ప్రకారం - కీమో థెరపీ యిస్తున్నారు.  కానీ , ఈ కాలంలో, ఈ తెరపి యొక్క సైడ్ ఎఫెక్ట్స్; కాన్సర్ మళ్ళీ రావచ్చునేమో అన్న సందేహం - యివన్నీ వుండనే వున్నాయి. అందుకని, ఈ విషయంపై  నేను - కాన్సర్ కు యిప్పుడు వున్న అనేక రకాలైన నిరోధకాలు, అనేక రకాలైన మందులను  గురించి చదవడం, పరిశీలించడం  జరిగింది . అందులో - మరెన్నో వున్నా - మనకు సులభంగా అందుబాటులో వున్న "గోధుమ పైరు  రసం" వైద్యం - నన్ను బాగా ఆకర్షించింది . అల్లోపతీ వైద్య పరిశోధకులు, లేబరేటరీలు, వీటిని అస్సలు పరిశోధించరు. వారికి మిగతా వైద్య విధానాల పట్ల గౌరవం లేదు; చాలా, అశాస్త్రీయమైన, అపనమ్మకం.

మన దేశంలోని, ఆయుర్వేద కళా శాలలు, విశ్వ విద్యాలయాలు, వీటిపై విధిగా పరిశోధనలు చేసి, పరిశోధనా ఫలితాలను ప్రకటించ వలసిన అవసరం ఎంతైనా వుంది. వారూ, యిటువంటి పరిశోధనలను పెద్దగా చెయ్యడం లేదు. చరక సుశ్రుతుల తరువాత, మన ఆయుర్వేద వైద్య పరిశోధనలు అంటూ పెద్దగా ఏమీ జరుగ లేదు . తురుష్కుల, ఆంగ్లేయుల కాలం లో వున్నవంతా పోయాయి.  తరువాత కూడా, మన ఆయుర్వేదానికి , మన ప్రభుత్వం వారు యిచ్చిన ప్రోత్సాహం ఏమీ లేదు.  చరక సుశ్రుతుల లాంటి వారు కొద్ది మంది చెప్పినది తప్ప మరేమీ మనం పరిశోధించి   ప్రకటించి  తెలియ పరచడము లేదు. ఈ నేపథ్యం లో, గోధుమ పైరు రసం పై ఎంతో మంది పాశ్చాత్య దేశాల డాక్టర్లు చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలు, చాలా ఉపయోగ కరం గా వున్నాయని తప్పక చెప్ప వచ్చు . ఇంటర్ నెట్ లో దీనిపై చాలా, చాలా ఉపయోగ కర సమాచారం వుంది . దీనిని క్లుప్తంగా, పాఠకుల ఉపయోగం కొరకు యిక్కడ రాయడం జరిగింది .

క్లోరోఫిల్ : - గో.పై.ర. లో , వృక్షములలోని, ఆకు పచ్చటి పదార్ధం - అంటే క్లోరోఫిల్, చాలా గొప్పగా, అన్ని పోషక పదార్థాలతోను , అన్ని రోగ నిరోధక పదార్థాలతోను, క్రిమి సంహారకాలతోను, వుందని వారందరూ చెబుతున్నారు .  వరి, జొన్న, రాగి లాంటి మిగతా పైర్ల తో పోల్చి చూస్తే, యిందు లోని క్లోరోఫిల్ లో - మన శరీరానికి ఉపయోగించే పదార్థాలు చాలా  వున్నాయని చెబుతున్నారు. యిది మనం, పైరును,  పచ్చగా, పూర్ణ జీవ శక్తితో వున్నప్పుడు, కోసి, రసం తీసి త్రాగడం వలన, మెడికల్ షాపులలో దొరికే ఏ మందు కంటే కూడా, మనం తయారు చేసే, మరే  ఆహార పదార్థాల కంటే కూడా -అత్యంత శ్రేష్టమైన మందు, మరియు ఆహారం అని చెప్ప వచ్చు .
ద్రవ పదార్ధం : - ఇది మనం ద్రవ పదార్ధం గా తీసుకోవడమే శ్రేష్టమైన విధానం. అదీ, రసం తీసిన వెంటనే తీసుకుంటే - చాలా శ్రేష్టం.  శరీరంలోకి అతి త్వరగా చేరడం వలన, అన్ని పోషక పదార్థాలు మనదేహంలో త్వరగా చేరుతాయి. రోగ నిరోధక శక్తి కూడా త్వరగా పని చేస్తుంది. అంటే - మార్కెట్ లో దొరికే మరే మందు కంటే కూడా - యిది ఎన్నో విషయాలలో, ఎన్నో రెట్లు త్వరగా పని చేస్తుంది -అని చెప్పుకోవచ్చు.  కాకపోతే - ఫ్లాట్  సిస్టం ఇళ్ళు యిప్పుడు చాలా ఎక్కువ . ఖాళీ స్థలం తో బాటు వున్న ఇళ్ళు  తక్కువ. అందువలన, గోధుమ   పైరు పెంచడం , రసం తీసి త్రాగడం అందరికీ కుదరదు . కాబట్టి, పౌడర్  గానో, టాబ్లెట్ రూపం లోనో, మార్కెట్ లో కొని కూడా వాడ వచ్చు. దాని ఉపయోగం కొంత తక్కువ . అయితే ప్రయాణాలు చేసే వారికి, వొక చోట వుండని వారికి , యివి కూడా మంచివే కదా .

 పోషక పదార్థాల  సమ్రద్ధత ;- ఈ రసంలో - శరీరానికి కావలసిన, ఎన్నో రకాల పోషక పదార్థాలున్నాయి. మన ప్రాణ శక్తికి, జీవ పోషణకు యివి చాలా సులభంగా, త్వరితంగా లభిస్తుంది. అంటే, మరి, కాఫీ , టీ లాంటివి అవసరం అనిపించక పోవచ్చు. అంతే కాదు. యిది తీసుకునే వారికి, త్రాగుడు లాంటి అలవాట్లు క్రమక్రమంగా  తగ్గిపోవచ్చు .


హిమోగ్లోబిన్ :- రక్త హీనత , అనీమియా  లాంటి వాటితో బాధ పడుతున్న వారికి  - వారి ఆరోగ్యాన్ని బాగుచేయడానికి యిది బాగా ఉపయోగ పడుతుంది. హిమోగ్లోబిన్ కణం ఎలా వుంటుందో , దీని కణాలు కూడా దాదాపు అలాగే వుంటుంది. అందువలన రక్త వృద్ధికి , హిమోగ్లోబిన్ వృద్ధికి, ఆరోగ్యానికి, యిది బాగా ఉపయోగ పడుతుంది. 

టాక్సిన్లు లేనిది : చాలా ఆహారాలలో , యేవేవో, హాని కరమైన టాక్సిన్లు వుంటున్నాయి. వాటి వలన, శరీరానికి, రక రకాల కీడు ఏర్పడడం జరుగుతూ వుంది . గో.పై.ర. లో - ఎటువంటి హానికర పదార్థాలూ లేవని చెప్ప వచ్చు. కాబట్టి, దీన్ని, ఏ భయం లేకుండా, వొక గ్లాసు వరకూ, తీసుకోవచ్చు. చాలా మంది రోగులకు, 3-4 గ్లాసులు ప్రతి  దినం యిచ్చారు . దీని వలన  కొంత మందికి 2-3 రోజులు డయోరియా లాంటివి వచ్చినా - దీన్ని సగం నీళ్ళలో కలిపి యిస్తే - వెంటనే తగ్గి పోయింది . ఆ తరువాత, యీ రసం వలన శరీరం లోని ఎన్నో వ్యాధులు  తొందరగా నయమయ్యాయి. 
శరీరంలోని/పైని బాక్టీరియా : దీన్ని, తీసుకున్న వారికి, శరీరంలో, వ్యాధులు ఉత్పత్తి చేసే ఎన్నో రకాల బాక్టీరియా పూర్తిగా నాశనమవడం జరిగింది. అలాగే, యిదే రసం, చర్మం పై పూస్తే , అక్కడున్న, పుండ్లు మానడం, అలెర్జీలు తగ్గడం, ఎగ్జిమా లాంటివి క్రమంగా పోవడం జరిగాయి . అంటే - శరీరం లోపలా, బయటా, ఈ రసం శక్తి వంతమైన బాక్టీరియా సంహారిణి గా, ఆరోగ్య వర్దినిగా వుండటం గమనించారు.  

చర్మ  రోగ  నివారిణి :- పైన చెప్పినట్టు, క్రమ బద్ధంగా, చర్మంపై పుండ్లు , అలెర్జీలు , ఎగ్జిమాలు , సోరియాసిస్  లాంటివి వున్న ప్రాంతాలలో, యిది పూస్తూ వస్తే , చాలా మెరుగైనట్టు చెబుతున్నారు . 

శరీరంలోని విష పదార్థాలు / టాక్సిన్ లు : మన శరీరంలో రకరకాల, విష పదార్థాలు, ఎలాగో చేరి పోతూ వుంటాయి . వాటినన్నిటినీ మట్టు బెట్టి , శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, శక్తి  యిచ్చి వాటి ద్వారా, శరీరాన్ని కాపాడుతుంది . 

డయాబెటీస్ : - చక్కెర వ్యాధి లో కూడా, యిది ఎంతో ఉపయోగ పడటం గమనార్హం . పాశ్చాత్య ఫార్మా కంపెనీలు , చాలా వరకు, ఏ వ్యాధికీ , పూర్తి విరుగుడు కనిపెడ్డటం లేదు .  ఆ వ్యాధులు శరీరంలో, జీవితమంతా వుండాలి, వాటికి మనం ఎప్పుడూ మందులు తీసుకుంటూనే వుండాలి- అన్న చందం గానే వుంది ప్రతి పాశ్చాత్య మందూ. అదీ, ప్రకృతి వైద్యం అంటేనే దూరంగా వుంటున్నారు. అన్నీ రసాయనిక మందులే. యిది చాలా మూర్ఖత్వంగా వుంది.  కానీ, కొంత మంది పాశ్చాత్య డాక్టర్లు కూడా, ఈ విధానాన్ని, గర్హిస్తూ - పూర్తి విరుగుడు కోసం వెదుకుతున్నారు . అందులో భాగమే - ఈ గోధుమ పైరు రసం వైద్యం . 

వ్యాధి నిరోధకం : శరీరంలోని రక రకాల దుర్వాసనలను పోగొట్టడము , పుళ్ళను నయం చెయ్యడము, సైనసిటిస్ , చేవ్వి పోట్లు, చెవుల వ్యాధులు , గుదం లో వచ్చే, పుళ్ళు , వెజైనా లో వచ్చే సమస్యలు యిలా ఎన్నో సమస్యలకు ఈ రసం బాగా ఉపయోగ పడడం గమనించారు .

శరీరం లోని  అతి ముఖ్య భాగాలు : గుండె, ఊపిరి తిత్తులు, మెదడు, లివరు లాంటి అతి ముఖ్య భాగాల పని కూడా, యిది  తీసుకున్నప్పుడు బాగు పడటం గమనించారు.

పండ్లు - వాటి సమస్యలు :- నోటిలో, ఈ రసం కాస్సేపు వుంచుకుని , పుక్కులించి , మింగితే , పళ్ళ సమస్యలు , నోటి దుర్వాసన  లాంటి సమస్యలు దూరం కావడం గమనించారు.

గుదం యొక్క ఆరోగ్యం : నోటిలో లాగే, గుదం ద్వారా, ఈ రసాన్ని లోపలి తీసుకుని , కొద్ది సేపు వుంచుకుని , మళ్ళీ బయటికి వదిలేస్తే , గుదం యొక్క సమస్యలు తీరి, ఆ భాగం ఆరోగ్యం బాగు పడటం గమనించారు .

కండరాలు,ఎముకలు :- కండరాల బలం, ఎముకల ధృఢత్వం  పెరగడం కూడా దీని వొక వుపయోగమే .

యెర్ర కణాలు, రక్త పోటు :- ఈ రసం తీసుకున్న వారికి రక్త పోటు బాగుండడం, ఎర్ర కణాల సంఖ్య, వాటి ఆరోగ్యం పెరిగి, రక్త సమస్యలు పూర్తిగా తగ్గి పోవడం గమనించారు.  బరువైన లోహ కణాలను తీసి వేసి, రక్తం లోని ఆమ్ల తత్వాన్ని తగ్గించి, క్షార తత్వాన్ని సమ తౌల్యానికి తేవడం  కూడా గమనించారు.   

పనికి రాని కణాలు, దుమ్ము  : శరీరంలో , అన్ని భాగాలలోనూ , శరీరానికి పనికి రాని కణాలు, దుమ్ము లాంటివి , ఎలాగో చేరి పోతూ  వుంటాయి. వీటిని, రక్తం ద్వారానే శుద్ధి చెయ్యడం , శరీరం అన్ని భాగాలకూ పంపడం - బాగా జరిగేది - ఈ రసం తీసుకున్న సమయంలో . 

మెటబాలిజమ్ : శరీరం యొక్క మెటబాలిజమ్ ను సమ తౌల్య స్థితిలో వుంచడం, శరీరపు భాగాలకు, పటుత్వం, శక్తి దొరుకుతూ వుండడం కూడా జరిగింది.  థైరాయిడ్ సమస్యలు, పెప్టిక్ అల్సర్లు,  కాన్స్టిపేషన్, మరెన్నో యితర జీర్ణావయవ సమస్యలు దీని ద్వారా మెరుగు పడ్డాయని చెబుతున్నారు .  

ట్యూమర్లు , కాన్సర్లు : దీని అతి గొప్ప ఉపయోగం ట్యూమర్లను, కాన్సర్ లను నయం చేయడం లో - అని డాక్టర్లు, పేషంట్లు చెప్పారు. దీన్లో వున్న ఉత్తమమైన ఆక్సిజన్ ఎదుట, ఈ ట్యూమర్లు గానీ, కాన్సర్ కణాలు కానీ బ్రతక లేక పోవడం, శరీరం లోని, ఏ అనారోగ్య కరమైన వాపూ, దీని ముందు నిలువ లేక పోవడం గమనార్హం. రేడియేషన్, కీమో థెరపీ లాంటి చికిత్సల సైడ్ ఎఫెక్ట్స్ ను బాగా తగ్గించి, ఆరోగ్యం పెంపొందించడం కూడా గమనార్హం. ఈ రసం బాగా జీవంతో ఉన్నప్పుడే కోసి, రసం తీసి తాగడం వలన - దీని ఉపయోగాలు చాలా, చాలా ఎక్కువ. ఇందులోని క్లోరోఫిల్ లోని జీవ పదార్థాలు, ఆక్సిజన్ , ఎన్ని రకాలుగా  ఉపయోగ పడుతోందో - అని వారందరూ ఆశ్చర్య పోతున్నారు. యివే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగ పడిందట. మనలోని ఫెర్టిలిటీ, యౌవనము పెరగడము - యిలా, ఎన్నో, ఎన్నో ఉపయోగాలు - ఈ డాక్టర్లు వారి పేషంట్లు గమనించారు .   

దీన్ని పెంచడం ఎలా : యిళ్ళలో , నేలపైగానీ, పెద్ద కుండీలలో గానీ, పెంచవచ్చు. మంచి గోధుమలను, సారవంతమైన మట్టి లో చల్లి, లేదా, నాటి, బాగా తడుపుతూ వుంటే , మొలకెత్తుతాయి. ఎక్కువ సూర్య రశ్మి అక్కర లేదు కానీ, కొద్ది పాటి రశ్మి అయినా కావాలి. అంటే - చెట్ల నీడలో కూడా పెంచ వచ్చు . వొక అడుగు పెరిగిన తర్వాత , అది యింకా బాగా పచ్చగా ఉన్నప్పుడే , రెండు మూడు ఆకులు వేసిన తర్వాత , కోసేసి, తడిపి, గుజ్జులాగా చేసి, మిక్సీ లో వేసి రసం తీసుకోవచ్చు . రసాన్ని నిలువ వుంచకండి. కానీ, కోసిన పైరును, అలాగే ప్రిజ్ లో కొన్నాళ్ళు ఉంచవచ్చు . ఎప్పుడు రసం తీసినా, వెంటనే త్రాగటం శ్రేష్టం .  

పేషంట్లు  ఏం చెయ్యాలి :యిన్ని విషయాలు, యింకా ఎన్నో విషయాలు, గోధుమ పైరు రసం గురించి , ఇంటర్ నెట్ లో వున్నాయి. మరి, అల్లోపతీ వైద్యులు వీటిని వొప్పుకుంటారా? ఊహూ. ఎందుకంటే, వారికి, ఏదైనా ఫార్మా కంపెనీ చెబితే కానీ నమ్మకం లేదు. కానీ, ఈ రోజు వరకూ, ఏ పాశ్చాత్య ఫార్మా కంపెనీ కూడా - యిప్పటి రోగాలకు దేనికీ పెర్మనెంట్ క్యూర్, అంటే, పూర్తి విరుగుడు కనిబెట్టడం లేదు. అవి జీవితాంతం వుండాలి. మీరు ఆ కంపెనీల మందులు  జీవితాంతం  వాడాలి. ఏదో, కొద్దో, గొప్పో, ఉపశమనం పొందాలి; మళ్ళీ, డాక్టరు దగ్గరకు వెళ్ళాలి; మళ్ళీ కొత్త మందులు; మళ్ళీ, మళ్ళీ, ఇదండీ జరుగుతున్న చక్రవ్యూహం .  

సరే . వొక డాక్టరు కే ఈ రోగాలేవైనా వస్తే - కనీసం భయంతో నైనా - ఈ వ్యాసమో, నెట్ లోని మరే వ్యాసమో చదివితే, తప్పకుండా, గోధుమ పైరు రసం సేవిస్తారు. ప్రాణ భయం ఎవరిని విడిచింది? నిజానికి, యిది తీసుకుని కాన్సర్ నయం చేసుకున్న మొదటి పేషంట్లలో డాక్టర్లు వున్నారు. కానీ, మరెవరికైనా వస్తే, యిది కూడా చెయ్యమని చెబుతారా. మన డాక్టర్లు చెప్పరు.

యిప్పుడు మా బంధువులలో వొకాయనకు కాన్సర్ వచ్చిందన్నాను కదా. ఆయన యిప్పుడు - అల్లోపతీ తో బాటు యిది కూడా యింట్లో తయారు చేసి, తీసుకుంటున్నాడు. అలాగే, ఆయనకు, కొన్ని రకాల ధ్యానం, కొన్ని రకాల ప్రాణాయామాలు చెప్పించాము. అవీ చేస్తున్నాడు. నా ఉద్దేశంలో - ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. అదీ చాలా త్వరగా .

యిప్పుడు మీ, నా కర్తవ్యం ఏమిటి?  మన దరి దాపుల్లో , ఎంతో మంది , ఎన్నో రకాల రోగులు  దీర్ఘ వ్యాధి పీడితులు వున్నారు. కొంత మంది బ్రదకడం గురించి ఎటువంటి నమ్మకమూ లేక , మృత్యువు కోసం ఎదురు చూస్తూ వుండేవారు కూడా వుంటారు. 

అటువంటి వారి మనస్సులో, మీరూ, నేనూ - నిర్భయత్వం , నమ్మకం, భవిష్యత్తు పట్ల వుత్సాహము - చిగురించే లాగ చెయ్యాలి . అందుకే - ఈ ప్రయాస . 

సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్






1.

25, నవంబర్ 2013, సోమవారం

పతంజలి యోగ సూత్రాలు 4 వ వ్యాసం సమాధి పాదం 3 వ సూత్రం 4 వ ప్రయోగం ద్రష్ట కావడానికి మొదటి మెట్టు

  

పతంజలి యోగ సూత్రాలు 
4 వ వ్యాసం 
 
పతంజలి  సూత్రాల పై  రాస్తున్న ఈ  వ్యాస మాలికకు - మీకందరికీ పునః స్వాగతం.  మీరు - మొదటి వ్యాసంలో  నల్ల గొరిల్లాను  2 నిమిషాలు మరిచి పోయే ప్రయోగం ; రెండవ వ్యాసంలో రిలాక్సేషన్; మూడవ వ్యాసం లో శ్వాస మీద ధ్యాస ప్రయోగం చేసారు కదా. చేసి వుంటే మీరు యోగ మార్గం లో ముందుకు వెడుతూ ఉన్నారన్న మాటే. ఇక నుండి, మీరూ యోగ సాధకులే. యోగ మార్గం లో వున్న వారే. వొక్కొక్క వ్యాసంతో, వొక్కొక్క అధ్యయనం తో - ముందుకు  వెళ్ళండి. 

సమాధి పాదం - సూత్రం -3

తదా ద్రష్టుహ్ స్వరూపేవస్థానం  

తదా  - అంటే, అప్పుడు అని అర్థం ; అప్పుడు అంటే ఎప్పుడు? సాధకుడైన మీరు - మీ చిత్త  వృత్తులను  నిరోధించినప్పుడు;  యిదే కదా, రెండవ సూత్రంలో యోగం అన్న శబ్దానికి నిర్వచనంగా , అర్థంగా చెప్పుకున్నాము . చిత్త  వృత్తులంటే ఏమిటో  క్రిందటి వ్యాసంలో కొద్దిగా చూశాము. మన మనసులో కదిలే వూహలు,ఆలోచనలు, భావనలు,  ప్రేమలు,దుఃఖాలు - అన్నీ చిత్త వృత్తులే.  సాధకుడైన మీరు వాటిని నిరోధించ గలిగితే , లోనికి రాకుండా ఆప గలిగితే - అప్పుడేమవుతుంది.   

మనసులో వృత్తులు కదులుతూ వుంటే - మీరు వాటి వెనుకనే వెళ్లి పోయే ప్రమాదం వుంది. అదే సాధారణంగా మీరు చేస్తూ, వాటి వెనుక వెడుతూ వున్నారు కూడా .

అది దుఃఖపడమంటే పడుతూ వున్నారు. కోపం చేసుకోమంటే, కోపం చేసుకుంటూ వున్నారు. అది పెట్టే కష్టాలన్నిటినీ అనుభవిస్తున్నారు.  మనసు గతి యింతే ; మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికీ , సుఖం లేదంతే - అని సరి గానే అన్నారు వొక సినిమా  కవి.

మనసు వొక కల్లు  త్రాగిన, ముల్లు గుచ్చుకున్న, తేలు కుట్టిన కోతి లాంటిది . కామ, క్రోధ , లోభ , మోహ, మద, మాత్సర్య , భయాలను - మన ఆనందాన్ని పూర్తిగా హరించే అంతః శత్రువులు  అన్నారు - ఆర్యులు .  వాటి నివాస స్థలము మనసు .

ఆర్యులు అంటే -  మన పూర్వీకులలో పూజింప దాగిన వాళ్ళు, అని అర్థం - అంతే కాని, ఏదో ఇరాన్, జర్మనీ నుండీ  వచ్చిన వారనో, లేదా, తమిళనాడులో అనుకునే లాగా వొక కులం వారనో కాదు. సరే . ఈ కామ క్రోధాదులన్నీ మనసులో వచ్చేవే .మనసులో పుట్టేవే . బుద్ధి మాట వింటే యివి రావు . 


మనసును నిరోధించే ఈ మార్గంలో మనం చేసే కృషినే - చిత్తవృత్తి   నిరోధః అన్నారు పతంజలి మహర్షి . ముందు ముందు,యిది పూర్తిగా విశదీకరించ నున్నారు పతంజలి . 

సరే . పతంజలి చెప్పినట్టు చిత్తవృత్తి  నిరోధం చేశామే అనుకోండి . దాన్నే యోగం అని ఆయన 2 వ సూత్రంలో అన్నారు కదా. అది చేసేస్తే , చెయ్య గలిగితే  ఏమవుతుంది?

అప్పుడు, ద్రష్ట అనబడే వాడు - తన నిజ రూపంలో ప్రతిష్టింప బడతాడు; ఆసీనుడవుతాడు; ఆవిష్కారమవుతాడు - అని అంటారు  పతంజలి .  ద్రష్ట అంటే - అన్నిటినీ చూసే వాడు, సాక్షిగా వుండే వాడు; వేటికీ లొంగక , వేటి వెనుకా, తానూ పరుగులెత్తక - తన స్థానంలో, తన స్వరూపంలో, తాను  వుండి అన్నిటినీ గమనించే వాడు.  ఎవరీ ద్రష్ట ? ఎవరీ సాక్షి? యిది  తెలుసుకోవడానికే  యిన్ని యోగ సూత్రాలు, యిన్ని ప్రయాసలు, యిన్ని ప్రయోగాలు . 

యిప్పుడు నేను చెప్పొచ్చు . ఆ ద్రష్ట  ఎవరో కాదు  - మీరే , అని . అందులో ప్రయోజనం ఏమీ లేదు . యోగం అనేది ఎవరో చెప్పి, ఏదో పుస్తకమో బ్లాగో చదివి తెలుసుకునే విషయం కానే కాదు . మీరే, ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా తెలుసుకునేది. 

సరే. ద్రష్ట మీరే అని చెబుతాను అనుకోండి . - మీరే అంటే ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది . మీ స్వరూపము , మీ స్వస్థానము, అంటే - ఎలా అర్థమవుతుంది ? కాదు. అయితే - , ఎప్పుడు ఎలా యివన్నీ అర్థమవుతుంది? మీరు, నేను  చెప్పే ప్రయోగాలు, అన్నీ మీ పైనే, చేస్తూ వెళ్ళాలి .  ముందుకు వెళుతూ వుంటే - మొదట  ఏది మీరు కాదో , తెలిసిపోతుంది . తరువాత, ఏది మీరో తెలిసి పోతుంది - కనీసం అలా అనిపిస్తుంది . ఎప్పుడో , మీరు, నిజమైన  మీరై  పోతారు . అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం వుండదు . అదండీ, సూక్ష్మం గా కథ.

యిప్పుడొక చిన్న ప్రయోగం చెయ్యండి : మొదట యిది రెండు సార్లు చదవండి . తరువాత  చెయ్యండి :

యోగ - ప్రయోగం - 4 ( ఆనందపు మూడవ మెట్టుకు - చిన్న ప్రయోగం ) 

హాయిగా  కూర్చోండి. నేల పై నైనా  సరే . కుర్చీ లో నైనా సరే. మంచం మీదైనా సరే . మీరు కాళ్లెలా పెట్టుకుంటారో , మీ యిష్టమే. 
మీ చేతులు,  మీ వొళ్ళో పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి చెయ్యి వేసి హాయిగా, శరీరం లో టెన్ షన్ లేకుండా, వీపు మాత్రం కాస్త నిటారుగా - హాయిగా, కూర్చోండి .   యిప్పుడు వొక చిన్న ప్రయోగం చెబుతాను . చదివేసి తరువాత చెయ్యండి .
ఈ  సారి, మీరు వొక శుభ్రమైన అద్దం ముందు కూర్చోండి. పెద్ద నిలువుటద్దమైనా మంచిదే. మీ ముఖం మాత్రం బాగా కనిపించేటంతటి  అద్దమైన పరవా లేదు . అది నిటారుగా వుండాలి . దాని ఎదురుగా,మీరు నిటారుగానే కూర్చుని -   వెంటనే, 'అద్దం చూడక ముందే' కళ్ళు మూసేసుకోండి.  యిప్పుడు, మీ మనసులో, మీ ముఖం ప్రతిబింబం ఎలా వుంటుందో  వూహించుకోండి. అద్దంలో కాదు - మీ మనసులో, మీ మూసిన కళ్ళ ముందు.    మీరు ఎంత మాత్రం, మీ ముఖాన్ని మీ మనసులో చూసుకో గలరో - అంత మాత్రం చూసుకోండి -వొక్క నిమిషం పాటు. ఇప్పుడు కళ్ళు తెరవండి . అద్దంలో మీ ముఖం చూడండి . 

 అందులో  హాయిగా మీ ముఖం చూస్తూ కూర్చోండి.  ముఖం మాత్రమే సుమా. జుట్టు నుండి , చుబుకం వరకు,  గడ్డం క్రింద వరకూ,  బాగా చూడండి . కానీ, ముఖాన్ని దాటి పోకండి. అయిదు నిమిషాలు చూడండి . రెప్పలార్పితే తప్పు లేదు. మామూలుగా, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎలా వుంటే, వున్నంతలో, మీ ముఖం బాగుంటుందో, అలా వుండండి. ముఖ కవళికలు, ఎక్కువగా మార్చ కండి. ఎలా వున్నా, మీరు బాగానే వున్నారు - అనే భావన మనసులో పెట్టుకోండి.  మధ్యలో, 30-50 సెకన్లు , కళ్ళు మూసుకున్నా ఫరవా లేదు. మళ్ళీ తెరిచి మీ ముఖమే చూడాలి . అంతే . యిప్పుడు కొంత సేపు మీ కళ్ళను మాత్రం చూడండి. ముఖమంతా కాదు. మీ కళ్ళు ఆనందంగా వున్నాయా - కనీసం మిమ్మలను మీ కళ్ళు ఆనందంతో చూస్తున్నాయా ? మిమ్మల్ని మీరు సంతోషంతో చూడాలి. యిదీ ఈ ప్రయోగం మొదటి వుద్దేశం. అంతకు మించి మరో ప్రయోజనం కూడా వుంది. 

మీకు తెలుసా ? ప్రపంచంలో, ఏ యుగం లోనూ, యిప్పటి వరకు , మీ లాంటి ముఖం, మీ కళ్ళు  లాంటి కళ్ళు  వున్న వారు ఎవరూ పుట్ట లేదని ? అంతే కాదు. యిక ముందు పుట్ట బోరని.   ఈ ప్రపంచంలో మీ లాంటి వారు మీరు మాత్రమే . మరో ఏడుగురు  వుంటారు,  అన్నదంతా - కథలే . అవన్నీ తప్పు . కాస్త దగ్గరి పోలికలు వుండవచ్చు కానీ , మీ లాంటి వారు ఎవరూ పుట్ట లేదు, పుట్టబోరు - మీరు తప్ప .

అంత కంటే  ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే -  యిప్పుడు మీ  వయస్సు 16 కావచ్చు, 26 కావచ్చు . 36 లేదా 46, 56, 66, 76 ఎంతైనా కావచ్చు . యిన్ని సంవత్సరాల జీవితంలో, మీ ముఖాన్ని గానీ , మీ కళ్ళను గానీ, మీరెప్పుడూ  నిశితంగా చూడనే లేదు . మీ ముఖంలో వచ్చే మార్పులు పూర్తిగా మీకు తెలియవు . ఏదో కొద్దిగా తెలుసు . అంతే . వొక అయిదు నిమిషాలు, తమ ముఖాన్ని తాము వొక్క సారి, పూర్తిగా, నిశితంగా  చూసుకున్న వారు - ఈ ప్రపంచం లో , చాలా తక్కువ మంది వున్నారు. యిప్పుడు - ఈ ప్రయోగం చేసి వుంటే - ఇలాంటి అతి కొద్ది మంది లో మీరు  వొకరైనారు . 

ఈ ప్రయోగం ఎందుకు . మీరు మీకే ద్రష్ట , లేదా, సాక్షి కావాలిగా; కనీసం మీ ముఖం మొదట మీకు తెలియనివ్వండి.

యిప్పుడు అద్దం  ముందే కూర్చుని కళ్ళు మూసుకోండి;  2-3 నిమిషాలు కనీసం . మీ మూసుకున్న కళ్ళ ముందు, మీ ముఖం మీకు స్పష్టంగా కనిపించాలి . కనిపించక పోతే , కళ్ళు తెరిచి, 30 సెకన్లు , అద్దంలో, మళ్ళీ మీ ముఖం చూడండి . మళ్ళీ కళ్ళు మూసుకోండి . యిప్పుడైనా మీ ముఖం స్పష్టంగా మీ మూసుకున్న కళ్ళ ముందు  కనిపించాలి. యిలా ఎన్ని సార్లు చేస్తే, మీ ముఖం, మీ కళ్ళు, మీకు బాగా తెలిసి  వస్తుందో, అన్ని సార్లు, ఈ ప్రయోగం చెయ్యండి . తరువాత, అద్దం  అక్కర లేదు. కళ్ళు మూసుకుంటే - మీకు, మీ ముఖం, మీ కళ్ళు బాగా తెలియాలి. 

మీకు - యిక చాలు అనిపిస్తే, మెల్లగా, మెల్లగా, కళ్ళు తెరవండి . మీరు ఎప్పుడు కళ్ళు మూసి తెరిచినా, మీ మొహం మీదకు వొక చిరునవ్వు రావాలి.  మీ పరిసరాలంతా , మీ చిరు నవ్వుతో బాటు - చూడాలి. 

ఆ తరువాత  మీరు   మీ పనులు చేసుకోవచ్చు .

- 4 వ  ప్రయోగం  పూర్తయ్యింది  

2 సార్లు యీ ప్రయోగం  పూర్తిగా చదివేయండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు  కూర్చుని - ఈ ప్రయోగం చెయ్యండి.


ఈ ప్రయోగం మీరు ఎప్పుడైనా, కానీ మీ యింట్లోనే , ఎక్కడైనా చెయ్య వచ్చు. యిది చేస్తే, ద్రష్ట , అంటే , సాక్షి కావడానికి సన్నద్ధులవుతున్నారు. బహిర్ముఖులు గా వుండే మీరు, మెల్లగా, మెల్ల మెల్లగా కొంత అంతర్ముఖులవుతున్నారు. 

మీరు ఈ ప్రయోగం - సరిగ్గా, రిలాక్స్ గా, సులభంగా,  చేసి వుంటే - యిప్పటికే మీరు , ప్రపంచం లోని 99 శాతం మనుషుల కంటే , మూడు పెద్ద ఆనందపు మెట్లు ,  పైకి ఎక్కేశారు . మీకు నా అభినందనలు . 
అయిదో వ్యాసంలో , మరో ఐదో ప్రయోగంతో , మళ్ళీ కలుద్దాం . అంత వరకు - ఈ నాలుగో ప్రయోగం అప్పుడప్పుడూ చేస్తూ వుండండి . 
= మీ 
వుప్పలధడియం విజయమోహన్ 

23, నవంబర్ 2013, శనివారం

స్వగతం (3) - టర్నింగ్ పాయింట్స్- అడ్డంకులేవీ , అడ్డంకులు కావు . అన్నీ సోపానాలే .


కష్టాలు పంచుకుంటే కరిగిపోతాయి. కష్టం పంచుకుంటే, అందులోనూ, సుఖం కనిపిస్తుంది.... చాలా,చాలా.

మరి సుఖాలో? పంచుకుంటే పెరిగి పొతాయి. అది కూడా.... చాలా,చాలా.

యివి రెండూ వొక దాని తర్వాత వొకటి రంగుల రాట్నంలా రావడమే జీవితం గా పెట్టాడు దేవుడు.

కానీ కష్టాలు కరిగి పోవడానికి, సుఖాలు పెరిగి పోవడానికీ కూడా మంచి టెక్నిక్ యిచ్చాడు కదా. అదే - పంచు కోవడం అనేది - అది వాడాలి. అప్పుడు - కష్టమూ సుఖమే; సుఖమూ సుఖమే. ప్రతిదీ - మరపు రానివిగా మిగుల్చుకోవచ్చు .

కష్టాలు పంచుకోవాలంటే  - మంచి స్నేహితుడు కావాలి. అది మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, అక్కో,చెల్లెలో, అమ్మో, నాన్నో, మరెవరైనా కావచ్చు . మీ కష్టాలు మీరు మరొకరితో పంచుకోవాలంటే - మొదట, మరొకరి కష్టాలు, మీరు పంచుకోవడానికీ సిద్ధంగా వుండాలి.

ఈ లోకంలో, కష్టాల్లో వున్న వారు, ఎంతో మంది వున్నారు. మీ చుట్టూ కూడా వున్నారు. మీ వాళ్లలోనే , మీ యింట్లోనే కూడా వున్నారు. దీనికి ముందటి వ్యాసంలో, మా చెల్లెలికి, నేను చేసిన కాస్త సహాయం గూర్చి చెప్పాను కదా. అందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు.  అంతే కాదు. దీన్ని సహాయం అనడానికి కూడా లేదు అది వొక , ముందు విస్మరించిన కర్తవ్యం మాత్రమే. చాలా సహాయాలు - నిజంగా మన కర్తవ్యాలే .

అయితే, ఆ తరువాత,  రానున్న కాలంలో , మా చెల్లెలు నాకు చేసిన సహాయం, అదీ, నేను అడగ కుండానే, అది మరువ లేనిది. దానికి తర్వాత వస్తాను. ఈ సంకలన మంతా యిలా ముందు వెనుకలు గానే నడుస్తుంది - దానికీ వొక కారణం వుంది లెండి .

మా యింట్లో - అప్పట్లో కాలేజీ చదువు చదివేటంత -స్తోమతు లేదు. అసలు దేనికీ ఆర్ధిక స్తోమతు లేదు . అసలు స్కూలు చదువే  - ఏదో మెరిట్ స్కాలర్షిప్  వలన - జరిగింది కానీ - లేకుంటే - ఏమో? ఎప్పుడు నిలిచి పోయేదో ?

అప్పట్లో, పోస్టల్  విభాగంలో, ఉద్యోగాలు, మార్కులు వుంటే చాలు, సులభంగా దొరికేవి. నాకు కూడా, 18 నిండీ నిండక ముందే,పోస్టల్ లోని ఆర్.యం.యస్ విభాగంలో దొరికింది. ఆ విభాగంలో క్లర్క్ ను సార్టర్ అనేవారు అప్పట్లో.

నేను ఆంధ్ర ప్రదేశ్కే  చేరిన, చెన్నై లో వున్న వొక ఆఫీసు లో వేయ బడ్డాను. కానీ, పని ఆఫీసు లో కాదు.  అప్పట్లో మద్రాసు - బొంబాయి మెయిల్  ట్రైన్ లో వొక పెద్ద సార్టింగ్ కంపార్ట్మెంట్  వుండేది. ఆటువంటివి యిప్పుడు లేవు. దాన్లో, దక్షిణ ప్రాంతాలనుండి (కేరళ, తమిళ నాడు ) నుండి వచ్చే కార్డ్లు, కవర్లు, ఇన్లాండ్ లెటర్లు, న్యూస్ పేపర్లు, రిజిస్టర్డ్ కవర్లు - ఇలాంటివన్నీ మద్రాసు-బొంబాయి రూట్ లో వున్న ప్రాంతాలకు సార్టింగ్  చేసి - వాటిని వేరు వేరు సంచులలో వేసి, వొక్కొక్క రైల్వే స్టేషన్  లోనూ - అక్కడి పోస్ట్ ఆఫీసు కో, RMS  ఆఫీసు కో యిచ్చెయ్యాలి.  వారు వెంటనే, వాటిని, ఆయా ఊర్లలో, ఎవరెవరికి చెందాలో, వారికి బట్వాడా చేసే వారు. ఆ పని నిజంగా చాలా గొప్ప పనే. మద్రాసు లెటర్లు - తిరుపతి, కడప, గుంతకల్లు  లాంటి ప్రాంతాలకు వొక్క రోజులో చేరి పోయేవి . యిప్పుడు చేరడం లేదు - ఆ సర్వీసు  తీసేసిన తర్వాత .

సరే. నా విషయానికొద్దాం. వొక్క రాత్రి మద్రాసు నుండి గుంతకల్లు వరకు ప్రయాణం. రాత్రి పూర్తిగా మేలుకొని సార్టింగ్  చేయాలి. గుంతకల్లు లో వొక రెస్ట్ హౌస్ లో పగలు వుండి, మళ్ళీ సాయంత్రం ఆరుగంటలకు - బొంబాయి నుండి మద్రాసుకు తిరిగి వెళ్ళే రైల్ లో మళ్ళీ అదే  సార్టింగ్ పని.  ఈ సారి, ఉత్తర ప్రాంతాల నుండి దక్షిణానికి పొయ్యే పోస్టల్ కవర్లు లాంటివన్నీ - మళ్ళీ సార్టింగ్ చేసి సంచులలో వేసి, ప్రతి స్టేషన్ లోనూ దింపాలి . అంటే - రెండు రాత్రులు - మేలుకుని పని చెయ్యాలి . పగలు గుంతకల్లులో, రెస్ట్ హౌస్ లో కూడా, ఏవేవో పనులు వుండేవి . యిలా రెండు రాత్రులు, మధ్య వచ్చే పగలు, మేలుకోవడం, మొదట  4-5 నెలలు నాకు చాలా కష్టంగా వుండేది . అదే కాక, ఊర్ల పేర్లు, అవి ఎక్కడ వున్నాయో, వాటికి చేరవలసిన లెటర్లు ఎక్కడ, ఏ సార్టింగ్ అర లో వేయాలో  తెలియక తికమక పడే వాడిని.

ఆ సార్టింగ్ అరలను పీజియన్ హోల్స్  అంటారు. యిప్పుడు కూడా పోస్ట్ ఆఫీసుల్లో చూడవచ్చు- అలాంటి వాటిని. కానీ - ఈ ట్రైన్ లో దేశం అంతటికీ సంబంధించిన మెయిల్స్ వచ్చేవి. అది ఎలా సార్ట్ చెయ్యాలో - అ  మొదటి 4=5 నెలలు నాకైతే  తెలిసేది కాదు. ఆ కంపార్ట్మెంట్ లో 10 మందికి పైగా సార్తర్లు, వొక హెడ్ సార్తర్ (హెడ్ క్లర్క్), కొంత మంది సంచులు కట్టే వారు (ప్యూన్లు ) పని చేసే వారు. మామూలు ప్రయాణీకులు  ఆ కంపార్ట్మెంట్ లోకి యెక్క రాదు .

యిలా దాదాపు, అయోమయంలో, నాకు కొన్ని నెలలు గడిచాయి . వొక రోజు, రాత్రి, మా హెడ్ సార్టర్ గారు , మరొక సీనియర్  సార్టర్ తో - నన్ను గురించి బాగా గేలిగా మాట్లాడాడు - ఎమండీ , మీవూరి వాడంటారు . అసలేం ప్రయోజనం లేదు చూడండి. నిద్రా మేలుకోలేడు; సార్టింగూ చాలా మెల్లగా చేస్తున్నాడు. ఏమేం తప్పులు చేస్తున్నాడో తెలీదు; మీరైనా అతనికి కాస్త బుద్ధి చెప్పండి - యిలా, ఏదేదో అనేశాడు . నాకైతే చాలా అవమానం అనిపించింది. మరి ఆ రెండు రోజులూ అసలు నిద్ర రాలేదు .

నా పని - యింకా బాగా నేర్చుకోవాలి ; కానీ యెలా ? ఎన్ని రకాల యోచనలు చేసానో - నాకే ఆశ్చర్యం వేస్తుంది, యిప్పుడు తలుచుకుంటే.  ట్రైన్ దిగిన రోజు మా మద్రాసు ఆఫీసుకు వెళ్లాను. అక్కడ, మావూరాయన ఆ రోజు వున్నాడు . ఆయన్నడిగాను. ఈ ఊర్ల పేర్లు, వాటి సబ్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులు, జిల్లాలు, రాష్ట్రాలు  పేర్లు - యివన్నీ ఎక్కడుంటాయని. ఆఫీసులో వొక పుస్తకం వుంది. అది చూపించాడు. ఆ తరువాత కొన్ని రోజులు ఆఫీసులోనే కూర్చున్నాను. నిజానికి, నేను పోనక్కర లేదు. వొక్క ట్రిప్ ట్రైన్ లో వెళ్లి వస్తే - మూడు రోజులు యింట్లో రెస్టు వుండేది .  ఆ మూడు రోజులూ ఆఫీసుకు వెళ్ళేది ఆరంభం చేశాను .

దక్షిణరాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్  లాంటి రాష్ట్రాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులు, సబ్  ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులతో సహా, అన్నీ కంఠతా నేర్చుకున్నాను. ఆ వయసులో - అలా బట్టీ పెట్టడం మాత్రం నాకు బాగా వచ్చు.  నా అభిప్రాయంలో, అలా అంత పూర్తిగా, మరెవరూ నేర్చుకున్నట్టు - నేను మా డివిజన్ లో చూడ లేదు. మరెక్కడా కూడా అల్లా నేర్చుకోవడం కష్టమే.

మనసులో నాటుకున్న అవమానం అనే పెనుభూతం నన్ను ఆ పని చేయించింది .

కానీ - అది చాలదు. రాత్రిళ్ళు మేలుకోవాలి. చాలా వేగంగా సార్ట్ చెయ్యడం నేర్చుకోవాలి. మరి యివి ఎలా చెయ్యడం?  మా అన్న - కెన్నెమరా లైబ్రరీ  నుండి, ఆంగ్ల నవలలు తెచ్చే వాడు. అవి రాత్రి దీపం ముందు కూర్చుని చదవడం ప్రారంభించాను. లైట్లు  ఆఫ్  చేసేసి చిన్న దీపం ముందు కూర్చుని చదివే వాడిని.  చాలా, చాలా గొప్ప నవలలు అనబడేవి - చాలా చదివాను. అవి అర్థం కావడం లేదు. అయితే,  మా యింట్లో, వొక చిన్న డిక్షనరీ వుంది. అర్థం కాని పదాలకు, అందులో వెదికి  అర్థాలు, వొక చిన్న పుస్తకం లో రాసుకునే వాడిని. అది నా పాకెట్ లో పట్టే లాంటి చిన్న పుస్తకం . నేను కుట్టిందే. ఆ అర్థాలకు కూడా వొక్కొక్క సారి అర్థాలు తెలిసేవి కావు . తరువాత, వాటికి అర్థాలు ఆ డిక్షనరీ లోనే వెదికి  రాసుకునే వాడిని. యివన్నీ రాత్రి పూటే. రాత్రుళ్ళు మేలుకోవాలిగా - అందుకని . యిలా రాత్రుళ్ళు మేలుకోవడం అలవాటైంది .

మరి - త్వరగా సార్ట్ చెయ్యడం ఎలా? దీనికి వొక మార్గం వెదికాను. అప్పట్లో, రోడ్లపై ఎక్కడ చూసినా పొగ త్రాగే వారు పారేసే సిగరెట్ పాకెట్లు పడి వుండేవి. వాటినన్నిటినీ, ఏరుకుని వచ్చే వాడిని. వాటి పై భాగం (దీర్ఘ చతురస్రం), క్రింది భాగం, రెండూ శుభ్రంగా కట్  చేసి , వాటి క్రింది భాగాలు తెల్లగా వుంటాయి కదా - అక్కడ, వొక వూరి పేరు, సబ్ ఆఫీసు పేరు, హెడ్ ఆఫీసు పేరు, జిల్లా, రాష్ట్రం పేరు - అన్నీ రాసే వాడిని . యిలా కొన్ని వేల కార్డులు (సిగరెట్ పాకెట్లు) తయారు చేసి, మా యింట్లోనే - నేలపై , అచ్చంగా, ట్రైన్లో ఎలా వుంటుందో అలా పీజియన్ హోల్స్ లాగా గీచుకుని, సార్ట్ చేసే వాడిని.

నేను చేసేది  చూసి,నా తమ్ముళ్ళు , చెల్లెళ్ళు కూడా   నాకు సిగరెట్ పాకెట్లు  ఏరుకుని వచ్చి యిచ్చే వాళ్ళు .

వాటిపై - యింకా  అడ్రస్సులు రాసుకుని సార్ట్ చేసే వాడిని .

యిలా యింట్లో వుండే సమయమంతా సార్టింగ్ లో గడిపే వాడిని . దీని వలన - నాకు ట్రైన్ లో సార్టింగ్ చెయ్యడం - రాను రాను చాలా సులభంగా మారింది. అప్పుడు - యింకా ఏమేం విషయాల్లో అభివృద్ది సాధించ వచ్చునో యోచన చేసే వాడిని. వొక్కొక్క వూరికి వెళ్ళే లెటర్లు అడ్రస్సులు చూస్తే - ఆ ఊర్లలో, ఏమేం వృత్తులు, పరిశ్రమలు, కాలేజీలు, స్కూళ్ళు , సంస్థలు వున్నాయో - తెలిసేవి.  అయితే కొంత మంది వూరి పేరు రాసి, జిల్లా లాంటివి రాసే వారు కాదు. అవి కూడా, ఎక్కడికి పోవాలో, నాకు సులభంగా తెలిసి పోయేవి .వొకే పేరుతో, రెండు మూడు వూర్లు వున్నాయి, చాలా చోట్ల .  అవికూడా, వూరి పేరు వుంటే చాలు - సులభంగా కనిపెట్టే వాడిని, మూడిట్లో ఏ వూరో !

కొన్ని నెలల తరువాత వొక విచిత్ర సంఘటన  జరిగింది.  వొక రోజు, మా ట్రైన్ బయలు దేరుతూ వుంది . నేను వెళ్లి తలుపు మూసి గొళ్ళెం వెయ్యాలని వెళ్లాను . సాధారణం గా నేను చేస్తాను - ఆ పని . ఏదో ఇంటరెస్ట్ .

తలుపులు మూస్తూ వుంటే - ప్లాట్ ఫామ్ నుండి, మా కంపార్ట్మెంట్  లోకి, ముగ్గురు వ్యక్తులు రావడానికి  ప్రయత్నం చేశారు . నేను వాళ్లకు చెప్పాను,  యిది RMS కంపార్ట్మెంట్; యిందులోకి  మీరు రాకూడదు. మరో కంపార్ట్మెంట్ కు వెళ్ళండి అని .

లోపలి నుండి, మా హెడ్ సార్టర్  గారు పెద్దగా కేక వేశారు - విజయమోహన్! బుద్ధుందా లేదా. వాళ్లెవరనుకున్నావు?    మొదట దారి విడు . నీ పని చూసుకో - అని .

వాళ్లెవరో హెడ్ సార్టర్  గారికి బాగా కావలసిన వాళ్ళేమో - అనుకున్నా . ఆ తరువాత - ఎవరో వచ్చి నా చెవిలో చెప్పారు - వాళ్ళెవరో తెలుసా. డైరెక్టర్ గారు, సుపరింటెండెంట్  గారు, ఇన్స్పెక్టర్  గారు అని . నాకేమీ పెద్దగా అర్థం కాలేదు . ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళే అనుకున్నా .

సరే . నా పని ప్రారంభం చేశా . నేను సాధారణం గా ప్యూన్లు  సంచులు తెరిచి లెటర్లు నాకిచ్చే వరకు చూస్తూ కూర్చోను. నేనే సంచులను తెరిచి - నా పనికి కావాల్సిన లెటర్ల కట్టలు అన్నీ తీసుకుని నా పని ప్రారంభించేస్తాను . ఆ రాత్రీ అలాగే చేశాను. మద్రాసులో సంచులను తెరిచి, తరువాత స్టేషన్ వచ్చే లోపు నా పని ఎప్పుడో పూర్తి  చేసేశాను. ఆ తరువాత స్టేషన్ లో వచ్చినవి, స్టేషన్ దాటక ముందే అయిపోయాయి. ఆ తరువాత, రేణిగుంట - అక్కడ ఎక్కువ  లెటర్ల కట్టలు వచ్చేవి. ఆదీ   అంతే . స్టేషన్ దాటక ముందే నా సార్టింగ్ అయిపోయింది .

అప్పుడు మొదలయింది.... తలుపు దగ్గర కూర్చుని  వున్న డైరెక్టర్ గారు పెద్దగా  ఆంగ్లం లో కేకలెయ్యడం మొదలు పెట్టారు. నేను, అందరూ వింటూ వున్నాము. కానీ - ఆయన నన్ను ఉద్దేశించి, అంటూ వున్నారని మాత్రం , నా బుర్రలోకి  యెక్క లేదు .

ఆయన అంటూ వున్న మాటల సారాంశం - మీరెవరూ, ఇవేవీ అసలు చూడరా, పట్టించుకోరా ; యిలా అయితే మన డిపార్ట్ మెంటు  ప్రతిష్ట ప్రజలలో నాశనం అయిపోతుంది . అటు చూడండి . ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో ? తన యిష్టం వచ్చినట్టు, టక టక టక టక మని  - ఏ అడ్రెస్సూ చదవకుండా, ఏదో వొక చోట పారేస్తున్నాడు లెటర్లన్నీ- చూడండి ? ఇదేదీ చూడకుండా, మీరేం సుపరింటెండెంట్, ఆయనేం ఇన్స్పెక్టర్.  అసలా హెడ్ సార్టర్ యివన్నీ పట్టించు కోవడమే లేదు . యిదేం బాగు లేదు. ఇన్స్పెక్టర్ గారూ, వెళ్ళండి . ముందు ఆ అబ్బాయిని  నిలపండి. నేనూ వస్తాను - అని వారందరూ, నా దగ్గరికి వచ్చారు . పక్కన లేచి నుంచో మన్నారు . అప్పటికీ నాకు అర్థం కాలేదు - వాళ్ళెం చెయ్య బోతున్నారో !

పక్కన నుంచున్నాను .  ఇన్స్పెక్టర్ గారు - నా వొక్కొక్క పీజియన్ హోల్ లోని లెటర్లు తీసి చెక్ చేస్తున్నారు . దాదాపు అన్నిటి లోని లెటర్లూ చెక్ చేశారు. మధ్య మధ్యలో  సుపరింటెండెంట్ గారూ, డైరెక్టర్ గారు కూడా చెక్ చెయ్య సాగారు. వారికేదీ పొరపాటు దొరక లేదు - వొక్కటి కూడా . మధ్య మధ్యలో, ఏదో వొక తప్పు కనిపెడదామని, ఇన్స్పెక్టర్ గారు, యది యిక్కడ ఎందుకు వేశావ్. జిల్లా పేరే లేదు . యిలా చేస్తే ఎలా అన్నాడు. నేను చిన్న పిల్లల ఉత్సాహంతో చెప్పుకొచ్చాను - అది అక్కడే ఎందుకుండాలో; ఆ వృత్తి వారు ఆ జిల్లాలోనే వున్నారు . ముఖ్యంగా - ఈయన ఆ వృత్తి సంఘానికి ప్రెసిడెంటు - యిలా .  డైరెక్టర్ గారు వొప్పుకున్నారు . నిజమే అన్నారు .

అప్పుడు ఆయన మాటలు - మరోలా మారి పోయాయి . అవునూ , నువ్వు, నిజంగా మనిషివా , యంత్రానివా ? నేనెక్కడా చూళ్ళేదు , యింత వేగంగా సార్ట్ చెయ్యడం. ఎప్పుడు పేరు చూస్తున్నావు, ఎప్పుడు వూరు చూస్తున్నావు , ఎప్పుడు జిల్లా చూస్తున్నావు ? ఎప్పుడు కట్ట నుండి, దాన్ని వెలుపలికి తీసి , ఎలా సరైన హోల్ లోకి వేస్తున్నావు?  యిది   ఎలా సాధ్యం ? నేను నమ్మ లేక పోతున్నాను . సరే . ఇన్స్పెక్టర్ గారూ ! యివన్నీ పీజియన్ హొల్సు నుండి బయటికి తీసేసేయ్యండి - అన్నారు. వారు అన్నీ తీసి కుప్పగా పోశారు . దాన్ని బాగా కలిపెయ్యండి - అన్నారు. ఆయనా కలిపేసారు . యిప్పుడు మళ్ళీ - నా దగ్గరిచ్చి , మళ్ళీ  సార్ట్ చెయ్యమన్నారు . నాకు యిదేదో ఆటలా వుందే కాని, లోపల భయం కానీ, మరే భావనా లేదు . ఏదో , వొలింపిక్  చాలెంజ్  లాగా - మళ్ళీ ఆరంభించి - మరో స్టేషన్ వచ్చే లోపు ఎప్పుడో పూర్తి చేసేశాను. అది మళ్ళీ చెక్ చేశారు . మళ్ళీ అందులో ఏమీ పొరబాట్లు కనిపించ లేదు . అంతే . ఆయనకు మాటలే రాలేదు . గుంతకల్లు లో దిగేటప్పుడు - హెడ్ సార్టర్ గారిని, ఇన్స్పెక్షన్ రిజిస్టర్  ఏదో తెమ్మన్నారు. వొక పేజీ ఏదేదో రాశారు. సూపరింటెండెంట్ గారు కూడా ఏదో రాశారు . దగ్గరికొచ్చి భుజం తట్టి, మళ్ళీ సుపరింటెండెంట్ ఆఫీసులో  వొక సారి అందరికీ  నువ్వెలా సార్ట్ చేస్తావో చూపించాలి ; బాగా చెస్తున్నావు. శభాష్ - అని వెళ్లి పొయ్యారు .

అంతే . మా హెడ్ సార్టర్  గారు వచ్చి నన్ను చెయ్యి పట్టుకుని  ఏదేదో చెప్ప సాగారు - విజయమోహన్, నిజంగా ఈ పని నీకు తగినది కాదయ్యా . ఆ   ఇన్స్పెక్టర్ స్థానం లో  నువ్వుండాలయ్యా . అతనికేం తెలుసు . నీకు తెలిసినవేవీ - అతనికి తెలీదాయె . నువ్వు. బాగా చదువు ; ఇన్స్పెక్టర్ అయిపో . వొక రోజు నువ్వు సూపరింటెండెంట్ అవుతావు . సూపరింటెండెంట్ ఏమిటి కర్మ . నువ్వు డైరెక్టర్ కూడా కావాలయ్యా. ఈ రోజు నుండి, నువ్వు బాగా చదువు . పుస్తకాలు నేను తెప్పిచ్చి యిస్తాను -అంటూ, చాలా, చాలా, చెప్పాడు. ఆ తరువాత - మా ఆఫీసు లో నన్ను ప్రోత్సాహ పరచని వారు లేరు.  కాల క్రమం లో -  టెలికాం  విభాగం - లో  పోస్టల్ డైరెక్టర్ పదవికి సమమైన డిప్యూటీ  జనరల్ మేనేజర్ కావడం , ఆ పదవిలో పది సంవత్సరాల పాటు ఎన్నో సాధనలతో పాటు వుండడం  జరిగింది .

చెప్పొచ్చేదేమిటంటే - జీవితంలో వచ్చే సమస్యలకు - అన్నింటికీ , సమాధానాలు వుంటాయి . ప్రతి అడ్డంకీ వొక మెట్టు లాటిది .  మన పురోభివృద్ధి కి వొక మంచి అవకాశం లాంటిది. అడ్డంకిగా భావిస్తే - భయ పడితే , నిరుత్సాహ పడితే , అక్కడే నిలిచి పోతాము . లేదా, వెనక్కు మళ్ళి , వెళ్లి పోయే ప్రమాదం  కూడా వుంది. సమస్యలకు అది సమాధానం కాదు.

మళ్ళీ చెప్పాలంటే  -   ప్రతి అడ్డంకీ వొక మెట్టు లాటిది . మన  పురోభివృద్ధి కి వొక మంచి అవకాశం లాంటిది. వున్న సమస్య కు అత్యుత్తమ సమాధానాలు వెదకాలి . ముందుకు సాగాలి . అంతే  కాని వెనక్కు మళ్ళ  కూడదు .  ఎంతో మంది  డాక్టర్  అబ్దుల్ కలాం లాంటి వారు ప్రెసిడెంట్ పదవి  వరకు వెళ్ళారు కదా . వారూ మనలా- బీద కుటుంబాల్లో , పుట్టిన వారే కదా .  కానీ - మన  దేశంలో, యిప్పుడు కూడా నిరుత్సాహ పరిచే వారే ఎక్కువ . యింటా , బయటా. యిది తగ్గాలి. మనమందరూ, వొకరికొకరు ఊపు నిస్తూ , ముందుకు సాగాలి . మా కాలం లో, మాకు యిది చెప్పిన వారు చాలా తక్కువ . నిరుత్సాహ పరచిన వారు చాలా ఎక్కువ .

 ఇప్పుడు, 64 ఏళ్ళ  వయసు తర్వాత - నేను ఏం చెయ్యాలి? వొక పదేళ్ళు పైగా యోగా ప్రాక్టీసు  చేస్తున్నాను . కొంత మంది గొప్ప గురువుల దగ్గర ట్రైనింగ్  కూడా అయ్యాను. ఆ తరువాత - దాన్ని గురించి ఎంతో అధ్యయనం చెయ్యడం కూడా జరిగింది.  పతంజలి యోగ సూత్రాల గురించి, గీత లోని ధ్యాన యోగం గురించి విశదం గా - ఆంగ్లంలో - నా బ్లాగ్ లో రాయడం జరిగింది . అదంతా తీసి - దానికి ఎన్నో మార్పులు, కూర్పులు , మరెన్నో  - చేసి పుస్తక రూపంలో దాన్ని  తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను. యింతకు ముందు ఎంతో మంది రాసారు కదా. వివేకానందు లంతటి వారు రాసారు. ఓషో గారు రాసారు. శివానందుల వారు రాసారు. మరి నేనెందుకు మళ్ళీ  రాయాలి ?

నిజమే. వారందరూ - నాకు గురు తుల్యులే. నేను వారందిరికీ ఏకలవ్య శిష్యరికం చేసిన వాడినే . అంతే కాదు . ఇప్పుడున్న ప్రసిద్ధ గురువులు, చాలా మంది వద్ద కూడా కొంత ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాడినే. 10 ఏళ్ళ వయసులో, వొక గొప్ప గురువు వద్ద, ప్రాణాయామాలు , ఆసనాలు ఎన్నో నేర్చుకున్న వాడినే. నా అనుభవాలు ఈ మార్గంలో ఎన్నో వున్నాయి . అంతే కాదు.  యోగ సూత్రాలకు - ఎంతో  వివరణ - యింకా, అవసరం వుంది . అది సామాన్య ప్రజలకు చేరనే లేదనే - నా నమ్మకం .అదీ వారు నేర్చుకునే విధంగా  చేరలేదనే - నా నమ్మకం . 

పాశ్చాత్య దేశాలకు చేరినంత కూడా - మన దేశం లో ప్రజల మధ్యకు యింకా రాలేదనే చెప్ప వచ్చు.  అందుకే - నా ఈ ప్రయత్నం. సఫలమౌతుం దనే  నా - విశ్వాసం .

యిక్కడ చెప్పొచ్చేది చాలా సరళమైన విషయం - అడ్డంకులేవీ , అడ్డంకులు కావు . అన్నీ సోపానాలే . అన్నిటికీ - మనసుంటే మార్గం వుండనే వుంది. కాకపోతే, మన దేశంలో -  నా పరిస్థితి కి నేను కాదు కారణం . మరెవరో - అన్న భావం చాలా ఎక్కువ . మరెవరో - అనుకుంటే - అదో తృప్తి . కానీ అందులో - మీ పరాజయం వుందే కాని - విజయం కాదు . నా పరిస్థితికి , నా భవిష్యత్తుకు కారణం  - నేనే అనుకుంటే - మీ జీవితం లో మీరు ఎన్నో సాధిస్తారు .

శ్రీకృష్ణుడి  గీతా ప్రబోధం  అంతా  యిదే .

-యిప్పుడు వున్న మీ సమస్యలకు  యిలా కాస్త యోచన చేసి చూడండి . యింకా బాగా మార్గాలు వెదకండి . మీరు సఫలీకృతులు అవుతారు . తప్పకుండా .

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 




21, నవంబర్ 2013, గురువారం

స్వగతం (2) - మీ సలహా వొద్దు . సహాయం కావాలి - చాలా మందికి . మీ భర్తకూ , భార్యకూ , అందరికీ . ఎందుకు?

స్వగతం -  మనలో మార్పు ఎలా వస్తుంది ?
వొక్కో సారి మనలో మార్పు ఎలా వస్తుందో మనకే తెలీదు, కానీ వస్తుంది . వొక్కో సారి, మనకు తెలిసి, మనమే మార్పుకు పునాది వేసి,  మన పధ్ధతి మనం మార్చుకుంటాం . ముందుకు సాగి పోతూ వుంటాము . 
చాలా సార్లు , మనం మన జీవితం లో చేసే చిన్న చిన్న మార్పులే, మన స్వభావంలో, మన జీవితంలో - పెద్ద పెద్ద మార్పులు గా పరిణమిస్తాయి . అవి మంచివీ కావచ్చు . చెడ్డవీ కావచ్చు . 

నిజానికి, ఆది శంకరాచార్యులు చెప్పిన వొక్క శ్లోకం - ఈ విషయం లో ఆణి ముత్యం లాంటిది . 

ఆయన అంటారు- సజ్జనుల సాంగత్యం వుంటే చాలు - అదే మిమ్మల్ని అన్ని సుఖాలకు, సంతోషాలకు దగ్గర చేరుస్తుంది , చివరికి  మోక్షానికి  కూడా కారణ భూతమవుతుంది, అని. "సత్సంగత్వే " అని ఆయన వాడిన మాటను , మరో రకం గా కూడా చెప్పుకోవచ్చు - ఎప్పుడూ సత్యం యొక్క సాంగత్యం వుంటే చాలు - అని . 
సజ్జనుల సాంగత్యం ,   సత్యం యొక్క సాంగత్యం - రెండూ నిజానికి వొకటే . సత్ + జనులు - అంటే సత్యం మాత్రమే పాటించే వారు అని చెప్పొచ్చు. ఆ విధంగా, రెండు అర్థాలూ వొకటే సూచిస్తాయి. ఆంగ్లం లో కూడా ,  మీ  స్నేహితుడిని గురించి చెప్పండి చాలు - నేను మీ గురించి చెబుతాను , అన్న వాక్యం వుంది కదా. 

తాగే వాడి స్నేహితుడు తాగడానికి ఎక్కువ చాన్సు వుంది. దొంగలందరూ, స్నేహం కట్టడం మనం చూస్తూనే  వుంటాము . మర్డర్  చేసే వాడి స్నేహితులు మర్డర్ చేయడానికి ఎక్కువ చాన్స్ వుంది. లంచం తీసే వాడు, తన లాంటి వారితోనే ఎక్కువ స్నేహం చేసే అవకాశం  వుంది . ఇలా మన జీవితాల్లో , మన స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది . 

మనం జీవితంలో సంతోషంగా వుండాలంటే, సాధారణంగా, మనం అలా వుండే వారి స్నేహం కట్టాలి. వారితో స్నేహం కట్టాలంటే - మనమూ వారిలా మారడానికి ప్రయత్నమూ చెయ్యాలి, మన లాగా వారినీ క్రిందికి లాగ కూడదు . 
ఆంగ్లంలో - మరో నానుడి వుంది - వొక మంచి స్నేహితుడు  మీకు దొరకాలంటే , మీరు వొక  మంచి స్నేహితుడుగా మారాలి . మీకు వొక  మంచి భర్త / భార్య దొరకాలంటే - మొదట మీరు మంచి భార్య / భర్త గా మారాలి . మంచి పిల్లలు కావాలంటే - మీరు మంచి తల్లి దండ్రులు గా వుండాలి . 

యిలా వుంటే - మీకు కావాలన్నది తప్పక దొరుకు తుందన్న  గ్యారంటీ  ఏమీ లేదు , కానీ , మీరు అలా లేక పొతే - మీకు కావాలన్నది తప్పక దొరకదు . యిది గ్యారంటీ. 
యిది  స్వగతం కదా . అందుకని, దీనికి సంబంధించిన నా అనుభవాలు  చెబుతాను .

మొదటిది, మా యింట్లోనే జరిగింది . అప్పట్లో, అంటే - దాదాపు 47 సంవత్సరాల క్రిందట మాట. మా చెల్లలు - స్కూల్లో సరిగా చదవలేక పొయ్యేది. స్కూల్లో తమిళం లో చెప్పే వారు . అప్పట్లో, ఆమెకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. అందుకని చదువంటే - పెద్దగా ఉత్సాహం చూపేది కాదు . నేను క్రొత్తగా, చెన్నై వచ్చినప్పుడు  కాలేజీలో నా అనుభవమూ అదే . కానీ, యిప్పుడు నేనొక చిరుద్యోగిని. పోస్టల్ (ఆర్.యమ్. స్) లో గుమాస్తా వుద్యోగం . ఏదో కొంత తమిళం తో పరిచయం వుంది.  అందువలన , తను ఎందుకు చదవలేక పోతోందో  అర్థం చేసుకోలేదు . అప్పుడప్పుడూ విసుక్కునే వాడిని. చదవమంటే , నువ్వు చదవడమే లేదు, అని . మార్కులు మరీ తక్కువగా వస్తున్నాయని . వొక సారి, కాస్త ఎక్కువే తిట్టినట్టున్నా . అది విని - మా అమ్మ గారు నన్ను మందలించింది. నువ్వు తనకు చేసేది - ఏమీ లేక పోయినా, తిట్టడం వొక్కటి - మాత్రం చేస్తావని . ఆమె మాటలతో - నాకు ఉక్రోషం వచ్చింది. అరె. నేను మంచి చెబితే , అందరూ నన్నే తిడుతున్నారు - అని . ఆ రాత్రి నిద్ర పట్ట లేదు . 
కానీ, ఎక్కడో , నాలో , వొక ట్యూబ్ లైట్  వెలిగింది . అవును. తిట్టడం  చేస్తున్నాను సరే. అన్నగా తనకోసం వేరే ఏం చేస్తున్నాను - అని. ఏదో వొకటి చెయ్యొచ్చు కదా - అని.  యోచన చేస్తే - సరే . నేనే ఎందుకు తను చదవ లేక పోతోందో చూడొచ్చు కదా - అనిపించింది . 

తెల్ల వారి లేచి - తను స్కూలుకు వెళ్ళే లోపల, తన దగ్గరికి వెళ్లి కూర్చున్నాను . ఏదో, హొమ్ వర్క్ రాస్తూ వుంది . నేను చెబుతాను, యిలా యివ్వు - అంటే యిచ్చింది . తన హొమ్ వర్క్ ఎలా చెయ్యాలో చెప్పాను . తన చేతనే చేయించాను . తరువాత రోజు - స్కూల్లో ఏం చెప్పవచ్చో - అది కూడా చదివించేశాను. మొట్ట మొదటి సారి, తన కళ్ళలో వొక నూతన వుత్సాహం , స్కూలుకు వెళ్ళడానికి సంతోషం కనిపించాయి . సాయంకాలం వచ్చిన వెంటనే - మళ్ళీ   అన్న దగ్గరికి రావాలని వచ్చింది; స్కూల్లో జరిగినది అంతా చెప్పింది. మాస్టారు తన్ను మెచ్చుకున్నాడట.   నాతో ,మరో రెండు గంటలు పాఠం చెప్పించు కుంది.
అప్పుడు నాకు తెలిసి వచ్చిన జీవన సూత్రం - నువ్వు ఏం సలహా యిస్తావన్నది - ఎవరికీ ముఖ్యం కానే కాదు . తన కోసం నువ్వుం ఏం చెయ్యడానికి సిద్ధంగా వున్నావన్నది  ముఖ్యం అని . దాని బట్టి వారు మీ సలహా తీసు కుంటారా, లేదా అన్నది చెప్ప వచ్చు . 
ఉత్తుత్తి సలహాలు ఎవరికీ వద్దు . వారి కష్టం తెలిసి మీ హృదయం స్పందిస్తే  - అప్పుడు, వారిలో మీ పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి . అప్పుడు, మీ సలహాకు విలువ వుంటుంది. 
ఈ విషయం అప్పటి నుండి యిప్పటి వరకు పాటిస్తూనే వచ్చాను .

ఎన్నో  విషయాల్లో,ఎదుటి వారి కష్టం మీరు తెలిసి, మాట్లాడితే - వారికి మీరు చెయ్య గలిగే సహాయం చేసి మాట్లాడితే - వారి హృదయంలో మీరు గొప్పగా మిగిలిపోతారు . లేదంటే - వారు, మిమ్మల్ని, మీ సలహాలను - దూరం గా వుంచుతారు. మీకు దూరంగా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. మీ భార్యైనా సరే, భర్తైనా సరే . చాలా వరకు ఈ సూత్రమే  వర్తిస్తుంది . యిక మీ యిష్టం .
= మీ 
వుప్పలధడియం విజయమోహన్


19, నవంబర్ 2013, మంగళవారం

పతంజలి యోగ సూత్రాలు 3 వ వ్యాసం సమాధి పాదం 2 వ సూత్రం 3 వ ప్రయోగం శ్వాస మీద ధ్యాస


పతంజలి యోగ సూత్రాలు 
3 వ వ్యాసం

పతంజలి  సూత్రాల పై  రాస్తున్న ఈ  వ్యాస మాలికకు - మీకందరికీ పునః స్వాగతం.  మీరు - మొదటి వ్యాసంలో  రాసిన నల్ల గొరిల్లాను  2 నిమిషాలు మరిచి పోయే ప్రయోగం ; రెండవ వ్యాసంలో రాసిన రిలాక్సేషన్ ప్రయోగం చేశారు కదా . చేసి వుంటే మీరు యోగ మార్గం లో అడుగు పెట్టారన్న మాటే . ఇక నుండి, మీరూ యోగ సాధకులే. యోగ మార్గం లో వున్న వారే. వొక్కొక్క వ్యాసంతో, వొక్కొక్క అధ్యయనం తో - ముందు  వెళ్ళండి. 

సమాధి పాదం - సూత్రం -2

యోగశ్చిత్త వృత్తి నిరోధః


యోగః - అంటే, ఏమిటి ? అన్నది పతంజలి వివరిస్తున్నారు. 
చిత్తవృత్తి నిరోధః - చిత్తం అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. మనలో కదలాడే, ఊహలు , ఆలోచనలు, భావనలు , జ్ఞాపకాలు - మీ తలలో - ఏమేం ఆలోచనలు , భావనలు కదులుతాయో - అవన్నీ కలిపితే అదే మీ చిత్తం . 

నిజానికి మనలోనే - రెండు రకాల ప్రపంచాలు  వున్నాయి. మన శరీరంలో వున్నవన్నీ , జరిగేవన్నీ కలిపితే - భౌతిక జగత్తు అని చెప్పుకోవచ్చు.  మనసులో - జరిగేవన్నీ  కలిపితే మానసిక జగత్తు . అదెక్కడుందో మనకు తెలీదు . కానీ మన లోపలే, మన మెదడు లోపలే - ఎక్కడో - ఎక్కడెక్కడో వుంది. యింకా, శరీరం లో - మరెక్కడైనా కూడా వుందా? అంటే  చెప్ప లేము . వుండొచ్చు. ఎక్కడున్నా, అక్కడేమైనా, అవన్నీ కలిపి మన మానసిక జగత్తు - అంటాము. యోగంలో - అదొక పెద్ద ఆకాశమంతటిదిగా వర్ణిస్తారు.  నిజానికి, మన భౌతిక  జగత్తుకు, మానసిక  జగత్తుకు - అవినాభావ సంబంధం  వుంది. అది లేక యిది కానీ, యిది లేక అది కానీ లేదు. 

అలాగే - మన మానసిక జగత్తుకూ, చుట్టూ వున్న వారి మానసిక జగత్తుకూ కూడా అవినాభావ సంబంధం  వుంది.అంటే, శరీరాలన్నీ వొకటి కాలేవు ; కానీ, మానసికంగా, మనమంతా చాలా, చాలా, దగ్గర కావచ్చు . వొక మనస్సు, మరొకటితో, చాలా దగ్గరగా రావచ్చు; కలిసి పోవచ్చు. ప్రపంచం లోని మానసిక శక్తి అంతా కలిపితే - చిదాకాశం - అంటారు. మన మానసిక  జగత్తు - మొత్తం విశ్వమంతా వున్న చిదాకాశం లో వొక భాగమే - కానీ వేరు కాదు . అందుకే - అది విశ్వంలో వున్న మరి ఎవరితో నైనా  ప్రేమైక సందేశాలు కానీ, మరే రకమైన సందేశాలు కానీ పంచుకో గల శక్తి  గలిగినది. యిది యోగం ద్వారా సుసాధ్యమే - అంటారు .

మన చిత్తానికి ఎన్నో రకాల గుణాలు వున్నాయి. వాటి విభాగాలు, పతంజలి ప్రకారం ఏమున్నాయో, అవి తరువాత చూద్దాం. యిప్పటికి కొన్ని గుణాలు మాత్రం కొద్దిగా అర్థం చేసుకుందాం. నల్ల గొరిల్లా ప్రయోగం  మీరు మొదటి వ్యాసంలో చేసారు కదా. అందులో మీకు తెలిసినదేమిటి?  

మీరు వద్దు, వద్దన్న కొన్ని పనులను మీ మనసు - నేను వినను గాక వినను అని చేసేస్తూ వుంటుంది . అవునా. అలాగే, చాలా సార్లు, మీరు చెయ్యమన్న పనిని మీ మనను చెయ్య నివ్వదు. రక రకాలుగా ఆ పని నుండి మిమ్మల్ని దూరంగా లాక్కుని వెడుతుంది. యిలా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడు మనకేమని తెలుస్తుందో తెలుసా ! మనమూ, మన మనసు వొకటి కానే కాదు . అది మనపై అజమాయిషీ  చేయడానికే పుట్టింది; అది మనకు అప్పుడప్పుడూ కష్టాలనూ, అప్పుడప్పుడూ సుఖాలనూ యివ్వడానికి పుట్టింది - అని తప్పకుండా అనిపిస్తుంది . 

మన యొక్క గొప్ప స్నేహితుడూ మనసే, మన యొక్క గొప్ప శత్రువూ మనసే - అంటాడు శ్రీకృష్ణుడు గీతలో . 

ఎలా?    మీకు దుఃఖం, క్రోధం, ఈర్ష్య, కామం, లోభం, గర్వం, శత్రుత్వం, భయం ఎలా, ఎక్కడ కలుగుతాయండీ ? మీ మనసుద్వారా, మీ మనసులో. అవునా ? అంటే - ఆ మనసు మీ అధీనం లో లేకుండా , యివన్నీ, పుట్టిస్తూ వుంటే - మీకు , ఈ లోకంలోనే నరకం చవి చూపిస్తూ వుంటే - మీ మనసే కదా, మీ శత్రువు . 

అదే, మీ మనసు మీ అధీనం లో వుంటూ - శాంతంగా, సంతోషంగా, హాయిగా , పరులపై దయతో, ప్రేమతో , ఆర్ద్రతతో , వుంటే - మీ మనసే కదా, మీ మిత్రుడు .  గీతలో సగమంతా - యిలా ఎలా వుండటం - అనేది శ్రీకృష్ణుడు  అర్జునుడికి బోధించడమే . 

అయితే, ఇక్కడొక తిరకాసు వుంది. ఎంతటి సుఖమైనా, కాల క్రమంలో, మనను విడిచి పెట్టి వెళ్లి పోతుంది. ఏ సుఖమూ, నిరంతరం కాదు . మీతో ఎల్లప్పుడూ వుండదు గాక వుండదు. 

అందుకనే, ఆది శంకరుల వారు - మీకు నిత్యానిత్య వివేక విచారము - ఎల్లప్పుడూ వుండాలి - అంటారు . ఏది నిత్యం? ఏది అనిత్యం?   ప్రాపంచికంగా కూడా, కొన్నిటితో పోలిస్తే, వేరే  కొన్ని సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, మనతో ఎక్కువ రోజులు వుంటాయి. మరి కొన్ని చాలా తక్కువ రోజులు వుంటాయి. 

ప్రేమలో దొరికే సుఖం అనిత్యం. పెళ్ళిలో దొరికే సుఖం దానితో పోలిస్తే , ఎక్కువ నిత్యం.  దాన్ని కూడా మూర్ఖంగా, తమ అహంకారాలతో, నిత్య దుఃఖం  గా మార్చుకునే భార్యలూ వున్నారు, భర్తలూ వున్నారు. స్వంత ఇల్లు కొంత నిత్యం. బాడుగ ఇల్లు అనిత్యం. సాత్వికాహారం నిత్య సుఖం యిస్తుంది. రాజసిక ఆహారం తక్కువ సుఖం, ఎక్కువ కష్టం యిస్తుంది. తామసిక ఆహారం చాలా తక్కువ సుఖం, చాలా ఎక్కువ దుఃఖం, కష్టం యిస్తుంది. యిలా మన జీవితంలో దొరికేవన్నీ ఏది, నిత్య సుఖం, ఏది అనిత్య సుఖం అంటూ బేరీజు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు, బుద్ధిమంతుడు, నిత్య సుఖాలకే ప్రాధాన్యతను యిస్తూ వెడతాడు . అనిత్య సుఖాల జోలికి పోడు . 

పతంజలి లాంటి మహానుభావులు , యిలా వెదికిన వాళ్ళే. యిలా వెదికి, వెదికి,  చివరికి , నిజమైన, నిత్యమైన, నిరంతరమైన, సులభమైన, అన్ని సుఖాలకంటే చాలా, చాలా గొప్పది అయిన సుఖం మనలోనే, మన అంతరాంతరాల లోనే , ఎక్కడో దాగుందని  తెలుసు కున్నారు. అక్కడికి వెళ్ళే సుగమమైన మార్గాన్ని కూడా కనిబెట్టారు . దాన్నే యోగం అన్నారు. యోగం - అంటే - నువ్వు, నిజంగా, ఎవరో తెలుసుకోవడం, ఆ నిజమైన, నీతో , నువ్వు ఐక్యం  కావడం.  అదే యోగం . 

అదెలా తెలుసుకోవడం? 

యిప్పుడు మనం మన మనసు వెంట, అదెక్కడికి తీసుకు వెడితే అక్కడికి, వెళ్లి పోతున్నాము. అది దుఃఖ పడమంటే పడి పోతాము . కోపం చేసుకోమంటే  కోపం చేసుకుంటాము. అది పెట్టే కష్టాలన్నిటినీ అనుభవిస్తున్నాము. మనసు తెలివిని వుపయోగిస్తున్నామే కానీ, మన తెలివిని కాదు.  మన తెలివి వేరే వుంది. యోగ పరిభాషలో దాన్ని బుద్ధి - అంటారు. ఆ  బుద్దే మనం అని అనుకోకండి. దాన్నీ మనం దాటి మన లోపలికి వెళ్ళాలి.  అంటే,మనసును దాటి, బుద్ధిని దాటి , మన లోపలి మనం వెళితే - అక్కడ ఏం వుంది ? ఏం లేదు! మనమే వున్నాము . 


ఈ మార్గంలో మనం చేసే కృషినే - చిత్తవృత్తి   నిరోధః అన్నారు పతంజలి మహర్షి . చిత్తంలో జరిగేవన్నీ చిత్త వృత్తులే . వాటిని నిరోధిస్తే - మనం వెలుపలి ప్రపంచం తో వేసుకునే బంధాలను విడగొడితే , మరొక క్రొత్త మార్గము మనలో ఏర్పడుతుంది. బహిర్ముఖమైన మన పంచేంద్రియాలన్నీ, అంతర్ముఖమవుతాయి. ఆ తరువాత, మెల్లగా, మెల  మెల్లగా, మనసు కూడా అంతర్ముఖమవుతుంది.  ఈ  మార్గమే యోగ మార్గము . అందుకనే, పతంజలి యోగః చిత్త వృత్తి  నిరోధః - అన్నారు.  ముందు ముందు,యిది పూర్తిగా విశదీకరించ నున్నారు పతంజలి .

యిప్పుడొక చిన్న ప్రయోగం చెయ్యండి : మొదట యిది రెండు సార్లు చదవండి . తరువాత  చెయ్యండి :

యోగ - ప్రయోగం - 3 ( ఆనందపు రెండవ మెట్టుకు - వొక చిన్న ప్రయోగం ) 


హాయిగా  కూర్చోండి. నేల పై నైనా  సరే . కుర్చీ లో నైనా సరే. మంచం మీదైనా సరే . మీరు కాళ్లెలా పెట్టుకుంటారో , మీ యిష్టమే. 

 కానీ ఈ సారి మీ చేతులు,  మీ వొళ్ళో పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి చెయ్యి వేసి హాయిగా , శరీరం లో టెన్ షన్ లేకుండా, వీపు మాత్రం కాస్త నిటారుగా - హాయిగా , కూర్చోండి . 

యిప్పుడు కళ్ళు మూసుకోండి. 

2 నిమిషాలు - ప్రపంచం  గురించి పెద్దగా పట్టించుకోకండి. మిమ్మల్ని గురించి  మాత్రమే, మీ మనసులో యోచన చేయండి. మీరు ఎక్కడ కూర్చో వున్నారు ; ఎలా కూర్చో వున్నారు; మీ చేతులు, కాళ్ళు, మీ క్రింద భాగం , నడుము, వీపు, పొట్ట, మెడ , తల యివన్నీ  వొత్తిడి లేకుండా, హాయిగా ఉన్నాయా ?  వొత్తిడి - అంటే టెన్ షన్ -   వుంటే , బాగా రిలాక్స్  చేయండి. బాగా రిలాక్స్ గా, హాయిగా కూర్చోండి . 

ఇప్పుడు ,మీ తల లోపల, అంటే మెదడు లోపల, వొత్తిడి వుందా - గమనించండి ; అదీ రిలాక్స్ చెయ్యండి . మీరు గమనిస్తే చాలు - అది రిలాక్స్ అయిపోతుంది.  అలాగే, రిలాక్స్ గా 2 నిమిషాలు కూర్చోండి . 

యిప్పుడు మీ శ్వాస,నిశ్వాస లను - అంటే గాలిని లోపలికి పీల్చడము,బయటికి విడవడము - మానసికంగా గమనిస్తూ వుండండి. వీలైనంత వరకు, శ్వాస మామూలుగానే, తనంతట తానుగా జరిగే విధంగానే జరగ నివ్వండి . ఎక్కువ వేగం వద్దు. మీరు మీ శ్వాస ను గురించి పెద్దగా ఆలోచన చెయ్య వద్దు. వూరికే గమనించండి . మనసు మరెక్కడికైనా వెడితే, మళ్ళీ శ్వాస పైకి మరల్చండి.  వీలైనంత  హాయిగా, రిలాక్స్డ్  గా వుండండి .  యిలా 2 నుండి 5 నిముషాల వరకు వుండండి.  శ్వాస మీద ధ్యాస. అంతే. మరే ధ్యాసా వద్దు . 
మీకు - యిక చాలు అనిపిస్తే, మెల్లగా, మెల్లగా, కళ్ళు తెరవండి . మీ మొహం మీదకు వొక చిరునవ్వు రావాలి యిప్పుడు .  మీ పరిసరాలంతా , మీ చిరు నవ్వుతో బాటు - వొక్క సారి చూడండి. 

ఆ తరువాత మీరు మీ పనులు చేసుకోవచ్చు .

- 3 వ  ప్రయోగం  పూర్తయ్యింది  

2 సార్లు యీ ప్రయోగం  పూర్తిగా చదివేయండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు  కూర్చుని - ఈ ప్రయోగం చెయ్యండి.


ఈ ప్రయోగం మీరు ఎప్పుడైనా , ఎక్కడైనా చెయ్య వచ్చు . బస్సులో, ట్రైన్లో , యింట్లో, ఎక్కడైనా సరే .  ఎన్ని సార్లైనా సరే.  ఈ ప్రయోగం చేసే వారి శారీరక ఆరోగ్యం ఎంతో బాగు పడుతుంది.  మానసిక ఆరోగ్యం కూడా బాగు పడుతుంది. ఎంతో మంది యోగ సాధకుల ప్రకారం,   ఈ ప్రయోగం చేసే వారి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.


మీరు ఈ ప్రయోగం - సరిగ్గా, రిలాక్స్ గా, సులభంగా,  చేసి వుంటే - యిప్పటికే మీరు , ప్రపంచం లోని 99 శాతం మనుషుల కంటే , రెండు పెద్ద ఆనందపు మెట్లు ,  పైకి ఎక్కేశారు . మీకు నా అభినందనలు . 

నాలుగో వ్యాసంలో , మళ్ళీ కలుద్దాం . అంత వరకు - ఈ మూడో ప్రయోగం అప్పుడప్పుడూ చేస్తూ వుండండి . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్