20, మే 2014, మంగళవారం

చంద్రబాబు నేతృత్వంలో - జరగాల్సిం దేమిటి ? ఏది మొదట? ఏది ముఖ్యం ? ఏది సులభం?


 అభివృద్ధి పథం లో 

మన రాష్ట్రం

ఎన్నికలు ముగిసిపోయాయి . వాటి ఫలితాలూ వచ్చేశాయి .

ఇవి రెండూ, నాకు బాగా నచ్చినట్టే వచ్చాయి . ఆ మాటకొస్తే , మనందరికీ బాగా నచ్చిన వాళ్ళే అధికారం లోకి వచ్చారని చెప్పుకోవచ్చు .

సీమాంధ్ర లో -  చంద్రబాబు నాయుడు గారి తెలుగు దేశం పార్టీ కి 102 సీట్లు , వారి తో బాటు పోటీ చేసిన భా.జ.పా. కు 4 అసెంబ్లీ స్థానాలు రాగా , జగన్ గారి పార్టీ కి 67 సీట్లు వచ్చాయి . కాంగ్రెసుకు ఏమీ రాలేదు . అలాగే - పార్లమెంటు స్థానాలకు, సీమాంధ్ర నుండి TDP + BJP  కూటమికి 17 స్థానాలు రాగా మిగతా 8  YSR కాంగ్రెసుకు వచ్చాయి .ప్రజలు చంద్ర , నరేంద్రులకు  బ్రహ్మ రథం పట్టి గెలిపించేశారు.  

యిక చంద్రబాబు గారు యిక్కడ , నరేంద్రుడు అక్కడ - తమ పరిపాలనా దక్షతను చూపడమే  తరువాయి .

సీమాంధ్ర లోని మొదటి పెద్ద పనులేమి ?

నా ఉద్దేశంలో - కరెంటు కొరత వెంటనే తగ్గించాల్సి వుంది . కరెంటు లేకుండా పరిశ్రమలు కానీ , వ్యవసాయం కానీ ఏదీ అభివృద్ధి చెయ్యలేము . పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యం అన్నీ కుంటు పడతాయి . ఆ విషయంలో చంద్రబాబు గారు మొదట తన దృష్టి సారించాలి .

(1) రాష్ట్రంలో - వున్న విద్యుత్తు కర్మాగారాలన్నీ సరిగా పని చేసే లాగు చూడాలి . నిజానికి దేశం అంతటా , ఎన్నో కర్మాగారాలలో - విద్యుదుత్పాదనకు సంసిద్ధంగా వున్న కర్మాగారాలున్నాయి .  వాటికి బొగ్గు, గ్యాస్ సప్లయ్  లేదు.  కొన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కర్మాగారాలన్నీ పనిచేస్తే - దేశంలో, రాష్ట్రంలో , అతి త్వరగా, విద్యుదుత్పాదన ఘనంగా పెరుగుతుంది . యిది - సులభంగా , అతి త్వరగా చెయ్యగల పని . చాలని విద్యుత్తు నేషనల్ గ్రిడ్ నుండి కొనుగోలు చెయ్యాలి .  కానీ, 2 సంవత్సరాలలోపు, రాష్ట్రాన్ని కొరత రాష్ట్రం నుండి సర్ ప్లస్ రాష్ట్రంగా మార్చ వచ్చు . మార్చాలి . తమిళనాడులో జయలలిత గారు కూడా అదే చేస్తున్నారు .

(2) మన రాష్ట్రంలో నదులున్నాయి . ఈ నదులను కలిపే ప్రణాళిక తయారు చెయ్యాలి . శ్రీకాకుళం నుండి కుప్పం వరకు నదుల నీరు ప్రవహించే ఏర్పాటు మనం చెయ్యాలి. నా చిన్న సలహా - కుప్పం పేరు శ్రీ కుప్పం అని  మారిస్తే బాగుంటుంది . అప్పుడు, మన రాష్ట్రం శ్రీకాకుళం నుండి, శ్రీ కుప్పం వరకు, అని చెప్పుకోవచ్చు . రాష్ట్రం - 'శ్రీ' ,అంటే, సిరి తో నిండి వుంటుంది.  మోడీ గారు, నవీన్ పట్నాయక్ గారు వొప్పుకుంటే - మహానది ని కూడా కలిపి - వొడిశా వొక కొన  నుండి ఆంధ్రప్రదేశ్ మరొక కొన వరకు - అన్ని జిల్లాలలో నదులు ప్రవహించే ఏర్పాటు చెయ్యవచ్చు . యిది అయిదేళ్ళు లేదా పదేళ్ళు పట్టినా ఫరవాలేదు , కానీ ఈ పనికి శ్రీకారం చుట్టాలి . మన రాష్ట్రంలో , చాలా ప్రదేశాలలో ఇప్పటికే మంచినీటి సరఫరా  చాలా తక్కువ . ఈ పరిస్థితి మారాలి. మహానది, గోదావరి , కృష్ణా   నదుల వరద నీరు మాత్రం కాలువల ద్వారా వచ్చినా , చిత్తూరు జిల్లా లాంటి ఎన్నో ప్రాంతాలకు నీటి సదుపాయం కుదురుతుంది

(3) మనకు మంచి రాజధాని కావాలి. హైదరాబాద్ పోగొట్టుకున్నది ఉత్తరోత్తరా మనకు అదృష్టంగా, మహా లాభకరంగా మారేలా చేసుకోవాలి. కొత్త రాజధానిని, రాష్ట్రం మధ్యలో, కనీసం 50 X 50 కి.మీ వైశాల్యం వుండేటట్టు , క్రొత్తగానే నిర్మించాలి . అది, చెన్నై- కోలకాతా జాతీయ రహదారికి వీలైనంత దగ్గర వుంటే మంచిది . అలాగే , కొంత చెన్నైకు సమీపం గా వుంటే చెన్నై లోని విమానాశ్రయము, పోర్ట్ మనం సులభంగా వాడుకునే వీలుంటుంది - అంటే మనం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము, పోర్ట్ నిర్మించే వరకు యివి అవసరం గనుక . యింతకు ముందు వొక సారి అది ఒంగోలు - నెల్లూరు మధ్య ప్రాంతాల్లో అయితే సరిపోతుంది అని రాశాను . అంటే ఒంగోలు ఆని కాదు . దానికి దగ్గర, ఢిల్లీ అంత నగరం నిర్మించ డానికి సరైన ప్రదేశం చూసుకోవాలి .

(4) మన రాష్ట్రంలో - IT  పార్కులు , ఫార్మా  పార్కులు సులభంగా నెలకొల్ప వచ్చు . వాటికి అన్ని రాయితీలు యివ్వాలి . ఈ విషయంలో - చంద్రబాబు గారికి వున్న అనుభవం తో - పారిశ్రామిక వేత్తలను సులభంగా ఆకట్టుకోవచ్చు .

(5) మన రాష్ట్రం పెద్దది. పక్క రాష్ట్రం చిన్నది. మనకు వొక రైల్వే జోన్ కావాలి కదా .  అది మోడీ గారిని అడిగి సాధించాలి .అలాగే - టెలికం సర్కుల్ , లాంటి కేంద్ర కార్యాలయాల విభజన జరగాలి . దీని వలన, ఆంధ్ర ప్రదేశ్ పైన గమనమూ పెరుగుతుంది , అభివృద్ధి     కూడా త్వరగా జరుగుతుంది . టెలికాం లో బ్రాడ్ బాండ్ రావడమూ త్వరగా జరుగుతుంది . రైల్వే లో క్రొత్త లైన్ ల నిర్మాణమూ జరుగుతుంది . వీటితో బాటు - హైదరాబాద్ లోని ఆంధ్రా ఉద్యోగులు కూడా కొంత మంది ఇక్కడికి  రావడానికి వీలుంటుంది . వీటి వలన చంద్ర బాబు గారు అనుకునే అభివృద్ధి తానుగా జరిగే వీలుంది .  అంత పెద్ద రైల్వే జోన్ తెలంగాణా కు అక్కరే లేదు అంత పెద్ద టెలికాం సర్కుల్ అక్కరే లేదు . కాని  మనకు కావాలి . అది మనం అడగాలి . 

(6) నన్నడిగితే,  TDP  పార్టీ నుండి రైల్వే మంత్రి వుంటే మేలు అని నాకు అనిపిస్తుంది . రైల్వే కాకపొతే - IT  మినిస్ట్రీ అయినా బాగుంటుంది , మన రాష్ట్ర అభివృద్ధికి . 

(7) మనకు వొక ఐ.ఐ.టి ., వొక ఐ.ఐ.యం., వొక ఏ.ఐ.ఐ.యమ్.యస్ . - లాంటి ఉత్తమ విద్యల నందించే సంస్థలు రావాలి . యివన్నీ, కేంద్రం నుండి, మనం అడగి తీసుకోవాల్సినవే ; మనం మనముగా చెయ్య వలసినవి కావు. 

(8) చంద్రబాబు గారు ఈ మధ్య పత్రికల వారికి , టీవీ చానెళ్లకు యిచ్చిన ఇంటర్ వ్యూలలో - చాలా సమస్యల గురించి బాగా చెప్పారు . మనకున్న 14 పోర్టుల గురించి , వాటికి చేయవలసిన అభివృద్ధి గురించి , వాటికి , మన వ్యవసాయ,  పారిశ్రామిక రంగాలకు మధ్య వుండవలసిన సహకారాల గురించి చెప్పారు . అలాగే , మనకు రాబోయే రాజధాని ఢిల్లీ కంటే బాగుండాలని చెప్పారు . యివన్నీ బాగుంది . 

చంద్ర బాబు గారు చెయ్యాల్సినవి చాలా వున్నాయి . యిందులో కొన్ని సులభంగా చేసేవి. కొన్ని వెంటనే చెయ్యాల్సినవి . కొన్ని నిదానమైనా, తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు.  మొదట ,సులభంగా చెయ్య వలసినవి చేసేసి, వెంటనే చెయ్యవలసినవి వెంటనే చేసేసి , తరువాత , ముఖ్యమైనవి  చిత్త శుద్ధితో , అందరి సహకారంతో చెయ్యాలి . 

చంద్రబాబు గారు యింకా ఎన్నెన్నో చెయ్యొచ్చు . అసలు ... పదేళ్ళలో , తెలంగాణా వారి కొందరు నాయకుల బూతు మాటలకు, లేని చేతలకు  మొహం మొత్తి , తెలంగాణా ప్రజలు మళ్ళీ, సమైక్యంగా వుందామన్నా - ఆశ్చర్యం లేదు . పక్క పక్క నున్నా , అటువంటి వారు  మధ్య లేకుంటే , కుటుంబ కలహాలు వుండవు . రాష్ట్రాల మధ్యా కలహాలు వుండవు . 

సర్వే జనాః సుఖినో భవంతు

- మీ 

వుప్పలధడియం విజయమోహన్




18, మే 2014, ఆదివారం

చేసిన పాపం చెబితే పోతుందా ? మరి చేసిన పుణ్యం? అదీ పోతుందా ? - బిచ్చ గాడు రౌడీ గా మారితే మనకేం?


మనం ధనవంతులా , కాదా ?   మనం ఆరోగ్యవంతులా, కాదా ?    మనం అందంగా వున్నామా, లేదా ?

మనకు అధికారము , పలుకుబడి వుందా , లేదా ? మనల్ని గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు ?
యిలా మనల్ను , ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ వుంటాయి .
కానీ , నేను మంచి వాడినా , కాదా - అన్న ప్రశ్న మనలో వుందా ? అలా వుండాలని మనం అనుకుంటూ వున్నామా ? 

మనమున్న సమాజం లో వొక పెద్ద పోటీ ప్రపంచం వుంది. అందులో వున్న వారు, ఎప్పుడూ, మిగతా వారితో ఏదో వొక విధంగా పోటీ పడుతూ వుంటారు ? కొందరికి ఏ పోటీ అక్కర లేదు . వారు తమ పని తాము చేసుకుని పోతూ వుంటారు ? 

మన రాజకీయ వాదులంతా పోటీ ప్రపంచం లోనే వున్నారు. పారిశ్రామిక వేత్తలలో కొంత మంది పోటీ ప్రపంచం లో, కొంత మంది  దాని బయట వున్నారు .

మనసులో పోటీ అని వుంటే - ఎంతో కొంత ఈర్ష్య వచ్చే ప్రమాదం వుండనే వుంది. ఈర్ష్య రాకుండా - పోటీ పడి, యెదుటి వాడు గెలిస్తే , అప్పుడూ, సంతోషంతో , గెలిచిన వాడిని అభినందించే మనస్తత్వం  మనలో వుందా ?  మనం సాధించిన దానికి, యితరులతో పోల్చుకోకుండా, ఆనందించే గుణం  మనలో వుందా ?

ఈర్ష్య అనేది - మానసిక కాన్సర్ - అని ఫోర్బెస్ అనే ఆయన అంటారు . నిజమే . యిది  మానసికంగా మనలను, ముఖ్యంగా మనలోని మంచిని, తినేస్తుంది . ఈర్ష్య మనసులో వుండే వాడిలో - ప్రేమ, అభిమానము ఉండలేవు - అంటారు, సెంట్ ఆగస్టిన్ . మన ఈర్ష్యకు గొప్ప కారణం వుండాలని ఏమీ లేదు. అది ఏదైనా వొక కారణం వెదుక్కుంటుంది. ఈర్ష్య మనలో వుంటే - అది  వుండడానికి ఏదో కారణాలు వెదకడం ప్రారంభిస్తుంది . తనకు తానుగా పెరగడం ప్రారంభిస్తుంది . అందుకే అది కాన్సర్ లాంటిది.     

కానీ నిజానికి , జీవితమనే నిరంతర ప్రవాహంలో, ఎప్పుడూ , ఎవరో వొకరు మనకు ముందూ వుంటారు ; వెనుకా వుంటారు . ముందు వాళ్ళ పైన ఈర్ష్య అక్కర లేదు . వెనుక వాళ్ళ పైన చిన్న చూపూ అక్కర లేదు . రెండూ మూర్ఖత్వమే . 

సరే . మన వూళ్ళో ధనవంతుడెవడో ,మనలో చాలా మందికి తెలుసు. మన వూరిలో పలుకుబడి, అధికారం,  వున్న వాడెవడో మనకు తెలుసు . అందరికంటే బలమైన వాడు , వెనుక పది మంది రౌడీలు వున్న వాడెవడో తెలుసు .

కానీ మనవూళ్ళో , అందరికంటే మంచి వాడు ఎవడో మనకు తెలుసా ? ఎలా తెలుస్తుంది?

మిగతా అన్ని విషయాల్లోనూ మనకు రక రకాల గణాంకాలు వుంటాయి . చాలామంది ద్వారా లబించే రూమర్లు కూడా వుంటాయి . కానీ - మంచి వాడు ఎవరయ్యా - అంటే , అది చెప్పడం కాస్త కష్టమే. ధనవంతుడో, రాజకీయ నాయకుడో చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్దగా  చూపించే పత్రికలూ, టీవీ లు వుండనే  వున్నాయి .  కానీ ,మీరో, నేనో చేస్తే - చెప్పే వాళ్ళు లేరు . మనమే చెప్పుకోవచ్చా ?  చెప్పుకుంటే వచ్చే పుణ్యం పోతుంది అంటారు . కానీ, సంతోషం వస్తుంది . పది మంది అనుకోవచ్చు - యిదేదో పెద్ద గొప్ప పని అని చెబుతున్నాడు ; అంతా బడాయి - అని . మనకు కాస్త  గాలి  తీసేసినట్టుగా  అవుతుంది . అయినా - చేసిన చెడ్డ పని చెప్పడం కష్టం గానీ , మంచి పని చెప్పడం కష్టం కాదు . అసలు చెప్పకండా వుండడం కష్టం .

నేను చాలా ఏళ్ళ క్రితం వొక మంచి యోగా ప్రోగ్రాం పూర్తి చేశాను . అది చాలా, చాలా బాగుంటుందని  నా లాగా ఆ ప్రోగ్రాం చేసిన వారందరూ వొప్పు కుంటారు.  అందులొ వొక భాగం , మీరు అదే ప్రోగ్రాం చేస్తున్న మరొక అపరిచిత వ్యక్తికి , మీరు మీ జీవితం లో చేసిన వొక పెద్ద తప్పు పని పూర్తిగా చెప్పాలి .ఆ పాపాన్ని అలా చెప్పి కడుక్కోవాలి .   అతడూ అలాగే తను చేసిన పెద్ద తప్పు పని మీకు పూర్తిగా చెప్పాలి. ఆ తరువాత మీరిద్దరూ - మీరు విన్న, చెప్పిన ఆ తప్పు పనులు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు . యిలా కొద్ది నియమాలు వున్నాయి . అతడు నాకేదో చెప్పాడు . నేను అతనికేదో చెప్పాను . యిందులో విశేషమేమిటంటే - యిలా చెప్పేసి ఏడవని వాడంటూ ఆ ప్రోగ్రాం లో లేదనే చెప్పాలి . నేను కూడా ఎన్నో దశాబ్దాల తరువాత , బాగా ఏడిచాను . ఎంత బండ బారిన వారికైనా ఆ ఏడుపు రావాల్సిన సమయం అది .  అది తెచ్చి పెట్టుకునే ఏడుపు కాదు . సహజంగా వచ్చేసే ఏడుపు . అలా, చేసిన ఏదో తప్పు పని , ఎవడికో చెప్పి అందరం ఎడ్చుకున్నాం . ప్రోగాం తరువాత - అందరం సంతోషం తో ఇళ్ళు చేరిన వాళ్ళమే.

మరి చేసే మంచి పనుల మాటేమిటి . అవి రహస్యంగా  వుంచము గా! అది చిన్నదో, పెద్దదో, ఏదైనా గానీ . పది మందికి చెప్పుకుంటే , వాళ్ళు కుళ్ళుకున్నా, అభినందించినా, అంతేనా అని గాలి పీకేసినా   - చెప్పేస్తే అదో సంతృప్తి .
నాకు చాలా సంవత్సరాలు - అసలు జీవితంలో మనం మంచి పనులు ఏమి చేశాము - అని మనసు పీకుతూ వుండేది . మరీ చిన్న పనులు మనకే చెప్పుకోలేము . మరొకరికి ఎలా చెబుతాము . మది కాస్తో, కూస్తో పెద్ద పనులు ఎప్పుడూ చేసినట్టు గుర్తు లేదు . మరేం చెయ్యాలి ?

వొక దశాబ్దం క్రితం అయితే - బిచ్చ గాళ్ళకు కూడా - వొక రూపాయికి మించి బిచ్చం వేసిన వాడిని కాను - అని అనుకుంటా . జేబులో డబ్బులు వున్నా , వొక్కో సారి వేద్దామనిపించినా, బిచ్చగాడిని దాటి వెళ్ళిపోయే వరకు , చెయ్యి జేబులోకి వెళ్ళేది కాదు . ఆ తరువాత, సరే, మరో సారి చూద్దాం అనుకునే వాడిని. వెయ్య కూడదని నియమం లేదు కానీ , వేసే అలవాటైతే లేదు . ఎప్పుడో వొక సారి , ఎలాగో వేసే వాడిని .

ఆ తరువాత, ఈ విషయం - నేను ప్రసంగించే కొన్ని క్లాసులలో చర్చకు వచ్చింది. వెయ్యాలని కొందరు; వెయ్యకూడదని కొందరు ; అసలు, బిచ్చ గాళ్ళలో చాలా మంది ధనవంతులున్నారని కొందరు, అసలు బిచ్చం వేస్తే , సోమరి తనాన్ని ప్రోత్సహించడమే నని కొందరు - యిలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు , వారి వారి కారణాలతో బాటు చెప్పారు.

ఆ తరువాత - బిచ్చ గాళ్ళకు బిచ్చం వేస్తే  ఏమవుతుంది ? వెయ్యకపోతే ఏమవుతుంది ? యిదీ చర్చించాం . ఈ అంశం పైన కాస్త దీర్ఘం గానే , తీవ్రం గానే పరిశోధనే చేసాము.

అప్పుడు నాకు అనిపించింది యిది. బిచ్చ గాడికి బిచ్చం వేస్తే , వాడు ఆ రోజు భోంచేస్తాడు. మరి కొన్ని రోజులు బ్రతుకుతాడు . సరే వాడి వద్ద డబ్బు వుందనుకోండి. మనమిచ్చిందీ అందులో చేరుతుంది . వాడికి అనుభవించే  రాత లేదు . అంతే . కానీ లేని వాడు బ్రతుకుతాడు . బిచ్చగాడి గానే అయినా - కనీసం బ్రతుకుతాడు .

బిచ్చ గాడికి బిచ్చం వెయ్యలేదనుకోండి ? వాడికి ఆకలి పోలేదనుకోండి . అప్పుడేమవుతుంది . వాడికి సమాజం పైన ఈర్ష్య, కసి పుట్టుకు వస్తుంది . ఆకలికి - వాడు చిన్న చిన్న దొంగ  తనాలు   చెయ్యవచ్చు . పట్టుబడితే తన్నులు తింటాడు . జైలుకూ పోవచ్చు . పట్టుబడినా, లేకున్నా , పెరిగే కొద్దీ పెద్ద దొంగ గా , గూండా గా , రౌడీ గా, మారొచ్చు . మన దేశంలో - రౌడీలకు రాజకీయ నాయకుల వద్ద పెద్ద డిమాండు వుంది కదా . కొన్ని పార్టీలలో యిది మరీ ఎక్కువ. భూ కబ్జాలు చెయ్యాలన్నా, ఎదుటి పార్టీ వాళ్ళతో పోరాటాలన్నా, వూరేగింపులన్నా, నినాదాలన్నా - రౌడీలు తప్పకుండా వుండాల్సిందే . ఈ రౌడీలలో చాలా మంది చిన్నప్పుడు వదిలి వేయబడి,  బ్రదుకెలా గడపాలో తెలియని వాళ్ళే . దారిలో అడుక్కున్నప్పుడు , మన లాంటి వాళ్ళ వద్ద , లేదుపో, అనిపిం చుకున్న వాళ్ళే  . కాలే కడుపుకు చట్టాలూ లేవు ; నీతులూ లేవు . అలా రౌడీలుగా మారి, ఆ తరువాత , రాజకీయాలలో చేరి, మంత్రులయిన వారు కూడా ఎందరో . మీరు బిచ్చం వెయ్యక పోతే - వాడు రౌడీ కావచ్చు ; దొంగా కావచ్చు ; మంత్రీ కావచ్చు. వేస్తె - ఆనందంగా , బిచ్చ గాడిగా ఎవరికీ ప్రాబ్లం  కాకుండా వుండి , ఎప్పుడో , ఎక్కడో రాలిపోతాడు .  ఏది బెటర్ ? యిదీ నా ఆలోచన . చాలా యోచన తరువాత , అప్పటినుండి - బిచ్చగాడికి బిచ్చం వెయ్యకుండా పోరాదు - అని నిశ్చయించుకున్నా . కాస్త అది లేటుగా -  నాకు అలవాటుగా మారింది.

కానీ - అదేం పెద్ద గొప్ప పని అన్నట్టు అనిపించ లేదు. నేను యింత కారణాలు వెతికి చేసే పని, చాలా మంది - అసలు ఏ మాత్రం యోచన చెయ్యకుండా , ప్రతి దినం గుళ్ల ముందు చెయ్యడం   చాలా సార్లు చూశాను . అందులో - ఆడవాళ్ళ శాతం యెక్కువ .

మరేం చెయ్యాలి ? 

అప్పుడు నేను రిటైర్ అయిన మొదటి సంవత్సరం.  మా వూళ్ళో "సేవాలయ " అనే అనాథాశ్రమం , వృద్ధాశ్రమం , స్కూలు - కలిపి - బాగా జరుపుతున్న సంస్థ నా దృష్టికి వచ్చింది . అక్కడికెళ్ళి - 5000 రూపాయలు - వారికి వొక రోజు భోజనం కోసమని విరాళం యిచ్చాను . అది నాకు కాస్త బాగా అనిపించింది . మా అన్నదమ్ములందరితో చెప్పాను . వోహో అన్నారు - అంతే .

అలాంటి 5000 రూపాయలు విరాళం , మళ్లీ 4, 5 సార్లు యిచ్చాను . అక్కడికెళ్ళి , ఆ పిల్లలకు వొక స్వీట్ వడ్డించి , వాళ్ళతో బాటు కూర్చుని 2 సార్లు భోజనం చేశాను . యిప్పుడు మరి కాస్త బాగా అనిపించింది . అయినా - పెద్ద గొప్ప పని అని అనిపించ  లేదు.

ఆ తరువాత సంవత్సరంలో - నేను స్టాక్ మార్కెట్ లో - ఎన్నో పరీక్షలలో చాలా బాగా రాసి వుత్తీర్ణుడవడం , అందులో నేను పెట్టుబడి పెట్టిన షేర్లు కాస్త బాగానే  లాభాలివ్వడం జరిగింది .

అప్పుడనుకున్నా - వచ్చే లాభాల్లో - వొక 25 శాతం - ఈ  పిల్లలకు విరాళం గా యిస్తే ఎలా వుంటుంది ? అంతా యోచన చేసి - నా విరాళం 25000 రూపాయలకు పెంచాను. యిలా వొక 5 సార్లు వొక్కొక్క సారి 25,000 రూపాయలుగా యివ్వడం జరిగింది. 

అప్పుడెప్పుడో చదివాను - బిల్ గేట్స్  గారు, వారన్ బఫ్ఫే గారు, మనదేశంలో అజీం ప్రేమ్జీ గారు యిలా ఎంతో మంది - ఎన్నో బిలియన్ల డాలర్లు సంపాదించి అందులో చాలా భాగం ప్రపంచంలోని అన్ని దేశాలలోని బీదలకు ఎన్నో రకాలుగా సహాయం చేసిన వైనం . అందువలన బాగుపడిన కుటుంబాలు, వ్యక్తులు ఎంత మందో చెప్పలేము .

ఇలాంటి ప్రపంచంలోని గొప్ప వాళ్ళ లో, గొప్ప మంచి వాళ్ళతో - ఎవరు పోటీ పడగలరు ? దాతృత్వం అనేది మన దేశం లో వుంది కానీ , అమెరికా లెవెల్ లో లేదనే చెప్పాలి . అందుకే మనదేశంలో యింకా ఆకలి, చదువులేమి , కనీసావసరాల లేమి - అన్నీ వున్నాయి .

యిలా అనుకుంటున్న సమయంలోనే మోడీ ప్రభంజనం  మన దేశం లో వచ్చింది . నాకూ, మోడీ గారు బాగా యిష్టమైన వొక లీడర్ . ఆయన వస్తాడు, వస్తాడు అనగానే - స్టాక్ మార్కెట్ లో వొక ఉప్పెన పుట్టు కొచ్చిం ది ,

నేను పెట్టుబడి పెట్టిన షేర్లు మరి కాస్తా బాగా పైకి పోవడం జరిగింది . అప్పుడనుకున్నా. ముందు అనుకున్న ప్రకారం 25 శాతం యివ్వాలి కదా. వొక వేళ మళ్ళీ షేర్లు పడిపోతే ఎలా?

 కాస్త అనుమానం వచ్చినా, మళ్లీ , చెయ్య గలిగే మంచి పని యిప్పుడే చెయ్యాలి , చేసేద్దాం - అని నేను, నా శ్రీమతి, సేవలయా కు వెళ్లాం . ఈ సారి - ఏదో వొక ఆడ పిల్ల, 5 లేదా 6 వ తరగతి చదువుతున్న పిల్ల , బాగా చదువుతున్న పిల్లను సెలెక్ట్ చెయ్యండి; ఆ పిల్ల చదువులల కయ్యే పూర్తి  ఖర్చు 12 వ తరగతి వరకు ఎంతవుతుందో చెప్పండి . అది వొక విరాళం (ఎండో మెంటు ) గా యిచ్చేస్తానని  చెప్పాను . ఆ ప్రకారమే 80 వేలు విరాళం (ఎండో మెంటు ) గాను మరో 5000 వొక రోజు ఆ ఆశ్రమం భోజన ఖర్చు గానూ  యిచ్చాను . వాళ్ళూ,  బాగా చదివే వొక 5 వ తరగతి పిల్ల పేరులో యిది చేర్చుకున్నారు . ఆ పిల్ల వివరాలు నాకు యిచ్చారు . ఇక పై ఆ పిల్ల ఎలా చదువుతూ వుందో నాకు తెలుపుతాము - అన్నారు .  మేము కూడా అప్పుడప్పుడూ వెళ్లి చూడొచ్చు; మాట్లాడవచ్చు-యిలా ఏదేదో చెప్పారు. ఆ తరువాత - ఏదో మనసులో వున్న మాట వాళ్ళతో చెప్పాను . ఆ పిల్ల 12 వ తరగతి మంచి మార్కులతో పాసైతే , నేను, నా శ్రీమతి అప్పుడూ బాగానే వుంటే - ఆ పిల్ల కాలేజీ ఖర్చులు కూడా యివ్వగాలనో ఏమో చూద్దాం - అని . 

యిలా మోడీ గారు స్టాక్ మార్కెట్ ను మరింత పెంచుతూ వుంటే , నేనూ, మరింత మంది పిల్లల పేరులో , విరాళాలు యిస్తాను కదా అనిపించింది . మరో ఆలోచన కూడా మనసులో మెదిలింది . యిందులో మన నిర్వాకం ఏముంది ? యిలా షేర్ల ధరలు పెరిగేటట్టు మనం చేశామా . అదేదో తానుగా పెరిగింది . మనం అనుకున్న ప్రకారం ఏదో యిచ్చాము .  అంతే  కదా .

యిప్పుడు నాకు 65 సంవత్సరాలు . కనీసం మరో 15 సంవత్సరాలు యిలాగే వుంటే - మరో 20 మంది పిల్లలకైనా - ఎండో మెంటు చెయ్యొచ్చు . యింకా ఎక్కువే చెయ్యొచ్చు కూడా .

ఈ సోదంతా ఎందుకంటే - మన దేశం లో అనాథలు అన్న పదమే వాడకం లో వుండకూడదు . మనమంతా వున్నప్పుడు , మన దేశం లోని ప్రతి బాలుడూ, బాలికా - బాగా చదవాలి . ఆర్ధిక పరిస్థితి కానీ , తల్లిదండ్రులు లేకపోవడం కానీ - పసి పిల్లల భవిష్యత్తుపై  ఎలాంటి చెడు ముద్రా వెయ్యకూడదు . వచ్చే తరాలలో -  రౌడీలుగా , దొంగలుగా, బిచ్చగాళ్ళుగా ఎవరూ వుండకూడదు . యిది మనసులో వుంది . దీనికి - యింకేం చెయ్యాలో చూడాలి.

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్  


6, మే 2014, మంగళవారం

సంస్కృతం నుండి - సుభాషితాలు కొన్ని - పుణ్యమంటే, పాపమంటే నిజంగా ఏమిటి ? పరో(రా)పకారమంటే ఏమిటి ?

సంస్కృతం నుండి
సుభాషితాలు కొన్ని 

ఈ మధ్య సంస్కృతం బాగా నేర్చుకోవాలనే తపన ఎక్కువై , సంస్కృత భారతి  వారు జరుపుతున్న మూడు పరీక్షలు రాసి బాగా పాసవడం , చివరిదైన కోవిద పరీక్షకు రిజిస్టరు చెయ్యడం జరిగింది . సంస్కృతం భారతీయ / ప్రపంచ  భాషలన్నిటిలో, అతి ప్రాచీనమైనది ; అందులోని జ్ఞాన సంపద అత్యున్నతమైనది - అన్న మాట మనలో చాలా మందికి తెలిసినదే .

సంస్కృతం నుండి కొన్ని శ్లోకాలను యిక్కడ ఉదాహరిస్తున్నాను .

ఋగ్వేదం : " ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః

అంటే , "అన్ని దిక్కుల నుండి  మంచి ఆలోచనలే మనకు వచ్చు గాక"  అని అర్థం . చూడండి . ఋగ్వేదం ఎప్పుడు మొదట రాయబడిందో , ఎవరికీ  తెలీదు . ఎంత ప్రాచీనమైనదో ఎవరికీ తెలీదు . ప్రపంచంలోని  అన్ని గ్రంధాలలో - అన్నిటికంటే అతి ప్రాచీనమైనది ఋగ్వేదం . అందులో చెప్పబడిన వాక్యం యిది . యిది ఎప్పటి వాక్యం ? ఎన్నో వేల ఏండ్లది  కావచ్చు . ఎన్నో లక్షల ఏండ్లదైనా  కావచ్చు . అంత ప్రాచీనమైన మాట యిది . 

అన్ని దిక్కుల నుండి మనకు మంచి ఆలోచనలే రావాలి. అప్పుడే కదా , మన మనసు మంచి ఆలోచనలు చేస్తుంది. అప్పుడే కదా, సమాజమంతా - మంచిగా వుంటుంది . దీనికి మరో పిల్ల వాక్యం చెప్పాలంటే , వొక వేళ , వొక వైపు నుండి, చెడు ఆలోచనలు వస్తూ వుంటే , ఏం చెయ్యాలి? మొదట, అవి మీ మనసులో దూరకుండా చూసుకోవాలి . మళ్లీ  అవి - ఆ దిక్కున పుట్టకుండా , మన వద్దకు రాకుండా , మరెన్నో చెయ్యాలి . యిలా - ఈ వాక్యార్థం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు . నిజానికి - మన జీవితం బాగుండాలంటే, సుఖ మయం కావాలంటే - ఈ వాక్యం వొక్కటి పాటిస్తే  చాలు - ఔనా !


2. "ఆత్మార్థం జీవలోకేస్మిన్  కో న జీవతి మానవః ;  పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి" . 

ప్రపంచం లో  చాలా మంది స్వహితం , స్వసుఖం చూసుకునే  వాళ్ళుగానే  వున్నారు . 

కానీ , పరోపకారార్థం , పర హితార్థం  ఎవరు జీవిస్తారో , వారి జీవితమే , నిజమైన , ధన్య జీవితం . అది కాని జీవితము , నిరర్థక జీవితం. యిదీ దీని భావం .

యిది విన్న తరువాత - మనం మన జీవితాన్ని కాస్త నిశితం గా పరిశీలించి - మనలో ఈ పర హితార్థకత  వుందా , లేదా; ఎంత వుంది - అని చూసుకోవాలనిపించాలి కదా .


3. "శ్లోకార్ధేన  ప్రవక్ష్యామి  యదుక్తం గ్రంధకోటిభిహి  ;  పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనం . "

కోటి గ్రంధాల లో చెప్ప బడిన దాని (సారాన్ని) అర్ధ (సగం) శ్లోకం లో చెబుతున్నాను . పుణ్యమంటే - పరోపకారమే . పాపమంటే - పరపీడనమే . 

మరొకరికి ఉపకారం చెయ్యడమే పుణ్యము . 

దేవుడికి మ్రొక్కితే పుణ్యము . పూజ చేస్తే పుణ్యము - అని అనుకుంటాము .  నిజానికి , యివన్నీ మన మనసును పరిశుద్ధం  చేసేవి . అంతే కాని పుణ్యాలు కావు . పుణ్యమంటే  పరోపకారమే - అంతే కానీ , మరేదీ కాదు.  దీన్ని మరింతగా మనం విశ్లేషించుకోవచ్చు . రాజు పట్టుకోవాలనుకునే దొంగను దాచి పెట్టడం  దొంగకు ఉపకారం లాగా తోచ వచ్చు . కానీ, ప్రజలకు అపకారం కదా . అందువలన , మనం చేసే పరోపకారం - మరొకరికి , ముఖ్యంగా, మంచి వారికి అపకారంగా పరిణమించ కూడదు . లంచగొండి అయిన వాడికి వోటు వేస్తే - వాడికి ఉపకారం ; కానీ, ప్రజలకు అపకారం . అలా వోటు వెయ్యడం కూడా పాపం క్రిందకే వస్తుంది . 

పర పీడనమే పాపము , అన్నారు. పరులకు కష్టం కలిగించడం ఖచ్చితంగా పాపమే . యిది మనం సాధారణం గా మాటల ద్వారా ప్రతి దినం , ఎన్నో సార్లు చేస్తూ వుంటాము . "నిజం మాట్లాడడం"  పుణ్యం అనుకుంటాం . కాదు . ఆ నిజం వలన పరోపకారం జరగాలి . సజ్జనోపకారం జరగాలి . ఆ నిజం, మృదువుగా, ఆహ్లాదకరంగా , మనసుకు నచ్చేటట్టు  చెప్పగలగాలి . అన్ని సమయాల్లోనూ , అలాంటి ప్రయత్నం చెయ్యాలి .  

అందుకే "సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ , న బ్రూయాత్, సత్యమప్రియం " అన్నారు. సత్యం చెప్పాలి. ప్రియంగా చెప్పాలి. ఏ సత్యాన్నీ  అప్రియంగా చెప్పకండి . -అని భావం . 

నువ్వు చూడ్డానికి అందంగా లేవు - అన్నది సత్యమా?  ఎదుటి వారిని గురించి - మీ మనసులో అలాంటి భావం వచ్చినా , అది నిజమే అని మీరు అనుకున్నా , అది చెప్పడం  సత్యం క్రిందకు రాదు, కానీ పాపం క్రిందకు మాత్రం తప్పకుండా వస్తుంది . పరులకు ఆనందమూ , ఆహ్లాదమూ కలిగించే సత్యాలు ఎన్నో వున్నాయి . అవి చెబితే , పుణ్యం కూడా .   కానీ, అవి చెప్పము . చెప్పాలని తోచదు . పరులకు కష్టాన్ని కలిగించే సత్యాలు చెప్పాల్సి వస్తే - అది ఎలా చెప్పాలో, అసలు చెప్పాలా వద్దా అన్నది మనకు తెలియాలి . చెప్పరాని విధంగా చెబితే - అది పాపం .  అంటే - మన మాట , మంచి  మాటగా , మంచిని పెంచే, పంచే మాటగా వుండాలి .

 మరి,  దుష్టులకు, వారు చేసే పనులు ఆకృత్యాలని చెప్పాలా , వద్దా ? చెప్పాలి.  వీలైనంత వరకు - వారిలో మార్పు వచ్చే రీతిగా చెప్పాలి . అందుకనే - సామ,  దాన, భేద , దండోపాయాలను - ఆ వరుస క్రమంలో ప్రయోగించ మన్నారు . 

యిది - కేవలం మాటల ద్వారా మనం చెయ్య గలిగే పుణ్యాలు , చేస్తున్న పాపాలు . 

ఉత్త మాటల ద్వారా మనం ఎంతో మందిని సంతోష పెట్ట వచ్చు . ఆలోచించండి . 

దీని తరువాత - మనం చేసే కార్యాలు - పుణ్యాలా , పాపాలా ? యిది చూసుకోవాలి . దీనికీ పై సూత్రమే వర్తిస్తుంది . ప్రతి రోజూ - మనలో, ప్రతి వొక్కరు , పంచ మహా యజ్ఞాలు - అనేవి చెయ్యాలి, అని పెద్దలు చెప్పారు . దేవతలకు, ఋషులకు, పితరులకు , మానవులకు, సకల భూత కోటికి (జంతువులు, పక్షులు, వృక్షాలు యిత్యాదులు)  మన సహాయం అందాలి . యిది మన నిత్య కృత్యం గా మారాలి . ఈ పుణ్యాలు చేసే వాడికి,  పాపాలను గురించి యోచన చేసే సమయం కూడా వుండదు . అతని జీవితం కూడా మహదానంద మయం  గానే వుంటుంది .


చివర , మహా భారతం లోని వొక చిన్న శ్లోకం :

4. "అలక్ష్మీరావిశత్యేనం  శయానమలసం నరం . "

సిరి ఎవరిని వరించదు? దురదృష్టం ఎవరికి వస్తుంది ?

ఎవడైతే నిద్ర మత్తులోనే వుంటాడో , ఎవడైతే సోమరితనంలోనే వుంటాడో - వాడికే దురదృష్టం వస్తుంది; సిరి వాడి వద్దకు రానే రాదు . 

- యిలా చురుకుతనాన్ని , పనిలో కుశలతను ఎంతగానో ప్రోత్సహించే తత్త్వం, సంస్కృతి  మనది . "కర్మలో కుశలత నే యోగం "  అని శ్రీకృష్ణుడు భగవద్ గీతలో కూడా అంటాడు. 

సంస్కృతంలో సుభాషితాలు చాలా, చాలా, చాలా ఎక్కువ . అవి చదివితే చాలు ; జీవితాలు మారిపోతాయి . మన పాఠ్య పుస్తకాలలో కూడా , ప్రతి క్లాసులోనూ - ఈ సుభాషితాలను చేరిస్తే చాలు - మన మనసుల్లోను, జీవితాల్లోను  ఎంతో ప్రగతి వస్తుంది . అది జరుగుతుందా ?  ఎప్పుడు జరుగుతుందో ?  శుభస్య  శీఘ్రం !

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్  


2, మే 2014, శుక్రవారం

ఎన్నికలు -2014- 1950 నాటి పద్ధతులు-ఈ నాటి టెక్నాలజీకి,వోటర్లకు ,తగినట్టుగా వుందా?. ఎన్నో మార్పులు రావాలి

ఎన్నికలు -2014


ఎన్నికలు  జరిగి పోతూ వున్నాయి. మరో పదిహేను రోజులలో అంతా అయిపోయి నట్టే . తరువాత -  ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి . జూన్ నెలలో క్రొత్త ప్రభుత్వాలు రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ వచ్చేస్తాయి .

ఎవరొస్తారో ? ....యెవరికి తెలుసు . 

తెలుసు అనే వాళ్ళ లోనూ,   మేమే గెలుస్తాం అనే వారి లోనూ కూడా గుండె దడ వుండనే వుంటుంది . మరి మేమే వోడిపోతాం -అని నిశ్చయించుకున్న వారి మనసు ఎలా వుంటుంది ?

ఎదుటి  వారిని , గెలిచే వారిని , ఎలాగైనా , ఏదో వొక చిక్కుల్లో యిరికించి పోదామని వుంటుంది .

యిప్పుడు కాంగ్రెస్ అలాగే చేస్తూ వుంది . యిప్పుడు కాంగ్రెస్ చేస్తూ  వున్న ఏ పని లోనూ నిజాయితీ , హుందా తనం కనిపించడం లేదు .

పదేళ్లుగా లోక్ పాల్ కావాలి అని ఉద్యమాలు జరిపిన వారందరినీ - ఎన్నో రకాలుగా వేధించిన కాంగ్రెస్ - యిక పది రోజుల్లో ఎలెక్షన్లు ముగిసిపోతుండగా ,  యిప్పుడు ఎవరితోనూ చర్చలు కూడా జరపకుండా , లోక్ పాల్ ను మేము పెడతాము - అనడం, హాస్యాస్పదం .

అలాగే మరెన్నో అప్పాయింట్ మెంట్లు చేస్తూ వుంది . స్నూప్ గేట్ అని పేరు పెట్టి - ఏమీ లేనిది , ఏదో జరిగిందని ఏదో చీమను భూతం లాగా చూపించడం , దానికి ఏ జడ్జీ యింతవరకూ - మేము వొప్పుకోము అన్న తరువాత కూడా - ఎవరో వొక జడ్జీని - ఎన్నికల ముందు పెడతాము -అనడం   విచారకరం ; హాస్యాస్పదం .  

మిగతా ఎంతో మంది జడ్జీలు ఎందుకు నిరాకరించారో  మొదట కాంగ్రెస్ చెప్పాల్సి వుంది . 

 లంచగొండి  తనం వొక ప్రక్క వున్నా - రాజకీయ ప్రత్యర్థులను యిలా ఎదుర్కొనడం , యిలా అనుకోవడం  కూడా  అంత కంటే, చాలా శోచనీయం .


కాంగ్రెస్ ఈ  పధ్ధతి మానుకుంటే  మేలు . లేకుంటే - వచ్చే అయిదేళ్ళలో , బీ . జే . పీ  కూడా అలాంటి పద్ధతే  పాటించితే - అది తప్పెలా అవుతుంది ?

మొత్తానికి రాజకీయాలను ఎంత కల్మషంగా మార్చాల్నో , అంత కల్మషం గా మార్చేస్తునారు . ఈ నేపథ్యంలో  ప్రజలు ఎన్నికలలో ఏం చేస్తున్నారో , ఏం చేయ్యబోతున్నారో  మనకు తెలీదు ;  కానీ , ఈ నెల అంతం లోగా తెలిసి పోతుంది .

ఈ మధ్యలో - ఎన్నికల కమిషన్ వారి తీరు కూడా కాస్త వింతగా వుంది . మోడీ గారు ఎక్కడో కమలం సింబల్ చూపారట . అది ఎక్కడా, ఏమీ అనేది విచారించ కుండా , వారిపై FIR  దాఖలు చేయించారు . మరి పోలీసులేమో - అది - వుండాల్సిన దూరాన్ని దాటే జరిగిందని చెబుతున్నారు .

మరో వైపు - కాంగ్రెస్ నేతలు ఎంతో మంది పోలింగ్ బూతు బయటికి రాగానే,  క్యూ లో నించున్న   వోటర్లకు   తమదైన  "హస్తం" గుర్తు చూపుతున్నట్టు  అందరికీ తెలుస్తోనే వుంది గా . మరి దానికేం FIR  లేదా ? తామర గుర్తు ఎక్కడో వోటర్లు కాని వాళ్లకు చూపితే ఏం తప్పు ?  ఈ గుర్తుల విషయంలో  EC వారు  కాంగ్రెస్ వారి వాదన పక్కకు పెడితే - ఎన్నో యిటువంటివి అన్ని పార్టీల వారూ చేస్తుండడం తెలుస్తుంది .

అంతెందుకు . సైకిలు గుర్తు వారు , కారున్నా కూడా , ఆ రోజు మాత్రం బూతుకు సైకిలు లో రావడం, దాన్లోనే ఊరంతా తిరగడము  జరుగుతూ వుంది . కారు గుర్తు వారూ అంతే . అది వోటర్ల మనసులలో - ఆహా , యిదీ వారి గుర్తు , అని చెప్పినట్టే కదా !

ఎలెక్షన్ కమిషన్ వారి  వోటింగ్ బూతుల్లోనూ , బయటా కూడా - "ఝాడూ" లు (పరకలు ) ఉన్నాయా లేదా ? అలాగే, బూతుల్లో - "ఫాన్లు" - అవీ వొక పార్టీ సింబల్ కదా - అవన్నీ వోటర్లకు కొన్ని పార్టీల గుర్తులు చూపుతున్నట్టే కదా. అవి చూస్తే - ఆ పార్టీలు మనకు , వోటు వేసే ముందు , గుర్తుకు వొస్తాయిగా ! ఎదురుగా వుండేది ఎందుకు  గుర్తుకు రాదు.

అసలు బూతుల్లో వుండే వస్తువులను - పార్టీల సింబల్సు గా ఎలా వొప్పుకున్నారు ? అందరూ చెయ్యెత్తి చూపే "చెయ్యి" సింబల్ - వొక పార్టీ సింబలు  గా యివ్వ వచ్చా?  యిప్పుడు వారేమో , బూతు నుండి  బయటికి రాగానే , చెయ్యెత్తి ఊపుతూ వెళ్ళిపోతున్నారు . 

యిలా ఎన్నో పార్టీ ల సింబల్సు - అందరూ - బూతుల్లోనూ , బయటా వోటర్లకే  చూపుతూ వుంటే - ఎక్కడో దూరంగా , మోడీ గారు, చిన్న తామర సింబల్ ను వోటర్లే కాని వారు ఎవరికో చూపితే - అది మాత్రమే - తప్పెలా అవుతుంది .

సరే . ఆ వోటర్లు కాని వారు టెలివిజన్ లో చూపారు అనుకోండి . అది ఎవరికని ? భారత దేశమంతా , యింకా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయా , లేదా ? అది వారికోసం కాదా . యిప్పుడు అందరూ , ప్రతిదినం ప్రచారం చేస్తున్నారు .  ప్రతి దినం ఏదో వొక చోట ఎలెక్షన్  వుంది . రెండూ జరుగుతూనే వున్నాయి కదా . మరి, ఎవరూ , మరెక్కడా మాట్లాడ కూడదా ? ఈ రోజుల్లో , దేశం లో కానీ విదేశాలలో కానీ - ఎక్కడ మాట్లాడినా , అది 10 నిమిషాల్లో ప్రతి వొక్కరికీ అందుతుంది  కదా .  అసలు అందితే తప్పేమిటి ?

ఈ చట్టాలన్నీ , యిన్ని టెక్నాలజీలు లేని సమయంలో చేసినవి , యివి, యిప్పటికి పనికి రాదు కదా .

మోడీ గారు ఎవరికో తామర సింబల్  చూపినంత మాత్రాన - అందరి మనసులూ ఆ క్షణాన  మారిపోయి ఆయనకే  వోటు వేస్తారు - అనుకోవడం ఎంత మాత్రం బాగుంది ?

కొన్ని నెలలుగా దేశమంతటా , ఎక్కడ చూసినా తామర సింబల్ వుందా లేదా ? యిన్ని నెలలుగా, మోడీ గారు అది పెట్టుకుని తిరుగుతున్నారా లేదా . తామర BJP సింబల్ అని తెలియని వోటర్లకు (నిజంగా వుంటే), ఇప్పుడాయన  ఎక్కడో, ఆ సింబల్ తీసి యిలా పట్టుకుంటే , అదీ వారెవరూ చూడక , ఎవరో, జర్నలిస్టులు మాత్రం చూస్తే - అది తప్పెలా అవుతుంది . అది అసలు ఆ జర్నలిస్టుల తప్పు మాత్రం ఎలా అవుతుంది ? వారు బూతు దగ్గరికి రాలేదు, అక్కడ అడగ లేదు . మోడీ గారు కూడా బూతు దగ్గర చెప్పలేదు చూప లేదు.

మరి యింత - సీనుందా ఈ విషయానికి ?  జర్నలిస్టులు కూడా ఆ రోజు కానీ , ఈ రోజు కానీ , ఈ మధ్య రోజుల్లో కానీ తామర ను చూపడమే లేదా . ప్రతి రోజూ , 24 గంటలూ , ప్రతి చానల్ లోనూ చూపిస్తూనే వున్నారు ; మనమూ చూస్తూ వున్నామా లేదా ? టీవీ తెరిస్తే తామర గుర్తు వుండనే వుంది కదా.

అంతే కాదు.  యింకా ఎలెక్షన్లు వున్నాయి కదా . మరి మోడీ గారు ఎక్కడో , ఎవరికో , కమలం గుర్తు చూపితే , అక్కడి బూతుల్లోని వోటర్లు మాత్రం, అది చూడకుండానే మారిపోతారంటే యెలా ? అలా మారిపోతారా ఎవరైనా ?

నా ఉద్దేశంలో - యిటువంటి రూల్సు మారాలి . నిజానికి బూతు దగ్గర కూడా వొక పెద్ద పట్టిక వుండాలి . ఎవరి సింబల్  ఏదో తెలిసేటట్టు చెప్పాలి కమిషన్ వారే . బయట వోటర్లు అది చూస్తే  -  మంచిదే . వోటింగు త్వరితంగా జరుగుతుంది . వోటర్లు తప్పుగా వేసే ప్రమాదం వుండదు . యిలా ఎన్నో వుపయోగాలున్నాయి .

అది విడిచేసి , ఎక్కడో వొక తామర చూపాడని , ఆయనపై FIR దాఖలు చేసే లాంటి రూల్సు పనికి రావు . నేను కమిషన్ ను తప్పు పట్టడం లేదు కానీ  ఇలాంటి రూల్సు మారాలి . రూలు వుందనుకోండి . కమిషన్ వారు కాంగ్రెస్ నాయకులకూ చెప్పాలి - మీరు చెయ్యి దించుకుని వెళ్ళాలి అని . యిప్పుడు వాళ్ళేమో , చెయ్యి సింబల్ , బూతు బయటే , వోటర్లకే చూపుతూ వెళతారు . మిగతా వాళ్ళు మాత్రం ఎక్కడో, వోటర్లు కాని వారికి చూపితే కూడా నేరం , యిదెలా ? సరే . BJP  వాళ్ళు కూడా రెండు చేతులూ కలిపి కమలం లాగా పట్టుకుని వెడితే పరవాలేదా .

యిదేదో - మనం, మన వోటర్లను , వారి తీసుకునే నిర్ణయాలను చిన్న చూపు చూస్తున్నట్టుగా లేదా .

ఎలెక్షన్  కమిషన్ వారు - ఎన్నికలు బాగా  జరుపుతున్నారు .

 కానీ - 1950 నాటి పద్ధతులు , యిప్పుడూ పెట్టుకుంటే , పాటిస్తే అది ఈ నాటి టెక్నాలజీకి , ఈ నాటి వోటర్లకు ,  తగినట్టుగా వుండదు .

యిది నా అభిప్రాయం . ఆ పైన ఎవరిష్టం వారిది .

జూన్ నెలలో - ఏ ప్రభుత్వం వచ్చినా - రాబోయే ఎలెక్షన్ల విషయంలో రావాల్సిన మార్పులు ఎన్నో వున్నాయని చెప్పడానికి ఈ ప్రయత్నం. 

సర్వే  జనాః సుఖినోభవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్