22, సెప్టెంబర్ 2013, ఆదివారం

మనం వొకటి కాగలం. కులాలు మాపుకోగలం ; అభివృద్ధి సాధించ గలం. పేదరికం పోగొట్ట గలం -మనల్ని విడదీయకుండా పరిపాలించే వాడికి వోటు వేయాలి . అంతే.


కేంద్ర ప్రభుత్వం వారు ఆహార సెక్యూరిటీ బిల్లు ను పాస్  చేశారు. 

66 ఏళ్ళ తరువాత, మన దేశంలో, చాలా మందికి సరైన ఆహారం కూడా లేదని వొప్పుకోవడమే యిది.  యిది ఎవరి వల్ల జరిగింది ? యిప్పుడు , ఉన్నట్టుండి , 2014 ఎలెక్షన్ల  ముందు , 66 ఏళ్ళుగా రాని  ఈ జ్ఞానోదయం ఎలా, ఎందుకు వచ్చింది .

66 ఏళ్ళ క్రిందట 1 రూపాయ కు వొక డాలర్  విలువ వుండేదట . యిప్పుడు , 66 ఏళ్ళ తరువాత, దాదాపు 66 రూపాయల కు  వొక డాలర్   గా మన రూపాయ విలువ పడి పోయింది.

ఎందుకిలా జరిగింది ? దీనికి ఎవరు కారణం ?  మీకు తెలీదా? నాకు తెలీదా ?

 దేశం లో మూడో భాగం లో నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువగా వుందట . దీనికెవరు కారణం? మిగతా రెండు వంతుల భాగంలో మన నాయకుల లంచ గొండి  తనం, వారి దుశ్చర్యల ప్రభావాలు కనిపిస్తూనే వున్నాయి. రెండో దాని వలన మొదటిది వచ్చిందా - అన్నంత ఎక్కువ గా వుంది

సరే . ఎవరు కారణం అన్నది వొక ప్రక్క వుంచితే - జరిగిన తప్పు లలో ముఖ్యమైనవి ఏమిటి - అనేది చాలా  ముఖ్యమైన అంశం  కదా . 

మన దేశంలో - మనం, ఉత్పత్తిని పెంచడానికి చాలా తక్కువ ప్రాముఖ్యత  యిస్తూ వచ్చాము . మనకు సహజ వనరులు చాలా వున్నాయి. రూపాయ విలువ పెరగాలంటే - దేశంలో , ఉత్పత్తులు పెరగాలి.  వేరే మార్గమే లేదు .

కానీ, కేంద్రం గానీయండి , రాష్ట్రం కానీయండి - వున్న దాన్ని పంచడమే గానీ- పెరిగే జనాభా కంటే - ఎక్కువగా ఉత్పత్తులు పెరగాలని, పెంచాలని మనస్స్ఫూర్తిగా   ప్రయత్నించడం లేదు .  జనాభా తగ్గాలనీ ప్రయత్నించడం లేదు. 

అందువలన ,  జనాభా పెరుగుతూ వుంది . ఉత్పత్తులు పెరగడం ఎప్పుడో మానేశాయి.  రూపాయ విలువ పడిపోతూ వుంది. అభివృద్ధి అసలు లేదని కాదు . కానీ వచ్చిన అభివృద్ధి చాలా వరకు ప్రైవేట్ వ్యక్తిగత ప్రయత్నాల వలన వచ్చిందే .  అదీ,జనాభా పెరుగుదల వల్ల , వ్యర్థమై పోతూ వుంది. 

ప్రభుత్వాలు చెయ్య వలసిన పనులు అసలు చెయ్యడం లేదు .

కొన్ని ఉదాహరణలు -

1.  విద్యారంగంలో పిల్లలకు, ముఖ్యంగా - దేశ  భక్తీ, ఉన్నతమైన సామాజిక విలువలు అతి ముఖ్యం.  అటువంటి దేశ భక్తీ, వున్నత విలువలు - విద్య ద్వారా పిల్లలకు కలగడం లేదని - మనకూ తెలుసు. 16 ఏళ్ళ పిల్లలు , కళాశాలల్లో చదివే యవకులు  మానభంగాలకు, దోపిడీలకు, హత్యలకు పాల్పడడం రోజు రోజుకూ  ఎక్కువవుతోంది . ఉద్యోగాల్లో వున్న వారిలో - ఎంతో మంది, లంచ గొండులుగా వుండడం మనకు తెలుసు. యిది కూడా చెడిపోయిన విద్య ప్రభావమే. వొక్క విద్య యొక్క విలువల ప్రమాణాలు  పెంచితే  - మరో 15 సంవత్సరాలలో - జాతిని పూర్తిగా మార్చ గల, చేవ గల తరం వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఎన్నో సమస్యలు గణనీయంగా - తగ్గిపోతాయి .  యిది ఎప్పుడు జరుగుతుంది ? పాలకులకు లేని విలువలు - వారు విద్యలో ప్రవేశ పెడతారా ? నాకు నమ్మకం లేదు .  మంచి విలువలున్న నాయకులొస్తే - విద్య లోని విలువల ప్రమాణాలు పెరగొచ్చు . నాకు తెలిసి -  భూ ఆక్రమణలలో కూడా - చాలామంది  నాయకుల హస్తమే వుంది -అది  ఏ రాష్ట్రమైనా కానియ్యండి.  వారిలో లేని విలువలు మరొకరికెలా వచ్చేటట్టు  చేస్తారు వారు?

2. జనాభా పెరుగుదల మన దేశంలో ఉన్నంత ఎక్కువగా చైనా లో కూడా లేదు. చైనా లో ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా వొక కుటుంబానికి వొకే సంతానం అనే విధానం తీసుకు వచ్చారు . ఫలితంగా - చైనా , అమెరికా ఆర్ధిక ప్రమాణాలను దాటి వెల్లగల స్థితికి వచ్చేసింది. మనకంటే నాలుగింతలు పెద్ద దేశంలో - మనకంటే తక్కువ జనాభా రాగల సమయం వచ్చేసింది . అమెరికా అంత కంటే చాలా పెద్ద దేశం . అక్కడ - జనాభా మనకంటే చాలా తక్కువ.    వారంతా- అభివృద్ధి చెందడానికి  కారణాలు - (1) జనాభా సంఖ్య పెరుగుదల కంటే - చాలా, చాలా ఎక్కువగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా సంబంధ  ఉత్పత్తులు పెరిగాయి. (2) జనాభా లోని విలువల ప్రమాణాలు కూడా యిప్పుడూ బాగుంది . 

మన దేశం లో ,   మనం, ఈ రెండు విషయాల్లోనూ, క్రిందికి పడిపోతున్నాము . దేశ భక్తి మన దేశంలో చాలా, చాలా, తగ్గిపోతున్నదనే  నా విశ్యాసం ; ముఖ్యంగా మన నాయకుల్లో . చాలామందిలో వారికి వుండవలసినంత  దేశ భక్తి, సామాజిక విలువలు లేవనే నా ప్రగాఢ విశ్వాసం . ఎక్కడ చూసినా అసత్యాలే . ఎక్కడ చూసినా నమ్మక ద్రోహమే.  ఎక్కడ చూసినా లంచ గొండి తనమే. 

సరే . వారిని ఎన్నుకొనే ప్రజలలోనూ అవి గణనీయంగా తగ్గి పోయాయి . మంచి , నిస్స్వార్థ పరులైన నాయకులను ఎన్నుకుంటే - మళ్ళీ, దేశం త్వరగా బాగుపడుతుందని - నా ప్రగాఢ విశ్వాసం. 

దేశంలోని ఏ సమస్య చూసినా - ఎక్కడో వొక చోట నాయకత్వ లోపంగానే తేలుతుంది. 66 సంవత్సరాలు, దాదాపు వొకే పార్టీకి అధికారం కట్టబెడితే - రూపాయ విలువ పెరగాల్సింది పోయి 1/2 కు కాదు, 1/4 కు కాదు ; ఏకంగా 1/66 వ వంతుకు పడిపోయింది.  ఈ మధ్య కాలంలో - ఎన్నో దేశాలు మనలను దాటి ముందుకు వెళ్లి పోయాయి. 

కులాలు పూర్తిగా పోయి, మనమందరం వొకే కులం అనే స్థితి రాక పోగా, కులాల వారీగా పార్టీలు, బాంకులు, టీవీ  చానల్లు, సొసైటీలు - అన్నీ ఈ రోజు కుల ప్రాతిపదిక పైనే జరుగుతున్నాయి. బ్రిటిష్ వాడు - విడదీసి పాలించుమన్నా -అన్నాడని అనే వారు కానీ - ఆ పని చేసింది, చేస్తూ వున్నది మన పాలకులే అని తెలుస్తూనే వుంది . మనం వొకటి కావాలి. కాగలం.  మనల్ని విడదీయకుండా  పరిపాలించే  వాడికి వోటు వేయాలి . అంతే. 

ఎవరికీ కష్టం లేకుండా, సుఖంగా క్రమంగా కులాలు మాపుకోవచ్చు ; అభివృద్ధి సాధించ వచ్చు . పేదరికం పోగొట్ట వచ్చు . అంతే కాదు; మరే దేశంలోనూ , లేనంత సుఖ శాంతుల్ని మన దేశంలో నెల కొల్ప వచ్చు . 

యోచించండి మరి ! 

=మీ 

వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి