6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

(1) అత్తలు-కోడళ్ళు- ఎద్దు ఈనింది, అంటే, గాట్లో కట్టేయండి -అన్న తరహాచట్టాలు;(2) సమైక్యాంధ్ర ఎందుకు ?

కలిసి వుంటే కలదు సుఖం - ఎప్పటి సినిమా? ఎన్నో దశాబ్దాలకు ముందు వచ్చింది. కుటుంబాలకు సంబంధించిన  కథ. అప్పట్లో అందరూ ఆ సినిమాను మెచ్చుకున్నారు. చాలా మందికి అప్పట్లో చాలా  నచ్చింది.  ఎందుకా సినిమా తీయాల్సి వచ్చింది ?  చాలా మంది  మనస్సులో, విడిపోతే బాగుండునేమో - అన్న భావనలు వుండడం వల్ల వచ్చింది . 

ఆ తరువాత - మన మానసిక దృక్పథం చాలా చాలా మారిపోయింది. విడిపోతే కలదు సుఖం - అనే  బాటలోనే యిప్పుడు చాలా మంది పయనిస్తున్నారు.  అందుకు ఎన్నో కారణాలు.  

కోడలు చెడ్డది అని పొరుగింటావిడ చెబితే  అత్త నమ్మేస్తుంది.  అత్తలందరూ చెడ్డ వాళ్లే - అంటే  నమ్మేస్తారు కోడళ్లు.   మనం చేసుకునే   చట్టాలూ అలాగే  ఏడిచాయి.  కోడలు చెబితే , నిజమో కాదో తెలుసుకోకుండా -అత్తారింటోళ్ల నందరినీ  జైల్లో  వేసేయమని  చట్టం. అత్తా వొక నాటి కోడలే ; కోడలూ వొక రోజు అత్తే -అన్న ప్రాథమిక  సత్యం అర్థం గాని వాళ్ళు చేసే చట్టాలు యిలాగే  ఏడుస్తాయి. అందరినీ జైల్లో వేయమని  చెప్పే కోడలు - మళ్ళీ ఆ యింట్లో  ఎలా వుండగలదు ? మొగుడితో ఎలా కాపురం చెయ్యగలదు ? ఈమె చెయ్యాలన్నా వాళ్ళు మళ్ళీ వొప్పుకుంటారా ?   వొకటిగా వుండగలరా? 

మనకు సంసారాలు  నాశనం చేసే  చట్టాలు కావాలా? సంసారాలు  సరి దిద్దే  చట్టాలు కావాలా?   కావాలంటే - సంసారాలు సరిదిద్దే చట్టాలు చాలా సులభంగా చెయ్యవచ్చు. 1955 లో చేసిన చట్టాలు సంసారాలు చక్కదిద్దే రీతిలో వున్నాయి. విడాకులు కావాలని వచ్చే వారికి- నచ్చ జెప్పి సరి చేసే ప్రక్రియ ఆ చట్టాల్లో వుంది. అప్పటికీ సరికాక పోతే విడాకులు యివ్వడం తప్పని సరి అన్నప్పుడు - యిచ్చేవారు. అప్పటి ఆ చట్టాల్లో వున్న విజ్ఞత- ఆ తరువాత వచ్చే చట్టాల్లో అస్సలు లేదు. 

కోడలు ఏది చెబితే - అదే నిజం అనుకునే వ్యవస్థ  వచ్చింది . కొన్ని చోట్ల నిజమే కావచ్చు . కొన్ని చోట్ల అబద్ధమూ  కావచ్చు . అన్ని చోట్లా కోడలు చెప్పేదే నిజం కానక్కర లేదు.  ఏది ఏమైనా -ఎవరిది తప్పు అన్నది కనీసం విచారించ కుండా అత్తగారి కుటుంబాన్నంతా జైల్లో తోసేయ్యడం అమానుషం. అటువంటి  చట్టాలు ఎన్నో కుటుంబాలను బాధించడం నాకే తెలుసు - మీకూ తెలిసి వుంటుంది . ఎవరి తప్పైనా - నచ్చ జెప్పడం , కౌన్సెలింగ్ , అంతకు మించితే చట్ట పూర్వకంగా కాస్త బెదిరించడం, సాంఘికంగా వొత్తిడి తీసుకు  రావడం  లాంటి ఎన్నో పద్దతులు వుపయోగించి సంసారం సరి చెయ్యాలి ; చెయ్య వచ్చు . 

అవేవీ చెయ్యకుండా - ఎద్దు ఈనింది, అంటే,  గాట్లో కట్టేయండి -అన్న తరహా చట్టాలు చేస్తూ పోతే సమాజం కుళ్ళి పోతుంది ; నాశనమై పోతుంది . చాలా చోట్ల కోడలికీ అన్యాయం జరుగుతూ వుంది .అలాగే కోడలు రాక్షసిగా, అత్త అస్సలు నోరు లేని దానిగా వుండే కుటుంబాలూ వున్నాయి. 

కాస్తో,కూస్తో సర్దుబాటు మనస్తత్వం లేని వారు ఎన్నో చోట్ల యిరు వైపులా వున్నారు.  అది సరి చేసి - కోడలు, అత్తారింట్లో , మొగుడితో సుఖంగా వుండేటట్టు  చూసే పద్ధతులు ఈ చట్టాల్లో లేనే లేవు. మొగుడినీ, అతడి కుటుంబం వారందిరినీ జైల్లో వేసే వొకే వొక పధ్ధతి వుంది.  కోడలినీ,  ఆమె మొగుడినీ, బద్ధ  విరోధులుగా చేసి, వారిరువురి జీవితాలూ పూర్తిగా నాశనం చేసి , ఆ మొగుడిని కన్నందుకు , అతని తల్లి తండ్రులు , వారి యింటిల్లి  పాదీ జైల్లో వుండాల్సిన పరిస్థితి  యిప్పటి  చట్టాల్లో వుంది.

కళ్ళు చూసేదీ, చెవులు వినేదీ మాత్రం నమ్మి  ఏ పనీ చెయ్యొద్దు. బాగా విచారించి, నిజమేమిటో  తెలుసుకుని మరీ చెయ్యి అన్న సామెత చాలా భాషల్లో - చాలా శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా  వుంది.  

అయినా, యిప్పుడు చట్టాలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీ - ఈ ప్రాథమిక సూత్రం విస్మరిస్తున్నాయి. నిజం ఏమిటి? నిజం ఏమిటి ? అన్న విషయం మనం, మన సమాజం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవడో చెప్పింది గుడ్డిగా నమ్మ కూడదు. దానిపై ఆధార పడి చట్టాలు  చెయ్యడం, స్నేహాలు , బాంధవ్యాలు నేల రాచేయ్యడం చాలా తప్పు.

మన మానసిక అంధత్వానికి  మరో ఉదాహరణ - యిప్పుడు జరుగుతున్న రాష్ట్ర విభజన కార్యక్రమం. నేను ఈ సమస్య యిప్పటి   వరకూ ఎక్కువ పట్టించు కోలేదు. కానీ, కొందరు రాజకీయ వాదుల పోకడ గమనిస్తే, వారి వలన రాష్ట్రానికే కాదు ; మున్ముందు దేశానికే ప్రమాదం రావచ్చు - అనిపించిది . అందుకనే, యిది రాయాలనిపించింది. రాష్ట్ర ప్రజలంతా, ముఖ్యంగా, తెలంగాణా ప్రాంతం వారు,  ఈ విషయాలు బాగా ఆలోచించాల్సిన  అవసరం వుంది. 

తెలుగు వాళ్ళంతా వొక  రాష్ట్రం గా వుండడం కుదరదు - అని   కొంత మంది రాజకీయ నాయకులు తెలంగాణా  ఉద్యమం లేవదీశారు. ఎందుకు - అంటే  మాకు అన్యాయం జరిగి పోతోంది;  మాకు  ఎప్పుడూ అన్యాయమే జరిగింది - అంటూ ఆవేశంగా మాట్లాడి  ప్రజలలో కూడా - ఆవేశం రగిలించారు.

సరే .  ఎద్దు ఈనింది -అంటే , గాట్లో కట్టేయండి -అన్న తరహా మనది. మనకు నిజంగా అన్యాయమే -జరిగింది కాబోలు - అని కొంత మందిలో వొక ఉద్దేశం సహజంగా వచ్చింది . అందుకే  శ్రీకృష్ణ  కమిటీ  వేశారు. కమిటీ వారు - తెలంగాణా  ప్రాంతానికి న్యాయమే జరిగింది. కాస్త ఎక్కువ న్యాయమే జరిగిందన్నారు. అసలు ఈ కమిటీ  రిపోర్ట్ మేం వోప్పుకోం అన్నారు - ఈ రాజకీయ వాదులు.

అప్పుడేం చెయ్యాలి? నన్నడిగితే, వో 2-3 వివిధ రాష్ట్రాల జడ్జీలు, ఆర్ధిక శాస్త్ర వేత్తలు వున్న మరో కమిటీ మళ్ళీ వేసిండొచ్చు . వారెలా చెబితే అలా చేసిండొచ్చు . నిజంగా అన్యాయం జరిగి వుంటే - న్యాయం ఎలా చెయ్యాలో ఆ కమిటీ చెబుతుంది  కదా .  అలా జరుగ లేదు. ఆ తరువాత  ఎంతో మంది  స్టాటిస్టిక్స్  యిచ్చారు - తెలంగాణాకు  న్యాయమే జరిగిందని .

కానీ, మాకీ స్టాటిస్టిక్స్ వద్దు. మీరు వద్దు; అంతే.  మీరు వెళ్లి పొండి -అని నీచంగా మాట్లాడే వాళ్ళ వద్ద  ఏ  తర్క మూ పని చెయ్యదు. నిజమేమిటి - అన్నది మాకనవసరం ; మేం విడి పోతం - అంతే అన్నది కొత్త వాదన .

కొన్ని ఏళ్ళ క్రితం, కొంత మంది రాజకీయ వాదులు - పని గట్టుకుని కొంత మంది ఉద్యోగుల యిళ్ళకు వెళ్లి , మీరు, మీ ప్రాంతాలకు  వెళ్లి పొండి అని చెప్పడం  వార్తా పత్రికల్లో వచ్చింది. వారు వుద్యోగులు . మూటా, ముల్లె సర్దుకుని ఎలా వెళ్ళిపోతారు ? యిది ఎంత అమానుష కార్యమో  - అలా అడిగిన వారికి అప్పటికీ, యిప్పటికీ  అర్థం కావడం లేదు. పైగా, పత్రికల వారు అడిగితే  - మేము వాళ్ళను కొట్టామా? తిట్టామా? వెళ్ళి పొమ్మన్నాము, అంతేగా - అన్నారు. యిలా రాజ్యంగా విరుద్ధంగా,  చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఏ చర్యా లేకపోతే , వారి చర్యలు మరీ యెక్కువవుతాయి. అలాగే అయ్యింది.

ఈ మధ్య వొక T.V. చానెల్  లో, వొక తెలంగాణా రాజకీయ నాయకుడి అభిప్రాయాలు  విన్నాను. అవి మరీ ఘోరంగా వున్నాయి.

ఆయనంటారు - యిదొక ప్రత్యేక దేశంగా వున్న ప్రాంతం ..వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్, వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్.. వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్..   దురాక్రమణ చేసి ఆక్రమించుకుంది భారత దేశం ..

యిది ఎంతో మంది వినే వుంటారు. నేను ఫేస్ బుక్  లో చూసాను. విన్నాను. యిందుకా   తెలంగాణా ? ఈయనకు నిజాం పాలన కూడా ఓకే .  హైదరాబాద్ ను పాకిస్తాన్ లో చేర్చాలని చూసిన వారు కూడా పరవాలేదు కానీ భారత దేశ పాలన, సర్దార్ పటేల్ గారి కృషి ఓకే  కాదు?
సర్దార్ పటేల్ గారి కృషినంతా వెనక్కు తిప్ప గలిగే రాజకీయ భావాలు ఈ కొంత మంది రాజకీయ వాదులలో వున్నాయని - భారత దేశం లోని అందరూ గ్రహించాలి. భారత దేశపు సమైక్యతను దెబ్బ తీయ గలిగే  భావాలు కావా యివి? రాష్ట్ర సమైక్యత వొక ప్రక్క వుండ నీయండి .

చంద్ర శేఖర రావు గారు సరే సరి. ఆయన నోటి వెంట ఎప్పుడు ఎవరిపై ఏ తిట్లు వస్తాయో - బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా వెళ్లి పొమ్మంటాడో - ఎవరూ చెప్ప లేరు. తెలంగాణా ప్రజలకు నిజంగా యిటువంటి  రాజకీయ నాయకుల పాలన కావాలా? వీరు, మొదట ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఎలా అన్యాయం చెయ్యాలో అదే యోచిస్తారు. అవి చేస్తారు.  యిదే అందరి భయం. నమ్మకం. అందుకే యింత పెద్ద ఎత్తున  సమైక్య ఆంధ్ర ప్రాంత పోరాటం జరుగుతూ వున్నట్టు తెలుస్తూ వుంది. 

మున్ముందు ఢిల్లీ  పాలకులు ఏం చేస్తారో   నాకు తెలీదు కానీ -  ఏది చెయ్యాలన్నా - చాలా, చాలా ఆలోచించి  చెయ్యాలి . లేదంటే - తెలుగు వారికి మాత్రమే  కాదు. యావద్దేశానికీ  ఏదో ప్రమాదం మున్ముందు  వచ్చే  సూచనలు మాత్రం వున్నాయి.

అయితే అక్బరుద్దీన్ ఒవాయిసి - లాంటి వారినే -మన చట్టాలు ఏమీ చెయ్య లేదు . ఆయన ఏమేం మాట్లాడాడో, వొక్క సారి వికీ పెడియా లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు మన దేశంలో చట్టాలేమీ లేవా - అనిపిస్తుంది.  ఆయనా  యిక్కడే వున్నాడు . మరి తెలంగాణా వస్తే - యింకా ఏమేం మాట్లాడుతాడో, ఏమేమి చేస్తాడో?


యిది  ప్రజలు ముఖ్యంగా గ్రహించాలి . మీరు వొక్క సారి ఈ తరహా రాజకీయ వాదుల  వద్ద చిక్కుకుంటే , మళ్ళీ, వేసిన తప్పటడుగు వెనక్కు తీసుకునే అవకాశమే లేదు .

ఈ  విషయంలోనే,కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా , మరింత శ్రద్ధ చొరవ తీసుకోవాలి . ఆయన పై చెప్పిన రాజకీయ నాయకుల స్వభావాలు , వాటి వల్ల , దేశానికి వచ్చే ప్రమాదం, తేట తెల్లంగా కేంద్రానికి చెప్పాలి.  యివి దేశానికంతా కూడా తెలియాలి . అలాగే, మిగతా నాయకులు , ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా యివన్నీ పరిశీలించి కేంద్రానికి స్పష్టంగా, చెప్పాలి.

రాజకీయ నాయకులు మంచి వారైతే, మానవతా వాదులైతే , రాష్ట్ర  విభజన ,యివన్నీ పెద్ద విషయం కాదు. కానీ, యిక్కడ, అదే లోపించింది. అందరూ అని కాదు. కొంత మంది ముఖ్యమైన వారు, మహాదురుసుగా మాట్లాడుతున్న వారు పదవికెక్క గలవారు దేశానికి ప్రమాదం తెచ్చి పెట్ట గల వారే - అన్న విషయంలో నాకైతే సందేహం లేదు. 

దేవుడా - అందరి మనస్సులో, అందరి పట్లా , సుహృద్భావం నింపు . లేదంటే - ఆట కదరా శివా , ఆట కదా కేశవా - అని కేదార్నాథ్  ప్రమాదం ను గురించి పాడినట్టు పాడుకోవాల్సి వస్తుంది .

=మీ

వుప్పలధడియం విజయమోహన్





 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి