8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కలిసి వుంటేనే - కలదు సుఖం = నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే - మన అభివృద్ధి


 కలిసి వుంటేనే - కలదు సుఖం


మనం చెయ్య గలిగే పనులు ఎన్నో వున్నాయి.
మనం చెయ్య లేని వాటితో పోలిస్తే - చెయ్యగలిగేవి చాలా తక్కువ . నిజమే .
కాక పొతే ....  చెయ్య గలిగే పనులు సకాలంలో చెయ్యడం లోనే, మన సంతోషం , అభివృద్ధి -రెండూ వుంటాయి .
  •  పుట్టడం మనం చేసిన పని కాదు. మన వల్ల అయ్యే పని కూడా కాదు. ఎందుకు ఫలానా వారి కడుపున, ఫలానా , ఫలానా జాతి, కులాల్లో , ఫలానా రంగు,రూపు లతో, ఫలానా, ఫలానా జన్యు గత స్వభావాలతో, ఫలానా చోట - యిలా ఎలా  పుట్టామో మనకు తెలీదు. అది మన చేతిలో లేదు. మన తల్లిదండ్రుల చేతిలోనూ లేదు. 
  • కొంత మందికి ఎదుటి వాడి రంగు, కులం, మతం, పుట్టిన స్థలం, తేదీ కూడా నచ్చడం లేదు . నచ్చక పొతే పెద్ద బాధేం లేదు కానీ - మా వూరు విడిచి వెళ్ళిపో - అంటున్నారు. 
  • వొక సారి వొక పులి అందట - మేకా, నువ్వు త్రాగుతున్న ఎంగిలి నీరు నాకు వస్తోంది. నీ ఎంగిలి నీరు నేనెలా త్రాగను? కాబట్టి నిన్ను చంపి తినేస్తాను - అని. మేక అందట - నేను ఎంతో క్రింద వున్నాను, మీ ఎంగిలి నీరే నాకు వస్తోంది - కానీ నా ఎంగిలి నీరు మీకెలా వస్తుంది  అని! నువ్వు కాక పొతే, మీ నాన్న అయి వుంటాడు . ఏమైనా, నేను నిన్ను తినాల్సిందే -అని పులి అందట .  ఇలాంటి వాదనలకు - సమాధానాలు వుంటాయా? 
  • వెనకటికి వొకాయన - ఈ యింటి కాకి ఆ యింటిపై వాలకూడదని కోప్పడ్డాడు . కాకులేవీ ఆయన మాట వినలేదు . ఆఖరికి, కాకులేమో అన్ని ఇళ్ళపై వాలుతూనే వున్నాయి . ఆయన మాత్రం స్మశానంలో బూడిదై మాయమై పొయాడు.   ఇళ్ళూ వున్నాయి. కాకులూ వున్నాయి. వాలకూడదని చెప్పిన వాడు అన్నిటికీ దూరంగా,  బూడిద గానో, మట్టిగానో వున్నాడు. 
  • మనలో కొందరు -  యిటువంటి  వారి మాటలు విని - మేము వేరే, మీరు వేరే  అని కొట్లాడుకుంటున్నాము. పోతన వరంగల్ జిల్లాలో పుట్టాడు. శ్రీనాథుడు  కోస్తా ప్రాంతం వాడు. వారు బావా మరుదులు గా - యిద్దరూ గొప్ప కవులుగా వుండడం మనకు తెలీదా? ఎప్పుడు మనం వేరయ్యాము? అప్పట్లో రాయల సీమ, తెలంగాణా , కోస్తా అన్న   పేర్లే లేవు . అందరూ తెలుగు వారే . మరి, ఈ విభేదాలు ఎప్పుడు వచ్చాయి? ఇరాన్ నుండి, అరేబియా నుండి వచ్చిన తురుష్క ప్రభువుల నుండి వచ్చింది. వాళ్ళు గుళ్ళూ కొట్టారు. గోపురాలూ కొట్టారు.  మాతృదేవోభవ అనే మన సంస్కృతిని  కూడా కొట్టారు. వారు మధ్యలో వచ్చారు. మధ్యలో పొయ్యారు. 
  • యిప్పుడున్న తురుష్క రాజ సంతతి వారు కూడా తురుష్క దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారే తప్ప , తెలంగాణా వారితో కాదు ; కోస్తా వారితో కాదు. అసలు భారదేశ వాసులతోనే కాదు. వారికి లేని తీట మనకొచ్చింది.   మన దేశం తోనే పెద్దగా సంబంధాలు యిష్ట పడని  వారు పెట్టిన పేరు మనకు శాశ్వతం అనుకుంటున్నాము. 
  • అంతకు ముందు రాముడు తిరిగిన ప్రాంతం మనది. అది మనకు గుర్తు లేదు. విజయనగర రాజులు, వోరుగల్లు రాజులు మరెంతో మంది రాజులు రెండు ప్రాంతాలనూ చేర్చి పాలించ లేదా ? అదెందుకు  మనకు గుర్తు రాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్దార్ పటేల్ గారు మళ్ళీ కలిపాడు మనల్ని. లేదంటే, మనలో వొక పాకిస్తాన్ పుట్టి  వుండేది. యిప్పుడు పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు వున్నాయో మనం చూస్తూనే వున్నాం కదా.  అది మనకు కావాలా?  అందునా తెలుగు వాళ్లకు అది కావాలా?
  •  మొన్నొకాయన టీవీ చానల్ లోనే అన్నాడు - మేము ఇండియన్స్ కాము..కాము..కాము. భారత దేశం దురాక్రమణ చేసి మమ్మల్ని తనలో కలిపింది - ఇలా ఎన్నో అన్నాడు. ఇలాంటి వాళ్ళా మనకు నాయకులు?   వీరి మాటా మనం వినేది ? మనకు - కలిపిన వాళ్ళెవరూ గుర్తు రారెందుకు? విడదీసిన వాడు మాత్రం గుర్తున్నాడు. వాడేదో మనకు గొప్ప ఉపకారం చేసినట్టు! అతను కూడా - ఏదో వొక పేరు పెట్టాడు -వొక ప్రాంతానికి - అంటే కాని , మనం విడి పోవాలని ఎప్పుడూ చెప్పలా. మనం వేరే, వేరే - అని కూడా చెప్పలా.
  • పోతన్న, శ్రీనాథుడు బావ మరుదులైతే - మనం వేరే ఎలా అవుతాము. గోపన్న, పోతన్న, తిక్కన్న, వేమన అందరూ - మన వారు కాదా? ఎవడో వొక విదేశీయుడు కొన్నాళ్ళు రాజ్యమేలితే -మీరు వేరు, మేము వేరా - మనం మనం కామా ? ఇదెక్కడి పిచ్చి?
  • వొక్క పోతన, శ్రీనాథుడు మాత్రమే కాదు ,ఎంతో మంది తెలుగు వారు అన్ని ప్రాంతాలకూ వెళ్ళారు, వచ్చారు
  • మొదట మనకు కర్నూల్ రాజధాని అయ్యింది. రాజధాని అక్కడే వుండి  వుంటే - ఈ విభజనా గట్రా ఆలోచనలు వచ్చేవి కావేమో.  ఆ తరువాత హైదరాబాద్ రాజధాని అయ్యింది . తరువాత మన రాష్ట్రంలో అక్కడ మాత్రమే విపరీతమైన అభివృద్ధి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ  లేనంత అభివృద్ధి అక్కడే, మనమంతా  చేరి తీసుకు వచ్చాం. 
  • ఆ తరువాత -మద్రాసు నుండి సినిమా పరిశ్రమ అంతా - హైదరాబాద్ కే తరలి వచ్చింది. అప్పుడెవరూ - మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళు లేరు. రచయితలు, కళాకారులు, సైంటిస్టులు , పారిశ్రామికులు - అందరూ - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చారు. అప్పుడు కూడా మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళెవరూ లేరు. 
  • ఈ కాలంలో - భార్యాభర్తల మధ్య కూడా చాలా సులభంగా చిచ్చు పెట్టే వారున్నారు. అమ్మా, మీ వారిని ఏదో హోటల్లో చూసాను, మరో అమ్మాయితో కూర్చొని వున్నారు - అంటే చాలు. అన్న వాడు  తెలియనివాడైనా ఫరవాలేదు. ఆమె యింట్లో - ఆ రోజు రామ రావణ యుద్ధమే. 
  • అలాగే, మీ యింట్లో, మీ ఆవిడ ఎవరితోనో కూర్చొని మాట్లాడుతూ వుందండీ.. మరేమో .. అని చెప్పారనుకోండి. ఆయన యింట్లో మహా  భారత యుద్ధమే. పెళ్ళాం  పైన,మొగుడి పైన వున్న నమ్మకం కన్నా మనలో చాలా మందికి -  ముక్కు, మొహం తెలియని వాళ్ళు చెప్పే పితూరిలపై వుంటుంది. యిది మనకున్న పెద్ద బలహీనత . 
  •  మరి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం వొక లెక్కా? అది ఎంతో సులభం గా మారి పోయింది . అదో, వారి వలన "మనం" నష్టపోయాం - అంటే చాలు. అనుమానాలు, విరోధాలు వెంటనే వచ్చేస్తాయి . మంచి నాయకుడు లేకపోతే - యింకా త్వరగా వచ్చేస్తాయి . సరే ; అయ్యా - మీరేమీ నష్ట పోలేదు -యిదుగో, గణాంకాలు - మీరే చూడండి అంటే - ఈ  గణాంకాలు - చేసిన వాడేదో కుట్ర చేసాడు - మీతో కలిసి . మేము నమ్మం గాక నమ్మం. మరి దీనికి జవాబు ఎక్కడ తెస్తాం . మరో సారి గణాంకాలు తెమ్మందాం -అంటే; వొద్దు; మొత్తానికి, మీకూ, మాకూ పొత్తు కుదరదు -అని రిప్లై . అసలు, ఏ తర్కానికీ లొంగని ఈ తర్కం ప్రకారం రాష్ట్ర ప్రజలు  విడపోదామంటే - ఎంత అవాంఛనీయం 
  • అయితే - పాలక వర్గంలో - కొన్ని రకాల అవాంచనీయ పరిస్థితులు  వచ్చాయనే చెప్పుకొవాలి. మా కులం, మాకులం అన్న పక్షపాతాలు ఎక్కువయ్యాయి. మన రాష్ట్రాభివృద్ధి, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా  చాలా, చాలా, కుంటు పడిందనే చెప్పుకొవాలి. యిది అన్ని ప్రాంతాలకూ చెందినదే.  కానీ, యిది మనం ఎన్నుకున్న నాయకత్వ లోపమే. చూడబోతే - మంత్రివర్గంలో - అన్ని ప్రాంతాల నాయకులూ - ఎప్పుడూ వున్నారు . ఏ ప్రాంతం అభివృద్ధి చెందక పోయినా - ఆ ప్రాంతపు  నాయకులే కారణం -మరెవరో కాదు .
  • నిజానికి -  మనకున్న  వనరులకు - మనం, గుజరాత్ కంటే కూడా బాగా అభివృద్ధి చెందవచ్చు . కానీ చెంద లేదు. గోదావరి, కృష్ణ  నదుల నీళ్ళు  ప్రతి జిల్లా కూ  ఎందుకు అందటం లేదు - ఈ రోజు వరకూ ? ఆదిలాబాద్ నుండి , చిత్తూర్  జిల్లా వరకు  కాలువలు త్రవ్వి త్రాగు నీరు, పంట నీరు రెండూ, కల్పించి  వుండ వచ్చు. కావాల్సినంత విద్యుత్తు  ఉత్పాదన చేసి వుండ వచ్చు.  ఎన్నో రకాలుగా,ఉద్యోగ, వృత్తి అవకాశాలు కల్పించి వుండ వచ్చు . యిప్పుడు చేస్తే కూడా - వచ్చే 5 సంవత్సరాలలో - యివన్నీ చెయ్య వచ్చు . 
  • యిప్పుడు  వస్తున్న ఉద్యమాలు కూడా - ఈ పరిస్థితికి ప్రతికూలంగా  వచ్చినవా - అన్న అనుమానం వుంది .
  • ఏది ఏమైనా , మనమంతా కలిసి పనిచేస్తేనే , కులాలకతీతంగా,  మంచి నాయకులను ఎన్నుకుంటేనే - మనం బాగుపడతాం .
  • నా ఉద్దేశంలో - కలిసి వుంటేనే - కలదు సుఖం. అలాగే, నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే -  మన అభివృద్ధి .అలా ఎన్నుకోలేక పోతే  ఏ అభివృద్ధీ వుండ బోదు. 
  •  వెనకటికి , వొక సామెత చెప్పే వారు - తొందర పడి , తాతాచార్యులు, మతం మార్చుకున్నాడట . ఆ తరువాత, ఆ మతం లోని నియమాలు, సమస్యలు  తెలిసిన వెంటనే, మళ్ళీ మొదటికొచ్చేసాడట.
  • మరో సామెత - ఏదో చెయ్యబోతే , పెద్ద ముక్కు రాలేదు కానీ ; వున్న ముక్కు ఊడి పోయిందట  
  • అలా అయిపోతుంది పరిస్థితి .  ప్రజలంతా యోచన చెయ్యాలి. 
  • సర్వే జనాః సుఖినోభవంతు
  • =మీ 
  • వుప్పలధడియం  విజయమోహన్   

7 కామెంట్‌లు:

  1. మరి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి అన్నాక కూడా కలిసి వుండటం సాధ్యమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనం వొక మినిస్టరు గారి మాటకో, మరో పార్టీ నాయకుడి మాటకో పరిమితం అయిపోతే - వారి మాటలతో విడి పోతే - మనకే ప్రమాదం. మన రాష్ట్రంలో - నాయకత్వ లోపం చాలా వుంది. మీరు ఏ జిల్లా కు వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా - అతి కొద్ది మంది వ్యక్తులే అర్థ బలం లోనూ,అంగ బలం లోనూ ప్రముఖులుగా వుండడం చూడొచ్చు. మరెవరూ - రాజకీయ రంగం లో ముందుకు రాలేక పోతున్నారు. అనేక పార్టీలలో, వొకే కుటుంబం వారు వుండడం, ఏ పార్టీ వచ్చినా, పదవి అదే కుటుంబంలో వుండడం మనం చూడొచ్చు. వెనుక బడడం అనేది - అన్ని ప్రాంతాలలోనూ అందువల్లనే జరిగింది. కలిసి కట్టుగా బుద్ధిబలంతో పోరాడితేనే, అభివృద్ధి సాధ్యమవుతుంది. మా జిల్లాలో - కర్నాటక నుండి ముందు వస్తున్న నీళ్ళు ఎప్పుడో నిలిచి పోయాయి. నాయకులకదేమీ పట్ట లేదు. అది అడిగిన వాడు లేదు. సరే. గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలోనే వున్నా, అవి ఇక్కడికి రావాలని ప్రయత్నం చెయ్యలేదు ఇప్పుడేమో రాయలసీమ కూడా ప్రత్యేక రాష్ట్రం అవ్వాలని గోల పెడుతున్నారు. అలా అనే వారికి మన అసలు సమస్యలు ముఖ్యం కావు. ప్రజలు ముఖ్యం కాదు. పదవులే ముఖ్యం . వొకరిద్దరు మంచి నాయకులూ వచ్చారు. మనలను వొకే త్రాటిపై నడిపించి, మనలో పగలు, విద్వేషాలు రగిలించక, ఆత్మ శక్తిని , ఐక్యతను పెంపొందించే నాయకుడు వస్తే - 5 సంవత్సరాలలో ,రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలు గుజరాత్ కంటే - బాగా అభివృద్ధి చెందగలవని నాకు నమ్మకం వుంది .

      తొలగించండి
    2. రవికాంత్,
      నీ ప్రశ్న నాకు చాలా నచ్చింది. అందులో పౌరుషం ఉంది. కానీ ఆ అన్న పెద్దమనిషి యే పార్టీ వాడో ఆ పార్టీ సాయం తోనే, ఆ పార్టీని బతిమిలాడుకుని విడిపోవాలనుకోవటం యేంటి అసహ్యంగా. యెటు తిరిగీ అంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చేసినా ఇప్పుడు తెచ్చుకున్నది కేవలం ప్రకటనే. మామూలుగా అందరితో సయోధ్యగా ఉండి మాకోరికలో న్యాయముందని ఒప్పించి అసెంబ్లీ నుంచి పైకి ప్రతిపాదన వళ్ళే పధ్ధతి లో ఐతే ఒకేసారి వోటింగ్ తో సరిపోయేది. కానీ యాభయ్యేళ్ళ నుంచీ మీరు నీళ్ళు ఉద్యోగాల విషయం లో జరిగినయ్యని చెప్తున్న అన్యాయాలకీ 1956 లో మీకు ఇష్టం లేకపోయినా మిమల్ని కలుపుకోవడానికి చెసిన పెద్దమనుషుల ఒప్పందాన్ని బుట్ట దాఖలా చెసిన పార్టీ సాయాన్నే తీసుకుని మీరు సాధించబోయేదమిటి. ఇప్పుడు ఈ రకమైన విభజన ప్రతిపాదన పైనుంచి వొచ్చే పధ్ధతి లో రెండు సభల్లో వోటింగు జరుగుతుంది. రేపటి గురించి అలోచించకుండా కేవలం ప్రకటన తోనే అంతా అయిపోతుందనే ధైర్యమో యేమో గానీ "కాంగ్రెసోళ్ళు" అని అనాల్సిన చోట "ఆంధ్రోళ్ళు" అనె పేరుతో కాంగ్రెసోళ్ళని తప్ప అందర్నీ బండబూతులు తిత్ట్టి ఉన్నారు మీ నాయకులు. రేపు వోటింగు జరిగేటప్పుడు ఆ తిత్ల సెగ తగిలిన వాళ్ళు విడిపోవటానికి మీకు మనస్పూర్తిగా సహకరిస్తారని యెలా అనుకుంటున్నావు. అక్కద కూడా వాళ్ళ సాయం లేకుండా కేంద్రం ద్వారా జరిపించుకునే వీలు లేదు కదా. అలోచించు.నోరు మంచిదైతే వూరు మంచిదౌతుంది. నోరు మంచిది కాకపొతే సిధ్ధాన్నం కూదా మట్టి పాలవుతుంది.

      తొలగించండి
    3. నేను చెప్పేది అదే, ఎన్నికల కోసం తెలంగాణాకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఇంకో విధంగా మాట్లాడే నాయకులూ 2 రాష్ట్రాలు వున్నా ఒక రాష్ట్రం వున్నా ఎవరికీ ఉపయోగపడే పనులు చెయరు. వారి స్వార్ధం వారిది. న్యాయంగ అభివ్రుది చేసే నాయకులూ లేనపుడు చిన్న రాష్ట్రాల ఒకే ఒక ఉపయోగం ఏమిటి అంటే నాయకుల అకౌంటబిలిటీ. అప్పుడు ఎదుటి వారిని సాకుగా చూపటం కుదరదు

      తొలగించండి
    4. ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు.సైధాంతికంగా విడిపోవటానికి నేను వ్యతిరేకిని కాడు. నేను బ్లాగుల్ని చూడటమూ, నా భావాల్ని చెప్పదల్చుకున్న చోట చెప్పటమూ మొదలు పెట్టిన మొదటి రోజుల్లోనే ఆల్ ద బెస్ట్ చెప్పాను తెలంగాణా గుండెఘోష దగ్గిర. ఇప్పటి నా కామెంటు లోని విషయం అది కాదు గదా. మీకు జరిగిన అన్యాయాలకి కారణమైన కాంగ్రెసుని, అదీ నీకు యే మాటకైతే కోపం వొచ్చిందో ఆ మాట అన్న వాడికి చెందిన పార్టీ సాయం తో మీరు తెచ్చుకున్నది కేవలం ప్రకటన మాత్రమే కదా.మిగతా వాళ్ళనెందుకు తూలనాడటం అని నేనంటున్నది.ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం చేస్తున్న వాళ్ళెవరూ దుర్మార్గమైన ఊహల్తో ఉన్న రాజకీయ నాయకులు కారు. అది తెలుసా? వాళ్ళు భయపడుతున్నది నిన్నటి వరకూ మీరు మాట్లాడిన ఉద్రేకపు మాటల వల్లనె.అవునా కాదా? ఇప్పుడు మీరు ప్రసన్నంగా మాట్లాడి వారిలో ఉన్న భయాల్ని పోగొట్టదం ద్వారానే విభజన ప్రక్రియ కూడా ప్రశాంతంగా అన్ని దశల్నీ దాటుకుని మీ కోరికని నెరవేరుస్తుంద్.లేని పక్షం లో రెండు సభల్లో జరిగే వొటింగుల్లో యెక్కడైనా వీగిపోవచ్చు కదా. కికురె ఆ మాటనే తన సొంత మనుషుల్తో అన్నట్టుగా పత్రికల్లో రానే వొచ్చింది.ఇలాంటి పరిష్తితుల్లో ఇంకా నిన్నటి వేడినే మాటల్లో చూపించకుండా కొంత దిగి రండి. సీమాంధ్ర ఉద్రేకాల్ని చల్లబర్చే చందనం మీ దగ్గిరే ఉంది. ఇప్పుడు నా కామెంటు వెనక ఉన్న అర్ధం యేమిటో తెలిసిందా?

      తొలగించండి
  2. "మొదట మనకు కర్నూల్ రాజధాని అయ్యింది"

    మదరాసు మనదే అని చేసిన ప్రయత్నం ఫలించి ఉంటె, తెలంగాణా వారికి ఈ సుత్తి తప్పేది.

    "అలాగే, నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే - మన అభివృద్ధి"

    ఆంధ్రలో టంగుటూరి ప్రకాశం & బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. తెన్నేటి విశ్వనాధం, గౌతు లచ్చన్న లాంటి మహామహులు మంత్రులగా ఉన్నారు.

    ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, వందేమాతరం రామచంద్రరావు, వావివాల గోపాలకృష్ణయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాకాని వెంకటరత్నం, పరకాల శేషావతారం, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి ఎందరో మహనీయులు వివిధ పదవులలో ఉన్నారు.

    రాజకీయ నాయకులు మంచి వారయినంత మాత్రాన సమస్యలు సమిసిపొవని చెప్పడానికి పై ఉదాహరణలు చాలు. వ్యవస్తా పరమయిన లోపాలను సరిదిద్దుకోవడానికి చేసిన అనేక ప్రక్రియలు (ఉ. భూసంస్కరణలు) చేసాము. అల్లాంటిదే మరో ప్రక్రియ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు (వేర్పాటు కాదు).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనసుల్లో సుహృద్భావం వుంటే - ఏ రాష్ట్రమైనా, పాలనా సౌలభ్యం కోసం 4 రాష్ట్రాలయినా ఏమీ తప్పు లేదు. కానీ, "నోరు తెరిస్తే - బూతులే, తిట్లే" వచ్చే కొంత మంది నాయకులను నమ్మడం చాలా తప్పు అని నా నమ్మకం. మరో నాయకుడు మేము ఇండియన్స్ కాదు..కాదు..కాదు. అని TV చానెల్ ముందే చెప్పాడు. మరి భవిషత్తులో, ఆయన పదవి కొస్తే - ఏం చేస్తాడో ఎలా చెప్పడం? యిది వరకు వచ్చిన నాయకుల అసమర్థత వలన రాష్ట్రంలోని, ఎన్నో ప్రాంతాలలో - త్రాగు నీటి సౌకర్యం కూడా లేకుండా వుంది. యిప్పుడు మన దేశంలోని మానసిక తత్త్వం ఎలా వుందంటే - మా రాష్ట్రం గాలి మాదే; మా రాష్ట్రం నీళ్ళు మాదే - అనే రకంగా వుంది. నీళ్ళు నిలిపెయ్యడం మొదటి పని. వీలైతే గాలి కూడా నిలిపేసే విశాల హృదయాలు వున్నాయి. నెహ్రు తర్వాత - ఎవ్వరూ, దేశం అంతా వొక్కటే - మనమంతా వొక్కటే -అనే భావన కలుగ జెయ్య లేదు . విభజించి ,పాలించు -అనే చేశారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే - 5 సంవత్సరాలలో - అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చెయ్యొచ్చు.
      లేదంటే - "మనకెందుకు లేదంటే,అదిగో, వాడి వలెనే" -అని సాకులు చెబుతూ వుంటారు. రేపేం నిర్ణయం వస్తుందో నాకు తెలీదు కానీ - సర్వే జనాః సుఖినో భవంతు -అన్న భావన మనలో వుంటే - ఏ నిర్ణయం వచ్చినా బాధ లేదు .

      తొలగించండి