బ్రహ్మమంటే ఏమిటి?
నీరుల్లి (ఎర్రటి) గడ్డ - పొరలు పొరలు గా వుంటుంది కదా. అందులోని పొరలను వొకదాని తర్వాత వొకటి, పైనుండి లోపలికి వలుస్తూ పోతే, చిట్ట చివర ఏం మిగుల్తుంది?
ఏమీ మిగలదు. అంతా పొరలే . కానీ - లోపల శూన్యమే.
బ్రహ్మమంటే కూడా - దాదాపు అంతే.
ప్రపంచమంతటా - బ్రహ్మం వుంది. బ్రహ్మమే వుంది. బ్రహ్మం తప్ప మరేమీ లేదు. అయినా , అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు.
ఈ బ్రహం యొక్క స్వరూపం ఏమిటి ?
బ్రహ్మం = సత్యం = జ్ఞానం = అనంతం
యిది ఉపనిషత్తులు యిచ్చిన డెఫనిషన్.
బ్రహ్మం అంటే సత్యం. సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే అనంతం.
అంటే - ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ వొకటే.
అదెలా? సత్యమంటే నిజం కదా. జ్ఞానమంటే తెలివి తో ఆర్జించే బుద్ధి సంపద కదా. అనంతం అంటే మరేదో ఆకాశ మంత పెద్దది అని కదా. యిలా, మన మనస్సులో చాలా సందేహాలు సాధారణంగా వస్తాయి.
మీకు తెలుసా - యిలా వచ్చే మన సందేహాలు -అన్నిటికీ మన ఉపనిషత్తులలో సమాధానాలు వున్నాయి.
కాక పోతే - యిప్పుడు ఈ విజ్ఞానంపై చాలినంత ఆసక్తి వున్న వారు చాలా తక్కువ. సంస్కృతం తెలిసిన వారు చాలా తక్కువ.
వీటిని - జన సామాన్యానికి అందించాలన్న తపన వున్న వారు అంతకంటే తక్కువ. అందువలన - యిదేదో - అంటరాని పదార్ధం అయి కూర్చుంది.
నిజానికి - కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో కూడా - ఈ వేదాంత సారం గ్రహించాలంటే - ఎక్కడో, అరణ్యాలలో, అది తెలిసిన ఋషుల దగ్గరికి వెళ్ళాలి. ఆ ఋషులు, యివి చెప్పాలంటే - వెయ్యి షరతులు పెడతారు. ఆ షరతులకు వొప్పుకున్న వాడికే, వేదాంత సారం, బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత వస్తుంది.
కొన్ని ఉపనిషత్తులు చదివితే - ఆ ఋషులు పెట్టే షరతులు నిజంగా కావాల్సినవే - అని మనకూ తెలిసొస్తుంది. ఆ షరతులకు వొప్పుకునే వాడు - మనలో, కోటికి వొక్కడున్నా - చాలా, చాలా ఎక్కువే.
మనకు లోకం లో ఎన్నో కావాలి. అవన్నీ వద్దనిపిస్తే - అప్పుడు బ్రహ్మజ్ఞానం.
అప్పుడు బ్రహ్మ జ్ఞానం మాత్రం ఎందుకు ?
అన్ని రకాల అందాలు, ఆనందాలు, సుఖాలు వదిలేసి - బ్రహ్మ జ్ఞానం వద్దకు పరుగు తీయడం ఎందుకు?
సినిమాలు వద్దు. టీ .వీ లు వద్దు. సెల్ ఫోన్లు వద్దు. కాఫీలు, టిఫిన్లు వద్దు. మంచి బట్టలు వద్దు, పెళ్ళీ పెటాకులు వద్దు - అసలేమీ వద్దు? అటువంటి బ్రహ్మ జ్ఞానం మనకెందుకు?
అన్ని రకాల అందాలు, ఆనందాలు, సుఖాలు వదిలేసి - బ్రహ్మ జ్ఞానం వద్దకు పరుగు తీయడం ఎందుకు?
సినిమాలు వద్దు. టీ .వీ లు వద్దు. సెల్ ఫోన్లు వద్దు. కాఫీలు, టిఫిన్లు వద్దు. మంచి బట్టలు వద్దు, పెళ్ళీ పెటాకులు వద్దు - అసలేమీ వద్దు? అటువంటి బ్రహ్మ జ్ఞానం మనకెందుకు?
అవును. ఎందుకు? ఏదో, ఈజీ గా వస్తే, అదికూడా ఓకే . కానీ అన్నీ వదిలేసి, అది ఎందుకు?
ఎందుకు? ఎందుకు? ఎందుకు?
అదండీ ప్రశ్న .
దీనికి ఉపనిషత్తుల సమాధానం ఏమిటి?
తై త్తరీయంలో వొక చిన్న వివరణ వుంది చూద్దాం.
బాగా బలవంతుడైన , ఆరోగ్య వంతుడైన , యౌవన వంతుడైన, అందగాడైన , సర్వ సంపదలతో కూడిన వొక రాజ కుమారుడు ఉన్నాడనుకొందాం. ప్రపంచంలో అతనికి ఎక్కడా ఎదురు లేదు. అతడికి కావాల్సిన సర్వ సుఖాలు వున్నాయనుకొందాం. అందమైన, ప్రేమించే భార్య - యిలా అందరూ.
యిప్పుడు - ఈ రాజకుమారుని ఆనందానికి లోటు లేదు. అతడి ఆనందం - వొక యూనిట్ అనుకొందాం. యిది నేను చెప్పింది కాదుః తై త్తరీయం చెప్పిందే.
యిట్లాటి మనుష్యానందాలు నూరు రెట్లైతే - వొక మనుష్య గంధర్వుడి ఆనందానికి సమం.
వొక మనుష్య గంధర్వుడి ఆనందం వంద రెట్లైతే - వొక దేవగంధర్వుడి ఆనందానికి సమం.
దేవ గంధర్వుడి ఆనందం వంద రెట్లైతే - చిరకాల (బ్రహ్మ) లోక వాసుడగు వొక్క పితృ దేవత ఆనందానికి సమం.
చిరకాల (బ్రహ్మ) లోక వాసుడగు వొక్క పితృ దేవత ఆనందం వంద రెట్లైతే - అజానజుడనే దేవత యొక్క , వొక్క ఆనందానికి సరి అవుతుంది
వొక్క అజానజుడనే దేవత ఆనందం వంద రెట్లైతే - వొక్క కర్మ దేవత ఆనందానికి సమం.
అలాగే కర్మ దేవత అనందం వంద రెట్లైతే - వొక్క దేవత ఆనందానికి సమం.
వొక్క దేవత అనందం వంద రెట్లైతే - యింద్రుని ఆనందానికి సమం.
యింద్రుని ఆనందం వంద రెట్లైతే - బృహస్పతి ఆనందానికి సమం.
బృహస్పతి ఆనందం వంద రెట్లైతే - ప్రజాపతి ఆనందానికి సమం.
ప్రజాపతి ఆనందం వంద రెట్లైతే - హిరణ్య గర్భుని ఆనందానికి సమం.
వొక కామ రహితుడైన బ్రహ్మ జ్ఞాని - అటువంటి గొప్ప హిరణ్య గర్భుని ఆనందం కూడా సాధారణంగా, నిరంతరాయంగా పొందుతాడు.
ఇక్కడేదో వంద రెట్లు - అంటూ చెప్పారు కానీ - బ్రహ్మ జ్ఞాని ఆనందం, అనంతం - అసలు ఎల్ల లేనిది, అనే చెప్పారు..
సరే. యిప్పుడు మనకు అది కావాలా, వద్దా - అన్నది మనమే నిర్ణ యించుకోవాలి.
కావాలి. వూరికే యిస్తే కావాలి. కానీ- వూరికే యివ్వరు కదా .
మరి, అందుకేం కావాలి మనకు?
గురువు కావాలి మనకు. గురువు మనకు యిది చెప్పాలంటే - మనకు 4 అర్హతలు కావాలి.
1. వైరాగ్యము 2. వివేకము. 3. శమ,దమ, ఉపరతి, తితిక్ష ,శ్రద్ధ, సమాధానం అనే ఆరు సంపదలు 4.ముముక్షత్వం . యివి ఏమిటి అన్నది పెద్ద చర్చనీయాంశం. అది మరో సారి చూద్దాం.
యివి నాలుగూ మీలో ఉన్నాయా? - అని మీ గురువు మిమ్మల్ని పరీక్ష చేసి గానీ మీకు బ్రహ్మ జ్ఞానం బోధించడు.
వొకానొక బ్రహ్మజ్ఞాని అయిన గురువు, తన దగ్గరకు వచ్చిన గొప్ప ఋషులను, సంవత్సరం పాటు పరీక్ష చేసి గానీ, బ్రహ్మ జ్ఞానం బోధించ లేదు.
వరుణుడు తన కొడుకైన భ్రుగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి - బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.
మీరు షావోలిన్ లో కుంగ్ ఫూ నేర్చుకోవడానికంటే - హార్వర్డ్ యునివర్సిటీ లో చేరడానికంటే - ఈ బ్రహ్మ జ్ఞానం కాలేజీలో చేరడానికి - అర్హతలు ఎక్కువ కావాలి.
సరే. చేరితే - ఎన్ని ఏళ్ళు పడుతుంది - ఈ జ్ఞానం రావడానికి?
చెప్పలేం.
వొక్క క్షణం లో కూడా రావొచ్చు. వొక్క రోజులో రావొచ్చు. వొక్క సంవత్సరంలో రావొచ్చు. వొక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలూ పట్టొచ్చు.
యిదేం అంత పెద్ద బ్రహ్మ విద్యా? అవును - యిదే బ్రహ్మ విద్య.
మీకు బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు.
మారడమూ కాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మం గానే వున్నారు - అని తెలుసుకొంటారు.
కానీ - మీలో వున్న అజ్ఞానపు, మాయ పొరల వల్ల, మీరు ప్రకృతి మాయలో పడి, ఈ మనుష్యానందాల్లో కొట్టు మిట్టాడుతున్నారు.
ఈ "మన " ఆనందాలు చాలా స్వల్పం; క్షణికం. కానీ, బ్రహ్మానందం ఏ పొగడ్తకూ అందనంత గొప్పది; నిరంతరం అయినది
మన ఈ ఆనందాలు చాలా తక్కువ ఆనందం యిచ్చేవి; తరువాత అవే - కష్టాలుగా కూడా మారిపోతాయి. బ్రహ్మానందంలో మరి కష్టాలు లేవు గాక లేవు.
మన ఆనందాలకన్నింటికి మూడు (ఆవ)లక్షణాలు వున్నాయి.
(1) యివన్నీ వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోతాయి. మీతో వుండవు. మీరుపోయే చోటికి అవి రావు. మీరు వాటిని, మీవి అనుకోవచ్చు కానీ - అవేవీ - అవి మీవి అని అనుకోవు. మీ ఇల్లు మీతో బాటు రాదు; తను మీది అని అనుకోదు. మీ భార్య కూడా - తను మీది అనుకోదు. మీరు తన వాడు అనుకుంటుంది.
(2) యివి - పూర్తి ఆనందంగా ఎప్పుడూ వుండవు. వచ్చేటప్పుడు, కూడా, వొక దుహ్ఖపు సంచిని తమతో బాటు తెచ్చుకుంటాయి. దుహ్ఖపు పాలు - పోను,పోను ఎక్కువవుతుంది. మీరు ఇల్లు కొన్నారు. ఆ రోజు బాగుంది. కొనడానికి కష్ట పడాలి. యింటిని శుభ్రంగా పెట్టుకోవడానికి కష్ట పడాలి. మీరు ఎంత కష్ట పడ్డా- అది మీరు వుం డమన్నట్టు గా మాత్రం వుండదు. ఎక్కడో, ఏదో, చెడిపోతూ వుంటుంది. కష్ట సుఖాలు కలిసే వస్తాయి. వొక్కో సారి వోక్కోటి దర్శనమిస్తుంది. అంతే. అందమైన, ఆరోగ్యవంతమైన, యౌవన వతి అయిన భార్య అలాగే వుండి పోతుందా? వుండదు. ఆవిడకూ రోగాలు వస్తాయి.అందమూ పోతుంది. యౌవనమూ పోతుంది. వొక వేళ, ఆవిడ ఏమీ మారక - అలాగే వుందనుకోండి. కానీ మీరు మారుతారు. అప్పుడూ మీకు చాలా పెద్ద సమస్యే కదా.
(3) ఆనందం ఏది వచ్చినా - అది మీకు వొక "బంధం" గా కూడా మారుతుంది. ప్రతి వొక్కటీ మీలో వొక అలవాటు సృష్టిస్తుంది. మీరు తాగే కాఫీ వొక అలవాటు. మీ భార్య మీకు వొక అలవాటు. ఆమెకు మీరు వొక అలవాటు. సిగరెట్టూ, మత్తు పానీయాలూ -అయితే మరీ ఘోరం. వాటిని వదిలించుకోవడం కష్టం.-అంటే అవి మీకు అలవాటు మాత్రమే కాదు. వాటికి మీరూ అలవాటే. అవి మిమ్మల్ని వదిలిపెట్టవు.
యిలా మూడు రకాల అవగుణాలున్నాయి ప్రతి ఆనందానికీ .
మొదటిది - వస్తాయి,పోతాయి. ఏదీ శాశ్వతం కాదు.
రెండోది - వచ్చేటప్పుడే , కష్టాన్నీ మూటగా కట్టుకునే వస్తాయి.అది లేకుండా వచ్చే సుఖమే లేదు.
మూడోది - మిమ్మల్ని, తనకు బందీగా చేసుకుంటుంది. మీకు రకరకాల బంధాలు కలుగ చేస్తుంది.
ఎంత గొప్ప మనుష్యానందమైనా - ఏదీ, ఈ మూడు అవగుణాలు లేనిది ప్రపంచం లో లేదు.
బ్రహ్మానందానికి -ఏ అవగుణమూ లేదు. అందుకనే దాన్ని - సత్యం .జ్ఞానం, అనంతం అన్నారు.
సరే. దీన్ని నేర్పగలిగే గురువు ఎక్కడున్నాడో మనకు తెలీదాయె. ఇప్పుడెలా?
మీరు కొన్ని పనులు చేస్తూ పోతే - మీ గురువే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా రావచ్చు.
ముఖ్యంగా - బ్రహ్మ జ్ఞానానికి - వొక అర్హత ఏదంటే - ప్రతి వొక్కరి లోనూ - మిమ్మల్ని మీరు చూడగలరా.మీలో, ఆ ప్రతి వొక్కర్ని చూడగలరా.
అంటే - సర్వ మానవ సమానత్వం.
చుట్టూ వున్న వారందరూ మీ వారే - నిజానికి మీరే అన్న భావన మీలో కలగాలి.
మీరు మీకు ఏమేం చేసుకుంటారో, అవన్నీ మీ చుట్టూ వున్న వారికి చెయ్య గలరా.
యిది లేకుండా - బ్రహ్మ జ్ఞానం లేదు గాక లేదు.
కేవలం మానవులే కాదు - పశు,పక్ష్యాదులలో కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి..
- అన్నిటినీ విడిచి పెట్టేసెయ్యడం వైరాగ్యం అనుకోవాల్సిన పని లేదు. అన్నిటినీ - నాలాగే చూసుకుంటాననడం కూడా వైరాగ్యమే
"అన్నీ -నాదే" అని కాదు.
"అన్నీ నేనే".- అన్న మాట
నిజానికి, మనలో ఎక్కడో ఈ భావన కదిలి - మన వారు కాని వారికి - మన జాతి వారు కాని వారికి, అసలెవరూ లేని వారికి - మనం సహాయం చేస్తే - మనలో - ఆ బ్రహ్మము - కొద్దిగా కదులుతుంది.
అలాంటి సందర్భాల్లో బ్రహ్మజ్ఞానం తాలూకు వాసనలు మనలో వెల్లి విరుస్తాయి.
మామూలు సుఖాలలో లేని - ఆ ఆనందం అనుభవించండి.
నన్ను ముట్టుకోకు, నన్నుముట్టుకోకు - అనే వారికి - యిది ఎన్న జన్మలైనా కావొచ్చు.
యిదే ఆది శంకరాచార్యులూ చెప్పారు. అదీ మహా శివుడి సందేశంగా చెప్పారు .
రమణ మహర్షి, రామకృష్ణులు, గాంధీ గారు - యిదే సందేశం తమ జీవితాల ద్వారా చెప్పారు. రమణుల వారి జీవితంలో - ఈ సర్వ మానవ సమానత్వం ఎంతగా పాటించారో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. రామ కృష్ణులూ అంతే. గాంధీ గారు కూడా అంతే.
రమణ మహర్షి, రామకృష్ణులు, గాంధీ గారు - యిదే సందేశం తమ జీవితాల ద్వారా చెప్పారు. రమణుల వారి జీవితంలో - ఈ సర్వ మానవ సమానత్వం ఎంతగా పాటించారో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. రామ కృష్ణులూ అంతే. గాంధీ గారు కూడా అంతే.
మీ మొట్ట మొదటి ప్రయత్నంగా - నెలలో వొక రోజు, ఏదైనా అనాథ శరణాలయం వెళ్ళిపొండి. అక్కడున్న పిల్లలకు మీరు ఏమేం చెయ్య గలరో చెయ్యండి. అక్కడ వున్నప్పుడు, మిగతా ప్రపంచాన్ని మరచి పొండి. ఆ పిల్లలో, పెద్దలో వారే మీ వారుగా వుండండి . మీ మొదటి -ప్రయత్నంలోనే మీకు ఎంతో ఆనందం కలగొచ్చు.
రెండు, మూడు నెలలలో - మీలో బ్రహ్మానందపు తాలూకు చాయలు కలగక మానవు. ఆ ఆనందం మిగతా సుఖాలకంటే - ఎంతో గొప్ప అని మీరూ వొప్పుకుంటారు.
ఆ తరువాత అక్కడి నుండి ముందుకు వెళ్ళచ్చు.
ఆ తరువాత అక్కడి నుండి ముందుకు వెళ్ళచ్చు.
= మీ
వుప్పలధడియం విజయమోహన్