సేవాలయ - శివాలయ - దేవాలయ
ఇప్పుడు - నేను వుండే వూరి పేరు తిరునిన్రవూరు . ఇది తమిళనాడులో చెన్నై - తిరుపతి జాతీయ రహదారిలో, చెన్నై లో- చిట్టచివర వుంది.
మా వూళ్ళో , వొక బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల శివాలయము, మరొక బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల విష్ణు ఆలయము వున్నాయి.
శివాలయానికి హృదయాలయ ఈశ్వర ఆలయమని పేరు. యిది వొక గొప్ప యోగి తన హృదయంలో తన కల్పన ద్వారా మొదట నిర్మించాడట. ఆ తరువాత, వొక రాజు దీనిని కట్టాడు. అదొక అందమైన కథ. విష్ణు ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. రెండూ - వేల సంవత్సరాల క్రితం కట్టినవే
అవి రెండూ, ప్రసిద్ధ ఆలయాలే .
చాలా గొప్పవే.
కానీ మా వూళ్ళో - మరో గొప్ప ఆలయం వుంది. దాని పేరు సేవాలయ.
అది వొక అనాథ శరణాలయం - అనాథలకోసం వొక మంచి పాఠశాల - వొక మంచి వృద్ధాశ్రమం - వొక గోశాల - యిలా ఎన్నిటికో రూప కల్పన జరిగి, చాలా బాగా నడుస్తున్న దేవాలయమని చెప్పొచ్చు.
17-నవంబరు -మా 34-వ పెళ్లిరోజు.
క్రిందటి రెండు సంవత్సరాలూ - మేం అక్కడికి వెళ్లి మాకు తోచిన డొనేషన్ యిచ్చేసి వచ్చాము. మళ్ళీ , అప్పుడప్పుడు, డొనేషన్ ( పుట్టిన రోజు లాంటి వాటికి) యిస్తూ వుంటాను.
కానీ ఈ సారి, కాస్త మార్పు వుండాలని - అక్కడి పిల్లల తో కాస్సేపు గడపాలని అనుకున్నాము.
16 నాడు డొనేషన్ యిచ్చేసి - 17 న మేం వస్తామని చెప్పాము. చెప్పినట్లే, నేను, నా శ్రీమతి 12.20 మధ్యాహ్న సమయంలో - అక్కడికి వెళ్ళాము.
మొదట వృద్ధాశ్రమంలో - అక్కడి వయోవృద్ధులు, దాదాపు డెబ్భై మంది భోజనం చేస్తూ వుంటే -వారితో అక్కడ, వారి జీవితాన్ని గురించి ముచ్చటించాము. వారు - బయటి ప్రపంచంలో -దాదాపు ఎవరూ లేని వారు. ఏమీ లేని వారు. కానీ అక్కడ సంతోషం గా గడుపుతున్నారు.
వారందరూ మమ్మల్ని ఆశీర్వదించితే - చాలా సంతోషమనిపించింది.
వారి ఆశీర్వాదంలో - అది వారి హృదయాంతరాళం నుండి వస్తూ ఉందన్నది చాలా బాగా, స్పష్టంగా, మాకు కనిపించింది. కొంత మంది అన్నం తింటూ వున్న చేతితో , లేచి, కొద్దిగా, ఆనందంతో వచ్చే కన్నీళ్ళతో, రెండు చేతులతో ఆశీర్వదించడం - ఎంతో హృదయాన్ని తాకే విధంగా వుంది.
- గోశాలలో 70 ఆవులకు పైగా వున్నాయి. వాటిల్లో - పాతిక భాగం పాలిచ్చే ఆవులైతే, ముప్పాతిక భాగం వట్టిపోయిన వృద్ధ ఆవులు. వాటినీ బాగా చూసుకుంటున్నారు వాళ్ళు . సంతోషం అనిపించింది. ఆ ఆవులూ సంతోషంగా కనిపించాయి .
సరే. అక్కడినుండి, పిల్లలను చూసేందుకు వెళ్ళాము. అది వారి భోజన సమయం. మేమూ వారితో పాటు కూర్చుని భోంచేశాము. నేను వారికి వడలు వడ్డిస్తూ, వారితో మాట్లాడాను. వారి పేర్లు, చదువుతున్న క్లాసు, ఎలా చదువుతున్నారో అని - అన్నీ అడిగాను. అందరినీ అడిగాను.
యల్ కే జీ నుండి 12 వరకు - అన్ని క్లాసుల పిల్లలూ వున్నారు.
మామూలు పిల్లలలో వుండే డిసిప్లిన్ - కంటే అక్కడ చాలా ఎక్కువ - అని చెప్పొచ్చు. అక్కడే వుండి చదువుకునే పిల్లలంతా - తల్లీ-తండ్రీ లేని వారే .దాదాపు 200 మంది.
బయటి నుండీ వచ్చే పిల్లలూ చాలా బీద కుటుంబాల నుండీ వచ్చిన వారే. వారు దాదాపు వెయ్యి మంది.
హాస్టలు పిల్లలు అందరితో మాట్లాడాను. వారంతా - థాంక్సు చెబుతుంటే - తమాషాగా వుంది.
యల్ కే జీ పిల్లలు, వారి అమాయకపు కన్నులతో మిమ్మల్ని చూస్తూ, ఉత్సాహంగా, మీకు థాంక్స్ చెబితే ఎలా వుంటుంది? 12 వ క్లాసు పిల్లలలో వారి భవిషత్తు గురించి కలలు కొంత మనం స్పష్టంగా చూడొచ్చు. సేవాలయ వారు - వారి కాలేజీ చదువుకూ సహాయం చేస్తారట. వుద్యోగం దొరికే వరకు రక రకాల సహాయం చేస్తారట.
మాకు చాలా బాగా అనిపించింది.
తల్లీ-తండ్రీ లేని పిల్లలు - అక్కడ సంతోషంగా వుండి - బాగా చదువుతున్నారు; నూటికి నూరు శాతం వుత్తీ ర్ణులవుతున్నారు - అంటే సేవాలయ యాజమాన్యం బాగా పని చేస్తున్నట్టే కదా . ఎందరో మహానుభావులు . నేను చేయని (లేని) పని అంత సమర్థంగా నిర్వహిస్తున్న - వారికి, నా హృదయ పూర్వక అభివందనాలు.
పిల్లల శుభాకాంక్షలు , వృద్ధుల ఆశీర్వాదాలు అందుకోవడం - దేవుడు నేరుగా వచ్చి ఆశీర్వాదం యిచ్చినట్టే వుంది.
మరి దేవాలయంలో అయితే - దేవుడి ఆశీర్వాదం - అలా మన అనుభవంలోకి రాదు కదా.
దేశంలో - ఏ వొక్కరూ భోజనం లేకుండా వుండకూడదు; చదువు లేకుండా వుండకూడదు . ఏ వొక్కరూ - అనాథలుగా వుండాల్సిన అవసరం వుండకూడదు - అని నాకు మాత్రం స్పష్టంగా అనిపించింది.
మీరూ - నేనూ అనుకుంటే - యిది మనం చేయ గలం.
మరి చేద్దామా?
సేవాలయా ను గురించి వొక విడియో ను మీరు క్రింద యిచ్చిన యు ఆర్ యల్ ను కాపీ చేసి మీ ఇంటర్నెట్ ద్వారా చూడొచ్చు. వినొచ్చు .
http://www.youtube.com/watch?v=CuZeSQSZ2bc&feature=youtu.be
http://www.youtube.com/watch?v=CuZeSQSZ2bc&feature=youtu.be
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి