26, నవంబర్ 2012, సోమవారం

సత్యమేవ జయతే - సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం - మూడు రకాల సత్యాలు - అబద్ధం - ఏమిటి? ఎక్కడుంది?

సత్యమేవ జయతే 



సత్యమేవ జయతే -అన్నది మన అశోక చిహ్నంలో రాసి పెట్టుకుని - మర్చిపోయాం. 

కళ్ళకు  అద్దాలు పెట్టుకుని కళ్ళద్దాలు వెదికే లాగ - యిప్పుడు సత్యం కోసం అందరూ వెదుకుతున్నారు.

మరి - ఘనత వహించిన కోర్టు వారు సాక్ష్యాధారాలు పరిశీలించి - వారికి తోచింది చెబితే అది సత్యం క్రింద చెలామణి అవుతుంది. దానిపై అప్పీలుకు వెళ్ళచ్చు. చాలా కోర్టులు పెట్టుకున్నాము మనం. ఏదో వొక చోట అసలు సత్యం యిదే - అని ఎవరో చెబుతారు. దానిపై యిక అప్పీలు వుండదు.

సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం.

మొన్నటి నాడు మాయింట్లో ఏం కూరలు వండారో నాకు గుర్తుండదు. కానీ కోర్టుల్లో -పదేళ్ళ నాడు - ఆరోజు - రాత్రి మీరు ఎన్ని గంటలా ఎన్ని నిముషాలకు అక్కడ వున్నారు, ఏం చూశారు, అసలేం జరిగింది -అని లాయర్లు అడగడమూ, చూశాము, అన్న వాళ్ళు గడగడా తడుముకోకుండా పూస గ్రుచ్చినట్టు, ఏదో చెప్పడము, దానిపై ఆధార పడి  జడ్జీ గారు తమ తీర్పు మరో అయిదేళ్ళలో చెప్పడమూ - అప్పుడు, యిదీ నిజం అని మనం అనుకోవడము - జరుగుతోంది.

అబ్బా, ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

నాకైతే - పది వాక్యాలు చదివి - వాటిని వొప్ప జెప్పాలంటే  - రోజూ పది సార్లు చదివితేనే - గానీ  చెప్పలేను. అయినా స్కూల్లో ఫస్టు , సెకండు వచ్చే వాణ్ని. అరవై మూడేళ్ళ వయసు తరువాత  ఈ మధ్య -నేషనల్ స్టాక్  ఎక్స్చేంజ్  వారు నిర్వహించే పరీక్షలు రాసి 11 పరీక్షల్లో 85 శాతం పైగా వచ్చి - యెన్.ఎస్.ఈ. సర్టిఫయ్డ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ -లెవల్.5. అని సర్టిఫికేట్ కూడా తీసుకున్నా. అయినా, అక్కడా అంతే. మళ్ళీ - మళ్ళీ -చదివేతేనే గానీ - ఏదీ పెద్దగా గుర్తుండి చావవు.    

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

ఏక సంథా గ్రాహులున్నారు. కానీ, వారు కూడా, నాకు తెలిసినంత వరకూ, విన్నది మాత్రం చెప్పగలరు. చూసినవన్నీ మాత్రం కాదు. మీరు వున్న గదిలో (లేదా యింట్లో) - మీరు పదేళ్లుగా వున్నారనుకోండి. యిప్పుడు, మిమ్మల్ని, ఎవరైనా - మీ గదిలో ఉన్నవన్నీ సరిగ్గా, పూస గ్రుచ్చినట్టు చెప్పమంటే - మీరు చెప్పలేరు. చాలా తప్పులు చెబుతారు. మీ గదే మీకు తెలీదు. వూర్లో జరిగే విషయాలు మీకెలా తెలుస్తాయి.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

అంత దూరం వద్దు. ఇప్పటికిప్పుడు, మీరు - కళ్ళు మూసుకుని - మీ శరీరంలో ఏమేమి ఎలా వుందో - బాగా చెప్పగలరా ? మీరు పడుకుని బాగా రిలాక్స్ అయి తరువాత - చెప్పమంటే మీకు నిజంగా రెండు కాళ్ళు వాటికి పది వేళ్ళు వున్నాయో కూడా -   మీకు తెలీదు.

మీ వెనుక (వీపు) భాగాన్ని మీరు ఎప్పుడు చూసారు? పదేళ్లకు ముందా ? అప్పుడూ చూడ లేదా? నేనూ అంతే.

కానీ, మీరు దారిలో వెళ్ళుతూ వుంటే, చీకట్లో, ఏ ఆక్సిడెంటో, దొంగతనమో జరిగితే - అందులో ఎవరికైనా, మీరు ఏ విధంగా నైనా, సహాయ పడితే -   అప్పుడు, మీరు అన్నీ చూడాలి. కనిపించక పోయినా సరే. అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి.  అప్పుడెంత టైమో, సెకండ్ల వరకూ మీకు తెలియాలి. డిజిటల్ కెమీరా లో వీడియో తీసినట్టు, మీ మనస్సు అవన్నీ సరిగ్గా రికార్డు చేసుకోవాలి. ఆ కేమీరాలో కూడా - ఫోకస్ వున్న చోటు మాత్రమే వస్తుంది. మిగతావి రావు. కానీ, మీరు మాత్రం ఏదీ మిస్ కాకూడదు. నాకు ఇవేవీ చాత కాదు. కాబట్టి, నేను అటువంటి చోట్లలో వుండనే వుండను. అంటే నేను వున్న చోట - అటువంటివేవీ జరగనే జరగవు.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

యిదంతా మాయా మంత్రాల కథ లాగా వుంటుంది నాకు.

ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సత్యం? ఏది అసత్యం ? ఎలా తెలుస్తుంది - మనలాంటి సామాన్యులకు.

మన ప్రాచీనులు, అంటే ఋషులు, సత్యం అన్న దాన్ని రకరకాలుగా తెలియజెప్పారు.

సత్యం - వొక్క భగవంతుడే తప్ప - మరేదీ కాదు అన్నారు. ఆ భగవంతుడికి మరో పేరు పెట్టారు - బ్రహ్మం అని. బ్రహ్మం వొకటే వుంది (లేదా వున్నాడు).మరోటి లేదు - అన్నారు.

మార్పు లేనిది, ఎల్ల వేళలా -వొకే రకంగా వుండేది సత్యం అన్నారు.

బ్రహ్మం అన్న దానికి వొక డెఫనిషన్ యిచ్చారు ;  బ్రహ్మం =  సత్యం = జ్ఞానం = అనంతం 

అంటే - ఇవేవీ వేరు వేరు విషయాలు కాదు, అన్నీ వొక్కటే అని అన్నారు. బ్రహ్మం  అంటే  సత్యం అంటే జ్ఞానం  అంటే అనంతం - అన్న మాట. యిది ఎలా - అని తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి. సరే.

బ్రహ్మాన్ని - పారమార్థిక సత్యం అన్నారు. మార్పే లేని సత్యం ఇదొక్కటే. యిది కాక, వేరే రెండు రకాల సత్యాలున్నాయి.

వొకటి - ప్రాతిభాసిక సత్యం. 

మెరిసేదల్లా బంగారం కాదు అంటాము. మెరిసేదాన్లో వొకటి బంగారం. మిగతావి మరేదైనా  కావచ్చు. కానీ, వొక్కో సారి, పసుపు పచ్చగా, రోడ్లో  దుమ్ములో మెరిసిపోతూ వుంటే మరో ఆలోచన లేకుండా తీసి జేబులో వేసుకుంటారు. అవసరంలో చూడరు.  ఎందుకు చూడరంటే  - మనం చేసే  పని మరెవరూ చూడకూడదని. అసలే చీకటి. అమావాస్య కూడా. మీకు అదృష్టమైన రోజు.

యింటికెళ్ళి మీ భార్యకో, భర్తకో చూపిస్తారు. వారి కళ్ళలో భయం కనిపిస్తుంది. అప్పుడు మీరూ చూస్తారు ఏమైందని.

యండమూరి బాణీలో - చెప్పాలంటే  - అప్పుడు తెలిసింది అది చిన్న పాము పిల్లని.

మీరు మీ భార్యని వదిలేసి, పామును పారేసి వీధి లోకి పరుగెత్తారు.

పాము పిల్ల బంగారం లా కనిపించడం ప్రాతిభాసిక సత్యం. మీరు మీ భార్యకు చూపే వరకు, అది సత్యమే. పాము పిల్ల జేబులో ఊగుతూ వుంటే - మీరు ఎంత సంతోషం తో నడిచారు. ఆ సంతోషం నిజం కాదా. అది పచ్చి నిజం.

కట్టెను పాము అనుకోవడం, భయ పడడం - ఈ ప్రాతిభాసిక సత్యానికి ఉదాహరణం గా వేదాంత గ్రంధాలలో చాలా సార్లు చెబుతారు. అది పరవాలేదు. దానికి రివర్స్ గా- పామును కట్టె  అనుకోవడం - దానిపై కాలు పెట్టడం, లేదా, దాని ప్రక్కనే నడవడం  చాలా సార్లు జరిగే విషయమే. అది ప్రమాద కరమైన - ప్రాతిభాసిక సత్యం.

ఏ భ్రమైనా - ప్రాతిభాసిక సత్యం క్రిందనే వస్తుంది. ఎండమావులలో నీళ్ళు వుందనే భ్రమ సహజం గా ఎడారుల్లో కలిగేది. 

మన దేశంలో, వొక పెద్ద భ్రమ వుంది.    నా కష్టాలకన్నిటికీ కారణం, వేరే ఎవరో - నేను మాత్రం కాదు - అనేది పెద్ద భ్రమ. యిది మనలో వున్న ప్రాతిభాసిక సత్యం.

మీ కష్టాలకు కారణం మీరు కాక పోతే - మీ సుఖాలకూ, మీరు కారణం కాలేరు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. కష్టే ఫలీ -అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. చెడ్డ అలవాట్లు వదిలి పెట్టండి. మీ సుఖాలకు మీరు కారణం అవుతారు. అప్పుడు తెలుస్తుంది - మీ కష్టాలకూ మీరే కారణం అని. యిది  ప్రాతిభాసిక సత్యం కాదు దీన్ని వ్యావహారిక సత్యం అంటారు.

 అలాగే - పక్క వాడికేవీ కష్టాలు లేవు - అన్నీ నాకే - అనిపిస్తుంది కొందరికి. ఎందుకు నాకే యిలా? అంటూ వుంటారు.అనుకుంటూ వుంటారు. పక్కింటాయనా యిలాగే అనుకుంటూ వుంటాడు. యిది  ప్రాతిభాసిక సత్యం.

అయితే - మగవాళ్ళు మరొకర్ని, వాళ్ళ కష్టాల్ని గురించి పెద్దగా అడగరు.స్వంత గోడు చెప్పుకోరు. మగ వాళ్ళు - కలిస్తే  మన్ మోహన్ సింగును గురించి, ఒబామాను గురించి, తక్కువ లెవెల్ లో మాట్లాడితే - లోకల్ యం.యల్.ఏ. గురించి మాట్లాడుతారు. తమ విషయాల్లో నామోషీ . 

కానీ - ఆడవాళ్ళు చాలా మంది - తమ, తమ విషయాలన్నీ అడిగి, చెప్పి, ఆ తర్వాత  - తెలుసుకున్న దాన్ని , మరో యిద్దరికీ చెప్పి - వొకరి కన్నీళ్లు, మరొకరి కళ్ళలో తుడుస్తూ వుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ గొప్పా కాదు. 

ద్వాపర యుగంలో  ధర్మ రాజు శాపం పెట్టాడట - ఆడ వాళ్ళ నోట్లో ఏదీ దాగదని. సత్యమేవ జయతే - అక్కడి నుండే - వచ్చింది. అబద్ధం వుంటేనే సత్యం సత్యం 'జయిస్తుంది'.   లేకుంటే - దేనిపై జయిస్తుంది? 

కలల్లో వచ్చేవన్నీ - ఆ కలల వరకు నిజమే కదా. కలల్లో మీరు ఎంతో మందిని చంపుతారు. ఎంతో - మందితో ఏమేమో మాట్లాడుతారు, ఏడుస్తారు నవ్వుతారు. భయపడతారు. ఎన్నెన్నో మాజిక్కులు చేసుకుంటూ పోతారు.  అది మీ కల; మీ సృష్టి . మీరు ఏమైనా చెయ్యొచ్చు. చేస్తారు.  లేచిన తరువాత - అది నిజం కాదు , అప్పటి (కలలోని) ప్రాతిభాసిక సత్యం అని తెలుస్తుంది మీకు .

చాలా మందికి ప్రేమ అనేది, 'ప్రేమ కల' లో ఉన్నంత వరకు చాలా గొప్ప నిజంగా కనిపిస్తుంది. పెళ్ళి (లో నిద్ర లేచిన) తరువాత - అది "ప్రేమ కల" అన్న విషయం మెల్ల మెల్లగా తెలుస్తుంది. అమెరికాలో ప్రేమించి పెళ్లి చేసుకుని -మూడేళ్ళలో డైవర్స్ చేస్తూ వుంటారు. సత్యం తెలియడానికి మూడేళ్ళు కావాలి.   కొందరికి, మూడు రోజులు లేదా మూడు గంటలు కూడా సరిపోతుంది.

మరి ప్రేమ సత్యం కాదా? సత్యమే. ప్రాతిభాసిక సత్యమే. మీరు అందులో నుండి,  నిద్ర లేచే వరకు సత్యమే. మరి అమర ప్రేమలు, ఆజన్మాంత ప్రేమలు లేవా. వున్నాయి. అన్నమయ్య సినిమాలో అన్నట్టు - తెగవవి నీవు తెంచే వరకు .

ప్రాతిభాసిక సత్యం చచ్చే వరకు వుంటే - అది సత్యమా, కాదా. అది అప్పుడేమవుతుంది?

అదే - వ్యావహారిక సత్యం - అంటారు. అది వొక రకంగా జీవితాంతపు భ్రమ.

కోర్టుల్లో చెప్పే తీర్పు -   వ్యావహారిక సత్యం. 

పది మంది జరిగిందన్నారు. యిరవై మంది జరగలేదన్నారు. మరి తీర్పు ఎలా వుంటుంది? యిరవై మంది చెప్పేది సత్యం.

ఈ రోజు కూడా, పాకిస్తానీ లాయర్ గారు వొకరు - అసలు కసాబ్, మీ కాశ్మీరీ టెరరిస్టే  అయి వుంటాడు - మా వాడు కాదన్నాడు.మరి వారి కోర్టు ఏమంటుంది? ఏమీ అనదు. ముంబై లో చచ్చిన వాళ్ళంతా - వాళ్ళను వాళ్ళే -కాల్చుకున్నారు  అని చెప్పినా - మనమేం చెయ్యలేము. అంతా - ప్రాతిభాసిక సత్యమే. 

కానీ - అసలైన నిజం అనేది వొకటి వుంది. అది దేవుడికి తెలుసు. మనకు తెలియక పోవచ్చు.

వ్యావహారిక సత్యం అనేది - మనం మన పంచేంద్రియాలతో చూసి,విని,తాకి, మనసుతో (మెదడుతో) గ్రహించే విషయాలు. 

యిక్కడ చిక్కాల్లా - మనం కళ్ళద్దాలు వేసుకుంటే వొక రకంగా కన్పిస్తుంది. వేసుకోక పోతే మరో రకంగా కనిపిస్తుంది. వినేది రెండు,మూడు సార్లు వింటే కాని,జ్ఞాపకం వుండదు. మన, ఈ యింద్రియాలు  ఏవీ సరైనవి కావు. మన కంటే గ్రద్దకు, చూపు బాగుంది. కుక్కకు, చీమకు వాసనలు ఎక్కువగా తెలుస్తుంది.దోమ కూర్చుంటే తెలీదు. కుడితే తెలుస్తుంది. యిలా, మనకు తెలిసే వ్యావహారిక సత్యం వొక పరిధిలోనే తెలుస్తుంది.

అందుకే న్యాయ స్థానాలలో మనుషుల సాక్ష్యం కన్నా కుక్కల సాక్ష్యం విలువైనది. అవి దొంగలను సరిగ్గా గుర్తు పడతాయట. యివన్నీ వ్యావహారిక సత్యాలు. 

మీ భార్య వ్యావహారిక సత్యం. వొక్కో సారి ప్రాతిభాసిక సత్యంగా మారినా - ఆశ్చర్యం అక్కర లేదు. అలాగే, భర్త కూడా.

యిప్పుడు మనం మూడు రకాల సత్యాలను గురించి - కొద్దిగా చూసాం. 

- మొదటిది పారమార్థిక సత్యం. దాన్ని బ్రహ్మం అన్నాం.అదే నిజమైన సత్యం; నిజమైన జ్ఞానం; నిజమైన అనంతం. దాన్ని గురించి చెప్పాలంటే,వేదాంతం చెప్పాలి. అది మరో సారి, జీవితంలో బాగా విసిగిపోయినప్పుడు -  ఇహ నిజంగా జ్ఞానం వొచ్చేస్తే మేలు అన్నప్పుడు - చెప్పుకుందాం.

-రెండోది ప్రాతిభాసిక సత్యం. నిజంలా కనిపించే భ్రమ. కానీ భ్రమ కూడా అది ఉన్నంత వరకు నిజమే.భ్రమ పడి పోతే- అది నిజం కాదని వెంటనే తెలుస్తుంది.

-మూడోది వ్యావహారిక సత్యం. మీకు రెండు చేతులు వున్నాయి. అది వ్యావహారిక సత్యం. కానీ, అవి నిజానికి మీవి కావు అన్నది పారమార్థిక సత్యం.ఎక్కడినుండో వచ్చాయి. ఎప్పుడో వెళ్ళిపోతాయి.మీరు పుట్టడం పెరగడం, పెళ్లి చేసుకోవడం మీ అవస్థలు మీరు పడడం, సుఖం లో దుహ్ఖాన్ని, దుహ్ఖం లో సుఖాన్ని అనుభవించడం, యివన్నీ వ్యావహారిక సత్యాలే. 

మీ ప్రేమలు ప్రాతిభాసిక సత్యం కావచ్చు. వ్యావహారిక సత్యం కూడా కావచ్చు. మీ గుళ్ళో దేవుడు వ్యావహారిక సత్యం. కానీ పారమార్హ్తిక సత్యం కావాలంటే - మీ గుడి దేవుడు చాలా ఉపయోగ పడతాడు. యిది అర్థం కాని వారు, మీ విగ్రహారాధన తప్పు అంటారు. నిజానికి, మీ పూజలు పునస్కారాలు, వ్రతాలూ, అన్నీ పారమార్థిక సత్యం తెలుసుకోవడానికి గొప్ప మెట్లుగా ఉపయోగ పడతాయి.

నిజానికి స్వర్గం, నరకం రెండూ - వ్యావహారిక సత్యాలే. పారమార్థిక సత్యం కాదు.స్వర్గానికెళ్ళి - నిజంగా మీరు ఏం చేస్తారు, చెప్పండి ? గీత వొకరు, బైబిల్ వొకరు, కొరాన్ వొకరు చదువుతూ కూర్చుంటారా? అసలేం చేయాలని వుంది అక్కడ? అది యిక్కడే చేస్తే పోలా?

సరే.  యివన్నీ వదిలి పెట్టండి. అబద్ధం అంటే - ఏమిటి? అది ఎక్కడుంది?

సృష్టిలో ఎక్కడా అబద్ధం లేదు - వొక్క మనిషి నాలుకపై తప్ప.  సృష్టిలో మరే ప్రాణికీ - అబద్ధం ఆడడం తెలీదు. చెట్లూ పుట్టలూ పాములూ గ్రద్దలూ ఏవీ అబద్ధం ఆడ లేవు.మంచీ చెడూ, నాలుక నుండే వస్తూ వుంది. నాలుక కు మనిషి చిత్తం నుండీ వస్తూ వుంది.

నేను యింట్లో లేనని చెప్పరా - అంటే - నాన్న గారు యింట్లో లేరని చెబుతున్నారు - అని మనమూ పిల్లలూ, అబద్ధాలు చెబుతూ వుంటాము.  

మనం, రోజుకు కనీసం నాలుగు అబద్ధాలు చెబుతామట - సరాసరిగా. అందులో 50 శాతం చెప్పే అబద్ధం - "మేం బాగున్నామండీ" అని. అయితే - అది శుద్ధ అబద్ధం  అని ఆ తరువాత చెప్పే పది వాక్యాలలో - చెప్పేస్తాం.

రాసుకోవడం సత్యమేవ జయతే - కానీ, అది చేయాల్సింది మనం కాదు, ఏ దేవుడో వచ్చి చెయ్యాలి. అదీ మన పంథా.

యిక్కడే వుంది మన వేదాల సారాంశమంతా; వేదాంతపు సారాంశమంతా. 

మన చిత్తంలో, మన నాలుక పైన - అబద్ధం తగ్గే కొద్దీ - అక్కడ బ్రహ్మం సాక్షాత్కరిస్తూ వస్తుంది. మనలో, సత్యం పెరిగే  కొద్దీ, జ్ఞానం పెరుగుతూ పోతుంది. అప్పుడు, అనంతం ఏమిటో తెలుస్తూ వుంటుంది.  

అబద్ధం మనలో, పూర్తిగా పోయిన నాడు, మనకు మోక్షమే. జ్ఞానమే ఆనందమే. ఎక్కడో కాదు - యిక్కడే. బ్రతికి వున్నప్పుడే. 

అందుకే - చాలా మంది నిజమైన స్వాములు - ఎప్పుడూ చిరునవ్వుతో  కనిపిస్తారు. కానీ - మనకు దొంగ స్వాములపైనే వుంటుంది మనసు. మిమ్మలను ఎలెక్షన్ లో గెలిపిస్తాను. మీ శత్రువు వోడి పోయేలా చేస్తాను. మీకు వ్యాపారంలో  లాభం వచ్చేలా చేస్తాను - అనే వాళ్ళంతా - దొంగ స్వాములే. వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే . మీరు అడిగేవి అన్నీ అబద్ధాలు నిజాలు కావాలనే.  ఆ రూట్ లో ఆనందం ఎప్పుడూ వుండదు.

కానీ - రమణ మహర్షి కానీ, శ్రీ శ్రీ రవిశంకర్ కానీ, రామకృష్ణులు కానీ - గాంధీ గారు కానీ - - నవ్వితే అమాయకపు, నిజమైన, స్వచ్చమైన నవ్వులే నవ్వుతారు. వారు మీకు యిచ్చేది - వేరే రకపు ఆనందం. వారి సమక్షంలో - మీకు వచ్చేది - కోరికలే లేని, స్వచ్చమైన మనసు.  అందులో వుండేది అనిర్వచనీయమైన ఆనందం. 

-దాన్నే  బ్రహ్మానందం అంటారు. అంతకు మించిన ఆనందం  ప్రపంచం లో మరొకటి లేదు. 

నిజానికి, ఎప్పుడో వొక సారి, మనం, ఏదైనా వొక గొప్ప నిజం చెప్పిన నాడు, మన మనసులో ఎక్కడో, కాస్సేపు అది ప్రతిఫలిస్తుంది. ఆ ఆనందం - చాలా, చాలా గొప్పది - అనేది మనకు తెలుస్తుంది కూడా.

అది కావాలనుకున్న నాడు -అబద్దాలాడడం - నిలిపేసెయ్యండి.  

సత్యమేవ జయతే.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్  


 
  





1 కామెంట్‌: