17, సెప్టెంబర్ 2012, సోమవారం

మతమూ - మానవత్వమూ

మతమూ - మానవత్వమూ 


మానవత్వం తెలియడానికి మతం అవసరమే లేదనిపిస్తుంది. మన సమకాలీన గురువు వొకాయన అంటారు - మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...

ఈ పనులు మీరు చేస్తారా? చెయ్యరు గాక  చెయ్యరు. ఎందుకు? అది మీ వేలు గనుక. అందులో మీరు వున్నారు గనుక. అది గాయపడితే మీరు గాయ పడ్డట్టు.అది బాధ పడితే మీరు బాధ పడ్డట్టు. అది  మీది. అది మీరు - అన్న భావన మీలో వుంది గనుక.

అదే మరొకరి వేలును గాయ పరచమంటే - మనలో - వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది. వొకరు ససేమిరా -నేను చెయ్యను; చెయ్యలేను.అంటారు. మరొకరిని శారీరకంగానో, మానసికంగానో, హింసించలేని  సున్నిత మనస్కులు యిప్పుడూ మన దేశంలోనూ, చాలా దేశాల్లోనూ - వున్నారు. అంటే - మానవత్వం వున్న వారు ఎంతో మంది వున్నారు.

సరే.  మరో రకం వారు - తమ మిత్రులనైతే , తమ వారినైతే హింసించలేరు గానీ - తమ శత్రువులనో, తమ వారు కాని వారినో  హింసించడానికి   ముందుకొస్తారు. వారిలోనూ, రక రకాల మనుషులున్నారు. కొంత మంది ఉత్త మాటలతో అయితే  హింసిస్తారు గాని - చేతల ద్వారా  హింసించలేరు.

కొంత మంది - ఎవరైనా మరొకరిని పంచ్ బాగ్ లాగా కొడుతూ వుంటే - చూసి ఆనందిస్తారు. సినిమాల్లో నైతే - విలన్లు అలాంటి పంచ్ బాగ్ లు గా మారి - హీరో చేతిలో దెబ్బలు తింటూ వుంటే - వాడిని యింకా కొట్టు, యింకా కొట్టు అనుకుంటూ వుంటాము. ఇక్కడ, మనకు తెలియకుండానే, మనలో - హింసను ఆనందించే ప్రవృత్తి ఏర్పడుతూ వుంటుంది. అదే - హీరోను కొడుతూ వుంటే - సహించలేము.

మన వారికి ఏదైనా ఆపద వస్తే - విలవిల్లాడి పోతాం. కాని - ఆపద వచ్చింది మన వారికి కాదు - అనిపిస్తే - నిశ్చింత వచ్చేస్తుంది మనలో. మన వారికి గోరు కాస్త తగిలితే - మనసులో - విల విల. కానీ పరాయివాడి ప్రాణం పోయినా - మన మనసులో ఏమీ లేదు.

నిజమా, కాదా?

కానీ,  మనలోనే కొందరు, ఎక్కడ, ఏ ఆపదదొచ్చినా - మూటా, ముల్లె సర్దుకుని అక్కడికెళ్ళి - అందరికీ సహాయ పడుతూ వుంటారు. అలాంటి ఎన్నో సంస్థలు వున్నాయి.

అటువంటి - మనస్తత్వం అందరికీ వుంటే - దేశం నందన వనం అయిపోదా? స్వర్గం గా మారిపోదా? మరి అటువంటి మనస్తత్వం మనలో ఎలా వస్తుంది? మన విద్యా విధానం ద్వారా వస్తుంది. గొప్ప గురువుల సాన్నిధ్యంలో వస్తుంది.

నాకు తెలిసి అటువంటి గురువులు మన దేశంలో చాలా మంది వున్నారు. కానీ, కొంత మంది - వారి దగ్గరకు వెళ్ళకుండానే, వారి ప్రబోధాలు వినకుండానే, వారు చేసే ప్రతి పనీ గమనించకుండానే   - వారిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ వుంటారు.

తాము చేయలేని పని వారు చేస్తున్నారు. అదెలా సాధ్యం. యిందులో, వారి స్వార్థం వుండనే వుంటుంది - వారు తమకంటే - ఏ విధంగానూ గొప్ప వారు అవడానికి వీలే లేదు -అనే భావన వుంటుంది. కానీ అటువంటి గురువుల సాన్నిధ్యానికి వొక సారి వెడితే - యిటువంటి వారు మారడానికి - అవకాశం వుంటుంది.

సరే. ఇలాంటి వారు రక రకాలుగా వున్నారు. 

జీవితంలో, మనిషి - వికాసాత్మకం గానూ, నిర్మాణాత్మకం గానూ వుండొచ్చు . లేదా, విమర్శకుడిగా మిగిలి పోవచ్చు. అందులోనూ  - వికాసాత్మక విమర్సకుడి గానూ వుండొచ్చు. లేదా, వినాశాత్మక విమర్శకుడిగానూ  వుండి  పోవచ్చు.

మన దేశంలో ముఖ్యంగా - నిర్మాణాత్మకతను  మనలో పెంచే విద్యా విధానం రావాలి . ఇప్పుడున్న విద్యావిధానం - అటువంటిది కాదని నిశ్చయంగా చెప్పొచ్చు.అలాగే - సహృదయంతో, వికాసాత్మకంగా చూడగలిగే విమర్శనా దృష్టి కూడా కావాలి.మన ఆలోచనా విధానమే మారాలి.

మరి -నకారాత్మక దృష్టి , నకారాత్మక స్వభావం కొందరిలో - మరీ మితి మీరి పోతుండడం  కూడా మన దేశంలో వుంది. మనం చూస్తూనే వున్నాం. కావాలని, రైళ్ళు  పడగొట్టడం, బస్సులు కాల్చడం, మనుషులను హింసించడం, చంపడం, ఆడవాళ్లనైతే ,అత్యాచారాలకు, సామూహిక అత్యాచారాలకు గురి చెయ్యడం - ఈ మధ్య ఎక్కువై పోతూ వుంది. నా వుద్దేశంలో యిందుకు ప్రధాన కారణం విద్యా విధానం లోని లోపాలే.

మరో కారణం సినిమా , టీ.వీ ల ద్వారా యిటువంటి హింసను -ముఖ్యంగా హీరో ద్వారా హింసను -ఎక్కువగా ప్రోత్సహించడం.  అశ్లీలత కూడా ఈ రోజుల్లో చాలా సరిహద్దులు దాటింది.

కాకపోతే - మన దేశం - మరి కొన్ని యితర దేశాలతో పోల్చి చూసుకుంటే -  కొంత మెరుగేనని చెప్పొచ్చు.

మనం చూస్తున్నాం కదా - మగ వాళ్ళు చేసే నేరాలకు ఆడ వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపుతూ దాన్ని ఆనందించే ప్రవృత్తి యింకా కొన్ని దేశాలలో వుంది. మతం పేరిట మన దేశంలో కొంత అంటరానితనం మాత్రం వుంది - కానీ - కొన్ని దేశాలలో - క్రూర మృగాల లాగా, మిగతా మతాల వారిని - హింసించడం, తమ మతంలో చేర్చుకోవడానికి బలాత్కారం చెయ్యడం - తత్ ఫలితంగా వారు దేశాంతరాలకు పోవడం జరుగుతూనే వుంది.

మతం పేరిట ఏదేదో జరుగుతూ వుంది. ఎన్నెన్నో జరుగుతూ వుంది. చాలా మందిలో  - రావాల్సిన మంచి మార్పు  రావడం లేదు.

అన్ని మతాల లోనూ - కొంత మంది మంచి వారూ వున్నారు. కొంత మంది చాందస వాదులూ వున్నారు.మంచి వారి వొక్కటిగా చేరితే - అన్ని దేశాల వారూ, అన్ని మతాల వారూ హాయిగా వుండొచ్చు.

అది జరగక పోతే - ఛాందస వాదుల ద్వారా - మానవత్వం మంట గలిసి, రాక్షసత్వం పెరగడం ఖాయం.

చాందస వాదులు మారాలంటే - ఎలా? ఆయా మతాల లోని మంచివారిద్వారానే - అది జరగాలి.  చెడును ప్రోత్సహించకపోయినా - చెడుని చూసీ చూడనట్లు వుంటే - చెడు పెరగడం ఖాయం. మన పొరుగు దేశాలలో అది జరుగుతుందో, లేదోచెప్పలేం . కానీ, మన దేశంలో - ఈ మార్పు రావాలి. రావచ్చు.వస్తుందనే నమ్మకం కలుగుతూ వుంది.

మతాలలో కూడా -గణనీయమైన మార్పులు రావాలి. మతంలో ఎంతో మంచి వుంది. కానీ- కొంత చెడూ వుంది. కొన్ని అమానుషమైన అలవాట్లూ ఉనాయి. 

మా మతమే గొప్ప - మా నాయకుడే గొప్ప -మా గ్రంధమే గొప్ప అనుకుంటే - మార్పు ఎప్పుడూ రాదు.

ఈ గంధాలన్నీ - వొక కాలంలో - ఆ కాలానికి తగినట్టు చెప్పబడ్డవి; రాయ బడ్డవి. -అందులోనూ  కొన్ని మాత్రం నిత్య సత్యాలే. వొప్పు కుంటాను. కొన్ని - కాలానుగుణంగా  మారాలి.

అందులో వొకటి - హిందు మతానికి -సంబంధించినది  - జాతి వివక్షత, అస్పృశ్యత. యిది మారుతూ వుంది కానీ - యింకా ఎంతో వేగంగా - అందరికీ నచ్చేటట్టుగా  మారాలి. 

మరొకటి మిగతా మతాలకు -మనకూ మధ్య వున్న సంబంధాలకు సంబంధించినది. మిగతా వారి వారి మతాలకు సంబంధించిన  విషయాలను నేను ప్రస్తావించను.

వొకటా మా మతంలో చేరండి - లేదా - మీరు నరకానికి వెళ్లి పోతారు - అన్నది హాస్యాస్పదమైన వాదం.యిందులో పెద్దగా వాదించి తెలుసుకోవలసిన సత్యం ఏమీ లేదు. కొద్దిగా, కళ్ళూ మనసూ తెరిచి చూస్తేనే చాలు - యిట్టే - అర్థమై పోతుంది.  

ఈ మతాలు వచ్చిందే 2000 ఏళ్ళ క్రితం. అంతకు క్రితం మంచి వాళ్ళు ఎంతో మంది వున్నారు కదా. వాళ్ళు ఎవరూ స్వర్గానికి వెళ్ళ లేదా? 

అలాగే - భారత దేశంలో కూడా, కృష్ణుడు లాంటి దేవుడి అవతారాలు 5000-6000 క్రితం వచ్చారంటే - గీత లాంటి   - గొప్ప సందేశాలు - అందించారంటే   -  ఎందుకు నమ్మక పోవడం? అందులో అంతగా నమ్మక పోవడానికి ఏముంది?

అలాగే - విగ్రహారాధన అంటే - ఏమిటో - అసలు తెలుసుకోకుండా - దీన్ని విమర్శించే  వాళ్ళు చాలా మంది  వున్నారు. విగ్రహారాధన చేసే వారిని తెగ కోసి  చంపితే మాకు స్వర్గం వస్తుందనే వారూ వున్నారు.

హిందు తత్వంలో కూడా - దేవుడు నిరాకారుడే అని ఎన్ని సార్లు చెప్పలేదు? కానీ - తన భక్తుల కోసం - దేవుడు - వారు కోరుకున్న రూపాల్లో వస్తాడని చెప్పడమే యిది .  అంతే కాక - పరి పరి విధాలుగా పోయే  మనస్సును మొదట వొక చోటికి చేర్చడమే  యిష్ట దేవతా విగ్రహాల లక్ష్యం.

ఆ తరువాత  నిరాకారుడైన దేవుడు. ఆ దేవుడి ఆరాధన.

ఆ తరువాత వుపనిషద్ వాక్యాల ప్రకారం  -అహం బ్రహాస్మి - నేనే బ్రహ్మమును - అనేదే నిత్య సత్యము. యివన్నీ తెలుసుకోకుండా -  పర మతాల్ని విమర్శిస్తే - సఖ్యత ఎలా కుదురుతుంది. విశ్వ శాంతి ఎలా వస్తుంది?

యిదైనా - ఎందుకు చెప్పాల్సి వస్తూ వుంది? నన్ను ఏం చేసినా తమకు పరవాలేదు - అంతకు మించి స్వర్గం కూడా వస్తుంది - అని కొంత మంది చాందస వాదులు అనుకోవడం - నేను వొప్పుకోలేను కదా. అందుకే. 

ఈ చాందస వాదాన్ని ఎవరు అరికట్టాలి . ఆయా మతాల లోని మంచి వాళ్ళే అరికట్టాలి. వారు అందుకు - ముందుకు వచ్చిన నాడు - చాందస వాదులు అణిగి పోతారు.

హిందూ  సంస్కృతి ప్రకారం - సర్వే జనాః సుఖినో భవంతు . మనమందరూ బాగుండాలి. అంతే 

మొదట చెప్పిన వాక్యాన్ని మరో సారి గుర్తు చేసుకుందాం....మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...మీరు చేస్తారా? చెయ్యరు కదా?  అలాగే. మిగతా వారినీ చూడండి. అందరూ దేవుడి బిడ్డలే. అందరి దేవుడూ వొకడే.  దేవుడి పేర్లు మనం పెట్టుకొన్నవి. ఆయన నా పేరు యిదీ - అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు.

ముందు చెప్పినట్టు - ప్రతి మతం లోనూ - కొంత మంచి, కొంత చెడూ - రెండూ వుంది. 

ప్రతి మతం లోని మంచి స్వీకరిద్దాం. ప్రతి మతం లోని చెడును గుర్తించి వదిలేద్దాం.


 =మీ 

 ఉప్పల దడియం విజయామోహన్  
 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి