9, జనవరి 2011, ఆదివారం

కర్మణ్యేవ అధికారస్తే , మా ఫలేషు కదాచన = కర్మయోగము = కారణ కార్య సంబంధము =(తెలుగు)



కర్మయోగము అంటే  కారణ కార్య సంబంధము - అని అర్థము చెప్పుకోవచ్చు.

భగవద్ గీతలో ముఖ్యముగా చెప్పబడిన ఒక అంశం కర్మ యోగం.

చాల మందిలో కర్మ యోగాన్ని గూర్చి చాలా అపోహలు వున్నాయి.

కర్మ పైన నీకు అధికారం వుంది కాని ఫలితం పైన అధికారం లేదు - అన్న వాక్యం చాలా మందికి అర్థం కావడం లేదు.

కొంత మంది ఫలితాన్ని ఆశించకు అని అర్థం చెబుతుంటారు.

ఫలితం పైన అధికారం లేదనదానికీ, ఫలితాన్ని ఆశించ  వద్దనడానికీ చాలా తేడా వుంది.

వుదాహరణానికి  -

చెట్టు పైని మామిడి పండును గురి చూసి - రాయి విసురుతాము.

ఈ పని లేదా ఈ కర్మ చేయడానికి  మనము సమర్థులం. కానీ రాయి మన చేతి నుండి   విసిరి వేయ బడ్డ తరువాత  ఆ రాయి ఎలా వెళుతుంది, మామిడి పండును తాకుతుందా లేదా - అన్నది ఫలితం.

ఈ ఫలితం పైన మనం మాత్రం కాదు; అనేక శక్తులు పని చేస్తున్నాయి.గాలి వీచి చెట్టు కొమ్మ పక్కకు జరగవచ్చు.

పండు రాయి దారికి  దూరంగా పోవచ్చు.గాలి వేగానికి రాయి కూడా మార్గం తప్ప వచ్చు.

ఏదో పక్షి పండు ను తీసుకెళ్ళి పోవచ్చు. 

ఇలా ఏదో వొకటి జరిగి - మనం విసిరిన రాయి - నేరుగా వెళ్లి - చెట్టుకు అటు వైపు వున్న ఏ బట్టతలాయన పైనన్నా పడ వచ్చు.

అంటే - ఫలితం వుంది కానీ ఆ ఫలితాన్ని పూర్తిగా శాసించే అధికారం మనకు ఇవ్వ బడ లేదు.

ఎవరైనా ఫలితాని ఆశించే పనులు చేస్తారు.

అర్జునుడూ ఫలితాన్ని ఆశించే యుద్ధానికి దిగాడు.

కృష్ణుడూ ఫలితాన్ని ఆశించే భగవద్ గీత చెబుతున్నాడు. కృష్ణుడు అంతకు ముందు రాయబారం నడిపింది కూడా ఫలితాన్ని ఆశించే కదా.

కానీ  అన్నీ మనం అనుకున్నట్టే జరగవు - మనం చేసే పనుల ఫలితం పైన ప్రపంచం లోని  ఇతర వ్యక్తుల, మరియు ఇతర శక్తుల ప్రభావం కూడా ఉంటుందని, అందు వలన ఫలితం ఎంతో కొంత మారుతుందని చెప్పడానికే, కృష్ణుడు ఫలితం పైన మనకు అధికారం లేదు - అని అన్నాడు.

అర్జునా, యుద్ధం చేయడం నీ ధర్మం. అందుకు నీకు అధికారం వుంది -  అని  కృష్ణుడు పదే పదే చెప్పాడు.

యుద్ధానికి ఫలితం ఎలా ఉంటుందో, అది పూర్తిగా అర్జునుడు శాసించలేడు.

అయినా యుద్ధం చేయాలి. తన శక్తికి అనుసారంగా యుద్ధం చేయాలి.

అర్జునుడి మనసులో, ఫలితం ఏమి కావాలో తప్పకుండా వుంది. కానీ, ఆ ఫలితం పైన కృష్ణుడి ప్రభావం కూడా వుంది.

భీష్ముడి ప్రభావమూ వుంది; మరెందరి ప్రభావమో వుంది.

అదన్న మాట.

కారణానికి  తగినట్టు కార్యం జరుగుతుంది. నిజమే.

కానీ, మనం గమనించ వలసినది - కారణం మనము మాత్రమే కాదు. మరెన్నో శక్తులు వున్నాయి.

ఫలితం అన్నిటికీ చేర్చి అన్నిటికీ తగ్గటు గా  వస్తుంది.

అన్నిటినీ మనసులో వుంచుకుంటే, ముఖ్యముగా, దైవమును కూడా మన ప్రక్కన వుంచుకుంటే, ధర్మం కూడా మన ప్రక్కన వుంటే, మనం అనుకున్న ఫలితం కంటే ఎక్కువే రావచ్చు.

= మీ

వుప్పలధడియం విజయమోహన్  


 







.

1 కామెంట్‌: