30, జూన్ 2016, గురువారం

సమాజంలో సమస్యలు - వాటి మూల కారణం

కమ్యూనికేషన్ స్కిల్స్ 

పరస్పర అవగాహనా నైపుణ్యం 



మాట్లాడ వలసిన వాడు -  మాట్లాడ వలసిన సమయంలో, మాట్లాడ వలసిన స్థలం లో, మాట్లాడ వలసిన వారితో మాట్లాడ వలసిన విధంగా మాట్లాడాలి. అలా మాట్లాడక పోతే చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి.

మరి, అలా మాట్లాడితే - వున్న మరియు రాబోయే చిక్కులు, ప్రమాదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలా మాట్లాడ గలిగి, మాట్లాడే వాడు బుద్ధిమంతుడు, జ్ఞాని. సమయస్ఫూర్తి గలవాడు. ప్రతి మనిషికీ, ప్రతి సమాజానికీ అటువంటి మనుషులు కావాలి .


కానీ, మాట్లాడ కూడని  వాడుమాట్లాడ కూడని  సమయంలో, మాట్లాడ కూడని స్థలం లో, మాట్లాడ కూడని వారితో, మాట్లాడ కూడని విధంగా మాట్లాడితే  చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. అటువంటి వాడు వాచాలుడు, మూర్ఖుడు. వాడి నోరు ముయ్యక పోతే, అన్నీ ప్రమాదాలే . తనకే కాదు, చుట్టూ వున్న వారికీ ప్రమాదాలు తెచ్చి పెడతాడు. 

అయితే, వినవలసిన  వాడు -  విన వలసిన సమయంలో,  విన వలసిన స్థలం లో,  విన వలసిన వారి మాటలను విన వలసిన విధంగా తప్పక వినాలి;అర్థం చేసుకోవాలి; పాటించాలి.

వినవలసిన వాడు -  అలా  వినక పోతే, పాటించక పోతే చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. వింటే , పాటిస్తే , వున్న చిక్కులు , ప్రమాదాలు మాయమవుతాయి. క్రొత్తవి రాకుండా వుంటాయి. 

అలాగే, విన కూడని  వాడు -   విన కూడని  సమయంలో,  విన కూడని  స్థలం లో,  విన కూడని  వారి మాటలను విన కూడని  విధంగా వింటే కూడా ఎన్నో చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. అలా వినే వాడు మూర్ఖుడు.

 సరైన విధంగా మాట్లాడడమూ , వినడమూ, మన జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన ప్రాథమిక విద్యలు, కళలు, విజ్ఞానమూ కూడా .

మంచి వాడితో, జ్ఞానితో, సమయ స్ఫూర్తి వున్న వాడితో   మాట్లాడమన్నారు; వాడి మాట వినమన్నారు; వాడి స్నేహం కట్టమన్నారు, మన పెద్దలు. అదే ముక్తికి కూడా సులభమార్గమన్నారు. సత్సంగత్వే ..... జీవన్ముక్తిహి - అన్నారు ఆది శంకరాచార్యులు.

భార్యాభర్తలు ఒకరితో ఒకరు  యెలా వుండాలి - అన్న విషయం కూడా ఇందులో మనం తెలుసుకో వచ్చు . తల్లిదండ్రులు పిల్లలు మధ్య సంబంధాలు ఎలా వుండాలి - అన్న విషయం కూడా ఇందులో మనం చూడ వచ్చు. స్నేహ, బాంధవ్యాలకు ముఖ్యంగా  ఈ సూత్రాలు పునాది .

సమయస్ఫూర్తి తో   మాట్లాడగలగడం,వినగలగడం , మంచి గ్రహించగలగడం, చెడు విడిచిపెట్ట గలగడం ఇవీ జీవితంలో విజయానికి పునాదులు. ఆనందానికి సోపానాలు.

ఇవి విద్యలో  మొదటి పాఠాలు గా ఉండవలసినవి. కడపటి పాఠాలు గా కూడా నేర్పడం లేదు.

అందుకే సమాజంలో యిన్ని సమస్యలు.

సర్వే జనాః సుఖినో భవంతు 

-మీ 

ఉప్పలాధడియం విజయమోహన్
 


 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి