20, నవంబర్ 2014, గురువారం

ఏ రోగమయినా నయం అవుతుంది - ఎలా ? - మీరేం చెయ్యాలి? - డాక్టర్లు ఏం చెయ్యాలి ?



వ్యాధులూ - మనమూ


మన దేశం లో - రక రకాల రోగాలు చాలా పెరిగి పోతున్నాయి .

కొన్ని దీర్ఘ కాలిక రోగాలు . కొన్ని మందుల్లేని రోగాలు . కొన్ని మరణం తప్పదనిపించే రోగాలు . కొన్ని  మందులతో నయమయ్యే రోగాలు . కొన్ని సర్జరీ అవసరమైనవి . కొన్ని సర్జరీ  అవసరం లేనివి .  యిలా రోగాలు ఎన్ని రకాలో . ఎన్నెన్ని రకాలో . 

పుట్టిన బిడ్డ నుండి ,  వంద ఏళ్ళ వారి వరకు  అందరికీ రోగాలే .


ఎయిడ్స్ పెద్ద రోగం  అనుకుంటే , కాదు నేనున్నాను అంటూ - ఎబోలా వస్తూ వుంది . కాన్సర్ అంటే పెద్ద భయం యిప్పటికీ అందరికీ వుంది. చర్మ రోగాలు ప్రమాద కరం కాకున్నా, చాలా వాటికి సరైన మందులు లేవు . పిచ్చికుక్క కాటుకు కూడా యిప్పటికీ సరైన వైద్యం లేదు . కరిచిన ఘంట లోగా ఇంజక్షన్లు వేసుకుంటే చాలా మంచిది  .  మనకు వచ్చే మానసిక రోగాలూ ఎన్నో, ఎన్నెన్నో . వాటికీ సరైన వైద్యాలు లేవు .
యిలా వుంటే ఎలా ?

"రాకుండా చూసుకోవడం "  ,  "నయం చేసుకోవడం" కంటే ఎంతో మేలు ; ఎంతో సులభం - అన్న నానుడి వుండనే వుంది .  అది నిజమే .  కాకుంటే - రాకుండా చూసుకోవడం ఎలా ? అది తెలిసి చావాలి కదా . ఏ రోగమూ రాకుండా ఎలా చూసుకోవడం ?

యేవో కొన్ని ముందు జాగ్రత్తలు చేసుకోవచ్చు . చేసుకుంటే కొంత మేలు .

ఏం చేసుకోవచ్చు ?

(1) దోమలు, ఈగలు , బొద్దింకలు లాంటి రోగవాహక , క్రిమి వాహక జీవులు  - యిళ్ళలో , యిళ్ళ దగ్గర లేకుండా జాగ్రత్త పడ వచ్చు . ముఖ్యంగా మురుగు నీరు వుండకూడదు . అక్కడే రోగవాహక , క్రిమి వాహక జీవులు పెరుగుతాయి .

(2) ఆహారము, విహారము , చేసే పనులు, నిద్ర, మేలుకునే సమయం - అన్నీ, మితంగా , మనకు తగినవిగా వుండాలన్నాడు - గీతలో శ్రీ కృష్ణుడు. నేను ఫాస్ట్ ఫుడ్స్  తింటాను . ఎంత  సేపైనా నిద్ర పోతాను; ఎంత సేపైనా మేలుకుంటాను . శరీర వ్యాయామం అసలు చేయను .  లేదా,దినమంతా వ్యాయామం చేస్తాను - యిలా ఏదైనా సరే , 'అమితం' గా చేసే వారికి ఆరోగ్యమూ వుండదు . సంతోషమూ వుండదు .

(3) యింట్లో - చెత్త , దుమ్ము - లాంటివి లేకుండా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది .

(3) ఇలాగే , మానసిక ప్రవృత్తులు కూడా కొన్ని నియమిత పరిధులలో వుంటే - ఆరోగ్యమూ వుంటుంది ; ఆనందమూ వుంటుంది .  మితి మీరిన పోకడలు పొతే , మానసిక ఆరోగ్యము చెడుతుంది ; తన కోపమె తన శత్రువు , తన శాంతమె తనకు రక్ష , దయ చుట్టంబౌ , తన సంతోషమే స్వర్గము , తన దుఃఖమే నరకమండ్రు  తథ్యము సుమతీ ! అన్నది పెద్దల సలహా . యిది వెయ్యేళ్ళు  పోయినా - మన మానసిక ఆరోగ్యానికి సూత్రం గా నిలబడుతుంది . నోరు నెమ్మదైతే , వూరు నెమ్మదౌతుంది.  యిదీ పెద్దలు చెప్పినదే, వేల సంవత్సరాల అనుభవానికి యివి ప్రతీకలు , ఫలితాలు . వీటిని పాటించక పొతే - మనకే నష్టం . నేను నిష్కర్ష గా మాట్లాడుతాను - అనే వారెవ్వరూ , ఎదుటి వారు తమ గురించి నిష్కర్ష గా మాట్లాడితే  విన లేరు . నిజాలు కూడా , చెప్పాల్సిన విధం వుంది . అది నేర్చుకోవాలి . వీటి వల్ల ఆరోగ్యం ఎలా వస్తుంది ? తప్పకుండా వస్తుంది . ప్రశాంతం గా, సంతోషంగా వుండే వారికి, రోగాలు రావడం చాలా తక్కువ . వచ్చినా - త్వరగా తగ్గిపోతాయి . యిది, నా, మన, అందరి  జీవితానుభవమే కదా !

రోగాలు రాకుండా చేసుకోవడానికి యిలా ఎన్నో మౌలిక సూత్రాలు వున్నాయి . ఇవి మనం  పాటించాలి .

సరే . రోగాలు వచ్చేశాయి . యిప్పుడేం  చెయ్యడం ?

ఉదాహరణకు - ఎవరికో కాన్సర్ వచ్చిందనుకోండి . చుట్టూ వున్న వాళ్ళు ఏం చెయ్యాలి ? కాన్సర్ వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి ? డాక్టర్లు ఏం చెయ్యాలి ?

ఇలాంటి రోగాల్లో - రోగం సగం . భయం సగం గా వుంటుంది . నిజానికి భయం , వైద్యం పైన అపనమ్మకం అనే 2 అంశాలు - రోగానికంటే  ఎక్కువగా రోగిని బాధ పెడుతూ వుంటుంది . మొదట యివి పోవాలి . డాక్టర్లు మొట్ట మొదట ఇవ్వాల్సింది  నమ్మకం , ధైర్యం . ఎంతో మంది డాక్టర్లు , చాలా రోగాల్లో - యివి యివ్వడం లేదు.  మేం చేసేదంతా చేస్తాం ; ఆపై దేవుడి దయ ; మీ అదృష్టం - లాంటి మాటలు అంటూ వుంటారు . యిది చాలా తప్పు .

డాక్టర్లు నమ్మకం యివ్వాలి . ధైర్యం యివ్వాలి . అదే వారిచ్చే గొప్ప ఔషధం . దేవుడి దయ, అదృష్టం ఎలా వుంటాయో  ఎవరికీ తెలీదు. రోగికి ముందు డాక్టరే పోవచ్చు . లేదా రోగి పోవచ్చు . మనకు తెలీని ఇలాంటి విషయాల గురించి కాదు . డాక్టర్ తను చేసే వైద్యం లో ప్ర ప్రథమం గా నమ్మకం , ధైర్యం యివ్వడం వుండాలి . నిజమైన పరిస్థితి చుట్టాలకు  చెప్ప వచ్చు . కానీ , రోగికి మాత్రం నమ్మకం , ధైర్యం కలిగించాలి . నా వుద్దేశంలో - డాక్టర్లు చెయ్య గలిగిన, చెయ్య వలసిన మొదటి వైద్యం యిదే .

నా అనుభవమే చెబుతాను . 5 ఏళ్ళ క్రితం నన్ను వొక పిచ్చి కుక్క వెనుక నుండి  వచ్చి కాలిపైన కొరికింది . అది పిచ్చి కుక్క అన్నది వెంటనే తెలిసిపోయింది కూడా . ఎందు కంటే , నన్ను కొరికి పరుగెత్తుకెళ్ళి , మరెంత మందినో కొరికింది. నేను వెంటనే నాకు బాగా తెలిసిన వొక డాక్టరు ఫ్రెండు కు ఫోన్ చేసి విషయం చెప్పి ఏం చెయ్యాలని అడిగాను . ఆమె చెప్పినట్టు - కొరికిన భాగాన్ని బాగా టాప్ క్రింద కడిగి (డెటాల్ తో కూడా) వెంటనే, వొక లోకల్ డాక్టర్ దగ్గరి కెళ్లి  ఆంటి రాబీస్ ఇంజక్షన్లు  వేయించుకున్నాను . ఆయన చెప్పినట్టు  చెప్పిన రోజుల్లో వెళ్లి మిగతా అన్ని యింజక్షన్ లూ  వేయించుకున్నాను. 

కానీ - నేను యిక ప్రమాదమేమీ లేదు కదా  - అని ఆయన్ను  అడిగితే, దాదాపు 3-4 నిముషాలు మౌనంగా వుండి , ఆ తరువాత , మిమ్మల్నిఆర్నెల్లలోగా మరో పిచ్చి కుక్క కొరికితే నేను వేసిన యివే ఇంజక్షన్లు పని చేస్తాయి - అన్నాడు . నేను అది సరే , మరో పిచ్చి కుక్క కరవడం అటుంచండి ; ఈ పిచ్చి కుక్క కాటుకు , మీరు చేసిన వైద్యం తరువాత  నాకు మరేమీ  ప్రమాదం లేదు కదా  - అని అడిగితే , మళ్ళీ అదే తంతు . కాస్సేపు మౌనం , మళ్ళీ, మరో పిచ్చి కుక్క కరవడం గురించే మాట్లాడుతున్నారాయన . ఇప్పటికే కరిచిన పిచ్చి కుక్కను గురించి మాట్లాడడం లేదు ఆయన . యిక లాభం లేదని , మరో ముగ్గురు  లోకల్ డాక్టర్ల  దగ్గరకెళ్ళి అడిగితే , అక్కడా యిదే తంతు . ఎందుకిలా ? ఆ తరువాత నేను ఇంటర్నెట్ లో చూశాను . అక్కడా సరిగ్గా యిదే పదాలు రాసుంది . యిదే చెబుతున్నారు ఆ డాక్టర్లు . ఆ తరువాత - దూరంలో వున్న నా ఫ్రెండు డాక్టరును అడిగాను . ఆమె చెప్పిన జవాబు నాకు సంతోషం కలిగించింది , ఆమె - "అన్నా! నేను  వారానికి కనీసం పది మందికి యివే ఇంజక్షన్లు వేస్తూనే వున్నాను . నేను పని చేస్తున్న చోట యిది మామూలు . యిప్పటికి కొన్ని వందల , వేల మందికి వేశాను . అందరూ బాగానే  వున్నారు . ఏ వొక్కరూ పోలేదు .  సరైన సమయానికి ఇంజక్షన్లు వేసుకుంటే  చాలు ; ఏ ప్రమాదమూ లేదు . మీరు యిక ఆ విషయం పూర్తిగా మరిచిపొండి . హాయిగా వుండండి . మీకు ఏ ప్రమాదమూ లేదు." అనింది .

ఈ మాటలు మిగతా వారు ఎందుకు చెప్పటం  లేదు?  వారు చేసే వైద్యం తరువాత కూడా , వొక్క శాతం కేసులు , లేదా 0. 1  శాతం కేసులు ఫెయిల్ అవ్వొచ్చు . కానీ , అడిగే పేషంటుకు ధైర్యం చెబితే ఏం పోతుంది. నా ఉద్దేశంలో వున్న వైద్యం చేసి, డాక్టరు పూర్తి ధైర్యం, నమ్మకం  యివ్వాలి . 0. 1  శాతం కేసులు ఏ రోగం లో అయినా ఫెయిల్ అవ్వొచ్చు . డాక్టర్ ధైర్యం , నమ్మకం యివ్వక పొతే , 0. 1 శాతం పదింతలు పెరిగే అవకాశం వుంది.   కుక్క కాటుకు పోకున్నా , మానసిక  అధైర్యం తో పొయ్యే అవకాశం వుంది .

కాన్సరైనా  అంతే . డాక్టర్లు పూర్తి ధైర్యం, నమ్మకం యివ్వాలి రోగికి . కాన్సర్ పూర్తిగా తగ్గి ఎన్నో దశాబ్దాలు ఆరోగ్యంగా వున్న వారు ఎంతో మంది వున్నారు..  చాలా మంది డాక్టర్లు , తగ్గొచ్చు , తగ్గక పోవచ్చు అన్న  విధంగా   మాట్లాడుతూ వుండడం  నేను చూశాను . రోగుల విషయంలో వారు - అంత సత్య హరిశ్చంద్రులుగా వుండడం చాలా తప్పు . సంస్కృతంలో  సత్యం గురించి గొప్ప నీతి వుంది . "సత్యం బ్రూయాత్ , ప్రియం బ్రూయాత్ , న బ్రూయాత్ సత్యమప్రియం ."  అంటే -  సత్యాన్ని చెప్పండి . ప్రియంగా వుండేటట్టు చెప్పండి . అప్రియంగా వుండేలా ఎలాంటి సత్యమూ చెప్పకండి .   యిలా ఎన్నో వున్నాయి . మీరు చెప్పే అబద్ధం వలన లోక హితం జరుగుతుందంటే - ఆ అబద్ధమే నిజం . ప్రకృతి కూడా , మీరు చెప్పింది , లోక హితం కోసం  అంటే , దాన్ని నిజం చెయ్యడానికి కృషి చేస్తుంది.

రోగి తనకు నయమవుతుందని నమ్మితే - అతని శరీరము , మనసు, అది నిజం చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తాయి . ఆ నమ్మకం అబద్ధం కాదు . కానీ , తనకు నయం కాదని అతడు నమ్మితే , అది నిజమయ్యే ప్రమాదం చాలా వుంది - ఎంత మంచి మందులు యిచ్చినా . అందుకని డాక్టర్లు, రోగి యొక్క కుటుంబ సభ్యులు, అందరూ ,  అతనికి ఆ నమ్మకం పూర్తిగా కలిగించాలి .

నమ్మకం మొట్ట మొదటిదైనా - రోగం పోవడానికి , మందులూ తీసుకోవాలి . నా ఉద్దేశం లో - అల్లోపతి , ఆయుర్వేద - రెండూ బాగా పనిచేస్తాయి , చాలా రోగాలకు . అలాగే - హోమియోపతి వైద్యం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎన్నో రోగాలకు . కానీ సర్జరీ కావాల్సిన చోట ,  కేమోథెరపీ కావాల్సిన చోట , యిలా మరి కొన్ని అధునాతన వైద్యాలకు - అలోపతీ వాడి తీరాల్సిందే . అయితే , యివి వాడుతున్నప్పుడు కూడా - ఎన్నో రకాల ఆయుర్వేద మందులు కూడా వాడవచ్చు . వుదాహరణకు - కాన్సరు పేషంట్లు ,  వీట్ గ్రాస్ జూస్  కానీ  వీట్ గ్రాస్ పౌడర్ కానీ వాడటం, వాటి వుపయోగం చాలా వుండడం నేను చూశాను .

అలాగే , హృద్రోగాలు రాకుండా వుండటానికి , వచ్చినవి ఎక్కువ కాకుండా వుండటానికి - అర్జున మాత్రలు, బాగా ఉపయోగ పడడం నేను చూశాను . బ్లడ్ ప్రెషర్ కు బాబా రామ్ దేవ్ గారి ముక్తావటి మాత్రలు బాగా ఉపయోగ పడటం - పూర్తిగా నయమవడం - నా ప్రత్యక్ష  అనుభవం . యిలా ఎన్నో రోగాలకు , అల్లోపతీ లో సరైన వైద్యం లేని రోగాలకు - ఆయుర్వేదం లో మంచి మందులున్నాయి .  కానీ, కొన్ని రోగాలకు అల్లోపతీ లోనే సరైన వైద్యం వుంది . రోగి - యివి రెండూ వాడితే - చాలా రోగాలు , చాలా త్వరగా నయమవడం నేను చూశాను . కానీ, అల్లోపతీ వైద్యులు యిది వొప్పుకోరు . కానీ, వారికే  యిటువంటి వ్యాధులు వచ్చినప్పుడు , ఆయుర్వేద మందులు వాడడం అన్ని దేశాల్లో జరుగుతూ వుంది . అది తమకు సత్ఫలితాలను యిచ్చినట్టు ఆ అల్లోపతీ వైద్యులు పుస్తకాలు కూడా రాశారు . యిది ఇంటర్నెట్ లో ఎంతో మంది అల్లోపతీ వైద్యులే రాయడం , చెప్పడం - మనం చూడొచ్చు.

ఆయుర్వేద వైద్య పధ్ధతి లో - రోగాలు రాకుండా చేసే వైద్య విధానాలు చాలా వున్నాయి . యివి మనం తెలుసుకోవాలి , పాటించాలి .

ప్రతి దినం  ఉదయం , రాత్రి - 15 నిముషాలు (కనీసం) యోగాసనాలు, ధ్యానం  చేస్తే - శారీరక , మానసిక ఆరోగ్యాలకు రెండింటికీ చాలా మంచిది. 

ధ్యానం ద్వారా  - ఏదైనా సాధించ వచ్చని  పతంజలి నొక్కి చెప్పారు . దురదృష్ట వశాత్తూ, ఈ రోజు - యోగా, ధ్యానం వీటిపైన అమెరికా లో వున్న నమ్మకం , మన దేశం లో లేకపోయింది . అక్కడ యోగా, ధ్యానం చేసే వారి సంఖ్య మన దేశం లో కంటే  చాలా ఎక్కువ .

మన టీవీ  చానెళ్ళలో - వీటిని గురించి ఏమీ తెలియకున్నా , హేళన గా మాట్లాడే మూర్ఖుల సంఖ్య  ఎక్కువగా వుంది . వారు చెప్పే దానికి తగినట్టు , వారికంటే  మూర్ఖులైన  దొంగ  స్వాములు , వారిని నమ్మే  అమాయక ప్రజలు కూడా ఎక్కువగానే  వున్నారు .

యోగా అన్నది మన దేశంలో వున్న అతి  గొప్ప సైన్స్ . అందులో  ధ్యానం అన్నది గొప్ప అంతర్భాగం . వీటి వుపయోగాలు అనంతం - అంటే ఏమీ అతిశయోక్తి కాదు .

నా అభిప్రాయంలో - మన దేశంలో  - డాక్టర్లు , రాజకీయ నాయకులు , మీడియా ప్రముఖులు - వీరికి మొట్ట మొదట - యోగా, ధ్యానం - వీటిలో శిక్షణ యివ్వాలి . డాక్టర్లు చాలా మంది నేర్చుకుంటూ వున్నారు . రాజకీయ నాయకులు , మీడియా ప్రముఖులు - వీరితోనే వచ్చిన చిక్కల్లా .  తమకు ఏ మాత్రమూ అనుభవం లేని ఈ విషయాల గురించి ఎంతో హేళనగా మాట్లాడుతూ వుంటారు . వారు యివి నేర్చుకుంటే - వారూ బాగు పడతారు ; దేశమూ బాగు పడుతుంది .

మీరు చెయ్య గలిగిన, చెయ్య వలసిన  విషయం వొకటి వుంది .

ప్రతి దినం - కనీసం 15 నిమిషాలు -   ధ్యానం చెయ్యండి . ఏ చిన్న, పెద్ద రోగం వున్నా , మీ ధ్యానం వల్ల , మీలో వున్న అపరిమిత నమ్మకం వల్ల , మీ రోగాలన్నీ పోతున్నట్టు , మీరు సంపూర్ణ ఆరోగ్య వంతులౌతున్నట్టు - నమ్మకం తో ధ్యానం చెయ్యండి .  మీ నమ్మకం నిజమౌతుంది. యిది - నా అనుభవం . నా చుట్టూ వున్న వారి అనుభవం . నాకు తెలిసిన ఎంతో మంది అనుభవం . అదే మీ అనుభవం అవుతుంది .

సర్వే జనాః సుఖినో భవంతు .

=  మీ

వుప్పలధడియం విజయమోహన్

27, అక్టోబర్ 2014, సోమవారం

చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ? మన భవిష్యత్తును ఎలా మలుచుకోవడం?

 
చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ?

 నిన్నటికీ , ఈ రోజుకూ ఏమిటి మార్పు ? ఏం తేడా వచ్చింది మన జీవితాలలో, ఈ వొక్క రోజులో - అని అప్పుడప్పుడూ మనం పునరావలోకనం  చేసుకుంటూ వుండాలి కదా. యిది చాలా, చాలా అవసరం.   


వొక్క వారంలో - గ్రుడ్డు పగిలి, పురుగుగా, ప్యూపాగా ఆ తరువాత రంగు రంగుల సీతాకోక చిలుకగా మారడం ప్రకృతి పరిణామం. జంతు జాలమంతా అంతే.  మనిషి వొక్కడే తన భవిష్యత్తు  కొంత తానే    నిర్ణయించ గల సమర్థుడు.


గ్రుడ్డు
కాటర్పిల్లర్
ప్యూపా
సీతాకోకచిలుక
 
మనకైనా , భూతకాలం యొక్క సహజ పరిణామమే వర్తమానం. వర్తమానం యొక్క పరిణామమే భవిష్యత్తు.  

వర్తమానపు వొక్క క్షణంలో - భూతకాలంలో చేసిన అన్ని పనుల ఫలితాలు, భవిష్యత్తు యొక్క అన్ని పునాదులు, యిప్పుడు అనుభవిస్తున్న అన్ని కష్టసుఖాలు - యిమిడి వున్నాయి కదా. 
మీరు భూత కాలాన్ని మార్చగలరా ?  మార్చలేరు . పోనీ వర్తమానం లో మీ అనుభవాల్ని, సుఖదుఃఖాల్ని మార్చ గలరా ? అదీ కష్టమే. ఈ క్షణంలో మీరు అనుభవిస్తున్నదంతా , మీ  భూత కాలపు శ్రమల ఫలితమే .

మీ 'నిన్న', మీ 'ఈ  రోజు' ను శాసిస్తూ వుంది.  

మీ 'నిన్న' + మీ 'ఈ రోజు',  కలిసి - మీ రేపటిని శాసిస్తూ వున్నాయి.   

మీరు చేసే పనులకన్నిటికీ మీరే బాధ్యులు, నేను కాదు అంటాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు. మీ పనులకు, మీకు రావాల్సిన ఫలితం మాత్రం నేనే యివ్వగలను, యిస్తాను ; అది ఎప్పుడు, ఎలా, మీకు యివ్వాలో - అది నిర్ణయించే వాడిని మాత్రం నేనే , నువ్వు కాదు అంటాడు భగవంతుడు .  

యిది మనకు అర్థం కావాలి . బాగా అర్థం కావాలి. ఎవ్వడికి, ఏది వచ్చినా , అది మంచైనా, చెడైనా, అది వాడు చేసిన పనుల ఫలితమే, వాటి ప్రభావమే;  మనకు రాకూడనిది ఏదీ మనకు రావడం లేదు. అలాగే, మనకు రావాల్సినవి ఏదీ , మనకు రాకపోవడం లేదు. 

ఈ  మూల సూత్రానికి కొన్ని వివరణలు అవసరం . వ్యక్తిగా మనం చేసే పనుల ఫలితం మనకు రావాలి; వస్తుంది . అయితే , సంఘంగా , మనం చేసే వుమ్మడి పనుల ప్రభావం కూడా మనలో ప్రతి వొక్కరికీ వస్తుంది. 

వొక వుదాహరణ : వికిలీక్స్ అనే సంస్థ భారత దేశంలోని  అగ్ర రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, అగ్ర క్రీడాకారులు - వీళ్ళంతా స్విస్  బాంకుల్లో, ఎంత నల్ల దానం దాచుకున్నారో - చిన్న లిస్టు వొకటి తయారు చేసి, కొన్ని సంవత్సరాల క్రితం  బాహాటంగానే విడుదల చేసింది . అందులో యింకా ఎంతో, ఎంతో మంది  ఉన్నారన్న విషయం కూడా చెప్పింది. అందులో లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుకున్న వారు ఎంతో మంది భారతీయ నాయకులు వున్నారు. ఎంత చెప్పినా , అప్పటి భారత ప్రభుత్వం ఏ మాత్రం స్పందించ లేదని కూడా చెప్పింది . ఎందుకు స్పందించ లేదంటే , ఏం చెబుతాం ?

స్విస్ బాంకుల్లో  లక్షల కోట్లు మన డబ్బు కాజేసి పెట్టుకున్న వెధవలకు  మనం వోటు వేస్తున్నామా ? లేదా ? మా కులం, మా మతం, మా పార్టీ - అని  మహా స్వార్థంగా , మహా మూర్ఖంగా మనం వోటు వేసేంత వరకు మన దేశం ఎలా బాగు పడుతుంది ?  బాబా రాందేవ్ గారు మొత్తుకుంటూనే వున్నారు - స్విస్ బాంకుల్లో వున్న నల్ల ధనం తెస్తే చాలు - మన దేశం బాగు పడి పోతుందని.
అందుకని  అప్పటి ప్రభుత్వం చేసిందేమిటి ? రామ్ దేవ్ గారి లా ఎవ్వరడిగితే , వారిపైన లేని పోని కేసులు పెట్టింది.  మోడీ గారు వస్తే  తమ గుట్టు బయట పడిపోతుందని,  వారిపై , చెత్త చెత్త కేసులు బనాయించాలని చూసింది. కాకుంటే , చేసిన పనుల ఫలితం - ఎప్పుడో వొకప్పుడు రాక మానదు కదా. యిప్పుడు వస్తూ వుంది .  ఈ హేమా హేమీలతో పోలిస్తే - జయలలితా గారిపైన వున్న ఆస్తి కేసు అసలేమీ లేదు - అని అనిపించక  మానదు. 

అయినా ప్రజలుగా మనం మారాలి . లంచగొండి తనానికి, నల్ల  ధనానికి ఎదురుగా - వొక మహా ఉద్యమం బయలు దేరాలి . మన ఊళ్ళల్లో ప్రతి ఆఫీసులో , వున్న లంచగొండి వాళ్ళను మార్చాలి ; మారని వాళ్ళను,  శిక్షించాలి. వొక క్లార్కుగా, కానిస్టేబుల్ గా వున్న వాడు , ఆస్పత్రిలో ప్యూన్ గా వున్న వాడు కోట్లు సంపాదించాలని ఎందుకు బయలు దేరుతున్నాడు ? నాయకుడు  సర్లేదు కాబట్టి .  మనం సర్లేదు కాబట్టి .

సరైన నాయకులను ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది . మోడీ గారు మూడు సార్లు సంపన్న రాష్ట్రమైన గుజరాత్ కు  ముఖ్య మంత్రిగా వున్న వారు. వారికి కోటి రూపాయల ఆస్తి మాత్రమే వుంది. అంతకు మించి వున్న 40 లక్షలను ప్రధాన మంత్రి కాక ముందే, అనాథ శరణాలయాలకు ఇచ్చేశారు. వొక సరైన ఇల్లు కొనడానికి యిప్పుడు వారి వద్ద డబ్బు లేదు. కానీ, 9 రోజులు వుప వాసం చేస్తూ, కేవలం నీళ్ళు మాత్రం తాగుతూ , గొప్ప గొప్ప వారిని ముగ్ధులను  చేసిన వాక్పటిమ , సాధనా పటిమ రెండూ వున్న వాడాయన. అటువంటి వాడు ప్రధాన మంత్రిగా వుండాలా? చుట్టూ వున్న వారు లక్షల కోట్లు ప్రజా ధనాన్ని మింగుతూ వుంటే  నిమ్మకు నీరెత్తినట్టు నోరు తెరవని వారు ప్రధానిగా వుండాలా ? అదీ కాక పొతే, ఆ మింగే వారే పదవిలోకి రావాలా ? 

సరే . మన  వ్యక్తి గత విషయాలకు వస్తే - మనం వర్తమానంలో చేసే పనుల వలననే - మన భవిష్యత్తు శాసించ బడుతుంది . అయితే భూత కాలం లో మనం చేసిన పనుల ఫలితం కూడా చాలా వుంటుంది. బంగారు బ్రతుకైనా , బండ బ్రతుకైనా  మనం సృష్టించుకునేదే (చాలా వరకు). 

పతంజలి మహర్షి అంటారు - "హేయం దుఃఖమనాగతం " అని. అంటే, రాబోయే కాలంలో రాబోయే దుఃఖాన్ని మాత్రమే మనం అడ్డుకోగలం ; దాన్నుండి తప్పించుకోగలం; కానీ , భూత వర్తమానాల లో జరిగి పోయిన, జరుగుతూ వున్న వాటిని మనం ఏమీ చెయ్యలేం అని . 

రాబోయే సుఖ దుఃఖాలకు కారణం - మనం యిప్పుడు చేసే పని. యిదే మన భవిష్యత్తు ను శాసిస్తుంది.
 
మనం బాగా చదవ వచ్చు. మన ఆఫీసుల్లో చేసే పనులు బాగా చెయ్య వచ్చు. మంచి మాటలు మాట్లాడ వచ్చు. మన, మన వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి  ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చు. లేని వారికి, తోచిన, చేతనైన సహాయం చెయ్యొచ్చు . యిలా మనం చెయ్య గలిగిన పనులెన్నో వున్నాయి .  

 యిన్ని చెప్పడం దేనికి ? మీరేం చేశారో చెప్పండి అని మీరు అనొచ్చు.  నిజమే . నేనేం చేశానో చెబితే - ఆ పైన మీరు చెప్పండి . నేను యింకా, ఏమేమి చెయ్యొచ్చో ? అది నాకూ మేలు. నేను చేసిన ఈ పనులు చాలా చిన్నవే కావచ్చు. కానీ ఏదో కొంత చేశాను. యిక ముందు మరేదైనా చెయ్యాలి . మీ సలహాలకు నా కృతజ్ఞతలు.    

నేను 60 ఏళ్ళ వయసుకు , అంటే  31-12-2008 నాడు రిటైర్ అయిన  తరువాత   యిప్పటికి 5 1/2 సంవత్సరాలు గడిచాయి.  మొదట 3 సంవత్సరాలు స్వామీ పరమార్థానంద గారి క్లాసులకు, మా అన్న, నేను యిద్దరం వెళ్ళే వాళ్ళం. ఆయన స్వామీ దయానంద గారి ప్రథమ శిష్యులలో ముఖ్యుడు. వారు అద్వైత సిద్ధాంతాన్ని, గీత, ఉపనిషత్తులు, శంకరాచార్యుల, వారి శిష్యుల గ్రంథాలు చాలా విశదంగా చెబుతారు. 3 సంవత్సరాలలో అద్వైతం బాగానే వంట బట్టిందని చెప్పొచ్చు.  

అయితే, ఆ మధ్య కాలంలోనే, నేను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి  వారు స్టాక్ మార్కెట్ గురించి పెట్టే 13 పరీక్షలు  వొక్కొక్కటిగా రాశాను. 84 శాతం సగటు మార్కులతో పాసయ్యాను. అందుకని వారు, నాకు ఆ 13 పరీక్షల సర్టిఫికేట్ ల తో బాటు మరో మూడు సర్టిఫికేట్ లు కూడా యిచ్చారు . అవి , యివి : 

1. NSE  సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ - లెవెల్ -5 (యిదే  హైయెస్ట్ )
2. NSE  సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్  ఛాంపియన్ 
3. NSE సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రో (ప్రొఫెషనల్ ) 
 
వొక ప్రక్క అద్వైతం; మరో ప్రక్క స్టాక్ మార్కెట్. యిది - నాకేమీ వైవిధ్యం అని అనిపించ లేదు.  

ఈ పరీక్షలు రాయడానికి ముందు, ICICI DIRECT వారి ద్వారా,  డీమాట్ అకౌంట్  ఓపెన్ చేశాను. నాకు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బులో సగం అందులో వేశాను.  సగం బాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లో వేశాను. మెల్ల మెల్లగా వొక్కొక్క కంపెనీ షేర్లలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్  చేస్తూ వచ్చాను . ఏ కంపెనీ షేర్లలో వేసినా, దాన్ని గురించి కనీసం వొక వారం రోజులు పూర్తిగా అధ్యయనం చేసే, ఆ తరువాతనే వేశాను . 

గొప్ప గొప్ప ఇన్వెస్టర్ల  గురించి, వారి విధానాల గురించి చాలా చదివాను. ముఖ్యంగా, వారెన్ బఫే (బఫెట్ ) గారు చెప్పిన సిద్ధాంతాలు  చాలా చాలా చదివాను. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్  చేయాలనుకునే వారందరికీ, వారెన్ బఫే గురించి మొదట తెలియాలి. స్టాక్ మార్కెట్ లో 'ఇన్వెస్ట్'  చేసే వారికి,  'స్పెకులేషన్'  చేసే వారికి చాలా అంతరం  వుంటుంది. ఎంత మంది చెప్పినా , నేను యింత వరకు స్పెకులేషన్  వైపు వెళ్ళలేదు . 

స్టాక్ మార్కెట్ లో ఎలా, ఎందులో, ఎప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలనేది  వొక సైన్స్ , వొక కళ .   యిది ఎవరైనా నేర్చుకోవచ్చు. యిది జీవితాంతం ఎప్పటికీ యింకా , యింకా నేర్చు కుంటూనే వుంటాను, అని నాకు  బాగా అర్థమయ్యింది. ఈ వ్యాపకం నాకు బాగానే వుంది. లాభ దాయకం గానే వుంది.  

సరే . అందులో వచ్చే  లాభం ఏం చెయ్యడం ?  అందులో నాలుగో వంతు (25%) అనాథ బాలికల, బాలుల విద్య కోసం పెట్టాలని నిర్ణయించుకున్నా. యిలా, పోయిన మూడు సంవత్సరాలూ  చేశాను. 2013 లో , లక్ష పది వేలకు పైగా విరాళం యివ్వ గలిగాను. 2014 లో యిప్పటి వరకు 86 వేలకు పైగా యిచ్చాను.  నవంబర్ 17, మా 36 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా, మరో 80 వేలు యిస్తానని చెప్పేశాను . అంటే - ఈ విరాళాలు రెండూ యిద్దరు అనాథ బాలికల కు 5 నుండి 12 తరగతుల వరకు అయ్యే పూర్తి ఖర్చు అన్న మాట.  యిది కాక, వొకరికి , ఆర్ధిక పరిస్థితి ననుసరించి, 50 వేలు యిచ్చాను కాని అది అభిమాన పూర్వకంగా యిచ్చింది ; విరాళంగా కాదు .  

ముందు ముందు దేవుడి ఆశీర్వాదం వుంటే - యింకా, ఎంతో చెయ్యాలని వుంది. రిటైర్  అయిన సమయంలో, జీతం పెన్షన్ గా మారిన సమయంలో, 1/3 వ వంతు కు తగ్గిన సమయంలో , యింత మాత్రం చెయ్య గలనని ఎప్పుడూ అనుకోలేదు.  యిప్పుడు యింకా , యింకా చెయ్యాలని,  ఉత్సాహం వుంది . 

సరే . జీవితం లో మరో కోణం చూద్దాం . నాకు సంస్కృతం చదవాలని , నేర్చుకోవాలని ఎప్పటి నుండో మనసులో వుండేది . బెంగళూరులో సంస్కృత భారతి  అనే ప్రసిద్ధ సంస్థ  వుంది.  వారు నిర్వహించే సంస్కృత పరీక్షలు, కరెస్పాండెన్స్  కోర్సులు  చాలా ప్రసిద్ధి గాంచినవి . నేను రెండేళ్ళ క్రితం అందులో చేరాను. నాలుగు పరీక్షలూ, ఆరు, ఆరు నెలల, రాయాల్సిన వ్యవధిలోనే రాసేశాను . ప్రవేశ , పరిచయ , శిక్ష , కోవిద - అనే యివి నాలుగూ  పాసు కావడానికి 2 ఏళ్ళు పట్టింది. కోవిద పరీక్షలో 99 శాతం మార్కులతో  పాసు కావడం, నాకు కొంత ఆనందాన్నిచ్చింది. యిప్పుడు, యింకా బాగా నేర్చుకోవాలని  ప్రయత్నిస్తున్నాను .

యివి కాక యింకేం చేశాను ? మీరు చదువుతున్న  ఈ తెలుగు బ్లాగు , ఆంగ్లంలో రెండు బ్లాగులు  రాస్తున్నా.  ఆంగ్లంలో - స్టాక్ మార్కెట్ గురించి వొక బ్లాగు, మరొకటి మన స్పిరిచువాలిటీ  గురించి. అందులో పతంజలి యోగ సూత్రాలు, ఆత్మ బోధ  లాంటి చాలా గ్రందాల గురించి విస్తృతం గా రాయడం జరిగింది. రెండేళ్ళ క్రితం చిలుకూరి వెంకటేశ్వర్లు గారు నాకు పరిచయమయ్యారు. వారు అడగడం, వారు ఆంగ్లంలో ఉపనిషత్తుల పైన రాసిన  పుస్తకాలను చదివి - వాటి మూల గ్రంథాలనూ చదివి , ఎడిట్ చెయ్యడం కూడా జరిగింది. అప్పుడు తెలిసింది , రామకృష్ణ మిషన్ వారి తెలుగు పబ్లికేషన్స్ లో చాలా పుస్తకాలు వారు రాసిందేనని.   అంతకు మించి - తెలిసింది , మన ఉపనిషత్తులు ఎంత పురాతనమైనవైనా, ఎంత గొప్పవో ! అవి చదవడానికి నాకు ప్రోత్సాహమిచ్చిన, వారికి నేనెప్పుడూ కృతజ్ఞుడనై  వుంటాను . 

ఈ  భూత కాలం పునాదుల పైన భవిష్యత్తులో, మరే చిన్న కట్టడాలు,లేదా భవంతులు వుంటాయో - నాకు తెలీదు. అయితే , నిశితంగా ఆలోచిస్తే, పెద్దగా మనం చేసేదేమీ లేదు ; ఏదో అతీత శక్తి అటు వైపు , యిటు వైపు మనలను నడిపిస్తోందని   స్పష్టం గా తెలిసి పోతుంది. ఆలోచన కాస్త మనది ; ఆపై వేసే వొక్క అడుగు మనది ; కానీ అంతకు మించి నడిపించే అతీత శక్తి మరేదో వుంది. 

నాకు తెలిసి చాలా మంది చేస్తున్న పనుల్లో చాలా చిన్న శాతం మాత్రమే చెయ్య గలుగుతున్నా - అని మాత్రం చెప్ప వచ్చు. కాబట్టి యిదేదో స్వంత డబ్బాగా నేను అనుకోవడం లేదు. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి ?  65 1/2 సంవత్సరాల వయసులో ఏం చెయ్యొచ్చు ? ఎన్నో చెయ్యొచ్చు . 


అదీ ఆలోచన, తపన . అంతే .


మరి, మీ సలహా చెప్పండి . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

22, అక్టోబర్ 2014, బుధవారం

నిజమైన దీపావళికి - మన గమ్యాలేమిటి - రాష్ట్రానికి గమ్యం ఏమిటి ?- చంద్రబాబు గారు ఏం చెయ్యాలి?

 

నిజమైన దీపావళి

 
చేసే ప్రతి ప్రయత్నంలోనూ,  మనం విజయం పొందుతామని గ్యారంటీ ఏమీ లేదు . అప్పుడప్పుడూ వోటమి సహజం . మన ప్రతి విజయం వెనుక కొన్ని వోటములు వుండ వచ్చు . అది సిగ్గు పడాల్సిన  విషయం కాదు . అసలు ప్రయత్నమే  చెయ్యని వాడికి , విజయమేమిటి , వోటమి ఏమిటి ? జీవితమే అగమ్యం .
 
మనలో ప్రతి వొక్కరికీ , నిర్దిష్టమైన గమ్యం అవసరం . ఆ గమ్యం వైపు వెళ్ళడానికే ప్రయత్నం కావాలి . మన ప్రయత్నం యొక్క ఫలితం గెలుపో, వోటమో, ఏదైనా కావచ్చు . కానీ, మొదటి నుండి, తుది వరకు, గమ్యం చేరడానికి చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యడంలో మాత్రం మనం ఓడిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన , చాలా అందమైన మాట .
 
జీవితం లో  మనం చేసే ప్రయత్నమే మన విజయానికి మూలము. కట్ట కడపట వచ్చే విజయాన్నే కాదు, మన ప్రతి ప్రయత్నాన్నీ మనం ఆనందించాలి.  ఇదే శ్రీకృష్ణుడు వుపదేశించిన కర్మయోగం . కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
 
ప్రయత్నం మన బాధ్యత.  మనం ప్రయత్నం చెయ్యడంలో, మన బాధ్యతే, మన అధికారమే వుంది ; మన ప్రయత్నాలకు దేవుడు బాధ్యుడు కాదు.  కానీ, ఫలితం యిచ్చేవాడు మాత్రం ఆయనే . ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి ఫలితం యిస్తాడో - అది మన యిష్ట  ప్రకారం  కాదు ; అది తన యిష్ట ప్రకారం యిస్తాడు .   

అందుకే, మన ప్రయత్నాన్ని - మనం పూర్తిగా మన బాధ్యతగా స్వీకరించి , దాన్ని అమలు చేస్తూ ఆనందించాలి. ఫలితం ఎలాగూ వస్తుంది . రాకుండా మాత్రం వుండదు . ఎప్పుడో, ఎలాగో - అది చెప్పడం కాస్త కష్టం. ఆ ఫలితం ఏదైనా , అదీ మనం ఆనందం తో అనుభవించాలి.
 
ఫలితాలు మన ప్రయత్నానుసారంగానే  వస్తూ వుంటాయి - కానీ , కాస్త ముందూ వెనుకలుగా. మనకు అక్కడే కాస్త తికమకగా వుంటుంది .   దాన్ని గురించి  పెద్దగా చింతించ కుండా తరువాత ప్రయత్నం మొదలు పెట్టేసేయ్యాలి ; అలా గమ్యం వైపు సాగిపోవడమే జీవితం .
 
అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలా వద్దా ? చూడొచ్చు. తప్పు లేదు.  ఇది వరకు మనం చేసిందేమిటి ? చెయ్యనిదేమిటి ? చెయ్యాల్సిందేమిటి ? యివి వొక్క సారి చూసుకుని ముందడుగు వెయ్యడంలో తప్పేమీ లేదు . 24 గంటలలో , వొక 5 నిముషాలు  ఈ పని చేస్తే , మిగతా 23 గంటలు, 55 నిముషాలు ప్రయోజనాత్మకంగా వుంటుంది .
 
స్టీఫెన్ కోవీ  గారు  - మీరు వేసే ప్రతి అడుగూ , గమ్యం వైపే వేస్తున్నారా , గమ్యానికి దూరంగా వేస్తున్నారా - అది సరి చూసుకుంటూ  వేయమంటారు.  గమ్యానికి దూరంగా వేసే ప్రతి అడుగూ, మనల్ని, విజయానికి దూరంగా తీసుకెడుతూ వుంటుంది. వాటికి ఫలితం  వుండదని  కాదు .  కానీ, అ ఫలితం  పెద్ద ప్రయోజన కారిగా వుండదు. మీరు నిచ్చెనను వెయ్యాల్సిన గోడకు వేస్తే , చెయ్యాల్సిన పనే చేస్తారు. మరో గోడకు వేస్తే, చెయ్యకూడని పని చేసేస్తారు. అవునా ! యిది మనం చెయ్యాల్సిన పనేనా, వెళ్ళాల్సిన మార్గమేనా అని అప్పుడప్పుడూ చూసుకోవాల్సిన అవసరం వుంది. లేదంటే, వినాయకుడిని చెయ్యబోయి, హనుమంతుడిని  చేసేస్తారు . అమెరికాకు వెడుతున్నామనుకుని అరేబియా కు వెళ్లి పోతారు. రోడ్ల మీద మార్గ దర్శక గుర్తులు అందుకే వున్నాయి . సముద్ర యానం లో దిక్సూచి అందుకే కావాలి . జీవన యానంలోనూ, గమ్యం తెలిపే దిక్సూచి మనకు కావాలి .  
 
అలాగే , స్టీఫెన్ కోవీ  "షార్పెన్  ది సా " అంటారు . అంటే , "మీలోని మేధా శక్తికి, మీ బుద్ధి కుశలత కు, మీ పనిముట్లకు  బాగా పదును పెట్టండి . అవి  బాగా పని చెయ్యగలిగేవిగా వుండేటట్టు  చూసుకోండి" అంటారు ఆయన. యిదే మాట గీతలో శ్రీకృష్ణుడూ అంటాడు  "యోగః కర్మసు కౌశలమ్" అని . అంటే మనం చెయ్యాల్సిన పనిని చాలా బాగా చెయ్యడమే యోగం అంటాడు . యిదే  భారతంలో అర్జునుడు మొదటి నుండీ చివరి వరకు చేశాడు. దీపాలు ఆరిపోతే , చీకట్లోనే భోజనం చేసిన అర్జునుడు , చీకట్లోనే అస్త్రవిద్యను కూడా నేర్చుకోవడానికి పూర్తి  ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు .
 
మనం గమ్య మార్గం లో వెళ్ళాలంటే, దానికి తోడ్పాటుగా  శారీరక బలం, బుద్ధిబలం, దైవ సహకారం అన్నీ మనకు వుండాలి .మనం సాధారణంగా విజయానికి మూల సూత్రాలు  - లాంటివి  ఎన్నో చదువుతూ వుంటాము .  అసలు విజయం అంటే ఏమిటి ? పాండవులు యుద్ధంలో గెలవడం విజయమా? అది వారికి ఎంత మాత్రం సంతోషాన్ని యిచ్చింది ? సత్యభామ నరకాసురుడిని వధించడం విజయమా? అది ఆమెకు సంతోషాన్ని యిచ్చిందా ? కళింగ యుద్ధంలో అశోకుడి గెలుపు అతడికి సంతోషాన్ని యిచ్చిందా? 
 
విజయం సంతోషాన్ని యివ్వాలి.  అలా సంతోషం యివ్వని విజయం  ఎందుకు ? అది , గెలిచినా, వోడినట్టే కదా.  
 
మనసుల్ని గెలవడం చాలా గొప్ప విజయం . మనుషుల్ని గెలవడం చాలా చిన్న విజయం . నిజానికి , దీపావళి అంటే అదే . ఎంత మంది మనసుల్లో  దీపాలు వెలిగిస్తే అంత పండుగ ; అంత ఆనందం .  
 
మోడీ గారు స్వచ్చ భారత్ కావాలి, అది మనం తీసుకు రావాలి అంటారు . అది మొదట మన మనసుల్లో  ఆరంభం కావాలి. మనసుల్లోని కల్మషాన్ని తుడిచి పారెయ్యాలి . అది మనకు ఎంతో  ఆనందం యిచ్చే బృహత్ సాధన . రోజుకు  కనీసం రెండు  సంతోషాన్ని కలిగించే మంచి మాటలు, వారానికి వొక్కటైనా మంచి పని - చెప్పాలి , చెయ్యాలి అనుకుంటే జీవితానికి వొక గొప్ప గమ్యం ఏర్పడుతుంది .  అలా చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు .  ఇది చాలా అందమైన , కానీ , అతి సులభమైన గమ్యం . 
 
వొకాయన అన్నారు - "మా మోడీ గారు స్వచ్చ భారత్ అంటే , మా దేశం లోని కోట్లాది ప్రజలు చీపురు పట్టుకుని దేశాన్ని శుభ్రం చెయ్యడానికి బయలుదేరారు.  మా దేశం శుభ్రం అవుతోంది.  కానీ -  తుపాకీ పట్టుకోండి - అని ఆయన అంటే పాకీస్తాన్ వుగ్రవాదుల్లారా ,  మా ఎదుట మీరు నిలువగలరా ? ఎందుకు మీకీ వెన్నుపోటు తుంటరి చేష్టలు ?" 
 
జీవితంలో విజయానికి అర్థం తెలియని వారికి - నాకు రెండు కళ్ళు పోయినా పొరుగు వాడికి వొక కన్ను పోవాలి - అనుకునే మూర్ఖుడికి - మొదట అది తెలియజెప్పాలి .  
 
దీన్ని దాటి - మనలో ప్రతి వొక్కరూ , మన మన జీవితాలకు వొక గొప్ప గమ్యం ఏర్పరుచుకోవాలి.  
 
ఆనందంగా వుండడమే పెద్ద గమ్యం అయినా - దాన్ని సాధించడానికి అనుబంధంగా,  ఎన్నో గమ్యాలున్నాయి . శారీరకంగానూ , మానసికం గానూ ఆరోగ్యంగా వుండాలి. యిది వొక గమ్యం. ఆర్థికంగానూ ముందుకెళ్లాలి. యిదీ వొక గమ్యం . ఏవైనా కొన్ని విద్యలలో ప్రావీణ్యత సంపాదించాలి .యిదీ వొక గమ్యం .ఇవేవీ వద్దని మన వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు . మన ఋషులు గొప్ప శాస్త్ర వేత్తలు . సృష్టిలోని ఎన్నో రహస్యాలను పరిశోధించి కనుగొన్న వారు. మన ఆయుర్వేదం ఎంత గొప్పదో ! మన వాస్తు శాస్త్రం ఎంత గొప్పదో ! మన యోగ విజ్ఞానం ఎంత గొప్పదో ! మన తర్క శాస్త్రం , మన కర్మ సిద్దాంతం , మన గుణత్రయ విభాగ శాస్త్రం మన సంఖ్యా శాస్త్రం - దేని కదే గొప్పగా యీరోజుకూ ప్రకాశిస్తున్నాయి .  
 
కాకపోతే - తన్ను తాను తెలుసుకోవడం , తన మనసు పైన , తన శరీరం పైన విజయం సాధించడం - అన్నిటి కన్నా గొప్ప విజయం అన్నారు , మన వారు. వంద కోట్ల ప్రజల పైన అధికారం వుంది కానీ, నా మనసు పైన నాకు అధికారం లేదు, నా మనసు నా మాట విననంటుంది - అంటే , అది విజయం అవుతుందా ? అదే - అప్పటి దుర్యోధనుడి , రావణుడి  సమస్య . ఈ రోజుకూ అటువంటి వారందరికీ అదే సమస్య . 
 
మనసు పైన అధికారం వున్న వాడికి , ప్రకృతి  కూడా వశ వర్తి అవుతుందని మన వాళ్ళు గట్టిగా చెప్పారు. వారేం  అనుకుంటే అది చెయ్యడానికి ప్రకృతి  లోని అన్ని శక్తులూ  ముందుకు వస్తాయట.  యిలా జరగడం మనం ఈ రోజుకూ చూడొచ్చు . కాబట్టి, ప్రతి వొక్కరికీ , యిదే గొప్ప గమ్యం . 
 
సరే . రాజుకు ఎలాటి గమ్యం వుండాలి ? ప్రజలంతా , సకల, ఆయురారోగ్య ఆనంద, ఐశ్వర్యాలతో , మహా బుద్ధి మంతులుగా , మహా శక్తి మంతులుగా , సఖ్య భావంతో వుండాలనేగా ?
 
మన మోడీ గారు పీ. టీ. ఉషా గారిని గుజరాత్ కు ఆహ్వానించి , అక్కడ, అందరికీ ఆటలలో తర్ఫీదు యివ్వమని అడిగారు ఆమె కూడా వెంటనే వొప్పుకున్నారు . మరి మన చంద్రబాబు కూడా  మోడీ గారికి తక్కువేమీ కాదు కదా ! అందువలన , వారు కూడా , మల్ల యుద్ధం , జిమ్నాస్టిక్స్ లాంటి మంచి పోటీలలో తర్ఫీదు యివ్వగలిగే వాళ్ళని ఆంధ్రా కు పిలిస్తే  ఆంధ్రులలో - శారీరక ఆరోగ్యమూ , అన్ని రంగాలలో ముందుకు పోవాలన్న బలమైన కోరిక కలగడానికి అనువుగా , ప్రోత్సాహంగా వుంటుంది.  లేదంటే - BP , చక్కర వ్యాధి లాంటి అనారోగ్యాలు మన వాళ్ళలో ఎక్కువవుతూ వుంటాయి .  
 
యిప్పుడు హర్యానా లో - అటువంటి మంచి , ప్రోత్సాహ కరమైన వాతావరణం  వుంది . మన రాష్ట్రంలో లేదు . చంద్రబాబు నాయకత్వంలో - ఆయన ప్రతి రంగంలో - హేమా హేమీ లను పిలిచి - మన వారికి ట్రైనింగ్ యిప్పిస్తే - మన రాష్ట్రం ఎంతో బాగు పడుతుంది .  

 
 
మన రాష్ట్రం లోని ప్రతి వొక్కరూ  - ఆరోగ్యంతో , వుత్సాహంతో ముందుకు సాగిపోయే వారయితే , అంతకు మించిన దీపావళి మరొక్కటి వుంటుందా ? వచ్చే ఆసియాడ్ , ఒలింపిక్స్  లాంటి పోటీలలో , ఆంధ్రులు ఎక్కువ వుంటారనీ , మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తారనీ - మనం ఆశిద్దాం . ఈ మాటలు చంద్ర బాబు గారు వినాలి ; దానికి తగిన చర్యలు తీసుకోవాలి అని - ఆశిద్దాం .
 
ఇలాంటి గొప్ప గమ్యం పెట్టుకుంటే - రాష్ట్రం - అన్ని రంగాలలో , అభివృద్ధి చెందుతుంది - అందులో సందేహం లేదు . 
 
అది మనమందరం కలిసి సాధిద్దామని ఆశిస్తూ - దీపావళికి మీకందరికీ , నా హార్దిక శుభాకాంక్షలు . 
= మీ 
 
వుప్పలధడియం విజయమోహన్ 
 
 
 

18, సెప్టెంబర్ 2014, గురువారం

పరిస్థితి - మనస్థితి - మన "స్థితి" - మనలో వో అమ్మ హృదయ స్పందన


పరిస్థితి - మనస్థితి - మన "స్థితి"

మామూలుగా వచ్చే స్కూలు బస్సు ఆ రోజూ వచ్చి వీధిలో, ప్రతి రోజూ నిలిచే చోటే  నిలిచింది . ఆ వీధిలో వున్న స్కూలు పిల్లలందరూ వొకరి తర్వాత  వొకరు ఎక్కి కూర్చున్నారు . బస్సు కదిలింది . పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ చేతులూపుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను చూస్తూ, బస్సు కనుమరుగయే దాకా చేతులూపుతున్నారు. తరువాత , యిళ్ళకో , ఆఫీసులకో వెళ్లి పోతున్నారు. 

ప్రతి రోజూ ఆ వీధిలో జరిగే తంతే యిది . మళ్ళీ సాయంకాలం పిల్లలను స్కూలు నుండి తీసుకు వచ్చి దించే సమయంలో,  యిదే తంతు రివర్స్ గా జరుగుతుంది. స్కూలుకు వెళ్ళేటప్పుడు పిల్లల మనస్థితి వొక రకం. వచ్చేటప్పుడు మరో రకం .  

అదే విధంగా పెద్దల మనస్థితీ రక రకాలుగా వుంటుంది. బస్సు కాస్త ఆలస్యంగా వస్తే , ఆ రెండు మూడు నిమిషాల్లో వొక్కొక్కరి మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వుంటుంది.  మనసు మంచిని కోరుకున్నా, కీడునే శంకిస్తూ వుంటుంది; తల్లిదండ్రుల విషయంలో మనం యిది చూస్తూనే వుంటాము . బస్సు వచ్చినా - తమ పిల్ల వాడు దిగే వరకు ఏదో ఆత్రుత . 

బడులకెళ్ళే పిల్లలు లేని వారి మనస్తత్వాలు మరో రకంగా వుంటాయి .  కొందరైతే తమకేమీ పట్టనట్టు వుంటారు . కొందరు - ప్రతి రోజూ మన వీధిలోనే ఏమిటీ రగడ , ఏమిటీ బెడద అనుకుంటూ వుంటారు . అందులో ఎవరో వొకరు - దీనిపై తప్పకుండా కంప్లైంట్ రాయాల్సిందే, అని ప్రతి రోజూ అనుకుంటూ వుంటారు.

అసలు పిల్లలే లేని వాళ్ళు , తమకూ ఇలాంటి పిల్లలు వొకరో ఇద్దరో వుంటే బాగుంటుందని రోజూ అనుకుంటూ , ఆ పిల్లలను చూస్తూ వుంటారు . అలాంటి వారు కొంత మంది,  ఆ పిల్లలు తమను చూసినా, చూడక పోయినా, వారందరికీ తాము కూడా చేతులు వూపుతుంటారు.  ఇది వారికి ఆనందమా, కాదా, చెప్పడం కష్టం.  కానీ, చేతులు ఊపక పొతే, వొక వెలితి మిగిలిపోతుంది వారి మనసులో. కొంత మంది పిల్లలు తమ వైపు చూసి చేతులు వూపితే మహదానంద పడి పోతారు . అయినా , ఆ తరువాత , ఏదో వొక వెలితి మిగిలే వుంటుంది .

యిలా  రోజూ జరిగే సాధారణ సంఘటనకు కూడా వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది.

నెలకొక రోజు వాన వస్తే , "ఎన్నాళ్ళ కొచ్చావమ్మా , వానా, వానా " అని వానలో యెగిరి గంతులెయ్యొచ్చు. ప్రతి రోజూ వానే అయితే ? రోజంతా వానే అయితే ?  అప్పుడేం చేస్తాం ? రోజంతా ఎందుకమ్మా , వానా, వానా - అని  అనమా ? తిట్టుకోమా ?

అనొచ్చు . తిట్టుకోవచ్చు . కానీ వచ్చే వానను ఆపలేం . రాని వానను తెచ్చుకోలేం .

గోదావరి నిండుగా ప్రవహిస్తే అందం; ఆనందం ; కానీ, అదే గోదావరిలో వరదలు పొంగి, గ్రామాలనూ , పంటలనూ, ముంచి , నాశనం చేసి హడలెత్తిస్తే - అదీ అందమేనా ? ఆనందమేనా ?

ఎలా ప్రవహించాలి - అన్నది గోదావరి యిష్టం . మీ యిష్టం కాదు . అవునా??  ... కాదు . గోదావరి యిష్టం కూడా కాదు. వర్షాలు ఎక్కువగా కురవకపోతే గోదావరిలో తక్కువ ప్రవాహం; వర్షాలు మామూలుగా వుంటే  నిండుగా ప్రవహించ వచ్చు. ఎక్కువైతే  వరదలు.

అంటే - అదంతా వర్షాల యిష్టం . గోదావరి యిష్టం కాదు. నిజానికి వర్షాల యిష్టం కూడా కాదు. సముద్రంలో నుండి ఎక్కువ మేఘాలు తయారైతే, ఎక్కువ వర్షాలు. లేదంటే, తక్కువ వర్షాలు. అంటే - మేఘాలు తయారు చేసే సముద్రం యిష్టమా ? కాదు కాదు . సూర్యుడు సముద్రంపై ఎక్కువ ఎండలు కాస్తే , ఎక్కువ మేఘాలు ; లేదంటే, తక్కువ మేఘాలు ; అసలు , అదీ కాదు ; మేఘాలను గోదావరిపైకి తీసుకెళ్ళాలంటే ,  గాలి  తోడ్పాటు కావాలి . లేదంటే సముద్రంలో తయారైన మేఘాలు సముద్రం పైనే వర్షిస్తాయి. సూర్యుడు సముద్రం నుండి మేఘాలు తయారు చెయ్యాలి. కానీ , గాలి బాగా వీచి,  మేఘాలను గోదావరి పైకి తీసుకెళ్ళాలి. అక్కడ దానికి చల్ల గాలి తగలాలి . అంటే గోదావరి ప్రక్కన కొండలు, వృక్షాలు కావాలి . యివన్నీ ప్రకృతి లోని వలయాలు . యివి మనకు కొంత తెలుసు; చాలా తెలీదు . ఈ బాహ్య పరిస్థితుల్లో ఏది మన అదుపులో వుంది? దాదాపు  ఏదీ లేదు ! గోదావరిలో వరదలొస్తే - మనం మన కోసం  ఏం చెయ్యాలో -  అది కాస్తా చెయ్యొచ్చు .

గోదావరి నుండి , కృష్ణ కు , కృష్ణ నుండి నీళ్ళు లేని మా ఊళ్లకు కాలువలు త్రవ్వవచ్చు. అలా త్రవ్వితే - గోదావరి వరద నీరు, మా ఊళ్లలో త్రాగడానికీ, పంట పొలాలకూ పనికొస్తుంది. లేదంటే - గోదావరి వరద నీరు, చుట్టూ వున్న గ్రామాలలో ప్రళయం సృష్టించి - కడపట, ఎవరికీ ఉపయోగం లేకుండా, బంగాళాఖాతంలో కలిసి పోతుంది . కానీ, మనం ఏం చేసినా - ఆ వర్షాలను ,  డైరెక్ట్ గా  నీళ్ళు లేని మా ఊళ్లకు తీసుకు రాలేం కదా.   

అసలు ప్రపంచం లో ఏదీ మన అధీనం లో లేదు; ఏదీ మన మాట ప్రకారం నడుచుకోదు - అనిపిస్తుంది.   మన యింట్లోని  వొక్క ఈగ , దోమ ,  చీమ ,  బొద్దింక  కూడా మన మాట వినదు .

అవి వినక పొతే పోనీ . మీ ఆవిడ, మీ వారు (బోలెడన్ని సార్లు) మీ మాట వినరు . మీరూ వారి మాట వినరు - కానీ వారు మీ మాట ఎప్పుడూ వినాలనుకుంటారు.  యిద్దరూ ఏదండం అంటే కోదండం అన్నట్టు గా వుంటారు . వొకరి మాట యింకొకరు వినే యిళ్ళు లేవని నేను అనడం లేదు . వినని యిళ్ళు చాలా వున్నాయంటాను . వింటే - మేలనీ అంటాను. "అహం" పెరిగే కొద్దీ వినని యిళ్ళ సంఖ్య పెరుగుతోందంటాను .

సరే . ఎల్లప్పుడూ ఎవరు వింటారు మీ మాట ? మీ మాట ప్రకారమే నడుచుకునే వ్యక్తి ప్రపంచం లో వొక్కరైనా వున్నారా? నిజం చెప్పనా ? నిజానికి  మీ మాట మీరే వినరు . మీరు అనుకున్నది , మీరు చెయ్యల్సింది,  మీరే చెయ్యరు ; మీరు చెయ్య కూడనిది చేస్తారు .

బయటి పరిస్థితి మనకనుగుణం గా వుండక పొతే - సర్ది చెప్పుకోవచ్చు . సవాలక్ష కారణాలు చెప్పుకోవచ్చు . మనమే మన మాట వినక పోవడానికి - ఎన్ని కారణాలు చెప్పగలం ?


ఇంత కంటే  పెద్ద సత్యం మరొకటుంది .

ప్రపంచమంతా  ఎక్కడ వుందయ్యా - అంటే , మన మెదడులో , మన మనసులో  - అని జ్ఞానులు చెబుతారు . మీరు మీ భార్యను ఎక్కడ చూస్తున్నారు ? వంటింట్లో , అంటారు మీరు .  లేదా, మరో చోట అంటారు . కాదు నా కంట్లో అంటారు - మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే .  వంటింట్లో కాదు , కంట్లోనూ కాదు ; నా మెదడులో , మనసులో , అంటారు - మరి కాస్త బాగా ఆలోచిస్తే . నిజమే . మీరు ఎవరిని చూసినా, దేనిని చూసినా, మీ మెదడులో, మీ మనసులోనే చూడగలరు .

మెదడు,మనసు చూడక పోతే - కన్ను తెరుచుకుని వున్నా చూడ లేరు. ఎదురుగా మనిషి లేకున్నా , కళ్ళు మూసుకుని వున్నా, తెరుచుకుని వున్నా, మనసు తలుచుకుంటే చూడగలరు . యిదొక పెద్ద చేదు నిజం .  బయటి ప్రపంచం  నిజం కాదనడం లేదు . కానీ మీ  అనుభవం , అనుభూతి మాత్రం మీ మెదడులోనే, మీ మనసులోనే కదా .

 ఈ అనుభవం , అనుభూతి ప్రతి మనిషికీ వేరు వేరుగా వుంటుంది . వొకే పువ్వును పది మంది చూస్తుంటే , ఆ పది మంది అనుభూతులూ వేరు వేరుగానే వుంటాయి . చూసే ప్రకృతి , పరిస్థితి వొకటే  అయినా, మన మనస్థితులు మాత్రం ఎంతో విభిన్నంగా వుంటాయి .   మన మనస్థితి ని బట్టి మన స్థితి వుంటుంది - పరిస్థితి ఎలా వున్నా .


బయటి పరిస్థితి లో నిరంతరం జరిగే మార్పులు, ప్రకృతి ధర్మాలను అనుసరించి వుంటాయి . అవి కొంత మనకు తెలుసు . చాలా వరకు తెలీవు .

 ఆ ప్రకృతి ధర్మాల ననుసరించి , మనకెలా కావాలో అలా,  యిండ్లు , రోడ్లు , బస్సులు, రైళ్ళు , విమానాలు యిలా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాము . వర్షాలు ఎప్పుడు రావచ్చో ఊహించి - దాన్ని వర్షాకాలం అన్నాము .  దాన్ని బట్టి పంటలూ, పొలాలూ  ఎన్నో తయారు చేసు కున్నాము .

కానీ, తుఫాన్లు,. వరదలు ఎప్పుడు వస్తాయో మనకు  తెలీదు. కాశ్మీరు లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి . ఎంతో ప్రాణ నష్టము,  ఆస్తి నష్టము , ఎంతో మంది యిళ్ళలో వుండలేని పరిస్థితి ఏర్పడింది . మనం ఎంత మాత్రం వరదలను అడ్డుకో గలిగాము ?  అడ్డుకోలేము కదా !

కానీ - చేతనైనంత సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. మన సంగతి విడవండి . అక్కడి వారే కొంత మంది - భారత ప్రభుత్వము  చేస్తున్న సహాయక చర్యలను అడ్డుకున్నారు . ఎందుకంటే - ఈ సహాయక చర్యలు లేకపోతేనే కదా మన దేశానికి ప్రతికూలంగా వారు చేస్తున్న పన్నాగాలు, ప్రచారాలు ఫలించేది; అక్కడి ప్రజలలో మన పట్ల అపోహలు పెంచేది. యిది కాశ్మీరు ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు ? తమకు సహాయం చేస్తున్నది భారత ప్రభుత్వం ; అడ్డుకుంటున్నది పాకిస్తానీ టెరరిస్టులు, వారితో కలిసిన కాశ్మీరీ వుగ్రవాదులు - అని కాశ్మీరు  ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి కదా . వరదలకు ఇవేవీ తెలీవు . అవి వస్తాయి .  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కలిగిస్తాయి. అవి వాటి ధర్మం .

పరిస్థితులు వాటంతట అవి వస్తాయి . కానీ, మన "స్థితులు" మన మనస్థితులపై ఆధారపడి వుంటుంది .  కాశ్మీరు సమస్య మనస్థితుల సమస్యే కానీ మరేమీ కాదు . పాకిస్తాన్ లోనూ పెద్ద ఎత్తున వరదలూ, వర్షాలూ అన్నీ వచ్చాయి . ప్రాణ నష్టమూ, ఆస్తి నష్టమూ జరిగింది . భారత దేశంలోనూ  అదే ఎత్తున వరదలూ, వర్షాలూ అన్నీ వచ్చాయి . కానీ , యిక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ వుంటే - అక్కడ,  భారత దేశం వలననే పాకిస్తాన్ లో వర్షాలు, వరదలూ - అని ప్రచారం మాత్రం చెయ్యబడుతోంది . పరిస్థితులు యిరు వైపులా వొకటే . మనస్థితులు ఎంత వేరో గమనించండి . ఆ మనస్థితిల ననుసరించే , వారి వారి కార్యక్రమాలు ఆధారపడి వుంటాయి . 

తమిళనాడులో తీర ప్రాంతంలో వొక సారి అకస్మాత్తు గా సునామీ వచ్చింది . కడలి పొంగింది . నింగికి ఎగిరింది . వుప్పుసముద్రం  జన సముద్రం మధ్యకు వచ్చేసింది . అలా వచ్చిన అల వొకటి  తాటి చెట్టు ఎత్తున వచ్చింది . వచ్చి తీరప్రాంతాన వున్న గుడిసేవాసులను ముంచి, రోడ్లు దాటి వూళ్ళలోకొచ్చి భీభత్సం సృష్టించి , మళ్ళీ మెల్లగా, వెనక్కు సముద్రం  లోకి  వెళ్ళిపోయింది .  అది వెనక్కు వెళ్ళే దారిలో  వొక గుడిసె వుంది . అది కూడా అల తాకిడికి మునిగి పోయింది . 

కానీ అందులో వొక జాలరి , అతని భార్య,  కొడుకు,కూతురు చిన్న పిల్లలు వున్నారు . వారందరూ మునిగిపోయారు . కానీ అల  వేగంగా వెనక్కు వెళ్ళే సమయంలో  జాలరి, ఆ నీటిలోనే , గుడిసె మధ్య లో వున్న స్తంభాన్ని వొక చేత్తో గట్టిగా వాటేసుకున్నాడు . అది పడి పోకుండా నిలిచింది. మరో చేత్తో భార్యచేతిని గట్టిగా పట్టుకున్నాడు . అతని భార్య తన మరో చేత్తో , దగ్గరగా అలలో కొట్టుకుపోతున్న కొడుకు చేతిని పట్టుకుంది . ఆమె కూతురు  ఆమె దగ్గరే, అలలో  కొట్టుకు పోతూ వుంది . అమ్మా, అమ్మా అని భయంగా, దీనంగా అరుస్తూ, చూస్తూ  వుంది . కానీ ఆ కూతురును రక్షించడానికి ఆమెకు మరో చెయ్యి లేదాయె . జాలరి, అతని భార్య, కొడుకు మాత్రం బ్రతికారు . కూతురు చనిపోయింది . 

బయట పడ్డ తరువాత ఆ అమ్మ ఏడుపు దీనాతిదీనంగా వుంది . తన కళ్ళ ఎదుటే , తన సమీపంలోనే తన ప్రియమైన కూతురు సునామీ అలలో కొట్టుకు పోతూ వుంటే , అమ్మా, అమ్మ అని అరుస్తూ వుంటే , నన్ను రక్షించవా , నన్ను మాత్రం వదిలేస్తున్నావా,  అన్నట్టు దీనంగా, భయంగా చూస్తూ, అల వేగం తో బాటు సముద్రం లోకి వెళ్లి పోతుంటే - వొక అమ్మ హృదయం  ఎలా స్పందిస్తుంది ? పరిస్థితి అలా వుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను - అనుకుంటుందా ? లేదు కదా ! నేను ఏదో చేసి వుండాలి ; ఏదైనా చేసి వుండాలి ; నా కూతురును ఎలాగైనా రక్షించి వుండాలి ; ఎంత పాపిష్టి దాన్ని అని కుమిలి పోయే ఆ అమ్మ హృదయం .... ; అందులోనే కదా దేవుడనే వాడు వుంటే - జీవిస్తూ వుంటాడు . 

నాకనిపిస్తుంది - వొక ప్రధాన మంత్రి హృదయం ఆ అమ్మ హృదయం లాగా స్పందించాలి . వొక ముఖ్య మంత్రి హృదయం ఆ అమ్మ హృదయం లాగా స్పందించాలి . అంతెందుకు ; మన వూరి MLA హృదయం కూడా అలా స్పందించాలి . అదీ నిజమైన నాయకత్వ లక్షణం అంటే . మన మోడీ గారిలో , కొంత వరకు ఆ లక్షణాలు వున్నాయని నా నమ్మకం .

పరిస్థితులు మన చేతిలో లేక పోవచ్చు . కానీ, మన మనస్థితి మాత్రం మన చేతిలోనే , మన అధీనం లోనే వుంది . మనిషి దేవుడిలా స్పందించవచ్చు . మనిషిలా స్పందించ వచ్చు . మృగంలానో , రాక్షసుడి లానో  కూడా స్పందించ వచ్చు . కానీ వొక  నాయకుడి  స్పందన చాలా మంది ప్రజల హృదయ స్పందనగా మారుతుంది . కానీ , నాయకుడి స్పందన కోసం, "ఎవరో వస్తారని , ఏదో చేస్తారని " మనం వేచి చూడాలా ?

ఎంత మంది అనాథలున్నారు, మన చుట్టూ  ? ఎంత మంది  పేద వాళ్ళు వున్నారు? ఎంత మంది తిండి, గుడ్డ, నీడ లేని వాళ్ళు వున్నారు ? యిది వొక సునామీ కాదా ? వీరిలో కనీసం వొకరిని ఆదుకునే శక్తి మనలో ఎంతో మందికి వుందని నా నమ్మకం. మన లోని ఆ శక్తి బహిర్గతం కావాలంటే , ఆ అమ్మ హృదయ  స్పందన మనలో రావాలి. 

ఆ స్పందన మన అందరిలో రావాలని కోరుతూ 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్  

15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఈ రోజు మీరు ఆడిన ఆట ఎలా ఆడారు - 5 నిమిషాల్లో మనసుపైన మీరు సాధించే విజయం ఎలా ?


వొకాయన  భార్య తనకు బహుమతిగా కొనిచ్చిన తెల్ల గుర్రంపైన కూర్చుని స్వార్తీ చేస్తున్నాడు . కాకపోతే , ఆయన తోకవైపు తిరిగి కూర్చుని స్వారీ చేస్తూ , గుర్రాన్ని తిడుతూ, కొడుతూ వున్నాడు . ఆయన భార్య కోపంతో , నీలాంటి మూర్ఖుడికి ఈ తెల్ల గుర్రం కొనివ్వడమే పొరబాటు . ఎవరైనా తోకవైపు కూర్చుని ప్రయాణం చేస్తారా - అన్నది .

అందుకాయన కూడా కోపంతో - నువ్వు మూర్ఖురాలివి, నీ గుర్రం నీకంటే మూర్ఖపుది . నేను, నేను వెళ్ళ వలసిన వైపే కూర్చుని వున్నా. యిది దానికి విరుద్ధంగా వెడుతుంటే నేనేం చేసేది ? అన్నాడు .

తప్పెవరిది ? గుర్రందా , ఆయనదా ? లేక ఆయన భార్యదా ? ఆయన మాత్రం తను వెళ్ళాల్సిన వైపే కూర్చుని ఉన్నాడట . గుర్రం దానికి విరుద్ధంగా వెడుతున్నదట.

ఏ గుర్రమైనా  ముందుకే వెడుతుంది . ఈయన వెనుక వైపున్న దారిలో వెళ్ళాలి . యిప్పుడేం చెయ్యాలి . గుర్రాన్ని వెళ్ళాల్సిన వైపుకి తిప్పితే , అది ఆ మార్గంలో ముందుకే వెడుతుంది . అప్పుడు యిద్దరి గమ్యం వొకటే అవుతుంది .

నా గమ్యం వేరు . నా వాహన గమ్యం వేరైతే  ఎలా ?

నిజానికి వాహనానికి గమ్యం లేదు . అది ముందుకే వెళ్ళగలదు . కాకపోతే , బయల్దేరే ముందు  ఏ  ప్రక్కకు తిప్పి నిలబెడితే , అది ఆ ప్రక్కన ముందుకే వెడుతుంది .

మనుషులకు ముఖ్య వాహనం - వారి వారి మనసు . అదీ సాధారణంగా, గుర్రం లాగా , ముందుకే దూసుకుని వెళ్ళ గలదు .

ఏ వైపు వెళ్ళాలో , గమ్యం ఏమిటో నిర్ణయించాల్సింది  మనమే . మనకు మన గమ్యమే తెలియకుంటే ,లేదా మనం మనసు యొక్క తోక వైపు కూర్చుంటే -అంటే , మనసు పరుగెత్తే వైపు కాక మరోవైపు పోవాలనుకుంటే , ఎలా కుదురుతుంది ?

మనం ఏదో పరీక్ష పాసు కావాలి . అదీ మన గమ్యం. ఇప్పుడు మనం మన మనసును ఆ వైపు త్రిప్పి నడిపించాలి , మనసును టీవీ వైపు పెట్టి పరీక్ష పాసు కావాలంటే ఎలా ?

ఏ గమ్యం చేరాలన్నా , మనసా, వాచా, కర్మణా అ గమ్యం వైపే  కృషి చేస్తేనే, చేరడానికి  అవకాశాలుంటాయి . అలా కాక , మనసొక వైపు, మాటొక వైపు , చేతలు మరొక వైపు వుంటే - గమ్యం చేరలేము కదా .

మనలో చాలా మందికి - యిదే సమస్య . మీ గమ్యం ఏమిటని అడిగితే - సగం మంది అసలు చెప్పలేరు . వారికి గమ్యం లేదు . వారి గుర్రం - అంటే  మనస్సు ఎటు  వైపు వెడితే , వారి జీవితం అటువైపు వెళ్ళిపోతూ వుంటుంది.
ప్రత్యేకించి గమ్యం అంటూ వుండదు .

మరి కొంత మందికి గమ్యం అంటూ ఏదో వొకటి లోపల వుంటుంది . కానీ వారు - తమ మనస్సును, బుద్ధిని - తమ గమ్యం వైపు త్రిప్పి వుంచరు . అందు వలన మనస్సు పరిపరి మార్గాల్లో పోతూ వుంటుంది . అప్పుడప్పుడూ , నిరాశతో , నిస్పృహతో - అయ్యో, ఎన్నో చెయ్యాలనుకున్నానే , ఏమీ చెయ్య లేక పోతున్నానే - అనుకుంటూ వుంటారు .

మనసు గతి యింతే ; మనిషి బ్రదుకింతే ;  మనసున్న మనిషికీ సుఖము లేదంతే -  అని సినిమా పాటలో లా అనుకుంటే  ఎలా ? సినిమా అయితే  ట్రాజెడీ  కానివ్వండి . పర్లేదు . కానీ మన జీవితం ట్రాజెడీ కానక్కర్లేదు .


 మీ మనస్సు - మీకు సేవకుడుగా వుంటే - మీకు అది అత్యంత ఆంతరంగికమైన,  నమ్మ దగిన సేవకుడుగా , మిమ్మల్ని మీ గమ్యం వైపు తీసుకుని వెడుతుంది .మీ అన్ని విజయాలకు అది కారణమవుతుంది.  

అలా కాక మీ మనస్సు మీకు యజమానిగా  ప్రవర్తిస్తూ , మిమ్మల్ని శాసిస్తూ వుంటే - అది మీకు అత్యంత అంతరంగిక విరోధిగా, మిమ్మల్ని మీ గమ్యం నుండి బహు దూరంగా తీసుకుని వెడుతుంది .మిమ్మల్ని అన్ని రకాల చిక్కుల్లో పడ  వేస్తుంది .

ఈ మాట చెప్పింది  సాక్షాత్తు  శ్రీకృష్ణుడు . అదీ భగవద్గీత లో .

మనసు యజమానైతే , మనం సేవకులైతే - ఏమవుతుంది .

మనసుకు నచ్చినవి , అలవాటైనవి కొన్ని వున్నాయి . వాటినన్నిటినీ  కలిపి అంతః  శత్రువులు  అని అంటారు.  అవి - (అ) మితి మీరిన కోరికలు (కామం),    (ఆ)  రక రకాల కోపాలు (క్రోధం ),   (ఇ)  అన్నీ నాకే కావాలన్న స్వార్థం (లోభము),   (ఈ) ప్రతి దానిపైన  వ్యామోహం (మోహం),  (ఉ) నేనే గొప్ప అన్న సుపీరియారిటీ  కాంప్లెక్స్ (మదం),   (ఊ) ప్రక్క వాడి సంతోషాన్ని, విజయాన్ని వోప్పుకోలేని యిన్ఫీరియారిటీ  కాంప్లెక్స్ (మాత్సర్యం ),  (ఎ) ఎన్నో రకాల భయాలు. 

మనస్సు యజమానైతే - అది మనల్ని వీటి వైపే లాగుతుంది . వీటన్నిటిలో , మన పతనమే  వుంటుంది  కానీ , సంతోషం , విజయం  రెండూ వుండవు .

మనం, మనస్సుకు యజమానిగా వుంటే - ఆయురారోగ్య , ఐశ్వర్య , సంతోష , శాంతి, విజయాల్లాంటివి , అన్నీ లభిస్తాయి . మన  మనస్సు , మనల్ని , వీటి వైపూ నడిపించ గలదు.

అందుకే పతంజలి  మహర్షి , యోగః  చిత్త వృత్తి  నిరోధః - అన్నారు . మనస్సును మన యాజమాన్యం లో పెట్టుకుంటే - అదే యోగం. అదే సంతోషం . అదే అతి గొప్ప విజయం .

జీవితం లో మరే గమ్యమూ ,   దీని కంటే గొప్ప గమ్యం కాదు. 

కానీ - మన జీవితాల్లో, కొన్ని సాధారణ గమ్యాలు వుండనే వుంటాయి .

ప్రేమ, పెళ్లి , భార్య , భర్త, పిల్లలు, చదువులు, ఉద్యోగాలూ, సంపాదనలు, ఆటలు, స్నేహాలు, రోగాలు , యవ్వనము , మధ్య వయస్సు . ముసలితనము , చావులు -  యివన్నీ సాధారణ గమ్యాలకు సంబంధించిన విషయాలు .  వీటిని తప్పించుకుని  మనం వుండ గలమా ?

యివి వొద్దని ఎలా చెప్పగలం ? యివి వుండనే వుంటాయి , మన సాధారణ జీవితాల్లో . 

బాల్యము , కౌమారము, గార్హస్థ్యము , ముసలితనము అన్నీ వున్నాయి మనకు . ఆయా జీవిత కాలాలకు తగిన వ్యాపకాలూ వున్నాయి

శంకరాచార్యులు చాలా సందేహ రహితంగా అన్నారు - బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రాహ్మణి కోపిన సక్తః.  యిది మన అందరికీ వర్తిస్తుంది .

చిన్నతనంలో గోలీలతో ఆడుకుంటారు . చిన్న చిన్న రాళ్ళను దాచుకుంటారు . మరి యవ్వనం వస్తే , ఈ యిష్టాలన్నీ పోతాయి. క్రొత్త ఇష్టాలు వస్తాయి.  స్త్రీల వెంట  పురుషులూ, వీరి వెంట వారూ  లవ్వో,లవ్వో  అంటూ పోతారు . అది కొన్నాళ్ళే . ఆ తరువాత, అందరి అమర ప్రేమలు మరో రకంగా మారిపోతాయి . 

పిల్లలూ , వారి చదువులూ , వారు పెరగడమూ , మనం ముసలివారవడం , అప్పుడు వచ్చే చింతలు ఎన్నో , ఎన్నెన్నో. అవీ తమకు అనవసరమైన చింతలు; అందుకే  - మనవారు, వానప్రస్థము , సన్యాసము లాంటి  నియమాలు, ఆశ్రమాలు  ఏర్పరిచారు - ఎవరికీ కష్టం లేకుండా .

వయసు పెరిగే కొద్దీ - మనం ఎవరో , మన అసలు, సిసలు  గమ్యం  ఏదో తెలుసుకోవాలి . అందులో వుండే ఆనందం అర్థం చేసుకోవాలి . 

గృహస్తాశ్రమం లో భార్య, భర్త - వొకరిపై వొకరికి అనురాగం ; వొకరికి వొకరు ప్రాణం గా వుండడం ; పిల్లలను కనడం ; వారిని అపురూపంగా , ప్రేమగా పెంచడం ; వుద్యోగాలు , వ్యాపారాలు - యివన్నీ వుండనే  వుంటాయి . వొక వయస్సులో - వుద్యోగాలు , వ్యాపారాలు పిల్లలకు వదిలేసి , భార్యాభర్తలు వొకరినొకరు బాగా చూసుకోవలసిన ఆశ్రమం, దేవుడా అని కొంతైనా అనుకోవలసిన ఆశ్రమం వానప్రస్థం. ఈ రోజుల్లో  యిది మానసికంగా  చెయ్య గలమే కానీ , ముందులా - అరణ్యాలకు పోలేం కదా . అందుకే  పాపం వృద్ధాశ్రమాలు  వస్తున్నాయి. కానీ యివి రావడం, పిల్లల బాధ్యతా రాహిత్యం వలన, మరెన్నో కారణాల వలన రావడం దురదృష్టకరం .

ఈ ఆట ప్రతి వొక్కరి జీవితాల్లో - దాదాపు యిదే రకంగా , చర్విత చర్వణం గా జరుగుతూ వుంది .

బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రహ్మణి కోపిన సక్తః.  యివన్నీ , పెరిగే కొద్దీ , మనలో, శారీరకం గా, మానసికంగా, సహజ సిద్ధంగా  జరిగే మార్పులు. అంటే, ప్రకృతి మన శరీరానికి, మనస్సుకు, ముక్కుత్రాడు వేసి లాక్కు పోతూ వుంటే - మనమూ దాని వెంట అలాగే  వెళ్లి పోతూ వున్నామన్న మాట . 

దీన్ని దాటి, ముందుగా, మున్ముందు జరిగేది కూడా తెలుసుకున్న వారు ఎవరు?

ఆట కదరా శివా; ఆట కదా కేశవా - అని, సాక్షీభావంతో - ద్రష్టగా ఈ జగన్నాటకాన్ని -  ఆనందంగా చూస్తూ, ఆడుతూ వుండ గలిగే వారెందరు? 

కృష్ణుడూ - ఈ నాటకం ఆడాడు , కానీ ద్రష్టగా . అయితే , కృష్ణుడు ఈ ఆట ఆడినంత తన్మయంగా, ఆనందంగా , "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడుతూ , ఆ పనులు చేస్తూ" తమ తమ పాత్రలలో అంత బాగా లీనమై న వారు  అప్పుడూ లేరు ; యిప్పుడూ లేరు. అంటే, మన పాత్రను మనం ఆనందిస్తూ కూడా , అందులో లీనమై కూడా - ద్రష్టగానూ  వుండొచ్చు , అలా వుండాలని మనకు చెప్పిన వాడు కృష్ణుడు .

కృష్ణుడిలో - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యర్య, భయాలు లేవు. కానీ అమితమైన వాత్సల్యం వుంది , ప్రేమ వుంది . కరుణ వుంది . శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ రెండూ చేశాడు . 16 వేల మంది గోపికలు , ఆ నీల మేఘ శ్యాముడి వెనుక బడ్డారు. పైగా 8 మంది భార్యలు కూడా . అందరూ ఆయన భక్తులే . అందరికీ ప్రేమను పంచాడు . ఆయన లో అశక్తత, అధైర్యం లేదు. దుష్ట శిక్షణ తానూ చేశాడు . పాండవుల ద్వారానూ చేయించాడు . కృష్ణుడి జీవితాన్ని మనసులో వుంచుకునే - మనం భగవద్ గీతను  చదవాల్సి వుంటుంది ; అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జీవితాన్నుండి  పారి పొమ్మని కృష్ణుడెప్పుడూ  చెప్పలేదు .

ఈ ఆట ఆడాల్సిందే. ఆనందంగా, సమర్థ వంతంగా ఆడాలి. వోటమికి క్రుంగి పోవడం, పారిపోవడం మన పాత్ర కు  న్యాయం చేసినట్టు కాదు. మళ్ళీ ఆడాలి .

"వొక్కొక్క  రోజూ కొత్త ఆటే. ఈ రోజు ఆట మీరు బాగా ఆడారా - అన్నదే ప్రశ్న. ఈ రోజు మీరు సంతోషంగా వున్నారా? ఎంత మందిని మీరు సంతోష పెట్టారు? నిన్నటి కంటే ఈ రోజు - క్రొత్తగా ఏం నేర్చుకున్నారు? ఏ విధంగా మీరు నిన్నటి కంటే బాగు పడ్డారు?  మీకు మీ గమ్యం జ్ఞాపకం వుందా? అటువైపే వెడుతున్నారా? మీరు ఈ రోజు చేసిన పనుల కంటే భిన్నంగా, గొప్పగా మరేదైనా చేసి వుండ వచ్చునా? వుంటే అది రేపు చేస్తారా? ఈ రోజు ఎవరికి సహాయ పడ్డారు? ఈ రోజంతా మీలో వచ్చిన భావనలు, ఆలోచనలు - సకారాత్మకమైనవా, నకారాత్మకమైనవా ? రేపంతా మీరు సకారాత్మకం గానూ , ఆనందం గానూ వుండాలంటే  చెయ్యాలి? "

వొక్క 5 నిమిషాలు - కళ్ళు మూసుకుని (TV కి దూరంగా) ఈ రోజు మీరు ఆడిన - మీ ఆట గురించి ఈ ప్రశ్నలు వేసి నిజమైన సమాధానాలు మీరు వెతుక్కుంటే - నిజమైన ద్రష్టగా మీరు మారిపోతారు.

మీకు యిష్టమైతే 10 నిమిషాలు గానీ , అంత కంటే ఎక్కువ కానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. మీకు నిజమైన , స్వచ్చమైన ఆనందం - అప్పుడే వస్తుంది.

 ఎందుకంటారా ?

ఆ పది నిమిషాల తరువాత - మీరే  "ఆనందం " గా మారిపోతారు గనుక .

లోపలున్న చెత్తంతా పొతే, మీరే ఆనందం . అదే యోగం . అదే సాధన . అంతే .

చాలా సులభమైన విషయం యిది. ప్రతి 24 గంటలలో - 5-10 నిమిషాల కృషి తో యిది సాధించదగిన విషయం. సాధించ వలసిన విజయం.

మీ మనసుపైన మీరు సాధించే విజయం యిది .

చేస్తారా మరి .

= మీ

వుప్పలధడియం విజయమోహన్




14, సెప్టెంబర్ 2014, ఆదివారం

నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?


నాకు నచ్చిన 10 మంది

"మన దేశం" లో నాకు బాగా నచ్చిన 10 మంది వ్యక్తుల పేర్లునచ్చిన  క్రమంలో నేను రాయగలనా ? ఏమో! వెంటనే  చెప్పలేక పోతున్నాను.

కానీ అసలు నాకు బాగా తెలిసి వుండాల్సిన  లిస్టు గా యిది. మన దేశంలో నాకు బాగా నచ్చిన వాళ్ళు కనీసం పది మంది వున్నారా, లేదా వుంటే,వాళ్ళెవరు ? ఎందుకు నచ్చారు ? యిది నాకు  తెలియాలా,వద్దా ?

నచ్చని వాళ్ళ లిస్టు అక్కర లేదు. అది చాంతాడంత వుండొచ్చు ; హనుమంతుడి  తోకంత  వుండొచ్చుయింకా పెద్దగానూ వుండొచ్చు . ఆ లిస్టు వొద్దు లెండి .

కానీ నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లో మనకు పెద్ద శ్రమనో , ప్రమాదమో లేదు కదా .

అది తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తా .

1. మహాత్మా గాంధీ : - గాంధీ గారు నాకు బాగా నచ్చారు . సత్యము, అహింస తో ఎన్నెన్ని సాధించ వచ్చునో - ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు . ప్రపంచానికే మార్గ దర్శకుడైన  గాంధీ మనకు నచ్చకపోవడం ఎలా? నాకు ఆయన చాలా బాగా నచ్చాడు . ఆయన  రాసిన ఆత్మకథ లాంటి పుస్తకం మరొక్కటి "నభూతో న భవిష్యతి".  తన తప్పులను ఏవీ దాచుకోలేదాయన.  అలా మరెవ్వరూ చెప్పలేరు.  ఆయన జీవితంలోని సంఘటనలు చదివే , మేమూ, 55 ఏళ్ళ క్రితం , మా వూళ్ళో , మా యింట్లో , లెట్రిన్ కు మా స్వహస్తాలతో గోడలు కట్టి దాన్ని శుద్ధి చేసి , కాస్త గర్వం గా కూడా  అనుభూతి చెందాము.  కుష్టు రోగులకు స్వహస్తాలతో మందు రాయడం, వాళ్ళను బాగా చూసుకోవడం లాంటి పనులు - అప్పుడు కానీ, యిప్పుడు కానీగాంధీ తప్ప మన నాయకులెవరూ చెయ్యలేదు . గాంధీ గారిని గురించి ఎంతో చెప్పొచ్చు .కానీ , మమ్మల్ని, చిన్నతనం నుండీ ఆయన జీవితం బాగా ప్రభావితం చేసింది కనుక యీలిస్టు లో మొదట ఆయన పేరు రాస్తున్నా - ఆయన యిప్పుడు లేక పోయినా . ఆధునిక యుగంలో, మన 21 వ శతాబ్దంలో, గాంధీ చాలా గొప్ప యోగి, అభ్యుదయ వాది, మానవతా వాది అని నా ప్రగాఢ  నమ్మకం . నా ఈ లిస్టులో యిప్పుడు లేని వారి పేర్లు - గాంధీ తప్ప - మరెవరిదీ రాయను . ఎందుకంటే - భూతకాలంలో ఎంతో మంది గొప్ప వారు వుండవచ్చు . కానీ , ఈ రోజు సజీవంగా , మన మధ్య వుండి, మన మధ్య , మానవ కల్యాణానికి కృషి చేస్తున్న వారు ఎవరు , వారిలో నాకెవరు నచ్చారు - అన్నదే నా ఆలోచన

2. నరేంద్ర మోడీ :-  మన యిప్పటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాకు బాగా నచ్చారు . లంచగొండితనానికి   ఆయన చాలా, చాలా దూరం .  చెప్పే పని చెయ్యడం , చేసే పని చెప్పడం - ఆయన ప్రత్యేకత. ఆయన్ను గురించి చెడ్డగా మాట్లాడే వారు తాము చెప్పుకో గలిగే పనులేం చెయ్య లేదు . మోడీ గారు చాలా, చాలా మంచి పనులు, గొప్ప పనులు చేశారు; చేస్తున్నారు. మద్య పాన నిషేధం వున్న వొకే వొక రాష్ట్రం గుజరాత్ . ఆ రాష్ట్రంలో  రోడ్లు, నీరు, విద్యుత్తు -పుష్కలంగా వుండేట్టు చేసిన ఘనత ఆయనది . మన రాష్ట్రాలలో, మద్యం నుండి వొచ్చే పన్ను యొక్క ఆదాయమే చాలా ఎక్కువ .   ఆదాయం ఎక్కువ అయినా రోడ్లు లేవు, నీళ్ళు లేవు, విద్యుత్తూ లేదు మనకు.   మద్య పానం మన రాష్ట్రాలలో వుంది గనుక, నేరాలు ఘోరాలు అక్కడికంటే యిక్కడ ఎక్కువ.  కాక పొతే అక్కడ వొక్క నేరం జరిగినా  వెంటనే తెలిసిపోతుంది.  మిగతా రాష్ట్రాలలో వంద నేరాలకు వొక్కటి పైకొస్తే  ఎక్కువ.  మోడీ గారి మాటలలో, ఎప్పుడూ "నూరు  శాతం ప్రజల" అభివృద్ధి వుంటుంది.   మిగతా వారి మాటలలో - ఏదో వొక వోట్  బాంక్  ను గురించే వుంటుంది ఎప్పుడూ.  మోడీ గారి చేతలూ అంతే.   సర్వే  జనాః సుఖినోభవంతు - అనేటట్టే  వుంటుంది.  ఆయన నేతృత్వం కొనసాగితే - 10 ఏళ్ళలో మన దేశం - అన్ని దేశాల్లో ప్రథమ స్థానంలో వుంటుందన్న  విషయంలో, నాకైతే సందేహం లేదు.   మోడీని గురించి చాలా చెప్పొచ్చు . వారి విషయం లో నా ఆశ  వొక్కటే . BJP లోని వారూ, RSS  లాంటి అనుబంధ సంస్థల్లోని వారూ కూడా, మోడీ లాగా, సర్వే జనాః సుఖినో భవంతు - అని మనసా, వాచా కర్మణా - అనుకోగలగాలి.  మోడీ మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. మోడీ నేతృత్వం లో వారు మసలుకోవాలి . అలా జరగాలని ఆశిద్దాం . 

3. సద్గురు జగ్గి వాసుదేవ్ :- ఈయన తమిళనాడులో , ముఖ్యంగా, యువతలో , వొక పెద్ద విప్లవమే తెచ్చాడు . దేవుడు లేడు , వద్దు - అనే  రాజకీయాలు వున్న తమిళనాడు  రాష్ట్రంలో , దాదాపు కోటి మంది ఈయన శిష్యులు గా మారిపోయారు . వారి అందరి జీవితాలలో అనూహ్యమైన మార్పు రావడం నేను చూశాను.  ప్రతి యింటిలోను , "యోగ" అనే జ్యోతి వెలగాలని , ఈయన చేస్తున్న కృషి అపారం . నిరుపమానం .  యిదే కాక, విద్యారంగంలోనూ , పర్యావరణ రంగంలోనూ  ఈయన కృషి తమిళనాడులో ప్రథమ స్థానంలో వుందని నా నమ్మకం . ముఖ్యంగా , తమిళనాడు  లోని యువతను, కుల మతాలకు అతీతంగా , ఏకం చేయడానికి ఈయన చేసినంత, చేస్తున్నంత  సకారాత్మక సేవ మరెవరూ చెయ్యలేదని నా నమ్మకం.  ఈయన ఆంగ్లంలో - చాలా సహేతుకంగా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడంలో చాలా  దిట్ట . ఈయన మాట్లాడే తమిళం వొక ప్రత్యేక యాసలో వున్నా - అందరికీ నచ్చింది . మన దైనందిన సమస్యలకు ఈయన యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . 

4. శ్రీ శ్రీ రవిశంకర్ (గురూజీ ) :- ఈయనా సద్గురు జగ్గి వాసుదేవ్ లాగా - యోగా, విద్య, లాంటి అనేక రంగాల్లో - యివతపై తమ అపార ప్రభావాన్ని చూపుతున్న వారే. సేవ, ప్రేమ , సహనం  లాంటి వున్నత విలువలను ఈయన ప్రపంచం అంతటా - కుల, మత, దేశ, రంగు , లాంటి అన్ని విభేదాలనూ   దాటి - విశ్వ మానవ ఐక్యత ను ప్రబోధిస్తున్న వారు  ఈయన. ఈయన శిష్యులూ కోట్ల సంఖ్యలో ప్రపంచమంతటా  వున్నారు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ వుండే ఈయన స్థాపించిన "ఆర్ట్ ఆఫ్ లివింగ్ " సంస్థలు 152 దేశాలలో వున్నాయి . ఈ సంస్థ నెలకొల్పిన గిన్నిస్  రికార్డులు చాలా వున్నాయి . సద్గురు జగ్గి లాగానే , మన దైనందిన సమస్యలకు శ్రీ శ్రీ గారు యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . "జ్ఞాని " అన్న పదం వీరిరువురికీ బాగా వొప్పుతుంది.  

5. బ్రహ్మకుమారి శివాని :- ఈమె సంభాషణలు "పీస్  ఆఫ్ మైండ్ " అనే టీవీ  చానెల్ (బ్రహ్మ కుమారి సంస్థదే) లోనూ, మరెన్నో చానెళ్ళ లోనూ (ఆస్థా , సంస్కార్ ) ప్రతి దినమూ వస్తూ వుంటుంది . నిత్య జీవితంలోని అనేకానేక సమస్యలకు యీమె సమాధానాలు చాలా చక్కగా, సహేతుకంగా వుంటాయి.  బ్రహ్మ కుమారి సంస్థ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరగడానికి, యీమె కూడా వొక కారణమని తప్పక చెప్ప వచ్చు . ఇవి తెలుగులోనూ తర్జుమా అయితే  చాలా బాగుంటుంది . చిన్న వయసులోనే , యింత విజ్ఞానం  వెదజల్లుతున్న  యీమె కృషి చాలా ప్రశంసనీయం. ఆత్మ , పరమాత్మ లాంటి విషయాల్లో  నేను శివాని గారి భాషణలు పెద్దగా పట్టించుకోను . ఆ విషయాలు నేర్చుకోవాలంటే - శాస్త్ర జ్ఞానం అపారంగా వున్న వారు చాలామంది వున్నారు. కానీ - సామాజిక సమస్యల విషయాల్లో , దైనందిన మానవ సమస్యల విషయాల్లో , మిగతా వారి కంటే - శివాని గారి భాషణలు  నాకు చాలా బాగా నచ్చుతాయి . ఆమె చెప్పేవన్నీ మనం సులభంగా చెయ్య గలిగేవి; చెయ్యవలసినవి. మనకు ఎంతో ఉపయోగ పడేవి . 

6. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు :-  తెలుగులో  ప్రవచన కర్తలలో - ఈయన మొదటి వారు  - అని అందరూ వొప్పుకోక తప్పదు . సరస్వతీ పుత్రుడు - అనిపించే ఈయనకుసంస్కృత,ఆంధ్ర భాషలు - రెండింటి  లోనూ  వున్న  పాండిత్యము , సాహితీ ప్రకర్షధారణా  శక్తి, సమయోచిత ప్రజ్ఞ , అపారము.  హైందవ విలువలను గురించి ఈయన చెప్ప గలిగే తీరు అసమానం . వొక్కో సారి ఆది శంకరుల వారు మన విలువలను మళ్ళీ మనకు చెప్పడానికి ఈయనను పంపించాడా  అని - అనిపిస్తూ వుంటుంది నాకు. ఈయనది పూర్తిగా శాస్త్ర విశ్లేషణ . శాస్త్రంలో వున్నది తప్ప నేను మరేదీ చెప్పనంటారాయన . బ్రహ్మకుమారి శివాని గారిది పూర్తిగా సామాజిక, మానసిక  విశ్లేషణ . సామాజిక, మానసిక  విశ్లేషణ లో శివాని గారిది , శాస్త్రీయ విశ్లేషణలో  చాగంటి గారిది - భాషణలు  అద్వితీయం గా, ఆహ్లాద కరంగా, చాలా విజ్ఞాన దాయకంగా వుంటాయి.

7. S.P. బాలసుబ్రమణ్యం :- సంగీతానికి సేవ చేసిన వారు చాలా మంది వున్నారు . కానీ, తెలుగులో , సంగీతానికి యింత సేవ చేసిన వారు ఈయన వొక్కరే అని - నాకు అనిపిస్తుంది . తెలుగు యువతలో , పిల్లలలో - సంగీతం పట్ల యింత అభిరుచిని  సృష్టించిన  వారు బాలు వొక్కరే - అని చెప్పక తప్పదు. పాడటం గొప్ప. పాడించడం అంతకంటే  గొప్ప. మన రాష్ట్రంలో, లక్షలాది మందిలో , కేవలం సంగీతం వినటమే గాక , పాడటం పట్ల ఆసక్తి యింతగా పెంచిన వారిలో SP బాలు వొక్క ఎవరెస్టు శిఖరం లాంటి వాడు అని చెప్ప వచ్చు . పాడటంలో ఆయన కంటే గొప్ప వారు ముందు వుండి వుండ వచ్చు. యిక ముందూ  రావచ్చు. కానీ , నేనూ పాడాలి - అన్న ఆసక్తి లక్షల మందిలో కలిగించి , ఎలా పాడాలి అన్నది వారికి నేర్పిస్తూ , మంచి  సంగీతం వినాలి అన్న ఆసక్తి కోట్ల మందిలో కలిగించిన ఘనత బాలూ గారిదే. సహజంగా, సరళంగా, సున్నితంగా, మనసును ఆకట్టుకునేలా మాట్లాడడం , అందులోనే అత్యంత ప్రయోజన కరమైన సలహాలనూ యివ్వడం - బాలూ ప్రత్యేకత . 

8.  బాబా రాందేవ్ :- ఈయన రాజకీయాలు  మనకు  నచ్చ వచ్చు ; నచ్చక పోవచ్చు . కానీ, యోగ శిక్షణ కోసం ప్రజల మధ్య ఈయన చేసినంత కృషి మరెవరూ చెయ్య లేదని నా విశ్వాసం . యోగా గురువులలో - అన్ని ప్రక్రియలూ "తానుగా" చేసి చూపిస్తూ , దాన్ని విశ్లేషిస్తూ , అలా చెయ్యమని - ఉత్సాహపరిచే గురువులు చాలా అరుదు. అందులో ప్రథముడుగా బాబా రాందేవ్ ను చెప్పుకోవచ్చు. ఆయన యోగా శిబీర్ కు నేనూ వెళ్లాను . వారం పాటు శిక్షణ పొందాను . అలాగే - నేను సద్గురు జగ్గి గారి యోగా శిక్షణనూ , శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ నూ కూడా పొందాను. యిప్పుడు అవన్నీ కలిపే సాధన చేస్తాను . నాకు అందరూ గురువులే . కానీ, రాందేవ్ గారి యోగా ప్రక్రియలు - ఆరోగ్యానికి అత్యంత సులభకరమైన , ప్రయోజన కరమైన ప్రక్రియలు అని నాకు అనిపిస్తుంది . అయితే - జగ్గి గారి శిక్షణ మరో రకంగా ఉన్నతమైనది; శ్రీ శ్రీ  గారి శిక్షణ మరో రకంగా . దేని కదే గొప్ప . బాబా  రాందేవ్ కృషి - ఆయుర్వేదం విషయంలో చాలా చాలా ప్రశంసనీయం . యిప్పుడు మా యింట్లో - చాలా వరకూ , మేము ఆయుర్వేద మందులే వాడతాం . అందులోనూ రాందేవ్ గారి పతంజలి యోగ చికిత్సాలయ్ మందులే ఎక్కువ . మిగతావి కూడా ఆయుర్వేద మందులు ఎక్కువ వాడతాము.  మేమే కాదు . లక్షలాది కుటుంబాల్లో అల్లోపతీ కంటే - ఆయుర్వేదం  ఎక్కువగా  వాడుతున్నారు యిప్పుడు . యోగా + ఆయుర్వేదం కలిస్తే  ఆరోగ్యం చక్కగా వుంటుందనడంలో నాకు సందేహం లేదు . రాందేవ్ గారి కృషి ఈ విషయంలో చాలా ప్రశంసనీయం .


నాకు పది మంది పేర్లు కావాలి . వాళ్ళు నన్నూ ప్రభావితం చేసి వుండాలి . దేశాన్నీ(లేదా రాష్ట్రాన్ని) బాగా  ప్రభావితం చేసి వుండాలి. ఇప్పుడు మన మధ్య వుండాలి. ఈ మూడు నిబంధనలూ - పై 8 మంది కే సరిపోయాయి. నేను చనిపోయిన మహాత్ముల గురించి మాట్లాడడం లేదు. వారిలో ఎందరో వున్నారు . పై ఎనిమిది మంది కంటే కూడా గొప్ప వారు వున్నారు . 

 ఇప్పుడున్న వారిలో గొప్ప వారు వున్నారు. మన పాత ప్రెసిడెంటు అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు , మన ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు నాకు బాగా నచ్చిన వారే . అయినా - వారి జీవితం నన్నెలా ప్రభావితం చేసింది - అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. మాకు వేదాంతం నూరి పోసిన గురువు గారు స్వామి  పరమార్థానంద. ఆయన గొప్ప వారే. ఆయన స్వామీ దయానంద ముఖ్య శిష్యులలో వొకరు. అయితే - ఆయన దేశాన్ని ఎంత ప్రభావితం చేశారు అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. 

త్వరలో - నాకు మరిద్దరు గొప్ప వాళ్ళు -  నన్నూ , దేశాన్నీ ప్రభావితం చేసే వాళ్ళు - దొరుకుతారని నేను ఆశిస్తున్నాను . 

ఇందులో పాఠకులు అయిన మీరు, నాకు - మీ సలహాలు కూడా యివ్వ గలిగితే , మీకు నచ్చిన వాళ్ళను గురించి చెబితే , చాలా సంతోషిస్తాను . కృతజ్ఞతతో మీ సలహాలను స్వీకరిస్తాను .

= మీ 

వుప్పలధడియం విజయమోహన్