15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఈ రోజు మీరు ఆడిన ఆట ఎలా ఆడారు - 5 నిమిషాల్లో మనసుపైన మీరు సాధించే విజయం ఎలా ?


వొకాయన  భార్య తనకు బహుమతిగా కొనిచ్చిన తెల్ల గుర్రంపైన కూర్చుని స్వార్తీ చేస్తున్నాడు . కాకపోతే , ఆయన తోకవైపు తిరిగి కూర్చుని స్వారీ చేస్తూ , గుర్రాన్ని తిడుతూ, కొడుతూ వున్నాడు . ఆయన భార్య కోపంతో , నీలాంటి మూర్ఖుడికి ఈ తెల్ల గుర్రం కొనివ్వడమే పొరబాటు . ఎవరైనా తోకవైపు కూర్చుని ప్రయాణం చేస్తారా - అన్నది .

అందుకాయన కూడా కోపంతో - నువ్వు మూర్ఖురాలివి, నీ గుర్రం నీకంటే మూర్ఖపుది . నేను, నేను వెళ్ళ వలసిన వైపే కూర్చుని వున్నా. యిది దానికి విరుద్ధంగా వెడుతుంటే నేనేం చేసేది ? అన్నాడు .

తప్పెవరిది ? గుర్రందా , ఆయనదా ? లేక ఆయన భార్యదా ? ఆయన మాత్రం తను వెళ్ళాల్సిన వైపే కూర్చుని ఉన్నాడట . గుర్రం దానికి విరుద్ధంగా వెడుతున్నదట.

ఏ గుర్రమైనా  ముందుకే వెడుతుంది . ఈయన వెనుక వైపున్న దారిలో వెళ్ళాలి . యిప్పుడేం చెయ్యాలి . గుర్రాన్ని వెళ్ళాల్సిన వైపుకి తిప్పితే , అది ఆ మార్గంలో ముందుకే వెడుతుంది . అప్పుడు యిద్దరి గమ్యం వొకటే అవుతుంది .

నా గమ్యం వేరు . నా వాహన గమ్యం వేరైతే  ఎలా ?

నిజానికి వాహనానికి గమ్యం లేదు . అది ముందుకే వెళ్ళగలదు . కాకపోతే , బయల్దేరే ముందు  ఏ  ప్రక్కకు తిప్పి నిలబెడితే , అది ఆ ప్రక్కన ముందుకే వెడుతుంది .

మనుషులకు ముఖ్య వాహనం - వారి వారి మనసు . అదీ సాధారణంగా, గుర్రం లాగా , ముందుకే దూసుకుని వెళ్ళ గలదు .

ఏ వైపు వెళ్ళాలో , గమ్యం ఏమిటో నిర్ణయించాల్సింది  మనమే . మనకు మన గమ్యమే తెలియకుంటే ,లేదా మనం మనసు యొక్క తోక వైపు కూర్చుంటే -అంటే , మనసు పరుగెత్తే వైపు కాక మరోవైపు పోవాలనుకుంటే , ఎలా కుదురుతుంది ?

మనం ఏదో పరీక్ష పాసు కావాలి . అదీ మన గమ్యం. ఇప్పుడు మనం మన మనసును ఆ వైపు త్రిప్పి నడిపించాలి , మనసును టీవీ వైపు పెట్టి పరీక్ష పాసు కావాలంటే ఎలా ?

ఏ గమ్యం చేరాలన్నా , మనసా, వాచా, కర్మణా అ గమ్యం వైపే  కృషి చేస్తేనే, చేరడానికి  అవకాశాలుంటాయి . అలా కాక , మనసొక వైపు, మాటొక వైపు , చేతలు మరొక వైపు వుంటే - గమ్యం చేరలేము కదా .

మనలో చాలా మందికి - యిదే సమస్య . మీ గమ్యం ఏమిటని అడిగితే - సగం మంది అసలు చెప్పలేరు . వారికి గమ్యం లేదు . వారి గుర్రం - అంటే  మనస్సు ఎటు  వైపు వెడితే , వారి జీవితం అటువైపు వెళ్ళిపోతూ వుంటుంది.
ప్రత్యేకించి గమ్యం అంటూ వుండదు .

మరి కొంత మందికి గమ్యం అంటూ ఏదో వొకటి లోపల వుంటుంది . కానీ వారు - తమ మనస్సును, బుద్ధిని - తమ గమ్యం వైపు త్రిప్పి వుంచరు . అందు వలన మనస్సు పరిపరి మార్గాల్లో పోతూ వుంటుంది . అప్పుడప్పుడూ , నిరాశతో , నిస్పృహతో - అయ్యో, ఎన్నో చెయ్యాలనుకున్నానే , ఏమీ చెయ్య లేక పోతున్నానే - అనుకుంటూ వుంటారు .

మనసు గతి యింతే ; మనిషి బ్రదుకింతే ;  మనసున్న మనిషికీ సుఖము లేదంతే -  అని సినిమా పాటలో లా అనుకుంటే  ఎలా ? సినిమా అయితే  ట్రాజెడీ  కానివ్వండి . పర్లేదు . కానీ మన జీవితం ట్రాజెడీ కానక్కర్లేదు .


 మీ మనస్సు - మీకు సేవకుడుగా వుంటే - మీకు అది అత్యంత ఆంతరంగికమైన,  నమ్మ దగిన సేవకుడుగా , మిమ్మల్ని మీ గమ్యం వైపు తీసుకుని వెడుతుంది .మీ అన్ని విజయాలకు అది కారణమవుతుంది.  

అలా కాక మీ మనస్సు మీకు యజమానిగా  ప్రవర్తిస్తూ , మిమ్మల్ని శాసిస్తూ వుంటే - అది మీకు అత్యంత అంతరంగిక విరోధిగా, మిమ్మల్ని మీ గమ్యం నుండి బహు దూరంగా తీసుకుని వెడుతుంది .మిమ్మల్ని అన్ని రకాల చిక్కుల్లో పడ  వేస్తుంది .

ఈ మాట చెప్పింది  సాక్షాత్తు  శ్రీకృష్ణుడు . అదీ భగవద్గీత లో .

మనసు యజమానైతే , మనం సేవకులైతే - ఏమవుతుంది .

మనసుకు నచ్చినవి , అలవాటైనవి కొన్ని వున్నాయి . వాటినన్నిటినీ  కలిపి అంతః  శత్రువులు  అని అంటారు.  అవి - (అ) మితి మీరిన కోరికలు (కామం),    (ఆ)  రక రకాల కోపాలు (క్రోధం ),   (ఇ)  అన్నీ నాకే కావాలన్న స్వార్థం (లోభము),   (ఈ) ప్రతి దానిపైన  వ్యామోహం (మోహం),  (ఉ) నేనే గొప్ప అన్న సుపీరియారిటీ  కాంప్లెక్స్ (మదం),   (ఊ) ప్రక్క వాడి సంతోషాన్ని, విజయాన్ని వోప్పుకోలేని యిన్ఫీరియారిటీ  కాంప్లెక్స్ (మాత్సర్యం ),  (ఎ) ఎన్నో రకాల భయాలు. 

మనస్సు యజమానైతే - అది మనల్ని వీటి వైపే లాగుతుంది . వీటన్నిటిలో , మన పతనమే  వుంటుంది  కానీ , సంతోషం , విజయం  రెండూ వుండవు .

మనం, మనస్సుకు యజమానిగా వుంటే - ఆయురారోగ్య , ఐశ్వర్య , సంతోష , శాంతి, విజయాల్లాంటివి , అన్నీ లభిస్తాయి . మన  మనస్సు , మనల్ని , వీటి వైపూ నడిపించ గలదు.

అందుకే పతంజలి  మహర్షి , యోగః  చిత్త వృత్తి  నిరోధః - అన్నారు . మనస్సును మన యాజమాన్యం లో పెట్టుకుంటే - అదే యోగం. అదే సంతోషం . అదే అతి గొప్ప విజయం .

జీవితం లో మరే గమ్యమూ ,   దీని కంటే గొప్ప గమ్యం కాదు. 

కానీ - మన జీవితాల్లో, కొన్ని సాధారణ గమ్యాలు వుండనే వుంటాయి .

ప్రేమ, పెళ్లి , భార్య , భర్త, పిల్లలు, చదువులు, ఉద్యోగాలూ, సంపాదనలు, ఆటలు, స్నేహాలు, రోగాలు , యవ్వనము , మధ్య వయస్సు . ముసలితనము , చావులు -  యివన్నీ సాధారణ గమ్యాలకు సంబంధించిన విషయాలు .  వీటిని తప్పించుకుని  మనం వుండ గలమా ?

యివి వొద్దని ఎలా చెప్పగలం ? యివి వుండనే వుంటాయి , మన సాధారణ జీవితాల్లో . 

బాల్యము , కౌమారము, గార్హస్థ్యము , ముసలితనము అన్నీ వున్నాయి మనకు . ఆయా జీవిత కాలాలకు తగిన వ్యాపకాలూ వున్నాయి

శంకరాచార్యులు చాలా సందేహ రహితంగా అన్నారు - బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రాహ్మణి కోపిన సక్తః.  యిది మన అందరికీ వర్తిస్తుంది .

చిన్నతనంలో గోలీలతో ఆడుకుంటారు . చిన్న చిన్న రాళ్ళను దాచుకుంటారు . మరి యవ్వనం వస్తే , ఈ యిష్టాలన్నీ పోతాయి. క్రొత్త ఇష్టాలు వస్తాయి.  స్త్రీల వెంట  పురుషులూ, వీరి వెంట వారూ  లవ్వో,లవ్వో  అంటూ పోతారు . అది కొన్నాళ్ళే . ఆ తరువాత, అందరి అమర ప్రేమలు మరో రకంగా మారిపోతాయి . 

పిల్లలూ , వారి చదువులూ , వారు పెరగడమూ , మనం ముసలివారవడం , అప్పుడు వచ్చే చింతలు ఎన్నో , ఎన్నెన్నో. అవీ తమకు అనవసరమైన చింతలు; అందుకే  - మనవారు, వానప్రస్థము , సన్యాసము లాంటి  నియమాలు, ఆశ్రమాలు  ఏర్పరిచారు - ఎవరికీ కష్టం లేకుండా .

వయసు పెరిగే కొద్దీ - మనం ఎవరో , మన అసలు, సిసలు  గమ్యం  ఏదో తెలుసుకోవాలి . అందులో వుండే ఆనందం అర్థం చేసుకోవాలి . 

గృహస్తాశ్రమం లో భార్య, భర్త - వొకరిపై వొకరికి అనురాగం ; వొకరికి వొకరు ప్రాణం గా వుండడం ; పిల్లలను కనడం ; వారిని అపురూపంగా , ప్రేమగా పెంచడం ; వుద్యోగాలు , వ్యాపారాలు - యివన్నీ వుండనే  వుంటాయి . వొక వయస్సులో - వుద్యోగాలు , వ్యాపారాలు పిల్లలకు వదిలేసి , భార్యాభర్తలు వొకరినొకరు బాగా చూసుకోవలసిన ఆశ్రమం, దేవుడా అని కొంతైనా అనుకోవలసిన ఆశ్రమం వానప్రస్థం. ఈ రోజుల్లో  యిది మానసికంగా  చెయ్య గలమే కానీ , ముందులా - అరణ్యాలకు పోలేం కదా . అందుకే  పాపం వృద్ధాశ్రమాలు  వస్తున్నాయి. కానీ యివి రావడం, పిల్లల బాధ్యతా రాహిత్యం వలన, మరెన్నో కారణాల వలన రావడం దురదృష్టకరం .

ఈ ఆట ప్రతి వొక్కరి జీవితాల్లో - దాదాపు యిదే రకంగా , చర్విత చర్వణం గా జరుగుతూ వుంది .

బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రహ్మణి కోపిన సక్తః.  యివన్నీ , పెరిగే కొద్దీ , మనలో, శారీరకం గా, మానసికంగా, సహజ సిద్ధంగా  జరిగే మార్పులు. అంటే, ప్రకృతి మన శరీరానికి, మనస్సుకు, ముక్కుత్రాడు వేసి లాక్కు పోతూ వుంటే - మనమూ దాని వెంట అలాగే  వెళ్లి పోతూ వున్నామన్న మాట . 

దీన్ని దాటి, ముందుగా, మున్ముందు జరిగేది కూడా తెలుసుకున్న వారు ఎవరు?

ఆట కదరా శివా; ఆట కదా కేశవా - అని, సాక్షీభావంతో - ద్రష్టగా ఈ జగన్నాటకాన్ని -  ఆనందంగా చూస్తూ, ఆడుతూ వుండ గలిగే వారెందరు? 

కృష్ణుడూ - ఈ నాటకం ఆడాడు , కానీ ద్రష్టగా . అయితే , కృష్ణుడు ఈ ఆట ఆడినంత తన్మయంగా, ఆనందంగా , "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడుతూ , ఆ పనులు చేస్తూ" తమ తమ పాత్రలలో అంత బాగా లీనమై న వారు  అప్పుడూ లేరు ; యిప్పుడూ లేరు. అంటే, మన పాత్రను మనం ఆనందిస్తూ కూడా , అందులో లీనమై కూడా - ద్రష్టగానూ  వుండొచ్చు , అలా వుండాలని మనకు చెప్పిన వాడు కృష్ణుడు .

కృష్ణుడిలో - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యర్య, భయాలు లేవు. కానీ అమితమైన వాత్సల్యం వుంది , ప్రేమ వుంది . కరుణ వుంది . శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ రెండూ చేశాడు . 16 వేల మంది గోపికలు , ఆ నీల మేఘ శ్యాముడి వెనుక బడ్డారు. పైగా 8 మంది భార్యలు కూడా . అందరూ ఆయన భక్తులే . అందరికీ ప్రేమను పంచాడు . ఆయన లో అశక్తత, అధైర్యం లేదు. దుష్ట శిక్షణ తానూ చేశాడు . పాండవుల ద్వారానూ చేయించాడు . కృష్ణుడి జీవితాన్ని మనసులో వుంచుకునే - మనం భగవద్ గీతను  చదవాల్సి వుంటుంది ; అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జీవితాన్నుండి  పారి పొమ్మని కృష్ణుడెప్పుడూ  చెప్పలేదు .

ఈ ఆట ఆడాల్సిందే. ఆనందంగా, సమర్థ వంతంగా ఆడాలి. వోటమికి క్రుంగి పోవడం, పారిపోవడం మన పాత్ర కు  న్యాయం చేసినట్టు కాదు. మళ్ళీ ఆడాలి .

"వొక్కొక్క  రోజూ కొత్త ఆటే. ఈ రోజు ఆట మీరు బాగా ఆడారా - అన్నదే ప్రశ్న. ఈ రోజు మీరు సంతోషంగా వున్నారా? ఎంత మందిని మీరు సంతోష పెట్టారు? నిన్నటి కంటే ఈ రోజు - క్రొత్తగా ఏం నేర్చుకున్నారు? ఏ విధంగా మీరు నిన్నటి కంటే బాగు పడ్డారు?  మీకు మీ గమ్యం జ్ఞాపకం వుందా? అటువైపే వెడుతున్నారా? మీరు ఈ రోజు చేసిన పనుల కంటే భిన్నంగా, గొప్పగా మరేదైనా చేసి వుండ వచ్చునా? వుంటే అది రేపు చేస్తారా? ఈ రోజు ఎవరికి సహాయ పడ్డారు? ఈ రోజంతా మీలో వచ్చిన భావనలు, ఆలోచనలు - సకారాత్మకమైనవా, నకారాత్మకమైనవా ? రేపంతా మీరు సకారాత్మకం గానూ , ఆనందం గానూ వుండాలంటే  చెయ్యాలి? "

వొక్క 5 నిమిషాలు - కళ్ళు మూసుకుని (TV కి దూరంగా) ఈ రోజు మీరు ఆడిన - మీ ఆట గురించి ఈ ప్రశ్నలు వేసి నిజమైన సమాధానాలు మీరు వెతుక్కుంటే - నిజమైన ద్రష్టగా మీరు మారిపోతారు.

మీకు యిష్టమైతే 10 నిమిషాలు గానీ , అంత కంటే ఎక్కువ కానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. మీకు నిజమైన , స్వచ్చమైన ఆనందం - అప్పుడే వస్తుంది.

 ఎందుకంటారా ?

ఆ పది నిమిషాల తరువాత - మీరే  "ఆనందం " గా మారిపోతారు గనుక .

లోపలున్న చెత్తంతా పొతే, మీరే ఆనందం . అదే యోగం . అదే సాధన . అంతే .

చాలా సులభమైన విషయం యిది. ప్రతి 24 గంటలలో - 5-10 నిమిషాల కృషి తో యిది సాధించదగిన విషయం. సాధించ వలసిన విజయం.

మీ మనసుపైన మీరు సాధించే విజయం యిది .

చేస్తారా మరి .

= మీ

వుప్పలధడియం విజయమోహన్




1 కామెంట్‌: