11, జూన్ 2012, సోమవారం

పాడుతా , తీయగా (ఫైనల్సు ) = యిక్కడి నుండి - మరెక్కడికి?= భారత దేశానికి మరో బాలు, మరో సుశీల - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

పాడుతా , తీయగా  (ఫైనల్సు )


కాశీ మజిలీ కథల్లో - వొక్కో మజిలీకి వొక్కో కథ వుంటుంది . ఆ కథ ఎంత  బాగున్నా- కథ తరువాత మరో మజిలీకి వెళ్ళక తప్పదు. 


జీవితమంతా అంతే . జీవితంలోని - ప్రతి భాగమూ అంతే .

ప్రతిదీ ధారా వాహికమే. ఎంత బాగున్నా - అది ఎక్కడో ముగియక తప్పదు.  

పాడుతా, తీయగా ధారా  వాహికంలో - ఈ రోజు  ఫైనల్సు  ముగిసింది.

ఎలా వుంది?

ఉగాది పచ్చడిలా వుంది.

పాటలు అద్భుతంగా వున్నాయి. నలుగురూ "చాలా, చాలా, చాలా, చాలా " బాగా పాడారు.

ఎవరికో వొకరికి ఈ ప్రైజులు  యివ్వక తప్పదు .

ఈ మార్కులు వేసే తతంగం అనివార్యం.వాటిని బట్టి ప్రైజులు యివ్వడమూ అనివార్యమే.

అయితే - ఆంధ్ర దేశంలో - యిప్పుడు ఈ నలుగురు పిల్లలూ - చాలా మందికి గొప్ప గాయకులుగా  పరిచయమయ్యారు. అది ముఖ్యం.

అంత కంటే ముఖ్యం - పాట , సంగీతం - అంటే - యిదీ - అని జన బాహుళ్యానికి - బాలు గారి ద్వారా - యింత నిశితంగా , నిర్దిష్టంగా తెలియరావడం.

హరిణి, తేజస్విని, రోహిత్, సాయి చరణ్ -నలుగురూ - వొకరికొకరు ఏ రకంగానూ - తీసి పోని వాళ్ళు. 

వొక్క రోజు రోహిత్ పాట వొకటి మహాద్భుతం అనిపిస్తే - రెండో రోజు తేజస్విని పాట  ఏదో వొకటి అలా అనిపిస్తుంది.  మరో రోజు హరిణి పాట , మరో రోజు సాయి చరణ్ పాట .

సంగీతం కూడా వొక స్థాయికి మించిన తరువాత - క్రికెట్  లాంటి గేము లాగా వుంటుంది. వొకరు ఎంత బాగా పాడినా- మరొకరు ఆరోజు వారి కంటే - బాగా పాడేస్తారు.

ఎంపిక చేసుకున్న పాట - దాన్ని ప్రాక్టీసు చేసుకున్న తీరు, వేదిక పైన ఆరోజున్న మనో భావన - అన్నీ పాడే విధానం పై తమ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, వొక మార్కు, రెండు మార్కులు తగ్గడమో, ఎక్కువ కావడమో - పెద్ద విషయం కాదు.

చివరి ఎపిసోడ్లకు - మోహన్ బాబు గారు రావడం మరింత రమ్యంగా వుంది. మోహన్ బాబు గారు కష్టమంటే - ఏమిటో తెలిసిన వారు. తాను  కష్ట పడి  సాధించిన వారు. తన విద్యాలయాల్లో - తన విద్యార్థులలో - వొక వున్నత స్థాయికై  పాటు పడుతున్న వారు. వారు రావడం చాలా బాగుంది. 

నవ్వండి. నవ్వుతూ వుండండి - నవ్వుతూ పాడండి - అని ఆయన పిల్లలకు చెప్పడం - నాకు బాగా నచ్చింది.  మనం నవ్వుతూ, చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ వుండడమే - నిజంగా సఫలీకృతమైన   జీవితం .జీవితంలో - విజయానికి వొకే మెట్టు చెప్పాలంటే - అది యిదే.

మోహన్ బాబు గారూ - మీరు పిల్లలకు, వారి ద్వారా అందరికీ  యిచ్చిన - యీ  అమూల్యమైన సలహాకు - మీకు చాలా ధన్య వాదాలు.

అలా నవ్వుతూ గడపాలంటే - ముఖ్యంగా- ఎవరినైనా సరే - క్షమించేసేయడం  చాలాముఖ్యం. మనల్ని కూడా. తప్పులు చేస్తాం. దాన్ని సరిదిద్దుకుంటూ - మనల్ని కూడా క్షమించేసుకుంటూ -ముందుకు వెళ్లిపోవాలి.

క్షమించ లేని వాడికి - జీవితం నరకంగా తయారవుతుంది. ఎందుకంటే - వాడినీ- ఎవరూ - క్షమించ లేరు గనుక. ఎంత  సేపట్లో క్షమించాలి? 5 నిమిషాలు చాలా ఎక్కువ. వొకటి రెండు నిముషాలలో - ఆ భావన  వొచ్చేయాలి. మళ్ళీ - మనం  నవ్వాలి.


ఈ నలుగురు పిల్లల ప్రజ్ఞా పాటవాల్ని - బాలు గారు - వొక గొప్ప స్థాయికి తీసుకొచ్చి - వాళ్ళను తెలుగు సంగీత ప్రపంచానికి  పరిచయం చేసి వదిలారు.వీరే కాదు. సెమి ఫైనల్సు లో పాడిన వారు కూడా బాగా పాడారు.

యిక్కడి నుండి - మరెక్కడికి?

అప్పుడే చెప్పినట్టు - ఈ ఫైనల్సు ఉగాది పచ్చడిలా  వుంది. అయ్యో అయిపోయిందే - అనుకుంటే - చేదుగా అనిపిస్తుంది.  ఎందుకు తేజస్వినికి  మొదటి ప్రైజు రాలేదు? ఎందుకు రోహిత్ కు రాలేదు? ఎందుకు సాయి చరణ్ కు రాలేదు ? అనుకుంటే - కొంచం  కారం అనిపించొచ్చు. కాని అందరూ హాయిగా, తీయగా పాడారు.

అందరూ - మనకు - మొదటి బహుమతే.  అలా అనుకుంటే - అది తియ్యగా వుంది.

సరే. మొదట చెప్పినట్టు - యిక్కడి నుండి - మరెక్కడికి?

భారత దేశానికి మరో బాలు, మరో సుశీల  - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

ఎన్నో చెయ్యాలి.  ఈ  గాయనీ గాయకులు - మరో నాలుగు భాషలను నేర్చేసుకోవాలి. ఆ  భాషల వాళ్ళ కంటే  బాగా!

ఏం. బాలూ గారూ, సుశీల గారూ నేర్చుకోలేదా?

ఆ భాషలలో - యింత కంటే - బాగా పాడ  గలగాలి. పాడ గలరు. మాకు తెలుసు. 

సరే. కర్నాటక సంగీతమూ, హిందుస్తానీ సంగీతమూ కూడా - బాగా నేర్చుకోవాలి - నేర్చుకో గలరు. మాకు తెలుసు.

నక్షత్రాలను అందుకోవాలని  ప్రయత్నిస్తే - చంద్రుడిని సులభంగా పట్టుకోగలము.

మీరు సంగీతాన్ని వొక యజ్ఞం లా - సాధన చెయ్యాలి.

వొక పెద్ద ఆడిటోరియం లో వేల మంది శ్రోతల ముందు పాడటం వొక ఎత్తు. యింట్లోనో, తోటలోనో   వొంటరిగా కూర్చుని సాధన  చేయడం మరో ఎత్తు.

ఆ సాధన లోనే - ఉన్నతమైన ఎత్తులకు ఎదగడం చాలా గొప్ప విషయం.

మనం విజయానికి ఎంత దగ్గరలో - ఉన్నామో - వొక్కొక్క సారి మనకు అర్థం కాదు. ఏదో - అందరిలా - కొంత ప్రయత్నం చేసి - వచ్చిన దానితో తృప్తి పడతాం.

దాన్ని  ఆంగ్లంలో  " కంఫర్ట్ జోన్ " లో వుండిపోవడం అంటారు. ఆ కంఫర్ట్  జోన్ దాటితే - అక్కడో అద్భుత ప్రపంచం వుంటుంది.  యింకా ఎన్నెన్ని చేయ గలమో - తెలుస్తుంది. 

అది దాటిన వారికి - వారి  చుట్టూ వున్న ప్రకృతి శక్తులు - ఎంతగానో - సహకరిస్తాయి. మరెన్నో విజయ శిఖరాల వైపు  తీసుకు వెడతాయి.

మరి  ఆ కంఫర్ట్ జోన్ ఎలా దాటుతారో  యోచన  చేయండి ?

అందరికీ -అభినందనలతో 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి