27, మే 2012, ఆదివారం

స్టీఫెన్ ఆర్ కవీ = "సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్" = గమ్యానికి బంగారు బాట


స్టీఫెన్ ఆర్ కవీ గారు ప్రముఖ రచయిత, వక్త, వ్యక్తిత్వ వికాస శాస్త్రంలో  మహా దిట్ట, ఆయన రాసిన "సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్" ప్రపంచంలో చాలా ప్రసిద్ధి పొందింది.

అది నేనూ చదివాను. దానిపై - నేను ఎన్నో ప్రసంగాలు కూడా చేసాను.

ఆయన రాసిన  ఆ ఏడు పద్ధతులు నిజంగా, మనిషి విజయానికి దారి తీస్తాయనడంలో సందేహము ఏమాత్రమూ లేదు. అంతే కాదు - ఎంతో సంతోషాన్నీ, సంతృప్తినీ కూడా యిస్తాయి. అంటే - నిజమైన   విజయం యిదే అని మనకూ తెలుస్తుంది.

ఆయన మొదట చెప్పేది అదే. మీరు జీవితంలో - ఏదేదో చేసేస్తూ వుంటారు. మీరు వెళ్ళే మార్గం, మీరు వెళ్ళాల్సిన గమ్యానికే వెళ్ళుతుందో, లేదో -  అప్పుడప్పుడూ చూసుకుంటూ వుండాలి. గోడ ఎక్కాలని నిచ్చెన వేసే ముందు - ఎక్కాల్సిన గోడ అదేనా అని చూసుకుని మరీ - ఆ గోడకు నిచ్చెన వెయ్యాలి.

లేదంటే - ఏడెన్ గార్డెన్ (నందన వనం)వెళ్ళాలనుకుని -  నడుస్తూ, నడుస్తూ - సహారా ఎడారి చేరుతారు.

మీకు కావాల్సింది - సంతోషమో, ప్రేమో వుండొచ్చు - నిజానికి.  కానీ - మీరు డబ్బు సంపాదించడం లోనో, పదవులపై వ్యామోహంలోనో - జీవితమంతా గడిపేస్తారు. అంటే - మీకు నిజంగా - ఏమి కావాలో - మీకు తెలియలేదన్న మాట.

మొట్టమొదట, మీరు - మీ గమ్యం  యిదీ అని నిర్దిష్టంగా నిర్ధారించుకోవాలి. తరువాతనే - మీ ప్రయాణం మొదలు పెట్టాలి.  గమ్యం తెలియని వానికి - ఏ దారైనా వొకటే.

గమ్యం  వుండాలి. ఎందుకు - ఆ గమ్యం మనం ఎన్నుకున్నామో కూడా మనకు నిశ్చయంగా తెలియాలి.

మీకు ఏం కావాలో మీకు అర్థమయ్యిందా ? మీరు  కోరుకునేది లభిస్తే - మీరు నిజంగా సంతోషంగా వుంటారా? ఈ రెండు ప్రశ్నలకు జవాబులూ - మనకు తెలియాలి.

మనం సినిమాల్లో చూస్తాము - హీరో గారు ఎంతో మందిని, ఏదో చిన్న నాటి పగతో చంపేస్తారు. తరువాత - హీరోయిన్ గారిని పెళ్లి చేసుకుంటారు - ఆ తరువాత సుఖంగా వుంటారు - అని అంటారు. కానీ - పగ చల్లారదు. యిక్కడ తగ్గితే అక్కడ రగులుతుంది.

ఏ జాతి చరిత్ర చూసినా - యిదే జరుగుతోంది. పశ్చిమ ఆసియా దేశాల్లో చూడండి. ఎప్పుడూ యుద్ధాలే. చైనా చరిత్ర అంతా - రక్త పాతంతో నిండినదే. బ్రూస్ లీ వంటి - కుంగ్-ఫూ ,కరాటే మాస్టర్ల జీవితమంతా రక్త పాతమే కానీ - శాంతి అన్నది లేదు.   చైనా - అంటే - కుంగ్-ఫూ - షావోలిన్ దేవాలయాలు యివే అంటాయి - వారి సినిమాలు. కానీ, షావోలిన్ లో అందరూ సాధువులే    అయినా - ముఖ్యంగా నేర్చుకునేది - కుంగ్-ఫూ. టిబెట్టు లో కుంగ్ ఫూ లేదు. శాంతి వుంది. సహనం వుంది. సంతోషం వుంది.

మనకు నిజంగా శాంతి, సంతోషమూ కావాలంటే - శాంతి మార్గంలోనే వెళ్ళాలి. గమ్యం శాంతి. మార్గం యుద్ధం - అనేది సాధారణంగా కుదరదు. శాంతి కావాలంటే - శాంతి కోసం ప్రయత్నించాలి. మార్గమూ అదే. గమ్యమూ అదే. చిన్న , చిన్న అడ్డంకులు వస్తాయి. కాదనను. జీవితంలో ఎప్పుడో వొక సారి - ఏ రౌడీలతోనో -   కొట్లాడాల్సిన పరిస్థితి రావొచ్చు. కానీ - జీవితమంతా అదే కాకూడదు.

అలాగే - మీకు ప్రేమ కావాలంటే - మొదట - మీరు , ప్రేమ యివ్వడం నేర్చుకోవాలి. ప్రేమ గమ్యం అయితే,ప్రేమే మీ మార్గం కూడా కావాలి. ప్రేమ ఇవ్వలేని వారికి - ప్రేమ దొరకదు. దొరికినా - తొందరగా - దాన్ని, దారపోసుకుంటారు.

జీవితంలో - మిమ్మల్ని అందరూ నమ్మాలంటే - మీరు అందరికీ నమ్మకస్తులుగా వుండాలి. మీతో అందరూ అబద్ధాలు చెప్పకూడదనుకుంటే - మీతో  అందరూ  నిజాలే చెప్పాలనుకుంటే - మీరు మొదట అబద్ధాలు చెప్పడం మానెయ్యాలి.

మీకు మంచి స్నేహితుడు కావాలనుకుంటే - మొదట, మీరు మంచి స్నేహితుడుగా మారాలి.

మీకు మంచి భార్య (లేదా భర్త) కావాలనుకుంటే, మీరు వారికి మంచి  భర్త (లేదా భార్య) గా మొదట మారాలి.

ఇలాంటి మార్పు - మీరు వారి వైపు నుండి ఎదురు చూస్తూ వుంటే - పుణ్య కాలం గడిచిపోతుంది. జీవితం అయిపోతుంది. మార్పు (మొట్ట మొదట) మీలో రావడం సులభం.

మీలో వచ్చిన మార్పు , 45  నుండి  90 రోజుల లోగా - ఎదుటి వారిలో పరివర్తన తీసుకువస్తుంది.  అందుకే, భారత దేశంలో, ఏ వ్రతమైనా, వొక మండలం రోజులు కనీసం చెయ్యండి అంటారు. యిది మనలో మంచి మార్పు రావడానికి. ఎదుటి వారిలో కూడా రావాలంటే - మరి కొన్ని రోజులు ఈ వ్రతం అవలంబించాలి. అందుకే - 90  రోజులు అన్నాము. నిజానికి - చాలా మందిలో, అంటే, మీ ఎదుటి వారిలో- మీలో వచ్చిన పరివర్తన , మీతో బాటే -45 రోజులలో నే వచ్చేస్తుంది. కొందరిలో, కాస్త సమయం అవుతుంది. యిది భారత దేశంలో మనకు తెలిసినంతగా - కవీ గారికి కూడా తెలీదు.

అయితే - ఆయన అన్నారు - మీ అన్ని సంబంధాల లోనూ - నమ్మకం పెంచాల్సిన బాధ్యత మీదే - అని.

మీరు  సంతోషం గా వుండాల్సిన బాధ్యత మీదే. మీ చుట్టూ - సుహృత్  సంబంధాలను , వాతావరణాన్ని సృష్టించాల్సిన     బాధ్యత మీదే.

జీవితంలో - విజయం సాధించే వారి అతి ముఖ్యమైన  ఏడు ముఖ్య లక్షణాలను - యిలా చెబుతారు, ఆయన :-

1  వారు సాధనను తమ చేతుల్లోకి తీసుకుంటారు.చెయ్యాల్సిన పనులు తాము నిర్ణయించి చేస్తూ వెడతారు. 
దీన్ని "ప్రో-యాక్టివ్ " గా వుండడం అంటారు ఆయన. విజయం - మీ సాధన పై ఆధార పడి  వుంది. అదృష్టం  పై కాదు.

2  వారు గమ్యాన్ని తాము నిర్ణయించి, మార్గాన్ని తాము నిర్ణయించి -పని మొదలు పెడతారు. 

గమ్యం - అంటే - మీకు ఏం కావాలో మీకు బాగా తెలిసి వుండడం. ఉదాహరణకు - అయిదేళ్ళ తరువాత - మీరు ఎలా వుండాలని కోరుకుంటున్నారు?అలా కావడానికి, యేమేం  చెయ్యాలో  మీకు తెలుసా? అలా చెయ్యడం, మీకు యిష్టమేనా? మీ గమ్యం - మీకు నిజంగా ఆనందం  యిస్తుందని - మీకు స్పష్టంగా తెలుసా?నిజానికి, మీ గమ్యాన్ని గురించి - మీరు కనీసం పది పేజీలైనా రాస్తే గానీ - అందులోని సాధక బాధకాలు కొంత కూడా తెలిసి రావు. గమ్యమంటే - అలా  బాగా  యోచన  చేసి  తీసుకునే  నిర్ణయాలు.

3  చెయ్యాల్సిన పనుల్లో - అతి ముఖ్య మైనవి ఏవి,  ఏది చేస్తే - మనం గమ్యం వైపు సులభంగా వెళ్ళగలం - అని ప్రతి రోజూ,   యోచన చేసి నిర్ణయించి మరీ చేస్తారు. దీన్నే  ఆంగ్లంలో కవీ గారు   ఫస్ట్ థింగ్స్  ఫస్ట్  అన్నాడు. ఈ  వొక్క  విషయం  పైన కవీ గారు మరో అందమైన పుస్తకం కూడా రాసారు. 

మన జీవితంలో - అతి ముఖ్యమైన విషయాలు - యేవో మనకు తెలిసి వుండాలి. ప్రతి రోజూ -ఆ ముఖ్యమైన  విషయాలపై ఏదో  కొంత పరిశ్రమించాలి  ముందుకు పోవాలి. లేదంటే - మీరు గమ్యం - అనుకునే విషయాలు - మీ ఆశలు గానూ, మీ కలలు గానూ - జీవితాంతం  మిగిలి పోతాయి. జీవితంలో - కొందరు విజయం సాదించడానికి, మరి  కొందరు ఏదీ చెయ్య లేక పోవడానికి - యిదే ముఖ్య కారణం. "ఫస్ట్ థింగ్స్" యేవో తెలీదు. తెలిసినా - రేపు చూద్దాం, మరో రోజు చూద్దాం -అని జాప్యం చెయ్యడం - జీవితాంతం జరుగుతూ వుంటుంది - కొందరికి 

4 . మీరూ, మీ తోటి వారు - అందరూ గెలవాలని ఆశించండి.  దీన్ని - ఆంగ్లంలో - "థింక్ విన్ విన్ " అన్నారి కవీ గారు.

 వెళ్ళే మార్గంలో - ఎప్పుడూ, మనకు తోడూ ఎవరో వొకరు వుండనే వుంటారు.వొక్కో సారి వుండక పోవచ్చు. సాధారణంగా - మనతో రాగలిగే వారిని, యిష్టమున్న వారిని - మనతో తీసుకెడుతూ - వారూ, మీరూ కూడా, విజయం  సాధించే లాగా ప్రయత్నం చెయ్యాలి. 

ఉదాహరణకు, జీవితంలో సమ భాగస్వామ్యులైన  భార్యాభర్తలిద్దరూ - సంతోషంగా జీవితంలో పాల్గొన గలగాలి. అంటే- భార్య చేసే పనులన్నీ భర్త చెయ్యాలనో, భర్త చేసే పనులన్నీ భార్య చెయ్యాలనో లేదు. అది కుదరదు కూడా. - కానీ జీవితంలో గెలుపు అన్న దానికి యిద్దరూ ప్రతీక కావాలి. వొకరి గెలుపు, మరొకరి వోటమికి  కారణం కాకూడదు. అలాగే యిద్దరి మధ్యా సుహృద్భావము లేక పోవడం, జీవితంలో యిద్దరూ వోడి పోవడం జరుగకూడదు.

చాలా సార్లు భార్య భర్త గురించో,  భర్త భార్య గురించో - మరొకరితో - పక్కనింటి వారితో  కూడా  పితూరీలు  చెప్పడం చూస్తూనే వుంటాం. దీన్ని - "లూజ్ -లూజ్" మనస్తత్వం అంటారు. యిద్దరూ వోడి పోతున్నారు  యిక్కడ.

నేనూ గెలవాలి. నువ్వూ గెలవాలి - నీ గెలుపుకు నేను తోడుంటాను - అన్న మనస్తత్వం  మనకు కావాలి.

5. మీ చుట్టూ  వున్న వారిని  మొదట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత - వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ  సహాయం చెయ్యండి.

నిజానికి  యిది వొక  గొప్ప ప్రయత్నం. చాలా కష్టమైన విషయమే. అయితే, యిలా చుట్టూ వున్న వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో - మీకు చాలా విషయాలు తెలుస్తాయి.  మిమ్మల్ని - మీ చుట్టూ వున్న వారు - ఎందుకు అర్థం చేసుకోవడం లేదో  మీకు తెలుస్తుంది. అంతే కాదు, మీ చుట్టూ వున్న వారికి  మీరంటే  బాగా అభిమానం ఏర్పడుతుంది. మీలో సహనం పెరుగుతుంది. మీలో జీవితాన్ని అనుభవించే , ఆనందించే  శక్తి  పెరుగుతుంది. 

సిగ్మండ్ ఫ్రాయడ్  గారు అంటారు - ఈ రోజు వరకూ, ఎవరికీ సమాధానం దొరకని వొక గొప్ప ప్రశ్న , నా ముప్ఫై సంవత్సరాల రీసెర్చిలో, నాకు సమాధానం దొరకని ప్రశ్న - " స్త్రీ అసలు, ఏమి కోరుకుంటుంది? "

 అయితే - యిది వొక మగవాడు చెప్పిన విషయం. యిదే - వొక ఆడ సైకాలజిస్టు చెబితే  - ఏం చెబుతుందో? మీరు చూసే వుంటారు - చాలా మంది ఆడవాళ్ళు, ఆ ...మాకు  మగవాళ్ళ  గురించి   పూర్తిగా  అర్థమయ్యింది లే...అనుకుంటూ వుంటారు. ఎవరిని గురించీ వారికే సరిగ్గా అర్థం కాదు. మరొకరి గురించి అర్థం కావాలంటే - చాలా పరిపూర్ణత, సహనం, అభిమానం అన్నీ వుండాలి. 

తెలుగులో - అంటాం కదా - ఆడవారి మాటలకూ  అర్థాలే  వేరులే - అని.  అది  కొంత  వరకు  నిజమే. స్వరంలో,  అసలైన  అర్థం ధ్వనిస్తుంది. కానీ మాటలు ఎన్నో రకాలు గా వుండచ్చు . చెప్పే మాటకు, ఎదురు చూసే సమాదానానికీ  సంబంధం  వుండక  పోవచ్చు. మీరు స్వరాన్ని గమనించక, మాట మాత్రమే గమనిస్తే - మీకు ఏదీ అర్థం కాదు.

యిది వొక ఉదాహరణ మాత్రమే.మగ వారూ, యిలా చేసే సందర్భాలున్నాయి. 

బిచ్చగాడు అలా ఎందుకున్నాడు? దొంగ  దొంగలా ఎందుకున్నాడు? కోపిష్టి వాడికి కోపం ఎందుకు ? దేవాలయం బయట చెప్పుల దొంగతనం ఎందుకు? లంచగొండి వాడికి ఆ బుద్ధి ఎందుకు?  యివన్నీ మనకు అర్థమవుతుందా ?  అర్థం కావాలంటే - ఎంతో యోచన , సహనం కావాలి.

తల్లిగా వున్న స్త్రీలో - తన సంతానం పట్ల అంత ప్రేమ ఎలా వస్తుంది? దేవత లాంటి ఆ తల్లే అత్త గారుగా కోడలిపై - ఆ అభిమానం చూపలేక పోవడానికి కారణం ఏమిటి? కోడలికి, అత్త గారిపై విముఖత ఎందుకు?  వీరి మధ్యలో - వున్నఆ మగవాడు  ఏం చేస్తే - అందరూ బాగుంటారు? యివి అర్థం చేసుకుంటే - చక్కటి సమాధానాలు దొరుకుతాయి. అందరూ హాయిగా వుండచ్చు .అర్థం కాకపోతే - అత్తగారు, కోడలిని హింసించడమో ,కోడలు, ఏ కారణమూ లేకుండా అత్త గారి కుటుంబాన్ని జైలుకే  పంపించడమూ,  తద్వారా, వారి జీవితాలూ, తన జీవితమూ, పూర్తిగా నాశనం చేసుకోవడమూ జరుగుతూనే వుంది. మనం చేసుకున్న చట్టాలు  ఎవరికీ మంచి చేయని చట్టాలుగా వున్నాయి. ఎందుకు? ఎవరికి ఎవరూ అర్థం కాలేదు గనుక. 

యిదే కవీ గారు చెప్పడం. మొదట ఎదుటివారిని అర్థం  చేసుకోండి.సహనంతో, అభిమానంతో, దయతో.  తరువాత  వారు మిమ్మల్ని  అర్థం చేసుకోవడానికి అవకాశం   యివ్వండి. 

6. మీ అన్ని  ప్రయత్నాలను  వొకదానికొకటి సహకరించేలా వుండేటట్టు చూసుకోండి. అలాగే, మీ ప్రయత్నాలకు, మీచుట్టూ వున్న వారి సహకారాన్ని కూడా తీసుకోండి. మనకు నాలుగెద్దులూ , సింహమూ కథ తెలుసు కదా. నాలుగెద్దులు  కలిస్తే - సింహం పై కూడా విజయం సాధించడం కష్టం కాదు. ఎంత గొప్ప పనైనా - పది మంది కలిస్తే - సుసాధ్యమవుతుంది.   కలవక పోతే అసాధ్యమవుతుంది. 

అలాగే - మనలోనే - పది  మంది  మనుషులున్నారు  తెలుసా. మీరు రాత్రి అనుకుంటారు  - వుదయం శీఘ్రంగా లేచి, ఏదేదో చేసెయ్యాలని. కానీ, ఉదయం  లేవాలనిపించదు. ఏదీ చెయ్యం. రాత్రి అనుకున్న మీరు వేరే. తెల్లవారి లెయ్యని మీరు వేరే. మీలోని వీరందరినీ వొక్క త్రాటి పైకి తెస్తే   - మీరు చెయ్య లేని పని లేదు. అందుకే మన వారు - మనసా, వాచా ,కర్మణా, అన్నారు. అంటే - మనస్సులో అనుకునేదే చెప్పాలి. చెప్పిందే చెయ్యాలి. మనసూ, మాట, పనీ అన్నీ వొకటైతే  - మీరు ఎన్నెన్నో మహాత్కార్యాలను - సాధించ గలరు. ఆంగ్లంలో - దీన్ని సైనెర్జీ అంటారు.

దీనికి కావలసిందల్లా - తెల్లవారి కాస్సేపు ,రాత్రి కాస్సేపు ధ్యానం చెయ్యడమే.ధ్యానము అంటే -ఏకాగ్రతా భావం తీసుకు రావడమే.దానితో బాటు, ప్రశాంతత,సహనం, ఆనందం  కూడా వస్తాయి.

7.మీ లోని శక్తులను, మేధస్సును, అప్పుడప్పుడూ సాన పెట్టాలి. బల పరుచు  కోవాలి.  శారీరకంగా,  మానసికంగా,  మరింత ఎదగాలి.  మనం చేసే  పనులు నిన్నటి కంటే - ఈ రోజు  మరెంత బాగా చెయ్య గలమో - తొందరగా చెయ్య గలమో -యోచన చెయ్యాలి. మీరు చేసే పనులన్నీ - నిన్నటి లాగే చేస్తే - మీ నిన్నటికీ - మీ ఈ రోజుకీ ఏ తేడా వుండదు  కదా. 

జీవితం గానుగెద్దు తరహాగా తయారవుతుంది. 

మార్పు ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. గానుగెద్దు జీవితంలో కూడా, కాడె విరిగి పోవడమో, కాలు విరగడమో -ఏదో జరిగి పోతూ వుంటుం ది. 

మీరు యోచన చేసి, ప్రయత్న పూర్వకంగా, మార్పు తెస్తే - అది మీరు ముందుకు పోవడానికి సహకరిస్తుంది . లేదంటే - వచ్చే మార్పు, మిమ్మల్ని, వెనక్కు నెట్టేస్తుంది. 

ఉదాహరణకు - మీకు ఏదో వొక రోజు అరవై ఏళ్ళు వస్తాయి. ఎనభై ఏళ్ళూ  వస్తాయి. నూరేళ్ళూ వస్తాయి. మీరు, ఆరోగ్యంగా వుండటానికి, సంతోషంగా వుండటానికి ప్రయత్నం చేస్తే. అలాగే, మీ భర్త (భార్య) ఆరోగ్యంగా వుండటానికి,సంతోషంగా  వుండటానికి మీ వంతు ప్రయత్నం మీరు, వారి వంతు ప్రయత్నం వారూ  చేస్తే.

అలా చెయ్యక పోతే - వొక నలభై ఏళ్ళు ముందుగా పోవచ్చు. వున్నన్నాళ్ళు  అనారోగ్యంతోనో, సంతోషం  లేకుండానో వుండొచ్చు. కొంత మంది - తొంభై ఏళ్ళ వయస్సులో - ఏ డిగ్రీలో, పీ.హెచ్ డీ లో చదివే వాళ్ళున్నారు. లేదా- ఎన్నో చదివి పుస్తకాలు రాసే వాళ్ళున్నారు.మరేదేదో  నేర్చుకునే వారున్నారు.దీన్ని, కవీ గారు - ఆంగ్లంలో, "షార్పెనింగ్   ది  సా"    అన్నారు. నాకు తెలిసిన వారిలో - శ్రీమతి కె . రామలక్ష్మి గారు, తమ వయస్సు  ఎంతయినా- ఎన్ని చిన్న, పెద్ద కుటుంబ కష్టాలు వచ్చినా - తమ రచనా వ్యాసంగం  విడవకుండా  వుండడం నాకు నచ్చింది. యిలా ఎంతో మంది - 85 దాటినా, ఎన్నో రకాల ప్రజోపయోగ కార్యాలు చెయ్యడం, ఎన్నో రకాల రచనలు చెయ్యడం నాకు తెలుసు.

ఈ యేడు అలవాట్ల గురించి  - ఎంతో చెప్పుకోవచ్చు .  చెప్పుకుందాం.

యివన్నీ - మీరూ,నేనూ చెయ్య గలిగేవే .

యివి చేస్తూ - మనం, సంతోషంగా, ఆరోగ్యంగా, అందరితో, ముందుకెడదాం.   

=మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి