సుమతి శతకం
కొన్ని ఆణి ముత్యాలు
తెలుగులో భారతం, రామాయణాల లాంటి కావ్యాలు, అత్యద్భుతంగా అతి గొప్ప కవీంద్రుల చేత రాయ బడ్డాయి. మరెన్నో కావ్యాలు, నాటకాలు, ఎన్నో,ఎన్నో వచ్చాయి.
అయితే - తెలుగు వారి నోటిలో - ఎక్కువగా నానేవి - సుమతి, వేమన శతకాలే - అంటే అతిశయోక్తి కాదు.
తమిళం లో తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ వారికి చాలా గర్వ కారణం అని అందరికీ తెలుసు. అలాగే - ప్రతి భాషలోనూ - ఏదో వొక గొప్ప పుస్తకం వుండనే వుంటుంది. ఎవరి గొప్ప వారికానందం.
తెలుగు వరకు - వేమన, సుమతి శతకాలు - ఎంత గొప్పవి - అంటే - చెప్ప లేనంత.మాకు చిన్న తనంలో - మా అవ్వ గారు - కాళహస్తి గుళ్ళో నేర్పించేవారు - అవన్నీ.
కాబట్టి - వాటిలోని - ఆణిముత్యాలు మనసులో పదిలంగా అలాగే నిలిచి పోయాయి. జీవితంలో - ఏ వొత్తిడి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఈ శతకాలలోని పాఠాలు - నన్ను ఆదుకున్నాయని తప్పకుండా చెప్ప గలను. యివన్నీ ప్రతి వొక్కరికీ - బాల్యంలోనే, తప్పక నేర్పించాలి. అలా నేర్పించడం వలన, వారి జీవితం సుఖ మయం అవుతుందనడం
లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
వేమన శతక పద్యం వొక్కటి మొదట చూద్దాం.
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ
తప్పులే చేయని వారు ప్రపంచం లో లేనే లేరు. మరొకరి తప్పులే వెదుకుతూ వెళ్ళే వాళ్లకు తమ తప్పులు తెలుసుకునే సమయమూ వుండదు. సామర్థ్యమూ వుండదు. వారి జీవితమంతా - మరొకరి తప్పులు వెదకడంలో జరిగిపోతుంది. వారు - ఏ రకమైన ఆనందమూ అనుభవించ లేరు. ఎంత గొప్ప జీవిత సత్యం యిది! నిజానికి మన తప్పులు మనం సరిజేసుకుంటూ
వెడితే - మనం బాగుపడతాము. యితరుల తప్పులే వెదికితే - ఎవరూ మన దగ్గరికి కూడా రారు. మనకు ఏ స్నేహాలూ, చుట్టాలూ వుండవు. మనం బాగు పడే ఆవకాశమూ వుండదు.
కానీ, వేమన గారి దగ్గర వేదాంతం పాలు ఎక్కువగా కనిపిస్తుంది. అద్భుతమైన అద్వైత వేదాంతం - అతి సులభ మార్గంలో చెబుతారు వేమన గారు. అవన్నీ మరో సారి చూద్దాం.
సుమతి శతకంలో - నిజ జీవితానికి సంబంధించిన సూక్తులు ఎక్కువ. అవి పిల్లలకూ, పెద్దలకూ - చాలా బాగా నచ్చుతాయి.సుమతి శతక కర్త పేరు బద్దెన కవి. 13
వ శతాబ్దికి చెందిన వాడు. ఆయన సూక్తులు, చాలా వరకు, ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్ని సూక్తులు - యిప్పటి కాలానికి పనికి రానివి వున్నాయి.
మనకు చాలా, చాలా, ఉపయోగ పడే - కొన్ని సూక్తులు యిక్కడ ఉదాహరిస్తున్నాను :
"
అక్కరకు రాని చుట్టము ; మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తా;నెక్కిన బారని గుఱ్ఱము; గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ! " అంటారు ఆయన.
చుట్టమంటే - సమయానికి సహాయపడే వాడే గానీ మొహం చాటు చేసే వాడు కాదు. మనమూ అలాగే వుండాలి గదా. మీరు ఎవరికి సహాయ పడతారో - వారే, మీకు సహాయ పడే ఆవకాశం ఎక్కువ. వరమీని వేలుపు సంగతి ప్రక్కన పెడితే - మీరు యుద్దానికని వెళ్ళారు; మీ గుఱ్ఱము, మీకు అనువుగా పరుగెత్త నంటుంది . మీరేం చేయాలి? అక్కరకు రాని చుట్టం లాగే యిదీ. వెంటనే వదిలి పెట్టండి.
అవసరానికి పనికి రానివి - మనం వెంటనే వదిలి పెట్టాలి. జీవితానికి కావలసిన సత్యమే కదా.
"
అప్పిచ్చు వాడు, వైద్యుడు; ఎప్పుడు,ఎడతెగక బారు ఏరును, ద్విజుడున్; చొప్పడిన ఊరనుండుము ; చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ! " అంటారు శతక కారుడు.
మీ వూళ్ళో, అవసరానికి అప్పిచ్చే వాడు వున్నాడా? వైద్యుడు వున్నాడా? నిరంతరం త్రాగునీరు సదుపాయం వుందా? మంచీ,చెడూ చెప్పే బ్రాహ్మణుడున్నాడా? ఈ రోజూ కూడా - ఎవరికైనా - యివన్నీ వున్న వూళ్ళో వుండడమే శ్రేయస్కరం. వీటి రూపాంతరాలు వుండొచ్చు. కాలంతో బాటు కొంత మార్పు సహజం. కానీ - (1) అవసరానికి అప్పు (2 ) రోగాలకు మంచి వైద్యుడు (3 ) మంచి నీటి సదుపాయం (4 ) మంచి చెడులు తెలియ జెప్పే వాడు - వుండే వూరిలో వుండడం, వుండని ఊరిని వదిలి పెట్టడం అందరికీ మంచిదే కదా.
"
ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి యన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక; తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ!"
యిది ఎంత మంచి మాట. ఎవరినీ నొప్పించకండి . మీరూ నొచ్చుకోకండి. అలా - ఎప్పుడు ఏది మాట్లాడితే అందరి మనుసుకూ బాగుంటుందో - అప్పుడు అది మాట్లాడి - సమస్యలు రాకుండా తప్పించుకోండి.
కొంత మందికి -తమకు తెలియకుండానే - చుట్టూ వున్న వారిని - నొప్పించే మాటలనడం -చాలా అలవాటుగా వుంటోంది
. అలా మాట్లాడడం తప్పని ప్రతి వొక్కరూ తెలుసుకోవాలి. తెలియని వారికి, ఎవరో వొకరు,చెప్పి తీరాలి. లేదంటే - వారి వలన, వారి చుట్టూ వున్న వారు ఎప్పుడూ, బాధ పడుతూనే వుంటారు.
"
తన కోపమె తన శత్రువు; తన శాంతమె తనకు రక్షా దయ చుట్టంబౌ; దన సంతోషమె స్వర్గము ;తన దుహ్ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!"
యిది వొక ఆణిముత్యం. మనకు, మన కోపాన్ని మించిన శత్రువు మరొకరు లేరు. మనల్ని కాపాడేది మన శాంతమే. మనలోని దయా గుణమే మనకు బంధువు. మన స్వర్గం మరెక్కడో లేదు - మన సంతోషం లోనే వుంది. అలాగే మన నరకం మరెక్కడో లేదు. మన దుహ్ఖమే మనకు నరకప్రాయము. ఎంత గొప్ప నిజం! యిది వొక్కటి జ్ఞాపకం వుంటే - జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. మన మిత్రులూ, శత్రువులూ - మనలోనే వున్నారు. గుర్తించండి.
"
నవ్వకుమీ సభలోపల; నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్; నవ్వకుమీ పరసతితో; నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!"
యిక్కడ నవ్వకుమీ అంటే - రక రకాల అర్థాలున్నాయి. (1
) పెద్ద వారున్న సభలలో - వూరికే నవ్వడమో, ఎవరినైనా అపహాస్యం చేయడమో అస్సలు చేయరాదు. సాధారణంగా సభలో, వూరికే నవ్వితే - ఎవరినో అపహాస్యం చేసినట్టు పదుగురు అనుకోవచ్చు. దాని వలన పదుగురూ, మనలను అసహ్యించుకుంటారు.(2
)
అలాగే - తల్లిని, తండ్రిని, భర్తను గానీ, రాజును కానీ (నాథుడు అంటే - రెండు అర్థాలూ వున్నాయి) ఎప్పుడూ అపహాస్యం చేయకండి. యివన్నీ పాప హేతువులు. (3
) మరొకరి భార్యతో పక పకా నవ్వడం ఎప్పుడూ చెయ్య కండి. అది ఆమెకూ, ఆమె భర్తకూ, మీకూ - మంచిది కాదు. (4
) మీకు మంచీ ,చెడూ చెప్పే విప్రుడిని అపహాస్యం చెయ్యకండి. యివి చేస్తే ఏమిటనే వారికి -ఎప్పుడో వొకప్పుడు చేటు రానే వస్తుంది.
"
కనకపు సింహాసనమున; శునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమునం; దొనరగ పట్టము గట్టిన; వెనుకటి గుణమేల మాను గదరా సుమతీ!"
యిది కూడా సర్వత్ర, సర్వదా వర్తించే సూక్తి. అర్హుడైన వాడినే ముఖ్య పదవులకు అధికారిగా చేయ వలెను గాని - అనర్హుడైన వాడిని, మూర్ఖుడిని అధికారిగా చేస్తే - ఎవరికీ మంచిది కాదని భావము. ఈ రోజుల్లో - ప్రజలు - మంచి వాడికి, సమర్థుడికి
వోటు వెయ్యాలే కానీ - అసమర్థుడికి పట్టం కడితే - దేశం దుర్గతి పాలవుతుందని భావం.
"
కులకాంత తోడ నెప్పుడు; గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ; కలకంఠి కంట కన్నీ; రొలికిన సిరి యింట నుండ దొల్లదు సుమతీ!"
భార్యతో నెప్పుడూ కలహింపకు;కొట్లాడకు; ఆమెలో లేని తప్పులు వూరికే చెప్పకు; అటువంటి కుల స్త్రీల కంటి నీరు పడిన యింటిలో - లక్ష్మి (అంటే - సిరి సంపదలు) ఎప్పుడూ నివసించదు. నివసించడానికి యిష్టపడదు. యిది మగ వారందరూ గుర్తుంచుకోవాలి. యిది మనువు కూడా చెప్పాడు. మీ యింట్లోని ఆడ వారు - సంతోషం గా వుండడం - మీ, అంటే, మగ వారి బాధ్యత - అన్నది - భారత సంస్కృతి.
"
కూరిమి గల దినములలో; నేరములెన్నడును కలుగ;నేరవు మరియా; కూరిమి విరసంబైనను; నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!"
యిది కూడా గొప్ప ఆణిముత్యమే. మనసులో, స్నేహభావమో, ప్రేమో వుంటే - ఎదుటి వారిలో మనకు ఎటువంటి చెడూ కనిపించదు. కాని ఆ స్నేహభావము, ప్రేమ ఏ కారణము వలనైనా పోయి, ఏహ్యభావం చోటు చేసుకుంటే - ఎదుటి వారు చేసేవన్నీ - మనకు నేరాలుగానూ, సహింపలేనివి
గానూ కనిపిస్తాయి. కాబట్టి - మన మనసులో ఏం ఉండాలో - స్నేహమా, ఎహ్యమా? అనేది మనమే నిర్ణయించుకోవాలి.
"
కొరగాని కొడుకు బుట్టిన; గొరగామియే గాదు తండ్రి గుణముల జెరచున్;జెరకు తుద వెన్ను బుట్టిన;జెరకున తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!"
కొడుకు పనికిరాని వాడితే - వాడు పనికి రాని వాడని మాత్రం అనరు. వాడి తండ్రిని కూడా లోకం తప్పు పడుతుంది. తండ్రి ఎంత మంచి వాడైనా, మూర్ఖపు కొడుకు గుణాలను తండ్రికీ అంటగడతారు. చెరకు గడ ఎంత బాగా వున్నా, దాని చివర వెన్ను పుట్టిందంటే
- గడ అంతటా చేదు తయారవుతుంది. తీపి పోతుంది. యిదీ అలాగే.
"
తన వారు లేని చోటను; జనవించుక లేని చోట జగడము చోటన్; అనుమానమయిన చోటను; మనుజున కట నిలువ దగదు మహిలో సుమతీ!"
మనం ఎక్కువ కాలం వుండాలంటే - తన, మన అని అనే వారు, మనం తమ వారు అనుకునే వారు వున్న చోటే వుండాలి కానీ . తన, మన అనే వారు ఎవరూ లేని చోట వుండ రాదు. అదే లాగ, ఏదో కాస్త - మనకూ స్వాతంత్ర్యం వున్న చోట వుండాలి కానీ, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, అనే చోట వుండ రాదు. ఎప్పుడూ, మనల్ని అనుమానం తో, చూసే వారున్న చోట కూడా ఉండరాదు. అటువంటి వారు - ఎప్పుడో వొకప్పుడు, మనపై అపవాదులు పెట్టడం ఖాయం. అటువంటి స్థలాల్లో నివసించడం క్షేమ కరం కానే కాదు.
"
వినదగునెవ్వరు చెప్పిన; వినినంతన వేగపడక వివరింపదగున్; గనికల్ల నిజం దెలసిన; మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!"
మనిషికి సలహాలిచ్చే వారు, ఉన్నవీ లేనివీ వార్తలు చెప్పే వారు ఎంతో మంది వస్తారు. సలహాలు, వార్తలు వినవచ్చు. తప్పు లేదు. కానీ -ఏది వింటే, అది వెంటనే నమ్మేయాలనీ, చేసేయాలనే ఆత్రుత పనికి రాదు. అదంతా నిజం అనుకునే మనస్తత్వం పనికి రాదు. ఏది నిజమో, కాదో; ఏది చేస్తే మంచిదో కాదో, బాగా వివరంగా తెలుసుకుని - మరీ కార్యంలో దిగాలి కానీ - వినినంతనే - ఆత్రుత పడితే - ముప్పే.
మొదట వినండి. మంచి వారి మాట ఎక్కువగా వినండి. మీ శ్రేయోభిలాషులైన వారి మాట వినండి. తల్లీ, తండ్రీ, గురువూ మాట తప్పక వినండి. ఏది విన్నా - అందులోని నిజమెంతో తెలుసుకుని మరీ ఏ కార్యమైనా చేయండి.
ఇలాంటి ఆణి ముత్యాలు మన శతకాలలో కోకొల్లలుగా వున్నాయి. అవన్నీ - యిప్పుడే చెపినట్టు - యిప్పటికి తగినవే అనుకోవడం సబబు కాదు. కాలానుగుణం గా కొన్ని మార్చుకోవాలి. కొన్ని - అన్ని కాలాలకూ పనికొచ్చేవి వున్నాయి. అవి తెలుసుకోవాలి. మనసులో రంగరించుకోవాలి
. మన జీవితం సుఖమయం చేసుకోవాలి.
యిక్కడ యిచ్చినవి - అన్నీ యిప్పటి కాలానికీ తగినవే - యివి మనమూ పాటించాలి. మన పిల్లలికీ నేర్పించాలి.
= మీ
వుప్పలధడియం విజయమోహన్