2, మే 2018, బుధవారం

కాల నిర్వహణ - టైం మానేజ్మెంట్ టెక్నీక్స్ - అసలు ఎందుకు? ఎవరికి?

టైమ్ మానేజ్మెంట్ -  కాల నిర్వహణ
 అంటే ఏమిటే?

మనకున్న కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవడమే టైం మానేజ్మెంట్. తెలుగులో కాల నిర్వహణ లేదా సమయ నిర్వహణ అని చెప్పుకోవచ్చు. 

పరుగులెత్తే కాలం : మీరు ఏం చేసినా, ఏం చెయ్యకున్నా, మీ కాలము వురుకులు పరుగులుగా కదలి వెళ్లి పోతూనే  వుంటుంది. అది మీ కోసం ఆగే ప్రసక్తే లేదు. రోజుకు 24 గంటలు  యివ్వబడింది, మన అందరికీ. గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకండ్లు - ఈ కాల వ్యవధి మన అందరికీ సమానమే. ఎప్పటి నుండి ఈ కాలము పరుగులెత్తుతూ వుందో, యిలా ఎప్పటివరకూ వెడుతుందో ఎవరికీ తెలీదు . 

మన ఆయుర్దాయం - మన కాలము : ఈ పరుగులెత్తే కాలంలో ఎప్పుడో మనం పుడతాం. అప్పటి నుండి కాలంతో బాటు మన పరుగు ఆరంభం అవుతుంది. మనం పరుగెత్తే కాలాన్ని మన ఆయుర్దాయం అంటాం మనం. మనం ఎందుకు పుట్టామో, కాలంతో బాటు మన పరుగు ఎందుకో కూడా మనకు తెలీదు. మనలో ఒక్కొక్కరికీ, ఎన్ని రోజులు ఆయుర్దాయం యివ్వబడిందో కూడా మనకు తెలీదు. ఒకరికి నూరేళ్లు, మరొకరికి యాభయ్, మరొకరికి ముప్ఫయ్, మరొకరికి పదహారు, మరొకరికి ఒక్క సంవత్సరం - యిలా అనిశ్చితంగా వుంది మన ఆయుర్దాయాలు. అందరికీ వొకే రకంగా యివ్వొచ్చుగా. ఏమో. అలా సమానంగా ఎందుకివ్వలేదో - మనకు తెలీదు. 

జరిగింది - జరగబోయేది :- నా ఆయుర్దాయం ఎంతో నాకు తెలీదు. మీ  ఆయుర్దాయం ఎంతో మీకు తెలీదు. ఇప్పటి వరకు జరిగిపోయింది నిజం.దాన్ని మార్చలేము. దాన్ని భూత కాలం అంటాము. మన వయస్సు ఎదిగే కొద్దీ - మన ఆయుర్దాయంలో భూతకాలం పెరుగుతుంది. రేపటి సంగతి నిశ్చయంగా తెలీదు, ఎవ్వరికీ. రేపు, నేను మీకు గానీ, మీరు నాకు గానీ హలో చెబుతారా అంటే - తెలీదు. అంటే - మన భవిష్యత్తు గురించి మనకు తెలిసింది తక్కువ. తెలియనిది ఎక్కువ. యింకా ఎంత భవిష్యత్తు మనకు, మన ఆయుర్దాయంలో మిగిలివుందో, అదే మనకు తెలీదు. అది ఎలా గడవబోతోందో -అదీ తెలీదు 

యిప్పుడు నాకు 68 ఏళ్ళు . మరి ఎన్నేళ్లు  వుంటానో నాకు తెలీదు. మీరు ఎన్నేళ్లు వుండబోతున్నారో  మీకు తెలీదు. 

వందేళ్లు వుండాలన్నది, మన పూర్వీకుల, మన పెద్దల ఆశీర్వాదం. శతాయుష్మాన్ భవ - అంటారు. వందేళ్లు చాలు అని వారి అభిప్రాయం కావచ్చు. 

వందేళ్లు వుంటే ఏం చెయ్యాలి?:-

 • అన్నేళ్లూ ఆరోగ్యంగా వుండాలి .....     అందుకేం చెయ్యాలి?
 • అన్నేళ్లూ, ఆనందంగా వుండాలి ....... అందుకేం చెయ్యాలి?
 • నా జీవితం యొక్క ధ్యేయం ఏమిటో తెలుసుకోవాలి...... అందుకేం చెయ్యాలి?
 • నా ధ్యేయాన్ని నేను అందుకోవాలి.........  అందుకేం చెయ్యాలి?
 • నా జీవితం యొక్క గమ్యం ఏమిటో తెలుసుకోవాలి........  అందుకేం చెయ్యాలి?
 • ప్రతిరోజూ కొన్ని కోట్లమంది చచ్చి పోతూ వున్నారు. ఈ పద్ధతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చచ్చిపోతున్నారు...... ఎందుకు? అది తెలియాలి. 
 • చావడమేనా మన అందరి గమ్యం? 
 • పుట్టడమెందుకు ? చావడమెందుకు ?
 • చావడం మేలా ? చావకుండా ఉండడం మేలా?  
 • చావకుండా ఉండడం వల్ల వచ్చే లాభం ఏమిటి? ఛస్తే వచ్చే లాభం ఏమిటి? 
 • చావు కు అవతల ఏముంది ? చావు తరువాత మనం ఏమవుతాము ? ఏం అవడానికి అవకాశం వుంది ?
మన పూర్వీకులు :- ఇలాంటి ప్రశ్నలన్నీ, మన పూర్వీకులకు వచ్చాయి. వారు వాటిపైన సునిశితమైన, సుదీర్ఘమైన ఆలోచనలు చేశారు; ప్రయోగాలు చేశారు; చర్చలు చేశారు; ప్రపంచాన్ని నిశితంగా పరిశోధించారు; మనసు లోతుల్లోకి వెళ్లారు. ఎన్నో తెలుసుకున్నారు. 

యిలా కనుగొన్న వారిలో కొంత మంది త్రికాల జ్ఞానులయ్యారట. కొందరు చిరంజీవులయ్యారట. తిండి, నీళ్లు, మల మూత్ర విసర్జన అవసరం లేకుండా ఎలా బ్రదకడమో కొంత మంది  కనుగొన్నారు(ట). అటువంటి వాళ్ళు కొంత మంది యిప్పటికీ వున్నారు. 

పతంజలి మహర్షి లాంటి వాళ్ళు చెప్పడం ఏమిటంటే - భూత భవిష్యద్ వర్తమానాలనన్నిటినీ యోగ విద్య సహాయంతో మనం వీక్షించ వచ్చును, తెలుసుకోవచ్చును  - అని . 

కానీ దానికి ఎంతో సాధన కావాలి. అలా యోగవిద్యలో నిష్ణాతులైన వారికి యిప్పటి  పాశ్చాత్య తరహా టైం మానేజ్మెంట్ టెక్నిక్స్ అవసరం లేదు. వారికి పై ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి యోగ అనే అద్భుతమైన విద్య తోడుంది. 

టైం మానేజ్మెంట్ టెక్నిక్స్ ఎందుకు :- మిగతా మన లాంటి వారికి టైం మానేజ్మెంట్ టెక్నిక్స్ అవసరం వుంది. ప్రతి రోజూ మనకు వున్న 24 గంటలు ఎలా వుపయోగించడం, దాని సహాయంతో మన జీవితాన్ని, ఆనందంగా, ఆరోగ్యంగా, అర్థవంతంగా, మనకు  నచ్చిన ధ్యేయం వైపు పయనించడం, యివన్నీ  మనం చేయగలమా ?

చచ్చే లోపల , నేను సాధించ వలసిందేమిటి? :-  (అ) ఆరోగ్యముగా ఉండడం (ఆ) ఆనందంగా వుండడం (ఇ)అర్థవంతమైన జీవితం గడపడం (ఈ)పదిమందికీ  నచ్చిన వాడిగా వుండడం : పది మంది పొగిడితే, నచ్చని వాడు లేడు. (ఉ) డబ్బు, ఆస్తి, మనల్ని ప్రేమించే కుటుంబం - వీటిని సంపాదించడం. మంచి అందమైన అమ్మాయిని/అబ్బాయిని  పెళ్లి చేసుకోవడం ఇందులోనే వుంది (ఊ) సమాజానికి ఉపయోగ పడే గొప్ప పనులేవైనా చెయ్యడం (ఋ)ఏదైనా గొప్ప కళాఖండాలు  సృష్టించడం - యిలాంటివెన్నో మనం సాధించాలి. 

మన ధ్యేయాలు :- మనలో చాలా మందికి యేవో  కొన్ని ధ్యేయాలు వుండవచ్చు. కొందరికి ఏ ధ్యేయాలూ లేకపోవచ్చు. ధ్యేయాలు వున్నవారు తెల్లవారి లేచినప్పటినుండి, ఆ ధ్యేయాల సాధన కోసం ఏదో ఒకటి చేస్తూ వుంటారు. జీవితంలో ముందుకు పోతున్నామన్న భావన, ఉత్సాహం వాళ్ళలో కనిపిస్తాయి. కొంత మందికి చిట్ట  చివరి నిముషం వరకు ఏదో ఒక పని ఉండనే వుంటుంది. పోతూ, పోతూ , చివరి వూపిరి విడుస్తూ కూడా, ఎన్నో విషయాలను - బ్రతికున్న వారికి వప్పగించి పోతూ వుంటారు. అలా పోవడం అసంతృప్తి కాదు. చాలా సంతృప్తి గా వుంటుంది. 

ధ్యేయాలు లేని వాళ్ళు :- ధ్యేయాలు లేనివారికి  వాళ్ళ జీవితాలకు ఒక అర్థం అంటూ కనిపించదు. తెల్లారి లేస్తే, ఏం చెయ్యాలి అన్నదే సంధిగ్ధంగా వుంటుంది. సోమరితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వారిలో. ఎవరో తిండి, గుడ్డ, నీడ సమకూరిస్తే, వారిపై ఆధారపడి బ్రతికేస్తుంటారు. ఏ పనీ చెయ్యరు. ఎవరైనా, ఏ చిన్న పనైనా చెబితే విసుక్కుంటారే తప్ప చెయ్యరు.  తమ హీన పరిస్థితికి ఎవరో కారణం అనుకుంటారు తప్ప - తామే కారణం అన్నది వారు అర్థం చేసుకోరు. 

మనం ఎలా వుండాలి ? :- ప్రతి మనిషికీ ఒక మంచి ధ్యేయం ఉండాలి. ఒకటే కాదు. మూడు, నాలుగు ధ్యేయాలు కూడా వుండొచ్చు. తప్పు లేదు. ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా, మానసికంగా, కళాత్మకంగా , సాహితీ పరంగా - యిలా అన్ని రంగాల్లో ఒక్కొక్క ధ్యేయం వుండొచ్చు. 

డబ్బు సంపాదన :- డబ్బు సంపాదన పాశ్చాత్య దేశాలలో మొట్టమొదటి ధ్యేయంగా ఉంటూ వుంది. అలా డబ్బు బాగా సంపాదించిన వారిలో ఎంతో మంది, తాము సంపాదించిన ఆస్తిలో - చాలా భాగం దానాలు చేసెయ్యడం, మంచి సామాజిక కార్యాలకు  వినియోగించడం మనం చూస్తూనే వున్నాము. మన ఉపనిషత్తులలో కూడా యిదే చెప్పారు. కానీ, దానాలు చెయ్యాలి, మనకంటే క్రింద వున్న వాడిని మనం ఆదుకొనాలి - అన్న భావన, మనలో ఇప్పటి కంటే చాలా ఎక్కువగా ఎదగాల్సి వుంది. 

సమాజంలో మన స్థితి :- డబ్బు పెరిగే కొద్దీ , డబ్బే ముఖ్యం అన్న భావన పోయి, మనం సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి గా గమనింప బడాలి అన్న ధ్యాస పెరుగుతుంది. పెరగాలి. మనకు ఎంతో మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండాలి అన్న కోరిక పెరుగుతుంది. దీన్నే ఒక ధ్యేయంగా పెట్టుకుంటారు. దీనికోసం కృషిచేస్తారు. సభలకు వెళ్లడం, ప్రసంగించడం, ప్రశంసలు పొందడం, బిరుదులు, అవార్డులు, పొందడం ఇటువంటి ధ్యేయాలు ఎక్కువవుతాయి. కొంతమందికి, గొప్ప పుస్తకాలు రాయడం లాంటివి ధ్యేయం కావచ్చు. 

సమాజోద్ధరణ :- కొంత మందికి మానవ సేవే మాధవ సేవ - అన్న బలమైన అభిప్రాయం కలగొచ్చు. అట్టడుగున వున్న  వారికి, కష్టాలలో వున్న వారికి సహాయ పడడమే తమ జీవితానికి పరమార్థం అనుకునే వారు చాలా మంది వున్నారు. అమెరికా లాంటి దేశాలు పైకి రావడానికి , మన దేశం రాక పోవడానికి యిది కూడా ఒక కారణమే. 

యిలా మనకు ఎన్నో రకాల ధ్యేయాలు ఉండొచ్చు. వాటిని సఫలీకృతం చేసుకోవడం కోసం మనం ప్రతి రోజూ ఎంతో కొంత కృషి చెయ్యాల్సి వుంటుంది. దీనికే మనకు టైం మానేజ్మెంట్ టెక్నీక్స్  కావాలి . ఏ ధ్యేయమూ లేకున్నప్పుడు, ప్రొద్దు పోవడమే కష్టంగా వున్నప్పుడు - టైం మానేజ్మెంట్ టెక్నీక్స్ అవసరం లేదు. 

సరే . మీకేవో ధ్యేయాలున్నాయి. మీకు  ఎలాంటి టైం మానేజ్మెంట్ టెక్నీక్స్ కావాలి - అన్న విషయం తరువాతి వ్యాసంలో చూద్దాం. 

=మీ 

ఉప్పలధడియం విజయమోహన్ 

 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి