తెలుగు ప్రముఖులు
వారిలో నాకు నచ్చిన వారు
తెలుగు వాళ్లలో నాకు నచ్చిన వాళ్ళు చాలా మంది వున్నారు.
ముఖ్యులైన మన ప్రవచన కర్తలందరూ నాకు బాగా నచ్చారు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వంటి ప్రముఖులు మాత్రమే కాకుండా యింకా ఎంతో మంది చాలా బాగా ప్రవచనాలు చెప్పే వాళ్ళు తెలుగు నాట వున్నారు.
చాగంటి గారి వాక్చతురత, వారి మేథాపాటవము, ఎప్పటికెయ్యది ప్రస్తుతమో,అప్పటికా మాటలాడ గలిగే నైపుణ్యము, అన్నిటినీ మించిన వారి వినమ్రత మనకు (నాకు) బాగా నచ్చుతాయి. గరికపాటి వారి సులభ శైలి, ప్రస్తుత పరిస్థితులకు కావలసింది చెప్పడం, వారి అవధాన చాతుర్యం ఎంతో బాగుంటాయి. షణ్ముఖ శర్మ గారిలో వీరిద్దరి పోలికలూ వున్నాయి. మహా మేధావులైన వీరందరూ కలిసి ఒకే త్రాటిపై నడిచే విధంగా వుంటే యింకా, యింకా యెంతో బాగుంటుందనే అభిప్రాయం, అభ్యర్థన కూడా నేను కొన్ని టి వి ఛానళ్లలో విన్నాను. దాన్ని నేనూ సమర్థిస్తున్నాను. ఎటువంటి అభిప్రాయ భేదమైనా సుహృద్భావముతో, ముఖాముఖీ సరిచేసుకోవచ్చు.
అంతే కాదు. వీరు ముగ్గురు, నలుగురు కలిసి, గొలుసుకట్టు రచన లాగా - కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలను కలుపుతూ - ఏదైనా గొప్ప గ్రంధం రచిస్తే , అది ఒక ప్రామాణిక గ్రంధం గానూ ఉంటుంది. చారిత్రిక గ్రంధం లాగూ ఉంటుంది. భారత దేశానికి ఆంగ్ల వాసన లేకుండా వచ్చిన ఒక ఆదర్శ గ్రంధంగానూ ఉంటుంది. ఎన్నో సందేహాలు , అపోహలు తీర్చే గ్రంధం గానూ , హైందవ సంస్కృతి యొక్క గొప్ప చరిత్ర గానూ వుంటుంది.
దీనికి వచన రచనే చాలు. రెండేళ్లు సమయం తీసుకోవచ్చు వీరు చేస్తే అందులో తప్పులు దొర్లవు. వున్నా సరిచేసుకునే వీలు తప్పక ఉంటుంది. దేశానికంతా ఒక ప్రామాణిక గ్రంధంగా వారి రచన మిగిలిపోతుంది. యింత ప్రతిభావంతులు, తమ కొద్దిపాటి అహం ప్రక్కన పెట్టి కలిసి పనిచేస్తే, తమ గొలుసుకట్టు రచన ద్వారా - ప్రపంచానికే మార్గ దర్శకమైన గొప్ప రచన చెయ్యగలరనడంలో నాకు సందేహం లేదు. తెలుగు నాట యింతకు ముందు మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయం ను మించిపోగలిగిన రచన వీరు చేయగలరని నా నమ్మకం. నా ఆశ. ఆ తరువాత వారి రచనను - మిగతా భాషలలోకి సులభంగా అనువదించుకోవచ్చు. నాకు తెలిసి మిగతా భాషలలో ఈ పని చెయ్యగలిగిన యింతటి ప్రతిభావంతులు యిప్పుడు లేరనే చెప్పవచ్చు. వీరి తరువాత యింత పండితులు, ప్రతిభావంతులు వస్తారా - అంటే , చెప్పడం చాలా కష్టం. రావాలంటే , వీరే పూనుకోవాలి.
రాజకీయాలలో కొట్లాటలు సహజం. అక్కడ కూడా సుహృద్భావముతో ఉంటే, చాలా అందంగా వుంటుంది. అక్కడ కూడా అక్కర్లేని బురద చల్లడమే పనిగా పెట్టుకో రాదు. కానీ , శాస్త్రాలను బోధించే ప్రవచన కర్తల మధ్య మచ్చ లేని స్నేహ భావం మాత్రమే ఉండాలి. ఉంటే , యింతటి మహత్తరమైన కార్యం సాధించే అవకాశం, వీలు తామే వెదుక్కుంటూ వస్తాయి.
సరే. వీళ్ళు కాకుండా, అష్టావధానాలు చేసే వాళ్ళు, శతావధానాలు చేసే వాళ్ళు, సహస్రావధానాలు చేసే వాళ్ళు ఎంతో మంది వున్నారు.అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు. వారందరూ నాకు నచ్చిన వాళ్ళే. వీళ్ళు కూడా తమ అసమాన ప్రతిభతో మరేదైనా కొత్త ప్రయోగాలు చెయ్యొచ్చు. మా తాతలు చేసిందే నేనూ చేస్తాననడం - అది ఎంత గొప్ప పనైనా - పెద్దగా శోభించదు. మీరే యోచన చేసి చూడండి. వీరు చేస్తున్న పని చాలా కష్టభరితమైనది.అసమాన ప్రజ్ఞ కావాల్సిన పని అది. కానీ, ఎంత ప్రజాదరణ వుంది ఈ కష్ట భరితమైన, అసమాన ప్రజ్ఞ తో కూడిన పనికి. వెయ్యి మంది వస్తారా చూడ్డానికి, వినడానికి. ఎంతో బాగున్న, ఒక శతావధానానికి వంద మంది లేరు వినడానికి. కానీ, ఈ ప్రక్రియను మరో రకంగా చేస్తే - ఈ ప్రతిభను లక్షల మందికి పంచవచ్చునేమో - అనిపిస్తుంది. అలా జరిగితే , దేశం ఎంతగానో మారిపోతుంది. ఈ మహానుభావులు ఈ విషయాన్ని యింకా బాగా యోచన చెయ్యాలని నా ప్రార్థన , అభ్యర్థన.
సరే. సన్యాసం స్వీకరించి, సామాజిక పరిస్థితులను చక్కదిద్దే పని కూడా చేసే స్వామీ పరిపూర్ణానంద వంటి వారు కూడా నాకు బాగా నచ్చారు. రామకృష్ణ మిషన్ స్వామీజీలు కూడా ఎంతో మంది ఎన్నో రకాల సమాజ సేవ చేస్తున్నారు. వారిని గురించి ప్రచార మాధ్యమాలలో యింకా రావాలి. మనకు వారి కృషి, గొప్పతనం తెలియక పోతే , మనకే చాలా నష్టం అనిపిస్తుంది.
పై వారందరిలో, నాకు చాలా, చాలా, ఎక్కువగా నచ్చిన గుణం వారి నిజాయితీ. నచ్చిన మిగతా గుణాలు వంద. నచ్చనివి ఒకటో రెండో వుండొచ్చు. వాళ్ళు యిది చెయ్యాలి, అది చెయ్యాలి, అని నా మనసులో - వారి పట్ల కొన్ని ఆశలు, ఆపేక్షలు ఉండొచ్చు. వున్నాయి . వారు అందరూ అవి అన్నీ చెయ్యలేక పోవచ్చు. లేదా చెయ్యక పోవచ్చు.
అందరూ అన్నీ చెయ్యాలని, చెయ్యగలగాలనీ దేవుడి సృష్టిలో ఎక్కడా లేదు. వాళ్ళు చేస్తున్నదే చాలా గొప్ప - అన్న సత్యం నేను మరచిపోకూడదు. నా అసలు ప్రశ్న -వాళ్ళు ఎందుకు ఇదో అదో చేయడం లేదన్నది కాదు, అవి నేనెందుకు చెయ్యడం లేదు - అన్నదే కావాలి.ఆ ప్రశ్న నాలో రావాలి. మనందరిలో రావాలి. అప్పుడు మనం అందరూ ఎన్నో కొత్త ప్రయోగాలు తప్పక చేస్తాం .
ప్రముఖ తెలుగు రచయితలు, వక్తలు లాంటి వారు ఎంతో మంది నాకు నచ్చిన వాళ్ళు వున్నారు. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు, శ్రీ బి.వి. పట్టాభిరామ్ గారు, శ్రీ గంపా నాగేశ్వర రావు గారు - ఇలాగా ప్రముఖ రచయితలు, వక్తలు అందరూ నాకు నచ్చిన వాళ్ళే. ముఖ్యంగా వీరు ముగ్గుర్నీ - నేను హైదరాబాద్ లో నేషనల్ అకాడెమి అఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మానేజ్మెంట్ లో డీజీఎం గా పని చేస్తున్న రోజుల్లో - ప్రతి వారం మేము పనిగట్టుకుని పిలిచి స్వాగతించే వాళ్ళము. దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి మా అకాడెమీ కి వచ్చిన అధికారులకు (ట్రెయినీలకు) మన ప్రముఖులైన వీరి చేత చాలా అందమైన వుపన్యాసాలు ఇప్పించే వాళ్ళము. వీరందరి వుపన్యాసాలు , మా లెక్చర్ హాళ్లలో , చాలా సార్లు నేను విన్నాను.
ఇప్పుడూ - వారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న ఉపన్యాసాలు వింటూ వుంటాను. అప్పట్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ లేదనుకుంటా. ఆ తరువాత ఇంపాక్ట్ ద్వారా వారు చేస్తున్న సమాజ సేవ చాలా గొప్పది. - అని నా నమ్మకం . ఉపన్యాసాలే కాకుండా, యితర విధాలుగా కూడా వాళ్ళందరూ సమాజ సేవ చేస్తున్న వాళ్ళే.
వీరు కాక - సంగీతము , సినిమా, రంగాల్లో తెలుగు ప్రముఖులు ఎంతో మంది వున్నారు. టెక్నాలజీ రంగంలో సత్యా నాదెళ్ల లాంటి వారు యెంతో మంది. క్రీడారంగంలో ప్రముఖ తెలుగు క్రీడాకారులు, క్రీడాకారిణులు ఎంతో మంది. యిలా ప్రతి రంగం లోనూ రాణిస్తూ వున్న వారు ఎంతో మంది వున్నారు.
బాహుబలి లాంటి సినిమా - మళ్ళీ ఎప్పుడైనా వస్తుందా ? యింతకు ముందు లేదు . ఇకపై వస్తే రాజమౌళి ద్వారానే రావాలి, తెలుగు లోనే మళ్ళీ రావాలి - అన్నట్టుగా వుంది. ఇలాంటి అపూర్వ సృష్టిఖండాలు - ప్రతి రంగంలోనూ , తెలుగు నాట మళ్ళీ , మళ్ళీ రావాలని మనం అనుకోవడం లేదా? ఆశించడం లేదా ?
వీరు కాక - ఈ మధ్య కాలంలో నేను విన్న ఒక పేరు 'బాబు గోగినేని'. ఈయన స్వంతంగా ఏ పనీ చేసినట్టు లేదు. కానీ , తప్పుచేసేవారిని,అబద్ధాలతో మోసం చేసేవారిని పట్టుకుని ప్రజల ముందు నిలదీస్తున్నారు. తన్ను తాను - హేతు వాది, హిత వాది - అని పరిచయం చేసుకుంటారు. మీకందరికీ ఆయన బాగా తెలిసే వుండొచ్చు. నాకొక 15 రోజులకు ముందే ఆయన గురించి తెలిసొచ్చింది.
యూట్యూబ్ లో ఆయన వీడియోలు చాలా చూశాను. ఆయన అభిప్రాయాలు, భావాలు అన్నీ కాదు కానీ, చాలా - నాకూ నచ్చాయి. ఆయన చాలా వరకూ హేతు వాది, హిత వాది - అని నేనూ వొప్పుకుంటాను. దేవుడు లేడు - అంటాడు. జాతకాలు తప్పు అంటాడు. ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రం, పామిస్ట్రీ, న్యూమరాలజీ లాంటివన్నీ హేతుబద్ధమైనవి కావనీ, నమ్మొద్దనీ అంటాడు.వాటి ద్వారా మోసపోవద్దని అంటాడు. మన ఎన్నో నమ్మకాలు పక్కన పడేయండి అంటాడు. గ్రహణాలు సైన్స్ ప్రకారం చూడండి . పాత కాలపు మూఢ నమ్మకాలు తీసి పక్కన పెట్టండి -అంటాడు.అన్నింటినీ హేతుబద్ధంగా చూడండి -అంటాడు.
యూట్యూబ్ లో ఆయన వీడియోలు చాలా చూశాను. ఆయన అభిప్రాయాలు, భావాలు అన్నీ కాదు కానీ, చాలా - నాకూ నచ్చాయి. ఆయన చాలా వరకూ హేతు వాది, హిత వాది - అని నేనూ వొప్పుకుంటాను. దేవుడు లేడు - అంటాడు. జాతకాలు తప్పు అంటాడు. ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రం, పామిస్ట్రీ, న్యూమరాలజీ లాంటివన్నీ హేతుబద్ధమైనవి కావనీ, నమ్మొద్దనీ అంటాడు.వాటి ద్వారా మోసపోవద్దని అంటాడు. మన ఎన్నో నమ్మకాలు పక్కన పడేయండి అంటాడు. గ్రహణాలు సైన్స్ ప్రకారం చూడండి . పాత కాలపు మూఢ నమ్మకాలు తీసి పక్కన పెట్టండి -అంటాడు.అన్నింటినీ హేతుబద్ధంగా చూడండి -అంటాడు.
వీటిల్లో చాలా విషయాలు నేనూ యధాతథంగా ఒప్పుకుంటాను. నేను చాలా కాలంగా చెన్నైలో ఉండటం వలన, తమిళనాడులో నేను చూస్తున్న హేతువాదం, ప్రపంచంలో మరెక్కడా లేనన్ని మూర్ఖపు నమ్మకాలతో కూడుకున్నది, రకరకాల ద్వేషాలతో, వైరుధ్యాలతో కూడుకొన్నది - అని నాకు బాగా అర్థమయింది. కానీ బాబు గోగినేని గారి హేతు వాదం నిజాయితీ తో కూడుకొన్నది; నిజంగా హేతువాదంగా, హిత వాదంగా వుండాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకు బాగా తెలుస్తుంది.
* * * యింకా వుంది * * *
* * * యింకా వుంది * * *
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి