భగవద్ గీత (3)
రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
భగవద్ గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, దేశ, కాల, మత, జాతులకు అతీతమైన, మహోత్కృష్టమైన జీవన విధానం.
మనిషి జీవితానికి అర్థం, పరమార్థం, మనం చెయ్య వలసినవి, చెయ్యకూడనివి, ఏది చేస్తే ఏమవుతుందో, ఏది కాదో, ఏది చెయ్యకూడదో - అన్నీ సమగ్రంగా తెలిపిన నభూతో నభవిష్యతి అయిన మహోపదేశం భగవద్ గీత.
మహా భారత సంగ్రామానికి ముందుగా, అంత వరకు కర్తవ్యోన్ముఖుడైన, అర్జునుడు, తన మనసులో రేకెత్తిన అల్లకల్లోలానికి,కర్తవ్య విముఖతకు ఎన్నెన్ని కారణాలో మనసు విప్పి శ్రీకృష్ణుడి ముందు ఏకరువు పెడతాడు. ఇది భగవద్ గీతలో మొదటి అధ్యాయం. అందులోని అర్జునుడి మనోవేదన ,శోకము, యుద్ధం పట్ల తనకున్న విముఖతకు కారణాలు క్రిందటి వ్యాసంలో చూశాము.
ఇందులో శ్రీకృష్ణుడి చాతుర్యం కూడా ఉందని విజ్ఞులు అంటారు. రథాన్ని భీష్మ, ద్రోణులముందు నిలుపకుండా దుర్యోధనుడి ముందో, దుశ్శాసనుడి ముందో, శకుని ముందో నిలిపి వుంటే అర్జునుడు కోపంతో వుడికిపోయి, యుద్ధానికి సన్నద్ధం అయ్యే వాడేమో. కానీ, రథం నిలిచింది తనకెంతో ఇష్టమైన తాత భీష్ముడు, ఎంతో పూజ్యుడైన, యిష్టుడైన గురువు ద్రోణుడి ముందు. అసలు వారితో కూడా యుద్ధం చెయ్యాలి, వారిని కూడా చంపాలి - అని అర్జునుడి మనసులో ఎప్పుడూ తట్టలేదు. ఇది తప్పకుండా అర్జునుడికి మనో వేదన కలిగించే విషయమే. ధర్మరాజు ఎంత ధర్మాత్ముడో , అర్జునుడు కూడా అంత ధర్మాత్ముడు. పెద్దల పట్ల ప్రేమ, గౌరవం కలిగిన వాడు. అటువైపు భీష్మ, ద్రోణులూ అంతే.
15 రోజులు వారి నాయకత్వంలో జరిగిన యుద్ధంలో, వారు పాండవసేనను పూర్తిగా నాశనం చేశారు, కానీ పాండవులనెవరినీ చంపలేదు. ఒక్క అర్జునుడిని తప్ప మరెవరినైనా చంపి ఉండొచ్చు కదా. అర్జునుడిని చంపలేరు. శ్రీకృష్ణుడు అతని సారథి కదా. ఈ సారథిని దాటి, ఆ రథి ని చంపడం అసాధ్యం. కానీ పాండవులందరూ ధర్మ మూర్తులు. భీష్ముడు ప్రతిజ్ఞకు కట్టుబడి, ద్రోణుడు సేవక ధర్మానికి కట్టుబడి దుర్యోధనుడి వైపు యుద్ధం చేశారు గానీ , వారి మనసు ధర్మం వైపే వుంది. వారికి తెలుసు, జయం కృష్ణుడున్న వైపే నని. తమ మృత్యువు తప్పదని. అయినా, యుద్ధం చేశారు.
ఇప్పుడు అర్జునుడి మనసులో యింత ఇష్టమైన తాత, గురువు లతో ఎలా యుద్ధం చెయ్యడమన్నది ప్రశ్న. అందుకే రాజ్యము, సుఖాలు ఏవీ వద్దు, పద పోదామన్నాడు. సరే. కౌరవులు కూడా సహోదరులు కదా. వారి కొడుకులు తమ కొడుకుల లాంటి వారే కదా. శల్యుడు మేనమామ కదా. యిలా ఎంతో మంది బంధువులు, బాంధవులు అటువైపు వున్నారు. వారిని చంపడం పాపం అని తెలిసీ, ఈ యుద్ధం ఎందుకు చెయ్యడం? వాళ్ళు ఛస్తే , వాళ్ళ భార్యలు వితంతువులైతే , వారికి పట్టే దుర్గతి ఎలావుంటుంది? వారినెవరైనా ఎత్తుకుపోతే, వర్ణ సంకరము , ధర్మ సంకరము, కుల నాశనము , యింకా యెన్నో అనర్థాలు అవుతాయి కదా. ఇలాంటి యోచనలు, కారణాలు ఎన్నెన్నో అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు. ముల్లోకాలు యిచ్చినా వద్దు. ఈ రాజ్యం యిచ్చినా వద్దు. యుద్ధం చెయ్యను. నా గాండీవం పడిపోతూ వుంది. నా శరీరం వణుకుతూ వుంది. మనసులో శోకం పొంగి పొర్లుతూ వుంది - అని చెబుతూ కూలబడ్డాడు అర్జునుడు.
యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం, 18 రోజులలో నిజంగానే హతమారిపోయింది. ఆ తరువాత అర్జునుడు అనుకొన్న దుష్పరిణామాలు నిజంగా జరిగాయా? ఎవరికి తెలుసు? ఆ తరువాత పాండవులు ఏలింది హస్తినాపురం మాత్రమే. మిగతా రాజ్యాల సంగతి దేవుడెరుగు. వాటి రాజులు పోయారు. సైన్యాలు పోయాయి. అవి ఏమయ్యాయో? ద్వారక సముద్రంలో మునిగిపోయింది. అందులో వున్న యాదవ వంశం చాలా వరకు నాశనం అయింది. ఎన్నో విపరీతాలు జరిగి పోయాయి. అవన్నీ మనకు తెలీదు. కానీ, యుద్ధం మంచిది కాదు -అని అర్జునుడు చెప్పింది సబబే అనిపిస్తుంది .
అయితే, జగన్నాటక సూత్రధారి ఎందుకిది జరిపిస్తున్నాడు ?
భీష్ముడికి యిచ్చామరణమే కానీ, యమధర్మ రాజే స్వయంగా వచ్చినా ఆయనను తీసుకుపోలేడు. అంటే, త్వరలో రాబోయే కలియుగంలో కూడా భీష్ముడు వుండిపోతాడా? ద్రోణుడి చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ఆయనను ఎవ్వరూ చంపలేరు. వీరుకాక ఎంతోమంది రాక్షసులు రెండువైపులా వున్నారు. వారు మాయావులు. దీర్ఘకాలం బ్రతుకగలిగేవారు. కలియుగంలో వారంతా ఉంటే ఎలా? ఎంతో మంది వద్ద దివ్యాస్త్రాలు వున్నాయి. వాటి సంగతేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు భారత యుద్ధం సరైన సమాధానం అయ్యింది - అని మనం చెప్పవచ్చు.
కానీ అర్జునుడి బాధ ఇది కాదు. నాకు యుద్ధం వద్దు అని - గాండీవం విడిచేసి కూర్చున్నాడు. అర్జునుడు లేకపోతే శ్రీకృష్ణుడు యుద్ధం జరిపించేది ఎలా? ఇదొక వైపు.
కలియుగంలో వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు యెంత మంది చదువగలరు ? అర్జునుడికే అర్థం కాని ధర్మాలు అందరికీ ఎలా అర్థమవుతాయి?
కలి యుగానికి ఒక గొప్ప ధర్మ శాస్త్రం కావాలి. ఒక భగవద్ గీత కావాలి. ఆ భగవద్ గీతకే అర్జున విషాద యోగం పునాది అయ్యింది. దీన్ని కృష్ణార్జున సంవాదం - అని కూడా అన్నారు . మన మనస్సులో తలెత్తే ఎన్నో ధర్మ సందేహాలను అర్జునుడు అడుగుతూ వుంటే, వాటన్నిటికీ, శ్రీకృష్ణుడు సముచిత సమాధానాలు చెబుతాడు. వాటినుండి , అర్జునుడి సందేహాలు మళ్ళీ ప్రశ్నలుగా అడుగుతాడు . మళ్ళీ శ్రీకృష్ణుడు సమగ్రమైన సమాధానాలు యిస్తాడు. ఇందులోని 18 అధ్యాయాలను, 18 యోగాలు - అని అన్నారు. ఒక్కొక్క అధ్యాయంలో , ఒక్కొక్క విజ్ఞానం వుంది. ఒక్కొక్క యోగం వుంది. ఈ విజ్ఞానం ప్రపంచానికంతా కావలసినది. ఒక్క భారత దేశానికి మాత్రం కాదు. ఒక్క ఆర్యధర్మానికి మాత్రం కాదు. యిది ఒక సైన్స్. ఒక విజ్ఞానం. 5500 యేండ్ల క్రితం స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పింది. శ్రీకృష్ణుడు నిజంగా తానెవరో కూడా యిందులో సుస్పష్టంగా చెప్పాడు. ఇందులో వుండేటంత గొప్ప సైన్స్ మరెక్కడా లేదు. ఏ దేశంలోనూ లేదు.
ఇక్కడి నుండి రెండవ అధ్యాయమైన 'సాంఖ్యయోగం ' ఆరంభమవుతుంది. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు శ్రోత గా ఉన్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ఇక పైన నిజమైన శ్రీకృష్ణార్జున సంవాదం మొదలవుతుంది.
మరి అర్జునుడి విషాదాన్ని కూడా యోగం అని అనొచ్చా.
అర్జునుడు చెప్పిన మాటలన్నీ 'మనసా, వాచా,కర్మణా' త్రికరణ పూర్వకంగా చెప్పినవే. అందులో ఉబుసుపోక మాటలో, అబద్ధాల్లో, వ్యర్థపు మాటలో లేవు. కాకపోతే, అర్జునుడు తనకు తెలిసిన ధర్మాలు చెప్పాడు. అలా చూస్తే, అర్జున విషాదం యోగమే. త్రికరణాలతో ఏకీకృతం అయి, చేసే ఏ పనైనా, పలికే ఏ మాటైనా, చేసే ఏ ఆలోచనైనా 'యోగమే' అవుతుంది. కానీ యిది విషాద యోగం. విషాదాన్ని అజ్ఞానం అన్నారు విజ్ఞులు. విషాదంలో యోగం లా లీనమైపోయిన అర్జునుడికి యిప్పుడు సరైన జ్ఞానం కావాలి. అదెలా వస్తుంది ?
అది ఇకనుండి, రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో చూద్దాం.
అది ఇకనుండి, రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో చూద్దాం.
ఈ వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను , విమర్శలను , అనుభవాలను కూడా నాకు మీరు తెలియ జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్