22, ఫిబ్రవరి 2014, శనివారం

నా సలహా ఏమిటంటే ... సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో? చెప్పకూడదో ? తెలుసుకోండి . యిది సలహాల సైన్స్ - శ్రీకృష్ణుడి సలహా భగవద్ గీత


నా సలహా ఏమిటంటే ...


మనకు సలహా లివ్వడం పరిపాటి . అడిగిన వాడికీ , అడగని వాడికీ , దావన పోయ్యే  ప్రతి దానయ్యకూ, బస్సులోనో , ట్రైన్ లోనో ప్రక్కన కూర్చున్న వాడికీ,  వినే వాడికీ, వినని వాడికీ, ప్రొద్దు పోకుండా కూర్చున్న సోమరి వాడికీ - అందరికీ సలహాలిస్తాం . మరొకరు మనకిస్తే - వొక్కో సారి వింటాం . వొక్కో సారి వినం .  వాళ్ళూ అంతే .

సాధారణంగా సలహాలన్నీ ఉచిత సలహాలే . కానీ డాక్టర్ సలహా కావాలంటే , ఫీజు యిచ్చుకోవాలి . అలాగే , వొక మంచి లాయరు , చార్టర్డ్  అకౌంటెంట్ , స్టాక్ బ్రోకర్ లాంటి వాళ్ళ సలహాలకు కూడా ఫీజు యిచ్చుకోవాలి .

ప్రపంచంలో  బాగా పేరు మోసిన పాత సలహాదారు  శ్రీకృష్ణుడు .

ఆయన ఎప్పుడు సలహా యిచ్చాడు ? అర్జునుడు  తన గాండీవము , శస్త్రాస్త్రాలు - అన్నీ తీసుకుని దేవతలిచ్చిన దివ్య రథాన్నెక్కి , కౌరవులను అందరినీ చంపేస్తాను - అని బయల్దేరాడు . అతని సారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు . తీరా యుద్ధ భూమికి వచ్చి  - భీష్ముల వారిని , ద్రోణుల వారిని, కౌరవులను చూసే సరికి , అర్జునుడిలో  విషాదం పుట్టుకు వచ్చింది . నాకు ఎంతో యిష్టమైన తాత గారిని, గురువును, ఇతరులను చంపి వచ్చే  రాజ్యమూ , ఆ నెత్తుటి కూడు నాకక్కర లేదు - అని,  శస్త్రాస్త్రాలు అన్నీపారేసి, ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు . అప్పటికీ శ్రీ కృష్ణుడు  ఏమీ మాట్లాడ లేదు . దాదాపు వొకటిన్నర ఛాప్టరు " నేను యుద్ధం చెయ్యను . ఎందుకంటే ..."  అని ఎన్నో , ఎన్నెన్నో కారణాలు అర్జునుడు చెబుతూ వచ్చాడు . అన్నీ విన్న శ్రీకృష్ణుడు అప్పుడు కూడా ఏ గొప్ప సలహానూ యివ్వ లేదు. మొదట కాస్త మందలించాడు . నీకసలు బుద్ధుందా ? యుద్దానికొచ్చేసి ,  యిక్కడ శస్రాస్త్రాలు పారేసి,  పేడి లాగా  మాట్లాడుతున్నావా ?  నలుగురూ నవ్వి పోతారు  - అన్నాడే కానీ అప్పుడూ సలహా యివ్వ లేదు .

ఈ తిట్లు అర్జునుడిలో - ఎక్కడో - తను ఏదో తప్పు చేస్తున్నట్టే  వుంది - అన్న భావన కలిగించింది .

అప్పుడు అన్నాడు - కృష్ణా ! నేను నీ శిష్యుడిని . నీ దాసుడిని . నాకు నీవు తప్ప మరొకరు మంచి చెప్పే వారు , సక్రమ మార్గంలో పెట్టె వారు ఎవరూ లేరు. దయ చేసి - నాకు సరైన మార్గం చూపించు . నువ్వు చూపించే  మార్గం లోనే నేను నీ వెనుకే వస్తాను. మామేకం శరణం మమ అని పూర్తిగా కృష్ణుడి ముందు దాసోహం  అనేశాడు .

అప్పుడు మొదలైంది శ్రీకృష్ణుడి సలహా . అదే భగవద్ గీత . దాసోహం అనే వారికి ఉపయోగ పడే భగవంతుడి  సలహాల సంపుటి . నాకు తెలిసి అంత కంటే  గొప్ప విజ్ఞాన సంచిక మరొకటి లేదు. రాదు.

అందులో - ఎన్ని రకాల విజ్ఞానం పొందుపరచ బడిందో చూస్తే - చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని గురించిన వివరణ తో కూడిన వ్యాఖ్యానం నా ఆంగ్ల బ్లాగ్ 'wisespiritualideas.blogspot.com ' లో రాస్తూ వున్నాను . సమయం వచ్చినప్పుడు క్లుప్తంగా ఈ తెలుగు బ్లాగ్ లో కూడా రాస్తాను.

యిక్కడ శ్రీకృష్ణుడి పాలసీ మనం గమనించాలి .
  • మొదటిది - అడగనిదే సలహా యివ్వ కూడదు .
  • అడిగినా - ఆ అడిగిన వాడు మనం యిచ్చే సలహా తీసుకుంటాడా, లేదా చూసి,   తీసుకునే  వాడికే సలహా యివ్వాలి . అలా లేని వాడికి సలహా యివ్వ కూడదు .
  • దాసోహం - అన్న వాడికి తప్పకుండా యివ్వాలి .
  • వాడు - చెయ్య గలిగేదే చెప్పాలి కానీ చెయ్య లేనిది చెప్ప కూడదు.
  • సలహా అడిగాడు కదా అని - అడిగిన వాడిని చిన్న చూపు చూడ కూడదు
  •  అడిగిన వాడికి - 4,5 మార్గాలుంటే అన్నీ చెప్పాలి.  ఆ మార్గాలన్నిటిలో  వుండే సాధక బాధకాలన్నిటినీ చెప్పి - అందులో ఏది , ఎందుకు మేలో చెప్పాలి .
  • అడిగిన వాడిని ఉత్సాహ పరచాలే తప్ప , నిరుత్సాహ పరచ కూడదు .
  • ధర్మ మార్గంలో వుండే మార్గాలు చెప్పాలే తప్ప - అధర్మ మార్గాలు కాదు .

- యిలా , సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో  చేసి చూపిన వాడు  శ్రీ కృష్ణుడు . ఆధునిక కాలంలో మనం కమ్మ్యూనికేషన్ స్కిల్స్ అని అంటాము కదా . అందులో ఆయన్ను మించిన నిష్ణాతుడు మరొకరు లేడు . భగవద్ గీత అంతా ఈ స్కిల్ల్స్ కు వొక శాస్త్రీయ గ్రంధం లాంటిది .

సరే . ఈ సలహాలను గురించి - ప్రపంచం లో నలు మూలలా ఏమనుకుంటున్నారు - అన్నది చూద్దాం .

  • మన సుమతి శతక  కారుడంటాడు - వినదగునెవ్వరు చెప్పిన , వినినంతనే వేగపడక వివరింప  దగున్ - అని. అది 'సలహా' కూ వర్తిస్తుంది .
  • సత్యం బ్రూయాత్ ; ప్రియం బ్రూయాత్ ; న బ్రూయాత్ సత్యమప్రియం :- అంటే సత్యమే చెప్పాలి . కానీ వినేవారికి  ప్రీతికరం గా వుండేటట్లు   చెప్పాలి.  అప్రీతికరం గా సత్యాన్ని చెప్ప వద్దు . యిది చాలా పురాతనమైన సూక్తి . యిది సలహాలు చెప్పే వారికి పూర్తిగా వర్తిస్తుంది. కఠినంగా మాట్లాడే వాళ్ళు సలహా యివ్వకుండా వుండడమే , వుభయులకూ మంచిది .  నేను కట్టె  విరిచినట్టు మాట్లాడే వాడిని - అనే వాళ్ళలో సత్యాని కంటే , నిర్దయ, అమానుషత్వం ఎక్కువగా వుంటాయి . వారు సలహాలు యివ్వడానికి అనర్హులు
  • సలహా యిచ్చే వారికి తీసుకునే వారి పట్ల అభిమానం , అక్కర వుండక పొతే - వారి సలహా సరైన సలహా కానే కాదు.  అలాగే, తీసుకునే వారికి, ఇచ్చే వారి పట్ల గౌరవము ,  అభిమానము లేకపోతే - వారికి సలహా ఇవ్వనే రాదు .
  • సలహా పాటిస్తే వచ్చే పరిణామాలు ఎలా వుంటాయో పూర్తిగా అర్థం చేసుకుని కానీ - సలహా యివ్వ కూడదు; పాటించ కూడదు . 
  • సలహాలు - తీసుకునే వారి మనస్స్థితి , ధైర్య సాహసాలు , వివేకము, విజ్ఞానము , వయస్సు - వీటిని బట్టి మారిపోతూ వుంటాయి . క్రూర మృగం కనిపిస్తే - పోరాడి వధించమని సుక్షత్రియునికి చెప్పాలి . చెట్టెక్కి తప్పించుకోమని   మిగతా వారికి చెప్పాలి .
  • మూర్ఖుడు ఎవరి సలహా తనకు అక్ఖర్లేదు - అని అనుకుంటాడు . కానీ వివేక వంతుడు  యితర్ల ఆలోచనలు వింటాడు - అంటుంది బైబిల్ .
  • మంచి సలహాలు అడగని, తీసుకోని వాడికి - జీవితంలో పడే దెబ్బలే - సరైన సలహాలనివ్వ గలదు   - అంటాడు హొరేజ్ .
  • నా జీవితమే - నేనివ్వగలిగే సలహా - అన్నది మహాత్మా గాంధీ అభిప్రాయం .
  • సహాయం చెయ్యడం - సలహా యివ్వడం కంటే మంచిది - అని మార్క్విస్  అనే ఆయన అంటాడు
  • నువ్వు నీలాగే వుండు - అన్నది కొంత మందికి మనం యిచ్చే మహా మూర్ఖమైన సలహా - అంటాడు థామస్ యల్ మేసన్. బాగు లేని వాడే సలహా అడిగే వాడు - నీవు అలాగే వుండు అనడం సలహా కానే కాదు . 
  •  పోగాలం దాపురించిన వారు - ఆప్త వాక్యమును వినరు - అని ఏకాలం నాటిదో వొక అభిప్రాయం . మరో రకంగా చూస్తే - ఆప్త వాక్యము (శ్రేయోభిలాషులు , వివేకులు అయిన వారు ఆప్తులు ) వినక పొతే - పోగాలము దాపురిస్తుందని అర్థం. 
  • కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా శయనేషు రంభా - అని భార్యను గురించి వొక "గొప్ప మాట" - భార్య యిలా వుంటే బాగుండునని అన్నారు . అటువంటి  భార్యను మించిన  సలహాదారు మరొకరు వుండరు - అని అర్థం .
  • అలాంటి (భర్త పైన అమితమైన ప్రేమ వున్న) భార్యల మాటలు విని బాగు పడిన భర్తలు, కుటుంబాలు ఎంతో మంది వున్నారు. అటువంటి భార్య దొరకడం దేవుడిచ్చిన వరం - అని తమిళ సామెత . కొంత మంది  (భర్త తప్ప మిగతా విషయాలపై ప్రేమ వున్న) భార్యల మాటలు విని - నాశనమయిన కుటుంబాలూ వున్నాయి . . 
  • సలహాల వరకు - ప్రపంచం లో అడిగే వారి కంటే - యిచ్చే వాళ్ళు చాలా, చాలా  ఎక్కువ అని వొకాయన అభిప్రాయం .
  • అయాచిత సలహాలు యిచ్చే వారికి - వాటిని ఆచరించడం లో వున్న సాధక బాధకాలు అర్థం కావు - అన్నది వొక పూర్వోక్తి .
  • యెవడైనా వొక్కడు నిన్ను  గాడిదా అంటే దాన్ని అసలు పట్టించుకోకు . కానీ మరో యిద్దరు అన్నారంటే - వెంటనే వొక కళ్ళెం కొనుక్కొని తగిలించుకో - అంటాడు తాల్ముడ్ . 
  • పడవలో నుండి - క్రింద నీళ్ళలో మునుగుతున్న వాడికి సలహా యివ్వడం తేలిక . పాటించడం కష్టం .
  • అన్నీ నువ్వనుకున్నట్టు జరిగితే - మరి నేనెందుకు ? దేవుడెందుకు ? నువ్వనుకున్నట్టు జరిగేవి కొన్ని . నేననుకున్నట్టు జరిగేవి కొన్ని . 99 శాతం దేవుడనుకున్నట్టు , నువ్వూ , నేనూ  అనుకోని విధంగా జరుగుతాయి . అందుకే వివేక వంతుల సలహాలు అడగాలి . పాటించాలి . 
  •  నీకే తెలీని విషయాలలో అస్సలు సలహా యివ్వకు 
  •  ప్రేమ లాంటి కొన్ని విషయాలలో - వద్దు, కాదు లాంటి సలహాలను  ఎవరూ వినరు గాక వినరు. 
  • కొంత మందికి సలహా చాలదు . థెరపీ కావాలి. 
  • ధనవంతుడు బీద వాడికి సలహా యివ్వడం మనం చూడొచ్చు . బీద వాడు ధనవంతుడికి సలహా యివ్వడమో , అది యితడు పాటించడమో చూడడం చాలా అరుదు .
  •  ధనవంతుడు - బీదవాడికి యిచ్చే సలహా - సాధారణంగా పాటించ లేనిది గానే వుంటుంది . 
  • నిన్ను వూరికే పొగిడే వాడి సలహాలో నిజం సాధారణంగా వుండక పోవచ్చు . 
  •  నీ సలహా ఎప్పుడూ కాస్త క్లుప్తంగానే వుండనీ - అంటాడు హోరాజ్ 
  • కొంత మంది సలహా అడుగుతున్నారో , తమ కష్టాల్లో భాగస్వామ్యం తీసుకో మంటున్నారో - బాగా జాగ్రత్త గా గమనించి మరీ సలహా యివ్వండి . 
  • వొకరికొకరు సలహా యిచ్చుకో వడం లోనే -అందరి రక్షణా వుంది (బైబిల్  వాక్యం )
  • రాజులకు మంత్రులూ వుంటారు . భట్రాజులూ వుంటారు . మంత్రుల వద్ద పొగడ్త ఎదురు చూడకూడదు . భట్రాజుల వద్ద సలహా అడగ కూడదు .
  • మంచి సలహా దొరికితే - పది మందికి చెప్పండి .
  • తండ్రిని మించిన శ్రేయోభిలాషి అరుదు . ఆయన యిచ్చే సలహా తీసుకోండి . తరువాత మంచి వివేక వంతులనూ  అడగండి . వొక్కో సారి తండ్రి సలహా మిన్న గా వుండొచ్చు -అది మెదడు నుండి మాత్రం కాక , హృదయం నుండి కూడా వస్తుంది గనుక . 
  •  స్టాక్ మార్కెట్ కు చాలా మంది రోల్స్ రాయిస్ కార్లో వస్తారు. సబ్ వే లో నడిచి వెళ్ళే వారి వద్ద సలహా తీసుకుంటూ వుంటారు.    ( వారన్ బఫ్ఫే)
  • పోప్  వద్ద సెక్స్ ను గురించి సలహా అడగొద్దు . అవి ఆయనకు తెలిసి వుండ కూడని విషయాలు  - GB  షా 
  •  సలహా యిస్తే యివ్వు కానీ - ఆ తరువాత ఎదుటి వారు అది పాటించే తీరాలని అనుకోకు . వారిని నీవే సరి చేయాలని అనుకోకు . 
  •  హృదయ కవాటం తెరిచి లేక పొతే - అందులోకి ఏ సలహా ఎక్కదు . అది వృథా శ్రమ . 
  •  నువ్వు  చెయ్యలేనిది ఎదుటి వాడు చెయ్యాలని సలహా యివ్వకు .  అలాగే ఎదుటి వాడు చెయ్య లేనిది - చెయ్యమని సలహా గా యివ్వకు 
  •  నువ్వు మొయ్య లేనిది , ఎదుటి వాడు ఎలా మోయ్యాలో చెప్పకు . అది నువ్వు మోసినప్పుడే తెలుస్తుంది  - అది ఎలా మొయ్యాలో  
  • మన దేశాన్ని ఎంత బాగా ఎలా నడపాలో చెప్ప గలిగే వాళ్ళంతా ఆటో డ్రైవర్ లు గానో , అదీ కాకుండానో  వున్నారు . ఎంత దురదృష్టం!
  • గొప్ప గురువు చెప్పేదంతా గొప్ప సలహా నే -  వొక మంచి గురువు ఎల్లప్పుడూ కావాలి . 
  • ప్రతి రోజూ - లోకాః సమస్తాః సుఖినో భవంతు ; సర్వే జనాః సుఖినో భవంతు; అని మొదట అనుకోండి . ఆ భావం వుంటేనే - సలహాలు యివ్వండి . లేకపోతే  వద్దు .
  • చిట్ట చివర - నా సలహా ఏమిటంటే - ప్రతి రోజూ , మొట్ట మొదట, మీరు, మీకే వొక మంచి సలహా యిచ్చుకోండి .  వీలైనంత పాటించండి . అప్పుడే - అది మంచి సలహానా , కాదా అని మీకు తెలుస్తుంది . 
సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్   

19, ఫిబ్రవరి 2014, బుధవారం

తెలంగాణా బిల్లు - యిక వుద్యమాలు,మనలను మనం శిక్షింకోవడం వద్దు - సీమాం ధ్రను దేశంలో నంబర్.1 రాష్ట్రం గా తీర్చి దిద్దాలి - ఎలా? (యిలా!)


తెలంగాణా బిల్లు

తెలంగాణా బిల్లు ప్రపంచానికి తెలియనివ్వకుండా, TV  చానళ్ళు లేకుండా , లోక్ సభలో డిస్కషన్ లేకుండా , అసలేం జరిగిందో  ఎవరికీ తెలియనివ్వకుండా , ఆంధ్రా MP లు లేకుండా - లోక్ సభలో పాస్ చేసుకున్నారు .

పార్లమెంటులో పాసయ్యే  చాలా బిల్లు లకు  కేనీసం 20 శాతం మంది MP లు కూడా సభలో లేకుండా పాస్ చేసేసుకోవడం  పాత విషయం . అది మనం ఎన్నుకుంటున్న నాయకుల గొప్ప తనం. నన్నడిగితే - కనీసం 95 శాతం బిల్లులకు -  మద్దతు గానో ,వద్దనో వోటు చెయ్యని  MP లను జీవితాంతం  అనర్హులుగా ప్రకటించాలి . ప్రభుత్వోద్యోగులూ - మీ లాగే ముఖ్యమైన విషయాలు, పనులు  చెయ్యాల్సి వున్నప్పుడు బయటికి వెళ్లి పోతూ వుంటే  - ఎలా వుంటుంది? నిజానికి - మీ నాయకత్వ లక్షణాల వల్ల ,  వాళ్ళూ కొంత అలాగే వున్నారు కూడా . ఈ MP లు బాగుంటే , ప్రభుత్వోద్యోగులూ బాగానే వుంటారు . యథా రాజా తథా ప్రజా . 

సరే . ఈ పాత , వున్న విషయాలు ప్రక్కన బెడితే - కొత్త  ఏమిటంటే సభలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియనివ్వ కుండా  TV  చానళ్ళు కూడా బ్లాక్ అవుట్  చేసి , డిస్కషన్  లేకుండా, సంబంధిత MP లు కూడా లేకుండా , బిల్లు పాస్ చెయ్యడం . కాంగ్రెసే వస్తే - యిక మున్ముందు , ఇలాంటివి ఎన్ని జరగ నున్నాయో ?

L.   రాజగోపాల్  గారు మిరియాల పొడి స్ప్రే  చల్లారట . మరి, ఆయనేమో , తెలంగాణా MP ల నుండి  నన్ను నేను  రక్షించు కునేందుకు అలా చేశాను  అంటారు .  నిజమేది ? కనీసం - ఆ విడియో ప్రజలకు పూర్తిగా చూపండి . ఎవరు ఏం చేసారో తెలుస్తుందిగా . అది చెయ్యండి ముందు . మరో MP,  కత్తి పట్టుకు వచ్చారు - అన్నారు . ఆయనేమో, అయ్యా , అది కత్తి కాదు స్పీకర్  ముందున్న మైకు అంటున్నారు . అందులో ఏది నిజం . ఎక్కడో హోటళ్ళలో , మాళ్ళలో  CCTV లు వుండాలి - అనే వారు , పార్లమెంటులో , ఎందుకు లేదో మాకు చెప్పండి .  వుంటే - ఆ ఫుటేజ్ ప్రజలకు చూపండి .  అది లేకుంటే - మీరు చెప్పేవన్నీ అబద్ధాలే -అనుకోవాల్సి వుంటుంది .

అయినా - మా వాదం యిది అని సమర్థ వంతంగా సభ ముందు పెట్ట లేని వాళ్ళు - స్పీకర్ ముందు గలాటా చెయ్యడం ఏమీ బాగు లేదు . స్పీకర్ గారు కూడా - మీ వాదం వినిపించండి - అని వారికి పూర్తి అవకాశం  యిచ్చి వుండాలి . కనీసం పార్లమెంటు లో నైనా ప్రజాస్వామిక పద్ధతులు , విలువలు పాటింప బడాలి . నాకు ఈ స్పీకర్ గారంటే  చాలా యిష్టం . బాగా నవ్వుతూ, సభను  బాగా సమర్థంగా నడిపేస్తారు . మరి ఈ విషయంలో - ఆమె ఎందుకు యిలా చెయ్యాల్సి వచ్చిందో   తెలియడం లేదు .

నిజానికి తెలంగాణా రాష్ట్ర నినాదమే - TRS  పార్టీ వారి అబద్ధాల తోనూ , కాంగ్రెసు వారి అసమర్థత తోనూ వున్న పునాది పైనే నిలబడి వుంది . NT  రామారావు గారికి తెలంగాణా వారు  పూర్తిగా వోటు వెయ్యలేదా ? వేశారు కదా. అలాగే , చంద్ర బాబు గారికి కూడా తెలంగాణా వారు పూర్తిగా వోట్లు వేశారు కదా . అప్పుడు TRS వారికి, KCR గారికి కూడా తెలంగాణా లో వోట్లే పడ లేదు . మరి ఎప్పుడొచ్చింది , తెలంగాణాకు ఆంధ్రా వారు  అన్యాయం  చేశారన్న వాదం ? చంద్ర బాబు తరువాత -  కాంగ్రెసు వారి కుల, మత రాజకీయాల వలన, వారి అసమర్థ నాయకత్వం వలన నే వచ్చింది. వారి పాలనలో- రెండు లేదా మూడు కులాలు మాత్రమే  విపరీతంగా లబ్ధి పొందాయనే  విషయం తెలియని వారెవరు ? నాకనిపిస్తుంది - KCR  గారు కూడా అలా చెప్ప లేక యిలా   చెబుతున్నారేమో అని . కానీ - ఆయన నోరు తెరిస్తే అపభ్రంశపు  మాటలే కానీ , తిట్లే కానీ మంచి మాటలు అస్సలు రావాయె . యిక ఆయన తెలంగాణా నాయకుడు . తెలంగాణా కు ఎటువంటి నాయకుడు   దొరికాడు?

తెలంగాణా విషయం మర్చి పోయే ముందు వొకే వొక మాట. రాజకీయ నాయకుల సంగతి ప్రక్కన పెడితే - మిగతా సీమాంధ్ర వారు ఎన్నో లక్షల  కోట్లు తెలంగాణా లోనే  ఖర్చు పెట్టారు . వారు ఎప్పుడూ తెలంగాణా వాసుల క్షేమం , అభివృద్ధి కోరారు తప్ప - ఎప్పుడూ వివక్షతో , పక్ష పాతమో చూపలేదు . యిది ముమ్మాటికి నిజం .శ్రీ  కృష్ణ కమిటీ కూడా యిదే  చెప్పింది . మరే నిష్పాక్షిక కమిటీ వేసినా అదే  తేలుతుంది .  రోశయ్య గారు, YSR గారు , కిరణ్ కుమార్ రెడ్డి గారు  మరో నిష్పాక్షిక కమిటీ కూడా వేసి, TRS వారి అబద్ధాలు "నిస్సందేహంగా"  ప్రపంచం ముందు తేల్చి వుండాల్సింది. కానీ వారది చెయ్య లేదు . ,అందువలన ఆంధ్రులేదో  అన్యాయం చేశారు - అని KCR  గారు, వారు పార్టీ వారు చెప్పడం - ఈ పచ్చి అబద్ధాలు వంద సార్లు చెబితే  ప్రజలూ నమ్మడం జరిగి పోయింది. యిలా అబద్ధాలు చెప్పే వారికి - దేవుడే బుద్ధి చెప్పాలి . 

అయితే - రాజకీయ నాయకులు చాలా మంది - అప్పుడూ, యిప్పుడూ వారి స్వప్రయోజనాలకే ఎక్కువ ముఖ్యత్వం యిచ్చారు . అది తెలంగాణా వారైనా సరే , ఆంధ్రా వారైనా సరే .

సరే . యిప్పుడు మేము వేరే , మీరు వేరే - అనే భావానికి తెలంగాణా ప్రజలు కూడా వచ్చినట్లు - వుంది కదా . అలాగే వుండనీ . అదీ మంచిదే. జరిగేవన్నీ మంచిదే . ఇకనైనా , సీమాం ధ్రలో - ఏం చెయ్యాలో  ప్రజలు యోచన  చెయ్యాలి . ఏదో  జగన్ గారో , మరొకరో చెప్పారని, బందులు - చేసుకుంటూ పొతే , మనల్ని మనమే శిక్షిం చుకోవడమే కానీ - అందులో , ప్రయోజకత్వం  ఏ మాత్రమూ లేదు. బందు రాజకీయాలు కట్టి పెట్టి, ఇకపై సీమాంధ్ర ను ఎలా భారత దేశంలో  నంబర్ . 1  రాష్ట్రం గా తీర్చి దిద్దాలో ఆలోచించాల్సిన సమయం వచ్చింది .

ఇందులో - నా అభిప్రాయాలు  ఇవి :

1.  మొట్టమొదట - రాయలసీమ , కోస్తా లాంటి దరిద్రపుగొట్టు విభజింపు పదాలు , అన్ని  పుస్తకాల్లో నుండి తీసి వెయ్యండి . వాటికి అర్థమే లేదు . తమిళనాడులో కూడా కోస్తా వుంది . లోతట్టు ప్రాంతాలూ వుంది . అక్కడా ఏదో చరిత్రలు వుండనే  వున్నాయి . కానీ వారు మనలా, ప్రాంతాల వారీగా - మనుషులను గానీ, మనసులను గానీ , ప్రభుత్వ పాలసీలను గానీ  ఎప్పుడూ విభజించ లేదు .  మనలో - అందు వల్లనే వచ్చింది  తెలంగాణా నినాదం . మరో విభజన నినాదానికి  తావివ్వకుండా - ఈ  అర్థం లేని పదాలను పూర్తిగా విడిచి పెట్టండి. 

సీమాంధ్రలో కూడా, విభజించి పాలించుమన్నా - అనే దరిద్రుడు ఎవడో వొకడు పుట్టనే పుడతాడు,  . ఏదో వొకటి చెబుతాడు , అన్యాయం జరిగింది - అదీ, యిదీ అని . వాడి వెనుక వెళ్ళే మూర్ఖులూ వుండనే వుంటారు . కాబట్టి , సమైక్యాంధ్ర లేకుంటే - ఏం మునిగి పోలేదు. కనీసం సీమాంధ్ర వొకటే ప్రాంతం అనే భావన ప్రజలలో కలిగించాలి . కాబట్టి - విభజింపు  పదజాలం తీసి పారెయ్యండి . ప్రభుత్వ పాలసీలన్నీ - అన్ని జిల్లాలకు సమానంగా వర్తింప జేయండి.

2.  సీమాంధ్ర - భారదేశం లోనే  నెం . 1 రాష్ట్రం గా రావాలంటే - ఏం చెయ్యాలో , అది యోచన చెయ్యండి . గొప్ప, గొప్ప సంస్థలనీ వొకే నగరంలో  వద్దు . అన్ని జిల్లాలూ , అన్ని నగరాలూ అభివృద్ధి చెందాలి . వొక్కొక్క జిల్లాకూ వొక ప్రణాళిక రూపొందించండి .   IIT   తిరుపతి లో పెట్టండి .  IIM విశాఖపట్టణం  లో పెట్టండి . AIIMS  సంస్థ విజయవాడ లోనో, నెల్లూరు లోనో  పెట్టండి.

3. IT రంగం - అభివృద్ధికి సులభమైన , కీలకమైన రంగం . అది - రాబోయే రాజధానిలో పెట్టండి . అన్ని IT  సంస్థలను అక్కడికి ఆహ్వానించండి.  అలాగే - మనకూ వొక రైల్వే జోన్ కావాలి . అది విజయవాడలో పెట్ట వచ్చు . యిదీ కేంద్రాన్ని అడగాలి . సాధించాలి .

4. క్రొత్త రాజధాని అన్ని జిల్లాలకూ అందుబాటులో వుండే లాగా  - వచ్చే 10 సంవత్సరాల కాలం లో త్వరగా అభివృద్ధి చెందే  లాగా - వొక  "క్రొత్త" నగరం గానే  నిర్మించాలి . కనీసం 50 చ.కి.మీ . వైశాల్యంతో  వుండాలి . గుజరాత్ లో క్రొత్తగా  గాంధీ నగర్  పెట్టుకున్నట్టు - అంతకంటే మిన్నగా - పెట్టుకోవాలి . అందులో, మన రాష్ట్రం లో సర్వ సాధారణంగా  జరిగే  భూ-ఆక్రమణలు అసలు లేకుండా చూసుకోవాలి .  నా వుద్దేశంలో - అదేదో , నెల్లూరు విజయవాడ ల మధ్య వుంటే - మేలని - అనిపిస్తుంది . విశాఖ , చాలా ప్రాంతాలకు అతి దూరం . హైదరాబాదు కంటే కూడా చాలా దూరం . అక్కడ తుఫాన్ల నుండి కూడా ఎక్కువ ప్రమాదం వుంది . ప్లేన్లు నిలవడం కూడా కష్టం .  భవిష్యత్తు దృష్ట్యా - అంత మంచి రాజధాని  కాదు - అనిపిస్తుంది . సరిక్రొత్త నగరం ప్లాన్ చెయ్యాలి . అదే మంచిది అని నా అభిప్రాయం . అందుకు సరిపడ్డ నిధులు కేంద్రం యివ్వాలి . ఆ నగరం - అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే  ఎక్కువ అభివృద్ధి కాగలిగింది గా వుండాలి .

5. చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతాలలో - చాలా ఊళ్లలో - త్రాగు నీళ్ళు కూడా లేవు . ఇదేదీ , YSR  గారికి గానీ , ఆ తరువాత వచ్చిన వారికి గానీ , NTR  గారికి పూర్వం వున్న  వారికి గానీ - ఏ మాత్రము పట్ట  లేదు . కనీసం త్రాగు నీటి వసతి కల్పించ లేని  రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వాలు? ఇలాంటి పరిస్థితే తెలంగాణాలో కూడా కొన్ని ప్రాంతాలలో వుంది.  అందు వలన - వచ్చే  క్రొత్త రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి , నీటి వసతి కావాలి. యిది కేంద్రాన్ని అడగండి . 66 ఏళ్లలో చెయ్యనిది - యిప్పుడైనా చెయ్యమనండి . ఎలాగైనా యిది సాధించి  తీరాల్సిన అంశం . లేదంటే ఈ ప్రాంతాలలో త్వరలో ఎడారులు తయారు కావడం తథ్యం .

6. క్రొత్త రాష్ట్రానికి - విద్యుచ్చక్తి చాలా ముఖ్యం . ప్రజలు చాలా విషయాలు అర్థం చేసుకోవలసి  వుంది . కాంగ్రెసు పాలనలో - చాలా రాష్ట్రాలలో , అసలు విద్యుచ్చక్తి వుత్పాదన లేకుండా పోయింది . వుత్పాదకులకు కావలసిన భూసేకరణ కూడా చెయ్య లేదు . గత 10 సంవత్సరాలలో భారత దేశమంతటా జరిగిన నిర్వాకం యిది . బడ్జెట్టులో , వచ్చే డబ్బు , ఎన్నికల కోసం , వోట్ల కోసం , పంచడం వొక్కటే జరుగుతో వుందే తప్ప - పరిశ్రమలు, విద్యుత్తు , త్రాగు నీరు - లాంటి మౌలిక సదుపాయాలు కూడా చెయ్యడం లేదు . ఫలితంగా - బాగా చదువుకున్న వారికి కూడా ఉద్యోగావకాశాలు  బాగా తగ్గి పోయాయి . అందరికీ ఉద్యోగావకాశాలు వుంటే - రిజర్వేషన్లు అక్కరే లేదు. వున్నది వెయ్యి మంది ; ఉద్యోగాలు 10 మందికి  - అంటే , రిజర్వేషన్లు, పోరాటాలు   కావాలి . వస్తాయి . ఎన్ని చేసినా , 990 మందికి , ఉద్యోగాలు లేక పోవడం - జరగనే జరుగుతుంది . కాంగ్రెస్ పాలన లో అదే జరుగుతూ వుంది చాలా రాష్ట్రాలలో . 

నరేంద్ర మోడీ పాలనలో  అది లేదు . బీహారీలు వస్తే - రండి , మా వారికే కాదు , మీకూ ఉద్యోగాలున్నాయి రండి అంటారు ఆయన . అదే   KCR  గారు , వారి అనుయాయులు,  దశాబ్దాలకొద్దీ తెలంగాణా లో  వున్న కొంత మంది ఆంధ్రులను - మీరు వెళ్ళిపొండి - అని , పనిగట్టుకుని యిళ్ళకు కూడా  వెళ్లి చెబుతున్నారు . యివన్నీ వార్తా పత్రికలో కూడా అప్పట్లో వచ్చాయి . ఆయన కూడా ఈ దేశంలో వొక నాయకుడు !! అందుకని  క్రొత్త రాష్ట్రంలో - విద్యుచ్చక్తి ఉత్పాదన మనకు కావాల్సిన  దానికంటే 200 శాతం  ఎక్కువ జరగాలి . అందుకు ప్రైవేటు రంగ సంస్థలను పెద్ద ఎత్తున ఆహ్వానించ వలసి వుంది . అలా చెయ్య గలిగే నాయకుడినే ఎన్నుకో వాల్సి వుంది .  ఎంత విద్యుచ్చక్తి  వుంటే అంత ఉద్యోగావకాశాలు , పరిశ్రమలు  అన్నీ వస్తాయి. అందుకే, వున్న పరిశ్రమలన్నీ యిప్పుడు  గుజరాత్ వైపు వెళ్లి పోతున్నాయి. 

7. తెలంగాణా తో యిటువైపు వారికి ఎప్పుడూ వైరం  లేదు . యిక ముందూ వద్దు . మన రాష్ట్రం అభివృద్ధి వైపే మనసు పెట్టాలి . కాకపొతే - నీటి పారుదల విషయంలో - సరైన  జాగ్రత్తలు తీసుకోవాలి . ఈ విషయంలో కాంగ్రెసు పాలనలో మనం ఎంతో ఘోరంగా పొగొట్టుకున్నామనే చెప్పాలి . కనీసం  ప్రతి పక్ష నాయకుడు గా చంద్ర బాబు తీసుకున్న చర్యలకు కూడా అండగా నిలవ లేదు  కాంగ్రెస్ ప్రభుత్వం . యిది మారాలి . యిటువంటి సందర్భాలలో  -  తమిళ నాడు  లోని ,ప్రతి పార్టీ అందరితో బాటు వొక్కటిగా నిలుస్తుంది. అది మనం నేర్చుకోవాలి . 

8.  ఎవరు - మన క్రొత్త రాష్ట్రానికి సరైన మద్దతు యిస్తారో  - కేంద్రం లో వారితోనే పొత్తు పెట్టుకోండి . వారి వద్ద అటువంటి హామీలు అడగండి . తీసుకోండి . 

9. యిక వుద్యమాలు వద్దు . అది వూరికే మనలను మనం శిక్షింకోవడం తప్ప , కొంత మంది రాజకీయ  ప్రయోజనాలకు తప్ప - అందులో ప్రజలకు వొరిగేదేమీ లేదు. ఈ ఉద్యమాలు - దొంగలు పోయిన ఆరు నెలలకు - కుక్కలు మొరిగిన సామెత లాగా వుంటుంది . పదవిలో వున్నప్పుడు - TRS వారిని , వారి అబద్ధాలను - ప్రజల ముందు, పార్లమెంటు ముందు నిర్దిష్టంగా పెట్ట లేని వారు , యిప్పుడు ఉద్యమాలు చెయ్యడం ఏ ప్రయోజనమూ లేదు . ప్రపంచం దృష్టిలో హాస్యాస్పదం గా వుంటుంది . ఈ నాయకులు ఏ కోణంలోనూ , కేంద్రం లోని అధికార , ప్రతిపక్ష నాయకులను  ఎవరినీ మా వాదం వెనుక నున్న బలం యిది అని చెప్పి నమ్మించ లేక పోయారు.  అందు వలన యిక ఉద్యమాలు వద్దు .

10. యిక - మంచి నాయకులను వెదకండి . కుల,మత రాజకీయాలకు అతీతంగా  మోడీ లాంటి నాయకుడు దొరుకుతాడేమో చూడండి.  జయ ప్రకాష్ నారాయణ్, చంద్రబాబు లాంటి వారు ప్రజల మనస్సులో విద్వేషాలు రేకెత్తకుండా, అభివృద్ధి సాధించే వారని నా అభిప్రాయం . వారిలో - లంచగొండి తనమూ లేదు.

11. చిట్ట చివర - నా ఆశ, అభిప్రాయం , మనవి  ఏమిటంటే - ప్రజలంతా అభివృద్ధి పథం లోకి వచ్చెయ్యండి . తెలంగాణా ప్రజలూ బాగుండనీ. మనమూ బాగుందాం . ఈ వివాదంలో మనం నేర్చుకోవలసిన విషయాలు యివీ. 

సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్




14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలంగాణా బిల్లు - సమైక్యాంధ్ర ఉద్యమం - అన్ని ప్రాంతాలకూ న్యాయం - సర్వే జనాః సుఖినో భవంతు


= తెలంగాణా బిల్లు =


పార్లమెంటులో  తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్ట బడింది. అందులో ఏముంది ? తెలంగాణా ప్రాంతం వొక ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని మాత్రం వుంది. 

యిక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోంది కదా . దాని మాటేమిటి ? ఎందుకని సమైక్యాంధ్ర ప్రజలు, నాయకులు అందరూ - ఈ రాష్ట్ర విభజన వద్దంటున్నారు ?  యివి  ఏదీ జాతీయ స్థాయి నాయకులు యోచనే చేయరా?

నాగేశ్వర రావు , రామారావు   గార్ల  నుండి , చిన్న స్థాయి   టెక్నిషియన్ వరకు సినిమా రంగమంతా  మద్రాసు నుండి హైదరాబాద్ కు "మన రాష్ట్రం" అంటూ, అనుకుంటూ వచ్చారు . ఎన్నో స్టూడియోలు , మరెన్నో సినిమారంగ  వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో  నిర్మించారు . చంద్రబాబు  గారు  తెచ్చిన ప్రతి సంస్థా , హైదరాబాదు కే తెచ్చారు. 

అలా వచ్చిన వారినెవరూ - యిది మీ రాష్ట్రం  కాదు - యిక్కడికెందుకొచ్చారు, యిక్కడెందుకున్నారు - అని అడగ లేదు; వారూ చెప్పవలసిన అవసరం రాలేదు. 

అంతే కాదు. రామారావు గారికి బ్రహ్మ రథం పట్టి తెలంగాణా వారంతా కూడా వారిని ముఖ్య మంత్రిని చెయ్య లేదా ? అప్పుడు  లేని వేర్పాటు భావం యిప్పుడెక్కడ నుండి  పుట్టుకొచ్చింది ? ఈ విషపుబీజం నాటిన వారెవ్వరు ? పెంచి పెద్ద  చేసిన వారెవ్వరు ? ప్రజలంతా కాస్త యోచన చెయ్యాలి .

రామారావు మాత్రమే  కాదు . చంద్రబాబు నాయుడు గారు, చివరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు , వేర్పాటు రాష్ట్ర వాదపు విష బీజాలు  తెలంగాణా లో పెద్దగా మొలవ లేదు ; పెరగ లేదు . యిదే  చరిత్ర . వారందరికీ వోటు వేసి గెలిపించిన  వారు తెలంగాణా ప్రజలు . అప్పుడు లేని అన్యాయం  ఎప్పుడు మొలిచొచ్చింది ? 

అన్యాయం, అన్యాయం అని TRS నేతలు ఘోషిస్తే - శ్రీకృష్ణ కమిటీ వేసారు . ఆయన లెక్కలన్నీ చూసి - అయ్యా ఏ అన్యాయమూ లేదు - జరుగ లేదు అని తేల్చి చెప్పారు . మరి - ఆ కమిటీ పైనే బురద చల్లారు TRS  నాయకులు .  కానీ , ఆ కమిటీ వారు చెప్పింది ఎలా తప్పు అన్నది ఎవరూ చెప్ప లేదు ; ఏది రైటో కూడా  వారు చెప్ప లేదు . యిప్పుడు తెలంగాణా  ఎందుకు - అన్న వాదం  మరో రకంగా తిరిగింది . 

మా వూళ్ళలో  - ఆంధ్ర వుద్యోగులు  వున్నారు - వుండకూడదు - అన్నారు. అదే మాకు జరిగిన అన్యాయం  అన్నారు.  పని గట్టుకుని వాళ్ళ యిళ్లకు  వెళ్లి  - మీరు మీ ప్రాంతానికి  వెళ్లి పొండి - అన్నారు . మేము శాంతంగా  చెబుతున్నాం - వెళ్ళిపొండి - అన్నారు, బెదిరించారు . యివన్నీ వార్తాపత్రికలలో  కూడా వచ్చాయి .  యిది ఎంత అరాచకమైన , క్రూరమైన, చట్ట వ్యతిరేకమైన చర్య ? అయ్యా - ఉద్యోగులు అలా ఎలా వెళ్లి పోగలరు ? అసలు, ఎవరయినా  అలా  యెలా  వెళ్లి పోగలరు? అలా వెళ్ళ గొట్టే అధికారం TRS వారికి గానీ, మరెవరికి  గానీ ఎవరిచ్చారు?  యిది అడగాల్సింది ఎవరు ? తెలంగాణా ప్రజలే  అడగాలి.  వొకాయన అంటారు - పక్క వాడికి అన్యాయం జరిగేటప్పుడు  మీరు అడ్డుకోక   పొతే , ఆ తరువాత  జరిగే అన్యాయం మీకే , అని . 

ఇప్పుడున్న వినాయకులు తెలంగాణా పాలకులైతే - ఈ విద్వేషాల బీజాలు పెరగడం తప్ప మరో గొప్ప పనేమే జరగదనేది తథ్యం .

తెలంగాణా లో ఎన్ని పరిశ్రమలు  పెట్టారు! ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు ! అందు వలన తెలంగాణా కు న్యాయం జరిగింది కాదా ? ఎలా జరగలేదంటారు?  

నాకు మాత్రం మొదటి నుండీ ఈ పధ్ధతి నచ్చ లేదు . రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ - యివి రావాలి. వొక IIT  కానీ , IIM  కానీ , ISB  కానీ మరే అత్యున్నత విద్యాసంస్థ కానీ , రాయలసీమ లో కానీ , కోస్తా ప్రాంతం లో గానీ  ఎందుకు లేదు ? వొక్క IT రంగ సంస్థ కూడా - తెలంగాణా ప్రాంతం తప్ప - మరెక్కడా ఎందుకు పెట్ట బడ లేదు ? వొక్క జాతీయ / అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? యిక్కడే జరిగింది తప్పు . అన్ని ప్రాంతాల లోనూ - అటువంటి సంస్థలు వస్తే , ఈ వేర్పాటు వాదాలు  రావు ; వుండవు ; వచ్చినా , రాష్ట్రాలను విభజించినా  పెద్ద ప్రశ్న లేదు .  యిప్పుడు ప్రశ్న అదే . మేమూ ,మీరూ  అభివృద్ధి చేసిన  ముఖ్యమైన ప్రాంతం మీది - మాకేమీ హక్కు లేదు అంటే - అది అన్యాయం  కాదా .

66 ఏళ్ళ తరువాత కూడా - రాయలసీమలో త్రాగడానికి వూళ్ళలో నీళ్ళు లేవు . రామారావు గారు కూడా హైదరాబాదుకు , మద్రాసుకు  నీళ్ళు వస్తే చాలనుకున్నారు . ఆయన వుంటే - యివన్నీ చేసేవారేమో - నాకు తెలీదు .  కర్ణాటకా  వారు ముందు  యిటు వైపు వస్తున్న నీళ్ళు , వాళ్ళ రాష్ట్రంలో  నిలిపేస్తే -అడిగే వాడే లేడు మన రాష్ట్రంలో . యిప్పుడు సమస్య  తెలంగాణా రాష్ట్రం వస్తే - రాయల సీమకు - కనీసం త్రాగు నీళ్ళు అన్ని ప్రాంతాలకూ  రావాలి . వస్తుందా ? లేదా , TRS  వారు అది జరగనివ్వరా ? జరగనివ్వరనేది అందరి అభిప్రాయం.  కేంద్ర ప్రభుత్వం వారు రాయలసీమ కు ఏం న్యాయం చేస్తారు ? యిది - ఏవీ , పార్లమెంటులోని  బిల్లులో లేవు .  విభజిస్తే - ఏ ప్రాంతం వాళ్లకు , ఏం న్యాయం చేస్తాం - అన్న అంశం ఏదీ - ఈ బిల్లులో లేదు. యిదీ వొక బిల్లేనా ? తొందర పడి తాతాచార్యులు మతం మార్చుకున్నాడట. అలా వుంది పరిస్థితి . మన దేశంలో ఈ మధ్య వచ్చిన చాలా చట్టాలు తొందరపాటుతో చేసిన చట్టాలే . కోడలు ఫిర్యాదు చేస్తే - యింట్లో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని వొక చట్టం . కొంత మంది కోడళ్ళు ఆరడికి గురి అవుతున్న మాట నిజమే . ఎవరూ కాదనటం లేదు. కానీ, ఎంతో మంది కోడళ్లు పెళ్ళైన వెంటనే , యింటిని విడగొట్టడమూ , యింట్లో ఏ బాధ్యతలూ తీసుకోక పోవడమూ అంతే నిజం. మొత్తానికి ఎవరిది తప్పైనా , అది సాంతంగా విచారించి, సమస్యను పరిష్కరించాలా ? యింట్లో వాళ్లందిరినీ జైల్లో  పెట్టాలా ? సరే ; జైల్లో పెట్టిన తరువాత , ఆ కోడలితో , ఆ భర్త కానీ, యింట్లో వాళ్ళు కానీ ఎలా వొకటిగా వుంటారు ? యిదా ఆ కోడలి సమస్యకు పరిష్కారం ? ఈ చట్టం క్రింద ఎవరికీ ఏ రకమైన న్యాయమూ జరగడం లేదు - నాకు తెలిసినంత వరకూ . తెలంగాణా చట్టమూ అంతే . విడగొట్టడం గురించి మాట్లాడుతున్నదే తప్ప - తరువాత ఏమిటన్నది ఏమీ మాట్లాడడం  లేదు .

మన దేశంలో ప్రజలను విడగొట్టడం అంత సులభమైన పని మరొక్కటి లేదు . మీకన్యాయం జరిగింది ; జరిగింది ; అంతా వారివలనే - అంటే చాలు . నిజమే కాబోలు అనుకునే ప్రజలు మనం . ఏమన్యాయం జరిగింది; ఎప్పుడు జరిగింది ? ఎవరి వలన జరిగింది? యివి అడిగే వాడూ లేదు; చెప్పే వాడూ లేడు . 

నిజమే.  ప్రజలందరికీ అన్యాయం జరిగింది - కొన్ని విషయాల్లో . యిది అన్ని ప్రాంతాల్లోనూ  జరిగింది . ఉదాహరణకు , భూ ఆక్రమణలు . యివి పెద్ద ఎత్తున, అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి .  హైదరాబాదు లోనూ జరిగాయి . తిరుపతి లోనూ జరిగాయి . మరెన్నో ప్రాంతాల్లో జరిగాయి . వీటిలో కూడా - కొన్ని ధనిక కుటుంబాలకు చెందిన , కొన్ని  కులాల వారు మాత్రమే   చాలా ఎక్కువ గా చేశారు , చేస్తున్నారు - అన్న విషయం అందరికీ తెలుసు . వీరే రాజకీయాల్లోనూ, రౌడీ యిజం లోనూ, పేరు  మోశారన్నది మనకందరికీ తెలుసు. అంటే - ఆ కులాల వారందరూ అలా చేస్తున్నారని కాదు . చేస్తున్న వారిలో - కొన్ని కులాల వారు చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయం . అదే కులాలలో మంచి నాయకులూ  వున్నారు . 

యిప్పుడు రాజకీయాలు అంటే రౌడీ ఇజం అన్న స్థాయికి దిగిపోయింది . యిటువంటి నాయకులకు యెదురుగా , సాధారణ ప్రజలకు ఎవరికీ న్యాయమూ లేదు ; రక్షణ కూడా లేదు - అన్న విషయం అందరికీ తెలుసు .

మనం మంచి నాయకులను ఎన్నుకుంటే - అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది . లేదా - ఏ ప్రాంతానికీ , న్యాయం జరుగదు . సాధారణ ప్రజలు కులాల వారీ, మతాల వారీ కాకుండా  మంచి వాళ్లకు వోటు వేస్తే , మంచే జరుగుతుంది . మన రాష్ట్రంలో - మనం మంచి  నాయకుడి కోసం వెదకాలే తప్ప , రాష్ట్ర విభజన కోసం కాదు . 

లాంకో హిల్ ఎక్కడ పోయినా - సాధారణ ప్రజలకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ప్రతి ప్రాంతం లోనూ త్రాగే నీళ్ళు  కావాలి కదా . వుద్యోగావకాశాలు అందరికీ కావాలి కదా. పరిశ్రమలు అన్ని చోట్లా రావాలి కదా . గొప్ప విద్యా సంస్థలు అన్ని చోట్లా రావాలి కదా . అన్నీ హైదరాబాదులో పెడితే , కనీసం యికపై వొప్పుకోకండి. మహబూబ్ నగర్  లోనూ రావాలి ; చిత్తూరు లోనూ రావాలి ; శ్రీకాకుళం  లోనూ రావాలి . 

అన్నీ చెప్పినా - చిట్ట చివర , నాకనిపించేది  ఏమిటంటే - ప్రజలుగా  మనం అందరం  వొకటే . దయ చేసి , మీరు వేరు, మేము వేరు -అనకండి. ఈ వేర్పాటు వాదానికి  అంతు  లేదు. ఎంతగానో వొకరినొకరు అభిమానించే  భార్యాభర్తల మధ్య కూడా - యిటువంటి వేర్పాటు విషబీజాల ద్వారా, విడిపోయే పరిస్థితులు  కల్పించే వారున్నారు. విడిపోయే వారూ వున్నారు. అది ఎంత తప్పో ఎప్పుడో తెలుస్తుంది . చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వొరిగేది ఏమీ లేదు . మాకు నవాబులైనా ఫరవాలేదు ,కానీ మీరు వద్దు - అనే మూర్ఖుల మాట నమ్మ వద్దు . 

సరే . రాష్ట్రాలు విభజించాల్సిందే - అనుకుంటే ; కాస్త  ముందు  చూపుతో,అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే లాగా వున్న బిల్లు వస్తే - కొంతలో కొంత మేలు .

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్