23, జనవరి 2014, గురువారం

అక్కినేని నాగేశ్వరరావు గారు - 90 ఏళ్ల మహత్తర జీవితం - వారు మిగిల్చిన తీపి గురుతులు ఎన్నో , ఎన్నెన్నో


అక్కినేని నాగేశ్వరరావు గారు పోయారు. 

90 ఏళ్ల మహత్తర జీవితం గడిపి , తుది వరకు , ఉత్సాహంగా , చిన్న పిల్లాడిలాగా తుళ్ళుతూ , అందరికీ ఆనందాన్ని పంచుతూ , ఎవరికీ కష్టం లేకుండా వెళ్లి పోయారు.

పోయినోళ్ళందరూ మంచోళ్ళు ; వున్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు - కదా . నిజమే. అక్కినేని ఎన్నో తీపి గురుతులని మిగిల్చి వెళ్లి పోయారు. ఆయన తీపి గురుతులే ఎన్నో , ఎన్నెన్నో. మరి ఆయన కొడుకులు మనమలు మళ్ళీ సినిమా ప్రపంచంలో, తమదైన  స్థానం , ఆయన్ను మరపించేది కాదు , ఆయన్ను తలపించేది సంపాదించుకున్నారు.

75 ఏళ్ళ నట జీవితం సామాన్యం కాదు . అందులోనూ - ఆయన నట జీవితం చాలా అసామాన్యం . ఎందరో నటులు వచ్చారు , వెళ్ళారు - అందరూ ANR లు , NTR లు కాలేదు కదా.  ANR గారు ఎక్కువగా చదువుకో లేదట. చదువంటే బళ్ళో చదివేదే చదువా ? నిజ జీవితంలో, నట జీవితంలో , ఆయన ఎంతో చదివారు. ఎంతో నేర్చుకున్నారు .  

నిజానికి - తెలుగు ప్రజానీకం ఆయననుంచి ఎంతో నేర్చుకుంది . భక్త జయదేవుడు తెలుగు వాడు కాదు ; కానీ నాగేశ్వరరావు గారి ద్వారా తెలుగు వాడు అయ్యదు. అలాగే, భక్త తుకారాం, విప్రనారాయణుడు,  కాళిదాసు, జక్కన్న , చివరికి కబీరు - వీరు అందరూ, తెలుగు వారు కాకున్నా , అక్కినేని ద్వారా - మనవారయ్యారు . దేశంలోని - అన్ని రాష్ట్రాల లోని గొప్ప వారిని మనకు పరిచయం చేసి, తెలుగు వారన్నా , భారతీయులన్నా వొకటే - అన్న ఏకీకృత భావం మనలో కలిగించారు అక్కినేని.  ఈ మహా కార్యం మరో నటుడెవ్వరూ, ఏ భాషలోనూ యింత ఎక్కువగా చెయ్యలేదు.  యివి మాత్రమా ! అనార్కలి, దేవదాసు, లైలా మజ్నూ లాంటి చిత్రాల ద్వారా - దేశంలోని - వివిధ రాష్ట్రాల లోని అత్యుత్తమ ప్రేమ కథలనూ మనకు అందించారు. దిలీప్ కుమార్ గారు అన్నారట - దేవదాసు అంటే వొక అక్కినేని నాగేశ్వర రావు గారు మాత్రమే అని . హిందీ లో ఆ పాత్ర పోషించింది ఆయనే .

255  పైగా చిత్రాలలో నటించిన అక్కినేని - తనకు నచ్చని, నప్పని పాత్రలను ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడూ పదవుల కోసమో , ప్రతిష్ట కోసమో ప్రాకులాడలేదు . కావాలంటే - అవన్నీ వచ్చి పడేవే . కానీ - ఆయనకు, తన జీవితంలో - ఏం కావాలో, నిర్దిష్టంగా తెలుసు . అలాగే చివరి వరకు వున్నారు .

అయినా ఆయనకు ఎన్నో ప్రతిష్టలు , అవార్డులు  వచ్చిపడ్డాయి .అందులో కొన్ని యివి :-

1. పద్మ విభూషణ్ 
2.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 
3. ఫిల్మ్ ఫేర్  బెస్ట్ ఆక్టర్  అవార్డు - తెలుగు - 4 సార్లు
4. రఘుపతి వెంకయ్య అవార్డు 
5. NTR నేషనల్ అవార్డ్ 
6. నంది అవార్డ్ - బెస్ట్ ఆక్టర్ - 2 సార్లు 
7. కలై మామణి  అవార్డ్ -తమిళనాడు 
యింకా ఎన్నో ....

నాకు దేవుడంటే పెద్ద నమ్మకం లేదు - అని అనే వారట.  అంటూ, అంటూ, దేవుడి దగ్గరికి వెళ్లి పోయారు . NTR  లాగా ఎక్కువ "దేవుడి" పాత్రలు వెయ్యలేదు.  కానీ,  అన్ని రకాల "భక్తుడి" పాత్రలు వేశారు . దేవుడు లేదనే మహా మనీషి ప్రజలలో దేవుడి పట్ల భక్తిని బాగా పెంచారు. 

అదంతే. సాధారణంగా కొట్టుకుంటూ వుండే గుండె - దేవుడా , దేవుడా అంటూ వుంటుంది. అదేదో లబ్ - డబ్  అని మనం అనుకుంటూ వుంటాము. 

దేవుడు, ఆ, ఏమిటీ - అని పలికిన రోజున మరి కొట్టుకోదు. దేవుడు పిలిస్తే - వెళ్ళిపోతాం . అంత వరకు, మరో గుండె కొట్టుకునే శబ్దం వినాలి - అనుకుంటూ వుంటుంది ; దానికోసం వెంపర్లాడుతూ వుంటుంది.  అదే  మన మనసుల్లోని ప్రేమాభిషేకం.   

ANR  గారి ప్రేమాభిషేకానికి, హైదరాబాదు - 533 రోజులు ఉర్రూతలూగి పోయింది.  యిప్పటి వరకు, అన్ని రోజులు ఏకధాటిగా చూడ బడిన ఏకైక తెలుగు సినిమా అదే.

ANR  గారి సినిమాల్లో  పాటలు  పెద్ద హై లైట్ . పాటల్లో, రాసే వారి గొప్పదనం, పాడిన ఘంటసాల, బాలు వారి కంఠం, సంగీత దర్శకుడి గొప్పదనం - యివన్నీ వున్నా, ఆ పాటలకు ANR  గారు ఎలా స్పందించారో - అది చూస్తూ వింటే - ఆ అనుభూతే  వేరు. పాట  వింటే , ANR  గుర్తుకొస్తారు. నటనలో జీవించడం - ఆయనలా మృదువుగా , నిజ జీవితానికి అంత దగ్గరగా చేసిన వారు చాలా అరుదు. 

వారి కాలం లో, వారిలాగా, నాట్యానికి వొక కొత్త నిర్వచనం  చెప్పిన వారు లేరు గాక లేరు. పచ్చ గడ్డి కోసేటీ పడుచు పిల్లోయ్ - అంటూ ఆయన చూపే హావ భావాలు - ఆయనకు ముందూ లేదు ; చెప్పాలంటే , ఆయన తరువాతా లేదు . 

పిల్లల్నీ, పెద్ద వారినీ, ముసలి వారినీ, ఆడవారినీ - వొక్కరేమిటి , అందరినీ వుర్రూత లూగించిన అక్కినేని  - అమరజీవి అయిపోయ్యారు.   ఆ లోటు వుండనే  వుంటుంది . 

కొందరికి కుటుంబం అంటే - మహా వుంటే 10 -20 మంది దాకా వుంటారు . కానీ, చాలా కొద్ది మందికి కోట్ల మంది తమ కుటుంబం గా వుంటారు. అంటే - వారిది వసుధైక కుటుంబకం. అందునా కొంత మంది, మరణం తర్వాత ఎన్నో దశాబ్దాలు  జీవిస్తూనే వుంటారు - వున్న వారి మనస్సులో. 

మనం ముఖ్య మంత్రులను , గవర్నర్లను  సులభంగా మర్చి పోతాం. మీకు గుర్తున్నారా - మన ముఖ్య మంత్రులందరూ? నాకు లేరు . వారి వల్ల  మనకు పెద్దగా వొరిగిందేమీ లేదు. 

కానీ - NTR , ANR  గార్లు కనీసం వొక శతాబ్దం కాలం అందరి మనస్సులో వుంటారు ; వున్నారు . మా అవ్వ గారు , మా అమ్మగారు , నేను , నా పిల్లలు - యిలా కనీసం 4 తరాలు - దాదాపు అన్ని తెలుగు కుటుంబాల్లోనూ వారిని బాగా అభిమానించిన వారే . 

యింత చెప్పినా - కడపట శ్రీకృష్ణుల వారి ఉపదేశం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొవలసిందే.  

"గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః" -   బుద్ధిమంతులు, వున్న వారికోసం కానీ , పోయిన వారి కోసం కానీ శోకించరు. 

"న త్వే వాహం  జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ;  న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం"  - నీవూ , నేనూ , వీరెవరూ - ముందెప్పుడూ లేని వారు కాదు . యిక ముందెప్పుడూ వుండని వారు కూడా కాదు. ( ఎల్లప్పుడూ  వుండే వారే ) . 

"దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ; తథా దేహాంతర ప్రాప్తిహ్ ధీరస్తత్ర న ముహ్యతి" - ఆత్మగా వున్న మనం , ఈ దేహంలో వుండి బాల్యం , యవ్వనం , ముసలితనం  ఎలా అనుభవిస్తామో , అలాగే , వొక దేహం నుండి మరో దేహానికి కూడా వెళ్లి పోతాము . జ్ఞాని అయిన వాడు , బుద్ధి మంతుడు - దీని కోసం శోకించడు. 

అంతే . ఈ ప్రవాహం యిలా సాగి పోతూనే వుంటుంది . కొన్ని తీపి గురుతుల్ని , మిగిల్చి  పోతూ వుంటుంది . ANR  మిగిల్చిన  తీపి గురుతులు  ఎన్నో , ఎన్నెన్నో . 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్

 
 

 


3 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది. ఆ ప్రేమ సామ్రాట్ గురించి నేను చదివిన వాటిల్లో చాలా మంచి విషయాల్తో కూడిన భావాల పరంగా ఒక శాంత గంభీరమయిన స్పందన. నాకు బాగా నచ్చింది!

    రిప్లయితొలగించండి
  2. అక్కినేని వారి సినిమా చూసినంత ఆనందం గా ఉంది మీ వ్యాసం చదువుతుంటే.

    రిప్లయితొలగించండి
  3. అక్కినేని వారి సినిమా చూసినంత ఆనందం గా ఉంది మీ వ్యాసం చదువుతుంటే.

    రిప్లయితొలగించండి