11, జూన్ 2012, సోమవారం

పాడుతా , తీయగా (ఫైనల్సు ) = యిక్కడి నుండి - మరెక్కడికి?= భారత దేశానికి మరో బాలు, మరో సుశీల - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

పాడుతా , తీయగా  (ఫైనల్సు )


కాశీ మజిలీ కథల్లో - వొక్కో మజిలీకి వొక్కో కథ వుంటుంది . ఆ కథ ఎంత  బాగున్నా- కథ తరువాత మరో మజిలీకి వెళ్ళక తప్పదు. 


జీవితమంతా అంతే . జీవితంలోని - ప్రతి భాగమూ అంతే .

ప్రతిదీ ధారా వాహికమే. ఎంత బాగున్నా - అది ఎక్కడో ముగియక తప్పదు.  

పాడుతా, తీయగా ధారా  వాహికంలో - ఈ రోజు  ఫైనల్సు  ముగిసింది.

ఎలా వుంది?

ఉగాది పచ్చడిలా వుంది.

పాటలు అద్భుతంగా వున్నాయి. నలుగురూ "చాలా, చాలా, చాలా, చాలా " బాగా పాడారు.

ఎవరికో వొకరికి ఈ ప్రైజులు  యివ్వక తప్పదు .

ఈ మార్కులు వేసే తతంగం అనివార్యం.వాటిని బట్టి ప్రైజులు యివ్వడమూ అనివార్యమే.

అయితే - ఆంధ్ర దేశంలో - యిప్పుడు ఈ నలుగురు పిల్లలూ - చాలా మందికి గొప్ప గాయకులుగా  పరిచయమయ్యారు. అది ముఖ్యం.

అంత కంటే ముఖ్యం - పాట , సంగీతం - అంటే - యిదీ - అని జన బాహుళ్యానికి - బాలు గారి ద్వారా - యింత నిశితంగా , నిర్దిష్టంగా తెలియరావడం.

హరిణి, తేజస్విని, రోహిత్, సాయి చరణ్ -నలుగురూ - వొకరికొకరు ఏ రకంగానూ - తీసి పోని వాళ్ళు. 

వొక్క రోజు రోహిత్ పాట వొకటి మహాద్భుతం అనిపిస్తే - రెండో రోజు తేజస్విని పాట  ఏదో వొకటి అలా అనిపిస్తుంది.  మరో రోజు హరిణి పాట , మరో రోజు సాయి చరణ్ పాట .

సంగీతం కూడా వొక స్థాయికి మించిన తరువాత - క్రికెట్  లాంటి గేము లాగా వుంటుంది. వొకరు ఎంత బాగా పాడినా- మరొకరు ఆరోజు వారి కంటే - బాగా పాడేస్తారు.

ఎంపిక చేసుకున్న పాట - దాన్ని ప్రాక్టీసు చేసుకున్న తీరు, వేదిక పైన ఆరోజున్న మనో భావన - అన్నీ పాడే విధానం పై తమ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, వొక మార్కు, రెండు మార్కులు తగ్గడమో, ఎక్కువ కావడమో - పెద్ద విషయం కాదు.

చివరి ఎపిసోడ్లకు - మోహన్ బాబు గారు రావడం మరింత రమ్యంగా వుంది. మోహన్ బాబు గారు కష్టమంటే - ఏమిటో తెలిసిన వారు. తాను  కష్ట పడి  సాధించిన వారు. తన విద్యాలయాల్లో - తన విద్యార్థులలో - వొక వున్నత స్థాయికై  పాటు పడుతున్న వారు. వారు రావడం చాలా బాగుంది. 

నవ్వండి. నవ్వుతూ వుండండి - నవ్వుతూ పాడండి - అని ఆయన పిల్లలకు చెప్పడం - నాకు బాగా నచ్చింది.  మనం నవ్వుతూ, చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ వుండడమే - నిజంగా సఫలీకృతమైన   జీవితం .జీవితంలో - విజయానికి వొకే మెట్టు చెప్పాలంటే - అది యిదే.

మోహన్ బాబు గారూ - మీరు పిల్లలకు, వారి ద్వారా అందరికీ  యిచ్చిన - యీ  అమూల్యమైన సలహాకు - మీకు చాలా ధన్య వాదాలు.

అలా నవ్వుతూ గడపాలంటే - ముఖ్యంగా- ఎవరినైనా సరే - క్షమించేసేయడం  చాలాముఖ్యం. మనల్ని కూడా. తప్పులు చేస్తాం. దాన్ని సరిదిద్దుకుంటూ - మనల్ని కూడా క్షమించేసుకుంటూ -ముందుకు వెళ్లిపోవాలి.

క్షమించ లేని వాడికి - జీవితం నరకంగా తయారవుతుంది. ఎందుకంటే - వాడినీ- ఎవరూ - క్షమించ లేరు గనుక. ఎంత  సేపట్లో క్షమించాలి? 5 నిమిషాలు చాలా ఎక్కువ. వొకటి రెండు నిముషాలలో - ఆ భావన  వొచ్చేయాలి. మళ్ళీ - మనం  నవ్వాలి.


ఈ నలుగురు పిల్లల ప్రజ్ఞా పాటవాల్ని - బాలు గారు - వొక గొప్ప స్థాయికి తీసుకొచ్చి - వాళ్ళను తెలుగు సంగీత ప్రపంచానికి  పరిచయం చేసి వదిలారు.వీరే కాదు. సెమి ఫైనల్సు లో పాడిన వారు కూడా బాగా పాడారు.

యిక్కడి నుండి - మరెక్కడికి?

అప్పుడే చెప్పినట్టు - ఈ ఫైనల్సు ఉగాది పచ్చడిలా  వుంది. అయ్యో అయిపోయిందే - అనుకుంటే - చేదుగా అనిపిస్తుంది.  ఎందుకు తేజస్వినికి  మొదటి ప్రైజు రాలేదు? ఎందుకు రోహిత్ కు రాలేదు? ఎందుకు సాయి చరణ్ కు రాలేదు ? అనుకుంటే - కొంచం  కారం అనిపించొచ్చు. కాని అందరూ హాయిగా, తీయగా పాడారు.

అందరూ - మనకు - మొదటి బహుమతే.  అలా అనుకుంటే - అది తియ్యగా వుంది.

సరే. మొదట చెప్పినట్టు - యిక్కడి నుండి - మరెక్కడికి?

భారత దేశానికి మరో బాలు, మరో సుశీల  - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

ఎన్నో చెయ్యాలి.  ఈ  గాయనీ గాయకులు - మరో నాలుగు భాషలను నేర్చేసుకోవాలి. ఆ  భాషల వాళ్ళ కంటే  బాగా!

ఏం. బాలూ గారూ, సుశీల గారూ నేర్చుకోలేదా?

ఆ భాషలలో - యింత కంటే - బాగా పాడ  గలగాలి. పాడ గలరు. మాకు తెలుసు. 

సరే. కర్నాటక సంగీతమూ, హిందుస్తానీ సంగీతమూ కూడా - బాగా నేర్చుకోవాలి - నేర్చుకో గలరు. మాకు తెలుసు.

నక్షత్రాలను అందుకోవాలని  ప్రయత్నిస్తే - చంద్రుడిని సులభంగా పట్టుకోగలము.

మీరు సంగీతాన్ని వొక యజ్ఞం లా - సాధన చెయ్యాలి.

వొక పెద్ద ఆడిటోరియం లో వేల మంది శ్రోతల ముందు పాడటం వొక ఎత్తు. యింట్లోనో, తోటలోనో   వొంటరిగా కూర్చుని సాధన  చేయడం మరో ఎత్తు.

ఆ సాధన లోనే - ఉన్నతమైన ఎత్తులకు ఎదగడం చాలా గొప్ప విషయం.

మనం విజయానికి ఎంత దగ్గరలో - ఉన్నామో - వొక్కొక్క సారి మనకు అర్థం కాదు. ఏదో - అందరిలా - కొంత ప్రయత్నం చేసి - వచ్చిన దానితో తృప్తి పడతాం.

దాన్ని  ఆంగ్లంలో  " కంఫర్ట్ జోన్ " లో వుండిపోవడం అంటారు. ఆ కంఫర్ట్  జోన్ దాటితే - అక్కడో అద్భుత ప్రపంచం వుంటుంది.  యింకా ఎన్నెన్ని చేయ గలమో - తెలుస్తుంది. 

అది దాటిన వారికి - వారి  చుట్టూ వున్న ప్రకృతి శక్తులు - ఎంతగానో - సహకరిస్తాయి. మరెన్నో విజయ శిఖరాల వైపు  తీసుకు వెడతాయి.

మరి  ఆ కంఫర్ట్ జోన్ ఎలా దాటుతారో  యోచన  చేయండి ?

అందరికీ -అభినందనలతో 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 











4, జూన్ 2012, సోమవారం

రాజు గారి గుఱ్ఱం గాడిదయ్యిందట = గాంధీ గారు, నెహ్రూ గారు వోటు అడిగితే -మనం వోటు వెయ్యం = దేవుడిని నమ్మలేం = ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో చెప్పలేం.


రాను రాను రాజు గారి గుఱ్ఱం  గాడిదయ్యిందట. ఇలాంటి మార్పులు - తప్పనిసరి.

 ప్రపంచం లో యేదీ శాశ్వతం కాదు. నిరంతరం కాదు. అన్నీ పుట్టేవే. అన్నీ పొయ్యేవే.

ప్రతి క్షణం, ప్రతిచోటా,  ప్రతి అణువు  లోనూ, ప్రతి జీవకణం  లోనూ,  జరిగే "మార్పు" మాత్రం తప్పనిసరి.

శాశ్వతమైనది  ఈ  ప్రపంచమంతటా  ఎల్లప్పుడూ , జరిగే  మార్పు వొక్కటే !
మార్పు లేనిదేదైనా వుందా - అంటే - వుందని  యోగులు, జ్ఞానులు  చెబుతారు.

అదేమిటి?.... అది నీవే?

కనిపించే , వినిపించే  నీవు కాదు. వాటికి అతీతమైన నీవు  మాత్రమే శాశ్వతం .
అది వొక్కటి పక్కన బెడితే - - మిగతా, వాటిన్నింటిలో - అంటే, కనిపించే , వినిపించే -అన్నింటిలోనూ మార్పు సహజం గా జరుగుతూ  వుంటుంది.
నిన్నటి మీరు - ఈ రోజు లేరు . ఈ రోజు మీరు-  రేపు మరో మీరుగా మారిపోతారు మీ భర్త(భార్య) కూడా అంతే  మీ పిల్లలూ అంతే. దేశమంతా అంతే. సర్వ సాక్షి అయిన సూర్యుడిలో  కూడా ఎన్నెన్నో మార్పులు  జరిగిపోతూ  వున్నాయి.

భూమిపైన  కూడా - సాక్షులు మారడం  సహజమే.
న్యాయవాదులలో  కూడా,  వొకరు - న్యాయం వైపు వాదిస్తే - మరొకరు (ఎవరో వొకరు) అన్యాయం వైపు  వాదించి తీరాలని  వొక  నియమం పెట్టేసుకున్నారు. ఎవరి ప్రక్క నిజంగా న్యాయం వుందో - వాదించే న్యాయ వాదులకిద్దరికీ  నిజంగా తెలీదా?  అయినా-  మా బాధ్యత  కనుక వాదిస్తున్నాం - అంటారు. అన్యాయం ప్రక్కన కూడా - ఎవరో వొకరు వాదించాలనేది - కలియుగ న్యాయం.అలా లేక పోతే న్యాయం జరుగదని మన  వాదన.

మరి వాదించే వారు, గెలవడానికని వాదిస్తారా? వోడడానికనా?   గెలవడానికేగా? అప్పుడు, న్యాయ వాదులలో  ఎవరో వొకరు గెలుస్తారు? సరే. న్యాయం గెలుస్తుందా ?

అలాంటి దైన మన వ్యవస్థలో - గెలిచేదంతా   న్యాయమేనా?
న్యాయ వాదుల సంగతి  పక్కన వుంచితే - న్యాయ మూర్తులు ఎలా వుండాలి?

 అలనాటి పట్టాభి రాముడిలా వుండాలి. న్యాయమంటే రాముడు. ధర్మమంటే - పటాభిరాముడు. 

రాముడిని చూసి తెలుసుకోవాలి  న్యాయమేమిటో ; ధర్మమేమిటో.

అలాంటి పట్టాభి రాముడేగాలి కా వాటంగా తెరచాప ఎత్తితే, న్యాయము  గాలి వాటం కాదా?

అదెలా న్యాయమవుతుంది?

సరే. న్యాయమూర్తి పట్టాభిరామారావు గారిని - కొన్నారని అభియోగం.   అందుకే  ఆయన లో - గాలి గారి పైన చాలా ప్రేమ పుట్టుకొచ్చింది -అనడానికి - సి.బీ.ఐ. వారికి  - వారి వారి బ్యాంకు అకౌంట్ లలో - చాలా చాలా - ఆధారాలు కనిపించాయి.

రౌడీ  కొడితే - పోలీసు వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. పోలీసు వాడు కొడితే - న్యాయ స్థానానికి వెళ్ళొచ్చు. న్యాయ మూర్తి కొడితే?

గాలి గారికి, జగన్ గారికి - మధ్య చాలా, సన్నిహిత , ఆర్ధిక సంబంధాలు కనిపించాయి.

జగమే - మాయలా వుంది .

పోయినోళ్ళు -అందరూ మంచి వారే అయితే - ఎంత బాగుండేది. వున్న వాళ్ళు  కూడా కాస్త బాగుండే వారు.

-కానీ  వున్న వాళ్ళ సంగతి లోడితే - పోయిన వాళ్ళ కంపు బయట కొస్తున్నది.

వున్న వాళ్ళు - అంటే మీరూ నేనూ కాదు.

బాగా వున్న వాళ్ళు . కొన్ని వేల ఎకరాల భూమి వున్న వాళ్ళు ;లేదా, రాసివ్వ గలిగిన వాళ్ళు. మీకు లేక పోతే ఎలా రాసిస్తారు?  కొందరు రాసివ్వొచ్చు.

ప్రభుత్వమంటే ఎవరిది? మీది. మరి ప్రభుత్వ భూమి మీరు రాసిస్తే చెల్లదా ? చెల్లుతుంది. అలా రాసిచ్చినప్పుడు - వాళ్ళేదో, కానుకలిస్తారాయె. అది మన దేశంలో ఆనవాయితీ కదా. 

కట్నాలూ, కానుకలూ  మేం పుచ్చుకోం. కానీ  మీ  అమ్మాయికి, మీరు వొక కారు, బంగాళా, కోటి రూపాయల నగలూ  -లాంటివి - లేకుండా పంపించడం బాగుండదు కదా -అలాగే చెయ్యండి మరి. మాకేం అభ్యంతరం లేదు.

యిలా చెప్పడం - మర్యాద.

అలాగే, పరిశ్రమలకు మేం భూములిస్తాం. మీరు నాకుగా ఏమీ యివ్వ వలసిన పని లేదు. నా కొడుకు వృద్ధిలోకి రావలసిన వాడంటారా? అది మీ అభిప్రాయం; మీ యిష్టమండి.  నాకు సంబంధం లేదు.

యిదొక మర్యాద.

యిప్పుడే - ఏ.రాజా  గారు  - బయలులో-బెయిలుతో,  స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు. గాలి గారు కూడా - పట్టాభి రాముల కృప వలన  స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు.

కానీ ఏ సహాయమూ - గాలి గారు వూరికే తీసుకోరు. తగిన ప్రతిఫలం యిచ్చేస్తారు. వారివ్వక పోతే వారి వారెవరో యిచ్చేస్తారు. అది న్యాయం. న్యాయ మూర్తికైనా సరే . 

గాలి గారి యీ న్యాయం వలన - యిప్పుడు, ఆయనా , న్యాయమూర్తి  గారూ కలిసి  లోపల వుండే ప్రమాదం వచ్చి పడింది .

యిలా - గాలి గారూ - వారికి సంబంధించిన  వారందరూ - వొక్క చోట వుంటే -  అదొక గొప్ప న్యాయం. అది లోపలైనా సరే.  ఏదైనా కొన్నాళ్ళే .ఎన్నాళ్ళని జైలులో పెడతారు?

ఏ.రాజా గారు - లోపల వున్నప్పుడు -ఏదో ఆటలంతా అడే వారట. టెన్నిస్ లాంటివి. కనిమొళి గారు కూడా కొన్నాళ్ళు లోపల వున్నారు. అంతా బాగుందనుకుంటుంటే - మళ్ళీ బెయిలు. యిప్పుడు - ఆడటానికి మిత్రులు ఎవరూ లేరు. నిజమే. బయట, నిజమైన మిత్రులు దొరకడం కష్టం. 

యివన్నీ పత్రికలలో చదువుతున్నాం.కానీ - యిందులో - నిజమెంతో మనం చూసొచ్చామా?  ఈ విషయాలలో - పూర్తి న్యాయమెంతో -తెలియడానికి యిరవై ఏళ్ళు  పట్టొచ్చు.  భారత దేశం కదా.

వీటన్నిటికీ, సాక్షులు  వున్నారా? మన న్యాయ వ్యవస్థ అంతా - సాక్షులపై  ఆధారపడి వుంది కదా. వారు దినదినమూ, గాలి వాటానికి  మారుతూ వుంటారు కదా.  కాబట్టి, అసలు సిసలైన న్యాయం ఏమిటో తెలియడానికి - ఎన్నో యుగాలు పట్టొచ్చు .

అయితే - ఈ కేసులలో - నిజమైన - అన్నీ  తెలిసిన - " సాక్షి"  ఎవరు?

సాక్షుల కోసం వెదకడం - మన పని కాదు. అది ఘనత వహించిన న్యాయ వాదుల పని. హేమాహేమీలున్నారు.

జగన్ గారు తలుచుకుంటే - చిన్న కోర్టు కైనా- అమెరికా లాయర్లైనా వచ్చేస్తారు. వారిపై ఆ లాయర్లకు - అంత ప్రేమ.

వీళ్ళందరూ - ఎప్పుడో ఆత్మ కథలు రాసేస్తారు. జైలు కెళ్ళిన వారందరూ - రాసేస్తున్నారు. గాంధీ గారితో - మొదలయింది ఈ పద్ధతి. యివి రాసేటప్పుడు - వీళ్ళంతా మళ్ళీ, మినిస్టర్లు , చీఫ్ మినిస్టర్లు లాంటి  పదవులలో వుండే ఛాన్సు  వుండనే  వుంది. మనం వుండే వరకు వారికి డోకా లేదు గాక లేదు .


పొరుగు రాష్ట్రం కేరళలో - మణి అన్న వొక గొప్ప పార్టీ నాయకుడు - ఏదో గొప్పలు చెప్పుకున్నాడు . మా  - ప్రత్యర్థుల నెవరినైనా లేపేసే ఆనవాయితీ మాకు వుంది -అన్నారు. మరి, ఎంత మందిని యిప్పటి వరకు లేపేసారో - యిప్పుడు తెలుసుకోవాలి. యిదీ, కేరళ ప్రభుత్వం వారి తలనొప్పి యిప్పుడు.

కేరళలో - మర్డర్ చేయబడిన వారి లిస్టు తీసుకోవాలి. అందులో - పాలిటిక్స్ లో వున్న వాళ్ళ   లిస్టు తీసుకోవాలి. ఆ కేసులన్నీ తిరగదోడాలి. యివన్నీ యిక 20 ఏళ్ళు అందరికీ పూర్తి పని.

బెంగాల్  లో మమతా గారి వ్యవహారం మరో రకం. కనిపించిన వాళ్ళంతా - నక్స లైట్లు  గానో, సి.పీ .యం . వారి లాగానో కనిపిస్తున్నారు ఆమెకు.


వొక చీఫ్ మినిస్టర్  గారు సామాన్య ప్రజలలో - యింత సులభంగా నక్స లైట్లను కనిబెట్ట గలగడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

బెంగాల్ లో  వున్న వారు  పెనం మీద నుండి, పొయ్యిలోకి దూకినంత సంతోషంగా వుండొచ్చు. ముందు చెప్పినట్టు - మార్పు  తప్పదు . ఇలాంటి మార్పు వారుగా వోటు వేసి తెచ్చుకున్నారు. మరి, వేరే ఎవరికి వోటు వెయ్యగలం? వుండేది - పొయ్యి, పెనం రెండే . నిజమే. పాలిటిక్స్ లో  ఆరోగ్యకరమైన మార్పు రావాలంటే - చాలా కష్టం.

యూ.పీ. లో మాయావతి  గారు వెళ్ళారు ములాయం గారు మళ్ళీ వచ్చారు.కొడుకును గద్దె ఎక్కించారు. అఖిలేష్ గారు  -మాయావతి గారిని - వీధుల్లోనూ, అసెంబ్లీ లోను కూడా ఎదుర్కొన గలరు. కానీ - మాయావతి గారు చాలా ముందు జాగ్రత్త మనిషి. ఆస్తిపాస్తులతో బాటు - తన శిలావిగ్రహాలు కూడా - రాష్ట్రమంతా తానే  పెట్టించేసారట. మళ్ళీ -దళిత  (అంటే, తన ) విగ్రహాలను ఎవరైనా తాకితే - ఖబడ్దార్ , అని సవాల్ కూడా చేసేసారు.యిప్పుడు అఖిలేష్ గారు ఏం చేస్తారో తెలీదు. వో  పని చెయ్యొచ్చు. ములాయం గారి విగ్రహాలను, తన విగ్రహాలను కూడా - మాయావతి  గారి విగ్రహాల ప్రక్కనే పెట్టేసేయ్యచ్చు. యింకా కావాలంటే వూరిలోని  యం.యల్.ఏ ల విగ్రహాలను కూడా పెట్టచ్చు. యూ.పీ. అంతటా - అందమైన శిలా విగ్రహాలు పెట్టిన కీర్తి మాయావతి గారితో  బాటు వీరిద్దరికీ దక్కుతుంది.

అన్ని రాష్ట్రాల గాధలూ యిలాగే  వున్నాయి. మనం వీళ్ళ నెవ్వరినీ తిట్టడం లేదు.తప్పు బట్టడం లేదు. వీరు వొక ప్రవాహంలో  కొట్టుకు పోతున్నారు. అంతే.  అధికారం, ధనం - ఈ రెండింటి కోసం తపన. యిదీ ఆ ప్రవాహం.

వొకప్పుడు - పదవికోసం పోటీ లేదు. సేవ చేయడానికి పోటీ వుండేది. పదవంటే  -  ప్రజలకు సేవ -అనే వారు. యిప్పుడూ ఆ మాట 5 సంవత్సరాలకొక సారి చెప్పాలి; చెబుతారు. ఆ తరువాత - అది వేరే లోకం.

యిప్పుడు - గాంధీ గారి విగ్రహాలు, నెహ్రూ గారి విగ్రహాలు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి - ఈ రోజు గాంధీ గారు వచ్చి వోటు అడిగితే -మనం వోటు వెయ్యం.

ఆయన - భారత ప్రజలలో - ఎవ్వరికీ విరోధిగా, కఠోరంగా మాట్లాడరు. ప్రజలను, జాతి, మత ప్రాంత, భాషా బేధాలతో విడదీయరు. అలా విడదీసి మాట్లాడే వారే - మనకు ఈ రోజు నచ్చుతారు. కాబట్టి గాంధీ గారు వోటడిగితే - రైట్ టు రిజెక్ట్  క్రింద ఆయనకు వొక్క వోటు కూడా పడదు.

అలాగే, నెహ్రూ గారు కూడా. ఆయనా అంతే. ఆయన ప్రసంగాలలో కూడా - ఉప్పూ కారం  గానీ, కారాలూ , మిరియాలూ కానీ వుండదు.అరె. అసలు, మన విరోధి ఎవడో చెప్పడు. వాడిపై పోరాటం చెయ్యాలన్న మాట అస్సలు లేదు.

దేశమంతా వొక్కటే - అంటాడు. యింకాస్సేపు మాట్లాడితే - ప్రపంచ ప్రజలంతా - వొక్కటవ్వాలంటాడు. అప్పుడప్పుడూ జై హింద్ అంటాడు.ప్రసంగం కడపట, జనగణమన పాడాలంటాడు.

మనం వేసే వోట్లన్నీ - విరోధి పై అసహ్యంతో, కోపంతో, భయంతో  వేసే వోట్లే కదా. అసలు విరోధి ఎవరో చెప్పక పోతే ఎలా? అదీ కాకపోతే - మన కులం వాడనో, మతం వాడనో, సారా బాటిల్ యిచ్చాడనో, మరేదో  యిచ్చాడనో -  వోటు వెయ్యచ్చు.

 నెహ్రు గారికీ, గాంధీ గారికీ - ఇవేవీ కూడా లేదు. మరెలా వోటు వెయ్యడం?

రాజకీయాల్లో - రాజు గారి గుర్రం కాల క్రమంలో - కంచర గాడిదగా - తయారయ్యింది.


ఎండలు మండిపోతున్నాయ్. సంవత్సరానికి రెండు డిగ్రీలు పెరుగుతూ వుంది. రేపు చెట్లు పెడితే మేలేమో - అన్న ఆలోచన మనకు వచ్చినా రావచ్చు. జగన్ గారికీ, కిరణ్ గారికీ,బాబు గారికీ రాక పోవచ్చు. వారి గోల వారిది.

రాయల సీమలో - చాలా మందికి , నీళ్ళ టాంకుల్లో అప్పుడప్పుడూ - వచ్చే నీళ్ళు ఎక్కడినుండి వస్తూ వుందో  తెలీదు. వొక వేళ  అవి రేపటి నుండీ రాక పోతే ఏమవుతుందో తెలీదు. రేపటిని గురించి అనుకునే నాథుడే లేదు. అది ఈ రోజు.

కానీ మార్పు సహజం. కంచర గాడిద మళ్ళీ గుర్రంగా మారినా మారొచ్చు.రేపు ఏమైనా జరగవచ్చు. 

రాజకీయ వాదుల్ని నమ్మొచ్చు. వాళ్ళు ఎప్పటి లాగే - తమ తమ ఆస్తుల్ని ,పదవుల్ని సర్దుకుంటూ వుంటారు.

కానీ దేవుడిని నమ్మలేం. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో చెప్పలేం.

సిరికిం  జెప్పడు..అంటూ..బయలుదేరి..ఎక్కడికక్కడ వొక తుఫాను కురిపించినా - ఆశ్చర్యం లేదు.

దేవుడిని నమ్మండి. మంచే జరుగుతుంది.

మళ్ళీ - మా దేవుడిని మాత్రమే  నమ్మండి అంటారా? కంచర గాడిద వంకర గాడిదగా తయారవుతుంది.


=మీ

వుప్పలధడియం విజయమోహన్