7, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఎందుకిలా జరుగుతోంది? 24 ఏళ్ళ వయసులో గుండె పోటు ఎందుకు? = నూరేళ్ళ జీవితం, అందంగా, ఆనందంగా గడపాలంటే ఏం చెయ్యాలి?

సమస్య నేనే అనుకుంటే - సమాధానం మనలోనే వెదుకుతాం. సమాధానం మనలోనే వుంటే - అది  తెలుసుకోవడం, దాన్ని అమలు చేయడం చాలా సులభం.

చాలా చాలా సమస్యలకు - నిజానికి సమస్యా మనమే; పరిష్కారమూ మనమే. యిది - క్రిందటి వ్యాసంలో మనం చూసాం.


ఈ ముందు మాట ఎందుకు?

రెండు రోజుల క్రితం - వొక  24  ఏళ్ళ  యువకుడు - ఐ.టీ. రంగంలో వున్న వాడు -  గుండె పోటు(హార్ట్ యటాక్) తో పోయాడు. అతనికి ఏ రకమైన చికిత్సా అందించడానికి మునుపే చని పోయాడు. ఈ మధ్య 24  నుండి 35   లోపుగా వుండే  యువకులిలా  అర్ధాంతరంగా పోవడం - చాలా, చాలా  విన్నాను. 

ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది?

భారత దేశానికి - ఐ.టీ. రంగం రావడం వలన - ఎంతో మేలు జరిగినా - యువకుల్లో -  బీ.పీ, చక్కర వ్యాధి, గుండెపోటు సమస్యలు, మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడం - చూస్తూనే ఉన్నాము.

యివి చాలదన్నట్టు - బెంగుళూరు నగరంలోని - ఐ.టీ. రంగంలోను, బీ.పీ.వో లాంటి మరి కొన్ని రంగాల లోనూ, వివాహ రద్దుల శాతం చాలా ఎక్కువయినట్టు  వార్తలు వస్తున్నాయి.

వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువ అవుతూ వుంది.. అయితే - శరీరంలో క్రొవ్వు శాతం పెరిగి, అతి స్థూల కాయం రావడం వలన సెక్సు సామర్థ్యం తగ్గినట్టు కూడా - తెలుస్తూ వుంది.

ఫాస్ట్ ఫుడ్, పిజ్జా లాంటివే ఎక్కువ తినడం వలన - మరెన్నో వ్యాధులకు గురి కావలసి వస్తున్నారు.
 
నిశితంగా చూసే వారికి - వీరిలో - వోర్పు శాతం తగ్గి, వొత్తిడి (స్ట్రెస్)శాతం ఎక్కువయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎంతో మందిలో - కోపమూ, వేగమూ - పెద్దల పట్ల అసహనమూ పెరుగుతున్నట్టు - అనిపిస్తుంది.

విదేశాల నుండి వచ్చే డబ్బు తో బాటు - వారి సంస్కృతి పట్ల మోజు కూడా చాల ఎక్కువవుతున్నట్టు అనిపిస్తుంది. యిది ఎంత శాతం మందిలో జరుగుతోందో - చెప్పడం కష్టం. కానీ - ఎంతో మందిలో వుంది, ఎక్కువవుతోంది - అని మాత్రం తప్పక అనిపిస్తుంది.

యిదంతా - వారి తప్పే - అని మాత్రం అన లేము. ఎన్నో కంపెనీల్లో,  6  - 8  గంటల పని ఎప్పుడో పోయింది.  12 గంటలు, అంతకు మించి కూడా పని చేసే వారి శాతం చాలా ఎక్కువగా వుంది. వారికి పని భారం వలన - వొత్తిడి, దాని ద్వారా వచ్చే వ్యాధులు వస్తాయి కదా.

యిటువంటి పనీ, పని కాలాలు -ఎక్కువవడమూ, వాటి వల్ల యువతీ,యువకుల మధ్య ఆకర్షణ పెరగడమూ, పెద్దలకు దూరంగా వుండడం వలన, అది సెక్సు రూపం ధరించడం సహజంగా జరిగిపోతూ వుంది. తప్పు వారిది మాత్రం కాదు. వయసుది; పరిస్థితులది - అని తప్పక చెప్పాలి. 

ఈ విషయంలో - కంపెనీలలోనూ, ప్రభుత్వం లోనూ- చైతన్యం రావాల్సిన అవసరం ఎంతయినా వుంది.


ముఖ్యంగా - యువకుల్లో, యువతుల్లో, చైతన్యం రావాలి.

క్షణికాకర్షణలు - సెక్సు గానీ, ఆహారం గానీ, డబ్బు గానీ-  వొక వైపు వున్నా - మరొక వైపు సమాజం ఎలా వుంటే - అందరికీ మేలో - అన్న చైతన్యం పెరగాలి.

ఆహారమూ, శారీరక ఆరోగ్యము పట్ల శ్రద్ధ పెరగాలి.

పని ఎంత వున్నా - మానసిక వొత్తిడి లేకుండా చేయడం నేర్చుకోవాలి.

అలాగే - వివాహేతర సంబంధాలూ, విడాకులపై మోజు - తగ్గాలి. వివాహం పట్ల గౌరవం పెరగాలి.

అమెరికాలో - 53  శాతానికి పైగా  వివాహాలు - అవీ, అన్నీ ప్రేమ వివాహాలే - విడాకులతో, అతి త్వరగా, ముగుస్తున్నట్టు, గణాంకాలు ద్వారా తెలుస్తున్నాయి. 

మరి ఆ ప్రేమలెంత నిజమైనవి? వాటిలో లోపం ఎక్కడుంది? అన్ని ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమౌతున్నాయి? అన్నీ - ఎన్నో నెలల, సంవత్సరాల "డేటింగ్" తరువాత జరిగేవే. అయినా, విఫలమౌతున్నాయి. డేటింగ్ జరిగినంత కాలం కూడా - వివాహం తర్వాత కలిసి వుండలేక పోతున్నారు.

ఎందుకు?

నాకు - ఏదో కావాలి. కానీ ఎం కావాలో, సరిగ్గా తెలీదు. మొదట ఈ బొమ్మ  పైన మనసు పడింది. అది దొరికేంత వరకు అది తప్ప మరోటి వద్దు - అదే కావాలి; అందుకని చిన్న పిల్లలు ఏడుస్తారు. రాద్దాంతం చేస్తారు. సరే. అది తీసిస్తే - వొక్క రోజులో - దాన్ని నాలుగు భాగాలు చేసి పడేస్తారు. మోజు తీరిపోయింది.

మళ్ళీ, మరో బొమ్మ కావాలి. మళ్ళీ అదే తంతు. పెరిగే వరకు అంతే. మనసు ఎదిగే వరకు అంతే. అప్పటికి పుణ్య కాలం గడిచి పోతుంది. వయసు అయిపోతుంది.

జీవితం కూడా బొమ్మలాట లాగ మార్చేస్తున్నారు. మారుస్తూ, జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు.

జీవితం అర్థం కావాలి. మనలో - మిస్టర్ పెర్ఫెక్ట్ కానీ మిస్ పెర్ఫెక్ట్ కానీ - ఎక్కడా లేరు. అందరిలో కొన్ని, కొన్ని లోపాలు వుండనే వుంటాయి. ప్రేమించే సమయంలో లోపాలు తెలియవు. బాధ్యతలు తెలియవు. వివాహం తరువాత - లోపాలు, బాధ్యతలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ప్రేమ మెల్లగా మాయమవుతుంది. 

ప్రేమిస్తే - లోపాలతో బాటు, బాధ్యతలతో బాటు - అన్నిటినీ ప్రేమించాలి. అన్నిటినీ స్వీకరించాలి. అది జరగడం లేదు.

ముందు తరంలో - బాధ్యతలు చాలా స్పష్టంగా - విభజింప బడ్డాయి. యిప్పుడా విభజనను వొప్పుకోక పోవడం వలన, మరో స్పష్టమైన, ప్రత్యామ్నాయం చూసుకోక పోవడం వలన -ప్రేమ వివాహాలు విఫలమౌతున్నాయి.

ప్రేమించే సమయంలో - నా ప్రాణాన్ని కూడా కావాలంటే యిచ్చేస్తా - అన్న వారే - కాఫీ నువ్వే పెట్టాలి, నేను పెట్టను. యిది నువ్వే చెయ్యాలి, నేను కాదు - అని అన్నిటికీ పోటీ పడుతున్నారు. నా జీతం నాదే. అందులో - నేను "మన కోసం" ఖర్చు పెట్టను అనే వారిని చాలామందిని  చూస్తున్నాము.

ఇలాంటి మార్పులు ఎన్నో.

ప్రేమల స్వరూపం మారిపోతూ వుంది. వివాహ జీవితాల స్వరూపం మారిపోతూ వుంది.  పిల్లల పట్ల, పెద్ద వారి పట్ల - అభిప్రాయాలు, ప్రవర్తన మారిపోతూ వుంది.

వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతూ వుంది. 

ఈ సమస్యలకు కూడా - నిజానికి సమస్యా మనమే; పరిష్కారమూ మనమే. అందరూ - పెద్దలూ, యవకులూ, యువతులూ, కంపెనీలు, ప్రభుత్వమూ -అందరూ - భాగ స్వామ్యులమే.

నాలోని కోపాన్ని, అసహనాన్ని, వొత్తిడిని, ఎవరు శీఘ్రంగా తగ్గించ గలరు? నేనే.

నా ఆరోగ్యాన్ని - శీఘ్రంగా ఎవరు బాగు చేయ గలరు? నేనే.

నా వివాహ జీవితాన్ని సరిగ్గా ఎవరు చూసుకో గలరు? నేనే.

సమాజం - కొంత వరకు తోడ్పడుతుంది. నా లో సమాజం పట్ల బాధ్యత వుంటే, గౌరవం వుంటే.

24  ఏళ్ళలో  గుండె పోటుతో పోవలసిన  అవసరం ఎవరికీ రాకూడదు. నూరేళ్ళ జీవితం, అందంగా, ఆనందంగా గడపాలంటే - మరి కాస్త బాధ్యతాయుతంగా, మరి కాస్త సామాజిక స్పృహతో, మరి కాస్త ఆరోగ్య స్పృహతో - జీవితం గడపాల్సిన అవసరం వుంది.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఏ సమస్యా నిజమైన సమస్య కాదు. అసలు సమస్య నువ్వే = జ్వరం-అనుజ్వరం = మీ అసలు సమస్య అంతా యిదే!


మనం  నీడల్ని చూసి భయపడతాం. "మన నీడ" ని చూసి కూడా వొక్కో  సారి  భయపడతాం. అలాగే, చీకటంటేనూ,  భయ పడతాం.

చీకటి అంటే నీడ. చీకటి, భూమి మీద పడ్డ (చంద్రుడి) నీడ. లేదా, చంద్రుడి పైన పడ్డ (భూమి) నీడ. అంత కంటే - మరేం లేదు. అదే మనకు రాత్రి.

వెలుతురు వుండి  - మనం ఆ వెలుతురు కు అభిముఖంగా నిలిస్తే, నడిస్తే - మన నీడ మనకు  కనిపించదు. వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ - వెలుగుకు వ్యతిరేక దిశలో చూస్తూ నిలిస్తే, నడిస్తే  - మన నీడ పెరుగుతూ, పెరుగుతూ - మన ముందు నడుస్తూ - మనల్ని  మానసికంగా భయ పెడుతుంది.

నిజ జీవితంలోనూ - అంతే.

మనం వెలుగు వైపు నడుస్తున్నామా - వ్యతిరేక దిశలో నడుస్తున్నామా? విజ్ఞానం వైపు నడుస్తున్నామా? దానికి వ్యతిరేక దిశలో నడుస్తున్నామా - అన్నదే అసలు ప్రశ్న

విజ్ఞానం వైపు నడిస్తే - భయాలనే మన నీడలన్నీ - వెనక్కి వెళ్ళిపోతాయి.

విజ్ఞానానికి వ్యతిరేక దిశలో నడిస్తే - మన భయాలన్నీ - ముందుకొచ్చి భయపెడతాయి.

గొర్రెలు కొండ అంచు వైపు పరుగెడతాయి. వొక్క గొర్రె అంచు నుండి దూకిందంటే   -   మిగతావన్నీ, దాని వెనకాలే , హాయిగా దూకేస్తాయి. క్రింద పడి ఎముకలు విరిగేంత వరకు  అవేం చేసాయో, ఎందుకు చేసాయో వాటికి తెలీదు. వాటికి  పర్యవసానం యోచన చేసేంత  బుద్ధీ లేదు. వోపికాలేదు.

సమస్య తెలీకుంటేనూ భయం లేదు - గొర్రెల్లాగా.  లేదా, సమస్యతో బాటు , పరిష్కారము  తెలిసుంటేనూ భయం లేదు. సమస్య  సరిగ్గా అర్థం కాకుంటే - చీకటి లాగా, నీడ లాగా, మనల్ని భయ పెడుతుంది. 

ఏ సమస్యా నిజమైన సమస్య కాదు. అసలు సమస్య నువ్వే - అంటారు - భారతీయ తత్వ వేత్తలు.

డేల్ కార్నీజ్ గారి రచనలో, సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి రచనలో - చదవడానికి బాగుంటాయి కాని నిజ జీవితంలో- వాటి వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని    ఓషో లాంటి దార్శనికులు చాలా విశదంగా చెబుతారు.

నేను కూడా, యివన్నీ చదివాను. చాలా బాగున్నాయి. నాకూ బాగా నచ్చాయి. కాని - వాటి ఉపయోగం అనుకున్నంత  ఎక్కువ కాదని చాలా కాలం తరువాత తెలిసింది.

వాళ్ళ విమర్శనాత్మకమైన, సకారాత్మకమైన   రచనలలో - వొకే వొక చిన్న లోపం. అన్ని సమస్యలకూ - పరిష్కారం ఎక్కువగా బయటనే వెదకడం. అసలు సమస్య ఎక్కడుందో తెలియక పోవడం. అంతే.

అసలు సమస్య మనమే. ఎవరికి - వారే , అసలు సమస్య.

మనం ప్రపంచాన్ని పూర్తిగా బాగు చెయ్యలేం. మనం - మనల్ని బాగు చేసుకోవచ్చు.

అవతారపురుషుడైన శ్రీ కృష్ణుడు కూడా - కౌరవులలో, ఏ వొక్కరినీ సరి చెయ్య లేక పొయ్యాడు.

జీసస్ క్రైస్ట్ బ్రతికున్న రోజుల్లో - పట్టుమని పది మందిని కూడా పూర్తిగా మార్చలేక పొయ్యాడు. నమ్మిన వాళ్ళే, శిష్యులన్న వాళ్ళే - ఆయనను పట్టిచ్చారు.

బుద్ధుడి వెనుక పదివేల మంది శిష్యులుండే వాళ్ళట. వారిలో చాలా మందికి ఎప్పుడూ సందేహాలే.

కొంత మంది మాత్రం - బుద్ధుడి ఎత్తుకు ఎదిగారు. యిలాగే - ఎవరు మారాలనుకున్నారో - వాళ్ళు మాత్రం మారారు. బుద్ధుడు ఎవరినీ మార్చాలని తీవ్రంగా ప్రయత్నించలేదు.

అయితే - మారాలనుకున్న   ఎందరో - ఆయన దగ్గరకు వెళ్ళారు.   అర్థం చేసుకున్న వాళ్ళు మారారు.

కృష్ణుడి భగవద్గీత విన్న వాళ్ళు నలుగురట.

అర్జునుడు ఎదురుగా కూర్చుని విన్నాడు. రెండవ వాడు, జెండాపై కపిరాజు, హనుమంతుడు. రామావతారంలో విననివన్నీ - యిప్పుడు విన్నాడు. సంజయుడు దూర శ్రవణమూ , దూర దృష్టీ వుండడం వలన విన్నాడు.  సంజయుడు చెబితే - ధృతరాష్ట్రుడు విన్నాడు. విని తరించిన వారు ముగ్గురే. అర్జునుడు, అంజనా తనయుడూ, సంజయుడూ.

భగవద్గీత విన్నా ధృత రాష్ట్రుడికి జ్ఞానోదయం కాలేదు.

మనమూ అంతే.

భగవద్ గీత వెలుతురు. కానీ దుర్యోధనుడు తన నీడ. నీడ నచ్చింది. వెలుతురు నచ్చలేదు - ధృత రాష్ట్రుడికి.

ధృతరాష్ట్రుడికి సమస్య దుర్యోధనుడు కాదు.  తనకు తానే సమస్య. అర్జునుడికి సమస్య మరొకరు కాదు. తనకు తానే సమస్య.

మీకు వెయ్యి సమస్యలున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. కానీ - అసలు సమస్య మీకు మీరే.

బుద్ధుడి దగ్గరకు వొక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయనకూ వెయ్యి మంది శిష్యులున్నారు.  శిష్యులడిగే ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చేవాడు గానీ  -   అవన్నీ విన్న తరువాత - యిప్పుడాయనకే లక్ష సందేహాలు.

సరే. బుద్ధుడు అన్నీ తెలిసిన జ్ఞాని అంటారు కదా - ఆయన్ను అడుగుదామని వచ్చాడు. బుద్ధుడు నవ్వి - మీ సందేహాలకన్నిటికీ చక్కటి సమాధానాలు నా దగ్గర వున్నాయి, చెబుతాను గానీ - వొక నిబంధన వుంది, అన్నాడు. అదేమిటంటే - వొక సంవత్సరం పాటు - ఏ సందేహమూ,ఎవరినీ అడక్కుండా వుండాలి. వీలైనంత మౌనంగా వుండాలి. అంతే. పండితుడు వొప్పుకున్నాడు. సంవత్సరం పాటు ఏమీ అడగలేదు. మౌనంగా వున్నాడు. బుద్దుడినేమీ అడగలేదు కానీ ఆయన్నే గమనిస్తూ వున్నాడు.

సంవత్సరం అయిపోయింది. బుద్ధుడు  ఆయన్ను పిలిచి అడిగాడు. యిప్పుడు చెప్పండి - మీ సందేహాలన్నీ.

పండితుడు నవ్వాడు. స్వామీ, ఇప్పుడేమీ సందేహాలు లేవు, సమస్యలూ లేవు - అన్నాడు.

సమస్యలెలా తీరింది.?  తన్ను, తాను తెలుసుకుంటే, తన్ను తాను అర్థం చేసుకుంటే -  వున్న సమస్యలన్నీ - కరిగిపోతాయి. వెలుగువైపు నిలబడ్డ వాడికి - నీడ కనపడనట్టుగా. మరీ చెప్పాలంటే, నలు వైపులా వెలుతురుంటే  - నీడ లేనట్టుగా, నీడ పారిపోయినట్టుగా, జ్ఞానమున్న చోట సమస్యలుండవు. జ్ఞానమంటే - తనను తాను తెలుసుకోవడమే. ప్రపంచాన్నంతా, మనం తెలుసుకోనవసరం లేదు.

అంతే - బయటి ప్రపంచంలో సమస్యలేవీ లేవా? - అంటే, వున్నాయి. అవి మీ సమస్యలు కావు.

అమెరికా వారి సమస్య మీ సమస్య కానంత వరకూ  - మీరు వారికేమైనా సహాయం చెయ్యొచ్చు. లేదా- మీ పనులు మీరు చూసుకుంటూ వుండొచ్చు.  అది మీ సమస్య అనుకున్నారంటే మాత్రం - మీరు చిక్కుల్లో పడతారు.

దీన్ని వేదాంతంలో - "అనుజ్వరం" అంటారు. ఉదాహరణకు - మీ అబ్బాయికో, భార్యకో, భర్తకో, జ్వరం వచ్చిం దనుకోండి. మీరు వారికి సేవ చెయ్యొచ్చు. మందులివ్వొచ్చు. మీరు వారికి ఏమేం చెయ్యగలరో అవన్నీ చెయ్యొచ్చు. తప్పు లేదు. కానీ- ఆ జ్వరం మీకే వచ్చినట్టు మీరు బాధ పడితే మాత్రం - అది మూర్ఖత్వమౌతుంది. దాన్నే "అనుజ్వరం" అంటారు.

మీ వారి జ్వరం, మీకు అనుజ్వరం గా మారితే - మీ వారికే ప్రయోజనమూ లేదు. మీరు వారికి చెయ్య గలిగే సహాయం కూడా చెయ్య లేక పోతారు. కానీ, మీ అనుజ్వరం వలన - మీకు మీ వారి జ్వరాన్ని మించిన జ్వరం వచ్చే ప్రమాదం వుంది. మీ వారి జ్వరం విషమించే ప్రమాదమూ వుంది.

మీరు హాస్పిటల్ లో ఏదో వ్యాధి నివారణ కోసం ఉన్నారనుకోండి. మీకు చిరునవ్వు నవ్వుతూ వచ్చి చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు అంటే - యిష్టమా, మీ లాగే ఆపసోపాలు పడుతూ, కన్నీరు కారుస్తూ , భయపడుతూ వచ్చే డాక్టర్లు, నర్సులు అంటే - యిష్టమా? చిరునవ్వుతో వున్న వారే కదా. మీ భార్య, లేదా భర్త, నవ్వుతూ, మీతో హాయిగా మాట్లాడుతూ సహాయం చేస్తే యిష్టమా. అయ్యో, మీకిలా వచ్చేసిందే. యిది నాకు వస్తే పోలా -దేవుడా ఈ వ్యాధి నాకిచ్చేసేయ్యి - అంటూ ఏడిచే వారంటే యిష్టమా?

యిందులో అంతర్లీనంగా వుండే - "ప్రతి సమస్య యొక్క  పరిష్కారం, సమాధానం" మనం అర్థం చేసుకోవాలి.

సమస్యలు లేవని కాదు. సమస్యలతో  బాటు, మనం వొకటి అయిపోతే,  మనమే సమస్య అయిపోతాం.

సమస్యను కాస్త దూరం నుండి చూడడం నేర్చుకోవాలి. సాక్షీ భావం - అంటారు దీన్ని.

మొదటి సాక్షీ భావం - సమస్య నేను కాను, కాకూడదు - అన్న భావన. రెండో భావన- సమస్య నాది కాదు అన్న భావన. మూడవది -ప్రతి సమస్యకూ సమాధానం వుంది - అన్నది. చాలా విషయాల్లో - ఇలాంటి భావనను అలవరుచుకోవడం సులభమే.

కొన్ని సమస్యలకు యిలా అనుకోవాలంటే - మరి కాస్త ఎక్కువ పరిణితి కావాల్సి వుంటుంది.

యిది మీ వల్ల కొన్ని సార్లు కాలేదనుకోండి. అప్పుడు - మరో మార్గం వుంది.

సాధారణ మనుషులకు ఉపయోగ పడే మార్గం యిది. ప్రతి సమస్యా రెండు కోణాల్లో చూడొచ్చు.

దీని పరిష్కారానికి - నేనేం చెయ్య గలను. నేనేం చెయ్య లేను - అనే రెండు విషయాలూ మీరు నిర్దిష్టంగా విశ్లేషించి, తెలుసుకోవాలి.

మీరు చెయ్యగలిగిన దానికి - మీరు చింతలో మునగాల్సిన అవసరం లేదు కదా. చెయ్య గలను - అనుకుంటే - చేసెయ్యండి.

సరే. మీరు చెయ్య లేని దానికి - మీరు చింతించి ప్రయోజనం వుందా? అదీ అక్కర లేదు.

అంటే - మీరు చెయ్య గలిగిన దానికీ - మీరు విచార పడ నవసరం లేదు. చెయ్య లేని దానికీ అక్కర లేదు.

చెయ్య గలిగినది చెయ్యకుండా వుంటే అది తప్పే. అలాగే - చెయ్యలేనిది - చేస్తాననడం కూడా తప్పే. 

మీ అసలు సమస్య అంతా - మీరు మనస్సులో పడే - మీ చింతనే. మరేం కాదు.  

ఉదాహరణకు, కొన్ని సమస్యలు, పరిష్కారాలూ  చూద్దాం.

  • మీ ఆస్తంతా పోయింది. రేపటి నుండి బిచ్చమెత్తుకోవాలి. అయ్యో. యిప్పుడెలా? ఎలా ఏమిటి? పాండవులే బిచ్చమెత్తినప్పుడు, మీకు మాత్రం తప్పేమిటి. యిక్కడ సమస్య ఏమిటి? మీ లోని అహం. మీలోని మీ భూతకాలం, మీ వర్తమానానికి అడ్డు వస్తోంది. అంటే - సమస్య మీరే. మీ అహం అడ్డు రాక పొతే - సమస్య లేదు. భిక్షాటన నుండి మొదలు పెట్టి, మళ్ళీ మీరు ముందుకు రావచ్చు.

  • ఏదో కారణానికి - మిమ్మల్ని జెయిల్లో వేసారు. మీకు శిక్ష వేసారు. అయ్యో. యిప్పుడెలా? ఎలా ఏమిటి? గాంధీ గారు జెయిలుకు వెళ్ళ లేదా. "రాజా" గారు జెయిల్లో హాయిగా టెన్నిస్ ఆడుకోవడం లేదా? మీరు మాత్రం హాయిగా వుండ లేరా. వుండ గలరు. మీ సమస్య - మీలోని అహం, న్యూనతా భావం. అవి పక్కన బెడితే - సమస్యే లేదు.

  • మీ అభిమాన టీ.వీ. సీరియల్ వస్తోంది. కరెంటు పోయింది. యిది సమస్యా? కొందరికి సమస్యే. కొందరికి కాదు. ఎవరికిది సమస్యంటే - ఎవరికి వారు సమస్యగా వున్నారో, వాళ్లకు యిది కూడా సమస్యే.

  • మీ అబ్బాయి సరిగ్గా చదవడం లేదు. పక్కింటబ్బాయికి  తొంభై అయిదు శాతం వస్తే, మీ వాడికి, యాభై శాతం వస్తోంది. మీకు వీలయితే - మీరు, మీ అబ్బాయికి నచ్చేటట్టుగా చెప్పగలిగితే - మీరే పాఠాలు చెప్పండి. లేదా- మంచి ట్యూషన్లు పెట్టండి. అబ్బాయి చదివేటప్పుడు, టీ.వీ. ఆఫ్ చెయ్యండి.చెయ్యాలనిపించ లేదా? ఇవేవీ మీరు చెయ్య లేరా? యిప్పుడు - మీరే సమస్య అన్నది తెలుస్తూ వుంది కదా.   మరి అబ్బాయి నెందు కంటారు? మీరు మాత్రం చింత పడి ప్రయోజనం  ఏమిటి? చెయ్య గలిగింది చెయ్యండి. చెయ్యలేనిది ఎలాగూ చెయ్య లేరు. యిది సమస్య అనుకుంటే - యిక్కడ మీరే సమస్య. మీ అబ్బాయికి యాభై మార్కులే వస్తే - ఎలా బ్రతకాలో నేర్పండి. చాలు. అందరూ పల్లకి ఎక్కాల్సిన పని లేదు. పల్లకి ఎక్కిన వాడి కంటే, మోసే వాడే సంతోషంగా వుండొచ్చు.

  • వ్యాధులు వస్తాయి. వొక్కో సారి తీరని వ్యాధులు వస్తాయి. అది కర్మ ఫలం కావచ్చు. మరేదైనా కావచ్చు. మీరు చెయ్య గలిగింది చెయ్యండి. చెయ్య లేని దానిని గూర్చి చింత పడడం అనవసరం. వ్యర్థం.
  • ఏ వ్యాధి వచ్చినా - చివరి క్షణం వరకూ - నేను సంతోషం గా మాత్రం వుంటాను - అని అనుకోండి. యిది మీరు చెయ్య గలరు. చెయ్య గల పని; చెయ్య వలసిన పని. వ్యాధి - సంతోషంగా వుండే వాడిని బాధ పెట్ట లేదు. డాక్టరు దగ్గరకు వెళ్ళ గలరా. వెళ్ళండి. ఆపరేషనో, మరేదో, చేసుకోవాలా - చేసుకోండి. అది, మీ వల్ల కాదా - వదిలి పెట్టండి. వొక్కటి మాత్రం వదలకండి. మీ సంతోషాన్ని. అది మీరు చెయ్య గలరు. చెయ్యాలి.
  •  
  • శాస్త్ర ప్రకారం - ప్రతి వ్యాధీ - మన శరీరమో, మనస్సో, సృష్టించేదే.  వాటిని, నయం చేయగల శక్తీ - మన శరీరానికి, మనస్సుకూ వుంది. ధ్యాన శక్తితో, ఎటువంటి వ్యాదినైనా నయం చేసుకోవచ్చు - అన్నగట్టి నమ్మకం మన దేశంలో వుంది.
  •   
  • అలాగే - ఆయుర్వేదం ప్రకారం - ప్రతి వ్యాధీ -  మూడు దోషాల సమన్వయము చెడినప్పుడే వస్తోంది - ఆ సమన్వయము తీసుకు వస్తే - వ్యాధి నయము కావడం తథ్యం అంటుంది. యిలా - వ్యాధులకు పలు విధ పరిష్కారాలు వున్నాయి. నమ్మకం ముఖ్యం.

  • అన్నిటికంటే - మనుషుల్ని - భయపెట్టేది - చావు. భారత సంస్కృతిలో - చావును గురించి , ముందెవ్వరూ , బాధ పడే వారు కాదు. భయ పడే వారు కాదు. చావు దగ్గర కొస్తోందంటే   -  అప్పుడు యిష్ట దైవతా ప్రార్థన చేసే వారు. మన నమ్మకం ప్రకారం - మనం చేసిన పాపాలన్నీ పోయి - ఏదో స్వీటు తిన్నట్టుగా చావు కూడా జరిగిపోతుంది. ఏం కష్టం లేదు. చావును చూసి భయ పడాల్సిన పని లేదు. సంతోషంతో ఆహ్వానించాలి.

  • నేను చావనైనా చస్తాను కానీ - నా బిడ్డ బ్రతకాలి - అనే తల్లులు - మన దేశంలో యిప్పటికీ వున్నారు. నేను చచ్చినా పర్వాలేదు కానీ, కొన ఊపిరి ఉన్నంత వరకూ, నాభార్య మాన ప్రాణాలు కాపాడతాను - అనే భర్తలూ వున్నారు. వీరందరి సంఖ్యా తగ్గుతున్న మాట నిజమే అయినా - వొక్క మాట నిజం. చావుకో, వ్యాధికో, ఆస్తి పోయినందుకో -  భయపడిన సంస్కృతి కాదు మనది. 

సంతోషం వున్న చోట - సమస్య లేదు. సమస్య లేని చోట - భయమూ లేదు.

ఇదండీ - సమస్య. యిది అర్థమయితే - సమస్య లేదు గాక లేదు.

= మీ

వుప్పలధడియం విజయమోహన్