భగవద్ గీత (18)
రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం.
అయిదు నుండి పదినాలుగవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(అంటే ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, వాటి స్వరూప లక్షణాలు, సంబంధాలు చూస్తూ వచ్చాము.
15,16 వ్యాసాలలో స్వధర్మము, క్షత్రియ ధర్మము అయిన ధర్మయుద్ధాన్ని చెయ్యడమే అర్జునుడి కర్తవ్యమని అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మయుద్ధం చెయ్యకపోతే నీ ధర్మాన్ని విడిచిపెట్టి, పాపం చేసినవాడవౌతావు. " అన్నాడు.
17 వ వ్యాసంలో, "సకల ప్రజలు నీ యీ అకీర్తికరమైన పనిని, అవమానాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోగలరు. ఈ అకీర్తి, అవమానము చావుకంటే హీనమైనది. ఇక్కడున్న మహారథులందరు నీవు, ఈ యుద్ధం నుండి, భయం చేత పారిపోయిన వాడవనే అనుకొందురు. ఇంతవరకు నిన్ను చాలా గొప్పగా అనుకొన్న వీరు నిన్ను యికమీద చాలా తేలికగా తీసుకొందురు." అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంకా, యింకా ఏమంటున్నాడో , యిప్పుడు చూద్దాం.

శ్రీకృష్ణుడి మాట :
"అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః |
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || (2. 36)
అవాచ్య = మాట్లాడకూడని ; వాదాన్ = మాటలు ; చ = కూడా ; బహూన్ = చాలా ; వదిష్యన్తి = మాట్లాడుతారు ; తవ = నీ యొక్క ; అహితాః = కీడుకోరేవారు, శతృవులు ; నిందంతః = హీనంగా మాట్లాడుతారు ; తవ = నీ యొక్క ; సామర్థ్యం = సామర్థ్యాన్ని, గొప్పదనాన్ని ; తతః = దీని కంటే ; దుఃఖతరం = ఎక్కువ దుఃఖాన్నిచ్చేది ; ను = నిజంగా ; కిమ్ = ఏది వుంది ?
"నీ శత్రువులు నీ బల పరాక్రమాల గురించి, సామర్థ్యాన్ని గురించి చాలా హీనంగా మాట్లాడుతారు. వీరుడైన నీకు, దీనికంటే దుఃఖాన్నిచ్చేది మరొకటి వుందా? "
ఇప్పటి వరకు అర్జునుడి బల పరాక్రమాలు, యుద్ధ కౌశలము అందరికీ ఆశ్చర్యము గొల్పినదే. ఎంతో గొప్ప వీరుడుగా అర్జునుడు ప్రఖ్యాతి గాంచిన వాడే. శివుడితో యుద్ధం చెయ్యడం, గంధర్వులతో యుద్ధంలో గెలవడం, ఉత్తరగోగ్రహణం లో కౌరవ వీరులందరిపైన, ఒంటరిగా పోరాడి గెలవడం - యివన్నీ అర్జునుడి సామర్థ్యాన్ని ప్రపంచమంతటా మారుమ్రోగ జేశాయి.
కౌరవుల 11 అక్షౌహిణుల సేన, అందులోని వీరులు, అర్జునుడికేమీ భయం గొలిపే విషయాలు కాదు. నిజానికి, అర్జునుడి రౌద్రరూపమే, శత్రువులకు భయం కలిగించేది. అర్జునుడి ఎదుట నిలబడి యుద్ధం చెయ్యడం - చాలా మందికి పిరికితనం కలిగించే విషయం.
కానీ, అటువంటి అర్జునుడు, ఈ రోజు యుద్ధం నుండి, ఏ కారణం చేత నైనా వెనుదిరిగితే, శత్రువులు ఏమనుకుంటారు? తన పరాక్రమాన్ని, ధైర్యాన్ని హీనంగా మాట్లాడరా, కించపరచరా? అది, అర్జునుడి లాంటి వీరుడికి తలవంపులు తెచ్చే విషయమే కదా. అంతకంటే ఒక వీరుడికి దుఃఖ కరమైన విషయం మరొకటి వుందా - అంటున్నాడు శ్రీకృష్ణుడు.
వీరుడికి ధైర్యమే ఆభరణం, అలంకారం. పిరికితనాన్ని మించిన మరణం వీరుడికి మరొకటి లేదు. ఈ దేశంలో అదే క్షత్రియులకు నూరి పోయబడిన స్వధర్మము, యుద్ధ ధర్మము. శత్రువు యొక్క సంఖ్య, వారి బలం, తన బలం కంటే, ధైర్యం కంటే, తనకు యుద్ధం చెయ్యడంలో గల నేర్పు కంటే, గొప్పదనుకోవడమే, యుద్ధంలో అపజయానికి కారణం అవుతుంది. మరణానికీ కారణం అవుతుంది. యుద్ధం నుండీ పారిపోవడం, అన్నిటినీ మించిన అపఖ్యాతి తెస్తుంది. ఇదే చెబుతున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి, మనకూ కూడా.
ఇప్పుడు, మీకు, ఈ మధ్య వచ్చిన గొప్ప తెలుగు సినిమా ఏదైనా జ్ఞాపకం వచ్చిందా ? అందులోని ఒక డైలాగ్ యిలాగే వుంది కదా? జయానికీ, అపజయానికీ మధ్య వుండేది మన ధైర్యము, మన నమ్మకమూ.
బాక్సింగ్ పోటీలలో మీరిది చూడొచ్చు. క్రింద పడిపోయిన వాడు ఓడిపోయినట్టు కాదు. క్రింద పడి, లేచి, మళ్ళీ బాక్సింగ్ చేసి, మళ్ళీ పడి, మళ్ళీ లేచి, ధైర్యాన్ని, నమ్మకాన్నీ విడువక, చివరికి గెలిచిన వాళ్ళు ఎంతో మంది వున్నారు. ఓటమి వొప్పుకుంటేనే, ఓడిపోయినట్టు.
ఈ విషయాన్ని, ఆంగ్ల సినిమా లు రాకీ 1,2,3,4 లలో చాలా బాగా చూపారు. శత్రువు మీకంటే పొడవుగా వుండొచ్చు, బలంగా ఉండొచ్చు కూడా. కానీ మీరు మీ పోరాటానికి యెంత బాగా సన్నాహాలు చేశారు, ఎంత మనో ధైర్యంతో వున్నారు, గెలిచి తీరాలన్న కాంక్ష మీలో ఎంత బలంగా వుంది - అన్నదే అంతిమ విజయానికి ముఖ్యకారణం అన్నది చాలా బాగా చూపారు.
రెండు కుక్కలు పోరాడుతూ ఉంటాయి. ఆ కుక్కల శరీరాల్లో వున్న బలాన్ని కంటే, వాటి మనసులలో వున్న బలమే, ఏది గెలుస్తుందన్నది నిర్ణయిస్తుంది. ఏనుగు వోడిపోవడానికి, సింహం గెలవడానికి సింహం యొక్క మనో బలమే కదా ముఖ్య కారణం, అడవిదున్న సింహం చేతిలో సాధారణంగా చచ్చిపోతుంది. కానీ, ఎదిరించి నిలబడితే, సింహాన్ని ఘోరంగా, సులభంగా చంపేస్తుంది.
ఓటమి వొప్పుకోని వాళ్ళు, చివరి వరకు పోరాడే వారు, చివరికి గెలిచే అవకాశాలు పూర్తిగా వుంది. కేవలం బాక్సింగ్ పోటీలే కాదు. కేవలం యుద్ధాలే కాదు. జీవితం లో, ఏ ముఖ్యమైన లక్ష్య సాధనలో నైనా సరే. మీ ఆరోగ్యమైనా సరే ; మీ వృత్తిలో, వుద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఏ లక్ష్యం లో నైనా సరే, మీరు ముందుకు పోవడం లో, విజయం సాధించడంలో - మీ ధైర్యానికి, చివరి వరకు ఓటమిని ఒప్పుకోని మీ నిలకడకు, స్థైర్యానికి ప్రముఖ పాత్ర వుంటుంది.
ఇంతే కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి యింకా ఎన్నో చెబుతున్నాడు. విందాం.
శ్రీకృష్ణుడి మాట :
"హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం |
తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః || (2. 37)
హతః = చంపబడినట్లైతే ; వా = ఇదో, అదో (ఏదో ఒకటి); ప్రాప్స్యసి = నీవు పొందుతావు ; స్వర్గం = స్వర్గ లోకాన్ని ( ఆ సుఖాలను) ; జిత్వా = గెలిస్తే ; వా = ఇదో, అదో (ఏదో ఒకటి) ; భోక్ష్యసే = అనుభవిస్తావు ; మహీం = ఈ భూమిని ; తస్మాద్ = అందువలన ; ఉత్తిష్ఠ = (నీవు) నిలబడు ; కౌంతేయ = అర్జునా ; యుద్ధాయ = యుద్ధానికి ; కృత నిశ్చయః = దృఢ నిశ్చయము తీసుకున్న వాడివై ;
"అర్జునా! ఈ యుద్ధంలో నువ్వు గెలువ వచ్చు. లేదా, యుద్ధభూమిలోనే మరణించవచ్చు. గెలిస్తే, రాజుగా ఈ భూమిపై ఆధిపత్యం వహించి భూలోకపు సుఖాలను అనుభవిస్తావు. అలా కాక, యుద్ధభూమిలో మరణిస్తే, స్వర్గలోకానికి వెళ్లి స్వర్గ సుఖాలను అనుభవిస్తావు. కాబట్టి, యుద్ధానికి సన్నద్ధుడై, కృత నిశ్చయుడై (అస్త్ర శాస్త్రాలను వహించి) నిలబడు. "
యుద్ధం నుండి వెనుదిరిగిపోతే, ఎన్ని రకాల అవమానాలో విన్నావు కదా. కానీ, అలా పారిపోకుండా, యుద్ధం చేస్తే, నువ్వు గెలువ వచ్చు. గెలిస్తే, రాజుగా, ఈ భూలోక సుఖాలను అన్నిటినీ అనుభవించ వచ్చు.
లేదా, యుద్ధభూమిలో పోరాడుతూ, నువ్వు వీరమరణం కూడా పొందవచ్చు. వీరమరణం పొందిన వారిని, స్వర్గం తన ద్వారాలు తెరిచి ఆహ్వానిస్తుంది. అప్పుడు నువ్వు స్వర్గలోకపు సుఖాలనన్నిటినీ అనుభవించగలవు. ఓడినా, గెలిచినా, నీకు కీర్తికరమే. ఆనందదాయకమే. కానీ, యుద్ధం విడిచి తిరిగి వెళ్లడం అన్నిరకాల అనర్థ దాయకం.
కాబట్టి ఓ అర్జునా ! నీవు అస్త్ర శస్త్రాలను ధరించి యుద్ధానికి సన్నద్ధుడై నిలబడు ." అంటున్నాడు శ్రీకృష్ణుడు.
నిజానికి, మనకందరికీ కూడా, ఇలాంటి ధర్మయుద్ధం ఏదో ఒకటి ఉండనే వుంది. అధర్మం పలువిధాలుగా మన చుట్టూ నాట్యమాడుతూ వుంది. మనం దాన్ని వీరులులాగా ఎదుర్కొంటున్నామా, భయపడి పారిపోతున్నామా - అన్న ఒక్క అంశం పైనే మన యొక్క, మన దేశం యొక్క పురోగతి, ప్రశాంతత ఆధారపడి వుంది.
అధర్మాన్ని ఎదిరించే అర్జునులు యిప్పుడు కూడా మనకు కావాలి. మనమే అలా తయారు కావాలి. అవునా, కాదా? యోచించండి. భగవద్ గీత ఒక్క అర్జునుడి కథ మాత్రం కాదు. శ్రీకృష్ణుడు మనల్నందరినీ కూడా యిదే మాటలంటున్నాడు. యిదే ప్రశ్న వేస్తున్నాడు.
ధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తావా, భయపడి పారిపోతావా ? మీకూ, నాకూ కూడా యిదే ప్రశ్నయే.
ఇంకా అర్జునుడు ఎలా ఉండాలో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం.

ఈ వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్
వజ్రాసనం |