2013 వెళ్ళిపోయి 12 రోజులయింది . అంతలో భోగి వచ్చేసింది. సంక్రాంతి వచ్చేస్తో వుంది . మన జీవితాల్లో ఏం క్రాంతి వచ్చింది; లేదా రాబోతూ వుంది ? ప్రపంచంలో ఎన్నెన్నో జరిగి పోతున్నాయి ; మన ప్రమేయంతో కొన్ని . మన ప్రమేయం ఏమాత్రం లేకుండా ఎన్నో !
చేస్తే - 365 రోజులూ ఏదో వొక పండగ చెయ్యొచ్చు. మన సంస్కృతి లో ఆ వెసులుబాటు వుంది. అలా చేస్తూ వుండే వాళ్ళం కూడా . పండగలు, వ్రతాలు , పూజలు, నోములు, అన్నీ - ఏదో రకంగా మనల్ని ఆనంద పరిచేవే .
పంటలు పండాయని కొన్ని, వానలు కురిసాయని కొన్ని, పూలు పూసాయని కొన్ని, పండ్లు, ఫలాలు చెట్ల నిండుగా వున్నాయని కొన్ని, ఋతువులు మారాయని కొన్ని, చంద్రుడు వచ్చాడని , రాలేదని, యిలా ప్రతి దానికీ పండగే . సూర్యుడు కక్ష్య మారితే పండగ.
ఈ రోజు, యిప్పుడు ఆనందంగా ఉన్నామని కొన్ని పండగలు, వ్రతాలు, నోములూ చేస్తే, భవిష్యత్తులో మరింత ఆనందంగా వుండాలని మరి కొన్ని చేస్తాం. మగ వాళ్ళు చేసేవి కొన్ని, మగ , ఆడా కలిసి చేసేవి కొన్ని, ఆడవాళ్ళు మాత్రమే చేసేవి కొన్ని, ఊరంతా కలిసి చేసేవి కొన్ని. దేశమంతా కలిసి చేసేవి మరి కొన్ని. ఆనందంగా వుండడానికి అన్నీ కారణాలే . ప్రతి పండుగకూ , పెద్ద వాళ్లకు మొక్కడాలూ , పిల్ల వాళ్లకు ఆశీర్వాదాలూ , స్పెషల్ వంటలు ,పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు - అంతా కోలాహలమే . అంతా వొక్కో రకమైన ఆనందమే; అన్నిటిలో, అంతర్లీనంగా వుండే అతి గొప్ప సంస్కృతి .
మనం చెట్లలో దేవుడిని చూస్తాం . రాళ్ళలో దేవుడిని చూస్తాం. ప్రతి జంతువులో, పాముల్లో, అన్నిటిలో దేవుడిని చూస్తాం . తులసి చెట్టు దేవుడు . రాగి చెట్టు, మద్ది చెట్టు -యిలా ఎన్నో దేవుళ్ళు . యిన్ని దేవుళ్ళు వుంటారా ?
నాగు పామూ దేవుడే . దాన్ని వేటాడే గరుడ పక్షీ దేవుడే . కాకి కూడా దేవుడే . ఎలా ?
అంతేనా . మొదటి దేవుడు తల్లట. మాతృదేవో భవ . రెండో దేవుడు తండ్రట. పితృదేవోభవ . గురువూ దేవుడే . అతిథీ దేవుడే . సరే . పెళ్ళైన ఆడవాళ్ళు అత్తారింటికి వెళ్లి పొతే , తల్లీ , తండ్రీ దూరమౌతారు కదా . అప్పుడెలా ? పతిదేవుడు. అదెలా? ఆడా, మగా సరి సమానులు అనే రోజుల్లో, పతి ని దేవుడు అంటే ఎలా ? పక్కింటి వాడినో , ఎదురింటి వాడినో - దేవుడంటే - సమస్యలు కదా. ఎక్కడో వొక చోట దేవుడిని చూడాలి. ప్రేమ వున్న చోట, రక్షణ వున్న చోట దేవుడు వుండనే వుంటాడు. లేకుండా ఎలా పోతాడు ?
ప్రేమ, రక్షణ వున్న చోట దేవుడు తప్పకుండా వుంటాడు. ధర్మేచ , అర్థేచ, కామేచ - నాతి చరామి అన్న వాడు, అన్నిటా తోడు గా వుండే వాడు, వాడిలో - దేవుడు లేదంటే ఎలా ? ఎందుకుండడు? ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, భార్యను రక్షించే వాడే భర్త . అదే మన సంస్కృతి . మరి పత్ని దేవత కాదా ? నిస్సందేహంగా దేవతే ! అందుకే కదా అర్ధ నారీశ్వర తత్వము దేవుడు అన్నాము . శివుడు లేనిది శక్తి లేదు ; శక్తి లేనిది శివుడు లేదు.
అంతటా దేవుడే. నాలో దేవుడు . నీలో దేవుడు . అయినా, బ్రహ్మచారి, సన్యాసి యిద్దరూ భిక్ష మడిగి బ్రతకాల్సిందే . వారిలో - అహం అనేది వుండకూడదు. గర్వం అనేది వుండకూడదు . కానీ, గృహస్తు - వారికి భిక్ష వెయ్యనని చెప్పడానికి వీలు లేదు . యింట్లో ఏదుంటే అది భిక్ష వెయ్యాలి . ఉపనిషత్తుల్లో చెప్పడం - గృహస్తు ఎంతైనా సంపాదించ వచ్చు - తనకు, పిల్లలకు, అతిథులకు కూడా తగినంత సంపాదించాలి . అదీ రూలు . అతిథులకు లేదనకుండా పెట్టడం గృహిణి వంతు . యింట్లో లేకపోతే క్రొత్తగా చేసైనా పెట్టాలి .
అయితే, యిందు లోని మూల సూత్రం అంత సులభంగా అందరికీ వంట పట్టదని - వ్రతాలు, పూజలు, నోములు - యిలా పెట్టారు. అన్నిట్లోనూ వారి వారికి కావలసినంత ఆనందం నింపారు .
గుళ్ళన్నీ రాళ్ళూ , మట్టే కదా . గుళ్ళోని దేవుడూ రాయే కదా . వాటిని పూజిస్తే , అవేం చేస్తాయి మనకు ? యిదీ కొంత మంది తర్కం . వినడానికి - నిజమే కదా అనిపించేలా వుంది కదా .
సరే . ఆ మట్టి నుండే కదా - అన్ని పంటలూ, చెట్లూ, ఔషధాలూ వచ్చేది. నిజానికి- మన శరీరము, దాన్లోని అన్ని భాగాలు మట్టి నుండి వచ్చిన వాటితోనే కదా తయారయ్యాయి. మట్టి నుండే వచ్చాము. మట్టిలోకే వెళ్లి పోతాము - అన్నది మనకు కాస్తో, కూస్తో అర్థం అవుతూనే వుంది కదా. మనం మట్టే . రకరకాల మట్టే .
చిన్నప్పుడు 3 కిలోలున్న మనం, యిప్పుడు, యిన్ని కిలోలు ఎలా అయ్యాం? ఇన్ని కిలోల శరీరమూ మట్టి నుండి వచ్చిందే కదా . 40-80 కిలోల మట్టి గా వున్న మనం ఎంత ఆలోచనా వంతులం , ఎంత జ్ఞాన వంతులం అనుకుంటున్నాం . అదంతా ఎక్కడి నుండి వచ్చింది మనకు ? అసలు అండము , శుక్రకణాలు కూడా మట్టి నుండీ కాక ఆకాశం నుండి వచ్చాయా ? అంతా మట్టే నని తెలుసు మనకు . అప్పుడప్పుడు మర్చి పోతాం . అంతే .
కానీ ,యింత మంది మనుషులను పుట్టిస్తూనే వున్న భూమాత లో ఎంత జ్ఞానం, ఆలోచన వుండాలి ? యిది మనకు తెలుసా ?అలాగే యింత మహా విశ్వంలో మరెంత జ్ఞానం వుండాలి ?
ఆ జ్ఞానాన్నే దేవుడు అన్నాం . మనం ఎక్కడ చూసినా ఆ జ్ఞానాన్నే చూడాలని ఆశిస్తాం . చదువు వున్న వాడైనా, లేని వాడైనా, శివ లింగానికి నమస్కరిస్తాడు . ఆచరణలో దేవుడిని చూసిన వాడికి , వేదాలు కూడా అక్కర్లేదని వేదాలే చెప్పాయి. కౌశిక మహర్షి తపస్సు చేసింది గొప్పా , ఆయన భిక్ష అడిగిన యింటి ఇల్లాలు గొప్పా, మాంసం అమ్మి బ్రదికే ధర్మ వ్యాధుడు గొప్పా? అన్ని పనులూ తపస్సే - తపస్సు లాగా చెయ్యాలని చెప్పిన సంస్కృతి గొప్ప.
సంక్రాంతి నాడు - సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడట. ఉత్తరాయణం ప్రారంభం చేస్తాడట. యిది కోట్ల సంవత్సరాలకు ముందు చెప్ప బడింది. మన పండగలలో, ఈ వొక్క పండగే సూర్య మానం ప్రకారం వస్తుంది గనుక, ఎప్పుడూ, యింగ్లీషు కాలెండర్ ప్రకారం కూడా, జనవరి 14 వ తేదీ నే వస్తుంది. మిగతా పండుగలు చాంద్ర మానం ప్రకారం గనుక మన నక్షత్రాలు, తిథుల ప్రకారం వస్తాయే గానీ - యింగ్లీషు కాలెండర్ ప్రకారం కాదు.
సూర్యుడు కక్ష్య మారితే మనకేం ? మనకు వసంత ఋతువు రాబోతూ వుంది . చలి తగ్గ బోతూ వుంది. చెట్లన్నీ వికసించ బోతూ వున్నాయి . పక్షులు కిలకిలారవాలు చేయ్యబోతూ వున్నాయి. ప్రకృతిలోని అన్నింటిలో - క్రొత్త ఉత్సాహం , క్రొత్త ఆనందం రాబోతూ వుంది . అదే ఆనందం మనలోనూ రావాలి. మనోహరమైన ప్రకృతిలో , మనోహరంగా మనిషి ఆడుకోవాలి . అదీ సంక్రాంతి .
సంక్రాంతి నాడు మనలో క్రాంతి రావాలి . పాత సంస్కృతికి కొత్త మెరుగులు దిద్దాలి. మరిచిపోయిన మంచిని పునరుద్ధరించాలి. మనలోని సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభించాలి. మనలోని ప్రకృతి వసంత ఋతువుగా మారాలి .
ఎలా? ఏం చెయ్యాలి? కొన్ని కొన్ని చిన్న, చిన్న పనులు, పెద్ద పెద్దగా మనం చెయ్యొచ్చు .
నా వొక్క అనుభవం మాత్రం చెబుతాను, వినండి. నేను వొకప్పుడు బిచ్చగాళ్ళకు బిచ్చం వేసే వాడిని కాదు. కొందరిలా, అసలు వెయ్య కూడదని రూలేం పెట్టుకోలేదు . దార్లో, ఎక్కడైనా , బిచ్చ గాడిని చూస్తే , అయ్యో పాపం అనిపిస్తుంది . కానీ, జేబులో ఉన్న ఏ నాణ్యమైనా వేద్దామని చెయ్యి అనుకోదు. బిచ్చ గాడిని దాటి వెళ్ళిన తర్వాత , వేసింటే బాగుండేదేమో అని వొక్కో సారి అనిపిస్తుంది . కొంత మంది యింట్లో బయల్దేరేటప్పుడే , జేబులోనో, పర్సులోనో , యిందు కోసమే కొన్ని నాణ్యాలు వేసుకుని బయల్దేరడం , అవి ఎక్కడో వొక చోట, ఎవరికో వొకరికి వేసేసి వెళ్లి పోవడం, నేను చాలా సార్లు చూశాను . అందులో చాలా మంది ఆడవాళ్ళు . వారికుండే దయాగుణం నాకెందుకు రావడం లేదు అని నేను చాలా సార్లు అనుకున్నా కూడా. ఆ తరువాత నేను కూడా - అలాంటి అలవాటు కొంత పెట్టుకున్నా. అయితే వొక సారి, వొక రైల్వే స్టేషన్ లో, వొక కుంటి బిచ్చ గాడికి (యిరవై ఏళ్ళకి ముందు) - అర్ధ రూపాయి వేస్తే, ఆతను, దాన్ని పట్టాల పైకి విసిరి వేసేసి - నన్ను చూస్తూ వెళ్లి పొయ్యాడు .
నాకూ కోపం వచ్చింది. కాస్త సిగ్గు వేసింది కూడా . మళ్ళీ కొన్నాళ్ళు షరా మామూలే; ఏ బిచ్చ గాడికీ బిచ్చం వెయ్య లేదు . కానీ కొంత మంది బిచ్చ గాళ్ళ ని చూస్తే - దేవుడు వీరిని ఎందుకిలా బాధ పెడుతున్నాడని చాలా సార్లు అనిపించింది . అప్పుడప్పుడూ - కొంత మంది బిచ్చం వేసే వారిని చూస్తే - ఆశ్చర్యం, ఆనందం అనిపించేది. ఎక్కడో అంత దూరం నుండి బిచ్చ గాడిని చూస్తే చాలు - వాళ్ళ వెళ్తున్న రూటు నుండి యింత దూరం వచ్చి, పర్సు లో నుండి, ఎంతో కొంత వేసి వెళ్ళే వారు. నేను మారాలి- అని చాలా సార్లు అనుకున్నా.
దానికేదో ముహూర్తం వచ్చింది . ఎప్పుడో వొక సారి, నేను కూడా వారి లాగే చేశాను. ఏదో లోభితనం గానే అనుకోండి - కొంత, కొంత వేశాను. అప్పుడు అలవాటు, వొక రూపాయకు తక్కువ వెయ్యడం లేదు . తరువాత అది రెండు రూపాయలకు పెరిగింది . వొక సారి మరో నాణ్యం లేక - అయిదు రూపాయల నాణ్యం మాత్రమే వుంటే - అయ్యో, యిప్పుడెలా, అనుకుంటూ, అదే వేశాను. ఆ తరువాత అనిపించింది - అయిదు రూపాయలే వెయ్యాలి - యిప్పుడు అంత మాత్రం ఆర్ధిక స్తోమతు నాకు వుంది; కాబట్టి మనసూ వుండాలి - అని .
అదీ అలవాటు అయ్యింది. అప్పుడు అనిపించేది - నేను చేసే పని ఆ బిచ్చ గాడికి నిజంగా ఉపయోగ పడాలి - లేదంటే, మొక్కుబడిగా నేను వేసేది ఏం ప్రయోజనం అని . కానీ, ఏం చెయ్యాలో - తెలియ లేదు . ఆ తరువాత ఎప్పుడో , మా నేషనల్ అకాడెమీ లో HR & MANAGEMENT విభాగానికి DGM గా వెళ్ళిన తరువాత , అసలు మానవతా దృక్పథం అంటే ఏమిటి అన్నది - కాస్త తెలిసి వచ్చింది . నేను యిచ్చే ప్రసంగాలు , వాటికి నేను చేసుకునే ప్రయత్నాలు - వీటి మధ్యలో - ఏదేదో క్రొత్త ఆలోచనలు, ఐడియాలు వచ్చేవి . కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , CRY లాంటివి వస్తే , ఏదో కొద్ది విరాళం యిచ్చే వాడిని . వంద, రెండు వందలు - యిలా .
మళ్ళీ చెన్నై వచ్చిన తర్వాత - నేనున్న తిరునిన్రవూరు లోనే 20 ఏళ్ళకు పైగా వొక అనాథ బాలల, వృద్ధుల శరణాలయం వుండడం, అది చాలా బాగా నడప బడడం తెలిసొచ్చింది. ఆ శరణాలయం పేరు సేవాలయ. దాని ముఖ్య ట్రస్టీ పేరు మురళీధరన్. వొకప్పుడు, అతి చిన్న సంస్థ గా వుండేది. యిప్పుడు 1300 నిరు పేద బాలలకు స్కూలు, 300 అనాథ బాలలకు ఉచిత విడుది , వంద మందికి పైగా అనాథ వృద్ధులకు శరణాలయం - యిలా ఎన్నో వున్నాయి. ఎంతో మంది దాతలు డొనేషన్లు యిస్తూ వున్నారు.
సరే . మా ఊళ్లోనే వుంది. నేను కూడా ఏదో కొంత చెయ్యొచ్చు కదా అనిపించింది . మొదట ఎంత యిచ్చానో జ్ఞాపకం లేదు . ఆ తరువాత 5 వేలు రూపాయలు విరాళం వొక్క సారిగా యిచ్చాను . యిది ఏదో కాస్త బాగా అనిపించింది . ఆ తరువాత, నాకు వీలైనప్పుడు , 5 వేలు, 5 వేలు యిలా యివ్వ సాగాను. వొక సంవత్సరంలో 20 వేలు అయ్యింది - యిలా విరాళం పెరిగింది .
రిటైర్ అయ్యిం తరువాత నాకు కొన్ని వ్యాపకాలు బాగా పెరిగాయి. అందులో వొకటి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ధ్యాస . వచ్చిన గ్రాట్యూటీ , ప్రావిడెంట్ ఫండ్ లాంటివన్నిటినీ కలిపి - షేర్ మార్కెట్లో పెట్టాలనుకునా; కానీ, మా ఆవిడ వొప్పుకొలేదు. అందుకని, సగం ఫిక్సెడ్ డిపాజిట్ , సగం షేర్ మార్కెట్ లో పెట్టాను. నిజానికి - అదే మంచి విధానం.
ఆ తరువాత - నేను మార్కెట్ ను బాగానే అధ్యయనం చేశాను . నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు పెట్టే ఎన్నో పరీక్షలు పాసయ్యాను. ఫలితంగా, నాకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారి నుండి (1) NSE సర్టి ఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ (NCMP ) -లెవెల్-5 (యిదే పెద్ద లెవెల్) (2) NSE సర్టి ఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిస్ట్ ఛాంపియన్ (3) NSE సర్టి ఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిస్ట్ ప్రో అన్న సర్టిఫికెట్లు కూడా లభించాయి .
యిప్పుడు - ఈ రంగం లో కొంత నిపుణత వుంది . ఏ కంపెనీ లో షేర్లు , ఎప్పుడు, ఎలా కొంటే, ఎలా అమ్మితే లాభకరమో బాగా తెలిసొచ్చింది . అందుకని నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తాలలో - నాకు లాభాలు వస్తూ వున్నాయి . మార్కెట్ పూర్తిగా పడిపోయిన రోజుల్లో కూడా నష్టాలు రాలేదు. యిక మీదట మోడీ గారు ప్రధాన మంత్రి గా వస్తే గిస్తే - దేశం , ముఖ్యంగా ఆర్ధిక రంగం, బాగా అభివృద్ధి చెందుతుంది అన్న వొక ఆశ మార్కెట్ లో చాలా మందికి వుంది . - చెప్పాలంటే నాకూ వుంది .
సరే . లాభాలు ఏదో వస్తున్నాయి . యిప్పటి వరకు మెల్ల మెల్లగా పెరిగింది - యిక ముందు యింకా బాగా పెరగొచ్చు . యివన్నీ దేవుడిచ్చిన, యిస్తున్న అవకాశాలే కదా . అందుకని , రెండు సంవత్సరాల క్రితం , నా డొనేషన్లు - 25 వేల రూపాయలకు పెంచాను . ఆ సంవత్సరం - 2012 లో- అలాంటి డొనేషన్లు 2 యిచ్చాను . అంటే - 50 వేలు అన్న మాట . 2013 లో అలాంటివి 4 సార్లు యిచ్చాను; అంటే - 1 లక్ష రూపాయలు అన్న మాట. యిది కాక, ఈషా ఫౌండేషన్ అన్న, సద్గురు జగ్గి వాసుదేవ్ గారి సంస్థకు 6-7 వేలు దాకా ప్రతి సంవత్సరమూ యిస్తాను. అది గురుదక్షిణ అనుకుంటా. ఎందుకంటే , నేను వారి వద్ద, చాలా యోగా శిక్షణలు పొందాను గనుక .
మరి, 2014 సంవత్సరం మాటో ? నాకు తెలీదు . మార్కెట్ బాగా పెరిగితే - బాగా లాభాలు వస్తే - ఎంత యివ్వాలి ? నేను ఏ లిమిట్ పెట్టుకో లేదు. సేవాలయా లోని ఆ చిన్నారి పిల్లల మొహాలు చూస్తే , వారితో బాటు నేనూ కూర్చుని భోంచేస్తే , వారికి ఏదో వొక ఐటెం వడ్డిస్తే, వారు చిన్ని చిన్ని మొహాలతో, థాంక్యూ సార్- అని చెబుతుంటే - ఆ అనుభూతికి - ఆ చిన్నారి దేవుళ్ళకి - ఎంతిస్తే సరిపోతుంది? అది దేవుడికి పెట్టే నైవేద్యం కాదా ?
మా యింట్లో, వొక్కో సారి, చిన్న వివాదం వస్తుంది - మీరు, మన పిల్లలకోసం పెట్టుకోకుండా, ఎవరికోసమో చేస్తున్నారేమిటి - అని. నిజానికి - పిల్లలు బాగానే వున్నారు . యిద్దరు కొడుకులు, కోడళ్ళు -అందరూ కాస్త మంచి వుద్యోగాల్లోనే వున్నారు. నేను చెబుతాను - నేను ఏం సంపాదిస్తే - అందులో కనీసం నాలుగో భాగం - అనాథ బాలలకు -మిగతాది మన పిల్లలకు అని . కాకపొతే, నా మనసులో - సగం సగం అనుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం వుంది. విప్రో ఛేర్మన్ డాక్టర్ అజీం ప్రేంజీ గారు వొక సారి అన్నారు - యింత మంది అనాథలు, నిరు పేదలు బయట తిండీ , గుడ్డా, చదువూ లేకుండా వుంటే , మనకు అసలు నిద్రెలా పడుతుంది ;తిండెలా సహిస్తుంది , అని. భారత దేశంలో అత్యధికంగా డొనేషన్లు యిస్తున్న వ్యక్తి యిప్పట్లో ఆయనే. యివ్వడం కాదు గొప్ప. మనసులో వున్న ఆ భావం గొప్ప . దాన్ని ఆచరణలో పెట్టే హృదయం గొప్ప .
అంతే కానీ, మనకు యిచ్చే వాడూ ఆ పై వాడే. మన నుండీ తీసుకునే వాడూ వాడే . తీసుకునే వాడిలో దేవుడిని చూడాలి , యిచ్చే వాడు .
అయితే - నరేంద్ర మోడీ గారు అంటారు - నా పాలనలో - మీకు ఉచిత కరెంటు, ఉచిత నీరు ఇలాంటి వాటిని గురించి మాట్లాడను . మీరు దేన్నైనా సరే - దాని విలువను యిచ్చి మీరే కొనుక్కునే సామర్థ్యం - మీకు కల్పిస్తాను - అని. అది నాకు బాగా నచ్చింది .
అది జరిగే వరకూ -
మన చుట్టూ వున్న అనాథ బాలలు, అనాథ వృద్ధుల మొహాల్లో - మనం ఆనందపు దీపాలు, అభివృద్ధి వెలుగులు వెలిగించాలి . అదీ క్రాంతి. అదీ మనకు సంక్రాంతి . మనలోని సూర్యుడు వుత్తరాయణం వైపు దిశ మళ్ళే సంక్రాంతి. మనలో విరిసే నిజమైన వసంతఋతువుకు మనం పలికే సుస్వాగతం.
అటువంటి సంక్రాంతికి - మీకు నా సుస్వాగతం . నా శుభాకాంక్షలు .
= మీ
వుప్పలధడియం విజయమోహన్